ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి – 8

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]టె[/dropcap]న్త్ క్లాసు పరీక్షలు పూర్తయ్యాయి. ఆఖరి పరీక్షరాసి వచ్చి ఒంటరిగా తురాయి చెట్టు దగ్గర కూర్చుంది రవళి. ఈ రోజుతో ఈ స్కూలుతో వున్న అనుబంధం కాస్త తగ్గినట్టే. ఎలిమెంటరీ స్కూలు నుండి వచ్చి ఈ పెద్ద స్కూల్లో చదవాలంటే తనకి చాలా భయంగా వుండేది. అన్నయ్య రవి తీసుకొచ్చి తనని ఈ స్కూల్లో జాయిన్ చేశాడు. పెద్ద బిల్డింగ్స్, విశాలమైన ఆవరణ, పెద్ద పెద్ద క్లాస్‍రూమ్స్ చూసి చాలా భయం అనిపించేది. 32 మంది టీచర్లు, ఒక హెచ్.ఎమ్, ఇద్దరు అటెండర్లు, ఇద్దరు ఆయాలు, ఒక క్లర్క్ ఇలా స్కూలు మంచి వైభోగంగా వుంటుంది. తను జాయిన్ అయ్యేటప్పటికి ఈ తురాయి చెట్టు చిన్నగా వుండేది. ఇప్పుడు చాలా పెద్దగా విస్తరించింది. అందులో వేసవికాలమేమో చెట్టుకి ఒక్క ఆకులేదు. ఎర్రగా పువ్వులు. ఈ అయిదేళ్ళలో ఈ పాఠశాలలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు. నలుగురైదుగురు టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళారు. ఇద్దరు ముగ్గురు టీచర్లు కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఈ ఉద్యోగంలో కొత్తగా చేరడమో కాస్త అలవాటు అయ్యేవరకు పాపం పాఠం చెప్పడానికి తడబడేవారు. ఆడపిల్లలు అల్లరి చేయరు అనుకుంటారు గానీ తన క్లాసులో కామేశ్వరి, పద్మ, జానకి వాళ్ళని పిచ్చిపిచ్చి డౌట్లు అడిగి కంగారు పెట్టేవారు. ఆ రోజులు తలుచుకుని నవ్వుకుంది రవళి. పాఠశాలలో ఏ జాతీయ దినోత్సవం అయినా తన పాట వుండవలసిందే. ఒకసారి లైబ్రరీ పిరియడ్‍లో టీచర్ ఎవరైనా మంచి పాట పాడండి అంటూ ఉత్సాహం వున్న పిల్లల చేత పాడించారు. అప్పుడు కృపామణి వాళ్ళు తమ యింటిదగ్గర్లో వుండేవారు. సాయంత్రం ఆడుకొనేటప్పుడు తను వచ్చీరాని పాటలు పాడడం విన్న కృపామణి “రవళి బాగా పాడుతుంది టీచర్” అంది. తను గొప్పగా పాడుతుందో లేదో తెలియదు. కానీ పాటను చెడగొట్టదు. అంతవరకూ తనమీద తనకి నమ్మకముంది. ఆఖరిది, తను ఆగష్టు 15నాడు పాడిన పాట. ఒక నిర్ణయం తీసుకుంటే మార్చుకోని తమ టీచర్లను సంహిత ఏం మాయ చేసిందో ఏమో. పదో తరగతిలో కూడా తను పాడేట్టు చేసింది. ఈ జ్ఞాపకాలన్ని ఒక ఎత్తయితే ఈ ఆఖరు ఏడాది ఈ పాఠశాల తనకిచ్చిన మధురమైన బహుమతి సంహిత. స్కూల్లో అంతమంది ఉంటే, క్లాసులో మిగతా 34మంది వుంటే సంహిత తన ప్రక్కనే కూర్చుంది. తన స్నేహితురాలై మనసులో ఒక సింహాసనం వేసుకు కూర్చుంది.

రవళి ఆలోచనల్లో తేలిపోతూనే వుంది. ఈలోగా చిన్నగా నవ్వులు, గుసగుసలు. ఆమె చుట్టూ చూసింది. సంహిత, జానకి, మాధవి, కృపామణి మిగతా స్నేహితులు.

“అబ్బా ఏం ఆలోచనలోయ్ మావైపు చూడనేలేదు” అంది జానకి.

“పుస్తకాల్లో, సినిమాల్లో బృందావనంలో రాధ అంటారే, అలా లేదూ రవళి” అంది సంహిత.

“ఆ… నిజమే… నిజమే” అందరూ కోరస్‍గా అన్నారు.

“చాలు…. చాలు… స్కూల్లో మళ్ళీ ఇలా కూర్చునే అవకాశం రాదు కదా అని యిటు వచ్చాను. అందరూ పరీక్ష బాగా రాశారా ఇళ్ళకి వెళ్ళిపోదామా” అంది రవళి.

“టీచర్లకి చెప్పిపోదాం అని అనుకున్నాం. మేమందరం నీకోసం వెతుకుతుంటే నువ్విక్కడ వున్నావ్ పద వెడదాం.” అంది జానకి.

“టీచర్స్ ఏమైనా అంటారేమోనోయ్” అంది సుందరి.

“ఆ… అయిదేళ్ళ బట్టి ఏదో ఏదో ఒకటి అంటూనే వున్నారు. ఇప్పుడు స్కూలు విడిచి వెళ్ళిపోతున్నాంగా ఏమి అనరులే” అంది కృపామణి.

అందరూ బయలుదేరి స్టాఫ్‍రూం చేరుకున్నారు.

“ఏమ్మా పరీక్షలు అయిపోయాయిగా సెలవుల్లో ఎక్కడికైనా వెడతారా?” తెలుగు టీచర్ అడిగారు.

అందరూ తలో ఊరు చెప్పారు. సంహిత, రవళి మాట్లడలేదు.

“శలవుల్లో ఇంగ్లీషు, తెలుగు గ్రామర్‍లు కాస్త ప్రాక్టీస్ చేయండి. బాగా ఆలోచించి ఇంటర్మీడియట్‍లో మంచి గ్రూప్ తీసుకోండి” అన్నారు ఇంగ్లీషు టీచర్.

అందరూ తలలూపారు. ఇంకొక రెండు నిమిషాలు మాట్లాడి హెచ్.ఎమ్ రూంలోకి వెళ్ళారు. ఆవిడ కూడా పిల్లలందరితో బాగానే మాట్లాడారు.

“ఏ కాలేజీలో చేరినా మన స్కూలుకు వున్న మంచిపేరును నిలబెట్టండమ్మా. పెద్దవాళ్ళు అయ్యారు, చదువుతో పాటు చక్కని ప్రవర్తన కలిగి వుండాలి. ఈ వయసులో మీకు ఏవేవో ఆకర్షణలు కలుగుతాయి. వాటికి లొంగిపోవద్దు. ఇక్కడ ఈ అయిదేళ్ళు మీకోసం మేము వేసిన పునాది మీద అందమైన భవంతి నిర్మించుకోవడమే మీ లక్ష్యంగా వుండాలి. మీ ముందు తరాలవాళ్ళం మేమే చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే మీరింకా బాగా మీ ఫ్యూచర్‍ను ప్లాన్ చేసుకోవాలి వెళ్ళిరండి” అన్నారు.

అందరూ బరువెక్కిన గుండెలతో హైస్కూలు గేటు దాటారు. మళ్ళీ ఈ బడికి వచ్చినా విద్యార్థులుగా కాదు, అతిథులుగానే. అమాయకంగా చదివిన ఎలిమెంటరీ విద్యకు, కాస్త పెద్ద చదువైన కాలేజీ చదువుకు ఈ హైస్కూలు ఒక వంతెన. ఆ వంతెనను ఈ రోజు దాటేశారు. అసలైన చదువు, జీవితం ముందున్నాయి. ఆ మహా సముద్రంలో ఎవరు ఈత నేర్చుకుని గెలుస్తారో? ఎవరు ఈత రాక మునిగిపోతారో….

“సరేగానీ ఇప్పుడు ఎవరెవరు సినిమాకొస్తారో చెప్పండి” అంది కామేశ్వరి.

“ఈ ఎండలో అందులో మ్యాట్నీ షో కా నేను రాను” అంది సంహిత.

“నేనూ రాలేను” అంది రవళి.

వీళ్ళిద్దరూ, కృపామణి, జానకి, మాధవి, ఫాతిమా తప్ప అందరూ సినిమాకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి అందరూ సినిమా హాలు దగ్గర కలుసుకోవాలని చెప్పుకొని విడిపోయారు.

“ఒకటి రెండు రోజుల్లో నిన్ను కలుస్తాను రవళి” అంటూ సంహిత వెళ్ళిపోయింది.

రవళి ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. ఆమె మనసులో ఏ ఆలోచన లేదు. పరీక్షలు ఎలా రాశానో అన్న ఆందోళన, కాలేజి చదువు ఎలా వుంటుందన్న ఆలోచన ఏదీ లేదు. అసలు ఆమెకు ఆలోచన అనేది చాలా తక్కువ. స్నేహ మనసులాగ ఆమె మనసు పాదరసంలాగ పరుగుపెట్టదు. ఏ పని చేస్తే దానిలోనే మమేకమై వుంటుంది. ఆమె ఇంటికి చేరుకునేసరికి ఒంటిగంట దాటింది. అయినా ఆదిలక్ష్మి ఆలస్యమైందేమని అడగలేదు.

“అన్నం తిని హాయిగా నిద్రపో రవళి. మరీ కళ్ళు లోపలికి పోయాయి నిద్రలేక” అంది ఆదిలక్ష్మి.

“మా ఫ్రెండ్స్ చాలామంది సినిమాకు వెళ్ళారమ్మా. ఈ ఎండలో సినిమా ఏమిటని వెళ్ళలేదు.”

“మంచిపని చేశావ్. నీకు అంతగా చూడాలనిపిస్తే మనం సాయంత్రం వెడదాం సినిమాకి.”

“నాకు పరీక్షలు అయిపోయాయి. స్నేహకి కూడా పరీక్షలు అవ్వాలిగా అవీ అయ్యాక వెడదాములే” అంది రవళి.

***

“అబ్బా! యిన్ని రోజులకా మా యింటికి రావడం రండి… రండి… అక్కా సంహితా, నీరజ వచ్చారు” అంది స్నేహ.

“రండి సంహిత, ఇన్నాళ్ళకు నీరజను కూడా తీసుకొచ్చావ్ చాలా సంతోషం పరీక్షలు ఎలా రాశావు నీరజ?” అడిగింది రవళి.

“బాగానే రాశాను.”

వీళ్ళు వచ్చినట్టు గ్రహించినా బయటకు వచ్చి పలకరించలేదు. రాత్రి వంటకు కూరగాయలు తరుగుతూ వంటింట్లోనే వుండిపోయింది ఆదిలక్ష్మి.

“రేపు మేము హైదరాబాద్ వెళుతున్నాం రవళి. ఆ మాట చెప్పిపోదామని వచ్చాం” అంది సంహిత.

“అలాగా. తిరిగి ఎప్పుడు రావడం. కాలేజి చదువు ఇక్కడే చదువుతావుగా.” అడిగింది రవళి.

“అహ…. హైదరాబాద్‍లో మనకెవరు సీటిస్తారు.” నవ్వింది సంహిత.

“శలవుల్లో మీ యింటికి రావచ్చు అనుకున్నాను. ఒక పదిరోజుల్లో వస్తారుగా.”

“లేదు. హైద్రాబాద్ నుండి మద్రాసు, ఊటీ వెళ్ళే ఆలోచన వుంది. అరె మీ యింట్లో గులాబీలు ఎంత బాగున్నాయో స్నేహ కాస్త కోసిస్తావా?” అడిగింది సంహిత.

“అలాగే… రా నీరజ గులాబీలు కోద్దాము.” అంటూ స్నేహ, నీరజను తీసుకువెళ్ళింది.

“రవళి ఇది హైద్రాబాద్‍లో మా పిన్ని ఇంటి అడ్రస్. ఉత్తరాలు రాయి” సంహిత అంతసేపు గుప్పిటలో పట్టుకున్న చిన్న కాగితం ముక్క చాలా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా రవళి గుప్పెటలోకి వెళ్ళిపోయింది.

రవళి ఏదో అనబోతుంటే “ఉష్… నీరజకు తెలియాల్సిన అవసరం లేదు” అంది సంహిత.

నీరజ గులాబి చెట్టు దగ్గర వున్నా ఆమె అప్పుడప్పుడూ వీళ్ళిద్దరినీ చూస్తూనే వుంది. ఇద్దరూ గులాబీలు తీసుకుని సంహిత, రవళి దగ్గరకు వచ్చేశారు.

“కవర్లో వేసిస్తా వుండు” అంది రవళి.

“అహ వద్దు ఇలా పట్టుకుంటే బాగుంది” అంది సంహిత.

“పొడుగ్గా కాడలతో కోశారు కదూ! నిజంగా నువ్వలా పట్టుకుంటే బాగుంది సంహిత” అంది రవళి మనస్ఫూర్తిగా.

“అవును వనకన్యలా వున్నావు. నువ్వు వేసుకున్న ఆకుపచ్చ డ్రెస్‍కి, ఈ ఎర్రగులాబీలకి చక్కగా జత కుదిరింది” అంది స్నేహ.

“భలే స్నేహంగా మాట్లాడుతుందోయ్, మంచి కవయిత్రి అవుతుందేమో!” అంది సంహిత.

“ఆ… ఆ… లెక్కలు చెయ్యమంటే, ఈ నేలలో ఆ గాలిలో అంటూ ఏవో రాస్తుంటుందిలే…” అంది రవళి స్నేహవైపు అభిమానంగా చూస్తూ.

“ఏం స్నేహా నిజమా వీళ్లంతా నవ్వుతున్నారని మానేయకు రాస్తుండు” అంది నీరజ.

“సరే మీ యింట్లో టైమే తెలియడం లేదు. ఇంక మేం వెళ్ళోస్తాం” అంది సంహిత.

ఆ అక్కాచెల్లెళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. సంహిత ఇచ్చిన ఎడ్రస్ కాగితాన్ని జాగ్రత్తగా తన నోట్ చేసుకుని ఆ పేపర్‍ని చింపేసింది రవళి.

“ఏమిటక్కా అక్కా చెల్లెళ్ళిద్దరూ బడిలో కలిసి భోజనం చెయ్యరు. మనింటికి మాత్రం కలిసి వచ్చారు” అడిగింది స్నేహ.

“అబ్బ ఏం డౌటే నీకు. మనిల్లు చూడలేదుగా నీరజ అందుకే తీసుకువచ్చి ఉంటుంది”

కానీ స్నేహకెందుకో నమ్మకం కుదరలేదు. ఏదో ఆలోచన వస్తోంది. అది పూర్తి ఆకారం దాల్చడం లేదు.

***

రవళి, స్నేహ ఇద్దరూ లైబ్రరీ నుండి ఇంటికి వచ్చేసరికి ఆదిలక్ష్మి దిగులుగా కూర్చుని కనిపించింది.

“ఏంటమ్మా అలా వున్నావు? మేము రావడం ఆలస్యం చేశామా? నువ్వు చెప్పిన పుస్తకాలు లైబ్రరీలో వెతికి తెచ్చేసరికి లేట్ అయ్యింది. మా కోసం భోజనం చెయ్యకుండా కూర్చున్నావా” అడిగింది రవళి.

“ఇంక పుస్తకాలు అవీ చదివే తీరిక వుండదే… తాతగారికి పొలంలో పాము కరిచిందట. అన్నయ్యా, నాన్నగారు తాతగారిని, మామ్మగారిని తీసుకురావడానికి వెళ్ళారు.” నిస్పృహగా అంది ఆదిలక్ష్మి.

“అయ్యో ఇప్పుడెలా వుందో… మేము యింట్లో వుంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదమ్మా” అంది రవళి.

“లేదు… మీరలా లైబ్రరీకి వెళ్ళగానే నాన్నగారి ఆఫీసుకే ఫోన్ వచ్చిందని, నాన్నగారు వెంటనే ఇంటికి వచ్చేశారు. అన్నయ్యే టాక్సీ తీసుకువెడదామని నాన్నగారికి సాయంగా వెళ్ళాడు.”

స్నేహ రవళికి చాలా భయం అనిపించింది. ఏమి మాట్లాడలేకపోయారు.

“బాధపడకండి. అక్కడ పాము మంత్రం వేసేవాళ్ళుంటే మంత్రం వేయించారట. ఇక్కడికి వచ్చాక డాక్టరుగారికి చూపిస్తారులే. రండి అన్నాలు తిందురుగాని” అంది.

“తినాలని లేదమ్మా” అంది రవళి.

“తప్పు అలా అభోజనంగా ఉండకూడదు. అన్నయ్య, నాన్నగారు అన్నం తినే వెళ్ళారు. మనం తిందాం రండి” అంది ఆదిలక్ష్మి.

ఆమెకు బెంగగా ఉంది. నలుగురు చుట్టాలు వస్తే ఇల్లు సరిపోవడం లేదని, తనకి కాస్త విశాలంగా, విడిగా ఒక రూము ఉండాలని రవి గొడవ చేయడంతో డాబా మీద మూడుగదులు నిర్మిస్తున్నారు. గదులు కార్తీకమాసంలో కట్టడం ప్రారంభించినా ఇంకా పూర్తికాలేదు. ఇంకా ఏవో చిన్నచిన్న పనులు వుంటూనే వున్నాయి. ఇప్పుడు మామగారికి పాము కరిచింది. అంటే మరుదులు, ఆడపడుచు చూడటానికి వస్తారు. అందులో తన అదృష్టం కొద్దీ ఇప్పుడు అందరి పిల్లలకి వేసవి సెలవులు. ఎంత తక్కువలో లెక్క వేసుకున్నా నెలరోజులైనా వుంటారు. వీళ్ళందరికీ వండి వడ్డించలేక నడుము విరిగిపోతుంది. ఇంతమందిని చూస్తే ఆ పనిమనిషి రెండురోజులకొకసారి గాని పనిలోకి రాదు. పైగా ఖర్చు… జగన్నాధం తన నాధుడు సరుకులు అయిపోయాయి తెప్పించమంటే తనే ఏదో మాయ చేసినట్టు విసుక్కుంటాడు. ఇవన్నీ పిల్లలతో చెబుతుందో తనే స్వగతం చెప్పుకుంటూ వుందో తెలియకుండా ఆదిలక్ష్మి ధోరణిగా మాట్లాడుతూనే వుంది.

చాలామంది పెద్దవాళ్ళు చేసే పొరపాటే ఆదిలక్ష్మి చేస్తోంది. తన ‘ఆలోచనలు’, ‘ప్రణాళికలు’ పిల్లలకు చెప్పడం తప్పులేదు. కానీ భవిష్యత్తును భయంకరంగా చూపించి, బంధువులను మనకు వ్యతిరేకులు అని చెప్పడం ఏమంత మంచి పద్ధతి కాదు. ఒక బాధ్యత గల వ్యక్తిగా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం చాలా వుంది. ‘పిల్లలంటే’ తన మనసులో బాధ చెప్పుకునే ‘పెద్దదిక్కు’ అనుకుంటారు. ఐతే ఇందుకు పూర్తిగా ఆదిలక్ష్మి లాంటి వాళ్లని కూడా విమర్శించలేము. ‘బంధువులు’ అంటేనే ‘బాంధవ్యం’ నిలబెట్టుకునేట్టు ఉండాలి. వచ్చిన ప్రతిసారీ ఆ గృహిణినో, గృహస్థునో, గృహాన్నో విమర్శిస్తే – ఆదిలక్ష్మే కాదు ఏ ఆడవాళ్లయినా భయపడతారు, విసుక్కుంటారు. ఈ గొడవల్లో పిల్లలు ‘ఆత్మీయత’ అనుకుని ‘ఆకర్షణ’ వైపు జారిపోయే ప్రమాదం వుంది. చాలామంది జీవితాల్లో జరిగేదే ఇది.

అందులోనూ ఒక తరంలో వుండే ఆప్యాయతలు, అనుబంధాలు మరో తరంలో వుండవు. ఈ కొత్త తరంలో వుండే అవకాశాలు, సౌకర్యాలు ముందు తరంలో వుండవు. దానికి ఆదిలక్ష్మి లాంటి వాళ్ళు బాధపడి ప్రయోజనం లేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here