సాగర ద్వీపంలో సాహస వీరులు-12

0
3

[box type=’note’fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]అం[/dropcap]తా కొంతసేపు విశ్రాంతికి పెద్ద చెట్టు కిందకు చేరారు.

“అయ్యా, ‘గతిలేనమ్మకు గంజే పానకం’. ఏం జేస్తాం ఆ రొట్టెముక్కలు నాకు, మా కోతిబావ గారికి కూడా ఇవ్వండి” అన్నాడు ఇకఇక.

“ఈ చిలుక ఇన్ని మాటలు సామెతలు చెంపా రాజ్య అంతఃపురంలో నేర్చింది.” అన్నాడు జయంతుడు.

“జయంతా ‘పెద్దల మాట చద్ది మూట’ అన్నారు పెద్దలు. నాకు మంచి కథలు చెప్పడం కూడా వచ్చు” అన్నాడు ఇకఇక .

“అలాగా ఏది ఓ కథ చెప్పు మా అందరికి అలసట తీరేలా” అన్నాడు శివన్న .

“సరే జాగ్రత్తగా వినండి. ‘శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు’.  ఈ కథ పేరు ‘గురువుగారి గుణపాఠం’.

అవంతి రాజ్య పొలిమేరలలోని సదానందుని ఆశ్రమంలోని విద్యాలయంలో ఎందరో విద్యార్థులు ఉంటూ చదువుకునేవారు. అందులో పలు దేశాల రాజకుమారులు కూడా ఉండేవారు. అక్కడే విద్యాభ్యాసం చేస్తున్న అవంతి రాజకుమారుడు జయంతుడు తను రాజకుమారుడనని దర్పంగా తోటి విద్యార్థులను అవహేళనగా మాట్లాడుతూ ఉండేవాడు. తోటి విద్యార్థులు పలువురు జయంతుని ప్రవర్తన గురించి సదానందుని వద్ద ఫిర్యాదు చేసారు.

ఒకరోజు భోజన సమయంలో అందరితోపాటు భోజనానికి జయంతుని పక్కనే కూర్చున్నారు సదానందుడు. భోజనంలో పలు పదార్ధలతోపాటు జున్ను, బంగాళదుంప కూర, జొన్నరొట్టెలు, అన్నంతో పాటు మామిడి పండు వడ్డించారు. దైవ ప్రార్థనానంతరం విద్యార్థులు భోంచేయసాగారు. “నాయనా జయంతా ఏమిటిది? నీరులా ఉండే జున్నుపాలు ఇలా గట్టి ఉందేమిటి. గట్టిగా ఉండే బంగాళదుంప మెత్తపడిఉంది. జొన్నరొట్టెలు గట్టిగా ఉన్నాయి, గట్టిగా ఉండే మామిడికాయ ఇలా మెత్తబడింది. ఇలా ఎందుకు మార్పు జరిగిందో నాకు అర్థం కాలేదు. నీకేమైనా తెలుసా?” అన్నారు సదానందుడు.

“గురుదేవా అది ప్రకృతిసిధ్ధమైన మార్పు. నీళ్ళలా ఉండే జున్నుపాలు ఉడికితే గట్టిపడటం, గట్టిగా ఉన్న బంగాళదుంప ఉడికితే మెత్తబడటం, వేడి జొన్నరొట్టెలు చల్లబడిన తరువాత గట్టిపడటం, మామిడి కాయగా ఉన్న పక్వానికి రావడంతో పండుగా మారుతుంది. బాల్యదశ నుండి యవ్వనానికి, యవ్వన దశనుండి వార్ధక్యానికి మారడం లేదా! ఇలా పలు విషయాలలో మార్పు తధ్యం. ఇది అందరికి తెలిసిన విషయమేగా!” అన్నాడు జయంతుడు.

“అలాగా. ఈ ప్రకృతిలో అన్ని సహజసిధ్ధంగా మార్పు సహజం అని తెసుకున్న నీవు అదే ప్రకృతిలో మనం నివసిస్తున్నాం అని గుర్తించలేక పోయావు. ఇది విద్యాభ్యాసం చేసే గురుకులం అని, నువ్వు ఇక్కడ రాజకుమారుడు కాదు ఓ సామాన్యమైన విద్యార్థివి అని నీకు గుర్తులేకపోవడం, నీలో మార్పు రాక పోవడం నాకు ఆశ్చర్వం కలిగిస్తుంది. విద్యాలయంలో అధికులని, పేదలని తారతమ్యాలు ఉండరాదు. కుల మతాలకు అతీతంగా అందరూ దేవాలయంలో భక్తితోనూ, విద్యాలయం వినయంతోను గురుదేవునికి శిరసువంచి నమస్కరించాలి. విద్యలో మొదట క్రమశిక్షణే మొదటి పాఠంగా చెప్పుకున్నాం. మొదట విద్యార్థికి వినయం, ఆర్తి, జిజ్ఞాస, ఆసక్తి, ఓర్పు, సహనం, పట్టుదల, ఏకాగ్రత వంటి లక్షణాలు ఉండాలి. సాటివారికి వినియోగపడని విద్య, ధనం, మేధావితనం వృథా! నేడు పేదరికంలో ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు, నేడు ధనవంతుడుగా ఉన్నవారు రేపు పేదవారు కావచ్చు. కాని మనతో చివరి వరకు వచ్చేది మన ప్రవర్తన. అది ఎంత గొప్పగా ఉంటే ఈ లోకంలో అంత గౌరవింపబడతావు. ధనం, పదవి తాత్కాలికాలు, మనం నేర్చిన విధ్య వినయం, సాటివారికి చేసే సహాయం, దానం శాశ్వతం.” అన్నాడు సదానందుడు.

తన తప్పు అనుభవపూర్వకంగా తెలుసుకున్న జయంతుడు “మన్నించండి గురుదేవా, నా తప్పు తెలుసుకున్నాను” అన్నాడు.

కథ విన్న వారంతా ఆనందంతో కరతాళధ్వనులుచేసారు.

“కథలోని రాజకుమారుడికి నా పేరు పెట్టావన్నమాట” అన్నాడు జయంతుడు.

“అవును ‘పండ్లు ఉన్న చెట్టుకేగా రాళ్ళ దెబ్బలు’ అన్నది చిలుక.

“అయ్యా, గొంతు తడిఆరిపోయింది కథ చెప్పేసరికి. కొద్దిగా నీళ్ళు తాగడానికి” అన్నాడు ఇకఇక.

ఎవరో చిన్నపాత్రలో నీళ్ళు అందించారు. చిలుక ఆ నీళ్ళు కొద్దిగా తాగింది. మిగిలిన ఆ నీటిని పారబోసాడు ఆయువకుడు.

“అయ్యయ్యో! ఎనకటికి నీలాంటోడే ‘మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలక బోసుకున్నాడట’. నీరు ఎప్పుడు వృథా చేయకూడదు” అన్నాడు ఇకఇక.

మరలా ప్రయాణం ఆరంభించారు. పడమర దిశలో సూర్యుడు దిగిపోతున్న సమయానికి అంతా జక్కమ్మ గుడి వద్దకు చేరుకున్నారు.

“మనం ఉండే ప్రాంతానికి నలుమూలల నెగళ్ళు (మంటలు) వేయండి, రాత్రంతా మండటానికి సరిపడా కట్టెలు సేకరించండి, రాత్రంతా నలుదిక్కుల నలుగురు వంతుల వారిగా కావలి కాయండి” అన్నాడు విజయుడు.

“అయినా కావలి కాయడం నా వల్ల ఏమౌతుంది? ‘తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు’ అన్నట్టు ఏ పులిగాడో, గిలిగాడోవచ్చానా నన్ను లెక్కచేయడు కనుక నన్ను కావలికి పిలవకండి. నెగడు దగ్గర వెచ్చగా బజ్జుంటాను అన్నట్లు ఈ పూట కూడా సప్పి రొట్టేనా?” అన్నాడు ఇకఇక .

“ఇవిగో నీకు, కోతిబావకు విందుభోజనమే” అంటూ శివన్న కొన్నిరకాల పళ్ళు వాళ్ళ ముందర ఉంచాడు.

“ఓహో కడిగి మరీ తీసుకువచ్చేవే? ‘పిండి కొద్ది రొట్టె పిర్ర కొద్ది పీట’ అన్నారు పెద్దలు. అయినా నా చిరుబొజ్జకు ఇన్నిరకాలా? మాకోతి బావకు పండగే” అన్నాడు ఇకఇక.

పళ్ళన్ని కనిపించేలా చిలుక మాటలకు నవ్వాడు కోతిబావ.

అంతా ఎండు కట్టెలు సేకరించి గుట్టగా వేసి నలుమూలలా నెగళ్ళు వేసారు.

మరికొందరు యువకులు పనస, బొప్పాయి, జామ, సీతాఫలం, అనాస, దానిమ్మ, రేగి వంటి పలురకాల ఫలాలతోపాటు, నీళ్ళ తిత్తులనిండుగా మంచినీరు నింపుకు వచ్చారు. అందరుకలసి పండ్లు తిని నిద్రకు ఉపక్రమించగా

“అయ్యలు నన్ను నిద్రలేపకండి. అయినా ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ ఎందుకు? ఏం జరిగినా నా నిద్ర పాడుచేయకండి. నానేస్తాలు విజయుడికో, జయంతుడికో చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు” అన్నాడు ఇకఇక.

దాని బడాయి మాటలకు అంతానవ్వుకున్నారు.

ఆరోజు తమక్షేమం గూడెం నాయకుడికి తెలియజేయడానికి జగ్గ వదలిన ఒక పావురాయి బయలుదేరింది.

మరుదినం ఆ కొండల నడుమ సూర్యోదయం చూసి తమ ప్రయాణ మార్గం సరైన దారిలోనే ఉందని ఊహించాడు విజయుడు.

మరలా చిత్రపటాన్ని చూస్తూ “జగ్గా ఇక్కడకు భైరవకోన ఎంతదూరం ఉంది?” అన్నాడు విజయుడు.

“నాయకా అదో ప్రమాదకరమైన ప్రదేశం. మూడు రోజుల ప్రయాణం. కాని మధ్యలో భయంకరమైన మొసళ్ళు ఉన్న ఓఘూ నదిని దాటాలి. అనంతరం భయకరమైన వేల అడుగుల లోతైన లోయపై ఉన్న తాళ్ళ వంతెన దాటి వెళితే భైరవకోన మనం చేరుకోవచ్చు. మనం నిధిని దక్కించుకున్నాక ఇదే నది ద్వారా సముద్ర తీరం చేరాలి. అక్కడనుండి తమరు అంగదేశం చేరుకునే ప్రయత్నం చేయాలి. మనందరం తూర్పుదిశగానే వెళ్ళాలి” అన్నాడు జగ్గ.

అందరు కలసి జక్కమ్మకు నమస్కరించి, పూజలు చేసి తమ కార్యక్రమం విజయవంతం కావాలని వేడుకుని, తమ ప్రయాణం కొనసాగించారు.

కొంతదూరం ప్రయాణించాక అందరు ఓఘూ నది తీరం చేరుకున్నారు.

“ఏలికా ఈ నది భైరవకోన చేరువగా సాఫీగా ఎలాటి ఒడుదుడుకులు లేకుండా నెమ్మదిగా పయనిస్తుంది. దీనిపైన ప్రయాణంచేసి మనం సముద్రతీరం చేరవచ్చు. కాని ఇప్పుడు ఇది లోయల గుండా ప్రయాణం చేస్తుంది. కనుక మన ఈ నది పైన కొంతదూరం మాత్రమే ప్రయాణించగలం” అన్నాడు జగ్గ.

“నది దాటదాడానికి ఇప్పుడు మనం రెండు తెప్పలు తయారు చేయాలి. పెద్ద పెద్ద ఎండు చెట్లను సేకరించి బలమైన తాళ్ళతో కట్టి రెండు తెప్పల్లా తయారు చేయండి. అవి చాలా బలంగా ఉండాలి” అన్నాడు విజయుడు.

జయంతుని పర్యవేక్షణలో ఆ ప్రాంతంలోని ఎండి ఒరిగిన చెట్లన్ని నదీతీరానికి చేర్చి విశాలమైన తెప్పలు ఎటువంటి ప్రమాదంలోనూ విడిపోకుండా తాళ్ళు, అడవి ఎండు తీగలతో కట్టారు.

“బాగా గట్టిగా కట్టండి. ‘నూరు కాకులను తిన్న రాబందు ఒక గాలి వానకే గోవిందా’ అంటారు. ఈ తెప్పపై మీరే కాదు నేనూ ఉంటానని మరచిపోవద్దు” అన్నాడు ఇకఇక.

”అంత భయమైతే హాయిగా ఎగురుకుంటూ అవతలి ఒడ్డుకు పోరాదా!” అన్నాడు శివన్న.

“ఏంటి? ‘ఆశ దోశ అప్పడం బూందీ లడ్డు’. ఆకాశమార్గన ఏ డేగ గాడో నన్ను తరిమితే ఏం చేయాలి? అయినా నాలాంటి ధైర్యవంతులు ఉంటే కదా మీలాంటి వీరులకు వన్నె, ‘నారుకు పోయిన రామన్న కుప్పలకు వచ్చాడంట’. త్వరగా కానివ్వండి ప్రతిదీ నేనే చెప్పాలంటే ఎట్లా? కొన్నయినా మీరు తెలుసు కోవాలి” అన్నాడు ఇకఇక.

ఇకఇక మాటలకు అంతా నవ్వుకున్నారు.

మొదటి తెప్పపైన అవసరమైన సామాగ్రి, కొందరు రాజముద్రిక గూడెం యువకులు ఆయుధాలు ధరించి బయలుదేరారు. దాని ముందు ఎడమ భాగాన శివన్న చేతిలో పొడవైన బల్లెం ధరించి ఉన్నాడు. అతనికి చేరువలో కుడి భాగాన విల్లంబు ధరించి జయంతుడు తమపై ఎటువంటి దాడినైనా ఎదుర్కొనడానికి సిధ్ధంగా ఉన్నాడు.

రెండవ తెప్పపై ఆయుధాలు ధరించి ఉన్న భిల్లుజాతి యువకులతో తను కుడి భాగన జగ్గు, ఎడమభాగాన విజయుడు స్ధిరంగా తెప్పపై నిలబడి ఉన్నారు.

భిల్లు, కోయ యువకులంతా వేగంగా తెడ్లు వేయసాగారు. నదీ ప్రవాహం చాలా నెమ్మదిగా ఉండటంతో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

కొద్దిసేపటికి గుంపులు గుంపులుగా ఉన్నపెద్ద పెద్ద ముసళ్ళు జయంతుడు, విజయుడు పయనిస్తున్నతెప్పలకేసి రాసాగాయి. తమ తెప్పలకు ముసళ్ళు కొద్ది దూరంలో ఉండగానే జయంతుడు, విజయుడు శరపరంపలకు ముసళ్ళు బలి కాసాగాయి. తమ తెప్పలకు చేరువగా వచ్చినని తెప్పపై ఉన్న ఆటవిక తెగ యువకుల బల్లెం, కత్తులకు బలికాసాగాయి. చనిపోయి నీటిపైన తేలిన మొసళ్ళను మిగిలిన మోసళ్ళు ఆహారంగా తినసాగాయి. ఇదే అదనుగా తమ తెప్పలను నది అవతలి తీరానికి చేర్చారు.

అంతా సురక్షితంగా నదీతీరం చేరుకుని ఒక పెద్దచెట్టు కిందచేరారు.

“అందరం అలసిపోయి ఉన్నాం, ఈ రాత్రి ఇక్కడే మన విశ్రాంతి పొంది రేపు ఉదయం భైరవకోన కువెళదాం!” అన్నాడు విజయుడు.

కొందరు అడవిలో ఫలాలు సేకరించడానికి, మరికొందరు నెగళ్ళు రాత్రంతా మండటానికి సరిపడా ఎండుకట్టెలు సేకరించడానికి వెళ్ళారు.

తన వద్దనున్న రెండు జింక చర్మ చిత్రపటాల భాగాలు ఒకటిగా చేర్చి నిధి ఉన్నమార్గాన్నిచూస్తూ జయంతుడితో చర్చించసాగాడు విజయుడు.

“చిలకన్నా ఏదైనా కథ చెప్పు” అన్నాడు శివన్న.

“అలాగే కథ పేరు పప్పు పూర్ణాల సాక్ష్యం. పూర్వం అవంతి రాజ్య రాజథానిలో శివయ్య అనే వ్యక్తి తన భార్యతో కాశీ యాత్రకు వెళుతూ, రంగయ్య అనే వ్యాపారి వద్ద తన భార్య నగలు, ధనం దాచిపెట్టి వెళ్ళాడు. సంవత్సర కాలం అనంతరం తిరిగి వచ్చి తనభార్య నగలు, ధనం తిరిగి ఇవ్వమనగా, ‘నువ్వు నా వద్ద ధనం దాయడమేమిటి? ఎవరైనా వింటే నవ్వి పోతారు పో’ అన్నాడు రంగయ్య. తను మోసపోయానని గ్రహించిన శివయ్య రాజుగారి సభకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించాడు. శివయ్య తనకు బాగా తెలిసిన నిజాయితీ పరుడు కావడంతో, రంగయ్యను రాజు గారి సభకు పిలిపించాడు న్యాయాధికారి.

“శివయ్య కాశీ వెళుతూ తన భార్య నగలు, తను దాచుకున్న ధనం నీవద్ద దాచి వెళ్ళాడట నిజమేనా రంగయ్యా” అన్నాడు న్యాయాధికారి.

“శివయ్య నా వద్ద ఎటువంటి ధనం దాయలేదు. అసలు ఇతను ఎన్నడు మా యింటికే రాలేదు” అన్నాడు రంగయ్య.

“శివయ్య నువ్వు రంగయ్య వాళ్ళఇంటికి వెళ్ళినట్లు, అతని వద్ద నగలు ధనము దాచినట్లు ఏదైనా సాక్ష్యం ఉందా”అన్నాడు న్యాయాధికారి.

“అయ్యా మనుషులైతే లేరండి, ఆరోజు దీపావళి పండుగ కనుక రంగయ్య గారి ఇంట్లో పప్పు పూర్ణాలు నాకు తినడానికి పెట్టారండి, పప్పు పూర్ణాలే సాక్ష్యం”అన్నాడు శివయ్య.

రాజ సభలోని వారంతా ఘోల్లున నవ్వారు. “సరే శివయ్య నీకు పప్పు పూర్ణాలు ఎవరు తెచ్చి పెట్టారు” అన్నాడు న్యాయాధికారి.

“రంగయ్యగారి పదేళ్ళ కుమారుడు” అన్నాడు శివయ్య.

పదేళ్ళ వయుసున్న రంగయ్య రాజసభకు పిలిపించి “అబ్బాయి ఈ శివయ్య ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా” అన్నాడు న్యాయమూర్తి.

“ఓ ఈయన మా యింటికి వచ్చినప్పుడు నేను పెట్టిన పప్పు పూర్ణాలు తిని, నా కాలులో ఉన్న ముల్లును నొప్పి తెలియకుండా తీసాడు, నాకు బాగా గుర్తు” అన్నాడు ఆ బాలుడు.

“శివయ్యా నువ్వు తిన్న పప్పు పూర్ణాలే నేడు నీకు సాక్ష్యం అయ్యాయి. రంగయ్య గారు పెద్ద మనిషి అంటే మనసు కూడా పెద్దదిగా ఉండాలి. శివయ్య సొత్తు అతనికి తిరిగి ఇస్తూ, వంద వరహాలు అపరాధంగా శివయ్యకు చెల్లించాలి” అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. సభలో కరతాళ ధ్వనులు మారు మోగాయి.

కథ వింటూనే అందరూ సంతోషంగా చేతులు తట్టారు. “ఓర్ని తస్సదీయ కథలో నా పేరు ఇరికించావే” అన్నాడు శివన్న.

“నాతో పెట్టుకుంటే అంతే! కథ విన్నారుగా, ‘కథ కంచికి మనం నిద్రకి’ ” అన్నాడు ఇకఇక.

అందరూ నిద్రకు ఉపక్రమించారు. సాయుధులైన కొందరు వంతుల వారీగా కావలి కాయసాగారు.

తెల్లవారుతూనే అందరూ తమ ప్రయాణం కొనసాగించారు.

“అయ్యలు, ‘లేడికి లేచిందే పయనమా’ – ‘అరచేతిలో వైకుంఠం’ చూపిస్తారా? తినడానికి ఏదైనా పెడతారా?” అన్నది కోతి భుజంపై ఉన్న ఇకఇక.

“ఇంకా వాగుడు మోదలు పెట్టలేదు ఏంటా అనుకున్నా! ఇదిగో” అని పెద్ద మామిడి పండు అందిచాడు శివన్న కోతిబావకు.

“శివన్నా ఎవరు ఏ పనిచేసి బ్రతికినా ‘కోటి విద్యలు కూటికొరకే’ కదా! అన్నారు పెద్దలు” అన్నాడు ఇకఇక.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here