యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 18. తిరుమలగిరి

0
3

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా తిరుమలగిరి లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

తిరుమలగిరి

[dropcap]జ[/dropcap]గ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్ళే దోవలో చింతకల్లుకి 4 కి.మీ.ల దూరంలో చిన్న కొండ మీద వున్నది తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం. ఇది చాలా విశేషమైన ఆలయం. విశేషమేమిటంటారా?  మీలో చాలా మంది వెంకటేశ్వరస్వామిని చూసే వుంటారు, తిరుపతిలోనో, మీ ఊళ్ళో గుడిలోనో. ఆయన పేరు చెప్పగానే మీ కళ్ళ ముందు నల్లని నిలువెత్తు రూపం, బంగారు కిరీటంతో, శంఖ చక్రాలతో వరద, అభయ హస్తాలతో, ధగ ధగ మెరిసే బంగారు ఆభరణాలతో, సువాసనలు వెదజల్లే పూమాలలతో కళ్ళ ముందు ఒక రూపం కనిపిస్తుంది కదూ అందరికీ. కానీ ఇక్కడ వెంకటేశ్వరస్వామి అలా వుండడు.

ఈయనకి ఒక ఆకారం లేదు. ఆకారం లేని వెంకటేశ్వరస్వామా అని ఆశ్చర్యపోకండి మరి. అదే ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని నేను దాదాపు పది సంవత్సరాల క్రితం చూశాను. ఇప్పుడెలా వుందోనని నిన్న వీడియో చూశాను. నిజంగా చాలా అభివృధ్ధి చెందింది. ఉపాలయాలు, కమానులు, ముఖ ద్వారం.. చూడటానికే చాలా అద్భుతంగా వుంది. కొండ చుట్టూ పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మాత్రం మారలేదు. మేము వెళ్ళినప్పుడు చాలామందికి తెలియదు ఈ ఆలయం గురించి. దీని గురించి నేను ఇంతకు ముందు రాసిన వ్యాసం అప్పుడు ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురింపబడ్డది.

ఇక్కడ స్వామి వెలియటానికి ఒక కథ చెప్తారు. పూర్వం భరద్వాజ మహర్షి కృష్ణా నదికి అవతలి వైపున వున్న ముక్త్యాలలో ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుండేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు అన్ని చోటలా వుండేవాడని తలచి ఆయన కోసం తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్రీ మహావిష్ణు పుట్ట రూపంలో నామాలతో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడంటారు. భరద్వాజ మహర్షి సంతసించి కృష్ణానది నుంచి నీరు తీసుకుని వచ్చి స్వామికి అభిషేకం చేయటం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఇక్కడ నిత్య పూజలో భరద్వాజ గోత్రీకులు పాలు పంచుకుంటున్నారు.

ఇంకో కథనం ప్రకారం కోపంతో వైకుంఠాన్ని వీడిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన శ్రీమన్నారాయణుడు ఒక పుట్టలో వుండటం, అక్కడకి నిత్యం ఒక గోవు వచ్చి పాలిచ్చేదని మనందరికీ తెలిసిన కథే కదా. ఆ పుట్ట ఇదేనని ఇప్పుడు ఇక్కడివారు చెబుతున్నారు. మేము వెళ్ళినప్పుడు ఆ పుట్టకు నామాలు వుండేవి. పుట్ట, పుట్టకున్న నామాలు స్పష్టంగా కనబడేవి. ఆ పుట్టలో స్వామి ఆది శేషుడి రూపంలో వున్నాడంటారు. గోవింద నామాలు 12 కదా. ఆ ద్వాదశ నామాలతో స్వామి అవతరించాడని నామాల వెంకటేశ్వరస్వామి అనేవారు.

నాకు ఇపుడు చూసిన వీడియోలో పుట్టపైన వస్త్రం కప్పినట్లు తెల్లగా కనబడింది. అంతే కాదు. ఇదివరకు ఉత్సవ విగ్రహాలు, విడిగా ఉపాలయాలు వున్నట్లు నాకు గుర్తులేదు ఆలయ ప్రాంగణంలో వరాహ స్వామి విగ్రహం వుంటుంది. దీనికి కూడా మండపం వచ్చింది.

మేము కారులో పైదాకా వెళ్ళిన గుర్తు. ఇప్పుడూ మార్గం వుందిగానీ, కరోనా కారణంగా మూసేశారుట. మెట్లు విశాలంగా, తక్కువ ఎత్తులో తేలికగా ఎక్కగలిగేటట్లు వుంటాయి. ఇప్పుడు మెట్ల మొదట్లో ఒక వైపు ఆంజనేయ స్వామి, మరోవైపు గరుత్మంతుడు పెద్ద విగ్రహాలు వున్నాయి. మెట్లమీదుగా వెళ్తుంటే శివాలయం కనబడుతుంది. ఇదివరకు ఇది ఒక మండపంలా వుండేది. ఈయన క్షేత్ర పాలకుడు. ఇక్కడ మారేడు చెట్టుకి ముడుపులు కడుతున్నారు. అది కూడా విశేషమేమిటంటే సంతానం లేనివారు తాము కట్టుకున్న వస్త్రం కొంగునుంచి ఒక గుడ్డ పీలిక చించి దానిలో ఒక రాయి వేసి కట్టి ఉయ్యాలలాగా ఆ చెట్టుకి కడితే సంతానవతులవుతారట. అలా అని అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఇదీ ఇదివరకు లేదు.

ఇంక రాజ గోపురం. పంచ భూతాలకీ, పంచ కోశాలకీ ప్రతీకగా ఐదు అంతస్తుల రాజ గోపురం. ఇక్కడ శ్రీ పాద పుష్కరిణి కూడా ప్రత్యేకమైనదే. స్వామి వెలిసినప్పుడు మొదట పాదం ఇక్కడ పెట్టారంటారు. ఆ ఆకారంలోనే ఈ పుష్కరిణి వచ్చిందనీ, ఇది ఎవరూ తవ్వినది కాదనీ అంటారు.

స్వామిని సేవించటానికి గంగమ్మ ఇక్కడ అవతరించిందంటారు (ఇవి ఇదివరకే వున్నాయి). అందుకే శివలింగం వెనుక గంగా భ్రమరాబ సమేతంగా శివుని ఉత్సవ విగ్రహాలుంటాయి. వెంకటేశ్వరస్వామి ఆలయం బయట వుండే వరాహ మూర్తికి మండపం కూడా తర్వాత వచ్చింది.

క్షేత్ర మహిమ ఇనుమడింప చెయ్యటానికి చుట్టూ తొమ్మిది ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠించారుట భరద్వాజ మహర్షి. అవి భక్త ఆంజనేయ స్వామి, దాస ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయస్వామి, బాల ఆంజనేయ స్వామి, పంచ ముఖ ఆంజనేయస్వామి, సప్త ముఖ ఆంజనేయ స్వామి, ఏకాదశ ముఖ ఆంజనేయస్వామి, చతుర్దశ ముఖ ఆంజనేయ స్వామి. మెట్ల దోవలో ఒకే రాతి మీద రెండు ఆంజనేయ విగ్రహాలు కనబడతాయి. వాటి గురించి జంట ఆంజనేయ స్వాములని, వాలి సుగ్రీవులని తోచిన విధంగా చెబుతారు. ప్రస్తుతం ఈ ఆంజనేయ స్వామి విగ్రహాలలో ఐదు మాత్రమే గోచరిస్తాయిట. మేము వెళ్ళినప్పుడు కూడా కొండ చుట్టూ తొమ్మిది ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయని, అయితే వాటికి ప్రత్యేకించి గుళ్ళు, ఆరాధనలు లేవని ఇప్పుడు సరిగా లేవని చెప్పారు. జంట ఆంజనేయ స్వాముల గురించి సరిగా చెప్పలేక పోయారు. వాలి సుగ్రీవులయి వుండచ్చు అన్నారు.

పుట్ట రూపంలో విలక్షణంగా వెలిశారు గనుక ఆ పుట్టలో స్వామి ఆది శేషుని రూపంలో వున్నారనీ, రాత్రిళ్ళు అక్కడ తిరుగుతూ వుంటారనీ అక్కడివారి నమ్మకం. అందుకే ఆలయ సమయాలు సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం దాకానే. సూర్యాస్తయం తర్వాత కొండమీద ఎవరూ వుండరు.

1200 సంవత్సరాన ముందే విలసిల్లిన ఈ ఆలయానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారి సమయంలో కొంత భూమిని ఇతర కానుకలనూ అందజేశారుట.

ఇక్కడ వెంకటేశ్వరస్వామి దీక్షలు కూడా వైభవంగా జరుగుతాయి. మండల దీక్ష చైత్ర శు. పౌర్ణమికి పూర్తయ్యేటట్లు చేస్తారు. ఆ రోజు ఇక్కడ స్వామి కళ్యాణం జరుగుతుంది. ఉగాదికి ఎక్కువ మంది భక్తులు వస్తారు.

రైతులు తమ తొలి పంటలో కొంత తెచ్చి స్వామికి సమర్పిస్తారు.. తమ పశువులతో గిరి ప్రదక్షిణ చేస్తారు. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు ఎక్కువగా వస్తారు.

స్వామి భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమయ్యాడు గనుక భరద్వాజ గోత్రీకులు వైఖానస అర్చక స్వాముల ఆధ్వర్యంలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు జరుగుతుంటాయి,

నేను చూసిన తర్వాత బాగా అభివృధ్ధి చెందిన ఆలయాలలో ఇది ఒకటి. అన్నట్లు జగ్గయ్యపేట ఊళ్ళో ఇంకో వెంకటేశ్వర స్వామి ఆలయం వున్నది. అక్కడ కూడా స్వామిని ఇలాగే పుట్ట రూపంలో నామాల వెంకటేశ్వరస్వామిగానే ప్రతిష్ఠించారు.

ఇక్కడ ఇస్తున్న ఫోటోలు అప్పుడు నేను తీసినవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here