ఐరోపాలో మహిళా విద్య రూపకర్త మేరీ వార్డ్

9
3

[dropcap]జ[/dropcap]నవరి 30వ తేదీ మేరీ వార్డ్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మధ్యయుగపు ప్రపంచంలో సింహభాగం మూఢవిశ్వాసాలు, నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం, మత మౌఢ్యాలతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా పేదలు పై వాటిలో మునిగిపోయి కునారిల్లుతుంటే/రాజులు, ధనికులు, మతాధిపతులు, భూస్వాములు విలాస జీవితం గడిపేవారు.

పేదమహిళలు అన్ని విధాలుగా వెనకబడి ఉండేవారు. వివిధ మతశాఖల మధ్య ఘర్షణలు చెలరేగిన ఆ కాలంలో మహిళాభివృద్ధి మరింత కుంటుపడింది. ఈ సమయంలో స్త్రీ విద్య, అభివృద్ధుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిందో యువతి. తన అనుచరులతో కలిసి ఐరోపా దేశాల మహిళల కోసం ఆశ్రమాలను, పాఠశాలలను నెలకొల్పింది. తరువాత కాలంలో ఈ పాఠశాలలు ఐరోపా ఎల్లలను దాటి విశ్వవ్యాప్తమయ్యాయి. ఈ పాఠశాలలే ‘మేరీ వార్డ్ – లోరెటో పాఠశాలలు’. వీటి రూపకర్త మేరీ వార్డ్.

ఈమె 1585 జనవరి 23వ తేదీన ఇంగ్లండ్ లోని ముల్విత్‌లో జన్మించారు. ఉర్సులా రైట్, మర్మ్‌డ్యూక్ వార్డ్‌లు ఈమె తల్లిదండ్రులు. ఆ రోజులలో క్రైస్తవ మత శాఖల మధ్య గొడవలు జరుగుతుండేవి. అవి చిలికి చిలికి గాలివానగా మారి, చివరకు పోరాటాలకు తావిచ్చాయి.

1595లో వీరిది కేథలిక్ మత శాఖా కుటుంబం. మత ఘర్షణలలో వీరి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఈమె తండ్రి, భార్యా పిల్లలను రక్షించుకుని ఊరు వదిలి పెట్టవలసి వచ్చింది. ఆ ఊరు, ఆ ఊరు తిరిగి 1599 నాటికి సెల్బీకి చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్న సర్ రాల్ఫ్ బాబ్ థోర్ప్ దగ్గర ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ భాషలను నేర్చుకున్నారీమె.

తన జీవితాన్ని మతం కోసం అంకితం చేయాలని, సేవా మార్గంలో పయనించాలని ఆశించారు. ఇటలీలోని రోమ్ నగరంలోని సొసైటీ ఆఫ్ జీసెస్ సంస్థలో చేరారు. తరువాత కొంతకాలానికి బెల్జియంలోని పూర్ క్లారెస్‌కు చెందిన ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ సిస్టర్‌గా సేవలను అందించారు. అయితే ఆ సంస్థ పేరుకే పేదవారి కోసమని, ఆచరణలో శూన్యమని అర్థం చేసుకుని బయటకు వచ్చేశారు. ఇంటికి వెళ్ళిపోయి మత క్రతువుల నిర్వహణలో పాలు పంచుకున్నారు.

ఆ ఆశ్రమ జీవిత అనుభవసారంతో గ్రేవ్‌లైన్స్‌లో తన స్వంత నిధులను వెచ్చించి ఆంగ్ల మహిళల కోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. స్నేహితులు, బంధువుల నుండి ఈమెకి చక్కటి సహకారం లభించింది. బంధువుల అండదండలతో బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించారు. 1609లో ఫ్రాన్స్ లోని సెయింట్ ఓమర్‌లో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది బ్లెస్డ్ వర్జిన్ మేరీ’ సంస్థని స్థాపించారు.

వివిధ దేశాల అధికారులు, మతాధికారులు తమ తమ దేశాలలో పాఠశాలలను స్థాపించమని ఆహ్వానించారు. కాని ఈమె మత ప్రధానంగా ప్రారంభించాలనుకున్నారు. మధ్యయుగం నాటి ఐరోపా దేశాలలో స్త్రీలు ఇంటి నుండి బయటకి రాకూడదు. కాని ఈమె మహిళలు బయటకు వచ్చి వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కోసం అపోస్టోలిక్ ఆర్డర్‌ను ప్రారంభించారు. మతాచారాలను, ప్రభుత్వాన్ని ఎదరించినందుకు ఈమెను జైలులో నిర్బందించారు.

జెస్యూట్‌లు ఈమె విధానాలని ప్రశంసించారు. పోప్ అర్బన్ కూడా ఈమెను రోమ్‌కు ఆహ్వానించారు. ఈమె అనుచరులతో కలిసి వెళ్ళారు.

వారి సహకారంతో ఈమె నెదర్లాండ్స్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, జెకోస్లోవేకియా దేశాలలో పాఠశాలలను స్థాపించారు. 1631లో మత ఛాందసులు ఆమెను మళ్ళీ జైలులో నిర్బంధించారు.

జైలులో ఉన్నప్పుడు తన అనుచరులకు పాఠశాలలను కొనసాగించడంలో తన సూచనలు, సలహాలను అందించారు. ఆ రోజుల్లోనే నిమ్మరసంతో కోడెడ్ లేఖలు వ్రాసి, గూఢచారులతో తన వారికి అందించడం ముదావహం. ఈ విషయం ఈమెకు మహిళా విద్య, మహిళాభివృద్ధి పట్ల గల అభిమానాన్ని తెలియపరుస్తుంది. అంతేకాదు పట్టుదలతో ఈ కార్యాన్ని నిర్వహించాలనే దృఢ నిశ్చయం కనపడుతుంది.

1632లో జైలు నుండి విడుదలయ్యారు. తన పాఠశాలలను చూసి పరమానంద భరితులయ్యారు. 1637లో పోప్, ఫ్రెంచి రాణిల నుండి ఆహ్వానం లభించింది. దీనిని పురస్కరించుకుని మళ్ళీ తన స్వదేశానికి వచ్చారు. లండన్ నగరాన్ని ముఖ్య స్థావరంగా చేసుకున్నారు. పాఠశాలలను స్థాపించారు. హాస్పిటల్స్ లోని రోగులకు ఉచితంగా ఆహారాన్ని అందించారు. జైలులోని ఖైదీలను సందర్శిస్తూ వారికి మంచి చెడులను తెలియజేసేవారు.

1642లో హట్టన్ రూడ్బీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కూడా పాఠశాలను స్థాపించారు. 1645 జనవరి 30వ తేదీన హెవర్స్ మనోర్‌లో మరణించారు.

ఈమె స్థాపించి నిర్వహించిన పాఠశాలలు ‘మేరీ వార్డ్ – లోరెట్ పాఠశాలలు’గా పేరు పొందాయి. వివిధ దేశాలలో ఈమె మరణానంతరం కూడా పాఠశాలలు నెలకొల్పబడ్డాయి.

భూగోళం మీది అన్ని ఖండాలలోనూ లోరెట్ సంస్థల ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, బోర్డింగ్ పాఠశాలలు స్థాపించబడి ఈ నాటికీ విజయవంతంగా నడపబడడం ముదావహం.

మనదేశంలో 1842 నాటికి లోరెటో పాఠశాలలు, కళాశాలల స్థాపించడం మొదలయింది. బాలికలు, మహిళలు చదువుకోవడం కోసం ఇవి కృషిచేశాయి. వీటిలో కొన్ని డార్జిలింగ్, సిమ్లా, లక్నో, ఢిల్లీ, రాంచీ, షిల్లాంగ్, సిక్కిం, అసన్‌సోల్, చెంబూర్ మొదలయిన ప్రదేశాలలో నెలకొని ఉన్నాయి. భారతీయ మహిళల విద్యలో వీటి పాత్ర అనిర్వచనీయం.

‘భారతరత్న’ మదర్ తెరీసా ఈ సంస్థ తరపున మనదేశానికి రావడం గమనించదగిన అంశం. ఈమె 1928 నుండి 1950 వరకు ఈ సంస్థ అనుబంధ శాఖలలో పనిచేశారు.

ఈమె జ్ఞాపకార్థం 2011 ఫిబ్రవరి 2వ తేదీన మేరీ వార్డ్ సంస్థలను ప్రారంభించి 400 సంవత్సరాలు పూర్తయిన (1609 -2009) సందర్భంగా భారతపాలాశాఖ ఒక స్టాంపును విడుదల చేసింది. ఈ స్టాంపు 5 రూపాయల విలువతో విడుదలయింది.

దీర్ఘచతురస్రాకారపు స్టాంపు మీద మధ్యలో నవ్వుతున్న మేరీవార్డ్ దర్శనమిస్తారు. రెండు వైపుల సంస్థ భవనాలు ఆకాశమంత ఎత్తున కనిపిస్తాయి. ప్రపంచం మొత్తం మీద ఈమె జ్ఞాపకార్థం స్టాంపును విడుదల చేసిన మొదటి దేశం మనదే! దీనిని బట్టి దేశవిదేశస్థులు ఎవరైనా దేశాభివృద్ధిలో పాలు పంచుకోవడాన్ని ప్రోత్సహించి, గౌరవిస్తుంది భారతదేశం అని ఋజువు చేసుకున్నాం. ఇంకా మహిళావిద్యకి తోడ్పడిన విద్యాసంస్థల స్థాపకురాలు స్వర్గీయ మేరీ వార్డ్‌కు మన దేశమందించిన అద్భుతం, అపురూపం, అనిర్వచనీయమైన నివాళి ఇది.

జనవరి 30 వ తేదీ ఈమె వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here