అన్నింట అంతరాత్మ-20: ప్రతి ఇంటా ప్రధాన ‘పాత్ర’ను నేను!

9
3

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం గిన్నె అంతరంగం తెలుసుకుందాం. [/box]

[dropcap]రెం[/dropcap]డు రోజులుగా సింక్‌లో పడి ఉన్న మాకు ఈరోజు పనిమనిషి రావడంతో మోక్షం వచ్చింది. మమ్మల్ని విమ్ జెల్‌తో రుద్ది కడుగుతుంటే తలంటిస్నానం చేసినంత ఆనందంగా ఉంది. నేను అన్నం గిన్నెను. నా జతగా మరో అన్నం గిన్నె కూడా ఉంది. అన్నపూర్ణమ్మగారు ఏది కొన్నా రెండేసి కొంటారు. అలా మేం జతగా ఎన్నో ఏళ్ల కిందట ఈ ఇంటికి చేరాం.

అన్నపూర్ణమ్మకు కుక్కర్‌లో వండండం లేదా రైస్ కుక్కర్‍లో వండడం ఇష్టం ఉండదు. వచ్చిన కోడలు కూడా అదృష్టమేమో గానీ అత్తమాటను మన్నించింది. రెండు రోజుల గిన్నెలను చూసి పనిమనిషికి కోపం, విసుగు వచ్చినట్లు ఆమె ముఖమే చెపుతోంది. జీతం బాగా ఇచ్చే ఇల్లు కావడంతో పైకి ఏమీ అనలేక మమ్మల్ని కొంచెం విసురుగా గిరాటేస్తోంది. అబ్బ! గట్టి దెబ్బే తగిలింది. కొద్దిగా సొట్టబోయాను. ఇంట్లో వాళ్లు కూడా అంతే. కోపం వస్తే మమ్మల్ని గిరాటేస్తుంటారు. తప్పు చేయక పోయినా శిక్ష తరచు అనుభవిస్తూనే ఉంటాం. తరతరాలుగా ఈ శిక్షకు అలవాటు పడిపోయాం. నా తోటి గిన్నెలు కూడా బాధను ఓర్చుకుంటున్నట్లు ముఖం పెట్టాయి. చివరకు మమ్మల్నందరినీ పెద్ద టబ్‌లో బోర్లించి పెట్టి ఎండలో పెట్టింది పనిమనిషి. కరోనా కాలమని ఇలా ఓ పావుగంట ఎండలో వదిలేసి తర్వాత మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నారు.

ఈ ఇంట్లో మా జనాభా చాలానే ఉంది. అన్నపూర్ణమ్మ అత్తగారి కాలం నాటి నుంచి నేటివరకు చేరిన పాత్ర సామాను మరి. స్టోర్ రూమ్‌లో అటకలనిండా అవే. అవేవీ అమ్మడం అన్నపూర్ణమ్మకు ఇష్టం ఉండదు. వెండి, ఇత్తడి, రాగి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణి, ప్లాస్టిక్.. ఇలా రకరకాల పాత్రలం ఉన్నాం. ఎప్పటివో కొన్ని మట్టిపాత్రలు కూడా ఉన్నాయి. అలాగే చిన్న, పెద్ద, భారీ పరిమాణాల్లో మేం ఉన్నాం. ఈ ఇంట అనేమిటి, పూరిగుడిసె నుంచి విలాస భవంతులవరకు ఎక్కడైనా మేం ఉండి తీరుతాం. ఎందుకంటే వంటకైనా, నీటి నిల్వ వంటి వాటికైనా మేం అత్యవసరం కదా.

“పంచపాత్ర, ఉద్ధరిణ, అరివేణం దేవుడి దగ్గర పెట్టండి” తాతగారు అన్నారు. “ఆఁ అలాగే” అంటూ తోమి, విడిగా ఉంచిన పూజసామాను లోపలకి పట్టుకెళ్లింది అన్నపూర్ణమ్మ. “తాతయ్యా! దాన్ని ‘పంచపాత్ర’ అని ఎందుకంటారు?” అడిగాడు వేదాంత్. ఏం చెపుతారో అని మేమంతా చెవులు అటు పడేశాం. ఎంతైనా మావాళ్ల విషయమనేసరికి కుతూహలం ఉంటుంది కదా.

తాతగారు వెంటనే “నీకు మంచి సందేహమే వచ్చింది వేదా, పూజ ప్రారంభంలో ఆచమనానికి ఈ పాత్రను వాడతాం. దీన్ని శివస్వరూపంగా భావిస్తారు. శివుడు పంచముఖుడు. ఆ పంచముఖాలు.. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఈ పాత్ర కూడా అలాగే ఉంటుంది” చెప్పారు. “మరి ‘కలశపాత్ర’ అంటే” ఇంకో ప్రశ్న సంధించాడు వేదాంత్. “కలశపాత్ర కూడా పూజకు వాడేదే. దీనికి సన్నని మూతి ఉంటుంది. పాత్ర చుట్టూ నలువైపులా పసుపు, కుంకుమబొట్టు పెట్టి, దాంట్లో నీటిని నింపి, గంధం, అక్షతలు, ఓ పువ్వు ఉంచి, కలశ పూజ చేస్తారు. కలశం అంటే నాకు అమృత కలశం గుర్తొస్తోంది. దాని గురించి కూడా చెపుతా విను.. క్షీరసాగర మథనం జరిగాక ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవించాడు. అమృతం కోసం సురులు, అసురులు కొట్టుకోవడంతో అది చేతులు మారిపోవడం చూసి దేవతలు శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, జగన్మోహినిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆమె అద్భుత సౌందర్యం చూసి రాక్షసులు ఆమె వెంటపడి, జరిగింది చెప్పి అమృతాన్ని పంచమని ఆమెను కోరారు. ఆమె వారిని రెండు వరుసలలో కూర్చోబెట్టి దేవతలకు అమృతం పోస్తూ దానవులను తన వయ్యారాలతో మభ్యపెడుతూ అమృతం అయిపోగానే అంతర్థానమయింది. ఆ తర్వాత దానవులు, దేవతలపై యుద్ధం చేయడం, అంతిమ విజయం దేవతలదే అయింది” వివరించారు.

“భలేఉంది” అని వేదాంత్ అంటుంటే ‘క్షీరసాగర మథనంలోనూ మా ‘పాత్ర’ ఉందన్న మాట’ అనుకుని ఉబ్బిపోయాను. నా కదలికతో తోటి పాత్రలు కూడా స్పందించి హర్షధ్వానాలు చేశాయి. అన్నపూర్ణమ్మగారు వచ్చి మమ్మల్ని వంటింట్లోకి తీసుకెళ్లింది. అన్నట్లు మాకు అనేక పేర్లున్నాయి. పాత్రలు, గిన్నెలు, బాసన్లు, బోకులు.. నన్నందుకుని బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టింది. అన్నం గిన్నెదే అగ్రస్థానమని చెప్పొద్దూ నాకు కాసింత గర్వం. కానీ ఆ కాఫీగిన్నె మాత్రం ఈ విషయంలో నాతో ఎప్పుడూ గొడవ పడుతుంది. “పొద్దున లేస్తూనే కాఫీ గిన్నెనయిన నన్నే వెతుక్కుంటారు. పొగలు కక్కే కాఫీ నాలో తయారయితే ‘ఆహా’ అనుకుంటూ ఆస్వాదిస్తారు. నువ్వు నా తర్వాతే” అంటూ బడాయిలు పోతుంది. నాకు ఒప్పుకోవాలనిపించదు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. కాఫీతో కడుపు నిండుతుందా ఏమిటి? ఇలా నేను అనుకుంటూ వేడెక్కిపోతున్నాను. నా లోపల అన్నం కుతకుతమంటోంది. నాకు ఎందుకో హఠాత్తుగా మొన్నామధ్య టీవీలో చూసిన మాయాబజార్ సినిమా గుర్తొచ్చింది. అందులో వివాహ భోజనంబు… వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. హహహ నాకే ముందు అని పాడుతూ ఘటోత్కచుడు విందారగిస్తాడు. ఆ సందర్భంలో వివిధ రకాల వంటకాల పాత్రలు ఘటోత్కచుడి ముందుకు వాటంతట అవే కదిలిరావడం భలేగా ఉంటుంది. అంతేకాదు, ఘటోత్కచుడు ఆరగించి వెళ్లగానే ఖాళీ అయిన పాత్రలను తమ మాయాజాలంతో మళ్లీ యథాతథంగా వంటకాలతో నింపేయడం ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది.. అనుకుంటుండగానే అన్నం ఉడికింది, అన్నపూర్ణమ్మ నన్ను కిందకు దించేసింది. కూరలు, పప్పు, పులుసు పాత్రలు చాలా బిజీగా ఉన్నాయి.

అంతలో “నానమ్మా! నానమ్మా” అంటూ ప్రణవి వచ్చింది. “ఏంటి తల్లీ!” అంది అన్నపూర్ణమ్మ. “మరి వంటలు స్టీలు గిన్నెల్లోనే వండాలా?” అడిగింది. “అదేం లేదమ్మా! హిండాలియం కుక్కర్లలో వండుకోవడం నీకు తెలుసుకదా. అలాగే గతంలో రాగి, ఇత్తడి గిన్నెలకు లోపలివైపు కళాయి పెట్టించి వంటకు వాడేవారు. కళాయి అంటే తగరంపూత అన్నమాట. కళాయి పెట్టేవారు తరచు వాకిళ్ల వద్దకే వచ్చేవారు. కళాయి కొంతకాలానికి కొద్దికొద్దిగా పోవడం మొదలవుతుంది. అది గుర్తించి మళ్లీ కళాయి పెట్టించవలసి ఉండేది. లేదంటే వంటలు వండినపుడు రసాయనిక చర్య జరిగి, ఆ పదార్థాలు తింటే వాంతులయ్యే ప్రమాదం ఉండేది. గతంలో కొంతకాలం జర్మన్ సిల్వర్ గిన్నెలు కూడా వాడకంలో ఉండేవి. ఆ తర్వాత వాటి వాడకం కూడా ఆరోగ్య దృష్ట్యా అంతమంచిది కాదని తెలుసుకున్నారు. పూర్వం రాజుల కాలంలో అయితే రాజభవనాలలో వెండి, బంగారు పాత్రలు విరివిగా వాడేవారు. అంతెందుకు ఇప్పటికీ ధనికుల ఇళ్లలో రెండో, మూడో అయినా వెండి పాత్రలుండటం మామూలే. ముఖ్యంగా పిల్లలకు అన్నప్రాసనకు వెండిగిన్నె, చెంచా వాడడం సంప్రదాయం. ఏమైనా ప్రస్తుతం అధికంగా వాడకంలో ఉన్నది స్టీల్. ఇప్పుడు స్టీల్ మీద కూడా కాస్తంత వ్యామోహం తగ్గిందనే చెప్పాలి. గతంలో పాత బట్టలకు స్టీలు సామాను ఇస్తామంటూ వాకిళ్ల ముందుకే వచ్చేవారు. కొంతమంది గృహిణులు వాటి మీది వ్యామోహంతో చాలినన్ని పాతబట్టలు లేకపోతే మంచిమంచి చీరెలను, ఇంటాయన ప్యాంటు, షర్టులను వెనకా, ముందు చూడకుండా ఇచ్చేసి నచ్చిన స్టీలు సామగ్రి కొనేవారు. వాస్తవానికి ప్రాచీన కాలంలో మట్టి కుండలే వంట పాత్రలుగా ఉండేవి. ఇప్పటికీ కొద్దిగొప్పో వాడుతున్నారు. వేసవిలో అయితే చల్లటినీటి కోసం కుండలు, కూజాలు కొనుక్కోవడం మామూలే. ఫ్రిజ్ వచ్చాక నీటి కుండల వాడకం తగ్గిపోయిందనే చెప్పాలి. అన్నట్లు కుండలంటే నాకు పూరి జగన్నాధ క్షేత్రంలోని విషయం గుర్తుకొస్తోంది. అక్కడ ప్రసాదాలు కుండల్లోనే, కట్టెలపొయ్యిల పైనే వండుతారు. కుండలను ఒకదానిపై ఒకటి వరుసగా పెట్టి ప్రసాదాలు వండుతారు. అన్నిటికన్నా పైనున్న చిన్నకుండలోని ప్రసాదం ఉడకగానే అన్నిటినీ దింపేస్తారు. అప్పటికే అన్ని కుండల్లోని పదార్థాలు చక్కగా ఉడికి ఉంటాయి. ఇంకో విశేషమేమంటే అక్కడ ఒకసారి ఉపయోగించిన కుండను మళ్లీ వాడరు. భక్తులకు కూడా మట్టిపాత్రలలోనే ప్రసాదాన్ని అందిస్తారు” చెప్పింది. “భలే ఉంది నానమ్మా” అంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది ప్రణవి.

అంతా విన్న నేను మా బంధు బలగం చాలా విస్తారమైందని గర్వంగా అనుకున్నాను. నేనిలా ఆలోచిస్తుండగానే అన్నపూర్ణమ్మ వంటకాలన్నీ భోజనాల బల్ల మీదకు చేర్చి అందర్నీ భోజనానికి రమ్మని పిలిచింది. అంతా వచ్చారు. వాళ్లలా అంతా కలిసి, కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం నాకే కాదు, మావాళ్లందరికీ కూడా ఎంతో ఇష్టం. తాతగారు రిమోట్ అందుకుని టీవీ ఆన్ చేశారు. ఏదో సినిమా.. అందులో భాగంగా శ్రీరామజననం గురించిన హరికథ నడుస్తోంది. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం, యాగం సంపూర్తి కాగానే అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథుడికి పాయస పాత్రను ఇవ్వడం, ఆయన తన మువ్వురు భార్యలకు ఆ పాయసాన్ని పంచడం, ఆ తర్వాత రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు జన్మించటం పాటల్లోనే చెప్పేశాడు. వాళ్లంతా కబుర్లలో ఉన్నా, నేను మాత్రం శ్రద్ధగా విని, రామాయణంలో కూడా మేం కీలకం గానే ఉన్నామనుకున్నాను.

“అన్నట్లు బియ్యం నిండుకోబోతున్నాయి. మళ్లీ ముందు చెప్పలేదంటారు. తెప్పించండి” అంది అన్నపూర్ణమ్మ. “అప్పుడే అయిపోయాయా! ఇంకా పదిరోజులు వస్తాయనుకున్నానే” అన్నారు తాతగారు. “నలుగురున్న ఇంట్లో మీ లెక్కలు ఎందుకు పనికి వస్తాయి. ద్రౌపది దగ్గరున్నట్లు మనకూ ఓ అక్షయ పాత్ర ఉంటే ఎంత బాగుండేది?” అంది నవ్వుతూనే. అది విన్న వేదాంత్ “అక్షయపాత్రా? అంటే అదేం పాత్ర?” అడిగాడు. తాతగారు అందుకుని “అక్షయం అంటే క్షయం లేనిది. అంటే తరిగిపోవడమనేదే లేనిది. ఆ పాత్రలోని పదార్థం ఎంత వాడినా ఇంకా మిగిలే ఉంటుందన్నమాట” అన్నారు. “భలే ఉందే.. ద్రౌపదికి అక్షయపాత్ర ఎలా వచ్చింది?” అడిగాడు వేదాంత్. అందుకు తాతగారు “పాండవులు అరణ్యవాసంలో ఉన్న కాలంలో వారిని కలవడానికి ఎందరో మునులు, రాజులు, మంత్రులు వచ్చేవారు. అది అడవి కావడంతో వచ్చిన వారందరికీ ఆతిథ్యం ఇవ్వడం ద్రౌపదికి కష్టమైంది. ఆమె ఇబ్బంది గమనించిన ధర్మరాజు దైవాన్ని ప్రార్థిస్తే సూర్యదేవుడు ప్రత్యక్షమై అక్షయపాత్ర ప్రసాదించాడని, దాన్ని ఆయన ద్రౌపదికి అందించాడని ఒక కథనం. మరో కథ ప్రకారం ద్రౌపదే తన కష్టం గట్టెక్కించమని కృష్ణుణ్ని వేడుకుంటే అక్షయపాత్ర ప్రసాదించాడని, అందరూ భుజించాక ద్రౌపది భుజించేదని, ఆమె తినేవరకూ ఎంతమందికైనా అందులో ఆహారం తరగకుండా ఉండేది. అదన్నమాట అక్షయపాత్ర సంగతి” అన్నారు తాతగారు. “అద్భుతం” అన్నాడు వేదాంత్. ‘మా జాతిలో కూడా మహిమ కలిగిన వాళ్లున్నారన్నమాట’ అనుకున్నాను నేను. అలా కబుర్లతో భోజనాలు ముగిశాయి. అంతా లేచారు. కోడలు మమ్మల్నందరినీ మళ్లీ వంటింట్లోకి చేర్చింది. నేను ఖాళీ అయ్యాను కాబట్టి సింక్ లోకి చేరాను.

మళ్లీ నాకు విరామం. అంతలో పప్పుగిన్నె పకాలుమని నవ్వింది. నేను ఏమిటన్నట్లు చూశాను. అది బదులిస్తూ “నాకు ఆమధ్య టీవీలో చూసిన తెనాలి రామకృష్ణ సీరియల్ గుర్తొచ్చింది. అందులో రామకృష్ణకు కాళికాదేవి ప్రత్యక్షం అయి, ఒక చేతిలో పెరుగు గిన్నె, మరోచేతిలో పాయసం గిన్నె పట్టుకొని ఏది కావాలో తీసుకోమంది. రామకృష్ణ తెలివిగా రెండింటినీ అందుకుని, గబుక్కున తాగేశాడు. కాళికాదేవి కోప్పడితే లక్ష్మి, సరస్వతి రెండూ అవసరమే కాబట్టి అలా చేశానని, ఆగ్రహించ వద్దనీ అంటాడు. ఆమె ‘అయినా సరే, నా మాటను ఉల్లంఘించావు కాబట్టి వికటకవి అవుతావు’ అంది. అది గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఎంత తెలివో కదా” అంది. అవునంటూ నేనూ నవ్వేశాను. ఇదేదో పప్పుసుద్ద అనుకున్నాను కానీ ఇది కూడా హాస్య చతురతను ఆస్వాదిస్తోంది. తొలిసారిగా దాన్ని గుర్తించాను.

టీవీ అంటే గుర్తొచ్చింది. ఆమధ్య ఓ సినిమా చూశాను… ఓ యుగళ గీతానికి బిందెలతో బ్రహ్మాండమైన సెట్ వేశారు. ఆ పాట బాగా హిట్ అయిందట మరో విషయం గుర్తుకొస్తోంది.. ఆమధ్య అన్న పూర్ణమ్మగారి చిన్నమ్మాయి వివాహం అయింది. పెళ్లితంతులో వరుడి కాళ్లు కడిగే ఘట్టానికి పళ్లెం, చెంబు కాకుండా రెండు చిన్న వంట గిన్నెలు కూడా తెచ్చారు. పెళ్లిలో మంగళసూత్రధారణ, తలంబ్రాలు వగైరాలు అయ్యాక స్థాలీపాకం ఘట్టం ఉంటుంది. అందులో వధువు ఓ చిన్న గిన్నెలో అగ్నిహోత్రం పైనే అన్నం వండుతుంది. దాన్ని వరుడు కొద్దికొద్దిగా హోమంలో వేస్తాడు. అంటే వధూవరులకు అప్పుడే మాతో పని పడుతుందన్నమాట. అంతే కాదు, పెళ్లిలో పానకం బిందెలు ఇవ్వడం, అందులో ఉంగరాలు వేసి, వధూవరులను తీయమనడం.. అలా మూడుసార్లు చేసి ఎవరు ఎక్కువసార్లు తీస్తే వారిదే పైచేయి అని చెప్పడం కూడా ఉంటుంది.

అసలు అప్పటిదాకా ఎందుకు, బాల్యం నుంచే మా పాత్రల పరిచయం జరుగుతుంది. ప్రణవి చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకునేది. అందులో చిన్నచిన్న గురుగులతో వంటచేసే ఆట ఆడేది. అన్నట్లు ఓసారి అన్నపూర్ణమ్మగారు కాశీ వెళ్లారు. అప్పుడు గంగా జలం ఉన్నచిన్న రాగి చెంబును తెచ్చారు. ఇంట్లో పాత్రలకు చాలా వాటి పై పేర్లున్నాయి. గతంలో అలా పేర్లు రాయించేవారు. అలాగే బహుమతులుగా ఇచ్చే గృహోపకరణాలపై కూడా పేరు, వివరం రాస్తుంటారు. ఏమైనా ఈ మధ్య కాలంలో స్టీలు పాత్రల బహుకరణ తగ్గిపోయిందని ఏదో సందర్భంలో అన్నపూర్ణమ్మగారు అంటుండగా విన్నాను.

సాయంత్రమవుతోంది. మళ్లీ కళ కళలాడుతూ కాఫీ పాత్రలు.. వాటికి ఎప్పుడూ గిరాకీయే. మా జాతిలో కొన్నింటికి కాలదోషం పట్టింది. పాతకాలం గంగాళాలు, కాగులు, ఆ తర్వాత కొన్నాళ్లు ఇంటింటా వెలిసిన రాగి బాయిలర్లు ఈ ఇంట్లో కూడా ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి.. కాకపోతే స్టోర్ రూమ్ అటకపై. అలాగే కొన్ని చిల్లిపడ్డ పాత్రలు కూడా అక్కడే పడి ఉన్నాయి. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు చీకటి పడ్డదో కూడా గుర్తించలేదు. అన్నపూర్ణమ్మగారు మనవరాలి (కూతురు బిడ్డ)కు చందమామను చూపిస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ.. ‘వెండి గిన్నెలో వేడి బువ్వ తేవే, పైడి గిన్నెలో పాల బువ్వ తేవే..’ అని పాడుతూ గోరుముద్దలు తినిపిస్తోంది. వెండిగిన్నె.. పైడి గిన్నె.. మళ్లీ మా వాళ్ల ప్రస్తావన విని కాసింత గర్వపడ్డాను. అంతలో ఆ మధ్య సంక్రాంతి రోజుల్లో హరిదాసుగారు ముచ్చటైన రాగిపాత్రతో హరి నామ సంకీర్తన చేస్తూ ఇల్లిల్లూ తిరగటం గుర్తొచ్చింది.

ఇలా అనుకుంటున్నానో లేదో వీధిలో ‘అమ్మా!’ అంటూ ముష్టివాడి వేడుకోలు. వాడి చేతిలో ఓ సత్తుగిన్నె. ఇలా మనుషులందరికీ ఉపయోగపడటం మా జాతిచేసుకున్న మహద్భాగ్యమే.

అయితే మనిషి విన్నా, వినకపోయినా సరే నావంతు ప్రయత్నంగా ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. అది.. మీ ఆహారం కోసం మేం పొయ్యిపై కూర్చుంటాం. మాడేదాకా ఉంచి, మసి పట్టించినా భరిస్తాం. పాత్రలమైన మేం మాపాత్రను నూటికి నూరు శాతం నిర్వహిస్తాం. అయినా మీరు, మాపట్ల కాసింత కృతజ్ఞత చూపరు. మీ విసుగునంతా చూపిస్తూ బరాబరా తోమేస్తారు. కోపమొస్తే విసిరి విసిరి కొడతారు. మీరే పడేసి, మాకు దెబ్బ తగిలితే సొట్టగిన్నె అంటూ నిందిస్తుంటారు. ఇదేం న్యాయం? నిజానికి మాలాగా మీ పాత్రను మీరు సవ్యంగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు. మనుషులుగా పుట్టినందుకు సమాజం పట్ల బాధ్యతతో, మానవీయంగా మెలుగుతూ, మీ కర్తవ్యాలను నిర్వహించాలని మనవి చేసుకుంటున్నాను.. అదిగో, భోజనాలయినట్లున్నాయి. మా వాళ్లను సింక్‌లో పడేస్తున్నారు. మావాళ్లు గట్టిగా మూలుగుతూ మాదైన భాషలో శబ్దాలు చేస్తున్నారు.

ఇంకేముంది.. అంతా కలిసి పరస్పర పరామర్శలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here