[dropcap]కొం[/dropcap]డవీడు రాజ్యంలో అరవిందుడు అనే వాడు జ్ఞాన సముపార్జన కోసం ఎన్నో గ్రంథాలు చదివాడు. బ్రతుకు తెరువు కోసం ఒక గ్రంథాలయంలో పనిచేసేవాడు. అలా వాడు అనేక దేశాల గురించి చదివాడు ఆ గ్రంథాలయంలో. తన జీవితంలో ఒక్కసారి అయినా వివిధ దేశాలు, వాటిలోని వింతలు చూడాలనుకున్నాడు.
కొండవీడులో అమర్త్యుడు అనే వ్యాపారి వ్యాపార నిమిత్తం తన ఓడ మీద దూర దేశాలకు వెళ్ళేవాడు. అమర్త్యుడి వద్దకు వెళ్ళి ఈసారి ఓడ విదేశాలకు బయలు దేరినప్పుడు తాను వస్తానని, ఓడలో తాను సహాయంగా ఉంటానని తనను తీసుకుని వెడితే ఆ దూర దేశాలు చూడటమే కాకుండా అక్కడి విశేషాలు గ్రంథస్తం చేస్తానని చెప్పాడు.
అరవిందుని జిజ్ఞాస గమనించి అమర్త్యుడు తన ఓడలో అరవిందుణ్ణి తీసుక వెళ్ళేందుకు అంగీకరించాడు. ఆ విధంగా వారు కొండవీడు ఓడరేవు నుండి బయలు దేరి సుదూర ప్రాంతాలకు సముద్రంపై ప్రయాణించసాగారు.
అలా సముద్రంలో చాలా దూరం వెళ్ళాక తుఫాను ప్రారంభమయింది. సముద్రం అల్లకల్లోలమయి పోయింది! ఓడ సముద్రంలో మునిగి పోయి చెక్కలు ముక్కలుగా విరిగి పోయింది. ఓడలోని వారందరూ చెల్లా చెదురుగా అయిపోయి వారి జాడ తెలియకుండా పోయింది! ఎలాగో అరవిందుడు, అమర్త్యుడు ఓడ చెక్క ముక్కలు పట్టుకొని ఈద సాగారు. మెల్లగా తుఫాను తగ్గి పోయింది.
అలా ఇద్దరూ ఒక దీవికి చేరుకున్నారు. బడలికతో ఇసుకతిన్నె మీద నిద్ర పోయారు. మెలకువ వచ్చి చూడగా దూరంగా చిక్కని చెట్లు కనబడ్డాయి. అక్కడ తప్పక తిండి దొరుకుతుందని ఊహించి ఇద్దరూ అతికష్టం మీద ఆ చెట్ల వద్దకు చేరుకున్నారు.
చిత్రంగా చెట్లకు మనం మామూలుగా చూసే కాయలకన్నా ఐదింతలు పెద్ద కాయలు, పండ్లు కాచి ఉన్నాయి. అంటే జామకాయలు మామూలుగా నాలుగు అంగుళాలు ఉంటే మనం పెద్దది అనుకుంటాము. కానీ ఆ ద్వీపంలో జామకాయలు చిన్న గుమ్మడి కాయంత పరిమాణంలో ఉన్నాయి. అవి చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
అమర్త్యుడు ఆకలితో వాటిని కోసి తినబోయాడు.
“ఆగు అమర్త్యా, కొత్త ప్రదేశంలో మనకు తెలియని ఆహార పదార్థాలు తినరాదు. అవి విష పూరితం అయి ఉండొచ్చు! పరిశీలించి తిందాం” అని చెప్పి అమర్త్యుడు తినకుండా ఆపాడు అరవిందుడు. ఇంకా మిగిలిన చెట్లను పరిశీలించడానికి ఇద్దరూ చెట్ల మధ్యకు వెళ్ళారు.
ఏ రకం పండ్లు, కాయలు చూసినా అన్నీ పెద్ద పరిమాణంలోనే ఉన్నాయి. అక్కడే కొన్ని స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయి. వాటిలో ఏ విధమైన రుచి లేదు కనూక ఇద్దరూ నీళ్ళు త్రాగి కడుపు నింపుకున్నారు. నీళ్ళు త్రాగడం వలన ఇద్దరికీ ఊపిరి వచ్చినట్లయింది. దీవిని మరింత పరిశీలిస్తుంటే వారికి దూరంగా ఓ పాత భవనం కనుపించింది. ఇద్దరూ ఆశ్చర్యపోయి, ఆ భవనంలో ఎవరైనా ఉన్నారేమో అని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ భవనం వైపు వెళ్ళారు. లోపల ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఇద్దరూ ఆయనకు నమస్కారం పెట్టి,
“అయ్యా, తమరు ఎవరు? ఇక్కడ ఇతర మనుషులు కానీ, జంతువులుకానీ కనబడటంలేదు. తమరు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటున్నారు? అసలు ఈ దీవి పేరు ఏమిటి? ఇక్కడ చెట్లకు అంతంత పెద్ద కాయలు,పండ్లు ఏమిటి? అవి తినదగినవేనా?” అని వారి అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో సంధించారు.
“అసలు మీరు ఎలా ఇక్కడికి వచ్చారు?” అని అడిగాడు తాత.
మేము వ్యాపార నిమిత్తం ఓడ మీద పోతుంటే తుఫానులో చిక్కుకుని, చెక్క ముక్క సహాయంతో ఇక్కడికి చేరాము. ఈ దీవిని గురించి మేము ఇంతవరకు విని ఉండలేదు” చెప్పాడు అమర్త్యుడు.
“అయ్యా, నా పేరు అనంతుడు. ఈ దీవి పేరు ఉజ్జ్వలద్వీపం. ఇది సముద్రంలో మారుమూల ఉండటం చేత దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఈ ద్వీపంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంతమంది జనం ఉండేవారు. ఇక్కడ మంచి చెట్లు, పుష్కలమైన మంచి నీరు ఉంది. ప్రజలు హాయిగా బతికేవారు. కానీ వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండేవికావు. అప్పటిలో ఈ దీవి మీద అతి పెద్ద తుఫాను సంభవించి అనేక వేలమంది చనిపోయారు. చాలా చెట్లు నాశనం అయిపొయ్యాయి.
ఎలాగో నలుగురు మాత్రం బతికారు, వారిలో అమరకీర్తి మాత్రం చాలాకాలం బ్రతికాడు. అమరకీర్తిలో జన్యు మార్పులు ఏ కారణం చేతో జరిగి వాడు మహాకాయుడుగా మారిపోయాడు. వాడికి ఎంత తిండి తిన్నా సరిపోయేది కాదు. చిత్రమేమిటంటే వాడు చాలా తెలివిగలవాడు.
అమరకీర్తి తన ఆకలి తీర్చుకునేందుకు చాలా ఆలోచించి చెట్లమీద విశేష పరిశోధనలు చేశాడు. చెట్లలో జన్యు మార్పులు తీసుకవచ్చి మేలిరకం పండ్లను అతి పెద్ద పరిమాణంలో కాసేటట్టు చేశాడు. అలా హాయిగా నూటఇరవై ఏళ్ళు బతికి చనిపొయ్యాడు.
“అతని సమాధి చూపిస్తాను నాతోరండి” అని అక్కడికి కొద్ది దూరంలో అతిపెద్ద సమాధిని ఆ ముసలి అనంతుడు చూపించాడు.
“అమరకీర్తి తన ఆకలితో తన తిండికోసం వివిధ పరిశోధనలు చేసి,తనకు తెలియకుండానే మానవాళికి ఎనలేని సేవ చేశాడు.అసలు ఈ పండ్లలోకొన్ని రకాలు ఆకలిని తీర్చడమేకాదు, రోగ నిరోధక శక్తిని పెంపొదిస్తాయి. ఇప్పడు నా వయస్సు రెండు వందల ఏళ్ళు, నాకు ఇక్కడే అలవాటు అయిపోయి ఈ సముద్రం దాటి వెళ్ళాలని నేను అనుకోపోవడంవలన ఇక్కడే ఉండిపోయాను. నా వయస్సుకూడా పైబడిపోయింది. నేను కనీసం ఈత కొట్టలేను. నామాటవిని ఈ చెట్లు, పండ్లు, కాయలు మీరు తగినన్ని తీసుకుని సహాయంగా కొన్ని పెద్ద చెట్లకొమ్మల్ని తీసుకుని జాగ్రత్తగా ఈది ఇక్కడికి అతి దగ్గరగా తూర్పుదిక్కున ఉన్న కంజీర ద్వీపాన్ని చేరి దాని మీద ఉన్న పెద్ద గుట్టను ఎక్కి దూరంలో ఏదైనా పడవవస్తే మీరు పెద్ద ఆకులు, చెట్టు కొమ్మల సహాయంతో ఊపండి. ఒకవేళ వారు గమనిస్తే వారు మిమ్మల్ని రక్షించి మీ దేశానికి చేరుస్తారు. మీరు తీసుకున్న పండ్లలో విత్తనాలను జాగ్రత్త పరచి మీ దేశంలో తోటల్లో వేయండి. అవి ఆకలి తీర్చడమే కాకుండా రోగాలు రాకుండా చేస్తాయి” అని మంచి మనసుతో చెప్పి,అమరకీర్తి స్వీయచరిత్ర,జన్యు విషయాలు వ్రాసిన తాళపత్ర గ్రంథాలు ఇచ్చాడు.
“అయ్యా, తమరు ఇంతమంచి మనసుతో విషయాలు చెప్పడమే కాకుండా, మాకు విత్తనాల కోసం పండ్లు, అమరకీర్తి వ్రాసిన గ్రంథాలు ఇచ్చారు. మిమ్మల్ని కూడా మేము మా దేశానికి తీసుకవెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాము” అని చెప్పారు అమర్త్యుడు, అరవిందుడు.
“నాయనా నేను చరమాంకంలో ఉన్నాను.ఇక్కడే పండ్లు తింటూ హాయిగా బతుకుతాను.మీకు వీలైతే ఎప్పుడయినా వచ్చి నన్ను చూసిపొండి” అని ఇద్దరినీ ఆశీర్వదించి పంపివేశాడు.ఇద్దరూ కంజీర ద్వీపాన్ని చేరి ఓ ఓడకు తమ సంజ్ఞలను చెట్టు కొమ్మలు, ఆకులు ఊపి తెలియచేసి ఆ ఓడలో స్వదేశం చేరారు. వజ్రాలకంటే విలువైన శాస్త్ర విషయాలు మానవాళికి ఉపయోగ పడే చెట్లు లభించినందుకు అమర్త్యుడు,అరవిందుడు ఎంతో సంతోషించి అప్పుడప్పుడూ ఉజ్జ్వల ద్వీపం వెళ్ళి రాసాగారు. వృద్ధ అనంతుడు కాలధర్మం చెందాక, అతని విగ్రహాన్ని,అమరకీర్తి విగ్రహాన్ని ఉజ్జ్వలద్వీపంలో ప్రతిష్ఠించి వాటికింద వారి చరిత్రలను వ్రాయించి తమ ఋణం తీర్చుకున్నారు.