[dropcap]“ఇ[/dropcap]దిగో అమ్మా, మా బాస్ ఎప్పుడైనా రావచ్చు, కనుక నువ్వు అటు ఇటూ వెళ్ళకు. అంటే పక్కింటి పిన్నిగారి దగ్గరకో, వెనుకింటి వదిన గారి ఇంటికో వెళ్ళకుండా, దయచేసి ఇంట్లోనే ఉండు. మా బాస్ ఏ క్షణంలోనైనా వస్తారు. ప్రమోషన్ ఆర్డర్స్ తెచ్చినా తెస్తారు. నాన్నా, నువ్వు కూడా ఆయన రాగానే చెక్క బొమ్మలా ఉండిపోక చక్కగా పలకరించు. లలితా, మా బాసు రాగానే నమస్కారం చేసి, ఆయన్ని ‘అన్నయ్యా’ అంటూ అభిమానంగా పలకరించు, అనుబంధం చిలకరించు. ఆయన అడుగు పెట్టీ పెట్టగానే నువ్ ఏ.సి. ఆన్ చేసేయాలి. ఆ ఏసీ ఆయన్ని చిల్ చేసేయాలి” చెప్పాడు మధు తెగ హడావుడి పడిపోతూ.
“నీ ప్రమోషన్ కోసం మేమంతా యానిమేషన్ బొమ్మల్లా ఆడాలన్నమాట?” అని ఓ క్షణం చిత్రంగా చూసి “అది సరే కానీ, ఇంతకీ ఆయన ఎన్ని గంటలకు వస్తారనేది నిన్న నీకు ఆఫీసులో సరిగ్గా చెప్పారా” అని అడిగాడు తండ్రి గిరిబాబు సందేహంగా.
“భలే వాడివే, నిన్న ఆఫీసు కేఫిటేరియాలో ఇద్దరం కాఫీ తాగి సాఫీగా మాట్లాడుకున్నాక, మార్నింగ్ మీ ఇంటికి వస్తాను అన్నారు. అంటే మధ్యాహ్నం పన్నెండు లోపల ఎప్పుడైనా రావచ్చు. కనుక మనం అంతా సిద్ధంగా ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే,ఒక సర్‌ప్రైజ్ కూడా ఉందన్నారు. బహుశా అది, ప్రాజెక్ట్ వర్క్ మీద నన్ను అమెరికా పంపడం, లేదా జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ చేయడం గురించో చెప్పొచ్చు. ఎందుకంటే, నా తోటి ఉద్యోగుల్లో కొందరు సీనియర్లు, తప్పక ఇదే జరుగుతుందని నొక్కి మరీ చెప్పారు. పోయిన వారం కూడా ఓ ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి, అలానే సర్‌ప్రైజ్ చేశారట. నిజంగా అలా జరిగితే ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ బాస్ వచ్చిన రెండు నెలలకే నా టాలెంట్ గుర్తించనట్టనిపిస్తోంది. నేనంటే మా బాస్‍కి ప్రత్యేక అభిమానం ఉండి ఉండాలి” అంటూ సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ తెగ ఫీల్ అయిపోయాడు.
ఇంతలో వీధి గేటు తీసిన శబ్దం వినిపించింది. అంతే, గిరిబాబు, హఠాత్తుగా స్ప్రింగు మింగినట్టు టింగుమని పైకి లేచి, “ఒరేయ్ మధు, మీ బాసు వచ్చేసినట్టు ఉన్నార్రా. పద, పద, పెళ్ళుమంటూ ఎదురెళ్ళి, బళ్ళుమంటూ సాదరంగా ఆహ్వానిద్దాo” అంటూ హడావుడిగా ముందుకు నడిచాడు. అతని తల్లి, దిష్టి తీయడానికి హారతి పళ్ళెం, నోరు తీపి చేయడానికి కొంచెం బెల్లం వగైరా పట్టుకుని గుమ్మం వైపు నడిచింది. లలిత చిన్న చిరునవ్వుతో తలుపు తీసి, తీస్తూనే “నమస్కారం” అంటూ గుమ్మం వైపు చూసి,సారం పోయిన మనిషిలా తయారైంది. అలానే కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది. తండ్రి, తల్లి కూడా కొయ్యబొమ్మల్లాగా నిలబడిపోయారు.
ఎవరో పెద్దాయన చిన్న చిరునవ్వుతో చూస్తూ నిల్చున్నాడు. అతన్ని ఎగాదిగా చూస్తూ, “బాస్ కోసం చూస్తుంటే, ఈ కొత్త ఫేస్ ఎవరబ్బా” అని మనసులో అనుకుని “మీరు” అన్నాడు మధు, ఏదో ఏలియన్ని చూసినట్టు చూస్తూ.
మధు వైపు చూసిన ఆ పెద్దాయన, మధు మనసులో ఏముందో గ్రహించినట్టు “నేనెవరో నీకు తెలియలేదా! మర్చిపోయుంటావు. నేను మీ నాన్న బాలమిత్ర, పేరు కూడా అదే” చెప్పాడు చిన్న చిరునవ్వుతో.
ఆ మాట వింటూనే గిరిబాబు కళ్ళజోడు సరిచేసుకొని, అతని వంక గుచ్చి గుచ్చి చూస్తూ “నువ్వా మిత్రా! ఇది వరకు చిలక్కొట్టిన జాంపండులా ఉండేవాడివి, ఇప్పుడిలా చీకేసిన తాట్టెంకలా తయారవడంతో గుర్తు పట్టలేకపోయాను. సరే లోపలికి రా” అన్నాడు కొంచెం ముఖం మాడ్చుకుని ఇటు తిప్పేస్తూ.
“ఎలా ఉన్నావ్ రా గిరి, అందరూ క్షేమమేనా. నిన్ను చూసి చాన్నాళ్ళయింది. దగ్గర, దగ్గర, పదిహేను సంవత్సరాలు అనుకుంటున్నాను. అప్పటి నుండి మనం కలవలేదు సుమీ” అన్నాడు. లోపలికి వచ్చి కూర్చుoటూ.
ఆ తర్వాత కాస్త వెనక్కి జారబడుతూ, “నిప్పులు నెత్తిన పడ్డట్టు, ఎండలుమండిపోతున్నాయి రా గిరీ” చెప్పాడు.అతని నుదుటిన పట్టిన చెమటని కర్చీఫుతో తుడుచుకుంటూ.
“అది సరేలే కానీ,ఇన్నాళ్ళ తర్వాత నా గురించీ,ఈ చిరునామా గురించీ నీకెలా తెలిసిందో” అడిగాడు గిరిబాబు వ్యంగ్యంగా.
“అదే చిత్రం, అనుకోకుండా మా అబ్బాయి మీ వాడి వివరాలు ఫేస్‌బుక్‌లో చూసి కనిపెట్టాట్ట. ఆ తరువాత నాకు చెప్పాడు. గుండె జబ్బు మనిషినైనా, ఉండబట్టలేక మొండిగా ఇలా వచ్చాను. అసలు చిత్రం ఏవిటంటే” అని అతను ఉత్సాహంగా ఏదో చెప్పేంతలోనే –
ఆ మాటలు వింటున్న గిరిబాబు కనీసం తల ఎత్తి చూడకుండా, “అవన్నీ సరేరా, కానీ మేము ఇపుడు బయటికి వెళ్ళి పోతున్నాం. స్నేహితుడివే కానీ, అనుకోని సమయంలో వచ్చిపడ్డావ్. సరే నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, కలుద్దాం” చెప్పాడు ఇబ్బందిగా చేతులు నులుముకుంటూ.
గిరిబాబు మాటలు వింటూనే తెల్లమొహం వేసారు మిత్రాగారు.
ఒక క్షణం తర్వాత కాస్త తేరుకుని, “అవునా! సారీ రా గిరీ, నీకు ఇబ్బంది కలిగించాను. అయితే నేను రావడం” అని మరింకేదో చెప్పేంతలోనే మధు అడ్డుపడుతూ, “ఇక బయలుదేరండి అంకుల్, ఎండ పెరుగుతోంది, ఈ అయిదు వందలు తీసుకుని ఏదైనా ఆటోలో వెళ్ళండి” చెప్పాడు మధు.
“ఒరేయ్ గిరి, మీ వాడు చేస్తున్న ఉద్యోగం”
“అదో పెద్ద కథ” అని ఇంకా ఏదో చెప్పేంతలోనే “మీరు ఉండండి, అసలే అన్నయ్య గారికి ఆలస్యం అయిపోతుంటేనూ” అంటూ సైగ చేసింది గిరిబాబు భార్య లక్ష్మమ్మ.
దాంతో ఇక తప్పదన్నట్టు కాస్త చిన్నగా నిట్టూరుస్తూ “సరేరా గిరి బయలుదేరుతాను. తర్వాత కలుద్దాం” చెప్పాడాయన పైకి లేస్తూ.
ఇంతలో గుమ్మం దగ్గర మధు వాళ్ళ బాస్ కనిపించాడు. “సార్, రండి” అంటూ మధు,అతని కుటుంబం మొత్తం ఎదురు వెళ్ళారు
వారిని చూసి ఒక చిన్న నవ్వు కూడా నవ్వలేదతను. ఆ పెద్దాయన మిత్రాగారి దగ్గరకి వెళ్ళాడు ఆ బాస్.
“వెళ్దాం పద నాన్నా” అన్నాడు.
మధుతో పాటు, అతని కుటుంబ సభ్యులందరూ, ఓ క్షణం పాటు, నిమ్మబద్ద నాకినట్టు మొహాలు చాలా ఇబ్బందిగా పెట్టారు.
“నేను చెప్పిన సర్‌ప్రైజ్ ఇదే మధూ, కానీ ఇలా ముగుస్తుందనుకోలేదు” అంటూ ఆయన్ని తీసుకుని కారు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు బాస్.