[dropcap]ఆ[/dropcap]యన గొప్ప రచయిత, మంచి మనిషి.
అవి నేను ముగ్గురు పిల్లలు ఉండగా ఏ.యు. లో పిహెచ్‌డి చేస్తున్న రోజులు. సాహిత్యం పట్ల వున్నా ఇష్టంతో కారా మాష్టారు మా ఇంటికి దగ్గిరలోనే ఉన్నట్టు తెలుసుకున్నాను. కానీ ఇంటికి వెళ్ళేటంత చొరవ తీసుకోలేదు. మా అమ్మాయిలకు ప్రయివేటు క్లాసులు తీసుకునేవారు. ఆయనకు తీరిక లేనప్పుడు వాళ్ళ అబ్బాయి హిందీ చెప్పేవారు. అలా కొద్దిరోజులు గడిచాయి. కానీ నేను వారిని చూడలేదు.
ఆ తర్వాత నేను రచనలో కథలు రాయడం మొదలుపెట్టేక హైదరాబాదుకి వచ్చేసాను. సాయిగారు ప్రతి ఏడు ఏదో ఒక సభ ఏర్పాటు చేయడం లేదా నేను వెళ్లడంతో చాలామంది రచయితలు పరిచయం అయ్యారు. అందులో అప్పుడు కారా గారు వున్నారు. సాయి గారు పరిచయం చేసినపుడు ”నీ ఉత్తరాలు చూసి అన్నపూర్ణ అంటే పెద్దయసు అనుభవం వున్న రచయిత్రి అనుకున్నాను. ఇప్పుడు చూసాక ఇంత చిన్న వారని అర్థమైంది. కానీ చాలా అనుభవం వున్నవారిలా రాస్తున్నారు…” అన్నారు. అదేదో నాకు అవార్డు ఇచ్చినంత ఆనందంగా అనిపించింది.
వారికి తరచుగా సాహిత్యం గురించి, రచయితల గురించి లేఖలు రాయడం జరిగేది. రచనకు చాలామంది అమెరికాలో వున్న రచయితలు కథలు రాసేవారు. యండమూరి, ఎం.బీ.ఎస్ ప్రసాద్ వంటి ప్రముఖులు కూడా రాస్తూ వుండేవారు. వారిమధ్య నా కథలు కూడా రావడం ఆనందంగా ఉండేది.
మాష్టారు రిటైర్ అయ్యాక శ్రీకాకుళం వెళ్లిపోయారు. కథానిలయం ప్రారంభించాక “నీ కథలు పంపు” అన్నారు. అప్పటినుంచి కథానిలయం చూడాలని కోరిక. విశాఖలో పెళ్ళికి వెళ్ళినపుడు బంధువులతో కలసి చూడాలని వెళ్ళాను. ఆయన చాలా అభిమానంగా మాటాడేరు. వాళ్ళింటో భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేశారు. కథానిలయం స్వయంగా చూపించినపుడు రచయితల ఫోటోలు కూడా చూసాం. అదంతా చూసాక నేను కూడా ఉడతా సహాయం చేయాలని కోరిక కలిగింది. మావారు కొంత డబ్బు డొనేట్ చేశారు. ఉదయం వెళ్లిన మేము సాయంకాలం వరకూ ఉండిపోయాము. తిరిగి వచ్చేటప్పుడు ”మా ఇంటి ఆడపడుచువి” అంటూ విలువైన జరీ చీర పసుపు కుంకుమలు ఇచ్చి పంపడం మరువలేని అనుభూతి.
నేను హైదరాబాదు తిరిగి వచ్చాక మా నాన్నగారిదీ దేవరకొండ బాల గంగాధర తిలక్ గారిది కనుపర్తి వరలక్ష్మి గారిది (ఆవిడ పెంపుడు కుమార్తె మేమున్న ఫ్లాటులో వున్నారు) ఫోటోలు పెద్ద సైజులో లామినేట్ చేయించి పంపించాను. ఆయన ఎంతగా సంతోషపడ్డారో చెప్పలేను. “ఇంత విలువైన ఫోటోలు పంపేవు బాగుంది కానీ నువ్వు కూడా రైటర్‌వే… నీ ఫోటో ఎందుకు పంపలేదు? నాకు నీ మీద కోపం వచ్చింది… ” అంటూ వుత్తరం రాసారు. ”అయ్యో… నేను పెద్ద రచయిత్రిని కాదు…. అందుకని పంపలేదు….” అని బదులు రాస్తూ వారింటికి వెళ్ళినపుడు వారితోబాటు తీసుకున్న ఫోటో పంపించాను.
ఫోను వచ్చినా ఉత్తరాలు రాయడం వారికీ మాకూ ఎప్పుడూ సంతోషంగా ఉండేది.
రచయిత్రి వోల్గా భర్త కుటుంబరావుగారు మాష్టారుగారి మీద వైజాగ్‌లో చక్కని డాక్యుమెంటరీ వీడియో తీశారు. ఆ వీడియో ఆవిష్కరణకి వెళ్లి చూసాను. చాల బాగుంది. కొన్ని వీడియోలు కొని నాకు దగ్గిర వారికి పంచిపెట్టాను. ఆ వేడుకకు రామారావుగారు రాలేదు ఎందుకోమరి….. కారణం తెలియదు.
వారి కుమారుడు అప్పటి ఉమ్మడి తెలుగు అకాడమీలో మావారికి కొలీగ్. ”మా దగ్గిర లేదండి మాకు ఇవ్వలేదు” అంటే వారికీ వీడియో ఇచ్చాను. ఇప్పటికి నా దగ్గిర వుంది.
కాళీపట్నం రామారావుగారు చాల సౌమ్యులు. మంచి మనసున్న మనిషి.. ప్రచారం కాని గర్వం కాని మచ్చుకైనాలేని మచ్చలేని మనిషి. ఎవ్వరితో ఐనా ఒకేలా వుండే గొప్పమనిషి. ఏమీ ఆశించని అసామాన్యమయిన మనిషి. అలాటివారు ఆయన తప్ప మరొకరు నాకు తెలియదు.
కథానిలయం ఆయనకు ఆరో ప్రాణం. చరిత్రలో ఏ రచయితా ఎవరూ సాధించని కీర్తి పతాక! ఇలా చెప్పాలంటే ఎన్నో…! సిరి వున్నచోట సరస్వతి ఎందుకు ఉండదో… అర్ధంకాదు. కానీ సంకల్ప బలంతో సాహిత్యాన్ని తన కథానిలయంలో కొలువు తీర్చిన కాళీపట్నం వారికి సరస్వతి స్వాధీన అయిపోయింది.
కారా మాష్టారు మాకూ తెలుసును… అంటే అంతులేని ఆనందం. వారి పరిచయం వున్నవారికి అదో తృప్తి!
వారు లేరు… అని అంటే మాకు కోపం వస్తుంది. ‘కథా నిలయంలో సికాకులపు కాళీ పట్నం ఎప్పటికి కొలువై వున్నారు’.