రంగుల హేల 47: ఆర్ట్ ఆఫ్ టేకింగ్

22
5

[box type=’note’ fontsize=’16’] “అప్పుడప్పుడు ఇవ్వడంలోనే కాదు తీసుకోవడం ద్వారా కూడా ఎదుటి వారికి ఆనందాన్ని ఇవ్వాలి, ఇస్తుండాలి” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]ఆ[/dropcap]ర్ట్ ఆఫ్ గివింగ్ ఉండాలని అందరూ అంటారు అంటే (ప్రదానకళ), ఇతరులకు ఇచ్చే గుణం ఉండాలని అర్థం. అలాగే ఒక్కోసారి ఇతరులు మనకు ప్రేమగా ఇస్తున్నప్పుడు తీసుకోవడం కూడా మంచి పనే. ఇదే ఆర్ట్ ఆఫ్ టేకింగ్ (స్వీకారకళ). ఎలాగంటారా? మీ బంధువులు ఎవరో మిమ్మల్ని భోజనానికి పిలిచి, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పాలని అనుకుంటారు. ఒక హెల్ప్ చేసినందుకు ప్రతిగా అలా వెళ్లడం బాగుండదని మీరు మొహమాటపడి “వద్దండీ! మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి” అని తప్పించుకుని వారిని శాశ్వతంగా ఋణగ్రస్త ఫీలింగ్ లో ఉండేట్లు చేయడం కూడా అంత మంచిది కాదేమో! కాస్త ఆలోచించండి. వాళ్ళకి కాస్త సంతృప్తి కలగాలంటే, ఆర్ట్ ఆఫ్ టేకింగ్ వాడి వారిని ఆనంద పరచడం కూడా మన ధర్మం కాదంటారా? ఎలాగో వివరంగా మాట్లాడుకుందాం.

అసలు డబ్బు అనే మాధ్యమం రానప్పుడు మానవులంతా ఒకరికి ఉన్నది మరొకరికి ఇచ్చి, వారికి లేనిది అడిగి పుచ్చుకోవటం చేస్తూ ఉండేవారు. అలా వస్తు వినిమయం జరిగేది. దాన్ని బార్టర్ సిస్టం అనేవారనుకుంటాను. అలా ఇచ్చి పుచ్చుకోవడం అనేది అనేక విషయాల్లో జరిగేది. తమ పొలంలో పండిన ధాన్యం, కూరల దగ్గరి నుంచి, తాము సాకుతున్న పశు సంపద ద్వారా వచ్చే పాలూ, పెరుగూ వరకూ సాగివుంటుంది. అదే క్రమంగా వర్తకంగా, వాణిజ్యంగా మారి ఉండొచ్చు. తమకున్నది ఇచ్చి తమకు లేనిదేదో తీసుకోవడం మానవ జీవనానికి ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. పరస్పర సహకారం అంటే అదే కదా. ఇప్పటికీ “మాకు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నాయండి” అనే మాటని గౌరవంగా చెప్పుకుంటుంటారు. అంటే అవి పుస్తకాల నుండి పెళ్ళిసంబంధాల వరకూ కావచ్చు. అంటే వాళ్ళ ఇంటి అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ వీరూ, వీరింటి నుండి అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీవారూ పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా చుట్టరికాల్ని కలుపుకోవడం అన్నమాట.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ప్రభావితం చేసేవీ, ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టేలాంటి పెద్ద పెద్ద క్విడ్ ప్రోకోలను పక్కన పెడితే మన జీవితాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పని సరి. ఒక పెళ్ళికి వెళ్లాలంటే గిఫ్ట్ తీసుకుని వెళతాం. మన ఇంట్లో ఫంక్షన్ సందర్భంగా ఇంతకుముందు వాళ్ల దగ్గర ఏమైనా గిఫ్ట్ తీసుకున్నామా? అని కూడా ఒకసారి చూసుకుంటాం. ఇక ఈ రోజుల్లో పెళ్లి, రిసెప్షన్, పుట్టిన రోజులూ, పెళ్లిరోజులూ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్‌లో పెడుతున్నారు. అక్కడ ప్లేట్ కింత అని భారీగా బిల్ వేస్తారు హోటల్ వాళ్ళు. అంచేత ఖరీదైన బహుమతి తీసుకుని వెళ్లాల్సిందే. అలా కాకపోయినా మనకి ఆపత్సమయంలో సహాయం చేసిన వారికి కూడా ప్రేమతో, అభిమానంతో విలువైన కానుకలు తీసుకుని వెళతాం. ఇక బంధువులు చాలా దగ్గర వాళ్లయితే ఎక్కువ ఖరీదైన కానుక ఇవ్వాలి. కాస్త దూరం ఐతే మనిష్టం, వీలుని బట్టి. ఇకపోతే, ఈ ఫంక్షన్‌లలో భోజనాలు వడ్డించే కాలం పోయింది. పైగా ఆ ఏర్పాట్లు మన ఊరి తీర్థంలో ఉన్నట్టు బోలెడంత విస్తీర్ణంలో విస్తరించి ఉంటున్నాయి. ‘రండి రండి తినండి’ అంటూ ఎవరూ మనల్ని అడగడం లేదు.అది మన డ్యూటీ అన్నట్టు మన తిండి విషయం మనమే చూసుకోవాలి. మనం అక్కడికొచ్చిన బంధువుల్నీ, స్నేహితుల్నీ కలిసి ముచ్చట్లేసే ఆతృతలో ఒళ్ళు మరిచిపోతాం. కాస్త తెలివి తెచ్చుకుని ఏం తినాలి? ఎక్కడేమున్నాయి? అన్న విషయసేకరణ కళ్ళతోనే చెయ్యకపోతే, ఎక్కడున్నామో అక్కడున్నవే తింటే అర్ధాకలితో ఇంటికి వెళ్ళాలి. అంచేత ఇక్కడే మన ఆర్ట్ అఫ్ టేకింగ్ ప్రతిభని వినియోగించి, ప్రతి ఒక్కటీ చూసుకుంటూ నచ్చింది తినాలి.

విందుభోజనాల తర్వాత రిటర్న్ గిఫ్ట్‍౬ల ఆచారం ఒకటి మొదలయ్యిందిప్పుడు. అది కూడా తెలుసుకుని తీసుకోకుండా ఇంటికి వెళ్లిపోతే మనం వెర్రివెంగళప్పలమని మన బంధుమిత్రులే మనకి తర్వాత ఓ సర్టిఫికెట్ ఇస్తారు. కాబట్టి ఎక్కడా మనం బద్ధకంగా రిలాక్స్ అవ్వడానికి ఉండదండోయ్! గుర్తుపెట్టుకోండి. బీ అలెర్ట్ ఆల్వేజ్.

కొందరి పెళ్లిళ్లలో వచ్చిన ఆడవాళ్లందరికీ చీరలు ప్యాకెట్ లలో పెట్టి భోంచేసి వెళ్లిపోతున్నప్పుడు అక్కడే నిలబడి ఆప్యాయంగా చేతికిస్తూ ఉంటారు. అది తీసుకోవడానికి మనకి మొహమాటంగా ఉంటుంది. అయినా తప్పదు. ఆ ప్యాకెట్లపై మన పేరు కూడా ఉండడంవల్ల మనకి నిజంగా కాస్త సంతోషంగా ఉంటుంది. మన కోసమని కొన్నారు, ఏదో గంపగుత్తగా కొనలేదులే అని. ఆడవాళ్ళ అల్పసంతోషం మనకి తెలిసిందే కదా! ఐదువేలు ఖర్చు చేసి పెళ్ళికెళ్ళి, వాళ్ళు పెట్టిన అయిదువందల రూపాయల చీర అందరికీ చూపించి ముచ్చటపడిపోతూ ఉంటారు, చిన్నపిల్లలు చాకోలెట్ చూసి మురిసినట్టు. అలా చిన్న చిన్న ఆనందాలు వాళ్ళు నిలబెట్టుకుంటారు కనకనే, మొహం గంభీరంగా పెట్టుకునే మగాళ్లలా కాకుండా స్త్రీలెప్పుడూ నిండా పూచిన పూలమొక్కల్లా కళ కళ్లాడుతూ, ఉత్సాహంగా ఉంటూ ఉంటారు.

ఒకోసారి మన దగ్గర పని చేస్తున్న చిన్నవాళ్ళు మనల్ని ప్రేమతో వాళ్ళింటికి పిలుస్తారు అప్పుడు మనం వెళ్లడమే వాళ్ళకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. కనుక చక్కని బహుమతి తీసుకుని తప్పకుండా వెళ్ళాలి. వాళ్లు మనకు ఎంతో మర్యాద చేసి వాళ్ళింట్లో వాళ్లందరికీ పరిచయం చేస్తూ మనం వచ్చినందుకు సంతోషపడుతూ, దగ్గర నిలబడి భోజనం పెడతారు. అప్పుడు తప్పకుండా తినాలి.‘విష్ చేసి వెళదామని వచ్చాము, టైం లేదు’అంటూ బడాయిలు పోకూడదు.

నా దగ్గర పని చేసే అసిస్టెంట్ హర్ష అనే అబ్బాయి మా ఇంట్లో ఒక ఫంక్షన్ కి పిలిచినప్పుడు ఖరీదైన బహుమతి తీసుకొచ్చాడు. అప్పుడు నేను “పిలిస్తే ప్రేమగా వచ్చావు చాలు. గిఫ్ట్ ఎందుకు తెచ్చావు?” అంటూ ఆ అబ్బాయి పై కోప్పడ్డాను. ఆ తర్వాత ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా, “అంత ఖర్చు పెట్టి గిఫ్ట్ ఎందుకు కొన్నావు?” అని నేను మళ్ళీ మళ్ళీ అంటుంటే ఒకసారి అతను చిన్నబుచ్చుకున్నాడు. “నేను ఆ మాత్రం కానుక ఇవ్వగలను మేడం. మీరు నాకు చాలా సాయం చేశారు. నాకు ఇవ్వాలనిపించి ఇచ్చాను. మీరు అలా ఇంకోసారి అనకండి మేడం. నాకు బాధగా ఉంటుంది” అంటూ ఆ అబ్బాయి నిష్ఠూరపడినప్పుడు నా మనసు చివుక్కుమంది. నిజమే కదా! అభిమానంతో వాళ్ళిచ్చిన దాన్ని తీసుకోవడం వారికి తృప్తినీ, ఆనందాన్నీ ఇస్తుందని గ్రహించానప్పుడు.

అప్పట్లో, నేను ఆఫీస్‍కి స్కూటీ మీద వెళ్లేదాన్ని. వెహికల్స్ పార్కింగ్ దగ్గరికి మా పై ఫ్లోర్‌లో ఉండే ఎపిట్కోలో పనిచేసే రూప రోజూ నాతో పాటే వచ్చేవారు. అలా మిత్రులం అయ్యాం. ఒక రోజు నేను లిఫ్ట్ నుంచి బైటికి వెళ్తుంటే “ఈరోజు బండి తేలేదా?” అన్నారామె. అవునన్నట్టు తలూపాను. “మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తా, వెయిట్ చేయండి” అని పార్కింగ్ వైపు వెళ్లారు. పది నిమిషాలయినా ఆమె రాలేదు. అసలు నేను చీర కట్టుకుని ఒక సైడ్ కూర్చుంటే ఆవిడ బ్యాలెన్స్ చేయగలరా? వద్దు అని నేను అనవలసిందేమో! ఆమెకు డబల్ రైడింగ్ కొంచెం ఇబ్బంది అవదా! ఆటోలో వెళ్లిపోదామా? ఆటోవాళ్ళు ఆపి అడుగుతున్నారు. వెళ్ళిపోతే ఆమె ఏమనుకుంటారో! అనుకుంటూ నిలబడ్డాను. “సారీ, ఒక ఫోన్ రావడంతో లేటయ్యింది. థాంక్స్ ఫర్ వెయిటింగ్” అంటూ రూప నన్నుఎక్కించుకుని, మా ఇంటి ముందు దింపారు. నేను థాంక్స్ చెప్పాను. నేను ఆమె కోసం వెయిట్ చెయ్యకుండా ఆటోలో వెళ్ళిపోతే ఎంత తప్పుగా ఉండేదో కదా!

మా ఆఫీసు బిల్డింగ్ కింద బ్యాంకులో పనిచేసే రమ, మా పక్క బిల్డింగ్ ఫ్లాట్స్‌లో ఉండడంతో నాకు ఫ్రెండ్ అయ్యారు. ఒకరోజు బ్యాంకుకు వెళ్ళినప్పుడు “ లక్ష్మీ! నాకు మద్రాస్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎల్లుండి వెళ్ళిపోతున్నాము” అని చెప్పారు. మర్నాడు ఆదివారం. నేను ఒక స్వీట్ బాక్స్ కొని ఆమెకు వీడ్కోలు చెబుతామని ఆమె ఫ్లాట్‍కి వెళ్లి ఇచ్చాను. రమ పిల్లలూ, భర్తా ప్యాకింగ్‍తో బిజీగా ఉన్నారు. ఆవిడ ఎంతో సంతోషపడి కొంచెం సేపు కబుర్లు చెప్పి, నాకు బొట్టు పెట్టి ఒక చీర పెట్టారు. నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాను. “నేను ఊరికే ఫ్రెండ్లీగా వచ్చాను. చీర ఇవ్వడం ఏమిటి? వద్దు ప్లీజ్” అన్నాను. “మిమ్మల్ని తప్పకుండా గుర్తుంచుకుంటాను. మీరు ఇంటికి వచ్చి నాకు సెండ్ ఆఫ్ చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ చీర నాకోసం నేను కొనుక్కున్నది, మీకు ఇవ్వాలి అనిపించి ప్రేమగా యిస్తున్నానంతే” అంటూ రమ బలవంతంగా చేతిలో పెట్టారు. చివరికి నేను సిగ్గు పడుతూనే చీర తెచ్చుకోవాల్సి వచ్చింది. వారం రోజులైనా ఆ బాధ తగ్గలేదు. బీరువా తీసినప్పుడల్లా హాంగర్ మీద ఆ చీర కనబడి ఏదో ఇబ్బందిగా ఉంటోంది.

ఒకరోజు ఈ విషయం నేను ఫోన్‍లో మా అత్తయ్య గారికి చెప్పాను. ‘ఆవిడ దగ్గరనుండి చీర తీసుకున్నాను. నేను తిరిగి ఆమెకి ఎప్పుడు పెట్టాలి ? ఆవిడ నాకు కనబడరు కదా!’ అన్న నా బాధను వెళ్ళగక్కాను. దానికి ఆవిడ పెద్దగా నవ్వేసి “ఆ రమ అనే అమ్మాయి ఎంతో ఆప్యాయంగా తన గుర్తుగా నీకు ఇచ్చింది. నువ్వు దాన్ని సంతోషంగా కట్టుకో. ఆ రమని గుర్తు చేసుకో. ఆమె నీకు తిరిగి దొరక్కపోవచ్చు. నువ్వు అంతే ప్రేమతో, అంతే అభిమానంతో మరొకరికి మంచి చీర కొని పెట్టుకో. అప్పుడది మంచి ఆచారం కూడా అవుతుంది. అంత మాత్రం దానికి నువ్వేదో ఋణపడిపోయావనీ, ఆ ఋణం తీర్చుకోలేననీ అంత బాధ పడిపోవలసిన అవసరమే లేదు. అసలు ఈ లోకంలో మనుషులు అంతా ఒకరికొకరు రుణపడి ఉన్నారు కనుకనే బంధువులుగానో, మిత్రులు గానో తారసపడుతుంటారు. ఎక్కువ ఆలోచించకు.” అన్నాక నాకు కలిగిన దుఃఖం ఒక్కసారిగా ఉపశమించింది. ఆ తర్వాత నేనా చీర ఆనందంగా కట్టుకున్నాను. ఒక చీర కొని దాచిపెట్టాను కూడా, ఎవరో ఒకరికి పెట్టడానికి. ఆ విధంగా ఆ చీర తీసుకోవడం ఆనందకారకమయ్యింది చూశారా!

కొంతమంది మరీ ముఖ్యంగా పక్క వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టినా తలుపు కొట్టి మరీ ఇచ్చేసి అమ్మయ్య అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతుంటారు. ఇది కూడా ఒక విధంగా అమాయకత్వమే. అంత చాదస్తం కూడా అవసరం లేదు. మనిషికి డబ్బే ముఖ్యం కాదు. అలా వెంటబడి, వెంటబడి అయిదు, పది రూపాయలు ఇవ్వడం పక్కవారికి చాలా విసుగ్గా ఉంటుంది. అంటే వీళ్ళు డబ్బుకు మరీ ఇంత విలువ ఇస్తారన్నమాట అనే సిగ్నల్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. మనం కూడా ఇలా ఇవ్వాలని సూచన ఏమో అని అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి చిన్న విషయాల్ని అంత సీరియస్‌గా తీసుకోనక్కర్లేదు. అప్పుడప్పుడు ఇవ్వడంలోనే కాదు తీసుకోవడం ద్వారా కూడా ఎదుటి వారికి ఆనందాన్ని ఇవ్వాలి, ఇస్తుండాలి. అలాగే మనం కూడా మరొకరికి ఇవ్వాలి, ఇస్తుండాలి. ఇస్తూనే ఉండాలి. అప్పుడే అనుబంధాలు, ఆత్మీయతలు మరింతగా అల్లుకుంటాయి. అంచేత అతిగా లెక్కలు వేసుకోకుండా ఒకోసారి ఇచ్చీ ఆనందిద్దాం. మరోసారి తీసుకునీ ఆనందం కలగజేద్దాం. ఏమంటారు? ఒకోసారి బైటికెళ్లే టైం లేక రసం కోసం పక్క పోర్షన్ వారినడిగి తీసుకున్న ఓ చిన్న టమాటా కూడా తిరిగిచ్చేసి గర్వంగా మురిసిపోయే పనులు మనం చెయ్యొద్దు. అసలు ఇవ్వడానికే కాదు తీసుకోవడానికి కూడా పెద్దమనసుండాలి తెలుసా!

ఒకోసారి ఊరునుంచి వస్తూ మనం తెచ్చుకున్న ఏ కాకినాడ కాజాలో, పూతరేకులో ఓ నాలుగు బాక్స్ లో వేసి “మా ఊరివి బావుంటాయి చూడండి” అంటూ పక్కింటివాళ్ళకి అభిమానంగా ఇస్తుంటాం. వాళ్ళవి తీసుకుంటూనే, పరిగెత్తుకుంటూ స్వగృహా స్వీట్ షాప్ కెళ్ళి ఆ బాక్స్ నింపేసి తలుపు కొట్టి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా మనకి చిరాకును కలిగిస్తుంది. మరెప్పుడైనా ఇవ్వాలనుంటే ఇవ్వొచ్చు. మరీ ఇలా బాకీ తీర్చే ధోరణి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంకోసారి వాళ్లకు ఇవ్వాలంటే భయం కలుగుతుంది. బహుశా అలా ఇవ్వొద్దని ఇది వార్నింగేమో అన్న అనుమానం కూడా వస్తుంది.

మా పిన్ని గారు తాను పాతికేళ్లుగా ఉంటున్నఒక ప్రసిద్ధ ఆశ్రమానికి రమ్మని పదే పదే పిలిచినప్పుడు ఒకసారి వెళ్ళాను. స్వామి గారి సందేశం అద్భుతంగా ఉంది. అది వెయ్యిమంది పట్టే మీటింగ్ హాల్. ఎంతో క్రమశిక్షణతో నడిచే ఆశ్రమం అది. భక్తులంతా ఒక వరస క్రమంలో కూర్చుని ఉన్నారు. స్వామి ‘మానవసేవే మాధవ సేవ’ అన్న ప్రసంగం పూర్తిచేసి నిశ్శబ్దంగా తన ఆసనంలో కూర్చున్నారు. హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్‌లో ఉంది. అందరికీ ప్రసాదం పంపిణీ మొదలయ్యింది. కవర్‌తో ప్యాక్ చేసిన స్వీట్స్ బేసిన్స్ పట్టుకుని ఇరవైమంది యువతీ యువకులు బయలు దేరారు. చకచకా పంచుతున్నారు. ఎక్కడా కలకలం లేదు. ప్రతివారూ ప్రసాదం పంచేవారికి వీలుగా చేతులు ఎత్తారు.

నేను చెయ్యి ఎత్తలేదు. ‘మన దగ్గరికి వచ్చి ప్రతివారికీ ప్రసాదం అందజెయ్యడం వాళ్ళ బాధ్యత. స్వీట్ తీసి ఇవ్వబోయే ముందు చెయ్యిచాపుదాం’ అనుకుంటూ కూర్చున్నాను. నాకు అటూ ఇటూ స్వీట్ బేసిన్లు వచ్చాయి, వెళ్లాయి. నాకు ప్రసాదం అందలేదు. నెమ్మదిగా అందరూ ప్రసాదం లడ్డూ ప్యాకెట్‌లు చింపారు. నా చేతిలో ప్రసాదం లేకపోవడం చూసి నా పక్కనున్నవాళ్ళు ఓ నలుగురు లడ్డూ ముక్కలు తుంపి,నా చెయ్యి వాళ్లే అందుకుని చేతిలో పెట్టారు. మా పిన్ని “ఏంటే? నీ ఒక్కదానికే ప్రసాదం రాలేదేంటి?” అంటూ ఆశ్చర్యంతో బాధపడింది. అప్పుడు నాకు అర్థం అయ్యింది, నాకు ఆర్ట్ అఫ్ టేకింగ్ లేదని. అందుకే అందలేదని. అడగందే అమ్మైనా పెట్టదంటే ఇదే నన్నమాట. అదీ సంగతి.

అలాగే మన సహాయకులనుంచి పని అడిగి చేయించుకోవడం కూడా ఒక ఆర్ట్ అఫ్ టేకింగ్ టెక్నిక్కే. అసలింట్లో ఏమేం పనులు ఈ రోజు చెయ్యాలో వాళ్ళు రాకముందే మనం హోమ్ వర్క్ చేసి పెట్టుకోకపోతే పుల్లయ్య వ్యవహారంలా వాళ్ళు రానూ వస్తారు వెళ్లనూ వెళ్తారు. ఎక్కడి పనులక్కడే ఉంటాయి. మనమేదో పుస్తకం చదువుకుంటూనో లేక ఏదో డ్రాఫ్ట్ రాసుకునే గోలలో ఉండిపోతే అంతే సంగతులు. సాయంత్రం ఇంట్లో వాళ్ళ చేత మొట్టికాయలు పడతాయి.

ఇంకా, ఒకోసారి మొహమాటంతో పనులు చేయించుకోలేకపోతాము.నిన్ననే పండగ అవుతుంది. మామూలు అడగ్గానే వాచ్‌మన్‍౬కి ఓ అయిదువందలిస్తాము, రెండువందలిస్తే ఏమనుకుంటాడో అని.తెల్లారే అర్జెంటుగా మందుల షాప్ కెళ్ళి ఒక టాబ్లెట్ తెమ్మంటే ఏమనుకుంటాడో? నిన్నే డబ్బులిచ్చిందీవిడ లేవంగానే పనులు చెబుతోంది అనుకుంటాడేమో! ఏ మధ్యాన్నమో తెమ్మంటే బావుంటుంది కానీ పొద్దుపొద్దున్నే అడిగితే బావుండదేమో అనేస్కుని మనమే తలనొప్పితో వెళ్ళబోతాము. వాచ్‌మన్ తనంత తానుగా “ఎక్కడికమ్మా, నేను వెళ్ళనా?” అని అడిగితే అప్పడు అమ్మయ్య అనుకుంటాము. ఇది కూడా తప్పే! ‘చెప్పి చేయించుకోవడం కూడా రాదే నీకు’ అని అక్కలు మనల్ని తిడతారిందుకే.

ఎప్పుడైనా మన బంధువులెవరో మనల్ని టీ కి పిలుస్తారు. వాళ్ళెంతో గౌరవంతో రెండు మూడు రకాల స్నాక్స్ చేసి ప్లేట్లలో సర్ది పెడుతుంటారు. “వద్దండీ మేం తినమండీ! మాకు పడదండీ” అంటూ మంతెనగారి లెవెల్లో, నానా గోల చేసి అల్లరి చేసే బదులు కాస్త ప్రేమగా వాటిని తలా ఒకటీ రుచి చూస్తే మన సొమ్మేం పోతుంది? కష్టపడి చేసినందుకు వాళ్ళెంతో తృప్తి పడతారు కదా!

ఏ పదేళ్లకో ఓసారి మనం సంక్రాంతికి మన ఊరికెళ్ళినపుడు అక్కడ మన సొంత బామ్మగారి చెల్లెలెవరో సెంచరీ కొట్టడానికి దగ్గరగా ఉన్న ఒక పెద్దావిడ ఉంటుంది. కొన్ని పళ్ళు తీసుకుని వెళ్లి, చేతిలోపెట్టి ఆవిడ మంచంమీద కూర్చుంటాం. ఆమెకి మనం చెప్పేది వినపడదు. మనం ఫలానా అని పెద్ద గొంతుతో గుర్తుచెయ్యగానే ఆమె పొంగిపోయి, మన చేతులు పట్టుకుని చెంపలు తడిమి “పిల్లల పెళ్లిళ్లు చేసేసావా?” అని ప్రేమగా అడిగి బోలెడు కబుర్లూ, పెద్ద వయసు కష్టాలూ చెప్పి నవ్విస్తారు. ఆనక కోడలిని పిలిచి తన చెక్క పెట్టె తెమ్మని అందులోంచి ఓ రెండువందలు జాగ్రత్తగా ఎంచి తీసి మనచేతిలో పెట్టి “చీర కొనుక్కో నాన్నా!” అన్నప్పుడు పైకి వెళ్ళిపోయిన మన బంధువర్గమంతా ఆమెలో ప్రతిఫలించి దీవించినట్టుగా గుండె చెరువవుతుంది.ఆ రెండువందలూ వద్దనకుండా ఆనందంగా కళ్ళనీళ్ళతో అపురూపంగా అందుకుని ఆవిడ కాళ్ళకి మొక్కండి. అప్పుడా బామ్మ గారెంత ఆనందంతో తబ్బిబ్బవుతారో చూడండి.

రెండు సంవత్సరాలనుండి మానవాళిని పీడిస్తున్న కరోనా భూతాన్ని“ఇంక వెళ్ళవమ్మా!” అని మనమంతా మూకుమ్మడిగా దణ్ణం పెట్టి బ్రతిమాలుతున్నా ఆ మహాతల్లికి మనల్ని వదిలిపోవడం ఇష్టంలేదు. అందరింటి తలుపులూ కొట్టి, “ఒక్క బొట్టు పెట్టి వెళతా” అంటూ ఆడామగా,చిన్న పెద్దా తేడా లేకుండా అందరికీ ఒళ్ళు నెప్పులో, జలుబో, దగ్గో, తలనెప్పోలాంటి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి మనల్ని వదల్లేక వదల్లేక వెళుతున్న కరోనమ్మ పూర్తిగా మనల్ని వదిలి వెళ్లిపోయేవరకూ, ఈ అవీ ఇవీ చేతికి ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమాలు అప్పుడే మొదలు పెట్టకండి. ఆ శుభ సమయం త్వరలో వచ్చేస్తోంది. అప్పుడిక మనం ఆనందంగా ‘అలాయ్ బలాయ్’లు ఎప్పట్లాగే ఇచ్చి పుచ్చుకోవచ్చు, కొత్త తెలుగు ఉగాది ‘శుభకృతు’లో! అందాకా జర టేక్ కేర్ మిత్రులారా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here