వావిళ్ళ ముద్రణాలయం – త్రిలిఙ్గ రజతోత్సవ సమ్మాన సంచిక – ఉపోద్ఘాతం

0
3

[box type=’note’ fontsize=’16’] వావిళ్ళ ప్రెస్ స్థాపించి 90 ఏళ్ళు గడిచిన సందర్భంగాను, వావిళ్ళ వారు త్రిలిఙ్గ అను మాసపత్రికను ప్రారంభించి పాతికేళ్ళు అయిన సందర్భంగా – ఆగస్టు 1941లో త్రిలిఙ్గ రజతోత్సవ సమ్మాన సభ జరిపారు. అప్పటి స్మారక సంచిక లోని ఉపోద్ఘాతాన్ని సంచిక పాఠకులకు ప్రత్యేక వ్యాసంగా అందిస్తున్నాము. [/box]

I

[dropcap]19[/dropcap]వ శతాబ్దారంభమునుండి దేశభాషలలోని వాఙ్మయమును అభివృద్ధి చేయు ప్రయత్నము గవర్నమెంటును ఐరోపియను పండితులును భారతీయ పండితుల సహాయముతో తీవ్రముగ సాగింపమొదలిడిరి. 1812వ సంవత్సరమున ఫోర్టుసెంటుజార్జి కాలేజీబోర్డు స్థాపితము చేసి గవర్నమెంటు అధికారులు ద్రావిడ భాషలలోను ఇతర భాషలలోను గ్రంథ ప్రచురణము చేయుట గట్టిగనడిపిరి. కాలేజీప్రెస్ అను ముద్రాలయములో అనేక గ్రంథములు ముద్రితమయ్యెను. మద్రాసు లిటరరీ సొసైటీ ప్రదర్శనాగారమున నెలకొల్పబడియుండిన ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారము కాలేజీపరము చేయబడెను. ఆ బోర్డులో వివిధ భాషాకోవిదులగు ఏ.డి. కాంబెలు, ఎఫ్.డబ్లు. ఎల్లిసు వంటి చక్కని పండితులు సభ్యులుగా నుండిరి. కాలేజీ ప్రధాన అరవ పండితులు చిదంబరపండారము; అచ్చటి ఉపాధ్యాయులు మామిడి వెంకయ్య, కాలేజీలో ఇంగ్లీషు ముఖ్యోపాధ్యాయులుగ నుండిన ఉదయగిరి వేంకటనారాయణయ్య, సంస్కృతము తెనుగుపండితులుగా నుండిన పట్టాభిరామశాస్త్రులు, గురుమూర్తిశాస్త్రులును నిఘంటువులు అనేక ధర్మశాస్త్రములు మున్నుగాగల గ్రంథ సామాగ్రిని ప్రకటించిరి. ఇట్టి గ్రంథకర్తలకు గవర్నమెంటువారు ఉదారముగ సహాయము జేయుటచేతను ఇట్టి గ్రంథముల యెడల అభిమానమును చూపు చదువరులు అభివృద్ధి అగుట చేతను దేశీయ గ్రంథ ప్రపంచ ప్రకటనకు ముఖ్యముగ భారత రామాయణాదుల ప్రకటనకును ఇతర ప్రౌఢ గ్రంథ ప్రకటనకును రాజమార్గమేర్పడెను.

భారతీయ వాఙ్మయ పునరుజ్జీవయుగము ఈ విధముగ ఏర్పడుచున్న తరుణమున తెనుగు సంస్కృతములలో అనేక గ్రంథ రాజముల ప్రకటనకర్తగాను సంపాదకులుగాను శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులుగారు బయలుదేరి దేశీయ విజ్ఞానమును వెదజల్లుటకు ఆధార భూతులైరి. వీరు నెల్లూరుజిల్లా అల్లూరునకు సమీపమందుండు వావిళ్ళ అను గ్రామమున 1812-వ సంవత్సరమున జన్మమందిరి. తరతరాలుగ శాస్త్రాభ్యాసము చేయుచుండిన కొన్ని పుదూరు ద్రావిడ కుటుంబములు ఆ గ్రామమున నివాస మేర్పరచుకొనియుండెను. వీరి తండ్రికి ఐదుగురు బిడ్డలు. నలువురు మగబిడ్డలు, ఒక ఆడుబిడ్డ. శ్రీ శాస్త్రులుగారు ఈ బిడ్డలలో కడపటి వారు. వీరి తల్లి వీరి శైశవముననే గతించెను. వీరి తండ్రి తరువాత కొద్ది కాలములోనే తమ స్వగ్రామము వదలి దండిగుంట అను మరియొక గ్రామము చేరవలసి వచ్చెను. బలవంతుడైన అచటి భూస్వామి తాకుడుకు తట్టుకొనలేక ఇతర కుటుంబములు మరికొన్నిటితో కూడ వీరిట్లు వెళ్ళిపోయిరి. శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులుగారి బాల్యాదు లెట్లు గడచినవను వివరములు మనకు తెలియవు. వీరి అన్నదమ్ములలో అందరికంటె పెద్దవారు శ్రీ వేంకట రమణ శాస్త్రి నెల్లూరు వెళ్ళి చదువుకొని కొంత ఇంగ్లీషు నేర్చి బళ్ళారి కలెక్టరు కచ్చేరిలో గుమస్తాగ కుదిరి శిరస్తదారయ్యెను. తుదివరకచటనే నివసించిరి. తరువాతి వారు సుబ్బరాయ శాస్త్రి. గ్రామాదులలో బ్రాహ్మణులకు నాడు లభ్యమగు సాధారణ విద్యనే చదువుకొని తండ్రితో దండిగుంటలో నుండి కుటుంబ భరణమొనర్చెను. శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రిగారును అతని దగ్గరి అన్న శ్రీ అనంత నారాయణ శాస్త్రులును నెల్లూరు చేరిరి. ఆనాడు పేరు గాంచిన విద్యా శేఖరులైన శ్రీ గట్టుపల్లి శాస్త్రులు, శ్రీకృష్ణ ఉపాధ్యాయులు అను వారి వద్ద వీరు వేదాధ్యయనము గావించిరి. దాని వెనుక గోదావరి డెల్టాలోని ద్రాక్షారామమునకు వెళ్ళి సుప్రసిద్ధ వైయాకరణి శ్రీ పాపయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణము నేర్చిరి. పిదప ఇరువురును మద్రాసునకు వచ్చి తండయార్పేటలో ప్రసిద్దమగు తంజావూరు రామానాయుడుగారి సంస్కృత పాఠశాలలో శ్రీ సరస్వతి తిరువేంకటాచార్యులతో సహాపాఠులుగ మరి కొంతకాలము వ్యాకరణ సాహిత్యముల సాధించిరి. తరువాత మైసూరునకు పోయి కొంత విద్యాభ్యాసమొనర్చిరి. లలితకళలలోను, సంస్కృతములోను అభిరుచి గల శ్రీ మహారాజా శ్రీ ముమ్మడి కృష్ణ రాజవొడయరుగారు ఏర్పరచియుండిన విద్యావాతావరణమున వీరు కొందరు మిత్రుల ప్రోత్సాహమున ఒక ముద్రణాలయమారభించి కన్నడమున గ్రంథ ప్రచురణము చేసిరి. కాని, అది ప్రయోజనకారి కాలేదు. అందుచేత వీరు మద్రాసు చేరుకొని ముందు కథ నడుపదలంచిరి. వీరి క్రొత్త ప్రకటన ప్రయత్నములలో వీరికి నాటి సుప్రసిద్ధ నాయకులు సర్ : టి. మాధవరావు, గౌ॥ పళ్ళె చెంచలరావు, శ్రీ అంబాశంకరదవేజీ, శ్రీ వల్లూరు జమిందారు మున్నగు వారులు చాల తోడ్పడిరి. శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారును వారి సోదరుల మామ శ్రీ వేదము వేంకటాచలశాస్త్రి గారును చేరి వివేకాదర్శన ముద్రణాలయము నెలగొల్పిరి. ఈ వీరి ప్రయత్నము చక్కగ సాగనందున శ్రీ శాస్త్రులుగారు తమ స్వంతముగ కొందరి మిత్రుల వద్ద డబ్బు తెచ్చి హిందూ భాషా సంజీవని ముద్రణాలయమును స్థాపించి రెండేండ్లు నడిపిరి. ఈలోగా మైసూరులోని యొక సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగ నుండవలసినదని వీరి సహోద్యోగులు అన్నయునైన శ్రీ అనంత నారాయణ శాస్త్రిగారిని కోరినందున వారు మద్రాసును విడిచి వెళ్ళిపోయిరి. అంతట శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారు తామొంటరిగనే తంటాలు పడవలసిన వారైరి. అదృష్టవశాత్తు వారికి శ్రీ సరస్వతి తిరువేంకటాచార్లు గారు సహోద్యోగులైరి. వారితో భాగస్వాములుగ వీరు క్రొత్త ముద్రణాలయమును సరస్వతీ నిలయముద్రాక్షరశాల అను పేరిట స్థాపించిరి. వారును మద్రాసు వదలి నెల్లూరుకు వెళ్ళవలసిరాగా శ్రీ రామస్వామి శాస్త్రులవారు క్రొత్తగ తండయార్పేట యందు తమ ఇంటిలో ఆది సరస్వతీ నిలయముద్రణాలయమును నెలకొల్పిరి. ఇప్పటికిని ఆ ముద్రణాలయమచ్చటనే సాగుచున్నది.

శ్రీ రామస్వామి శాస్త్రుల వారి మొదటి ప్రచురణము 1854 సంవత్సరములో వెలువడెను. నాటినుండి నలువదియేండ్లు వారు ప్రచురణకర్తగ గ్రంథ సంపాదకులుగ నెడ తెగని పరిశ్రమ చేసిరి. లండనులోని బ్రిటిషు మ్యూజియము అధికారులు 1976 సంవత్సరములో ఇండియాలో ప్రకటితమైన గ్రంథముల జాబితానొకటి ప్రకటించిరి. దానినిబట్టి శ్రీ శాస్త్రుల వారు 1854‌‌-62 మధ్యలో తెనుగులిపిలో ఇతరములతో గూడ ఈ క్రింది గ్రంథములు ప్రకటించినట్లు తెలియవచ్చును. 1. శ్రీ మద్రామాయణము, 2. లీలావతీ గణితము, 3. అమరము, 4. గురుబాలప్రబోధిక, 5. గౌతమస్మృతి, 6. పరాశరమాధవీయము, 7. ఉత్తరగీత, 8. శంకరవిజయము, 9. భోజచంపు – సవ్యాఖ్య, 10. అభిధానరత్నమాల, 11. సంస్కృత శ్రీ భాగవతము, 12. ఆంధ్రభాగవతము, 13. సవ్యాఖ్యానరఘువంశము, 14. మేఘసందేశము, 15. భట్టికావ్యము, 16. శబ్దమంజరి, 17. విష్ణుసహస్రనామ భాష్యము. శ్రీ శాస్త్రుల వారి పనిని గురించి సుప్రసిద్ధ తెనుగు పండితులు సి.పి బ్రౌను ఇట్లు వ్రాసెను. – “చేతి వ్రాత పుస్తకములు చదువుకొనే రోజులలో శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులవారు ముద్రణాలయమును స్థాపించి చదువరుల కష్టముల నివర్తింప జేసిరి.”

శ్రీ రామస్వామి శాస్త్రులవారు తాళపత్ర గ్రంథములు సేకరించడములోను అందులో ముఖ్యమైనవానిని ప్రకటించడములోను నిరంతరము కృషిచేసిరి. ఏడెనిమిది సంవత్సరముల స్వల్ప కాలములో వారు ఏబది పుస్తకాలు ప్రకటింపగలిగిరి. శబ్దమంజరి, అమరము, బాల రామాయణము బోటి చిన్నరకాలనే గాక శ్రీ మద్రామాయణము, శ్రీ భాగవతము, లీలావతీ గణితము, ఆముక్తమాల్యద, తెనుగు భాగవతము – ఇట్టి ప్రసిద్ధ విస్తార గ్రంథములిందులో చేరినవి. కొంత కాలమైన పిదప ఇంకను బృహత్తర గ్రంథములైన రామాయణము – సవ్యాఖ్యానము, శ్రీభాగవతము – సవ్యాఖ్యానము, ఇట్టివానిని గూడ వారు ప్రకటించిరి. ప్రఖ్యాత పురుషులగు శ్రీ ఆనందగజపతి విజయనగరము మహారాజావారు, శ్రీ వేంకటగిరి, బొబ్బిలి మహారాజులు, కార్వేటి నగరము రాజుగారు, బుచ్చిరెడ్డి పాళెమున, శ్రీ పుట్ట కోదండరామిరెడ్డి గారు, మోవూరున శ్రీ రేబాల పట్టాభిరామిరెడ్డి గారు, గౌ॥ పి. చెంచలరావుగారు, రాయబహదూరు ప. అనంతాచార్లుగారు, రాజా టీ. రామారావుగారు, రాజా సర్ : టి. మాధవరావుగారు, శ్రీ అంబాశంకరదవేజిగారు, శ్రీ కొల్లా సుబ్బారాయ శెట్టిగారు, శ్రీ కావలి సీతారామయ్య పంతులుగారు, శ్రీ శ్రీమా౯పిళ్ళ, శ్రీపిట్టి మునుస్వామిశెట్టి గారుమున్నగు వారి నైతిక ధనిక సహాయములతో సంపూర్ణ తెనుగు వ్యాఖ్యసహితముగ శ్రీమద్రామాయణమును మాస సంచికలుగ ప్రకటించుటకు శ్రీ రామస్వామి శాస్త్రులవారుపక్రమించిరి. వారు మొదటి రెండు కాండలు పూర్తి చేయకముందే మృత్యువుపాలైరి. వారు గతించిన పిదప వారి కుమారులు శ్రీ వేంకటేశ్వర శాస్త్రులు గారు బాలురుగానున్నందున వారి అల్లుడు సుప్రసిద్ధ పండితులు శ్రీ చదలవాడ సుందరరామ శాస్త్రులు గారు ఆ పుణ్య కార్యాన్ని సాగించిరి. ఆ రీతిగా రామాయణమును పూర్తిగ ప్రకటించి కృతకృత్యులైరి. సంస్కృతము తెనుగు గ్రంథములను ప్రోత్సహించే గుణ గ్రహణసారీణులు ఆ కాలమున మద్రాసులోనేమి ఇతర జిల్లాలలోనేమి విరివిగ నుండిరి. అందుచేతనే శ్రీ రామస్వామి శాస్త్రులు గారి కార్యక్రమము చక్కగ కొనసాగడమునకు అనుకూలము గలిగినది. రామాయణము మాససంచికలకు 850 మంది నెలకు ఒక రూపాయి చందా చెల్లించి సభ్యులై యుండిరి. ఆ గ్రంథమంతయు 15 సంపుటములుగ ప్రకటితమై రు 70‌‌-0-0 ల ధరకమ్మబడెను. ఇట్టి గ్రంథముల ప్రోత్సాహము ఆనాడట్లుండెను. ఈనాడు క్షీణించిపోవడము గమనింపదగినది. శ్రీ రామస్వామి శాస్త్రులు గారు గతించిన నాటి నుండి నేటిదాక వారి అసలు రామాయణము ప్రతులు 100కి పైగా చెల్లుబడి కాలేదు.

శ్రీ రామస్వామి శాస్త్రులవారు తెనుగు సంస్కృతములలో అఖండపండితులని ప్రఖ్యాతి గాంచిరి. అనేక సంవత్సరములు వారు మద్రాసున శ్రీ శృంగేరీ పీఠ ప్రతినిధులుగ పనిచేసిరి. ఎప్పుడైన మత విషయముల నిర్ణయము చేయడములో అనుమానములు గలిగినను ఆచార వ్యవహారములు నిర్ణయించడములో సంశయములు పొడమినను వీరిని అడిగేవారు. వీరి ప్రతిభకొక నిదర్శనమే చాలును. వీరి శాస్త్ర వాదమును విని సుప్రసిద్ధ తెనుగు పండితులు ప్రెసిడెన్సీ కాలేజీ వారు మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు అద్వైతియై శృంగేరీ పీఠ కార్యనిర్వహణములో వీరికి బహుకాలము సహకారిగ నుండిరి. ఆ కాలములో కృష్ణప్ప నాయక అగ్రహారమున శృంగేరీ మఠమున ప్రతి ఆదివారము మత విషయకోపన్యాసములు చర్చలు వీరు జరిపేవారు. శ్రీ శాస్త్రుల వారి మరణానంతరము ఇవి ఆగిపోయెను. మన దురదృష్టవశము చేత ఇవి మరలసాగినవి కావు.

శ్రీ రామస్వామి శాస్త్రులవారి మరణానంతరము కొంతకాలము ముద్రణాలయ కార్యక్రమము నిలిచిపోయెను. శ్రీ చదలవాడ సుందరరామ శాస్త్రి, శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రి ప్రభృతి ప్రసిద్ధ పండితులుండియు నీ స్థితి తప్పలేదు. అందుచేత అప్పటిస్థితిలో క్రొత్త ప్రచురణము లేమియు బయల్పడలేదు.

II

తండ్రి మరణించునప్పుడు శ్రీ వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రులు బాలురు. ముద్రణాలయ ప్రకటన కార్యక్రమములను తలదాల్పదగినవారు కారు. శ్రీ దండిగుంట సూర్యనారాయణ శాస్త్రులకడను మేనమామ శ్రీవేదము వేంకట్రామ శాస్త్రికడను కొన్ని సంవత్సరములు సంస్కృతము చదివి తరువాత ఇంగ్లీషు అభ్యసింప మొదలిడి ఒక బంధువుతో గూడ నుండి ఆవిద్య నేర్చుటకై అచటి హైస్కూలులో చేర్చునుద్దేశమున వీరిని కర్నూలునకు బంపిరి. తరువాత వీరు మద్రాసునకు వచ్చి పచ్చయప్ప కాలేజీలో మెట్రిక్యులేషను పూర్తిచేసి కొంతభాగము కాలేజీ విద్యకూడ అభ్యసించిరి. కుటుంబ పరిస్థితుల చేత వీరు కళాశాల చదువు పూర్తి చేయకనే చదువును మానుకొనవలసినవారైరి. వీరు కళాశాలలో ఉండగానే 1906వ సంవత్సరమున వీరు ముద్రాలయము పేరు ఆది సరస్వతీముద్రాలయమను దానిని మార్చి వావిళ్ళ ముద్రణాలయమని క్రొత్త నామకరణమొనర్చిరి.

ఆ రోజులు ‘వందేమాతరం’ రోజులు. బంగాళా విభజనము, స్వదేశీ ఉద్యమము ప్రబలిన కాలము. భారతదేశీయ మహాసభలో అతివాద పక్షమేర్పడిన యుగము. శ్రీ వేంకటేశ్వర శాస్త్రులు పొందిన ఆంగ్ల విద్యాభ్యాసము వారి ముద్రణ ప్రచురణ కార్యక్రమములను నవీన కాలానుగుణముగ తీర్చడమునకు వారికి పనికివచ్చెను. తెనుగు సంస్కృత కావ్యముల పునరుజ్జీవనమునకీయన శ్రద్ధతో పాటుపడెను. దానితో గూడ బంకించంద్ర ఛటర్జీ విరచిత ఆనందమఠమువంటి నూతన నవలలు వగైరాలు ప్రకటించుటలోను ఈయన శ్రద్ధచూపెను. ప్రసిద్ధ పురుషుల జీవిత చరిత్రలును అనేకముల వీరు ప్రకటించిరి. ఇట్లు రెండు మూడేండ్లు పనిచేయుచు రాగా కళాశాల చదువు సాగించుట అసాధ్యమాయెను. అది సాగిన వ్యాపారము కుంటుపడుట తప్పదని తోచినది. విస్తారముగ తాను ప్రకటింపదలచిన అన్ని గ్రంథములు ప్రకటించునంత విరళముగ తన ముద్రాలయమును పెంచవలసియుండినది. లేకున్న నెచ్చటెచ్చటనో అచ్చువేసుకొనవలసి వచ్చినది. 1910వ సంవత్సరములో ఈయన నూతన కాలమునకనుగుణమగు చక్కని అచ్చు పరికరముల విస్తారముగ కొనెను. తన ముద్రాలయమును విస్తరింపజేసెను. దానితో వీరి ముద్రణగుణము పెరిగి వీరి ప్రకటనల స్వరూపము సుందరతరమయ్యెను. నాటి నుండి ఇంతదనుక శ్రీ శాస్త్రులు గారు తెనుగు సంస్కృతములలో సుమారు 900 గ్రంథముల ప్రకటించిరి. అరవమున అరువది, ఇంగ్లీషున అనేక గ్రంథములు అచ్చువేసిరి. ఇందులో అనేకము లెన్ని కూర్పులో అయినవి. ప్రచురణకర్తగ వీరు చేసిన పనిలో వీరెన్నో కష్టాలు పడవలసి వచ్చినది. అయితే వీరిదొకటే దీక్ష. మన వాఙ్మయ రత్నములన్నిటిని ప్రజాసామాన్యమునకు అచ్చులో అందజేయడమే వీరి ముఖ్యోద్దేశము.

ప్రాచీన ప్రౌఢ రచనల ప్రకటించుటలో శ్రీవావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులుగారి కెల్లప్పుడును మార్గము సుగమముగ నుండినదని అనుకోవలదు. కొన్ని సంవత్సరములు గడచిన వెనుక సంఘ సంస్కర్తయగు శ్రీ గోటేటి కనకరాజు పంతులుగారనే గవర్నమెంటు ట్రాన్సులేటరు మూలకముగ వీరికొక ప్రాసిక్యూష౯కూడ సంభవించెను. కారణము వీరి ప్రచురణములలో కొన్ని పద్య కావ్యములలో ముఖ్యముగ ప్రచండాంధ్ర కవి శ్రీనాథుని గ్రంథమున అసభ్య వర్ణనలు కలవనడము. అప్పుడు ఈ ప్రచురణకర్త పరముగ ప్రముఖులైన సర్ : బి ఎ౯ శర్మ, శ్రీ పేరి నారాయణమూర్తిగారు, శ్రీ పిఠాపురము మహారాజా గారు, శ్రీ జయంతి రామయ్య పంతులు గారు మున్నగువారు చర్యపుచ్చుకొని అనేక సభల జరిపి తీర్మానములు చేసిరి. ప్రాచీన కాలమునుండి ప్రచారమున యుండే మహా కావ్యములను అసభ్యమని నిషేధించడము ఉచితముగాదని ఇంతకంటె గొప్ప అసభ్యాలు పాశ్చాత్య కవులలో – ఛాజరు, షేక్సుపియరులలో – గలవని, ల్యాటిను, ఫ్రెంచి కావ్యకర్తల మాట చెప్పనేపని లేదని, చక్కని వాదాలను పెట్టిరి. కొంత అల్లరి జరిగినమీదట గవర్నమెంటువారు ప్రాసిక్యూషనును ఉపసంహరించుకొనిరి. కాని ముందు ముద్రింపబోవు కూర్పులలో అసభ్య పద్యములకొన్నింటిని తొలగించి ప్రకటింపవలెనని ఉత్తరువు చేసిరి. ఇటీవల కాంగ్రెస్సు వారధికారమునకు వచ్చినప్పుడు శ్రీ శాస్త్రుల వారు ముఖ్యమంత్రి శ్రీ సీ. రాజగోపాల చార్ల గారిని జూచి ఈ నిషేధము తుదముట్టతీసివేయవలసినదిగ కోరియు ప్రయోజనము లేకపోయినది. ఈ ఆంక్ష ఆంక్షగానే నిలచిపోయెను.

III

శ్రీ శాస్త్రులు గారు అనేక ఇతర ప్రజాహిత జీవిత శాఖలతో సంబంధము గల వారైనందున వారికి ప్రాముఖ్యత కలుగుటకుతోపాటు వారి ప్రయోజనత్త్వమును విశేషముగ పెరిగినది. ఇతర వ్యాసంగములెన్ని ఉన్నా సరే – ఇవి చాలా ఉన్నవి అనడము నిజమే – వీరు సంస్కృతము, తెనుగు, అరవము వాఙ్మయాలలో ప్రాచీన ప్రౌఢరచనల్ను వెలువరచుటయందు మాత్రము దీక్షాబద్ధులై పనిచేయుచున్నారు. ఈ విధముగ ప్రాచీన వాఙ్మయాన్ని ప్రకటించుచు శ్రీ శాస్త్రులు గారు ఆ దినములలో సుప్రసిద్ధ కోవిదులగు శ్రీ అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల సహాయముతో 1916వ సంవత్సరములో త్రిలిఙ్గ అను తెనుగు మాసపత్రికనుపక్రమించిరి. కొంతపిదప శ్రీ ఉమాకాంతముగారికి ప్రెసిడెన్సీ కాలేజీలో పండిత పదవి దొరకగానే నెల్లూరులో అడ్వకేటుగనుండే శ్రీ ఎ౯. సుబ్బరాయుడు, బిఏ, బి.యల్, గారి సహకారమును సంపాదించిరి. మాస పత్రికగనున్న త్రిలిఙ్గను పక్షపత్రికగ వెలువరించిరి. ప్రజానుమోదము పొందినందున బహు త్వరలోనే దానిని వారపత్రిక గావించి ఈ 22 ఏండ్లుగ ఆ స్థితిని సాగించిరి. శ్రీ సుబ్బరాయడు గారు నెల్లూరుకు వెళ్ళిన పిదప శ్రీ శాస్త్రులు గారే పూర్తిగ ఈ పత్రిక సంపాదక కార్యక్రమమును సాగించుచున్నారు. ఈ పత్రిక చందాదారులు క్రమముగ అభివృద్ధి పొందిరి. ఆంధ్రదేశమున అన్ని భాగములకు చేరడమే గాక బొంబాయి, లోయరుబర్మా, దక్షిణాఫ్రికా మున్నగు చోట్లకు – దూర దేశములకు -తెనుగువారు ఉన్న ప్రాంతాలన్నిటికిని ఈ పత్రిక వ్యాపించినది.

ఇండియ౯ స్టాచ్యూటరీ కమిష౯ ఏర్పడడానికి దగ్గరగ ముందే 1927 సంవత్సరం జవనరిలో శ్రీ శాస్త్రులుగారు ‘ఫెడరేటెడ్ ఇండియా’ అనే ఇంగ్లీషు వారపత్రిక నారంభించి అనుభవజ్ఞులగు పత్రికా రచయిత శ్రీ కే. వ్యాసరావు గారు మరణము వరకు వీరి సహాయముతో దీని సాగించిరి. అఖిల భారత సంయుక్తతను భారతదేశమునకు నచ్చజెప్పి దాని అంగీకరింపజేయడమే ఈ క్రొత్త ప్రయత్నము యొక్క ఉద్దేశము. ఈ పత్రిక ఏపక్షమును ప్రత్యేకముగ వహింపక జవాబుదారీతో మెలగుచుండును. బ్రిటిషు ఇండియాలోను స్వదేశ సంస్థానములోను దీనికి చక్కని ప్రచారమున్నది. పరదేశములలో గూడ చందాదారులున్నారు. ఈ రెండు పత్రికలును – తెనుగులోని త్రిలిఙ్గ, ఇంగ్లీషులోని ఫెడరేటెడ్ ఇండియా – స్వతంత్రపత్రికలు. ఏ పార్టీకి ఏ ప్రత్యేక వర్గానికి జెందినవి గావు. ఆ విధముగ పార్టీ పత్రికలుగ పనిచేసియుంటే శ్రీ శాస్త్రుల వారికి ఆర్థికముగను ఇతరత్రను గొప్ప సహాయము కలిగియుండును. కాని, వారి దృష్టి అంతా దేనిమీద ఉన్నదంటే అప్పటికప్పుడేర్పడే అన్ని సమస్యలను గురించి తటస్థముగ ఆలోచించి న్యాయము, ధర్మము అనితోచే స్వతంత్రాభిప్రాయముల ధైర్యముగ ప్రకటించడమనుటయే వారి దీక్ష. దీనిచేత వీరెక్కువ ఆర్థిక నష్టములు పొందవలసి వచ్చినది. చందాదారుల వల్లను ప్రకటనల వల్లను వచ్చే ఆదాయము తప్ప త్రిలిఙ్గ మరియొకరీతి ఆదాయమునెరుగదు. ఏ రాజకీయ సంస్థ గానీ, గవర్నమెంటు గాని దీనికొక్క దమ్మిడీ విరాళమిచ్చి యుండలేదు. ఈతావున నొక్కమాట చెప్పడము అవశ్యకముగ తోచును. ఆంధ్ర ప్రజ ఈ పత్రిక యెడల నెక్కువ అభిమానమును చూపి ప్రోత్సహించుట ఉచితము. సహాయ నిరాకరణము, త్రాగుడు నిరోధము, దేవాలయ ప్రవేశము ఇట్టి ముఖ్య సమస్యలతో గూడ అన్ని రాజకీయ మత సాంఘిక విషయములలోను అన్ని అభిప్రాయముల ప్రకటనకును త్రిలిఙ్గ తావు గల్పించినది. ఈ సూత్రమునుంచి నెప్పుడు తొలగినది గాదు. శ్రీ శాస్త్రులు గారికి చిన్నతనములోనే పత్రికా రచయిత ప్రముఖులగు శ్రీ జీ. సుబ్రమణ్యయ్యరు, శ్రీ సీ. కరుణాకరమిన౯, తరువాత శ్రీ కే. వ్యాసరావు, సర్ : సీ. వై. చింతామణిగార్ల పరిచయము గలిగినది. ఆ తరువాత నేడు మనలను విడిచిచనిన శ్రీ కస్తూరి రంగ అయ్యంగారు, ఆయన వెనుక మహాదక్షతతో హిందూ సంపాదకత్త్వము నిర్వహించిన శ్రీ ఏ. రంగస్వామి అయ్యంగరు వీరి సాహచర్యమును గలిగినవి. ఇందరి మహదాశయములను శ్రీ శాస్త్రులుగారు తనయందు ప్రతిఫలింప జేసికొన ప్రయత్నించిరి.

90 ఏండ్ల కాలపు జీవితములో వావిళ్ళ ముద్రణాలయము నిర్వహించిన కార్యమునకు ఆ సంస్థ గర్వింపదగియున్నది. దీని స్థాపనాచార్యులు శ్రీ రామస్వామి శాస్త్రులు గారు మొదట శ్రీ మద్రామాయణము అచ్చు వేసినప్పుడు దేశమంతటను తిరిగి తాను చేయు కృషిని గురించి ప్రబోధము గావించిరి. అప్పట్లో అనేక స్థలములలో వారి గౌరవార్థము సభలు జరిపి వారిని సత్కరించిరి. ఆ రీతి ఉత్సాహము నేటి దినము అదృశ్యమయినదని చెప్పదగును. కాబట్టి నేటి దినము గ్రంథ ప్రకటన విరివిలోను ఉత్సాహములోను తగ్గుదల గట్టిగ గనిపించును. నైతికముగ ఆర్థికముగ మంచి ప్రచురణలకు ముఖ్యముగ ప్రాచీన ఫ్రౌడ కావ్యములకు, అర్వాచీన గ్రంథ సామగ్రికి, ఇయ్యతగిన ప్రోత్సాహము తగినంత లేదు. వావిళ్ళ సంస్థవారు అరవములోను ఏబది గ్రంథములు ప్రకటించిరి. ఇందు ‘తొలుకాప్పియము’, ‘తిరుక్కురళు’ గలవు. దేశభక్తులు పండితులునైన శ్రీ వీ.ఓ. చిదంబరంపిళ్ళెగారు తొలికాప్పియమును చక్కగ సవరించి సంతరించి ఇచ్చిరి. మహాభారత రామాయణములు సులభవచనమున ప్రకటితమయినవి. నాగరిలిపిలో సంస్కృత మహాభారతము దాక్షిణాత్యపాఠములతో సంపూర్ణముగ 18 సంపుటములుగ ప్రొఫెసరు : పీ.పీ.ఎస్. శాస్త్రి గారి సాయముతో బయలుపరచిరి. ఇంకను ఇతర గ్రంథములును వెలువడినవి. ఇంత చేసికూడ మన దేశీయ వాఙ్మయము నెడల దేశములో తగినంత అభిమానము లేదని శ్రీ వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారు అభిప్రాయపడుచున్నారు. సంస్కృతము తెనుగు వాఙ్మయములు వీటి పురోగమనములను గురించి ఒకొక్కప్పుడు వారు చింతనందుట కలదు.

ఏదో ఒక రీతిని పాఠ్యపుస్తకములు అచ్చువేసి డబ్బు చేసుకొందామనుకొనక శ్రీ శాస్త్రులుగారు ప్రాచీన ప్రౌఢ రచనలను లోకమునకు సమర్పించడము తన జీవిత ధర్మముగ స్వీకరించి పని చేసిరి. కడచిన 25 ఏండ్లుగ తాము నడిపిన త్రిలిఙ్గ మూలకముగ జరిగిన సేవ నీరీతిని కొనియాడడము జూచి ఈ యుత్సవమును వారు ఉచిత మర్యాదగ గ్రహించుచున్నారు. తెనుగు, సంస్కృత వాఙ్మయముల సేవలో తన ప్రచురణసంస్థ గావించిన కృషికి ఇది తగిన ప్రోత్సాహజనక గౌరవమని అంగీకరించుచున్నారు.

మద్రాసు

ఆగష్టు 1941

త్రిలిఙ్గరజోత్సవసమ్మానసంఘసభ్యులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here