[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
పృచ్ఛకుల మతలబు:
[dropcap]స[/dropcap]ర్వసాధారణంగా అవధానం రక్తి కట్టడానికీ, ఒక సారస్వ వినోద క్రీడగా రాణించడానికీ పృచ్ఛకుల సహకారం అవసరం. అలా అని match fixing వలె ముందుగా మాట్లాడుకోనవసరం లేదు. పట్టు విడుపులు అవసరం. అవధానిని అపహాస్యం పాలు చేయాలని చాలా కొద్దిమంది ప్రయత్నిస్తారు. పాత రోజుల్లో గురువుగారి కొమ్ము కాస్తూ శిష్యులు ఎదుటివారిని చిత్తు చేయాలని కుతంత్రాలు పన్నేవారట! గురువులకు పేరు తెచ్చే విధంగా చిన్న వయసులోనే వేలూరి శివరామశాస్త్రి గుంటూరు కళాశాలలో శతావధానం దిగ్విజయంగా చేసి తిరుపతి వేంకట కవుల ప్రశంసలందుకొన్నాడు:
మ:
జగతీనాధులు పెక్కుమంది ముదితస్వాంతంబునన్ కాన్కలం
పగ, సాంగంబు, సలక్షణంబుగ శరద్ద్వావింశతిన్ పేర్మి హె
చ్చగ మా ఏలిన ఈ వధానకవితా సామ్రాజ్య భారంబు మో
యగ పూనంగదవయ్య! తండ్రి! శివరామయ్యా! చిరంజీవివై
అని మనస్ఫూర్తిగా దీవించారు.
పృచ్ఛకులలో నిషిద్ధాక్షరికి కూచొనే వ్యక్తి డొక్కశుద్ధి వున్న పండితుడై ఉంటాడు. ప్రత్యక్షర నిషిద్ధంతో మూడు పాదాలు పాండితీ స్ఫోరకంగా సాగిపోతాయి. ఏకాక్షర నిఘంటు సాయంతో అవధాని ముందుకు ఉరుకుతాడు. సమయాభావం వల్ల నాలుగో పాదం స్వేచ్ఛగా చెప్పమని సభాసంచాలకులు సూచిస్తారు. కొందరు పృచ్ఛకులు కాదు, కూడదని అడ్డుపడి నాలుగో పాదం కూడా పట్టుబడతారు. మూడు పాదాలు నడిపిన వ్యక్తి నాలుగోది నడపలేడా? నిషిద్ధాక్షరిలో రహస్యం ఏమిటంటే – అవధాని ఒక అక్షరం చెప్పే ముందుగా రెండో అక్షరానికి ప్రత్యామ్నాయం కూడా ఆలోచించి పెట్టుకొంటాడు. అయితే మరో అక్షరం వెదికినట్లు కొంచెం సేపు గంభీరంగా ఆలోచిస్తున్నట్లు నటిస్తాడు. పృచ్ఛకుడు మహదానందపడిపోతాడు. ఎలుక బోనులో పడబోతోందని భావిస్తాడు. అదొక రసవత్తర ఘట్టం.
సమస్య కిరికిరి:
సమస్య ఇచ్చే పృచ్ఛకుడు విరుద్ధ భావం గల సమస్య నివ్వడం సహజం.
‘రాముని మాని రావణుధరాసుత ప్రీతి వరించె భర్తగాన్’
‘అంధుం డర్ధనిశీధి మందు కనె నయ్యర్కేందు బింబంబులన్’
వంటి సమస్యలు అవధాని మెడదుకు పదునుపెట్టిస్తాయి. అయితే కొందరు ద్విత్వాక్షరాలు ప్రాసలో వచ్చేలా సమస్యను ఏరికూర్చి బాణంలా సంధిస్తారు. కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్కడి తెలుగు జూనియర్ లెక్చరర్ అగస్త్యరాజు సర్వేశ్వరరావు (1970 ఫిబ్రవరి 1న) నాకు ఇచ్చిన సమస్య –
‘ప్రజ్ఞాశీలురు ఛాత్రు లేవిధమునన్ భాసింప రీ దేశికుల్!’
పూరణ ఇలా కొనసాగింది:
అజ్ఞానాంధులు పెద్ద చిన్నయను వ్యత్యాసంబు లేకుండగన్
విజ్ఞానం బిసుమంత లేని గతిలో విద్యావిహీనాకృతిన్
విజ్ఞానమ్మును లేక వెళ్లుదు రటందెందేని కన్పించగా
ప్రజ్ఞాశీలురు ఛాత్రు లేవిధమునన్ భాసింప రీ దేశికుల్!
వ్యంగ్యంగా సమస్యను సమర్థించవలసి వచ్చింది.
‘లక్ష్మీ మాధవ సింహవాహనల వాల్లభ్యంబు సంభావ్యమౌ’ అనే సమస్యను ఆకాశవాణి విజయవాడ కేంద్రం 1963లో సరస వినోదిని సమస్యా పూరణ కార్యక్రమంలో శ్రోతలకిచ్చింది. బి.ఏ. విద్యార్థిగా నేను క్రమాలంకారంలో పూర్తి చేసి పంపితే, ప్రసారం చేశారు. ఇక్కడ ప్రాసాక్షరం ‘క్ష్మ’ అని మూడు అక్షరాల సమాహారం కావడం విశేషం.
అవధాని పూరించిన తర్వాత పృచ్ఛకుడు సమస్యా పూరణను మెచ్చుకుంటూ ప్రశంసాపూర్వక వాక్యాలు పలుకుతాడు. కొందరు తాము ఇంటివద్ద కూచొని వ్రాసుకొచ్చిన పూరణను చదివి సభలో వినిపిస్తారు. విడిగా కూచొని రాయడం వేరు. అవధాన రసకందాయంలో పూరించడం వేరు.
పృచ్ఛకుల ప్రార్థనా పద్యాలు:
సభా ప్రారంభంలో అవధాని పృచ్ఛకులకు నమస్కార బాణాలు వదులుతాడు. తనను సాదరంగా చూడమని పలకరిస్తూ వారి అనుమతి కోరతాడు. ఒకటి రెండు అవధాన సభలలో పృచ్ఛకులను ప్రశంసిస్తూ నేను ఆశువుగా చెప్పిన పద్యాలు స్మరిస్తాను:
“పృచ్ఛకులార! వందనము – పెద్దలు మీరలు పాండితీధనుల్
స్వచ్ఛహృదంతరాళముల సారెకు పంతము పట్టుచుంట, నా
స్వేచ్ఛకు అడ్డు కట్టలను వేయగబూనుట, మాటిమాటికిన్
గుచ్ఛములౌ సమస్యలను గోరుట – వజ్రము సానబెట్టుటే!”
ఇక్కడ అవధాని తనను తాను వజ్రంతో పోల్చుకోవడం విశేషం.
అవధానంలో వివిధ ప్రశ్నల పరంపరను ప్రస్తావిస్తూ బెంగుళూరు సభలో నేను ఇలా అన్నాను. పృచ్ఛకుల పట్టుదలను స్పృశించాను.
“ఒక్కరు వర్ణనన్ తనియ, ఒక్కరు దత్తపదిన్, సమస్య వే
రొక్కరు నిచ్చి, వేరొకరు ఊరకప్రస్తుత మాటలు పుచ్చి, వే
రొక్కరు గంట వాదనము – ఒక్కొక్క రీతి పరీక్ష సేసి, నా
తిక్క కుదర్చగా తలచి తీరిక చేసుక వచ్చినారులే!”
ఇక్కడ ఒక చెణుకు విసిరాను. ‘తిక్క కుదర్చడం’ అనే నానుడి వాడాను.
ఒంగోలు సభ:
ఒకసారి ఒంగోలులో డా. మేడసాని మోహన్ చతుర్గుణిత అష్టావధానం ఏర్పాటు చేశారు. 1996 నాటి మాట. నేనప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్ర డైరక్టర్‍ని. సభా నిర్వాహకులు నన్ను సభాధ్యక్షులుగా ఆహ్వానించారు. ఆనాటి సభా విశేషాలను డా. మోహన్ నేను ప్రచురించిన ‘అవధాన పద్మసరోవరం’ అనే గ్రంథానికి ముందుమాట వ్రాస్తూ – 2008 జూన్ 6న ఇలా వ్రాశారు. ఆ గ్రంథంలో నేను చేసిన అవధానాలలో నా వద్ద లభ్యమైన కొన్ని సభల పూరణలు యథాతథంగా ముద్రించాను. ఆ పీఠికా భాగంలో ఒంగోలు సభ విశేషాలు వివరంగా మోహన్ ప్రస్తావించారు.
“అనంత పద్మనాభరావు గారు సాదరంగా విచ్చేసి సభను అలంకరించారు. చతుర్గుణితాష్టావధానం అంటే కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది (4 x 8 =32 పృచ్ఛకులు). ఉదయం, మధ్యాహ్నం భోజనానంతరం కూడా సభ కొనసాగవలసి ఉంతుంది. ఆ దినం కారణాంతరాలచే 11 గంటలకు సభ ప్రారంభమైంది. పృచ్ఛకులు ఒక్కొక్కరే ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతి పృచ్ఛకుడూ ప్రశ్న వేయడానికి ముందు దైవ ప్రార్థన చేస్తూ పది, పదినేను నిమిషాలు తీసుకుంటున్నాడు. అలా చేస్తూ పోతే భోజన విరామ సమయానికి ఒక్క ఆవృత్తి అయినా పూర్తి అవుతుందో? కాదో అనే భయం అన్ను (అవధానిని) ఆవహించింది. అనంత పద్మనాభరావు గారు నా ఆందోళనను గుర్తించారు. వెంటనే సమయస్ఫూర్తితో – ‘దయచేసి పృచ్ఛకులందరూ మనస్సులోనే దైవ ప్రార్థన చేసుకొని ప్రశ్నలతో సిద్ధం కండి!’ అన్నారు. పృచ్ఛకులు అలాగే చేశారు. నేను సకాలంలో అవధానం పూర్తి చేశాను. ‘అవధాన సరస్వతి’ అనే బిరుద ప్రదానం వారి చేతుల మీదుగా ఆ సభలో అందజేసి జ్ఞాపికనిచ్చారు. వారు స్వయంగా అవధానులై వుండి, మరొక ప్రతిభామూర్తి యొక్క ప్రతిభా విశేషాన్ని కూడా గుర్తించి, ఆదరించి, అభిమానించి, వాత్సల్యామృతం వర్షించి, ప్రోత్సహించే లక్షణం వీరిలో పుష్కలంగా వుంది.” – అని మేడసాని మోహన్ ముగించారు.
సభాధ్యక్షుల సాగతీత:
కొందరు అధ్యక్ష స్థానంలో కూచొని అవధాన సభకు ముందు సుదీర్ఘోపన్యాసం చేస్తారు. అవధానికి ప్రశాంత వాతావరణం లేకుండా ఏవో అనవససర విషయాలు ప్రస్తావిస్తారు. అవధానం మధ్యలో జోక్యం చేసుకుని సుదీర్ఘ వివరణలిస్తారు. అది ఉచితం కాదు. సభా సంచాలకులు ఆ విషయంలో జాగ్రత్త వహించి అవధానం రసవత్తరంగా ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. సభలో కూచొన్నవారు అందరూ పండితులు కాదు. తెలుగు సాహిత్యంపై ఆసక్తి, అభిమానము, ఆదరంతో వచ్చినవారు. వారికి మానసికోల్లాసం కలిగించడం, భాషపై మక్కువ పెంచడం ప్రధానోద్దేశం. అవధాన శాఖ సాహిత్యంలో సుస్థిరంగా వర్ధిల్లడానికి అందరూ కృషి చేయాలి. వర్ధతాం! అభివర్ధతాం!
(మళ్ళీ వచ్చే వారం)