చూడక్కరలేని 12 ఓ క్లాక్

0
3

12 ఓ క్లాక్ (అందర్ కా భూత్) (హిందీ చిత్రం)

2021 (అమెజాన్ ప్రైం లో లభ్యం)

హెచ్చరిక: ఈ సినిమా చూడక్కర లేదు.

***

చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు. కేవలం పాప నివృత్తి కొరకు నిజం  చెబుతున్నాను.

మన ఘనత వహించిన దర్శకదిగ్గజం ఆర్జీవి దర్శకత్వం వహించిన చిత్రం ’12 ఓ’ క్లాక్ అనే చలన చిత్ర రాజాన్ని చూసి మూర్చిల్లితిని.

కేవలం దింపుడు కళ్ళెం ఆశలాగా చూశాను ఈ చిత్రాన్ని. పోనీలే ఈ చిత్రాన్ని అయినా బాగా తీశాడేమో అన్న ఒక చిన్న ఆశ ఏదో మూల ఉండి పోయింది నా మదిలో.

మనం ఎంతో అభిమానించే వ్యక్తి  కాస్తా సరైన దారిలో లేనప్పటికీ, ఎప్పటికైనా బాగుపడడా అని ఆశిస్తాం చూడండి అలాగన్న మాట ఇది.

నిన్న నా కళ్ళ ముందే ఊరిస్తూ ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నప్పటికీ ఈ దిక్కుమాలిన చిత్రాన్ని చూడాల్సి వచ్చింది. ఎందుకు చూడాల్సి వచ్చింది అనే పదం వాడుతున్నాను ఎవ్వరైనా బలవంతం పెట్టారా అని మీకు ధర్మ సందేహం రావచ్చు. కాదు నాయనా, కాదు ఎవ్వరూ నన్ను బలవంత పెట్టలేదు. ‘అదృష్టం అందలం ఎక్కిస్తానంటే, బుద్ధి బురదలోకి లాక్కెళ్ళింది’ అని ఒక సీమ సామెత నా పట్ల నిజం అయ్యింది.

పక్కనే కూర్చున్న శ్రీమతి అక్కడికీ హెచ్చరిస్తూనే ఉంది , ఆమె మాటల్లోనే విందాం ఆమె ఏమందో –

“ఎందుకొచ్చిన రిస్క్ అండీ, 2021లో విడుదల అయింది అంటున్నారు, ఇప్పటిదాకా ఈ సినిమా గూర్చి ఎవ్వరైనా ఒక్క మాటయినా చెప్పారా, ఈ గూగుల్ సెర్చ్‌లో తెలిసిందే  తప్ప, ఈ చిత్రం గూర్చి మెడమీద తలకాయ ఉన్న వాడు ఎవ్వడైనా చెప్పాడా, ఎందుకొచ్చిన ఈ దుందుడుకు స్వభావం మీకు, నా మాట వినండి. వద్దు. అయినా మీ సహధర్మచారిణిని కాబట్టి మీరు ఏది పెడ్తే అది చూస్తా. మీకు టైం దొరికేదే తక్కువ, పాపం మళ్ళీ మీరు పనిలో పడితే సినిమాలు చూడ్డానికి కుదరదు. కానీ ఈ విలువైన సమయాన్ని ఇలా దిక్కుమాలిన సినిమాలు చూడ్డానికి, ఆ తర్వాత గంట సేపు దాని గూర్చి ఓ నాలుగు మాటలు వ్రాయటానికి వృథా చేసుకుంటారు. మీ ఇష్టం (వాస్తవానికి మీ ఖర్మ అంది లేండి).”

‘కర్మ అన్నది బలంగా ప్రవహించే నది వంటిది అని, దుందుడుకుగా అందులో దూకి ఎదురీదబోతే అవస్థలు తప్పవ’ని, సరైన టైం కి ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనకి మంచి చెప్పి మనల్ని కాపాడేవారు ఉండనే ఉంటారు వారే దైవ స్వరూపాలు అని అవధూతలు చెప్పకనే చెప్పారు. కానీ మనం వినం కద. అదే కర్మ యొక్క బలం.

కాబట్టి నా శ్రీమతి హెచ్చరికలు కూడా తుంగల్లో తొక్కి విజయవంతంగా ’12 ఓ క్లాక్’ అనే స్వచ్ఛమైన  ఆర్జీవి చిత్రాన్ని అమెజాన్ ప్రయిం లో హిందీ భాషలో చూడటం జరిగింది.

ఇంతకూ కథ ఏమిటి?

ఎంత దిక్కుమాలిన సినిమాకి కూడా ఒక కథ ఉండి ఏడుస్తుంది కద.

ఈ సినిమాకి కూడా ఒక కథ ఏడ్చింది.

ఒకటి చెప్పనా, రాం గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్లుగా మొదలెట్టి అద్భుతమైన దర్శకులుగా రాణిస్తున్న దర్శకులైతే ఏమీ, ఇటీవల అతని వద్ద ఓనమాలు దిద్దుకుని అతని నిర్మాణంలో సినిమా దర్శకత్వం చేస్తున్న పిల్ల డైరెక్టర్లు అయితే ఏమీ, వీరెవరికి ఈ కథని ఇచ్చి సినిమాగా తీయమని చెప్పి ఉండినా, ఖచ్చితంగా ఇంతకంటే బాగా తీసి ఉండేవారు.

కాకపోతే ఈ చిత్రం తాలూకు ముగింపు మాత్రం ఖచ్చితంగా మార్చాలి. లేకుంటే ఎంత మేటి దర్శకుడు తీసినా కూడా దరిద్రంగా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ ఈ సినిమాకి గొప్ప వీక్ పాయింట్.

సరే కథ చెప్పండి అంటారా. సరే చెప్తాను.

అదేదో జోక్ ఉంది చూడండి, ఓ బుక్ షాప్ వాడు చెప్తాడట “సర్ ఈ బుక్ తప్పక కొనండి, ఈ బుక్‌లో సస్పెన్స్ భలే ఉంటుంది, చివరి పేజి వరకు తోటమాలే హంతకుడు అని మీరు అస్సలు కనుక్కోలేరు” అని

అలా ఈ కథకి సంబంధించిన దిక్కుమాలిన క్లైమాక్స్ కూడా చెప్పేస్తాను ఇక్కడ ఈ వేళ.

అలా వ్రాస్తే ఆ రివ్యూని స్పాయిలర్ అనాలిట. ఈ  సినిమాకి నేను ఆ మర్యాద కూడా పాటించదలచుకోలేదు. అవును ఇది స్పాయిలరే. ఎలాగూ మీరు చూడబోవడం లేదు కద. ఉరికే ఎందుకు అతిమర్యాదలు ఈ సినిమాకి.

కథ:

ముంబాయి నగరంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా హత్యలు జరుగుతూ ఉంటాయి. చివరికి బాబు అనే ఓ సైకో చేస్తున్నాడు ఈ హత్యలన్నీ అని నిర్దారణ చేసుకుని పై అధికారుల అనుమతితో  అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు ఓ పోలీస్ ఆఫీసర్. కొన్నాళ్ళు ఆగినట్టే ఆగిన ఈ హత్యలు మళ్ళీ మొదలవుతాయి. పోలీసులమీద ఒత్తిడి పెరిగి పోతుంటుంది.

ఇక్కడ మనం ఒక మధ్య తరగతి కుటుంబం గూర్చి చెప్పుకోవాలి. ఓ గవర్నమెంట్ ఆఫీస్‌లో నౌకర్ గా పని చేస్తున్న రావు (మకరంద్ దేశ్‍పాండే)ది చిన్న కుటుంబం. అతనికి ఇద్దరు పిల్లలు. ఒక టీనేజి కుర్రాడు, ఓ ఇరవై ఏళ్ళ కూతురు గౌరీ (కృష్ణ గౌతం). అతను అతని భార్య (దివ్యా జగ్దాలే) తమ ఇద్దరు పిల్లలతో, ఉన్నంతలో ఆనందంగా చీకు చింతలేకుండా హాయిగా ఉంటారు. వాళ్ళ వద్ద రావు గారి ముసలి తల్లి కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ రోజులు వెళ్ళదీస్తూ ఉంటుంది.

ఈ అమ్మాయికి వరుసగా కొన్ని రాత్రులు అర్ధరాత్రి మెలకువ వచ్చి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇదంతా ఆత్మలు ఆమె శరీరంలోకి ప్రవేశించే ప్రక్రియ అన్నమాట. చివరికి విజయవంతంగా ఆమె శరీరంలోకి బాబు అనే సైకో కిల్లర్ ఆత్మ ప్రవేశించి నగరంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. అంటే మీరనుకుంటున్నట్టు, దెయ్యం పూనిన ఆ అమ్మాయి ఇంట్లోనుంచి ఎక్కడికీ వెళ్ళదు ఇంతకూ. కానీ  ఆమెలో ఉన్న ఈ  దుష్ట ఆత్మ ఇక్కడే కూర్చుని (వర్క్ ఫ్రం హోం తరహాలో) అనేక ఇతర అత్మలను ఇక్కడి నుంచే, గాల్లోనే ప్రేరేపించి (వాటికి జియో ఫైబర్‌ని మించిన నెట్‌వర్క్ ఏదో ఉండే ఉంటుంది)  తాత్కాలికంగా ఆ ఆత్మల్ని ఎవరో ఒకరిలోకి పూనేటట్టు చేసి నగరంలో తన సీరియల్ కిల్లింగ్ అనే యఙ్జాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఉన్నంతలో గుడ్డిలో మెల్ల, ఆ బుల్లి బుల్లి దుష్ట ఆత్మలు కేవలం డెప్యుటేషన్ మీద పని చేస్తుంటాయి. హత్య పూర్తవంగానే అవి తాము ఆవహించిన వ్యక్తులను వదిలేస్తుంటాయి. కానీ ఈ బాబు గాడి దుష్ట ఆత్మ ఈ పిల్లను శాశ్వతంగా ఆవహించి ఉంటుంది. ఈ పిల్లని అంటిపెట్టుకోవడంలో చాలా సుఖంగా ఉందని కూడా డైలాగులు చెబుతు ఉంటుంది ఆ పిల్ల తండ్రితో. ఆయన సిగ్గుతో తల దించుకుంటూ ఉంటాడు.

ఇంకొక హైలైట్ ఉంది ఇక్కడ. ఈ బాబు  దుష్ట ఆత్మ తన శక్తులని ఉపయోగించి, తనతో పాటు ఈ పిల్ల శరీరంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరే ఇతర ఆత్మలకి కూడా అకామిడేషన్ కల్పిస్తు ఉంటుంది.

మాంత్రికుడు (ఆశిష్ విద్యార్థి) రావుగారికి సాయం చేయబోయి దుష్ట ఆత్మ ప్రభావంతో ప్రాణాలు కోల్పోతాడు. ఇక ఒక నాటి డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి ఒక నిస్సహాయుడైన సైకియాట్రిస్ట్‌గా నటించాడు. దలీప్ తాహిల్ పోలీస్ కమీషనర్‌గా, మానవ్ కౌల్ పోలీస్ ఆఫీసర్‌గా, అమిత్ సాధ్ హీరోయిన్ ప్రియుడిగా నటించారు. వీరందరూ కూడా దుష్ట ఆత్మ ప్రభావానికి తలొగ్గుతారు. కొందరు చస్తారు. గుడ్డిలో మెల్లగా మిథున్ చక్రవర్తి, పోలీస్ కమీషనర్ ప్రాణాలు కోల్పోరు.

సైకియాట్రిస్ట్ అయిన మిథున్ చక్రవర్తి  చివరికి గత్యంతరం లేక ఆ పిల్లనెత్తిన కిరొసిన్ పోసి తగలెట్టేయ్యమని తలితండ్రులకి సలహా ఇస్తాడు. ఆ విధంగా ఏ గ్రంథాలలో వ్రాసి ఉన్నాయో తెలియదు.

వాళ్ళు ఆ సలహా పాటిస్తారు. ఆ పిల్ల చచ్చూరుకుంటుంది.

ఇది కథ.

రాంగోపాల్ వర్మకి ఈ కథ ఎందుకు తోచిందో తెలియదు. ఆయన మన స్పృహలో లేనప్పుడు  బహుశా సైకో కిల్లర్ బాబు  ఆత్మ ఆయనకి కథ చెప్పి నచ్చజెప్పిందేమో తెలియదు.

పాజిటివ్ పాయింట్స్:

పాజిటివ్ పాయింట్స్ ఒక్కటీ లేవు అని అనాలనుంది కానీ, కొన్ని అంశాలు చెప్పక తప్పదు.

ఫోటోగ్రఫీ చాలా బాగుంది.

మధ్య తరగతి ఇండ్లలో ఉండే వాతావరణాన్నికళ్ళకు కట్టినట్టు చూపారు.

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గౌరీ పాత్రలో నటించిన కృష్ణ గౌతం అనే హీరోయిన్ గూర్చి. చాలా చక్కగా చేసింది ఈ అమ్మాయి. సైకో రౌడీ లాగా వాడి బాడి లాంగ్వేజిని అలవోకగా నటిస్తూ, ఉన్నట్టుండి అమాయకంగా గౌరీలాగా షిఫ్ట్ అయిపోతుంది. ఒక్కోసారి ఇతర ఆత్మలు తనలో ప్రవేశించినప్పుడు ఆయా ఆత్మల తాలూకు వాచకం, ఆంగీకం చూపిస్తుంది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పవచ్చు.

మకరంద్ దేశ్‍పాండే నటన గూర్చి ఎప్పుడు గొప్పగా వినడమే కానీ ఈ సినిమాలో అతని నటన యొక్క విశ్వరూపాన్ని చూస్తాం. ముఖ్యంగా ఆ విచిత్రమైన జుత్తు లేకుండా హాయిగా చిన్న క్రాఫ్ తో కనిపించే అతన్ని మొదట గుర్తుపట్టలేకపోతాము.

అతను చూపిన వేదన, కూతురి పట్ల ప్రేమ, అటెండర్ గా ఒదిగి ఉండే విధానం ఇవన్నీ అతని నటనలోని లోతుని చూపిస్తాయి.

ఏతావాతా గొప్ప నటీ నటులందరినీ తీసుకుని హోల్‌సేల్‌గా వాళ్ళందరినీ ఒక దరిద్రం సినిమాలో నటింపజేసిన పాపాన్ని మూటగట్టుకున్నాడు మన ఆర్జీవి.

నెగెటివ్ పాయింట్స్:

ఈ సినిమా మొత్తం నెగెటివే.

సైడ్ లైట్స్:

ఈ సినిమాలో డాక్టర్ పాత్ర పోషించిన ఆలీ అస్గర్, తన వద్ద ఉన్న నర్స్‌తో సాగించే సరసాల దృశ్యాలు చూపడం వల్ల డాక్టర్ల పరువు తీశాడు దర్శకుడు. కథకి ఏ మాత్రం సంబంధం లేని రామాయణంలో పిడకలవేట వంటి ప్రహసనం ఇది.

వీళ్ళిద్దర్ని తన వర్క్ ఫ్రం హోం స్కీంలో మన బాబు ది కిల్లర్ ఎలాగు చంపేస్తాడు అనుకోండి అది వేరే సంగతి.

ఈ మహత్తర చిత్ర రాజానికి సంగీతం కీరవాణి.

ఫోటోగ్రఫీ: అమోలె రాథోడ్

నిర్మాత: ఆర్జీవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here