[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]చా[/dropcap]లా కాలం క్రితం అమెరికన్ సినిమా ప్రముఖులొకరు ఉద్యోగవిరమణ మీద SPAN పత్రికలో ఒక హాస్యరచన చేశారు. ఆ రోజుల్లో 65 సంవత్సరాలు వస్తే అమెరికా దేశంలో రిటైర్ అవుతారు. ఆ తేదీ దగ్గర పడుతుంది. మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు సలహాలు – ఉచితసలహాలు కుమ్మరిస్తారు. ముందుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి, నిష్క్రియాశీలత వల్ల ఎందుకూ కొరగాకుండా పోతావని అతన్ని ఊదరగొట్టి చంపుతారు.
అతను ‘ఆన్ రిటైర్మెంట్’ మీద పుస్తకాలన్నీ చదివి, ఒక ప్రణాళిక తయారు చేసుకొంటాడు. తనకు ఆర్థిక భద్రత ఉంది. ఇన్సూరెన్సులున్నాయి. కనుక జీవితంలో తాను ఏయే పనులు చెయ్యాలని చేయలేక పోయాడో ఆ పనులన్నీ చెయ్యాలని, తీరని కోర్కెలను తీర్చుకోవాలని, క్షణం వృథా చెయ్యరాదని తీర్మానించుకుని రిటైర్ అయిన రోజు రాత్రి మరుసటి రోజు ఉదయం నుంచి మినిట్ టు మినిట్ టైంటేబుల్ తయారు చేసుకొంటాడు. ఉదయం వేకువన 5 గంటలకు అలారం పెట్టుకొని పడుకొంటాడు.
అతనికి తెల్లవారి మెలకువ వచ్చేసరికి 8 దాటుతుంది. “అలారం మోగలేదా?” ఇల్లాలిని అడుగుతాడు. “అలారం ఎందుకు? రిటైర్ అయ్యారు కదా, నేనే ఆపాను” అంటుంది.
అయ్యో! ప్రథమకబళంలోనే మక్షికాపాతమే అని చికాకుగా ఆ రోజు పత్రికల కోసం చూస్తాడు. పత్రికలు కనిపించవు.
“ఈ రోజు నుంచీ ఆఫీసువారు పత్రికలు వెయ్యరన్న సంగతి మరచిపోయారా?” ఇల్లాలు గుర్తుచేస్తుంది.
ఆమె అందించిన కాఫీ తాగి పత్రికలు తెచ్చుకోవడం కోసం బయల్దేరుతాడు. ఆమె కూడా అతనివెంట బయల్దేరుతుంది. దారిలో పార్కు గేటువద్ద పది పన్నెండు ఏళ్ల పిల్లలు తారసపడి “అంకుల్ ఒక మనిషి తక్కువ అయ్యారు. అంపైర్ రాలేదు. మ్యాచ్ ఆగిపోతుంది. అంపైర్‌గా ఉండండి” అని అభ్యర్ధిస్తారు. ఒప్పుకోమని భార్య కళ్ళతో సూచిస్తుంది.
మ్యాచ్ ముగిసేసరికి 11 దాటుతుంది. ఇంటిదారి పడుతూ “సగంరోజు పోయింది ఇట్లాగైతే నేనైమైపోతానో, నా రిటైర్మెంట్ జీవితం ఏమయిపోతుందో” అని వ్యాఖ్యానిస్తూ వ్యాసం ముగిస్తాడు. హస్యప్రధానంగా ఉన్నా ఇందులో చాలా ధ్వని, స్ఫూర్తి ఉంది.
ఈ వ్యాసాన్ని కథ రూపంలో రాశాను. పత్రికలో వేశారు కానీ “జీవితం నది వంటిది. అది తన ఇష్టం వచ్చిన మలుపులు తిరుగుతుంది” అని ముగింపులో సంపాదకులు చేర్చారు.
నా వరకూ కాలేజీలో చివరి వీడ్కోలు ఫంక్షన్‌లో నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడి సెలవు తీసుకోవాలని అభిలాష పడ్డాను. రిటైర్మెంటుకు నెలరోజుల ముందు మా తెలుగుశాఖ వారు ఏర్పాట్లు చేసిన వీడ్కోలు సభకు నాగభైరవ, వెన్నెలగంటి వచ్చారు. ఆ సభలో ఏదో బిక్కముఖం వేసుకుని కూర్చున్నా. అట్లా ఉండకూడదని నాకు తెలుసు. ఆ రోజే తీర్మానం చేసుకున్నా. అనుకున్నట్లే మా కళాశాల స్టాఫ్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో హుందాగా, నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ పాల్గొన్నా.
మా దంపతులం రిటైరైన మొదటి ఏడాది ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగామో! ఈ రోజు వరకు రచనావ్యాసంగం, యాత్రలు, సినిమాలు, ఆప్త మిత్రులు, కుటుంబ బాధ్యతలతో జీవితం సాగుతోంది.
(మళ్ళీ కలుద్దాం)