కైంకర్యము-21

0
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]‘నీ[/dropcap]లా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణమ్
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరస్సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్త్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః॥’

మధురంగా గోదాస్తుతి చేస్తోంది ఆండాళ్ళు. ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి వారికి రోజులు ఎలా గడిచిపోతున్నవో తెలియటం లేదు.

ఉదయం నుంచి గోదా పాశురాలు పాడటం, పూమాలలు రంగురంగులుగా చిత్ర విచిత్రంగా గుచ్చటము, మధ్యాహ్నం భాగవత సప్తాహాలు, సాయంత్రం తిరుప్పావై ప్రవచనాలతో కోదండరాముని కోవెల దైదీప్యమానంగా వెలుగుతున్న కాలమది.

ఆండాళ్ళుకు పుట్టింటికి వచ్చినది మొదలు కోదండరాముని కైంకర్యములో మునిగితేలుతోంది. ఆమె అలా తన చిన్నతనంలో సేవించింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆమెకు ఆ అవకాశం కలిగింది. సంతోషంగా సాగుతున్న కాలమది ఆమెకు.

మార్గళి మొదలై అప్పుడే పదిహేను రోజులైయింది. ఆ రోజు వల్లి ఎందుకో హడావిడిగా ఉంది. ఆమె కొత్త బియ్యం నానబోసి ఆరబెట్టింది. వాటిని దంపి ఆ పిండితో అరిసెలు వండటం ఆనవాయితీ. సంక్రాంతికి దాదాపు అందరి ఇళ్ళల్లో ఆ సమయంలో మనకు అరిసెలు కనపడుతాయి.

ఆండాళ్ళు తన మామూలు ధోరణిలో శ్రీరామ కీర్తనలు పాటుకుంటూ కూడా వదిన పడుతున్న ఈ హైరానా గమనిస్తూనే ఉంది.

ఆనాడు రంగరాజన్ తన ప్రవచనంలో హృదయంలో నారాయణుడిని ఎలా మంత్రం సాయంతో నిలబెట్టుకోవాలో చెబుతున్నాడు.

“మనస్సుకు సంతోషమిచ్చేది మంత్రం ఓం నమః నారాయణాయ. ఆ మంత్రం మనలో ఉంటుంది. ఎక్కడో లోపల ఉంటుంది. ఇంటి వెనుకు ఉద్యానవనంలా ఉంటుంది. ఉద్యానవనం వెనక బావిలా ఉంటుంది. ఈ నమః అన్నది దిగుడుబావి. ఆ దిగుడు బావిలో దిగితే కాని మనకు పాప పరిహారం కాదు. నమః లో అర్పణ ఉన్నది. మంత్రమన్న తల్లి, ఆచార్యడన్న తండ్రి మనలను శుభ్రపరుస్తున్నారు. మనము ముక్తి పొందటానికీ ఒక్క నారాయణ మంత్రం చాలు. గోదా తల్లి కూడా అలా నారాయణ మంత్రం పట్టుకు వ్రతం చేసింది…” ఇలా కొనసాగుతోంది కోవెలలో రంగరాజన్ ప్రవచనం. అక్కడ ఉన్న భక్తులు మైమరచి వింటున్నారు.

ఆయన చెబుతున్న విషయం వింటూ తనకు ఆచార్యుల నుండి గ్రహించిన నారాయణ మంత్రాన్ని అనుసంధాన పరుచుకుంటున్నది ఆండాళ్ళు. ఇంతలో ప్రక్కన వదిన లేదన్న విషయం స్ఫురణకొచ్చింది.

ఆమెకు వదిన కోవెలలో కానరాలేదు. మాములుగా వదిన కూడా ఆండాళ్ళు ప్రక్కన కూర్చొని వింటుంది. కీర్తనలను అందుకుంటుంది.

‘ఈ రోజు ఈమే ప్రవర్తన విచిత్రంగా ఉంది’ అనుకుంది ఆండాళ్ళు.

లేచి నెమ్మదిగా వెతుకుతూ ఇంటి లోపలికి వెళ్ళింది.

బావి ప్రక్కన ఉన్న పెద్ద రోటి దగ్గర ఉంది వల్లి.

ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి రోట్లో పచ్చిబియ్యం దంచుతోంది.

“వదినా!” అంటూ వచ్చి “ఏంటి ఈ టైంలో దంపటం? అక్కడ అన్నయ్య ప్రవచం అయిపోవస్తుంటే…” అన్నది.

“వస్తున్నా… నీవు కానివ్వు!” అంది వల్లి బియ్యం లోపలకు తోస్తూ.

దంపుతున్న అమ్మాయి కొద్దిగా ఆపింది.

రోకలి తీసి రోటి ప్రక్కన పెట్టింది. వల్లి దంపిన బియ్యం పిండి తీసి, మళ్ళీ పచ్చి బియ్యం రోట్లో పోసింది.

మళ్ళీ దంచటం మొదలయ్యింది.

దంపుతున్న అమ్మాయిని చూసింది ఆండాళ్ళు. ఆ అమ్మాయి గంధానికి గులాబీరేకులు కలిపిన రంగులో ఉంది. పెద్ద పెద్ద కళ్ళు దింపి రోటి లోకి చూస్తూ దంచుతోంది.

నల్లని పొడవైన జడ, నుదుటి మీద జుట్టు లోంచి చెమట జారుతోంది. పచ్చ కాటన్ పరికిణీ, నీలం వోణి నడుముకు బిగించింది. సుకుమారంగా ఉన్న ఆ అమ్మాయి అలా కష్టపడుతుంటే ఆండాళ్ళు చూడలేకపోయింది.

“ఎవరు వదినా ఈ అమ్మాయి?” అడిగింది ఆమెను కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ.

ఆ మాట ఆ అమ్మాయి తలెత్తి చూసి చిరునవ్వు నవ్వింది. మళ్ళీ పనిలో నిమగ్నమయింది.

“ఈ అమ్మాయి ప్రసన్నలక్ష్మి. మీ రాజన్న కూతురే…” అంది.

“రాజన్న కూతురా?” ఆశ్చర్యపోయింది ఆండాళ్ళు.

రాజన్న ఆండాళ్ళుకు పెద్దనాన్న కొడుకు. పరమ నిష్ఠాగరిష్టుడు. పరుల సాయం తీసుకోడు. దానం తీసుకోడు. అర్చకత్వం చేస్తాడు కాని, దక్షిణలు తీసుకోడు. ఏదైనా ఆహారంగా లభిస్తే తింటాడు లేకపోతే పస్తులు ఉంటాడు.

అతనికి వివాహం కూడా చాలా ఆలస్యంగా జరిగింది. వారు ఉన్న కోవెల కూడా చాలా చిన్నది. ఆదాయం అంతంత మాత్రమే. అయినా రాజన్నకు డబ్బు విషయం పట్టదు. ఆయన వేదాలను సమూలంగా అధ్యయనం చేసిన ఘనాపాఠి. వేదపాఠశాలను నడుపుతాడు. ఆయనకు తెలియకుండా గ్రామస్థులు ఆయన భార్యకు కూరగాయలు, బియ్యం ఇస్తూ ఉంటారు. ఆమే సంగీతం తరగతులు చెబుతుంది.

అసలు రాజన్న సన్యసించాలని అనుకున్నా, పెద్దనాన్న తొలి సంతానమని, పెద్దమ్మ గొడవకు సన్యాసము కాదని వివాహం చేసుకోవలసి వచ్చింది. ఆయనకు ఇద్దరు కుమారులు, తరువాత ఈ ప్రసన్నలక్ష్మి సంతానం.

ప్రసన్నలక్ష్మిని చూడటం ఆండాళ్ళుకు అదే ప్రథమం. ఆశ్చర్యపోయింది. చూస్తూ ఉండిపోయింది.

పిండి దంచటం అయ్యాక, ఆ రోకలి ప్రక్కన పెట్టి, వెళ్ళి, బావి దగ్గర ముఖం కడుక్కొని వచ్చింది ప్రసన్నలక్ష్మి.

వల్లి లేచి, “హమ్మయ్య! అయిపోయింది. పండక్కి చుట్టాలు కూడా వస్తారు. నీవొచ్చి సాయం పట్టావు. మీ అమ్మతో చెప్పు అత్తయ్య వెళ్ళే లోపు రమ్మనమని. టీ ఇస్తాను త్రాగి వెళ్ళు. అన్న వస్తాడు. వాడు దింపుతాడు ఉండు…” అని లోపలికి వెళ్ళింది.

అరుగు మీద కూర్చుంది లక్ష్మి.

“ఏం చదువుతున్నావమ్మా?” అడిగింది ఆండాళ్ళు.

“పది వరకు చదినానత్తయ్య. ఇంక చాలన్నాడు నాన్న. ఆపేశాను…” అన్నదామె. చేతికున్న మట్టిగాజులు సర్దుకుంటూ.

“సంగీతమొచ్చా?” అడిగింది ఆండాళ్ళు.

“వచ్చు అత్తయ్యా. అమ్మ సంగీతం క్లాసులు ఇప్పుడు నేనూ నేర్పుతాను. కాని పెద్దగా నేర్చుకునేవారే లేరు. ఏదో పది మంది వరకూ వస్తారు…”

“అవునా. శ్రీవ్రతం చేస్తావామ్మా…” (ధనుర్మాసవ్రతాన్ని శ్రీవ్రతమని వాడుకగా అంటారు. పెళ్ళి కాని పిల్లలు చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం).

“చేస్తున్నా నత్తయ్యా…”

ఇంతలో టీ తో వచ్చింది వల్లి.

ముగ్గురూ టీ త్రాగుతుండగా “మీ అన్నయ్యకు ఇష్టం ఉండదు లక్ష్మి చేత పనులు చేయించటం. అందుకే ఆయన కోవెలలో ఉన్న సమయం రమ్మంటాను దీన్ని. నాకూ కొంత సాయం కావాలంటే వచ్చి చేసి వెడుతుంది పాపం. పిచ్చి పిల్ల ఎప్పుడూ కాదనదు…” అన్నది వల్లి.

“సంగీతం తరగతులు తీసుకుంటుదట కదా…”

“అవును! మంచి స్వరం దీనిది. పాడవే ఒక పాట. అత్తయ్య వింటుంది…” అంది వల్లి.

టీ త్రాగటం అయ్యాక ‘రంగ పుర విహారా…’ అన్న కీర్తన పాడింది లక్ష్మి.

ఆమె స్వరానికి హృదయాంతరాళలలో కదలికలు కలిగాయి ఆండాళ్ళుకు.

ఇంతలో కోవెలలో గంటలు వినిపించాయి. హరతి సమయం అని ముగ్గురు లేచి వెళ్ళారు.

కోదండరామునికి సాయంత్రపు హారతి నిచ్చి హరతి తదనంతరం శయనించటానికి జోల పాడారంతా…

కోవెల నుంచి బయటకు వచ్చాక సౌందర్యరాజన్‌ను పిలచి లక్ష్మిని దించి రమ్మంది వల్లి.

అతను తన బండి మీద ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here