ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి – 9

1
3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap]దిలక్ష్మి అనుకున్నట్టే అందరూ కుటుంబాలతో సహా దిగారు. తల్లి పరిస్థితులను ముందుగా అంచనా వేసినందుకు రవళి ఆశ్చర్యపోయింది. స్నేహకు మాత్రం సంతోషంగా ఉంది.

“మేడమీద గదులు వేస్తున్నారెందుకు వదినా రవళికి పెళ్ళి చేసేద్దామనా?” అడిగాడు పెద్దమరిది.

“లేదు… లేదు… ఇల్లు సరిపోవడం లేదు. అందుకని గదులు వేస్తున్నారు”

“ఇల్లంతా ఇసుకా, సిమెంటు. ఇంతకు ముందు ఇక్కడికి వస్తే డాబామీద పరుపులు పరుచుకు పడుకునేవాళ్ళం. ఇప్పుడక్కడ చోటు లేదు. కింద వాకిట్లో పడుకుందామంటే మనందరికీ మంచాలు సరిపోవు” అంది రవళి మేనత్త.

‘అసలు అందరినీ కట్టకట్టుకుని ఒకేసారి ఎవరు రమ్మన్నారు’ అనాలనిపించింది ఆదిలక్ష్మికి. నిజానికి తండ్రిని పాము కరిచింది అనే సానుభూతి కంటే వాళ్ళను చూడకపోతే ఎవరేమనుకుంటారో అనే బెంగే ఎక్కువగా వుంది అందరికీ.

ఈ హడావిడిలో సంహితకు ఉత్తరం వ్రాయాలన్న ఆలోచన రాలేదు రవళికి. ‘పోస్ట్’ – వీధి గేటు దగ్గర నిలబడి పిల్లలందరికీ ఐస్‍ఫ్రూట్ కొనుక్కుంటున్నందుకు డబ్బులిస్తున్న స్నేహ ఉత్తరం తీసుకుంది. ఆ వుత్తరం రవళికి. ఆమె నిశ్శబ్దంగా దాన్ని పట్టుకెళ్ళి రవళి పుస్తకాల్లో పెట్టింది.

“అక్కా! నీ ఇంగ్లీషు నాన్ డీటెయిల్డ్ బుక్ ఇవ్వు. అందులో స్టోరీ చదివి అర్థం చేసుకోమన్నావ్‍గా” అంది స్నేహ.

“అబ్బా నేను ఇచ్చేదేమిటి నా పుస్తకాలు నీకు తెలియవా?” అంది రవళి బాబయ్ పిల్లలతో కేరమ్స్ ఆడుతూ.

“కాదులే నేను తీస్తే నీ పుస్తకాలు అటూ ఇటూ చేశానంటావ్. నువ్వే యివ్వు.”

“అబ్బా పట్టుకుంటే వదలవు కదా!” అంటూ లేచింది రవళి.

స్నేహ ఆమె వెనుకే వెళ్ళి తనే బుక్ తీసిచ్చింది అక్కకు. అందులో సంహిత రాసిన ఉత్తరం. ఆమెకు ఒక్కసారి ఆనందం వెల్లువలా ముంచెత్తింది. ఈ బంధువులు వాళ్ళ మాటలనే ముళ్ళు గుచ్చుకుంటుంటే సంహిత ఉత్తరం ఒక మెత్తటి పువ్వులా తాకింది. ఛ… తనసలు సంహితకు నిజమైన ఫ్రెండే కాదు. తను వూరికి వెళ్ళినా ఈ స్నేహితురాలికి మరిచిపోలేదు. ఆ… నీకు బంధువులొచ్చారులే అంది మనసు ఆమెను సమర్థిస్తున్నట్టు. సంహిత మాత్రం కొత్త ప్రదేశం, కొత్త చుట్టాలు… లాంటి వాతావరణంలో ఈ రవళి అనే చిన్న స్నేహితురాలిని మరిచిపోలేదు.

ఆమె అక్కడే ఉత్తరం చదవబోతే “ఇక్కడ వద్దక్కా మేడమీదకు వెళ్ళు.” అంది స్నేహ.

రవళి ఉత్తరం తీసుకు మేడమీదకు వెళ్ళింది. కొత్తగా కట్టిన గదులు చల్లగా వున్నాయి. రవళి కళ్ళు ఉత్తరంలో అక్షరాల వెంబడి పరుగెత్తాయి. అందులో యిలా వుంది.

రవళి!

ఎలా వున్నావ్? నేనిక్కడ వున్నానే గానీ నా మనసు నీ చుట్టూ తిరుగుతోంది. ఈ టైముకి నిద్రలేచి వుంటావు. ఈ టైముకి భోజనం చేస్తూ వుంటావు. ఇలా… మన పరిచయమైన తర్వాత వచ్చిన ఎక్కువ శలవు రోజులివి. నేను కూడా అక్కడే వుండి నీతో హాలిడేస్ ఎంజాయ్ చెయ్యాల్సింది. దసరా, సంక్రాంతి శలవుల్లో కూడా మన స్కూలు వాళ్ళు పెట్టిన ప్రైవేటు క్లాసుల వల్ల కలుస్తుండే వాళ్ళం. ఇప్పుడు శలవులు ఇవ్వగానే నేనిటు వచ్చేశాను.

మా పిన్నీ, పిల్లలు నిన్ను తీసుకురాలేదేం అని అడిగారు. నిజమే నీకు ముందుగా చెప్పి మాతో పాటు నీకు టిక్కెట్ కొంటే సరిపోయేది. ఇక్కడ రెండు హింది సినిమాలు చూశాను, ఏదో వున్నాయి. సాయంత్రం టాంక్‌బండ్ మీదకు వెడదాం అంటున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు ఎలా వుందో చూడాలి.

అన్నట్టు మా అన్నయ్య నువ్వు పరీక్షలు ఎలా రాశావని అడిగాడు. ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అని చెప్పాను. మా అందరికీ నువ్వంటే ఎంత అభిమానమో చూడు. నువ్వేమో నాకు ఉత్తరమే రాయలేదు.”

రవళి ఉలికిపడి మళ్ళీ ఉత్తరం చదవసాగింది.

“అయినా ఊరికి వెళ్ళినవాళ్ళే ఉత్తరం రాయడం పద్ధతి కాబట్టి నేనే రాస్తున్నాను. ఆ… ఇంతకీ నా ఎడ్రస్ జాగ్రత్త పెట్టావుగా ఈ ఉత్తరం అందగానే విశేషాలతో ఉత్తరం వ్రాయి. అమ్మానాన్న గారికి అన్నకు నా నమస్కారాలు అందజేయి. స్నేహకు ఆశీస్సులు.

ఎప్పటికీ నీ స్నేహితురాలు

సంహిత

రవళికి వచ్చిన మొదటి ఉత్తరం. సంహిత ఎంత బాగా రాసింది. అయిదు నిమిషాలు చూసిన తనను వాళ్ళ పిన్ని, చెల్లెళ్ళు, అన్న మర్చిపోలేదు. తల్లికి, తండ్రికి వాళ్ళ తోబుట్టువులో, సన్నిహితులో ఉత్తరాలు రాస్తుంటారు. వాటినిండా నిందలు, నిష్ఠూరాలు. సంహిత ఉత్తరంలో తనపై అణువణువున ప్రేమ, అభిమానం. సంహితకు వెంటనే మంచి ఉత్తరం రాయాలి. ఆ ఉత్తరాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది రవళి. ఆమె మనసు సంహిత చుట్టూ తిరుగుతోంది.

“సంహిత ఏం రాసిందక్కా ఉత్తరంలో” స్నేహ అడిగింది. చెప్పింది రవళి.

“అమ్మో నువ్వు సంహితతో హైదరాబాద్‍కా మనింట్లో పంపిస్తారంటావా?”

“వాళ్ళు పంపించరు, నేను వెళ్ళను. కానీ వాళ్ల అభిమానం. దానికి మనం సంతోషించాలి.”

“ఆ మాట నిజమేలే. మన పెద్ద మామయ్యా వాళ్ళు బొంబాయిలో వున్నారు ఒక్కసారైనా మనని పిలుచుకువెళ్ళారా? అత్త విజయవాడలో వుంటుంది మనల్ని పిలిచిందా?” అంది స్నేహ.

“అబ్బా ఊరుకోవే, ఎవరైనా వింటే బాగుండదు. ఆ… నీ దగ్గర ఇన్‍లాండ్ కవరు వుందా” అడిగింది రవళి.

“లేదక్కా మొన్న కొన్న యాభై కవర్లు నా అభిమానులకు ఉత్తరాలు రాసేశాను.”

“ఏమిటే ఆ పిచ్చిమాటలు. నువ్వేదో సినిమా స్టార్‍వి అయినట్టు”

“లేకపోతే ఏమిటక్కా, నేనెవరికి ఉత్తరాలు రాస్తాను? నాన్నగారి టేబుల్ సొరుగులో కవర్లు, కార్డులు, స్టాంపులు వుంటాయి. ఒకటి తీసుకో. ఆ… అన్నట్టు సంహిత, నీరజ వచ్చినరోజు తనకి నువ్వు మన ఎడ్రస్ యిచ్చావా?”

“లేదే”

“మరి తను అంత కరెక్ట్‌గా వుత్తరంపై ఎడ్రస్ ఎలా రాసింది” అడిగింది స్నేహ.

“ఏమో”. ఇద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. మాటలు మరిచిపోయినట్టుగా ఇద్దరూ అలానే కూర్చున్నారు.

“ఏయ్ రవళి, స్నేహ ఎక్కడున్నారు? ఇలా వచ్చి ఈ కాఫీలు అందరికీ ఇవ్వండీ” అంది ఆదిలక్ష్మి.

“పాము కరిచింది తాతగారికైతే మిగతావాళ్లందరూ మనింటికి వచ్చి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు” అంది స్నేహ.

“ఉష్… వాళ్ళు వింటే బాగుండదు. పద కాఫీలు యిద్దాం” అని లేచింది రవళి.

పెద్దవాళ్లందరికీ కాఫీలు, పిల్లలందరికీ బోర్నవిటా ఇచ్చాక, అన్నయ్య రవి కాఫీ గ్లాసు అలానే వుండిపోయింది. ఆమె కిందిగదుల్లో చూసి అక్కడ లేకపోయేసరికి మేడమీదకు వెళ్ళింది.

ఆమె వచ్చిన అలికిడికి చప్పున తడబాటుగా లేచి నిలబడ్డారు రవి, మామయ్య కూతురు శ్రావణి.

“శ్రావణీ! నువ్వు ఇక్కడే వున్నావా అది తెలియక నేను నీకు కాఫీ తేలేదు అన్నయ్యా ఇదుగో నీ కాఫీ” ఇచ్చేసి వెళ్ళిపోయింది రవళి కిందికి.

కజిన్స్ మాట్లాడుకోవడం కొత్తేమీ కాదు. వాళ్ళిద్దరు మాత్రమే మేడమీద కూర్చుని మాట్లాడుకోవలసిన అవసరం ఏముంది? రవళికెందుకో అసంతృప్తిగా అనిపించింది.

***

సంహితా!

నీ ఉత్తరం అందింది. మర్చిపోకుండా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషం అనిపించింది. పరిస్థితులు మామూలుగా వుంటే నేనే నీకు రాసేదాన్ని. తాతగారికి పల్లెటూరిలో పొలానికి వెళ్ళినప్పుడు పాము కరిచింది. ఆయనను, బామ్మగారిని వెంటనే మా యింటికి తీసుకువచ్చేశారు. ఇంక ఆయనను చూడటానికి బాబయ్‍లు, అత్త, మామయ్యలు ఇలా అందరూ వచ్చారు. ఈ ఉత్తరం కూడా ఎవరూ చూడకుండా అందరూ నిద్రపోయాక రాత్రి పదకొండు గంటలకు రాస్తున్నాను.

మీ వాళ్ళందరూ నీతోపాటు నేను హైదరాబాద్ రాలేదేమని అడిగారని రాశావు. నీలాగే వాళ్ళు స్నేహశీలురు. మనిద్దరం ఎం.బి.బి.యస్. హైదరాబాద్‍లో చదివితే ఎలా వుంటుంది? ఆ ఊహే ఎంత బాగుందో. నాకు టెన్త్ ఫస్ట్ క్లాస్ వస్తుందనే నీ నమ్మకానికి నా థ్యాంక్స్. నిజంగా అలా మనిద్దరం ఫస్ట్ క్లాసులో పాసయ్యి మెడిసిన్‍లో కూడా కలిసి చేరితే స్నేహంతో చదువులు పాడు చేసుకుంటారు అనుకునే మన టీచర్లు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఏమంటావ్? నువ్వు మద్రాసు వెళ్ళేముందు తెలియజెయ్యి, నేను ఉత్తరం రాయను. సినిమాల్లో తరుచూ చూపించే ఊటీ ప్రత్యక్షంగా ఎలా వుంటుందో చూసిరా. ఆ రోజు నువ్వు మా యింట్లో గులాబీలు పట్టుకు నిలబడడమే గుర్తుకు వస్తోంది. ఆ… అన్నట్టు మా యింటి ఎడ్రస్ నీకెలా తెలిసింది. మా స్నేహకు, నాకూ ఒకటే ఆశ్చర్యం. అమ్మగారికీ పిన్నిగారికీ నా నమస్కారాలు తెలియజెయ్యి. కావ్య, మమతలకు నా ఆశీస్సులు. అంతవరకూ ఆగకుండా రాసిన రవళి కలం ఆగిపోయింది. వాళ్ళ నాన్నగారికి, బాబాయ్‍గారికి అన్నకు నమస్కారాలు రాయాలా… వద్దు మగవాళ్ళ సంగతి మనకెందుకు. రవళి ఉత్తరం ముగించి ఎడ్రస్ రాసి మర్నాడు పోస్ట్ చేసింది.

***

సంహిత రవళి రాసిన ఉత్తరాన్ని చదివి నవ్వుకుంది. ఆమెకు ఆ ఉత్తరం ఎవరో చిన్నపిల్లలు రాసినట్టుగా అనిపించింది. ఎం.బి.బి.యస్. చదువా… అందులోనూ హైదరాబాద్‍లో ఎంత ఖర్చు, ఎంత శ్రమ. అదంతా తనవల్ల కాదు. కాలేజి లైఫ్ అంటే ఎంజాయ్‍మెంట్ వుండాలి. బండెడు పుస్తకాలు మోస్తూ చదువే జీవితంగా తను బ్రతకలేదు. అయినా అమ్మ, పిన్ని ఇద్దరూ హైస్కూలు వరకే చదివారు. వాళ్ళ జీవితాలకేం లోటు వచ్చింది. ఇద్దరూ గవర్నమెంట్ ఆఫీసర్లని పెళ్ళాడి హాయిగా వున్నారు. తన అందానికి ఏ పెద్ద ఆఫీసరో, బిజినెస్‍మేనో వచ్చి పెళ్ళి చేసుకుంటాడు. సాయంత్రాలు ఏ పార్కుకో, సినిమాకో, ఇంకే కల్చరల్ ప్రోగ్రాంకో వెళ్ళకుండా డాక్టరై మనుషుల రోగాలు, బాధలూ వినాలా? బాబోయ్ తనవల్ల కాదు. రవళిని కూడా ఈ మెడిసిన్ పిచ్చి నుంచి తప్పించి ఏ మామూలు కోర్సో చదవమనాలి. సంహిత స్నేహితురాలు సంహిత కంటే మంచి కోర్స్ చదవడమా… జరగని పని. ఆమె వెంటనే రవళికి ఉత్తరం రాసింది.

ప్రియమైన రవళి!

నీ ఉత్తరం నా చేతులను కాదు నా మనసును తాకింది. ఎదురుగా నిలిచి నువ్వే మాట్లాడుతున్నట్టుగా వుంది నీ ఉత్తరం. చుట్టాలకు సేవ చేస్తూ తరిస్తున్నావన్నమాట. మొన్న టాంక్‍బండ్ వెళ్ళాము. ఆ చల్లగాలికి అసలు ఇంటికి రావాలనిపించలేదు. ఇంతలో కాస్త చీకటి పడుతుంది. ఇంతలో దూరం నుంచి ఎవరో అమ్మాయి. పరికిణీ, ఓణిలో. చెప్పొద్దు ఒక్కసారి నా గుండె వేగంగా కొట్టుకున్నట్టు అయింది. నువ్వే అనుకున్నాను దగ్గరకొస్తే నువ్వు కాదు, కానీ ఆ భ్రమ నిజమైతే ఎంత బాగుండేది. నువ్వూ, నేను ఇక్కడే మెడిసిన్ చదవడానికి ఇది ఒక శుభసూచకం. ఏమంటావ్…. ఇంక మీ ఇంటి అడ్రస్ ఎలా దొరికిందంటావ్… మరి సంహిత అంటే ఏమనుకున్నావ్ జేమ్స్ బాండ్000 హ… హ… నేను మద్రాసు వెడితే నువ్వు ఉత్తరాలు మానేయడం ఎందుకు. ఆ ఎడ్రస్ ఇస్తాను సరేనా….

నీ స్నేహితురాలు

సంహిత

మనసులో ఒకటి ఆలోచిస్తూ, బయటికి ఒకటి మాట్లాడే మనుషులు మనదగ్గరే వుంటారు. అది గ్రహించకపోవడం రవళి దురదృష్టం.

ఆ రోజు రవళి యింట్లో బంధువులందరూ బయలుదేరుతున్నారు. జగన్నాధం దంపతులు మాటవరసకి కూడా ఎవరినీ ఇంకో నాలుగురోజులు ఉండమనలేదు. రవళి బాబయ్ లిద్దరూ మధ్యలో ఎవరి వూళ్ళకు వాళ్ళు వెళ్ళారు. ఆడవాళ్ళు పిల్లలూ ఇక్కడే వున్నారు. పెదబాబాయ్ విశాఖలో షిప్ యార్డ్‌లో పనిచేస్తాడు. అతను తల్లిని, తండ్రినీ తనతోపాటు విశాఖ తీసుకు వెళదామనుకుంటున్నాడు. అతని స్నేహితుడికి అరకులో ఇల్లుంది. ఈ వేసవిలో చల్లదనం కోసం పెద్దవాళ్ళిద్దరినీ పదిరోజులైనా ఆ యింటిలో వుంచాలని అతని ఆలోచన. పెద్దవాళ్ళిద్దరే వుండలేరు కాబట్టి వారికి తోడుగా తన కుటుంబం. ఈ ప్లానంతా విన్న స్నేహ కళ్ళు మెరిశాయి.

“మనం కూడా అరకు వెళదామమ్మా” అంది తల్లి దగ్గర చేరి.

“నిన్నూ, నన్నూ ఎవరు పిలిచారు. నిన్ను తీసుకువెళ్ళమని వాళ్లని అడిగావా?” అంది ఆదిలక్ష్మి.

“ఛీ…. వాళ్ళని అలా అడుగుతానా అమ్మా. మాకు శలవులు అయిపోతే ఎటూ వెళ్ళలేం. అరకు చూడలేదుగా అందుకు అంటున్నాను.”

“ఇప్పుడు మనం వెడితే వాళ్ళ వెంట పడిపోయినట్టుగా వుంటుంది. తర్వాత చూద్దాంలే.”

“ఏమిటొదినా ఏదో చూద్దాంలే అంటున్నావ్ ఏ విషయం” అంది రవళి మేనత్త కుమారి.

“ఏం లేదు కుమారి, స్నేహ సినిమాకి వెడదామంటేను”

“అవును పాపం పిల్లలకు శలవుల్లో ఏమి తోచదు. పోనీ మా ఊరికి తీసుకువెడదామన్నా విజయవాడ ఎండలు అలవాటైన మేమే భరించలేము. మీరు అసలు ఆ వూళ్ళో వుండలేరు.”

మన సంభాషణ విన్నదేమో అన్నట్టూ తల్లీ కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు. మొత్తానికి ఆ సాయంత్రం ఇల్లు ఖాళీ అయిపోయింది. కుమారి తన మనసు మార్చుకుని అమ్మా నాన్నలతో అరకు వెళ్ళింది పిల్లల్లిద్దరినీ తీసుకుని. ఆ మర్నాటి ఉదయం ఆదిలక్ష్మి ఇల్లు సర్దడం మొదలుపెట్టింది.

“ఈ ఇల్లు సర్దుతుంటేనే అంతంత మాత్రం. అందులో పదిహేనురోజులై ఇల్లు అడవిలా తయారయింది. ఒరేయ్ రవి నువ్వు పొడుగ్గా వుంటావు. ఈ బూజు కర్రను తీసుకుని ఇల్లు దులుపు, నేనూ ఆడపిల్లలు సామాన్లు సర్దుతాం.”

“అబ్బా ఏమిటమ్మా ఇప్పుడే పండగా లేదుగా ఎందుకీ పనులన్నీ”

“ఎందుకా ఏమి తోచక… వచ్చే చుట్టాలు ఒక దుప్పటి ముక్కైనా తెచ్చుకోరు. అన్ని బట్టలు మాసిపోయాయి. నువ్వు వెంటనే వెళ్ళి చాకలి సీతమ్మను తీసుకుని రా.”

రవికి ఏ పనీ చేయాలని లేదు. కానీ వెళ్లనంటే తల్లే సీతమ్మ యింటికి వెళ్ళేంత ఆవేశంలో వుంది. రవి సైకిలు వేసుకుని బయలుదేరాడు. అందరూ ఇల్లంతా దులిపి, శుభ్రం చేసేటప్పటికి అందరికీ నీరసం వచ్చేసింది. ఈ పనిలో పడి ఆదిలక్ష్మి వంట చేయడం కూడా మరిచిపోయింది. జగన్నాధం గారు ఊళ్ళో లేరు. వాళ్ళ ఆఫీసులో వాళ్ళబ్బాయి పెళ్ళంటే వెళ్ళారు. రవిని మళ్ళీ హోటలుకు పంపించి భోజనం తెప్పించింది ఆదిలక్ష్మి. అందరూ తిన్నారు. కానీ ఎవరికీ నచ్చలేదు హోటల్ భోజనం. ఆ సామాన్లు అన్నీ సర్దేటప్పుడే రవళి లైబ్రరీ నుండి తెచ్చిన బుక్స్ కనపడ్దాయి. అవి తెచ్చి ఇరవై రోజులు అయింది. చదవడం కాదు కదా ఆ పుస్తకాలను ఆనాడు చూశారు. మళ్ళీ ఈనాడు చూస్తున్నారు.

“రవళీ! రేపు లైబ్రరీలో ఈ బుక్స్ ఇచ్చి కొత్తవి తీసుకురా, వీటికి ఫైన్ పడుతుందేమో” అంది ఆదిలక్ష్మి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here