సాగర ద్వీపంలో సాహస వీరులు-13

0
4

[box type=’note’fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]మ[/dropcap]ధ్యాహ్న భోజన సమయానికి సెలయేరు ఉన్న ప్రాంతంలో విడిది చేసారు. తమ వెంటతెచ్చిన పండ్లు అన్ని అందరికి పంచాడు శివన్న.

“ఓ శివన్నో ‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’. అందరికి పండ్లు పంచావు. మరి కోతిబావకు, నాకు ఏవి? ‘వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలోకూర్చున్న లడ్డు పడుద్ది’ కదా” అన్నాడు ఇకఇక.

శివన్న నవ్వుతూ పండ్ల మూటలోనుండి రెండు దోరమాగిన జామ కాయలు తీసి కోతిబావకు అందించాడు.

“ఎవర్రా అది హద్దుమీరి మా సీమలోకి వచ్చింది? ప్రాణాలతో తిరిగి వెళ్ళగలరా?” అంటూ ఇద్దరు బలాడ్యులు వచ్చారు.

“అయ్య నేను అంగ దేశ రాజకుమారుడిని, వీళ్ళంతా నా సహచరులు. ఒక పనిమీద వెళుతూ ఈ సీమలో ప్రవేశించాము. మా వలన మీ సీమకు ఎటువంటి ఆపదా రాదు. కొంతసేపు సేదతీరి మాదారిన మేము వెళ్ళిపోతాము”అన్నాడు విజయుడు.

“కుదరదు. ఈ సీమలోనికి వచ్చిన వారికి మరణమే శిక్ష” అని ఓ దృఢకాయుడు విజయునిపైకి తన రాతిగదతో వచ్చాడు.

కత్తి దూసిన విజయుడు వాడి గద దెబ్బను తప్పించుకుంటూ వాడిని తన కత్తితో గాయపరచసాగాడు.

మరో దృఢకాయునితో జయంతుడు పోరాటం చేయసాగాడు.

కొద్దిసేపటికి ఒళ్ళంతా గాయాలైన దృఢకాయులు ఇరువురు తమ ఆయుధాలు వదిలి “అయ్యా మేము అలసిపోయాము, ఓడిపోయాము. మమ్మలను ప్రాణాలతో వదలండి” అని వేడుకున్నారు.

“అరే, మీరు మా మనుషుల్లా ప్రవర్తిస్తున్నారే. ‘అందితే జుట్టు అందకుంటే కాళ్ళు’ అని దీన్నే అంటారు. ‘ఓ దారిన పొయ్యేదానా కాసేపు మా భూజాన ఉండి పో’ అన్నాడట వెనకటికి ఒకడు. ‘భలే భలే” అన్నాడు ఇకఇక.

“శరణార్థులను, అలసిపోయినవారిని, యుధ్ధంలో గాయపడినవారిని, వెన్ను చూపినవారిని వదిలివేయడం వీరుల ధర్మం. వెళ్ళండి” అన్నాడు విజయుడు.

“తెలుసుకున్నారుగా వెళ్ళండి. ‘ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు’ -‘అనువు కాని చోట అధికులము అనరాదు’. వెళ్ళండి” అన్నాడు ఇకఇక.

దృఢకాయులు ఇరువురు ఒకరు ఒకరు ఆసరాగా కుంటుకుంటూ వెళ్ళిపోయారు.

జయంతునికి, విజయునికి అయిన స్వల్పగాయాలకు ఆకు పసరు పూసాడు జగ్గు.

కొంతసమయం విశ్రాంతి పొందాక తమ ప్రయాణం కొనసాగించారు అంతా.

రాత్రికి అడవిలో చదునుగా ఉన్న ప్రదేశంలో విశ్రాంతికి ఆగారు. నెగళ్ళు మండుతుండగా కొందరు వంతుల వారిగా కావలి కాయసాగారు.

“అయ్యలు దూరంగా గుర్రాల సకిలింపు వినిపిస్తుంది. ఎవరో దొంగలు వస్తున్నారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏంలాభం?’. ముందుజాగ్రత్తలో మనం ఉండాలి, లేకుంటే ‘గోరుచుట్టుపై రోకలి పోటు’లా మనం ఉండే సమస్యలలో మనం ఉండగా, మధ్యలో వీళ్ళగోల ఒకటి” అన్నాడు ఇకఇక.

అంతా సిధ్ధంగా ఉండే సరికి, గుర్రాలపై కొందరు వచ్చి విజయుని బృందంపై దాడిచేసారు.

ఇకఇక హెచ్చరికతో సిధ్ధంగా ఉన్న విజయుని బృందం సమర్థవంతంగా వారిని ఎదుర్కొంది. కొద్దిసేపటి పోరాటంలో దొంగలను తరిమి కొట్టింది విజయుని బృందం.

గుర్రాలను వదలి ప్రాణభయంతో పరుగులు తీసారు దొంగలు.

అప్పటికే తెల్లవారి పోవడంతో దొంగలు వదలివెళ్ళిన గుర్రాలపై తమ సరంజామా అంతా సర్దుకుని బయలుదేరింది విజయుని బృందం.

మధ్యాహ్న భోజనసమయానికి భైరవకోనకు బయలుదేరారు.

“నాయకా, ఈ చెట్టు ఆకుల పసరు పూస్తే ఎటువంటి గాయాలనైనా రెండురోజుల్లో తగ్గిపోతాయి.” అని చెట్టు ఆకులను తుంచి తన భూజాన ఉన్నజోలెలో వేయస్తు కొద్దిగా అవతలి భాగానికి వెళ్ళాడు జగ్గు. ఆ పరిసరాలలోని మొక్కతీగలు ఒక్కసారిగా దాడిచేసి అతడిని బంధించాయి.

కత్తి చేతపట్టి జగ్గుకు చేరువగా వెళ్ళిన జయంతుని కూడా తృటికాలంలో బంధించాయి ఆ మొక్కల తీగలు.

విషయం గ్రహించిన విజయుడు అర్ధచంద్రాకారపు బాణాలు వదలి ఆ మొక్కల మొదలు తెగవేసాడు. మొక్క మొదలు తెగడంతో జగ్గు, జయంతుడు బంధ విముక్తులు అయ్యారు.

“ఓర్ని ఈ అడవిలో రాక్షసులు, దొంగలతోపాటు మొక్కలు కూడా ప్రమాదకరమైనవే! ‘గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా’ ఉంది నా పరిస్ధితి. ఇక్కడ మనం ఇన్నిబాధలు పడుతున్నాం. అక్కడ నా భార్య ఎన్నిబాధలు పడుతుందో కదా!” అనుకున్నాడు ఇకఇక.

“జయంతా ఈ ప్రయాణంలో అనుక్షణం మనం అప్రమత్తులమై ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మనం తగుమూల్యం చెల్లించవలసి ఉంటుంది. మన వాళ్ళందరిని రక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉంది” అన్నాడు విజయుడు.

“నిజమే మిత్రమా. మనల్ని నమ్మివచ్చిన ఇంతమందిని క్షేమంగా వారి గూడేలకు చేర్చాలి. అది మన బాధ్యత కూడా!” అన్నాడు జయంతుడు.

అందరు ఒక పెద్దచెట్టు కింద చేరి భోజనం చేసి విశ్రాంతి తీసుకోసాగరు.

“చిలుక తమ్ముడూ, అందరం హాయిగా నవ్వుకునేలా మంచి హాస్య కథ చెప్పవా?” అన్నాడు శివన్న.

“కథ చెపితే నాకేంటి లాభం?” అన్నాడు ఇకఇక.

“నీ భార్య బెకబెకను వెదికిపెడితే మాకేంటి లాభం?” అన్నాడుశివన్న.

“ఓహో నువ్వు అట్లా వచ్చావా శివన్నా, నువ్వు తెలివైన వాడవే. ‘గుడ్డికన్నా మెల్ల మేలుకదా!’. ఒంటరిగా నా భార్యను వెదకబోయి ప్రమాదంలో చిక్కుకున్నా. సరే కథ పేరు ‘గిలిగాడు వచ్చె- పులిగాడు చచ్చె’. కథ వినండి. ఒక అరణ్యంలో సింహరాజు అరణ్య సరిహద్దుల పరిశీలనకు వెళుతూ, పులిరాజును వారం రోజులు రాజుగా నియమించాడు. అడవిలోని జంతువుల పిల్లలు అందరిని సాయంత్రం ఒకచోటచేర్చి కథ చెప్పసాగాడు నక్కమామ. “పిల్లలు అల్లరి చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు చెప్పబోతున్న విషయం కథ కాదు నిజంగా జరిగింది. ప్రతి అమావాస్యరోజు గిలిగాడు తన భుజానికి పేలుడు పదార్ధాల సంచి తగిలించుకుని అడవిలో తిరుగుతుంటాడు. దొరికిన ప్రాణి ఏదైనా అది పులి కావచ్చు, సింహం కావచ్చు, ఏనుగైనా సరే బంధించి చురకత్తితో కోసి తింటాడు” అన్నాడు నక్క.

“నక్కమామా గిలిగాడు ఎలా ఉంటాడో చెప్పు” అన్నది భయంగా కుందేలు పిల్ల.

“ఎవరికి తెలుసు మా అమ్మమ్మ మా అమ్మకు చెప్పింది, మా అమ్మనాకు చెప్పింది. అది నేను మీకు చెపుతున్నా. అయిన ఇటువంటి విషయాలు మావంటి పెద్దవాళ్ళు చెపుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, అడ్డమైన ప్రశ్నలు అడగకూడదు. జాగ్రత్త ఈ రోజు అమావాస్య. గిలిగాడు వేటకు వస్తాడు, చీకటిపడకముందే ఇంటికి వెళ్ళండి” అన్నాడు.

అప్పటివరకు ఊపిరిబిగపట్టి బిగుసుకుపోయిన పిల్ల జంతువులన్ని ఏడుస్తూ భయంతో ఇళ్ళకు పరుగులు తీసాయి. నక్కమామ పక్కనే ఉన్న తన బొరియ (ఇల్లు)లో నవ్వుకుంటూ దూరాడు. చెట్టుచాటునుండి నక్కమామ మాటలు విన్న పిరికి పులిరాజు భయంతో నేల తడిపాడు.

ఇంతలో వచ్చిన కోతిబావను చూసిన పులిరాజు “ఏయ్ కోతి ఈరోజు గిలిగాడు వేటాడటానికి అడవిలోనికి వస్తాడట. నువ్వు – నేను నిద్రపోయే గుహకి కావలి కాయాలి!” అన్నాడు తన భయం కోతికి కనపడకుండా.

“ప్రభు నేను ఎప్పుడు చెట్టుపైనే నిద్రిస్తాను. అటువంటిది గుహముందు నేలపైన నిద్ర రాదు” అన్నాడు వినయంగా.

“కావలి కాయమంటే నిద్ర పోతానంటున్నావు. ఒళ్ళెలా ఉంది?” అన్నాడు పులిరాజు.

“అలాగే ప్రభూ” అని పులిరాజు గుహకు చెరుకున్నారు. “ప్రభూ తమరు హాయిగా నిద్రపొండి. నేను గుహ ముందు భాగాన తమకు గిలిగాడి దాడి జరగకుండా కావలి ఉంటాను” అన్నాడు కోతిబావ.

“నీ తెలివి తేటలు నా వద్దనా? నేను నిద్రపోగానే చల్లగా జారుకోవడానికా?” అని, అందుబాటు లోని కొన్ని అడవి తీగలు అందుకుని కోతి తోక చివరిభాగాన్ని, తన తోక చివరిభాగంతో గట్టిగా ముడివేసి ధైర్యంగా నిద్రపోయాడు పులిరాజు.

అర్ధరాత్రి దాటాక కుందేళ్ళను వేటాడుతరతున్న వేటగాళ్ళు పేలుడు పదార్ధాలు పేల్చడంతో ‘ఢాం’-‘ డాం’ అని శబ్ధం వినిపించగా వినిపించడంతో అదిరిపడిన పులిరాజు గిలిగాడు తనకోసమే వచ్చాడని భయంతో తుపాకిమోత వినిపించిన దిశకి వ్యతిరేకంగా పరుగు లంకించుకున్నాడు.

తోకలు ముడిపడి ఉండటంతో నిద్రపోతున్న కోతిబావను కూడా ఈడ్చుకు పోసాగాడు. భయంతో ఏం చెయాలో తెలియని కోతిబావ “ఓరి నీ భయంపాడు గాను ఆగరా సామి” అన్నాడు నేలపైనుండి ప్రాణభయంతో పరిగెత్తే పులిరాజుతో కోతిబావ. ఇవేమి వినిపించుకునే స్ధితిలో లేడు పులిరాజు. ఒళ్ళంతా గీరుకుపోయిన కోతిబావ ఎగిరి పులిరాజు పైన కూర్చొని కిందపడిపోకుండా పట్టుకోసం పులిరాజు రెండుచెవులు గట్టిగా పట్టుకున్నాడు.

అసలే భయంతో సగం చచ్చిన పులిరాజు ఆ సంఘటనతో మరింత భయపడి “నేను కాదు నాకేం తెలియదు నన్నువదిలేయిరా గిలిగా!” అన్నాడు. గిలిగాడే తనపై కూర్చొని తన చెవులు పట్టుకున్నాడని భయంతో మరింత పరుగు వేగం పెంచాడు. నానాబాధలు పడి తోక ఊడదీసుకున్న కోతిబావ పులిపైనుండి ఎగిరి దూకిదూకి తనువచ్చిన దారినే వెనుతిరిగి బయలుదేరాడు.

“అందరూ నేచెప్పిన కథ విన్నారుగా? చెప్పుడు మాటలు ఎంత భయాన్ని, ఎన్ని తిప్పలు తెచ్చిపెడతాయో! ధైర్యం కలిగినవాళ్ళే ఏ విద్యలోనైనా ఉన్నతశిఖరాలు అధిరోహిస్తారు. భయమే మన మొదటి శత్రువు అని తెలుసుకొండి.” అన్నాడు ఇకఇక.

కథ నచ్చిన అందరూ ఆనందంతో చప్పట్టు కొట్టారు.

అంతా ప్రయాణానికి సిధ్ధమయ్యారు.

“జయంతా మొదట మనం ఒక లోయపై ఉన్న తాళ్ళ వంతెన గుండా ప్రయాణం చేసి ఆ లోయ దాటాలి. కానీ తాళ్ళవంతెనపై ఉన్న చెక్కపలకలు గుర్రాలను ఆపగలవా అన్నది సందేహం” అన్నాడు విజయుడు.

“యువరాజా ప్రతి రెండు అడుగులకు ఒక చెక్క పలక వంతున ఉన్నాయి, పైగా తాళ్ళవంతెన చాలా పొడవుగా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడో కట్టిన అది శిధిలావస్థకు చేరుకుని ఉంటుంది. మనతో గుర్రాలను తీసుకువెళ్ళడం అసంభవం. అవి అంతలోతైన లోయను చూస్తూ ప్రతి రెండు అడుగులకు ఓ చెక్క పలకపై కాలు పెడుతూ నడవటం అసంభవం. కనుక గుర్రాలను వంతెనవద్ద వదలి మనం వంతెన ఒకొక్కరుగా దాటివెళదాం ‘ అన్నాడు జయంతుడు.

 ప్రయాణం ప్రారంభించారు అందరు.

సాయంత్రానికి అంతా లోయ పైభాగాన వేసిన తాళ్ళ వంతెన వద్ద బసచేసారు.

“జయంతా కాగడాలు సిధ్ధంచేయించు. గుర్రాలను ఇక్కడ వదలివేద్దాం. మనమంతా వస్తువులతో తాళ్ళ వంతెనపై ఒకొక్కరే అవతలభాగానికి చేరుకుందాం, నేను తాళ్ళ వంతెన ఎంత ధృడంగా ఉందో పరిశీలించి వస్తాను”అని కాగడా చేతబూని తాళ్ళ వంతెన పై కొంతదూరం ప్రయాణం చేసి వచ్చిన విజయుడు “జయంతా ఇద్దరు ఇద్దరు ఒకేసారి వంతెనపై ప్రయాణం చేయవచ్చు, భయం లేదు” అన్నాడు.

“మీరు భయపడకండి. ‘కట్టె వంకర మంట తీరుస్తుంది’. నేను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నానో? ‘అయినా చేతిలో వెన్న ఉంచుకుని నేతికోసం ఊరంతా వెదికారంట’. నేనుండగా మీకు భయమేల” అన్నాడు ఇకఇక.

ఇకఇక డాంబికానికి అందరు నవ్వుకున్నారు.

చేత కాగడాలు పట్టి ఇద్దరు ఒక జట్టుగా వంతెన దాటసాగారు. అందరూ వంతెన దాటి క్షేమంగా చేరుకున్నారు. చివరిగా శివన్నతో చిలుకతో కలసి వంతెన దాటసాగాడు విజయుడు. కొద్ది సేపటికే కాగడాలు ధరించిన పలువురు దృఢకాయులు, తాళ్ళవంతెన దగ్గరకు వస్తూనే విజయ, శివన్నలను చూస్తూ “ఎక్కడికి పోతారు? మా చేతిలో మీ మరణం తప్పదు” అని వంతెనకు ఉన్న తాళ్ళు కోయసాగారు.

“అయినా ‘కాకిని తెచ్చి పంజరంలో పెడితే చిలుక అవుతుందా?’. పాపం అని క్షమించి వదిలితే మాకే అపకారమా” అన్నాడు ఇకఇక.

వాళ్ళు తమ చేతిలో చావు దెబ్బలు తిన్నదొంగలు అని గ్రహించాడు విజయుడు.

“శివన్నా ఎట్టి పరిస్ధితులలో నువ్వు వంతెనకు ఉన్న తాళ్ళను వదలవద్దు, ఆ దొంగలు మన వంతెన తాళ్ళను కోస్తున్నారు జాగ్రత్త” అంటూ ఉండగానే తాళ్ళు తెగిన వంతెన కొన్ని వందల అడుగుల లోయలోనికి జారిపోయింది.

శివన్న, విజయుల చేతుల్లోని కాగడాలు ఎప్పుడో జారిపోయాయి.

ఆ దృశ్యం చూసిన ఆవలి పక్కవారంతా హాహాకారాలు చేసారు.

గాఢాంధకారంలో ఉన్న ఆ లోయలో వంతెన తాళ్ళు పట్టుకుని వేళ్ళడసాగారు శివన్న, విజయులు.

‘బ్రతికి ఉండిననూ బలుసాకు తిని బ్రతకవచ్చు’ అని ఎగురుతూ అవతల భాగాన ఉన్నజయంతుని వద్దకు చేరింది చిలుక.

చీకట్టో తాళ్ళ వంతెన ఆధారంగా గాలిలో వేళ్ళాడుతూ ఉండిపోయారు విజయుడు, శివన్న.

లోయభాగంలోనికి వంగిన జయంతుడు “యువరాజా క్షేమమా?” అన్నాడు బిగ్గరగా.

“ఏలికా తెల్లవారిందాక మనం ఇక్కడే ఉందాం, ఆపైన ఏంచేయాలో నిర్ణయించుకుందాం” అన్నాడు జయంతునితో జగ్గ.

“సరే ఎండుకట్టెలు సేకరించండి నెగళ్ళు వేయండి, త్వరగా” అన్నాడు జయంతుడు.

మరికొద్దిసేపట్లో తమందరి చుట్టూ నాలుగుదిక్కులా నెగళ్ళు వేసారు. తమతో తీసుకువచ్చిన ఫలాలు అందరికి పంచాడు జగ్గ.

“అంతేగా ‘గుర్రం గుడ్డిదైనా దాణా తక్కువ తినదుగా’. ఎన్ని బాధలు ఉన్నా, ఆకలి బాధ ముందు తలవంచవలసిందే కదా” అన్నాడు ఇకఇక.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here