చిరుజల్లు 5

0
3

అవునంటే కాదనిలే…

శ్లో.

యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః
తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః
మాయాచారో మాయయా బాధితవ్యః
సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః

ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.

కోడి కూస్తే, నిద్ర లేస్తే మనం ఎంతో మందితో కల్సి మెల్సి తిరగాల్సి ఉంటుంది. మరి ఇంత మందీ ఒకే రకమైన అభిప్రాయాలూ మనస్తత్వాలూ కలిగియుండరు. మంచితనమూ, పాపభీతి, లజ్జ, దాక్షిణ్యము లేనివారు కూడా మన చుట్టూ చాలామంది ఉంటారు. నిజంగా అవసరం వచ్చినప్పుడు మనకు చేదోడు వాదోడుగా ఉండేవారు ఉంటారు. నాలుక చివర నుంచీ సానుభూతి మాటలు చెప్పి తప్పించుకునే వారుంటారు. ఇంకో రకం వాళ్లు… ఎదుటి వాళ్లను ఎప్పుడూ తమ స్వార్థానికే ఉపయోగించుకోవాలన్న దృఢమైన సంకల్పంతో ఉండేవారు ఉంటారు.

ఒక కాలనీలోనో, అపార్ట్‌మెంటులోనో ఇరుగు పొరుగు వాళ్లు ఉంటారు. కరెంటు బిల్లులో, వాటర్ బిల్లులో చెల్లించాల్సి ఉంటుంది. ఒకయాన ఎప్పుడూ పక్క వాళ్లకు డబ్బులిచ్చి తన ఇంటి కరెంటు బిల్లులు కట్టమని అంటుంటారు. నిజంగా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడయితే, ఫరవాలేదు గానీ, ప్రతిసారీ ఎవరో ఒకరి నెత్తిన రుద్దాలనుకోవటం మంచిది కాదు. పక్కవాడు సరైనవాడు కాకపోతే ఆ డబ్బులు తీసేసుకొని వాడుకోనువచ్చు. ఇలాంటప్పుడే అవునంటే కాదనిలే… అన్న అర్థం వస్తుంది.

చిన్నప్పటి నుంచీ కొన్ని అభిప్రాయాలు దృఢంగా ఏర్పడి ఉంటాయి. అందులో ముఖ్యమైనది సేవాభావం. చేతనయినంతలో సాటి వారికి తోడుపడటం అనే లక్షణం చిన్నతనంలోనే అలవాటు అవుతుంది. పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటుంటారు. ఎదురింటామో “ఒరే వేణూ కొంచెం షాపుకెళ్లి పంచదార తెచ్చిపెట్టరా?” అని అడిగితే, వేణుతో పాటు మిగిలిన ముగ్గురూ ఆట మానేసి, పంచదార తెచ్చి పెడతారు. అలాగే స్కూలులో ఎవరికన్నా పెన్సిల్ లేకపోయినా, పుస్తకం లేకపోయినా, ఫ్రెండ్స్ ఆదుకునే అలవాటు చిన్నప్పటి నుంటీ వాళ్ల మనస్తత్వంగా మారిపోతుంటుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, ముక్కూ మొహం తెలియని వాళ్లు ఆగంతుకుడిని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి చికిత్స చేయించటమూ ఈ మనస్తత్వానికే నిదర్శనం. రేపు మనకు ఎలాంటి ఇబ్బంది వస్తుందో అప్పుడు ఎవరు ఎలా సాయపడతారోనన్న ఊహే ఇందుకు కారణం. ఇచ్చిపుచ్చుకునే తత్వం అలా అలవాటైపోతుంది.

అయితే సమాజం మారుతోంది. జీవన శైలి మారుతోంది. అవసరాలు మారుతున్నాయి. ప్రతిదానికీ పరిమితులుంటాయి. మంచిని అంట్టిపెట్టుకుని చెడు కూడా ఉంటుంది. మంచి ఎక్కడ ఉంటుందో దాని నీడలా చెడు ఉంటుంది. సరియైన వెలుతురులో మాత్రమే, విచక్షణ జ్ఞానం వెలిగినప్పుడు మాత్రమే మంచిని మంచిగానే, చెడును చెడుగానే చూడగలుగుతారు.

మనిషిలోని మంచితనాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేవారూ మన చుట్టూ ఉంటారు. వారిని దూరంగా ఉంచకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ‘తన్నుమాలిన ధర్మమూ, మొదలు చెడ్డబేరమూ కలదా’ అని అన్నారు. ఎత్తలేని బరువులు ఎత్తితే నడుములు విరగక తప్పదు. అందుచేత ‘నో’  అని చెప్పటమూ నేర్చుకోవాలి.

శలవు రోజున పక్కింటాయన వచ్చొ “మీ స్కూటర్ ఇవ్వండి, చిక్కడపల్లి వెళ్లొస్తాను” అంటాడు. మొహమాటం కొద్దీ కాదనలేక స్కూటర్ ఇస్తారు. వారం రోజుల తరువాత చూసుకుంటే, బండికున్న కొత్త టైర్లకు బదులు పాత టైర్లు కనిపిస్తాయి. నిలదీసి అడగలేరు. బాధపడకుండా ఉండలేరు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా – అని వగచి ప్రయోజనం ఏముంది?

ఇంకోరకం ఉంటారు. అవసరం ఉన్నప్పుడు, పొగడ్తలతో అగడ్తలను దాటిస్తారు. మీ ‘చేతికి ఎముక లేదం’టారు. ‘నీ మనసు వెన్నపూస’ అంటారు. ‘శిబిచక్రవర్తి నీ సొంత అన్న’ అంటారు.  ‘నీ మందు దానశూరవీరకర్ణుడు ఏ పాటి’ అంటారు. ‘మీ అబ్బాయి అమెరికా అధ్యక్షుడు అవుతాడనీ, మీ అమ్మాయి ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంద’నీ ఆకాశానికెత్తుతారు. పొగడ్తలకు దేవుడే పొంగిపోయి వరాలిస్తాడుగదా. మీరెంత? చిట్ ఫండ్ కంపెనీకో, బ్యాంక్‌లో కారు లోన్‌కో మిమ్మల్ని ష్యూరిటీగా ఇరికించి సంతకం తీసుకుంటాడు. ఇంక ఆ తర్వాత కంటికి కనిపించడు. నాలుగు నెలలు గడిచాక, వాయిదా డబ్బులు మీ జీతం నుంచి రికవరీ పెట్టబోతునట్లు నోటీసు వస్తుంది. దానశూరవీరకర్ణుడు అయినందుకు కన్నీటి పర్యంతం అవక తప్పదు. మొదట్లోనే ‘నో’ చెప్పేసి ఉంటే, ఇంత బాధ ఉండదు గదా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా, అడిగిన దానికల్లా అవునంటూపోతే, కష్టాల నష్టాల ఊబిలో కూరుకుపోకతప్పదు. ఈ చిన్న చిన్న మొహమాటాలు వల్ల జీవితంలో కోలుకోలేని దెబ్బ తగలనూ వచ్చు.

ఉద్యోగాలు చేసే వాళ్ల సమస్యలు మరో రకంగా ఉంటాయి. ఆఫీసు పనీ, ఇంటి పనీ తెమలదు. ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక, ఏది ఆఫీసు పనో, ఏది ఇంటి పనో తెలియటం లేదు. ఇరవై నాలుగు గంటలూ చాలటం లేదు. ఉద్యోగం, సద్యోగం లేని వాళ్ళకు కాలక్షేపం కాక ఫోన్ చేసి గంటలు గంటలు మెదడు తినేస్తుంటారు. ఇక పండగలకు పబ్బాలకు పేరంటాలకూ కొదవలేదు. ఉద్యోగిని వెళ్లకపోతే, వెనక నుంచి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి –  గర్వం అనీ, పొగరు అనీ. ఎవరేమనుకున్నా, తన పనులు మానుకుని, ఈ పని లేని వాళ్లతో కాలక్షేపం చేయకపోవటమే మంచిది. పిల్చినా ‘నో’  అని చెప్పకతప్పదు.

ఇంక ఆఫీసుల్లో సంగతి చెప్పనవసరం లేదు. ఒక ఆధికారి కింద పది మంది ఉంటే అందులో సక్రమంగా పని చేయగల వాళ్లు నలుగురే ఉంటారు. మిగిలిన ఆరుగురి పనీ ఆఫీసర్ వీళ్లకే అప్పగిస్తుంటాడు. ఆఫీసులో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ప్రకారమే పని చేస్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరమూ ఉంది. ముఖ ప్రీతి కోసం అవునని ఒప్పుకుంటే, ఇంక అదే అలవాటుగా మారుతుంది.

దగ్గర బంధువుల విషయంలో చిత్రమైన పరిస్థితులుంటయి. ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములుంటారు. శుభకార్యానికో, అశుభకార్యానికో నాలుగు లక్షలు ఖర్చు అవుతాయి. నలుగురూ పంచుకోవాల్సి వస్తుంది. అందులో ఇద్దరు తెలివిగల వాళ్లు ఉంటారు. “ముందు మీరు సర్దండి, వచ్చే నెలలో సర్దుబాటు చేస్తా”మంటారు. అది వాయిదా వేయలేని సందర్భం గనుక, ఎలాగోలాగ గడిచిపోతుందని వాళ్లకు తెల్సు. సర్దుబాటు చేస్తామని చెప్పిన ‘వచ్చే నెల’ మాత్రం ఎప్పటికీ రాదు. కానీ వాళ్ల భార్యలు నగలు చేయించుకుంటుంటారు. పిల్లలకు లక్షల్లో ఫీజులు కడుతుంటారు. మనస్పర్థలు వచ్చినా, వాళ్లు ఇదీ మన మంచికే అనుకుంటారు.

ఇలాంటప్పుడే కొంచెం నిదానంగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఒకోసారి ఖచ్చితంగా ‘నో’ అని చెప్పాల్సి వస్తుంది. బాధ్యతలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు, స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకసారి నో అని చెప్పిన తరువాత ఇంక ఊగిసలాట పనికి రాదు. ఖచ్చితంగా ఆ మాట మీదనే నిలబడాలి. కానీ అన్ని సందర్భాల్లో అంత నిర్దయగా నిలబడటమూ సాధ్యం కాదు. ఉదాహరణకి పిల్లలు ఫ్రెండ్స్‌తో కల్సి ఫలానా చోటుకు వెళ్తామని అడుగుతారు. ఏ చెరువు గట్టుకో వెళ్లి ఏ ప్రమాదం కొని తెచ్చుకుంటారో అని ‘నో’ అని చెప్తారు. కాని పిల్లలు అంత తేలికగా వదలరు. రెండు రోజులు పాటు అదే పనిగా పుండు సలిపినట్లు సలుపుతుంటారు. నసుగుతుంటారు. పోన్లే గదా అని మీరు ఒకసారి మెత్తబడితే, ఇక వాళ్లకు దొరికినట్లే. ప్రతిసారి ఆ నసుగుడు తోనే మిమ్మల్ని వాళ్లు జయించేస్తారు. అందుచేత ‘నో’ అంటే ‘నో’ అంతే. ఇంక ‘యస్’ అనగూడదు.

ఇక భార్యాభర్తల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వస్తుంటయి. ప్రతి వాళ్లకీ కొన్ని రుచులూ, అభిరుచులూ ఉంటాయి. మొదట్లో అలా వద్దు ఇలా వద్దు అని చెప్పినా సర్దుకుపోతుంటారు. కానీ కొంత కాలం గడిచేసరికి, ఈ ‘నో’ చెప్పటం వల్ల అంతరం పెరిగిపోతుంటుంది. “మా ఆవిడలో చిన్న చిన్న లోపాలున్నా, నేను పెళ్లి చేసుకున్నాను” అంటాడు భర్త. “ఆ లోపాలు కూడా లేకపోతే, నేను నిన్ను ఎందుకు చేసుకుంటాను?” అంటుంది భార్య. “పతియంచు, సతియంచు మనకు లంకె వేసె ఆ నాలుగు మొహాలవాడు” అంటాడు భర్త. “నాకంట పడితేనా నాలుగు ముహాల వాడినీ పట్టకొని, నాలుగు దులిపేద్దును” అంటుంది భార్యామణి. “ఏ లోపమూ లేనివాడు ఎవడూడుండడు. చంద్రడికే అంత పెద్ద మచ్చ ఉన్నప్పుడు, మానవ మాత్రులం, మనకు లోపాలు ఉండవా? అయినా ఆలుమగల మధ్య కలహం, పడకగది చేరేంత వరకే, కష్ట నష్టాలకు భరిస్తూ, అనుభవాలే ఆర్జనగా, అనుభూతులే ఆస్తులుగా మూటగట్టుకొని, చెట్టాపట్టాలేసుకొని, తోడునీడగా కడదాకా కల్సి నడిచే మనిషి ఉండటాన్ని మించిన సంపద ఇంకేం ఉంటుంది ఎవరికైనా? ఈ అనుబంధం ముందు మిగిలిన సమస్యలన్నీ మరుగుజ్జువైపోతాయి. ఆలుమగల మధ్య అంతరాలను పెంచే విషయాలు మూడు ఉంటాయి. ఒకటి ప్రేమానుబంధం. రెండు డబ్బు. మూడోది బాధ్యతలు పంచుకోవటం. కానీ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే, ఇవన్నీ దూదిపింజల్లాగా గాలికి కొట్టుకుపోతయి. అందునా ఈ తరం వారి జీవనశైలి వేరు. ఇద్దరూ సంపాదించుకుంటుంటారు. ఇద్దరి చేతుల్లోనూ క్రెడిట్ కార్డులుంటాయి. ఇద్దరికీ చెరో కారు ఉంటుంది. చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఇంక కొదవ ఏముంది? ‘నో’ చెప్పే అవకాశమూ తక్కువే.

తల్లిదండ్రుల విషయం సెంటిమెంటుతో కూడిన వ్యవహారం. కని పెంచి పెద్ద చేసిన వారి ప్రేమ, పైకి కనిపించని ప్రేమ. వృద్ధాప్యంలో వాళ్లు పిల్లల మీద ఆధారపడి బ్రతకవల్సి వస్తుంది. అడ్డాల నాటి బిడ్డలకీ, గడ్డాల నాటి బిడ్డలకీ చాలా తేడా ఉంటుంది గదా. కొడుకులూ, కూతుర్లూ తమ వాళ్లే అయినా. ఎక్కడ నుంచో వచ్చిన కోడళ్లూ, అల్లుళ్లూ పరాయివాళ్లే కదా. వయసు మీరిన తరువాత జబ్బులు పట్టి పీడించే సమయంలో చేతిలో డబ్బులు లేకపోవటం వారిని మరింత కృంగదీస్తుంది. ఆస్తులు ఇచ్చినా, ఆప్యాయతలు కొరవడే సంసారాలు ఎన్నో ఉన్నయి. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే, మరో రకమైన సమస్యలు. అన్నిటికీ పంపకాలు. ఊరికి బరువై, అయిన వారికే పరాయివాళ్లు అయి, ముసలి వాళ్లు పడే మూగ బాధ ఎవరూ తీర్చలేనిది. ఇక్కడ ‘నో’ అని చెప్పరు. కానీ ఎవరూ తీర్చలేని చింత ఏదో మనసులో చింత నిప్పుల్లా రగులుతూనే ఉంటుంది. తన వారు పరులైన బ్రతుకెందుకో అన్నాడు మల్లాది రామకృష్ణశాస్త్రి. కన్నీరు ఎంత బరువైనది? ఎంత బలమైనది?

ఇంకో రకం పక్షులుంటయి. హస్టల్స్‌లో ఉంటుంటారు. వీళ్లకి నీది నాది అన్న వ్యత్యాసం ఉండదు. పాంట్లు, షర్టులూ దగ్గర నుండి, జేబులో డబ్బులు దగ్గర నుంచీ అన్నీ ఉమ్మడిగా వాడేసుకుంటుంటారు. వీళ్ల గదిలో లేకపోతే పక్క వాడి గదిలోకి వెళ్లి టూత్ పేస్టు వాడుకుంటాడు. ‘ఇది నీ రూం కాదురా’ అంటే  ఇవాళ నేను నేను కాదురా… అందుకని ఏ రూం నాదో చెప్పలేను అని గొప్ప ఫిలాసఫీ చెబుతాడు. ఇక్కడ ‘నో’ చెప్పే ఛాన్స్ అసలే ఉండదు.

ఇక ప్రేమికులు ఉంటారు. ప్రేమ అనేది మనిషి మానసిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు కలిగే ఒక రకమైన ఉన్మాదం. ఆ సమయంలో ప్రేమించిన మనిషి కనిపిస్తే చాలు అంటాడు, మాట్లాడితే చాలు అంటాడు. నవ్వితే చాలు, తుమ్మితే చాలు, దగ్గితే చాలు –  అంటాడు. ఆ కొద్ది రోజులూ ఆ అమ్మాయి ప్రభావం, పొగమంచులా కప్పేస్తుంది. ఏదీ స్పష్టంగా చూడలేడు. పెరిగే ప్రేమ ఎప్పుడూ కన్నీరుగానో, పన్నీరుగానో మిగిలిపోతుంది. ఆడదాన్ని దగ్గరకు చేర్చుకుంటే, ఖర్చు పెడుతుంది. దూరం చేసుకుంటే చిచ్చు పెడుతుంది. ముందే కళ్లు తెరిచి నో చెప్పకపోవటం వల్ల అక్కడక్కడ హత్యలూ, కొండోకచో ఆత్మహత్యలూ జరుగుతున్నయి.

‘నో’ చెప్పవల్సి ఉన్నా ‘నో’ అని చెప్పలేని వ్యామోహాలు ఎన్నో ఉన్నయి. ముఖ్యంగా వ్యసనాలు. చాలా ఏళ్ల కిందట, మలక్‌పేటలో రేస్ కోర్స్‌లో గుర్రపు పందాలు జోరుగా జరుగుతుండేవి. జనం రేస్ కోర్స్ నిండా కిక్కిరిసి పోయి ఉండేవారు. ఆడా మగా అన్న తేడా లేదు. అదొక ఫ్యాషన్ అయిపోయేది. ఉన్నవాడు డబ్బు వెదజల్లితే పోయేదేం లేదు. కానీ మధ్య తరగతి వాళ్లు, ఉద్యోగులు, అప్పులు చేసి వేలకు వేలు లోన్లు తీసుకొని తిరుక్షవరం చేయుంచుకునేవారు. ‘ఫోటో ఫినిష్‌లో పోయిందిరా’ అంటాడు. ఏ ఫినిష్‌లో పోతేనేం? నువ్వు ఫినిష్ అయ్యావా, లేదా?

సిగరెట్లు, మద్యపానం ఒకప్పుడు చెడు అలవాట్లుగా కనపడేవి. ఇప్పుడవి స్టేటస్ సింబల్‌గా కనిపిస్తున్నయి. ఈ డోసే చాలటం లేదు. డ్రగ్స్ రాజ్యమేలుతున్నయి. అమెరికా లాంటి దేశాల్లో పిల్లలను స్కూలు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చాయి. అక్కడ స్కూల్‍లో ప్రతి పిల్లవాడికి ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్‍లో ఏమేం ఉంటాయో తెలియదు. డ్రగ్స్ లాంటివి ఆ లాకర్స్‌లో కనిపిస్తే స్కూలు నుంచి పంపించి వేస్తారు.

ఇంకా ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేరు. స్వీయ నియంత్రణ్ ఒక్కటే గత్యంతరం. ప్రతిదానికి ‘అలాగే’ అని తల ఊపటం మానేసి, ఎప్పుడు ‘అవును’ అనాలో, ఎప్పుడూ ‘నో’ చెప్పాలో తెల్సుకోవాలి. ఒకసారి ‘నో’ అంటే, ‘నో’ అంతే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే… అనే ఊగిసలాట వద్దు.

ప్రతి చిన్న విషయంలోనూ మంచి చెడులు నిర్ణయం తీసుకొని అవుననో, కాదనో చెప్పాలి.

కనుక,

‘ఊ’ అంటారా, మరి ‘ఊహూ’ అంటారా? మీ ఇష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here