[box type=’note’ fontsize=’16’] 5 ఫిబ్రవరి 2022 నాడు శ్రీ అద్వయానంద భారతీ స్వామి (బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారి) వారి శతజయంతి సందర్భంగా వారి జీవితాన్ని సంక్షిప్తంగా ప్రస్తావించి, పూర్వాశ్రమంలో వారు రచించిన పద్యకావ్యాలను విశ్లేషిస్తున్నారు డా॥ తుమ్మలపల్లి వాణీకుమారి. [/box]
[dropcap]శ్రీ[/dropcap] అద్వయానంద భారతీ స్వామి వారి పూర్వాశ్రమంలోని పేరు తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు. నాటి కవిలోకంలో ప్రసిద్ధులైన శ్రీ రామలింగేశ్వర రావు గారు శ్రీ జ్వాలాపతి, మహాలక్ష్మమ్మ గార్ల ప్రథమ పుత్రులు. కృష్ణాజిల్లాలోని గుడివాడ వీరి స్వస్థలం. ఎఱుకపాడు గుడివాడ సమీపంలోని గ్రామం. ఆ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో వీరి తండ్రిగారు ఏడాదిపాటు నిత్యం మహాన్యాస పూర్వకంగా అభిషేకం చేసిన పుణ్యఫలంగా రామలింగేశ్వర రావు గారు జన్మించారు. 1921లో జన్మించిన రావు గారు 1937 నాటికి ఎస్.ఎస్.ఎల్.సి.లో మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రథమ స్థానాన్ని పొందారు. వీరి విద్యాభ్యాసం ఎక్కువ కాలం రాజమండ్రిలో సాగింది. పితృ వియోగం తరువాత పత్రికలో ఉప సంపాదకులుగాను,రెవెన్యూ శాఖలోను పని చేసారు. ముక్కుసూటిగా పోయే మనస్తత్వం కావటంచేత ఎక్కువ కాలం ప్రభుత్వ ఉద్యోగాలలో ఇమడలేక చివరి వరకు స్వతంత్రంగానే జీవించారు. శ్రీ శృంగేరీ పీఠాధిపతి అనుగ్రహ ఆశీస్సులతో వెలువడే ఆధ్యాత్మిక మాస పత్రిక శంకర కృప. రావు గారు 20 సంవత్సరాలు ఆ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. శ్రీ శృంగేరీ పీఠం జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారి శిష్యులై పాదుకాంత దీక్షను పొందారు. 1988లో శ్రీమదభినవ విద్యాతీర్థుల వారి సన్నిధిలో తురీయాశ్రమాన్ని స్వీకరించి శ్రీ అద్వయానంద భారతీ స్వామిగా జీవనాన్ని సాగించారు. 1991లో దుర్గాష్టమి రోజున బ్రహ్మ సిద్ధిని పొందారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్. విశ్వనాధ వంటి పండితుల, కవుల ప్రశంసలను పొందారు.
ధర్మనిర్ణయం, మనకు మిగిలింది, తిక్కన సోమయాజి, పోతనామాత్యుడు, తాళ్ళపాక అన్నమాచార్యులు వీరి నవలలు. శ్రీ చక్రవిలసనము, శ్రీ చక్ర పూజావిధానము, లలితా సహస్రనామ స్తోత్ర భాష్యము, సౌందర్యలహరికి వ్యాఖ్యానం-ఇవి వీరి మంత్ర శాస్త్ర గ్రంథాలు. అపరోక్షానుభూతి, శ్రీమత్త్రిపురసుందరీ వేదపాఠ స్తోత్రము, వేదాంత డిండిమము మొదలైన వేదాంత గ్రంథాలు,
పోతనగారి సహజ పాండిత్యము, నన్నెచోడుని వస్తుకవిత, శ్రీ విశ్వనాథ వారి శ్రీ మంజూషిక,ధూర్జటి అతులిత మాధురీ మహిమ మొదలైన విమర్శనా గ్రంధాలు, sureshwaracharya,The rationale of Mantra sastra, profile of kaladi, sringeri revisited మొదలైన ఆంగ్ల గ్రంధాలు వీరి రచనలు. గోదావరీగర్భము, ప్రేయోనువాకమ్, శివానుగ్రహము, పితృయజ్ఞము, అగ్నిష్టోమము, హాస్యగాథాద్విశతి వీరి పద్య కావ్యాలు. వాటిని గురించి లఘు పరిచయం.
శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు ఆధునిక ఆర్షకవి. వీరి కవిత్వంలో కనుపించే అపారమైన పాండిత్యం, నైష్ఠికత, తాత్వికత, సనాతన, ధార్మిక విలువలు ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఇవి పాఠకుని దివ్యభూమికలకు తీసుకొని పోతాయి. మంత్ర శాస్త్రం, సాహిత్య విమర్శ, పద్య, గేయ, వచన కవిత్వాలు, నవల, యాత్రా చరిత్ర మొదలైన అనేక సాహిత్య ప్రక్రియలలో వెలువడిన వీరి గ్రంథాలు ఆంధ్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. వీరి పద్య కావ్యాలలో ఆరు గ్రంథాలు ముద్రితాలు. ఆకారంలో చూస్తే ఇవన్నీ చిన్న కావ్యాలు. కాని ప్రతి పద్యానికి వ్యాఖ్యానం అవసరమే! ఈ కావ్యాలను సమగ్రంగా అర్థం చేసుకోవటానికి సామాన్య పాఠకునికి సాధ్యం కాదు. పద్యానికి ముఖ్యమైన లయబద్ధత, రమణీయమైన శైలి, సారళ్యం శ్రావ్యంగా సాగిపోయి పాఠకునికి అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలిగిస్తాయి. కాని లోతైన భావాలు అర్థం చేసుకోవాలంటే మాత్రం పాండిత్యంతో పాటు సనాతన ధర్మమూల్యాలు, సంప్రదాయం తెలిసి ఉండాలి. అంత శక్తి లేకపోయినా కేవలం ‘ఏకఃస్వాదు నభుంజీత’ అనే ఆర్యోక్తిని అనుసరించి కొంత పరిచయం మాత్రం చేయటానికి యథాశక్తి ప్రయత్నిస్తాను.
గోదావరీ గర్భము:
గోదావరీ గర్భమనే కావ్యానికి ఉన్న మరోపేరు ‘నన్నయ దర్శనము’. గోదావరీ నదీ పావిత్ర్యాన్ని గురించి, ఈ నదీ తీరాన వెలసిన సాంస్కృతిక, సాహిత్య ఔన్నత్యాన్ని గురించి ఆదికవి నన్నయ గురించి, తన్మయులై ధాన్యంలో మునిగివున్న కవికి ఆ నదీజలాలలో నన్నయ దర్శనమిస్తాడు. యోగి నిశ్చలంగా ధ్యానం చేస్తున్నప్పుడు పరమాత్మను దర్శించగలుగుతాడు. అలాగే కవి గౌతమీ తీరంలో ధ్యానమగ్నుడైనప్పుడు ఆ నదీజలాలలో ఆదికవిని దర్శించాడు. రససిద్ధుడైన కవీశ్వరుడు యోగియే! కవితానందం బ్రహ్మానంద సదృశమే కదా! నన్నయ నేటి తెనుగు భాష దుస్థితికి తెలుగు వారి దుస్థితికి చింతించాడు. తననే ధ్యానిస్తున్న కవితో ఇలా అంటాడు.
“కంటివిరా కుమార! కలికాలము వచ్చి తెలుంగువారలే
తుంటరి మాటలందురు కదోయి, తెలుంగున సత్కవిత్వపుం
బంటలు నేటికిప్పటికి పండగ లేదటరా కుమార! నా
వంటి కపుల్ తపస్సు పరిపాలన చేసినదెల్ల వ్యర్థమై”
~
“ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహతిన్
వనరుట చేత లెస్సయగు వైభవముండి జగజ్జనానురం
జనమగు మాధురీ గుణ విశారదులయ్యును నేటికిట్లుగన్
తెనుగులు సర్వభారత సుధీ పరిషత్తులలోన విస్మృతుల్”
అంటూ వ్యథ చెందాడు నన్నయ. కవి తెలుగును పరమశైవ మూర్తిగా భావించారు.
“తేనెలో మునిగిన తియ్యమామిడి పండు
మధుర శబ్ద నాదమయము తెలుగు
ప్రణవ సహితమైన పంచాక్షరీ మంత్ర
జాతమాంధ్రి పరమ శైవమూర్తి”
~
“దివ్య గీర్వాణ భారతీదేవి యొక్క
నవ్య మధురావతారమాంధ్రంబు నిజము
ఎవడురా దీని లఘువుగా నెంచువాడు
వాడు నూఱేండ్లు నిండినవాడు గాక!”
అని గర్జించాడు నన్నయ.
“నా వచనంబులందున ననాదరమేటికిరా కుమార భా
షా వివిధ ప్రచార పరిషత్తులలో మన భారతీయ భూ
మీ వలయంబునన్ తెలివిమీరిన యీ మన తెన్గుభాషకున్
నావలనన్ గడింపబడినట్టిది కీర్తిని నిల్పుకొమ్మురా!”
అని కవికి ఉద్బోధించాడు. మెల్లమెల్లగా బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుతున్న నన్నయమూర్తి గోదావరీ జలాల్లో కలసిపోయినట్లు తోచింది కవికి.
“ఆ కవీంద్రుని రూప విన్యాసమెల్ల
గౌతమీ ప్రవాహంబులో కరగిపోయి
తద్రసాంచిత ధ్వని మత్త విద్రుమంబు
ఆంధ్రసాహిత్యమందు కావ్యాత్మయయ్యె!”
ఆంధ్ర సాహిత్యానికి ఆత్మ నన్నయ. ఆ ఆత్మ ఉన్నది కాబట్టే నాటి నుండి నేటివరకు ఆ మార్గాన్ని అనుసరించే వేల కావ్యాలు వచ్చినాయి; వస్తున్నాయి. నన్నయగారి ఆదికావ్య నిర్మాణం గోదావరి గట్టున జరిగింది. నన్నయ శారద గోదావరీ తీర సైకత విహార ప్రౌఢ. శ్రీనాథుని శారద కూడా ఆ గౌతమి గట్టుపైనే సాహిత్య సామ్రాజ్యాన్ని నిర్మించింది.
“ఇది గోదావరి ఆంధ్ర సాహితికి బ్రాహ్మీదేవి నన్నయ్య శా
రద గోదావరి తీర సైకత విహార ప్రౌఢ, శ్రీనాథ శా
రదయున్ గౌతమి గట్టుపైన నొక సామ్రాజ్యంబు కట్టెన్ మహా
భ్యుదితాంధ్రోరు కళా ప్రపంచమున నీ యుద్యోగమల్పంబటే”
అంటాడు కవి.
“ఆంధ్ర జన మహాలోక భాగ్యంబులెల్ల
గౌతమీ నదీ దేవ్యనుగ్రహము కలిమి
భారతీయ సాహిత్య సంపత్తులందు
ఆంధ్ర సుకవితా శ్రీ నన్నపార్యభిక్ష”
గోదావరి తీరాన వెలసిన దేవతామూర్తులు, విరాజిల్లిన కళలు, వికసించిన రాజ్యాలు, పాలించిన చక్రవర్తులు కవి స్మృతిపథంలో కదలి కావ్యమై అవతరించింది. వేదనాదం గోదావరీ తరంగాలలో తరంగితమై ప్రవహించి కవి హృదయాన్ని రసప్లావితం చేసింది. ఆంధ్రలోకంలో సంప్రదాయ దారిద్ర్యమనేది రాకుండా సాహితీ, సాంస్కృతిక, ధార్మిక కళలనెన్నిటినో ప్రోత్సహించిన గోదావరి కవిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకొంది. తెలుగు రాజుల శౌర్య పరాక్రమాలను, తెలుగు ప్రాచీన వైభవాన్ని తలచుకొని కవి గొంతు గద్గదమైంది.
“ఒక తరంగము చళుక్యోద్విపతుల వైభ
వము వోలె పైపైకి ప్రాకి వచ్చు
ఒక తరంగం బాంధ్ర సకల సాహిత్య శా
సనము వోలె బిగువు సాగివచ్చు
ఒక తరంగము నిల్చు ప్రకటిత నిగ్రహా
నుగ్రహ శక్తి సందోహమగుచు
ఒక తరంగము రెడ్డి యెకిమీళ్ళశౌర్యరే
ఖా విలాసంబుగా కదనుద్రొక్కు
చిన్ని చిన్ని తరంగముల్ చిందులాడి
నా మనస్సులో పూర్వాంధ్ర భూమిపైని
మధుర గాథాస్మృతులను సమన్వయించి
కంఠమున పైకి తెచ్చు గాద్గదిక మొకటి”
ఈ విధంగా త్రిలింగ మధ్యస్థ భూమీతలాన ధర్మ పరివృద్ధికి ప్రత్యక్షసాక్షిగా నిలచిన గోదావరీ పావిత్ర్యం, ఆంధ్ర సాహిత్యానికి ఆదిభిక్ష పెట్టిన నన్నయ్య పట్ల గౌరవం కవిచేత ‘గోదావరీ గర్భము’ కావ్యాన్ని వ్రాయించింది. 120 పద్యాలు మాత్రమే ఉన్న చిన్ని కావ్యమైనా పఠితలకు ఆంధ్ర సాహిత్యం పట్ల మక్కువను పెంచే ఈ కావ్యం కవి ప్రతిభకు అద్దం పడుతున్నది.
శివానుగ్రహము:
రామలింగేశ్వర రావు గారి మరొక పద్య కావ్యం ‘శివానుగ్రహము’. కవికి పరమేశ్వరుని పట్ల గల భక్తి వెల్లువై వెన్నెల వాకయై ప్రవహించినదీ కావ్యంలో. శివా! అనే మకుటంతో సాగిన ఈ శతకాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే సామాన్య పాఠకులకు వ్యాఖ్యనం అవసరం. ఎన్నో వేదాంత రహస్యాలు, ఉపనిషద్వాక్యాలు నిక్షిప్తమై ఉన్న ఈ శతకంలో భక్తి శతకాలన్నింటిలో కనుపించే ఆర్తితో పాటు పాఠకులు అర్థం చేసుకోవలసిన అనే తాత్త్విక విషయాలు కనుపిస్తాయి. కవితా సాధనను యోగ సాధనగా భావించాడు కవి. అందుకే
“కవితా సాధన యోగ సాధనముగా కల్పించి సద్యోగసం
భవమానందము పొందనెంచితి రసబ్రహ్మావతారా! రసో
ద్భవ సాహిత్య సదబ్జయోని! పృథు శబ్ద బ్రహ్మ చిన్మూర్తి! నా
కవితాయత్నము లర్థవంతములుగా కల్పింపనీవే శివా!”
అంటారు.
‘రసోవైసః’ అంటున్నది ఉపనిషత్తు. ఆనందానికి రసమనే పేరున్నది. ఆ విధంగా రసానందం అంటే బ్రహ్మానందమే! ఈశ్వరుడు ఆనందకరుడు. అందుకనే కవి ఈశ్వరుని రసబ్రహ్మావతారా! అని సంబోధిస్తున్నాడు. ఇదొక సాధనాపథమని, ఈ పథంలో ఎందరో పూర్వ ఋషులు సంచరించారని, వారి పాద చిహ్నాలను అనుసరించి తానూ పయనిస్తానని అంటాడు. సనాతనమైన వారి భావమే తననూ వరించాలని కోరుకుంటాడు.
కవి తన కవిత్వానికి ప్రేరణను గురించి ఇలా అంటాడు.
“నీ గాథాశ్రవణంబు నా చెవులలో నిర్ర్హాదగీతంబులై
నాగప్రస్వరగానమై ఉపనిషన్మాధుర్య పాధస్తరం
గీగాంభీర్యము ముద్రవేసినది తండ్రీ! నాడుగా నా కవి
త్వగ్రైవేయము ప్రస్తరించినది శైవ ప్రాభవంబుల్ శివా!”
తన సాహిత్యానికి శివుడే లక్ష్యమనీ, శివపాదపద్మ దయారూపకమైన ఘంటాపథాన్నొకదానిని ప్రాలేయాద్రిదాక నిల్పుతాననీ అంటాడు. పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపించే ఈ భక్త కవిలోని వైరాగ్య వీచికలను చూడండి.
“నా కర్మాళి నశించిపోయి, జగమంతా హేయమై తోచి నా
యీ కాయంబును భారమై, మనసులో నీ పంచప్రాణంబులం
దేకత్వమ్మును బొంది, వాక్కులయమై తేజస్సులోనిండి యే
వో కైలాస శిఖాప్రలోభములు చూపున్ వాంఛపెల్లై శివా!”
పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఏదో ఒకటి చేయాలని ఆరాటపడతాడు.
“వేదార్థంబులు చిల్కరించి కవితల్ విన్పింతునా? లేక మా
ధ్వీదివ్యాసవమిత్తునా? మధుర సద్వీణాశ్రుతుల్ నింతునా?
నాద స్వఛ్ఛ లయానుకూల శివ సంధ్యానృత్యమాడింతునా?
ఏదో నీ దయ కోసమేదయినగానీ చేయఁజూతున్ శివా!”
పరమేశ్వరుని కారుణ్య ధారాపూరము అరుదెంచేదాక తన పద్యాంబు రసాభిషేకానికి అంతే లేదంటాడు. జాగృత్, స్వప్న సుషుప్త్యావస్థలలో కూడా తన మనసు ఇతర విషయాలపైకి పోవటం లేదని అంటాడు. తన ప్రయత్నం వ్యర్థమవుతుందేమో పరమేశ్వరానుగ్రహం లభిస్తుందో లేదోననే సంశయంతో మనసు డోలాయమానమవుతూంటుంది మధ్య మధ్యలో.
ఈ జన్మలో ఏదో రాజయోగం ఉందని జ్యోతిష్యులు అంటారు గానీ అదే విధమైనదో తెలియటం లేదనీ ఊహించటానికి యత్నిస్తాడు.
“ఈ జన్మంబున రాజయోగమొకడేదే లబ్ధమౌనంచు నా
తో జ్యోతిర్విదులాడుచుందురు కవిత్వోపాసనాలబ్ధమౌ
ప్రాజాపత్యమొ! జీవితావసర మర్యాదార్హముద్యోగమో
రాజద్రాజజలేజ నాయక కృపా రాజీవమేమో! శివా!”
తన అపార కవితా నైవేద్య సంపత్తికి ప్రతిగా పరమేశ్వరుడిచ్చే నీవారతుల్యమైన, సూక్ష్మమైన కారుణ్యం చాలుననీ దానినే కొండంతగా భావిస్తాననీ అంటాడు. తన పద్యాలు ఈశ్వరుని పాదతలంపైని మందార ప్రసూనాలని, స్వేద జల సంధ్యా నృత్య నిర్మాల్యమని, భూధరేంద్ర మణి కన్యా కౌచ కస్తూరి అని, తన పద్యాలే ఈశ్వరానుగ్రహాన్ని తనకు ప్రసాదిస్తాయని అంటాడు.
శ్రుతి శిరస్సులైన ఉషనిషద్వాక్యాలు కవి పద్యాలలో అలవోకగా ఒదిగిపోయాయి.
“సోఽన్వేష్టవ్యమటన్న భావములలో చొక్కుల్ ప్రసాదింపుమీ
నిన్వేమారు ‘లధీహి బ్రహ్మ’మని వందేశాంతమూర్తీ! యటం
చు న్వారుణ్యవతార రూపమని నిన్నున్ త్తెత్తిరీయోక్తముల్
కణ్వశ్రీ పరిశుద్ధ భావములతోఁగైతల్ వచింతున్ శివా!”
కవితా ప్రౌఢులు పేదలవుతారని తన తండ్రి అంటుండేవాడని, కాని తన వంశ పురుషులు శివునే ప్రార్థించేవారని తన పేదరికం మాత్రం అవిలంఘ్యమై పోయిందనీ అనుకొంటాడు. తనవంటి వారు లోకంలో ఎలా బ్రతుకుతారో తెలియక ఆ బాధను శివునికే చెప్పుకొంటాడు.
తన కవితాసాధనకు లక్ష్యంగా కావ్యాంతర బ్రహ్మ సంభవంగా, రసంగా, శరీరం, ప్రాణం – అన్నీ ఈశ్వరునిగా తోచినా మళ్ళీ ఒక్కొక్కసారి మాయ కమ్ముకొని వస్తుందంటాడు. “ఏకంసత్ శివఏవ, తత్త్వమసి, సత్యేనేహనానాస్తి, సోహమస్మి సర్వం ఖల్విదం బ్రహ్మమ్’ అంటూ ఏకగ్రీవంగా వేదాలు ఘోషిస్తున్నాయి. తనకు ఆ శ్రౌత రహస్య మార్గముల ప్రజ్ఞలు తోచుగాక అని ఆశిస్తాడు. తనకోసం శివుడు వస్తాడనే ఆశ ఒక్కటే తనను నిలుపుతోందని అంటాడు. ఏనాడో ఒక భక్తుని రక్షించినది లెక్కేలేదు పోవయ్యా! ఈనాడు తనవంటి వాడిని కరుణిస్తే గాని లాభం లేదంటాడు చనువుగా. అంతగా వాపోయాక చివరకు ఈశ్వరుడు తనకోసం వస్తున్నట్లనిపించింది. గంగా తరంగ ఘోషలు, శరీరంలోని అర్ధభాగంలో కొలువై వున్న భవానీ మాత మణిమయమైన ఆభరణాల మ్రోతలు శివుని ఆగమనాన్ని తెలియచేశాయి.
“అదిగో విన్పడెడున్ శిరస్థ్సితధునీ వ్యాసంగసంభావనా
స్పదముల్ తుంగతరంగసంఘటితశబ్దశ్రీలు సమ్మోహముల్
మృదుశైవార్థవధూనికామణిమయామేయాచ్ఛకాంచీక్వణా
భ్యుద యోత్థాపితదివ్యశబ్దములు నీవున్ వచ్చునట్లై శివా!”
భక్తునికి భగవంతుడొక అనుభూతి. ఈశ్వర కటాక్షం అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలిగిస్తుంది. ఈశ్వర సాక్షాత్కారానికి సంకేతమైన ఆ అనుభూతి భక్తుని బ్రహ్మానందంలో ఓలలాడిస్తుంది. అందుకే బసవేశ్వరుని పాదచిహ్నాలు గుర్తించగానే శివుడు తనకోసం వస్తున్నట్లు తెలిసి హృదయంలో ఒక గొప్ప ఆనందం అనుభూతమయింది. ఇలా ఈశ్వరానుగ్రహం కోసం పరితాపంతో సాగిన కావ్యం శివానుగ్రహము. అందుకే విశ్వనాథ
“ఈశ్వర పాద భక్తి విమలేడిత! తుమ్మలపల్లి రామలిం
గేశ్వరరాయ నామక కవీశ్వర లోక శిరః ప్రసూనమా!”
అని ప్రశంసించారు.
పితృ యజ్ఞము:
రామలింగేశ్వర రావు గారి మరొక కావ్యం పితృయజ్ఞము. ‘పితృయజ్ఞము’ అనే పేరులోనే కవి కర్మనిష్ఠ తెలుస్తున్నది. పితృకర్మను ఒక యజ్ఞంగా భావించాడు కవి. పితృదేవుడంటే శివ పరబ్రహ్మం. ‘ఈశానః పితృరూపేణ’ అని వైదిక కర్మ మంత్రం చెపుతున్నది. కవి పితృయజ్ఞాన్ని ప్రణవోపాసనగా ప్రతిపాదించాడు. పితృ, పితామహ, ప్రపితామహులు వసు, రుద్ర, ఆదిత్యరూపులు. పితరం వసు రూపం, పితా మహం రుద్రరూపం, ప్రపితా మహం ఆదిత్య రూపం.
ఈ దేశం కర్మభూమి, ఫలాన్ని ఆశించినా ఆశించకపోయినా కర్మ చేయవలసినదే! భగద్గీత చెప్పేది కర్మ పరిత్యాగాన్ని కాదు, కర్మఫలత్యాగాన్ని. చేసిన కర్మకు ఫలితం తప్పదు. కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. కర్మకు జ్ఞానం అవసరమైనట్లే జ్ఞానానికి కర్మ కూడా అవసరమే. కర్మ చేయడమంటే ధర్మాన్ని ఆచరించటమే, అనుసరించటమే! మరి ధర్మ కర్మాచరణకు ఇంద్రియాలుండాలి. ఇంద్రియాలతో కూడిన శరీరాన్నిచ్చినవారు తల్లిదండ్రులు. కాబట్టి పితరులకు చేసే కర్మకాండను ఒక యజ్ఞంగా భావించి నిష్ఠతో శ్రద్ధతో చేసినవాడే ఋషి సంప్రదాయాన్ని అనుసరించేవాడు.
భారతీయమైన ఆర్ష సంప్రదాయంలో దేవ, పితృ, ఋషి ఋణాలను తీర్చుకోవటం ప్రతి వ్యక్తికీ విధి. ఈ పద్యం వ్యక్తి పారివారిక ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో తెలియజేస్తున్నది.
“ఈ వంశ వర్థన హేతు మహర్షి ర
క్తంబులోనున్న ప్రాగల్భ్య మెరిగి
ఈ వంశ పావిత్ర్య భావనా నిధులతే
జస్సు పెంచిన తప్పశ్శక్తి పొంది
ఈ వంశపాలనా హేలా సమారబ్ధ
శైవ సంకల్ప రక్షణము బడసి
ఈ వంశ పూర్వ మహీయః కళాస్వరూ
ప మధుర కావ్య శిల్పములు తెలిసి
రుద్ర వసుమిత్ర, పితృదేవ లోకదత్త
చాతురీ కమనీయ హరితమగుచు
నా తనూ వాహమైన ప్రాణానిలంబు
నాగళంబులో రేపుచున్నది సర్వంబు”
పితృ వియోగ దుఃఖంతో కవి పలికిన పలుకులు కరుణ రసప్లావితాలు. సకల రాజోపచార యోగ్యమైన పితృదేహాన్ని చితాగ్నిలో వ్రేల్చి, అస్థికలు జలంలో నిమజ్జనం చేసి, సన్నిహితమైన పితృ ప్రశస్త భావాన్ని దూరవసులోక భూముల వరకు తోలి, శాశ్వతంగా భూమి ఛాయలకు రానీయకుండా కట్టడులు చేసిన తాను పాపాత్ముడనని తనను తాను నిందించుకొంటాడు.
తాను తండ్రి జీవించినప్పుడు తన కవిత్వాన్ని వినిపించలేదని, ఇప్పుడా కవిత్వాన్నే అర్ఘ్యంగా ఇస్తానంటాడు. తనకు గాయత్రీ మంత్రోపదేశం చేసిన తండ్రిని స్మరిస్తాడు. ఏం చేసినా పితృఋణాన్ని తీర్చుకోలేనంటాడు.
“నీ యుత్ర్కమణ వేళ నేఁజేయు మంత్రస్మ
రణ భవధుపదేశ ఋణము తీర్చు
అంత్యకర్మారంభమందు ప్రాయశ్చిత్త
మునుజేసి సంస్కార ఋణము తీర్తు
మత్తనుసృష్టి ప్రమాణంబు చితివహ్ని
కిచ్చి దేహ భరిత ఋణము తీర్తు
నీ పవిత్రాస్థికల్ నిర్ఘారాంబుల త్రోసి
జని సంప్రదాయంపు ఋణము తీర్తు
నా యథాశక్తి సర్వదానములు చేసి
నైజ లౌకిక వ్యగ్ర ఋణంబు తీర్తు
తావకీనాత్మజత్వ సందర్భమైన
తీర్పరాని పితౄణమదెట్లు తీర్తు”
పూర్వ యుగాలలో భార్గవుడు, రామభద్రుడు పితృవాక్య పాలనతో ఋణవిముక్తులయ్యారు. తాను భవ్యకవితా రసాన్నే తర్పణంగా చేస్తూ రామకథను రచిస్తానంటాడు. ఎందరో ముముక్షవులు కావ్యేష్టియందు బ్రహ్మానుభవాన్ని అనుభవించారని, తననా పూర్వ కవి యోగులందరూ ఆశీర్వదించాలని వినమ్రుడై నమస్కరిస్తాడు. తమ కుల ఋషులకు, బ్రహ్మ సూత్ర భాష్యకృతులకు అంజలిస్తాడు. ఆదికవి వాల్మీకిని, భవభూతి, మురారి కవులను, కవిత్రయాన్ని స్మరిస్తాడు. తన గురువును భక్తితో తలచి తొలి కావ్యమైన రామాయణాన్ని ప్రారంభిస్తాడు. తన కావ్య రచనాకృషికి మార్గ రక్షకులను గురించి చెపుతూ
“సత్యమగు దర్శనాంత సాహిత్య దృష్టి
తీవ్రమగు పాదుకాంత మాంత్రికము దీక్ష
పైతృకము సంప్రదాయ సంపత్ఫలంబు
కావ్యకృషిలోని మార్గరక్షకులు నాకు”
అంటారు.
శ్రీరాముడు సీతాలక్ష్మణులతో నివసించిన చిత్రకూట వర్ణనతో కావ్యం మొదలవుతుంది. చిత్రకూటం తపోమహస్సుకు నిత్యాశ్రయమట. అక్కడి నిత్య హోమాజ్య ధూమం క్ష్మాతలాన్ని, స్వర్గ తలాన్ని ఏకం చేస్తున్నదట. ఆ ధూమం ప్రతిరోజూ ఆహ్వానింపబడిన సుపర్వగణం ధరణిపైకి వచ్చే పథంలా ఉన్నదట. ఒకనాడు దీనుడై, సేనా సమేతుడై భరతుడు వచ్చాడు. వశిష్ఠునికి నమస్కరించి లేచిన రాముని పాదాలపై బడి భరతుడు దుఃఖించాడు. భరతుని దుఃఖానికి కారణమేమిటో తెలియక వృద్ధుడు, ఆప్తుడు అయిన సుమంత్రుని వంక చూశాడు రాముడు. ఇక్కడ రఘు వంశానికి, సుమంత్రునికి ఉన్న అనుబంధాన్ని కవి విపులంగా వర్ణిస్తాడు. సుమంత్రుడు దశరథుని మరణవార్తను చెప్పటానికి నోరాడక, చివరకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని చెప్పాడు. తండ్రి మరణవార్తను విన్న రామచంద్రుడు మూర్ఛపోయాడు. తండ్రి వాత్సల్యాన్ని తలచుకొని దుఃఖించాడు.
వశిష్ఠ మహర్షి రామచంద్రునికి జీవులు కర్మబద్ధులై ఉండటాన్ని ఉపదేశించాడు. దానికి పూర్వరంగంగా శ్రావణ కుమారుని కథను వివరించాడు. పితృకర్మ చేయమని ఆదేశించారు. కవి ప్రతి పదాన్ని అర్థవంతంగా ప్రయోగించాడు. శోకాకులుడైన రామచంద్రునికి ‘శ్రీ వాశిష్ఠులు’ కర్మసూత్ర రహస్యాన్ని వివరించారు. అంటే ఇది జ్ఞాన వాశిష్ఠం. జ్ఞానం, కర్మ పరస్పర సంబద్ధాలు అనే విషయాన్ని ఈ పద ప్రయోగంతో సమన్వయించుకోవాలి. అప్పుడే పాఠకునికి ‘పితృయజ్ఞం’ అర్థమవుతుంది.
పితృవియోగంతో తల్లడిల్లిన వాడు రామచంద్రుడు, రామలింగేశ్వరుడు కూడా. కావ్యాదిలో కనుపించిన కరుణం శాంతంగా పరిణమించింది. కవి శాంత పర్యవసాయి అయిన తన కావ్యఫలంగా దేశశాంతిని కాంక్షించాడు. శాంతిపాఠంతోనే కావ్యం ముగుస్తుంది.
ప్రేయోనువాకమ్:
రామలింగేశ్వరరావు గారు సతీస్మృతిలో వ్రాసిన కావ్యం ‘ప్రేయోనువాకమ్’. కుసుంభ, నీలీ, మాంజిష్ట రాగాలు దేవహూతి కర్ధముల, సీతారాముల, నలదమయంతుల ప్రస్తానలతో ధర్మబద్ధమైన దాంపత్య శోభలు విరజిమ్ముతాయి ఈ కావ్యంలో. ద్వితీయ, తృతీయ పురుషార్థాలు మొదటిదయిన ధర్మంతో ముడివడిన భారతీయ ఋషి సంప్రదాయం, సనాతన ధర్మదృష్టి కావ్యమంతటా కనుపిస్తుంది.
తన అర్ధాంగి నిత్య, నైమిత్తిక కర్మలలో ఏవిధంగా తోడ్పడేదో చెపుతూ
“అఘమర్షణస్నాన మాచరించెడు వేళ
నస్త్రమంత్రార్థ భాష్యంబులీమె
సంధ్యవార్చి జపము సలిపెడు వేళల
కాలోచిత జ్ఞానశీల మీమె
ఔపాసనాగ్ని ముఖావరూఢ రుచిర
కారుణ్యమునకు తార్కాణమీమె
దైవత ఋషి పితృ తర్పణంబుల వేళ
శోభిల్లు శాంతి విస్ఫురణమీమె
వైశ్య దేవాన్న సంస్కారబలుల వేళ
గార్హ్యకర్మాధికార యోగ్యతయు నీమె
అతిథి సత్కార వేళా మహాన్నపూర్ణ
అద్వయాకృతి – ఈమె నిత్యంబునాకు”
అంటారు. దాంపత్యం కేవలం లౌకికమైనది కాదు. ఆంతరికమైన స్నేహమే ఆ బంధాన్ని పవిత్రం చేస్తుందని కవి ప్రగాఢ విశ్వాసం.
“భార్యభర్తృత్వంబుల
మర్యాదలు లౌకికంబు మాత్రమె కాదున్
ధుర్యంబై చనుయోగం
భార్యా నూచీనమైన హవన విభూతుల్”
పూర్వరాగం మూడువిధాలు. బయటలు విశేషంగా కనబడి కాలాంతరంలో తొలగిపోయేది కుసుంభరాగం. కనబడకపోయినా లోపల స్థిరంగా ఉండేది నీలిరాగం. బయటకు కనబడుతూ లోపల కూడా ఎప్పటికీ స్థిరంగా ఉండేది మాంజిష్ట రాగం. ఈ మూడు రాగాలకు ఉదాహరణలుగా దేవహుతి కర్దములను, సీతారాములను, నలదమయంతులను గ్రహించారు కవి. వారి గాథలను విపులంగా వర్ణించారు. తనను కర్దమునిగ తన సతిని దేవహూతిగ, తనను రామునిగ, ఆమెను సీతగ, తనను నలునిగ, పత్నిని దమయంతిగా భావించి, ఊహించి వారి కథలను వర్ణించారు. తన కష్ట సుఖాలలో పాలు పంచుకొని, కష్టనష్టాలను సహనంతో భరించిన భార్యను స్మరించి వ్యథాకులుడవుతాడు కవి. రురువు ప్రమద్వరను బ్రతికించుకొన్నట్లుగా ఆమెను బ్రతికించుకోలేనంటాడు.
“వింటివా పూర్వము రురువు పేరు నీవు
మరల బ్రతికించుకొనె ప్రమద్వరను ప్రియను
ఈ వయస్సులో రురువు కాలేను నేను
శిరము వంచెదనే కాలపురుషునకును”
తండ్రి తనపైన కుటుంబ భారాన్ని మోపి, ఆ బాధ్యతలో ఆమెను తనకు సహచరిగా చేసి వెళ్లారని, కుటుంబ సభ్యులు ఒడ్డు చేరారు కాని ఆమె తనను వీడి పోయిందని బాధపడతాడు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య గతించగా జీవచ్ఛవంలా తాను ఆమె స్మృతి అనే మహాగ్నిలో అజమహారాజులా కాలిపోతానంటాడు.
తాను అర్పించే శ్రీదేవి ఆమెను అనుగ్రహించాలని ఆకాంక్షిస్తాడు. సృష్టి అంత జగజ్జనని ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తుంటుందని తామే అన్ని భ్రాంతులు కల్పించుకొంటున్నామని అంటాడు. కనులు విప్పని పసినాళ్ళలో తండ్రి, ఆపదలనే అగ్నిలో తల్లి, కనుపించని శూన్యంలో విలీనమై భార్య తనను విడచిపోయారని, జన్మసిద్ధమైన పేదతనమొక్కటే విడవకుండా ఉన్నదని అంటాడు. ఎవరికైనా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదని, తన కర్మమే ఇదంతా అని వాపోతాడు. బంధుకోటిపై గాని, బిడ్డలపై గాని ఇక మమకారం అవసరం లేదని, వారందరూ క్షేమమేనని, తానొక్కడే ఆమె వియోగంతో పరితపిస్తున్నానని అంటాడు. శ్రీదేవి నివాసాన్ని మనోహరంగా వర్ణించి, తన అర్ధాంగి తపస్సిద్ధి వలన ఆ లోకానికి చేరిందంటాడు.
“పసుపు పండించు కల్పద్రుమ శాఖలపైన
పూచిన కుంకుమ పూల సొగసు
త్రయ్యంత భావ విస్తార చందన చర్చ
కడిమి చెట్టుల నుండి గాలి విసరు
ప్రతి శబ్దమున దేవి వైభవ వ్యాఖ్యాన
కీర్తన స్పష్ట సంగీత మధువు
ప్రతి దృశ్యమున పరబ్రహ్మ వైవర్తత
త్త్వారూఢ నైగము ప్రాభవంబు
శ్రీ పరాదేవి దివ్యాంఘ్రి చిన్మహస్సు
సంతత శ్రీమయంబుగా సాగుచుండు
ప్రళయమెరుగని గౌరీ నివాసభూమి
చేరికొన్నావు నీ తపస్సిద్ధి వలన!”
పరాదేవి పాదసీమకు చేరి ఆ దేవి వాత్సల్యాన్ని అనుభవించమంటాడు. తన కావ్యం స్వగతమనీ, ఆమె ముందరున్నట్లుగా భావించి మనసులో మాటలన్నీ చెప్పానని, తన హృదయభారంతో పాటు సంచిత కర్మశేషం కూడా తొలగిందని అంటాడు. భార్యపట్ల గల అనురాగం ఆమెతో గడిపిన జీవితం – అన్నీ క్రమక్రమంగా కనుమరుగై తురీయాశ్రమానికి నిర్ణయం జరిగింది. దుఃఖం తొలగి క్రమంగా ముఖం మీదొక హాసరేఖ ఉదయించింది. ఎందుకంటే
“అతివ దక్కలోక మన్యంబు సర్వంబు
మాతృదేవి యన్న మనసు నాది
అతివ గూడ నింక నమ్మవారేయన్న
హాసరేఖ యొకటి యందగించె”
ఎంత ఉదాత్తమైన భావన! భార్య తప్ప ఇతర స్త్రీలందరూ మాతృదేవతల్లా కనిపించటం జన్మతః కలిగిన సంస్కారం – ప్రహ్లాదునిలా అమ్మవారిలో ఐక్యమైన తర్వాత అర్ధాంగి కూడా అమ్మవారే అనే భావన, ఎఱుక కవి తపః ఫలం. భావనలో కూడా ఇక ధర్మపత్ని భాసించకూడదని సర్వజగత్తు పరాంబయొక్క మాయా వివృతంగా తెలిసి, ఆత్మ ముఖుడవుతాడు. ఈ విధంగా ఈ స్మృతి కావ్యం కూడా శాంతరస పర్యవసాయిగానే ముగిసింది.
అగ్నిష్టోమము:
‘అగ్నిష్టోమము’ పద్య, గేయ, వచన, కవితా సంపుటి. కవి సంప్రదాయానురక్తి అనేక ఖండికలలో కనుపిస్తుంది. పూర్వ కవులను స్మరించి వారు తిరుగాడిన భూమిలో జన్మించినందుకు పరవశిస్తారు.
“ఏ పురాంధ్ర కవీంద్ర సత్కృతులలోన
తెనుగుదన మొక్క రూపంబు తీర్చుకొనెనొ
తన్మహా కవిరాజ పాదతలభూమి
రేణువులలోన నొక్కడవైన చాలు”
అంటారు.
దాదాపు 60,70 సంవత్సరాల క్రితం వ్రాసిన వచన కవితలలోని భావ నిర్దుష్ఠత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మానవ సౌభాగ్యం మరింత చేసేదైతే విప్లవమవుతుంది గాని అర్థం లేని వస్తువులు విప్లవ చిహ్నాలు కావంటారు. ప్రాణం, పరిశ్రమా, విలయం, విప్లవమూ అన్నీ ఒక చెట్టున కాసిన కాయలు; అన్నీ ఒక సిద్ధాంతానికి ఛాయలు అంటారు. పొలాలు పండించటానికి, ఫలాలు కాయించటానికి ఇలా తలం కావాలి కనుక ఇలా తలంగా దేశాన్ని నిర్వచించారు. మనుగడకు, మానవతకు ఘనులమన్న గౌరవ భావాలకు మానవ సంఘమే దేశంగా మరొక నిర్వచనం. కాని ఆర్య ఋషుల భావం అంతమాత్రమే కాదు అంటారు.
“పృథివి సమస్తం పురుషోత్తమ రూపం
అండ పిండ బ్రహ్మాండాలు అంతా విరుట్పురుష మయం
సర్వ సర్వం సహాచక్రం జనతాచైతన్యానికి మూలం
ఇటు భూచక్రం నుంచి అటు శ్రీచక్ర పర్యంతమూ
ఇవి మహా చిన్ని వాసాలు”
అంటారు. ‘విప్లవ రథ గమ్యస్థానం విశ్వమానవ కల్యాణ దినం’ అంటారు. విప్లవానికి చక్కని నిర్వచనాన్నివ్వటంతో పాటు విశ్వాన్ని, విశ్వాత్ముని గురించి క్లుప్తంగా, రసరమ్యంగా చెప్పిన తీరు ఆర్షకవికి మాత్రమే సాధ్యం. ‘అగ్నిష్టోమం’ అనేది వసంతకాలంలో ఐదురోజులు చేసే యాగం. వివిధ విషయాలను గురించి ఎన్నో ఖండికలున్నా దీనికి ‘అగ్నిష్టోమం’ అనే పేరే సరి అయినది. ఎందుకంటే కవి నిత్యం అగ్నిని అర్చించే సంప్రదాయాన్ని పాటించేవాడు.
“స్వామి నీవు నిత్యము నాకు స్నానమట్లు
స్వామి నీవు నిత్యము నాకు భార్యయట్లు
అగ్ని నీవు నిత్యంబు అధ్యయనమట్లు
నీ యుపాసన నాకు నిత్యేష్ఠి దేవ”
అంటాడు అగ్నిని సంబోధిస్తూ.
సహస్రార కమలంలోని బ్రహ్మమయమైన పరాస్వరూపం అగ్నిలా వెలుగుతోందంటాడు.
“ఈ సహస్రార కమల మధ్యేనివిష్ట
చక్రరాజ బిందుగత చిచ్చంద్ర కరప
రా స్వరూప వహ్ని తెలిసె బ్రహ్మమయము
నాత్మ మయము నంతర్యాగమందు నీవు”
జ్యోతి స్వరూపుడైన పరమాత్ముని దర్శించటమే సాధకుని లక్ష్యం.
‘అహోబత’ అనే ఖండికలో ధర్మచ్యుతికి బాధపడుతూ నదులను, పర్వతాలను, ఋషులను ధర్మసంస్థాపనకై ఆహ్వానించారు. ‘ఆషాఢ తరుణము’ నుండి ‘అగ్నిష్టోమము’ వరకు ఇందులో 29 పద్య, గేయ, వచన కవితలున్నాయి.
హాస్యగాథాద్విశతి:
‘హాస్యగాథాద్విశతి’ రామలింగేశ్వర రావు గారి హాస్య ప్రియత్వాన్ని తెలిపే కావ్యం. సమకాలీన విషయాలనెన్నిటినో మృదువైన హాస్యంతో చమత్కారంగా చెపుతారు కవి. ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరకూ కళ్ళజోళ్ళుంటున్నాయి. దాన్ని కవి ఇలా చమత్కరిస్తున్నారు.
“ప్రేమ గుడ్డిదన్న పెద్దల వచనంబు
సత్యమనుట కెంత సాక్ష్యముండె!
యువకులెల్లగాక యువతీమణులు కూడ
కండ్లజోడు లేక కానరారు!”
కళ్ళజోడు గురించి మరో పద్యం-
“కండ్లజోడు నిద్ర కాలంబునందేల
పెట్టుకొంటివోరి పొట్టివాడ?
కలలలోన జనులు కాన్పింపవద్దేమి?
జోడులేక వారి చూచుటెట్లు?”
వైద్యుల గురించి ఒక చురక –
“శ్రమపడకు మీవు మిగుల విశ్రాంతి గొనుము
అదియె నీకు నారోగ్యభాగ్యమని వైద్యు
డంపినది బిల్లు తీర్చివేయవలెగాన
పాటుపడితిని రెండు సంవత్సరములు”
ఇలా ఈ కావ్యంలో ఎన్నెన్నో విషయాలతో చమత్కారభరితమైన 216 పద్యాలు ఉన్నాయి. చింతామణి మంత్ర బీజాక్షరాలతో కూర్చిన ‘చింతామణి ద్విశతి’ అముద్రిత కావ్యం.
రామలింగేశ్వర రావు గారు పితృయజ్ఞం వ్రాసినా, ప్రేయోనువాకమ్ వ్రాసినా, అగ్నిష్టోమం వ్రాసినా అందులో కనిపించేది అవిచ్ఛిన్నంగా సాగివస్తున్న ఋషి సంప్రదాయమే. అందుకే ఆయనను ఆర్ష కవీశ్వరుడు అనటం సమంజసం.