మిత్రుల నాగాలాండ్ మేఘాలయ యాత్రానుభవాలు-1

0
3

[dropcap]ఎ[/dropcap]వరు వృద్ధులు? అరవై దాటినవారా? డెబ్భై దాటినవారా?

నా మిత్రులు కొందరు ఏడుపదులు దాటినా, రికామీగా ఒంటరిగా, మిత్రులతో కలిసి పర్యటనలు చేస్తూ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నవారున్నారు. శ్రీ మల్చూరు విజయభాస్కరరెడ్డి గారు వృత్తిరీత్యా పారిశ్రామికవేత్త. ఇప్పడు విశ్రాంత జీవితం గడుపుతూ, కొండలెక్కుతూ, ట్రెక్కింగుల్లో పాల్గొంటూ క్షణం తీరికలేకుండా వున్నారు, దేశదేశాలు చూశారు, సొంతంగా కారు నడుపుతూ అమెరికా అంతా పర్యటించారు, కరోనా కష్టకాలంలో ఏడాదిపాటు ఇంటిపట్టున ఉన్నా, మళ్ళీ ఇప్పుడు యాత్రలకు ఉద్యమించారు. నేను తిరగడం మానుకొన్నా, ఇతరుల పర్యటనానుభవాలు అందరితో పంచుకోడం ఒక సరదా, చాలా ఇష్టం.

తెలితెలి మబ్బులతో స్వాగతం

మొన్న డిసెంబర్ మొదటి తారీకు నుంచి 10వ తారీకు వరకు నాగాలాండ్ ముఖ్యపట్టణం కోహిమాలో ఏటా జరిగే హార్న్ బిల్ ఫెస్టివల్‌కు ఈ యేడు నా మిత్రులు విజయ భాస్కరరెడ్డి, వారి మిత్రులు దయానందబాబు వెళ్లి వచ్చారు. ఇప్పడు డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణం వల్ల సమయం, శ్రమ తగ్గుతుంది. చెన్నై నుంచి కొలకత్తా, అక్కణ్ణుంచి నవంబరు 29న దిమాపూర్‌కు విమానంలో వెళ్లారు. దిమాపూర్ నాగాలాండ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. కోహిమా రాజధానైనా దిమాపూర్ అన్నిటికీ కేంద్రం. దిమాపూర్ విమానాశ్రయాన్నించి టాక్సీలో కోహిమాకు 3 గంటల ప్రయాణం. ముందే ఏర్పాటు చేసుకున్న ప్రకారం నగరం నడిబొడ్డున, మంచి హోటల్లో దిగారు.

కోహిమా

కోహిమాలో ముందుగా మాట్లాడుకొన్న టాక్సీలో జ్యులీక్ (DUZULEKE) గ్రామానికి వెళ్ళారు, గంటన్నరపైనే ప్రయాణం, 40కిమీ దూరం, రోడ్డంత సుగమంగా ఉండదు. జ్యులీక్ చాలా చిన్న గ్రామం. 150 జనాభా. సన్నటి గొందులు, సందులు, చుట్టు దట్టమైన అడవి, ఎక్కడ చూచినా మహా వృక్షాలు, వెదుళ్ళు, అడవి యాపిల్ వృక్షాలు. dzu చిన్న నదీప్రవాహం ఈ గ్రామం వద్ద భూమిలోకి ప్రవేశించి అదృశ్యమవుతుంది. నాగాలాండ్‌లో ముఖ్యమైన ఆదివాసీ తెగ అంగామీ ప్రజలు ఈ కుగ్రామంలో కూడా నివాసం ఉంటున్నారు. ఈ గ్రామీణులు చాలా ఆత్మీయంగా ఉంటారు. అంగామీ భాషలో dzu ఆంటే నీళ్లు. Leke అంటే భూగర్భం. అదే ఈ వూరిపేరయింది. అన్ని ఆరాటాలు, చికాకులు విడిచిపెట్టి ఈ తపోవనం లాంటి జ్యులీక్‌లో ఉండడమే గొప్ప అనుభవం. కొందరు అక్కడి సెలయేటి ఒడ్డున క్యాంపు వేసుకొని ఆనందంగా రోజుల తరబడి ఉంటారు. ఆ కొండల్లో ఎక్కడ చూచినా అడవి అరటిచెట్లు సహజంగా పెరిగి కాస్తాయి. అడవి యాపిల్ పండ్ల నుంచి తయారుచేసిన వైన్ రుచి చూడడం కూడా ఒక సరదానే పర్యాటకులకు. విజయభాస్కర్ రెడ్డి చిన్న వైన్ బాటిల్ నెల్లూరు మిత్రులకు రుచి చూపవచ్చని కొని దాచుకున్నారు కాని, గౌహాతి విమానాశ్రయంలో అనుమతించలేదట. జ్యులీక్‌లో సహాంజంగా గుహలాగా ఏర్పడిన ఒక ప్రదేశాన్ని కూడా దర్శించారు.

హార్న్ బిల్ ఫెస్టివల్‌లో విజయభాస్కర్
దయానందబాబు, విజయభాస్కర్

2021డిసెంబరు మొదటి తారీకు ఉదయం 10 గంటలకు అధికారికంగా ప్రారంభం కావలసిన హార్నుబిల్ ఫెస్టివల్ ఏవో కారణాలవల్ల ఈమారు సాయంత్రం 4 గంటలకు ఆరంభమయింది. కోహిమా నుంచి కిసామాకు పది కి.మీ దూరం. షేర్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. నాగాలాండ్ లోని 17 ఆదివాసీ తెగల ప్రజలు వారివారి తెగల వేషాల్లో ఈ జాతర వంటి ప్రదర్శనలో పాల్గొంటారు. ఇక్కడ ప్రతి తెగవారు తమ తమ వస్తువులను, జీవన విధానానికి సంబంధిచిన ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనశాలలను మురంగ్ అంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభోత్సవం. ఆరోజు ఉదయంనుంచే కోలాహలంగా అన్ని ప్రదర్శనశాలలు తెరిచారు. వారి వారి తెగల భోజనాల షాపులు తెరిచారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా వరన్నం, పప్పు ఆహరం. పోర్క్, చికెన్, బీఫ్, డాగ్ మీట్ కూడా భుజిస్తారు. విజయభాస్కర్ రెడ్డి పట్టుపురుగులతో చేసిన వంటకం – కరుకుట్లను, ఈశాన్యరాష్ట్రాల్లో పండే స్టికీ రైస్‌తో చేసిన వంటకాన్ని రుచిచూశారు. నాగాలు బియ్యంతో బీరు తయారుచేస్తారు. మన మిత్రద్వయం రైస్ బీర్ కూడా రుచిచూశారు. ఎక్కడకు వెళ్ళినా ఆ ప్రజల ఆహారం తినడం, అక్కడి పానీయాలు రుచిచూడడం విజయభాస్కర్ రెడ్డికి అలవాటు. ఏదైనా ఒక్కసారి రుచి చూడడమే. భిన్న భిన్న ప్రాంతాలనుంచి మనదేశప్రజలు, విదేశాలనుంచి పర్యాటకులు హార్న్ బిల్ ఫెస్టివల్ చూడడానికి వస్తారు. ఈ ప్రదర్శన పదిరోజులు కొనసాగుతుంది.

రెండవరోజు కూడా మళ్ళీ కిసామాకు వెళ్లి ఆదివాసీల ఫెస్టివల్ చూచారు. మాన్ జిల్లాలో జరిగిన అల్లరులవల్ల ఈ ఫెస్టివల్ ను మూడవరోజునుంచి రద్దుచేశారు.

వండి పుల్లలకు గుచ్చిన పట్టుపురుగులు

నాగాలలో అధికసంఖ్యాకులు క్రైస్తవులు, ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారు. ఈ రాష్టంలో ఇంగ్లీషు అధికారభాష. నాగామీ అనే అస్సామీ క్రియోల్ భాష కూడా మాట్లాడతారు. నాగాలాండ్‌లో ఇప్పుడెవరు ఆదివాసి వేషధారణ చేయడం లేదు. కుగ్రామాల్లో మాత్రమే ఆదివాసీలు తమ సహజ వేషధారణలో కన్పిస్తారు. మాన్ జిల్లాలో ఒక ‘హెడ్ హంటర్స్’ గ్రామం ఇంకా మిగిలి ఉందట. విజయభాస్కరరెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదు.

జర్నీ
మణిపూర్లో ఆదివాసీల నాగదేవత ఆలయం IBU DHO PAKHANGA TEMPLE

కోహిమా నుంచి జోకు వ్యాలీ 25 కిమీ దూరం. జోకు వ్యాలినుంచి ట్రెకింగ్ చేస్తూ లోయలోకి దిగి చూడాలి. ట్రెకింగ్ కు వెళ్ళేదారి వరకు వెళ్లి ట్రెక్కింగ్ చేయకుండా వెనక్కి తిరిగారు.

మొదటి రెండురోజులు భాస్కరరెడ్డి గారు, వారి మిత్రులు కోహిమాలో మార్కెట్ లన్నీ చూచారు. ఇక్కడే పెర్సిమాన్ పండు రుచిచూశారు. ఈ పండు మన టమాటో కంటే కాస్త పెద్దదిగా ఉండి, కరకర లాడుతూ తీయగా ఉంటుందిట!

పెర్సిమాన్ ఫ్రూట్స్

డిసెంబర్ 3వతేది, ఉదయం ఏడున్నరకు మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు నాగాలాండ్ ఆర్.టి.సి. బస్సులో ప్రయాణమయ్యారు. బస్సు సాయంత్రం చీకట్లు ముసురుకుంటున్న సమయంలో ఇంఫాల్ చేరింది. దారిలో మావో అనే వూరి చెక్ పోస్ట్ వద్ద వేక్సినేషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం బస్సును మూడు గంటల సేపు ఆపి వుంచారు. ఈ రాష్టాల్లో పర్యటించాలంటే inner line permit వంటి అనుమతులు ముందుగానే తీసుకోవాలి.

ఈశాన్య రాష్ట్రాలలో త్వరగా తెల్లవారుతుంది. 4గంటలకు సాయంకాలం అవుతుంది. మరి కాసేపటికి చీకటి పడిపోతుంది. ముందుగానే ఇంఫాల్‌లో హోంస్టే ఏర్పాటు చేసుకొన్నారు కనక బస్ డిపొనుంచి నేరుగా హోం స్టేకు వెళ్ళారు. ఇంఫాల్ హోంస్టేను సైన్యంలో రిటైరయిన ఒక కల్నల్ నిర్వహిస్తున్నారు. అతిథుల సేవలన్నీ కల్నల్ దంపతులే నిర్వహిస్తారు. భోజనం తర్వాత పళ్ళాలు కల్నల్ కడిగి శుభ్రంచేస్తారని ఊహించి మనమిత్రులే శుభ్రంగా కడిగిపెట్టారు వారిపట్ల గౌరవంతో.

ప్యూమిడ్‌ల మీద హోమ్ స్టేలు

ఇంఫాల్‌లో లోక్ టాక్ సరస్సు చాలా అందంగా ఉంటుందట. మొదట ఆ సరస్సు చూడడానికి వెళ్ళారు. సరస్సులో బయోమాస్ (phumids) నీటిపైన దట్టంగా అలుముకొని ఉంటుంది. స్థానికులు సరస్సుమీద మందంగా తేలుతున్న ప్యూమిడ్‌ల మీద గుడిసెలు వేసుకొని ఉంటారు. విజయశేఖర్ రెడ్డి, వారి మిత్రులు నీటిలో తేలియాడే ప్యూమిడ్‌ల మీద నిర్మించిన హోమ్ స్టేలో ఒకరోజు సరదాగా గడిపారు. ప్యూమిడ్ హోమ్ స్టేలకు బోటులో వెళ్ళాల్సిందే.

అడుగు కంటే మించని మందంగా వుండే, నీటిమీద తేలియాడే నేల

ఇంఫాల్‌లో పురాతనమైన కంగ్లా కోటను, అక్కడి మ్యూజియంను దర్శించారు. ఇంఫాల్ సిటీ సెంటర్లో లక్ష్మి కిచెన్ హోటల్లో మణిపురి భోజనానికి ప్రసిద్ధి, రుచిచూడాలని అనుకొన్నా అది కుదరలేదు. సాయంత్రం ఆరుకల్లా నగరం నిద్రపోతుంది. మనవాళ్ళు భోజనానికి వెళ్లేసరికి అన్ని హోటళ్ళు మూతపడ్డాయి. పప్పుకుమార్ యాదవ్ అనే బిహారి హోటల్ నడుపుతాడు.

ప్యూమిడ్ హోంస్టే నుంచి పడవమీద తిరిగి వెళ్లిపోవడం

అతనుకూడా అప్పడే హోటల్ కట్టేసాడు. వీళ్ల పరిస్థితి గమనించి భోజనం దొరికే చోటుకు వెంటపెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఈ పర్యటనలో ఇలాగే అందరూ మన మిత్రులకు సహకరించారట. ఇంఫాల్‌లో ఆటోలున్నాయి. కోహిమా కొండలు గుట్టలతో ఎగుడుదిగుడుగా ఉంటుంది కనక ఆటోలుండవు.

మరుసటిరోజు నాగాలాండ్ స్టేట్ ఆర్.టి.సి బస్సులో దిమాపూర్ తిరుగు ప్రయాణం. అప్పుడే మాన్ అనే గ్రామంలో సెక్యూరిటీ గార్డ్ లకు స్దానికులకు మధ్య ఘర్షణలు, అసమ్మతి ప్రదర్శనలు జరిగి బస్సు దారిలో ఆగిపోయింది. మద్యాహ్నం 12 తర్వాత బస్సును వదిలారు. దిమాపూర్ రాత్రి ఆలస్యంగా చేరడంతో గౌహాతి వెళ్ళే రైలు మిస్సయింది. రాత్రి 9.కి దిమాపూర్లో రైలెక్కి వేకువన 3గంటలకు గౌహాతి చేరి, అస్సాం టూరిజం హోటల్లో దిగారు. ఇక్కడే ఇద్దరు మిత్రులు హనుమంతరావు, కోటీశ్వరరావు ఫ్లైట్లో గౌహాతికి వచ్చి, కలిశారు. నలుగురు ఉదయం కార్ రెంట్‍౬కు తీసుకొని సొంతంగా డ్రైవ్ చేసుకొంటూ మేఘాలయ పర్యటనకు బయలుదేరారు.

***

గౌహాతి నుంచి కారులో షిలాంగ్‌కు మూడుగంటల ప్రయాణం. షిల్లాంగ్ నగరం మధ్యలో, అంజలి థియేటర్ సమీపంలో మంచి హోటల్లో దిగారు. మరుసటిదినం ఉదయం జోవోయ్ వద్ద మోనోలిథిక్ గుళ్లను చూడడానికి బయలుదేరారు. గంటన్నర ప్రయాణం. జోవోయ్ వద్ద ఏకశిలల ప్రకృతి విచిత్రాన్ని దర్శించారు, ఇటువంటి శిలలు (మోనోలిథిక్సు) యాత్రలో ఎక్కడ పట్టినా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడే అడవి అరటిపళ్ళు తిన్నారు,

మోనోలిథిక్సు పార్కు 1

పండ్లు ఇచ్చిన మహిళ డబ్బులు తీసుకోలేదు. ఇక్కడే రాగిపిండితో ఆవిరిమీద ఉడికించిన కుడుములవంటి టిఫిన్ కూడా తిన్నారు. జొవోయ్ సమీపంలోనే టైర్షి జలపాతం దర్శించకుని ఎలిఫెంట్ ఫాల్స్ కు బయలుదేరి, దారి తప్పగొట్టుకొని, చివరకు ఏమీ చూడకుండానే షిలాంగ్.చేరారు. షిలాంగ్.నగరంలో పార్క్ చూద్దామని వెళ్తే యేదో కారణంవల్ల దాన్ని కూడా మూసివేశారు. సాయుధ సైనికులు లోపలికి అనుమతించలేదు. అక్కడ నిలబడి షిల్లాంగ్ నగర అందాలను చూడవచ్చు. మళ్ళీ షిల్లాంగ్ నగరంలో మార్కెట్ అంతా తిరిగిచూసారు.

మోనోలిథిక్సు పార్కు-2

మరుసటిరోజు షిల్లాంగ్ నుంచి వెయ్ సాడొంగ్ జలపాతాన్ని చూడడానికి వెళ్లారు. ఒకటిన్నరగంట కారుప్రయాణం. పచ్చని ప్రకృతిమధ్య మూడంతస్తులుగా జలపాతం కిందికి పడుతూవుంది. జలపాతం కింద ఏర్పడిన సరస్సు వరకు దిగడం కాస్త శ్రమతో కూడిన పనే అయినా దిగిచూసారు.

లోయ
వాటర్‍ఫాల్స్

కిందకు దిగడానికి మధ్యమధ్యలో కొంతదూరం వెదురుమెట్లు ఏర్పాటుచేశారు.

రెయిన్ బో వాటర్‍ఫాల్స్

వెనక్కి వచ్చాక, డబుల్ రూట్ బ్రిడ్జి చూడడానికి బయలుదేరారు. దారిలో చిన్న గుహల వంటివి – శాండ్ స్టోన్‌తో ఏర్పడినవి తారసపడ్డాయి. నాన్ గ్రియట్ గ్రామంలో రూట్ బ్రిడ్జి ఉంది. ఆ దారిలో వెళుతుంటే మాయాబజార్ సినిమాలో “భళిభళిదేవా బహు బాగున్నదయా నీ మాయా” పాట నేపధ్యలో వినిపిస్తుంటే రథం సాగుతున్న దృశ్యం గుర్తొచ్చిందట విజయభాస్కర్ రెడ్డికి. తిర్నా గ్రామంవద్ద కార్లు విడిచిపెట్టి కాలినడకన 3000 వేల అడుగుల లోతుకు దిగాలి. రెయిన్ బో జలపాతం బండమీదపడి ఇంద్రధనుస్సు ఏర్పడేది ఇక్కడే కానీ మనవాళ్ళు పొరబాటుగా మరొక పల్లె వద్ద కారు నిలిపి బయలుదేరారు. దారి వాలుతలంగా వుంటుంది. సిమెంట్ మెట్లు ఏర్పరచివున్నాయి. నడవడానికి రెండు చేతుల్లో రెండు వెదురుబొంగు ఊతకఱ్ఱలు పట్టుకొని ముందుకుసాగారు. కారు దిగిన తర్వాత ఒక పిల్లవాణ్ణి గైడ్‌గా కుదుర్చుకున్నా, కొద్దిదూరం ముందుకు సాగాక ఆ కుర్రాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దారిలో కొంతదూరం బండలు పేర్చిఉన్నారు. నడుస్తూ ఉంటే తిర్నా గ్రామం కనిపించింది. తిర్నా వరకు కార్లు వెళ్తాయి. అక్కడినుచి 3000 అడుగులు దిగితే చాలు. ఈ వివరం వీళ్లకు తెలియక తిర్నాకు బదులు ఈ గ్రామంనుంచి 6000 అడుగుల లోతుకు దిగివెళ్ళే మార్గంలో వెళ్లారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here