[box type=’note’ fontsize=’16’] గానకోకిల లతా మంగేష్కర్ ఈ రోజు… 06 ఫిబ్రవరి 2022న భౌతికదేహాన్ని వీడి భువికేగారు. ఆమె స్మృతికి నివాళిగా కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘పాడుతా తీయగా’ పుస్తకం నుంచి ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. [/box]
***
[dropcap]ఒ[/dropcap]క కళాకారుడి మరణం శోకించే సందర్భం కాదు. అతడి కళను సెలెబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం. అతడి కళా ప్రదర్శనను పదే పదే స్మరిస్తూ, ఇంత ఆనందాన్ని మనకు కలిగించే కళను సృజించిన ఆ కళాకారుడికి నివాళులర్పించే సందర్భం. తన కళను అనుభవించి, ఆనందాన్ని అనుభవించటాన్ని మించి ఏ కళాకారుడు కూడా ఇంకేమీ ఆశించడు. లతా మంగేష్కర్ మరణం కూడా ఆమె స్వరం నుంచి వెలువడి ప్రపంచాన్ని పరవశింపచేస్తున్న సరస్వతీవీణానిక్వణంలాంటి ఆమె గానాన్ని తలచుకుని ఆనందించే సందర్భం. నిజానికి లతా భౌతిక శరీరం ఇప్పుడు నశించినా, ఆమె చైతన్యం ఇప్పుడు స్థంభించిపోయినా, ఒక కళాకారుడి అసలు మరణం అతని కళా సృజన ఆగిపోవటమే. సృజనాత్మక స్రవంతి ఇంకిపోవటాన్ని మించిన మరణం కళాకారుడికి మరొకటిలేదు. కాబట్టి లతా భౌతిక మరణానికి కలుగుతున్న బాధను ఆమె సృజించిన కళను అనుభవిస్తూ, మైన్ అగర్ బిఛడ్ భి జావూన్, కభి మేరా గం న కర్నా మేరా ప్యార్ యాద్ కర్కే, కభి ఆంఖ్ నం న కర్నా, అన్న లతా పాటలోని మాటలు గుర్తు తెచ్చుకుంటూఅలౌకిక ఆనందానుభవంగా మలచుకోవాల్సివుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంచిక వచ్చే సంచికనుంచీ లతా మంగేష్కర్ పాటల విశ్లేషణను అందిస్తోంది.
కళాకారుడి కళను అనుభవించండి. కళకారుడిని అభినందించండి. లతా మంగేష్కర్ లాంటి కళాకారిణి కళను అనుభవించే అదృష్టాన్నిచ్చిన సరస్వతీదేవికి నమస్కరిస్తూ, పాడుతా తీయగా పుస్తకంలోని ఈ రచనను చదవండి.
***
‘తూజహా జహా చలేగా మేర సాయ సాథ్ హోగా’.
నందకళ్యాణ రాగంలో మదన్ మోహన్ స్వరపరచగా, తన స్వరంతో ఈ పాటకు జీవం పోసి, వెంటాడే మధురమైన మెలోడీగా, ఎల్లప్పటికీ వెంటనుండి సాంత్వన నిచ్చే చల్లని స్పర్శగా రూపొందించింది లత స్వరం. ఈ పాట పదాల అర్థం మన నిత్యజీవితంతో విడదీయరాని రీతిలో ముడిపడి లత స్వరం ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. జీవితంలోని ప్రతి సందర్భానికి లత పాట ఉంటుంది. ప్రతి మూడ్‍కి తగ్గట్టు లత పాట ఉంటుంది. బాల్యంలో ఆటలాడిస్తుంది. యవ్వనంలో ప్రేమభావనలకు చక్కని దిశ నిచ్చి ఉన్నతమైన ప్రేమభావనలకు ఊపునిస్తుంది. నడివయసులో సమస్యలను ఎదుర్కోవాల్సిన ధైర్యాన్నిచ్చి, భుజం తట్టి ‘నేనున్నానం’టూ ముందుకు నడిపిస్తుంది. వృద్ధాప్యంలో వైరాగ్యాన్ని, జీవితతత్వాన్ని బోధిస్తూ జీవించే శక్తినిస్తుంది. వెరసి లత స్వరం ఊపిరిలో ఊపిరై, రక్తంలో రక్తమై, అడుగులో అడుగు కదుపుతూ మన వెంటే జీవితాంతం ఉంటుంది. నీడయినా మనల్ని వదలి వెళ్లవచ్చు కానీ లత స్వరం కలిగించే మధురభావనల ప్రకంపనల జాడల నీడలు మాత్రం మనల్ని జీవితాంతం వదలవు. ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటాయి.
లత స్వర మాధుర్యాన్ని మాటలలో వర్ణించటం కుదరదు. ఆ మాధుర్యాన్ని అనుభవించాల్సిందే. లత స్వరం సరస్వతి వీణా నిక్వణం. లత స్వరం సరస్వతీదేవి మందహాసం. ప్రపంచంలోని అత్యున్నత ఆనందానుభవం ఆధ్యాత్మికానుభవం అయితే, ఆ అనుభవం కొంతమాత్రమైనా సామాన్యులు అర్థం చేసుకుని, ఆనందస్వరూపాన్ని గ్రహించేందుకు వీలుగా భగవంతుడు లత స్వరాన్ని సృజించాడనిపిస్తుంది. లత స్వరం జీవనది లాంటిది. దాహార్తుల దప్పిక తీరుస్తుంది. జగతిని సస్యశ్యామలం చేస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తికీ సాంత్వననిస్తుంది. సంతృప్తినిస్తుంది. అతడిలో నిద్రాణ స్థితిలో ఉన్న విశ్వసృష్టికారుడి జ్యోతిని వెలిగించి మామూలు మనిషికి తన దైవత్వాన్ని గ్రహింపుకు తెస్తుంది లత స్వరం.
లతా మంగేష్కర్ సినీ ప్రపంచంలో అడుగిడినపుడు ఆమె ఇన్ని ఎత్తులు అధిరోహించి, జాతీయస్వరంగా అలరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పైగా, ఆమె స్వరం ‘పీలగా ఉంది, పనికిరాద’ని తిరస్కరించారు. అయితే, లత పుట్టిందే పాడటానికి. అందుకే విధి అనుకూలించింది. లత అత్యున్నత శిఖరాలు అధిరోహించేందుకు మార్గం సుగమం చేసింది.
లత సినీ పరిశ్రమలో అడుగిడినప్పుడు పాటలు పాడేవారి స్వరాలు బలంగా ఉండటం తప్పనిసరి. సంగీత ప్రపంచంలో అధికంగా ఉర్దూ ప్రభావం ఉండేది. శాస్త్రీయ సంగీత విద్వాంసుల ఆధిక్యం ఉండేది. తండ్రి నుంచి సంగీతం వారసత్వంగా, భగవంతుడినుండి దివ్యస్వరం బహుమతిగా అందుకున్న లత ఆరంభంలో అనేక అవమానాలను ఎదుర్కొంది. నిరాదరణను అనుభవించింది. అభద్రతాభావాన్ని తట్టుకొంది. ఆమెను ఏ సంగీత దర్శకుడయినా ప్రోత్సహిస్తే రకరకాల వదంతుల కారణంగా ఆ సంగీత దర్శకుడు వెనుతిరగాల్సి వచ్చేది. ఇతర సంగీత దర్శకులు లత స్వరాన్ని మెచ్చినా, తమకు ప్రియమైన వారికి ప్రాధాన్యాన్నిచ్చేవారు. ఈ అనుభవాలన్నీ లత వ్యక్తిత్వంపై ప్రభావం చూపి ఆమె ప్రవర్తనను నిర్దేశించాయి. ఇంతలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశవిభజన జరిగింది. అంతవరకూ ఆధిక్యంలో ఉండి, సినీ ప్రపంచంపై పట్టు ఉన్న కళాకారులు అనేకులు సరిహద్దులు దాటి ఆవలివైపుకు వెళ్లారు. సినీ పరిశ్రమలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు దేశం నలుమూలలనుంచి సృజనాత్మక కళాకారులు బొంబాయి చేరుకున్నారు. అంతవరకూ దిగ్గజాల నీడల్లో ఒదిగి ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు తెరపైకి వచ్చారు. ఒక తరం తెరవెనక్కు వెళ్లి, కొత్తతరం తెరపైకి వస్తున్న తరుణం అది. ఈ సమయంలో నూతన తరానికి ప్రాతినిధ్యం వహించే స్వరంగా ఎదిగింది లతామంగేష్కర్.
బొంబాయి చేరినప్పుడు లతకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంది. బొంబాయి వచ్చి ఉస్తాద్ వద్ద శిక్షణ పొందింది. ఉర్దూ భాషపై ప్రావీణ్యం సంపాదించింది. సినీ పరిశ్రమ రీతులను, తీరుతెన్నులను ఆకళింపు చేసుకుంది. విజయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకుంది. శిఖరం చేరటం ఎంత కష్టమో, దిగజారటం అంత సులభం అని గ్రహించింది. శిఖరం పైనున్నవాడిని భక్తిభావంతో తల ఎత్తి ఆరాధనగా చూసేవారే, అవకాశం దొరకగానే గోతులు తవ్వుతారని, వెన్నుపోటు పొడుస్తారని అర్థం చేసుకుంది. అందుకే ఒక్కసారి ఉన్నత శిఖరాన్ని చేరుకున్న తరువాత లత క్రిందకు దిగనే లేదు. అంటే, ఓవైపు సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేసుకొనే అవకాశం కోసం ఎదురుచూసిందన్న మాట లతామంగేష్కర్. దేశవిభజన తరువాత సినీ ప్రపంచంలో లోటు ఏర్పడటంతో అందుబాటులో ఉన్న కళాకారులనే వాడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఒకరొకరుగా సంగీత దర్శకులు లత స్వరంవైపు మళ్లారు. గులామ్ హైదర్ సంగీత దర్శకత్వంలో ‘మజ్బూర్’ (1948) సినిమాలోని ‘తోడ్ దియా దిల్ మెరా’ పాటతో లతా మంగేష్కర్ స్వరాన్ని అందరూ గుర్తించటం ఆరంభించారు. అప్పటి ప్రఖ్యాత గాయని నూర్జహాన్‌ను అనుకరిస్తూ లత పాడిన ఈ పాట, నూర్జహాన్ స్వరంపై ఆధారపడిన సంగీత దర్శకులంతా లత స్వరంవైపు ఆకర్షితులయ్యే వీలునిచ్చింది.
1949లో “మహల్” సినిమాలోని ‘ఆయేగా ఆనేవాలా’ పాట లత స్వరానికి గుర్తింపు సంతకంలా ఎదిగింది. సమయం వచ్చినప్పుడు అందుకు తగ్గ కళాకారుడు వస్తాడన్న సత్యాన్ని సూచిస్తూ ‘ఎవరిదీ స్వరం?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్న సమయం లోనే, భవిష్యత్తులో లత స్వరం హిందీ సినీ సంగీత ప్రపంచం పై కురిపించబోయే కుంభవృష్టిని సూచిస్తూ “బర్సాత్” పాటలు సినీ సంగీత ప్రపంచాన్ని తడిపి ముంచెత్తాయి. శంకర్ జైకిషన్‌లు తమ తొలి సినిమాలోనే తమ పాటలన్నీ లతతో పాడించటమే కాదు, ఒక దశాబ్దం పాటు లతనే తమ ప్రధాన గాయనిగా ఎంచుకుని తమ సృజనాత్మకత విశ్వరూపాన్ని ప్రపంచానికి ప్రదర్శించేందుకు లత స్వరాన్ని మాధ్యమంగా చేసుకున్నారు. దాంతో శంకర్ జైకిషన్‌లతో పాటుగా వారి స్వర లహరుల శృంగాలపై నృత్యం చేస్తూ లత కూడా అత్యున్నతమైన ఎత్తులకు ఎదిగింది. మరోవైపు ఇదే సమయానికి నూర్జహాన్‌లా పాడగలిగే లత స్వరాన్ని ఆధారం చేసుకుని నౌషాద్ “అందాజ్” సినిమాలో నాయిక పాటలను లతతో పాడించాడు. అంతవరకూ పెద్దపీట వేసిన శంషాద్ బేగమ్‌ను పక్కకు నెట్టి మరీ లతకు అగ్రస్థానం ఇచ్చాడు నౌషాద్. .
“బర్సాత్”లోని ‘హవామె ఉడ్‌తా జాయె’, ‘జియ బేకరార్ హై’, ‘ఓ ముఝే కిసీసె ప్యార్ హోగయా’, ‘అబ్ మెరా కౌన్ సహారా’, ‘బిచే హువె ప దేశీ’, ‘మెరి ఆఖోమె బర్గయ’, ‘బర్సాత్ మే’ వంటి పాటలు ప్రతి వీధిలో మార్మోగుతూండగా, “అందాజ్”లోని ‘డర్ మొహబ్బత్ కర్ లే’, ‘కోయీ మేర దిల్ మె’, ‘ఉఠాయే జా ఉన్ కే సితమ్’ వంటి పాటలు ఇంటింటా మార్మోగసాగాయి. ఆ రకంగా లతా మంగేష్కర్ స్వరం ప్రతి శ్రోత హృదయంలో స్థిరపడింది.
లత పాడిన పాటలు అనూహ్యమైన రీతిలో అత్యంత విజయం సాధించటంతో అంతవరకూ ఉదాసీనంగా ఉన్న సంగీత దర్శకులు, లత స్వరాన్ని మెచ్చని సంగీత దర్శకులూ లత వైపు మళ్లనారంభించారు. దాంతో, ఇతర ఏ గాయనికీ లభించని అదృష్టం లతకు కలిగింది. దేశంలోని అత్యుత్తమ సృజనాత్మక కళాకారులంతా, తమ అంతులేని అమోఘమైన సృజనాత్మక కళాప్రదర్శనకు లత స్వరాన్ని మాధ్యమంగా చేసుకున్నారు. దాంతో ‘లత’ పాట నాణ్యతకు ప్రామాణికమయింది. లత అచిరకాలంలోనే అత్యుత్తమ కళాసృష్టికి పర్యాయ పదమయింది. లతా మంగేష్కర్ ఏదో ఒక సంగీత దర్శకుడికో, ఏదో ఓ క్యాంపుకో పరిమితం కాకుండా, ఎలాంటి భేషజాలు, అహంకారాలు లేకుండా ప్రతి ఒక్క పాటను భగవదత్తమైన అవకాశంగా భావించి, తన ఆత్మతో అనుభవిస్తూ పాడటంతో మామూలు పాటలు కూడా అత్యద్భుతమైన రత్నాలుగా భాసించి శోభిల్లాయి. దాంతో, లతతో కలిసి ఎదిగిన కళాకారులే కాదు, లత ఆధారంగా ఉన్నత స్థానాలకు ఎగబ్రాకే కళాకారులూ లత భక్తులుగా స్థిరపడ్డారు. దాంతో తన ఎదుగుదలకు తోడ్పడిన కళాకారుల స్థాయి దాటి ఎదిగి లత తనను భక్తిభావంతో చూసి, తనపై ఆధారపడే సంగీత దర్శకులుండే స్థాయికి ఎదిగిందన్న మాట. ఈ రకంగా తరాల అంతరాలను దాటుకుంటూ, విభిన్న తరాల నడుమ వారధిలా వ్యవహరిస్తూ జీవనదిలా ఆరు దశాబ్దాల పాటు లత అవిచ్ఛిన్నంగా సినీ సంగీత సామ్రాజ్లిగా చలామణీ అయింది. సినీ చరిత్ర అంటే లత పాటగా నిలిచింది. ఈ మధ్యకాలంలో అనేకులు లతను ఉన్నతస్థానం నుంచి దింపాలని ప్రయత్నించారు. ఆమెపై బురద చల్లాలని ప్రయత్నించారు. దుష్ప్రచారాలు చేశారు. విషం వెదజల్లారు. కానీ ‘మానోతో మై గంగా మా హూ/ నా మానోతో బహతా పానీ’ అన్న “గంగాకీ సౌగంధ్” పాటలోలాగా, తనని గౌరవించినవారికి, తన స్వరమాధుర్యం వింటూ మైమరచినవారికి అలౌకిక ఆనందాన్నందిస్తూ, తనని ద్వేషించేవారి దప్పికను తీర్చి, పాపప్రక్షాళన చేసే గంగానదిలా లతా మంగేష్కర్ స్వరప్రవాహ ప్రస్థానం కొనసాగుతూ పోయింది.
అనిల్ బిశ్వాస్, శంకర్ జైకిషన్, నౌషాద్, ఎస్.డి. బర్మన్, సి. రామచంద్ర వంటివారు తాము సంగీత శిఖరాలు అధిరోహిస్తూ, లత సంగీత శిఖరా రోహణ చేయటంలో తోడ్పడ్డారు. తన స్వరంతో ఈ సంగీత దర్శకుల కెరీర్ల అభివృద్ధికి లత తోడ్పడింది. అంటే, అటు సంగీత దర్శకులు, ఇటు గాయని ఒకరి వల్ల ఒకరు లాభపడటం తద్వారా సినీ పరిశ్రమ లబ్ది పొందటం జరిగిందన్న మాట. లత స్వరం ప్రేక్షకులు, శ్రోతలను ఎంతగా అలరించిందంటే లత స్వరం అత్యున్నతము, అత్యద్భుతమూ అయిన ప్రతిదానికీ ప్రతినిధిగా ఎదిగింది. నాయిక అందమైన రూపాన్ని స్ఫురింపచేసి అలరించే స్వరంగా నిలచింది. దాంతో, నాయికలు సైతం లత స్వరాన్ని తమ స్వరంగా చేసుకొని తమ కెరీర్లు నిర్మించుకోవాలని తపనపడ్డారు. కొన్నాళ్ల తరువాత లత తమకు నేపథ్యంలో పాడితే చాలు తమ జన్మ ధన్యమైనట్టుగా నాయికలు భావించే స్థితి వచ్చింది. హేమంత్ కుమార్, సలిల్ చౌధరీ, ఖయ్యామ్, రవి, రోషన్, మదన్ మోహన్ వంటి సంగీత దర్శకులు లత స్వరం ఆధారంగా సినీ పరిశ్రమలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫాడ్కే, హన్స్‌రాజ్ బహల్, చిత్రగుప్త, ఉషాఖన్నా వంటివారు లత భక్తులుగా నిలిచారు. లత కాకుండా మరోగాయని వైపు తప్పనిసరి పరిస్థితులలోనే మళ్లారు. ఆర్.డి. బర్మన్, బప్పీలహరి వంటివారు చక్కని బాణీ కుదరగానే లతనే స్మరించేవారు. ఎఆర్ రహెమాన్, ఆనంద్ మిళింద్, రామ్ లక్ష్మణ్, రవీంద్ర జైన్ వంటివారు ఉత్తమ బాణీకి ప్రాణం పోసి అమరం చేయటానికి లతపైనే ఆధారపడ్డారు. అందుకే హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఏ కళాకారుడి గురించి రాయాలన్నా లత ప్రసక్తి రాక మానదు. ఆయా కళాకారుడి అత్యుత్తమ సృజనలో లత పాటలే అధిక శాతం ఉంటాయి. చివరికి లతతో ఒక్క పాట కూడా పాడించని ఓపి నయ్యర్‌ను గుర్తు తెచ్చుకున్నా ఈ విషయం ప్రస్తావించి లత పేరును తలవాల్సి ఉంటుంది. అందుకే హిందీ సినిమాలలోని అత్యుత్తమ పాటల జాబితా లత పాటల జాబితా అవుతుంది. సంగీత దర్శకుల అతిగొప్ప పాటల జాబితా లతా పాటల జాబితా అవుతుంది. నాయికల హిట్ పాటల జాబితా లత పాటల జాబితా అవుతుంది. అలా ఎన్ని పాటల జాబితాలు తయారుచేసినా ఇంకా ఎన్నో పాటలు మిగిలిపోతాయి. అసంతృప్తి కలుగుతుంది. అందుకే లత అత్యుత్తమ పాటల జాబితాలు ఎన్ని తయారుచేసినా ఎవరికీ సంతృప్తి కలగదు. కానీ ‘ఏయ్ మాలిక్ తెరే బందె హమ్’, ‘అల్లా తేరో నామ్’ వంటి పాటలు వింటూంటే అనిర్వచనీయమైన అలౌకిక ఆనందం కలుగుతుంది. ఇక మరో పాట వినాలనిపించదు.
‘మన్ డోలె మెర తన్ డోలె’ వింటూంటే ఎంతగా పరవశం కలుగుతుందో ‘రసిక బల్‌మా’ వింటూంటే అంతగా విరహవేదన ఆనందంగా అనిపిస్తుంది. ‘ఘర్ ఆయా మెర పర్‌దేశీ’ వింటూంటే ఎంతగా వర్ణించనలవి కాని ఆనందం కలుగుతుందో, ‘పంఖ్ హోతేతొ ఉడ్ ఆతీ హై’ వింటూంటే అంతగా రెక్కలు కట్టుకుని విహరించాలనిపిస్తుంది. ‘దునియామె హమ్ ఆయే హై తొ జీనాహీ పడేగా’ పాట వింటూంటే ఎంతగా స్ఫూర్తి కలుగుతుందో ‘కభీతో మిలేగీ కహీతో మిలేగీ’ పాట వింటూంటే అంతగా ఆశాభావం కలుగుతుంది. ‘లగ్ జా గలే’ పాట వింటూంటే కలిగే తపన ‘ఆప్ కి నజ్‌రోనె సమ్ ఝా’ వింటూంటే అంత ఆనందంగా మారుతుంది. ‘తేరా మేరా ప్యార్ అమర్’ పాట వింటూంటే కలిగే రొమాన్స్ భావన ‘కొయీ పత్తర్ సే నా మారే’ వింటూంటే ఉద్వేగంగా మారుతుంది. ‘మేరి ఆవాజ్ హీ పహచాన్ హై’ పాట వింటూంటే కలిగే విశ్వాసం ‘రహేన రహే హమ్’ వింటూంటే ఆలోచనాత్మకమవుతుంది. ‘రాత్ కా సమా’ పాట కలిగించే ఆనందం ‘రులాకే గయా సప్నా మేరా’ వింటూంటే విషాదంగా మారుతుంది. ‘ఖిల్‌తే హై గుల్ యహా’ పాటలోని తాత్వికత ‘శీష హోయ దిల్ హో వింటూంటే నిర్లిప్తతగా మారుతుంది. ‘తెరే మెరే బీచ్ మె’ పాట ఎంత గొప్పగా ఉంటుందో ‘ఉఠె సబ్ కి కదమ్’ అంత చక్కగా ఉంటుంది. ‘ఓ సజానా బర్‌ఖా బహార్ ఆయి’ పాట వింటూంటే కలిగే మధురానుభూతి ‘పానీ పానీరే’ వింటూంటే వేదనాభరితమవుతుంది. ఇలా ఒకటా… రెండా… ఆరు దశాబ్దాలుగా అసంఖ్యాకంగా అద్భుతమైన లత పాడిన పాటలను తలవటం అంటే అనంతమైన మహార్ణవాన్ని పిడికిట్లో బంధించాలని ప్రయత్నించటమంత మూర్ఖత్వమే.
ఎందుకంటే ఓ వైపు ఒక పాట గుర్తుకువస్తూంటే మరోవైపు ‘బహారో మేరా జీవన సవారో’ అన్న మధురగానం మైమరపిస్తుంది. ఇంకోవైపు ‘ఆజా పియా తొ హె ప్యార్ దూ’ అన్న పాట అలరిస్తుంది. మరోవైపు ‘ఆప్ యూ ఫాస్‌లోసే గుజరతే రహే’ అన్న పాట ఎదను మురిపిస్తుంది. ‘మౌసమ్ హై ఆషికానా’ వింటూ కలల్లో తేలే హృదయం ‘ఓ రామ్ జీ బడా దుఖ్ దీనా’ వింటూ ఉలిక్కిపడుతుంది. ‘ఏయ్ దిల్ ఏ నాదాన్’ పాట వింటూ తన్మయం చెందిన మనస్సు ‘షాయద్ మేరే షాదీక ఖయాల్’ పాట విని అల్లరి చేస్తుంది. మధుబాల, నిమ్మి, నూతన్, నర్గీస్ స్వరంగా ఎంతగా అలరించిందో, ఆశాపరేఖ్, సాధన, సైరాబాను, షర్మిలాటాగోర్ స్వరంగానూ అంతే మెప్పించింది. హేమమాలిని, జయబాధురి, రాఖీ, రేఖల మనసు పిలుపులనెంత గొప్పగా వినిపించిందో, టీనా మునిమ్, మాధురీ దీక్షిత్, శ్రీదేవిల హృదయస్వరాల స్వనాలనూ అంత గొప్పగా వినిపించింది. ఇలా తరాలతో పని లేకుండా ఏ తరానికి తగ్గ పాటలను ఆ తరానికి పాడి మెప్పించటంలోనే లత ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది. లతను సవాల్ చేసి దారి పక్కన పడిపోయినవారి ఆక్రోశాలు ఎంతగా అర్థం లేనివో స్పష్టమవుతుంది.
లతా మంగేష్కర్ ఆరంభం నుంచీ తన సమకాలికుల కన్నా రెండడుగులు ముందు ఉంటూ వచ్చింది. ప్రతి తరానికి తగ్గట్టు తనని తాను పునర్నిర్వచించుకుంటూ విలువలతో రాజీపడకుండా నూతన రూపం ధరిస్తూ సజీవనది స్వరంలా ప్రవహిస్తూ వస్తోంది. ఆరంభంలో నూర్జహాన్‌ను అనుకరించినా, మారుతున్న పరిస్థితులను అనుసరించి తనదైన ప్రత్యేక గాన సంవిధానాన్ని ఏర్పాటుచేసుకుంది. భావప్రకటన పద్దతిని సృజించుకుంది. నిరంతరం సాధన చేస్తూ, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇతరుల కన్నా ముందు ఉంటూ వచ్చింది. గొప్ప విద్వాంసురాలు కాకున్నా, సంగీత విద్వాంసులు సైతం అబ్బురపడే రీతిలో శాస్త్రీయ గీతాలను గానం చేసింది. పాటలలో భావం చెడకుండా ఊపిరి బిగపట్టి రాగం తీయటం, అత్యద్భుతమైన రీతిలో గమకాలు వేయటం, భావాన్ని పలికించటంతో శాస్త్రీయ సంగీత నిష్ణాతురాలిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఒక పద్ధతి ప్రకారం తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకుంది. దొరికిన ప్రతి పాట పాడకుండా ఒక స్థాయికి చేరిన తరువాత ఉత్తమమైన, నాణ్యమైన పాటలు ఎంచుకుని మరీ పాడింది. ఒక సంగీత దర్శకుడు గొప్ప బాణీ సృజించాడని తెలిస్తే, అహం లేకుండా అతడి దగ్గరకు వెళ్లి శిష్యురాలిగా పాట విని పాడేది. క్యాబరే పాటలు, ద్వంద్వార్థాల పాటలు పాడనని భీష్మించుకున్నా, 70వ దశకం ఆరంభంలో మారుతున్న పవనాల దిశను గమనించి ‘ఆ జానేజా’ అంటూ అత్యద్భుతమైన రీతిలో క్యాబరే పాటల గానానికి శ్రీకారం చుట్టింది. ఇతరులెందరో ఎన్నో రకాల క్యాబరే పాటలు పాడేరు. కానీ ‘ఆ జానేజా’లా క్లాసిక్ అనిపించే రీతిలో మాత్రం పాడలేదు. అలాగే 1990 దశకం ఆరంభంలో అనూరాధ పోడ్‌వాల్, టి సిరీస్ సహాయంతో లతను దెబ్బతీయాలని ప్రయత్నించింది. సమాధానంగా లత “లేకిన్” సినిమాను నిర్మించింది. ఆ సినిమాలో లత నా విన్నవారు మరో స్వరాన్ని మెచ్చలేని రీతిలో అద్భుతంగా పాడింది. ‘యారా సిలిసిలి’ పాటలో చివరలో తీసిన దీర్ఘమైన రాగం ఆమె వయసును మరపింపచేసుంది. కొత్త గాయనిలు ఒక సంగీత దర్శకుడికో, సంగీతం కంపెనీకో పరిమితమైన తరుణంలో లత తన అపరిమితమైన ప్రతిభను ప్రదర్శించి అందరి నోళ్ళ మూయించింది. “లేకిన్”లో ‘సునియో జీ’ పాటను రెండు విభిన్న రకాలుగా పాడి మెప్పించింది. ‘మై ఏక్ సదీసే బైఠీ హు’లో ఆమె ప్రదర్శించిన భరించలేని ఒంటరితనం, దుర్భరమైన విషాదం మరెవరూ ప్రదర్శించలేరు. ఈ రకంగా పరిమితులు లేని ప్రావీణ్యం, అవధులు లేని అద్భుతమైన ప్రతిభ కల లత స్వరం చెదరకుండా ఉన్నంతకాలం సంగీత దర్శకులు మరో గాయనిని ఆదరించలేక పోయారు. నాయికలు మరో స్వరాన్ని తమ స్వరంగా ఊహించలేకపోయారు. చివరికి ఇక పాడగలిగినన్ని పాటలన్నీ పాడిన తరువాత, ఇక కొత్తగా పాడేవేవీ లేకపోవటం వల్ల, ముఖ్యంగా, స్వరం దెబ్బతినటం వల్ల లతా మంగేష్కర్ స్వచ్ఛందంగా సినీగీతాలు పాడటం నుంచి విరమించుకున్న తరువాత కానీ ఇతర గాయనిలు సంగీతదర్శకుల దృష్టికి ఆనలేదు. కాబట్టి లత రాజకీయాలు చేసిందని అనేకులు ఆరోపించటంలో సత్యం ఎంత ఉందన్న సంగతి పక్కన పెడితే, ప్రతిభ విషయంలో వారెవరూ లతకు సాటిరారన్నది కాదనలేని సత్యం.
ఈనాడు, మీడియా విస్తృతి పెరిగి రోజుకో కొత్త గాయనీ గాయకులు పుట్టుకు వచ్చి తారాజువ్వలా వెలిగి, మరుక్షణానికి బూడిదై పక్కన పడిపోవటం చూస్తూంటే లత ప్రాధాన్యం, గొప్పతనం మరింత స్పష్టంగా మనసుకు బోధపడుతుంది. అనంతాకాశానికి అవధులు లేనట్టే, అంతరిక్షానికి అంతం లేనట్టే లతా మంగేష్కర్ పాటలు కలిగించే అపరిమితానందానికీ అంతు లేదు. తరాలు ఎంతగా మారినా, శ్రోతల అభిరుచులు ఎన్నెన్ని రకాలుగా రూపాంతరాలు చెందినా, ఆకాశంలో సూర్యుడు ఒక్కడే అయినట్టు హిందీ సినీ సంగీత ప్రపంచంలో లతామంగేష్కర్ ఖ్యాతి అజరామరంగా ఉంటుంది. ప్రతి క్షణం తన స్వరంతో జీవనమార్గంలో జ్యోతులు వెలిగిస్తూ మార్గదర్శనం చేస్తుంది. ‘జ్యోతి కలశ్ ఛల్ కే/ హువే గులబీ, లాల్ సునహరే / రంగ్ దళ్ బాదల్ కే / జ్యోతి కలశ్ ఛల్‌కే.
జ్యోతికలశం లాంటి లత స్వరం నుండి జాలువారుతున్న స్వరతరంగా కిరణాలు ప్రపంచాన్ని పంచరంగుల మయం చేస్తూనే ఉంటాయి. భగవంతుని సృష్టిలోని అపరిమిత ఆనందాలను అనుభవానికి తెస్తుంటాయి. ఎందుకు? సరస్వతీదేవి స్వరపుత్రిక లతామంగేష్కర్ కాబట్టి.