[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]
అభినవతిక్కన కృతులు
[dropcap]”మ[/dropcap]ఱు మ్రోయున్దద తెల్గు వీణియల యుష్మద్రాష్ట్రగానమీ కొరడాదెబ్బకు దద్దఱిల్లిపడి తెల్గుల్ మేలుకొన్నారహో ! పురుషోత్తంసుకథన్ రచించితిరి మా పుణ్యాలకుం బంటగా మఱవం జాలరు మీరు దేశమును ధర్మంబుగవిగ్రామణీ!”
తెలుగునాట నా యెఱింగిన మేటికవులలో శ్రీ సీతారామమూర్తి చౌదరిగా రొకరు. నా చిన్న ”నాఁటనుండియు వీరికబ్బము లయ్యయ్యవి చూచుచునే యుంటిని. ”మహేంద్రజన నాదులగు నా కబ్బములు” సూనూగు మీసాల ప్రాయములోనివి. ఇవియన్నియు వీను మిగిలినవి కావు గాని వీనియన్నింటను చెప్పఁదగ్గ గుణ మొక్కటి మాత్రమే. అది యీయన యొక మహాకవి కాగలడని సూచించునది. చౌదరి గారు ”ఆత్మార్పణము”నో ”ఆత్మకథ”నో వ్రాసినప్పుడు కాఁబోలును మా యిరువురికి నెయ్యము పొసగినది. అదిసుత నొకరికృతులతో నొకరికి పరిచితి పెరిగినది. ఆబాల్యారబ్దమగు చౌదరి గారి కవిత ”ఇంతింతై వటు డింతయై” యనునట్లు నానాట బెంపు సెంది ఆయా కావ్యములలో క్రొంగొత్తపోకడల నలవఱచు కొని, తొలికవుల మేలిబాటల నాకళించుకొని యాయనకొక మహాకవి స్ధానమును సంతరించినది. చౌదరిగారు ధన్యుడైనాడు. ఆ మహాకవిని గన్న యాంధ్ర దేశము, మాతృభాష ధన్యములైనవి.
కవి తనకున్న ఉత్తమాధమసంస్కారములను బట్టి కావ్యరచన మొనర్చుచుండును. ఆతని సంస్కారములకును, అభిరుచులకును బ్రకృతియు, బరిసరములును దోహదము గైసేయవచ్చును. అట్టియెడఁగవి తన సంస్కారములను బట్టియే కవితావస్తువు నెన్ను కొని దానిని కవితాశిల్పచిత్రిత మొనర్చి లోకమున కందించును. ఒక తరగతి సంస్కారములుగల కవి వానిని భిన్నములయిన తీరున తన కైత వెలయింప జాలడు.
మనచౌదరి గారు ఉదాత్తమగు వీరరసమునకు బుట్టినిల్లయిన మేలివంగడములో బుట్టువు గన్నారు. దానికిఁగోడు ధర్మజ్యోతియై వన్నె కెక్కిన పితృపాదుల పాలనమున నాయనకు గల సహజోదారసంస్కారములు క్రొత్త చెలువమును గైసేసికొన్నవి. మేలిశీలము, ఉత్తమగుణములు, ఉదాత్త ప్రవర్తనము, సౌమ్యభావములు, సత్యధర్మనిష్ఠ, మను మార్గానుగమనము ఆయనకు బెట్టని నగలై చెలువమును దిద్దినవి. కావుననే వీరి పాత్రములును నట్టివయై జగద్వంద్యములగు గుణముల కిక్కలై ఆంధ్రజగతి నుఱ్ఱూత లూగించిన వందును. ఈయనకృతుల జదువునపుడీ యంశమును మనము మఱువరాదు.
బహుశః అవి చౌదరి గారికి కళత్రవియోగము సంభవించినదినములై యుండును. ఆంత నే యాయన ”ఆత్మార్పణము”ను వ్రాసి ప్రియురాలి కప్పన చేసినాఁడు. ఇది వారి పేరెన్నికగన్న కృతులలో మొదటిది. ఆత్మార్పణము”లో వర్ణితమైనకథ భారతము శాంతిపర్వములోని లుబ్ద ”కపోతోపాఖ్యానము”. ఆ పిట్టకథకు వలయు మార్పులు, చేర్పులు నొనరించి కవిగారు విస్తరించి వ్రాసిరి. కళత్రము తోడి సంయోగ వియోగములను జవిసూచిన మనకవిగారు కపోతీ కపోతముల దుఃఖవృత్తాంతములను వర్ణించుటలో నాత్మచరితమును, ఆత్మానుభవమును వ్యక్తీకరింపక తప్ప లేదు. కపోతము కపోతి కొఱకు విలపించు పట్టున,
”కలిమిలేముల లోన భాగంబు గొనుచు
మంచి చెడ్డలలోన, బాల్పంచు కొనుచు
మెలగు నర్ధాంగి దూరమై తొలగెనేని
మగని కాధారమెవ్వరో మగువ ! చెపుమ”
అనుచున్నది. ఈ మాట దాంపత్య సారమును జుఱ్ఱని కవి యనిపింపజాలడు. ఇంకను ఆల్మగల యని నా భావమును సూచించుచు
”రమ్యకుసుమంబ నీవు సౌరభమ నేను
నిండు నెల వీవు పండు వెన్నెలను నేను
పదమ నీవు తదద్ద సంపదను నేను,
అని కపోతి యనుచున్నది. చౌదరి గారు పలువు రాంధ్ర కవులమార్గములను, కాళిదాసాది సంస్కృత కవుల తెరువులను పుణికి పుచ్చుకొన్నారు. కావున ఆయా కవులరీతుల ననుసరించియు దన కావ్యమును మహనీయము చేసికొన్నారు.
నెలతో వెన్నెల దొలగున్
జలదముతో నరుగు మెఱుపు చానలు తమ భ
ర్తల ననుగమించువారని
తెలిపెడిని విచేతనములు తెల్లముగాఁగన్
ఇది కాళిదాసుని ”శశినా సహ యాతి కౌముదీ” అను శ్లోకము ననుగమించినది. బోయ కాహుతియైన నాథు నుద్దేశించి కపోతి సహగమనము చేయ నెంచి
నీ యొడలిలోన సగపాలు నిలిపిబోయ
కప్పనమ్మొనరింతె శేషాంగ మిట్లు
దీనఁగల్గునె పూర్ణాతిధేయ సుకృత
మతిథి కర్థాన్న మిడుట నాయంబె నాథ!
అని లోకోత్తరమగు ‘హైందవసతీత్వవిశేషమును స్ఫుటీకరించుచున్నది. కర్షకుని లోకహిత పరాకాష్ఠను, దెల్పుటకు గవి బోయ కూడు వేడుట సదనుగా జేసికొని
తా దిన దేహియటంచను
పేదకు వడ్డింప నతిథి బృందమునంద
త్యాదరము నూప నెల్లర
కాదరులై యుండగ నితడు హాలికుడొక్కో,
ఎండకు వానకు జంకక
పండించిన ధాన్య మెల్ల బాతఱ లందున్
నిండించి తినుచు బెట్టుచు
నుండెడి కర్షకుడె ధన్యుడూహింపంగన్”
అనుచున్నాడు. ఇవి కేవలము స్వకులాభిమానమున వెలువరించిన పలుకులు గావు. కర్షకుని లోని యతిథి సేవాభావమున కీడైన వర్ణనమిది.
కవిగారి యీ కృతి యలతియలతి జాను తెనుగు పలుకులతో గులుకుచు వలపు లీనుమిటారి కత్తెవలె నడయాడినది. సంస్కృతభాషాటోపము నంతగా జూపక నిర్దుష్టమై సరళ గంభీరమైన శైలిలో నీ కావ్యము ముద్దుముచ్చటలు సూపుచు, వెలలేని నీతిరత్న ములను జదువరులకు బసదన మిచ్చుచున్నది. ఇందు కవికిగల శీలసంస్కారములు, ధర్మపరత ప్రతి పదమునందును గుబాళించెడిని.
శైలినిబట్టియు, గ్రమమునుబట్టియు దరువాత చెప్పదగినది ‘ఆత్మకథ’ ఇది లోకోత్తరుడగు గాంధి మహాత్ముని చరితము. కవికి వర్ణనీయములైన కథానికము లెన్నియో యుండగా దీనినే వస్తువుగా నెన్నుకొనుటలో గవికి గల ఉత్తమసంస్కారములే కారణమందును. సర్వరసములకు విహార స్థానములైన యితి వృత్తములున్నను కవి మనస్సున కవి నచ్చవాయెను. ఇందుకు గారణము ‘విశ్వశ్రేయః కావ్యమే. ”ఆ యా యంశములనే కవి యిట్లు సూచించుచున్నాఁడు.
ఏ సూరినో పేరినో సుబ్బినో నిల్పి
పచ్చిసింగారంబు పల్కుకంటే
హేతువాదంబున కింతనిల్వగ లేక
బూతుల బుంగలై జాతివైర
ములకు మత ద్వేషముల కుపాధ్యాయులై
యౌ దార్యమునకు దవ్వగుచు నీతి
రతుల కెంతయు రోత రాజేయునట్టి పు
రాణమ్ముల బూని వ్రాయుకంటె
కాసులకు దాసుడగుచు మ్రుక్కడిని బొగడి
కల్లకై తల నల్లుటకంటె నిట్టి
గుణగరిష్ఠుల దేశభక్తుల చరిత్ర
చెప్పుట జగద్దితంబైన సేత గాదె?”
జగద్ధితమగు కార్యమును దలపెట్టిన కవికి గాంధీ చరితము వర్ణనీయమగుటలో వింతలేదు. మహనీయ గుణగరిష్ణుల చరిత్రము లెందఱెంద ఱెన్ని భంగుల వర్ణించినను లోటులేదు. రామునివంటి లోకోత్తర నాయకుని చరిత్రమును సంస్కృతములో నెందరు కవులో వర్ణించి ధన్యులైనారు. మురారికవి ”అనర్ఘ రాఘవ’మును వ్రాయుచు రామచరితమును పూర్వులు వ్రాసిరని విడిచిన ”కవివాక్కులు ధన్యములగుట కిట్టి నాయకు డింకొకడు లేడుగదా !” యని సమాధానము చెప్పుకొన్నాడు. అట్లే జగద్దితకీర్తియగు భారతజనకుని బ్రతుకు మనకింకి నెన్నదగినదైనది.
చౌదరిగారి భాష అచ్చమగు జాను తెలుగు. తిక్కనాదుల తెలుగు సొగసునకు మురిపెము గన్న కవి ఆ మార్గమునే పట్టి తన కైతను వెలయించి కబ్బముల సేతకు బూనుకొనుట లెస్స వేలుపుం బాస కైవసము తనకు వలసినంతయున్నను విచ్చలవిడిగా దానిని వాడుట కీయన యియ్యకొనడు. ఆయా అందమునే
”పండిత శ్రేణి వేలుపుం బాస మీది
తగులమున జేసి తెలుగును దెగడు నాడు
మాతృభాషను మన్నించి మనిపి నట్టి
వారి కర్పింతు మన్నమోవాకశతము”
అని సూచించినాఁడు. సాజమగు జాను తెనుగు పలుకుల కులుకు తిక్కన్నలోను, కొన్ని యెడల పోతన్న యందును, నన్నెచోడ మహాకవిలోను, కొందరు శివకవుల కబ్బములలోను మనము చూడగలము. ఆ యీ రహస్యమును తెలుగు కవిరాజు (శ్రీత్రిపురనేని రామస్వామి చౌదరి) కనిపించి తన కావ్యములను కమ్మని తెలుగు తీరు తీయములకు మేల్మి గీము లొనర్చుకొని, గీర్వాణభాషాటోపము తెలుగు కైతకున్న సౌజమగు సొగసును బోకార్చునని చాటియున్నాడు. తెలుగునాట నీబాట కిటీవల నీతడాచార్యుడనవచ్చును. ఈ రహస్యమును గ్రహించి వారి యనుచరులగు కొందఱీ నాడద్దానిని వృద్ధి పరచుచున్నారు. పదాఱణాల తెలుగువాడైన మన కవియు తెలుగు పొంకము, బింకము, జిగిబిగువులు సడలనీయక తేటగా కైతను దిద్ది తెలుగు దేవికి గూర్చు వాడై మెరసెను. ఈయన వచనములు తిక్కన వచనములం బోలియు, నీయన దేశీచ్ఛందములు తిక్కన దేశి పద్దెముల కుద్దియయ్యు నీయన నభినవతిక్కన నొనర్చి తెలుగుతల్లి ముద్దుమురిపెములు తీర్చినవి. శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి వంటి విమర్శక మూర్ధన్యులు “కవిగారూ ! మీకావ్యము ఆంధ్రభారతమునకు ప్రతిబింబము”’ అని ఒక్క మాటలో కోటిమాటల వలను వెల్లడించినారన్న వీరి యతిశయమున కింకేమి గీటురాయి కావలెను? కవియు ”తెలుఁగు కవిత్వము వలుకుట తనకు తియ్య”మని మా తిక్కన యజ్వలు తొక్కిన త్రోవ కేను సమ్మతిపడెదన్ అని తిక్కన వెలుఁగు బాటలలో పయనించి కైత వెలయించినాఁడు. పోతన్నను బోలిన యీ సాత్వికాహంకార మెంత యింపు నింపుచున్నదో చూడుఁడు.
పుఱ్ఱెకొక్కబుద్ది పుట్టు జిహ్వకు నొక్క
రుచి జనించు నంట రూఢియైన
సరసు లెల్ల మెచ్చ వెలయింతు గైతలో
గమ్మదనము మత్కులమ్మునవలె”
కులములోవలె కమ్మదనమును కైతలోగూడ వెలయించుట యీయనకే చెల్లె! ఇట్టి ప్రతిన పూనియు నిర్దుష్టమగు కవిత్వము సెప్పజాలియు దనలోని వినయమునకు సూచకముగను ఎంతవారికైనను ప్రమాదము తప్పదనియును,
తప్పులేని కైత సెప్పెదనని గుండె
పైని జేయి వైచి పలుకజాలు
కవి యెవండు ? బుధులు కారుణ్యమూర్తులై
యుంట నాటసాగు చుండుగాని
అని పలికినాడు. ఇది యీయన సౌజన్యమునకు నిదర్శనము. గాంధీ జీవితములో నాయాయిరసములకు విహారయోగ్యత లేకున్నను వెలలేని నీతుల కది యిక్కయై వన్నెకెక్కును. ఉపదేశార్ధము కావ్యమును బఠింప వలెనన్న నట్టి కావ్యములే మాననీయములు కాగలవు. బాలురనుండి వృద్ధుల వఱకును గావలసిన జీవితానుభవములు పురుషోత్తముడగు నీ మహనీయుని చరిత్రమునం దిమిడి యున్నవనుట పొల్లువోనిమాట.
గాంధీ దేవునికి జీవనసూత్రమగు నహింసకు, నీతికి నిక్కయైన యీ పద్యముంగనుడు.
సలిలంబు నీకు నీ గలిగినవానికి
నిష్ట మృష్టాన్నంబు నీగదయ్య
కేల్మోడ్పు నిడువానికిం భక్తిసంయుక్తి
జాగిల్లి జోహారు సలుపవయ్య
తృణకణం చేసి నీకిచ్చు పుణ్యాత్మున
కపరంజినాణె మీయంగదయ్య
కడగండ్ల నీకు దోడ్పడెడి వానికి నీశ
రీరమేగోసి యర్పింపవయ్య
ఇచ్చుచోనొండు దసగుణంబిచ్చు టొప్పు
గీడుగూర్చిన మేలుగల్గించు టురవు
చిత్తవాక్కర్మశుద్దియై జేయు వీని
నెవ్వ డాతండ గెల్చుఁబో యిజ్జగంబు.
అనెడు గుజరాతి నీతిపద్యం బొకండు
నా మనంబున దద్దయు నాటుకొనియె
నందు ‘ గీడొనర్చిన మేలు నాచరింపు’
మన్న సూక్తి జీవననూత్రమయ్యె నాకు.
ఇట్టి జీవనసూత్రములు కాదగ్గ సుద్దులిందు లెక్కకు మిక్కిలి.
”బొంకాడి యెఱుగనన్నెడు”
ప్రక్కనున్న వాని పలకను దిలకించి
నకలు వ్రాయు టెఱుఁగ నొకదినంబు”
”ఏక స్త్రీవతచర్య ధర్మములలో నెచ్చంచు వ్రాయంబడెన్.”
”అది ముద్రవోలె నామది నదికె”
ఈ తీరు చక్కట్లతో నిండిన యీ కబ్బము మహనీయనాయక గుణశోభితమై, సత్యాహింసాది దైవ గుణములను మప్పుచు వేదకాలమునాటి ముత్తైదువవలె జనవంద్యమై నెగడినది. ఆత్మార్పణములోని కవితకన్న నిందలి కవితలో, కవి నేర్పు శతాధికముగా పెరిగి ప్రాక్కవుల పోకడలతో నింపు సొంపుల నింపుచున్నది. ఈ కవిగారి ఆత్మకథ రెండు, మూడు భాగములు గూడ దరిదాపు రెండు వేల పద్యములు వ్రాయబడి ముద్రిత స్థితిలో నున్నది. అనతికాలమున నదిగూడ తెలుగువారి చేతుల గైసేయగలదని యాశింతము.
ఇక తెలుఁగునాట వీను మిగిలిన వీరి మూడవ కృతి ”రాష్ట్ర గానము’ ముప్పదియేండ్లకు బైగా రాష్ట్రలబ్దికాందోళనము సేయుచుండియు గృతార్దులుగాని తెలుగువారిని బ్రబోధించుట కీకృతి బయలుదేరినది. ఇందు కవి సీసములను వృత్తములను నాశ్రయించి ఆంధ్రాభిమాన మిబ్బడి ముబ్బడి కాగా వే రీతుల భూతవర్తమాన కాలముల యాంధ్ర ప్రతిభను చాటును. కవికి గల పాండిత్య ప్రతిభలకీ గ్రంథము చక్కని యొఱపిడిరాయి యందును. గీర్వాణాంధ్రముల రెంటను గవి తన లేఖినిని విశృంఖలముగా వీర విహారము చేయించినాడు. సజీవములగు జాతీయములను సామెతలను వాడి ఆయాఘట్టముల బాఠకులను దన్మయుల నొనర్చి ”ఆంద్రోహమ్మని పించుటలో నీ కబ్బమున కిదియే సాటి. ఆంధ్రత్వమును నిండుదనముతో చాటుట కీకబ్బమే తెలుగులకు మొదటిదనుట తెగువ కాదు. తెలుగుదల్లికి జోహారు పెట్టుచు
”నినుజూచి నినుబాడి నినుగొల్చువేళ నా
కనులాణి ముత్యాలగనులు గానగు నహో !
తెలుగుతల్లీ ! నీకు జోహారూ !”
అని తన్మయుడై తన యకృత్రిమాంధ్రాభిమానమును చాటుచున్నాడు. ”తల్లి సంకెలలో దల్లడిల్లుచుండ నాకమైనను నరకంబుగాకయున్నె” అని వా పోయి ”ఊచవోయిన సంతాన మేచునట్లు దీవనల్గురి యింపవే తెలుగుతల్లి!” అని వేడు నీయన తెనుగు భక్తియెంతిదో! తనకట్టు, తనజుట్టు, తనబొట్టు, తనదనుకొన్న దంతయు చౌదరి గారికి సమ్మతము. పెఱల యడుగులకు మడుగులొత్తుట, వారివేషభాషలకు గులాములగుట వీరికి రోత. కావుననే ”ఆయ్యరు గూడకట్టు మనకక్కఱయే గుజరాతిటోపితో నెయ్యము లేనిచో బ్రతుక నేర మరబ్బుల లుంగి పొత్తు లేద య్యెనయేని చక్కదనమన్నది సున్న. తెలుంగువానికీ దయ్యపువేస మేల? మనతాతల తండ్రుల కట్టు గిట్టదే!”
”అంధ్రుడ వైజన్మించితి
వాంధ్రుడవై యనుభవింపు మీ యుర్విభవం
బాంధ్రుడవై మరణింపుము
ఆంధ్రత్వములేని బ్రతుకు నాసింపకుమా ! అనుచున్నాడు.
తెలుగువారు, ఏ శ్రోత్రియులో దక్క పెరలు మూతిమీదిమీసాలు గొరిగించు కొనుట యీయనకు చెప్పరాని తలనొప్పి. ముఖమునకు మీసాలే యందమని భావించు నీకవి
”మీసములేని మూతికవి మిశ్రమనోహర కావ్య వాఙ్మయాభ్యాసము లేని పల్కు నవపల్లవ కోమల కన్యకా పదన్యాసము లేని కొంప లలనామధురాధర సంపుటీ సుధా గ్రాసములేని జీవితము గాదె గుణగ్రహణైక దృష్టికిన్ అని తనయభిమానమును జాటుచున్నాడు.
లేజవరాలి మోవికి, జిలేబికి, బాలరసాల మార్దవ శ్రీజనయిత్రికిన్, రుచులు చిందెడు తేనెయట యాంధ్రవాణి, ఆంధ్రవాణిమాట యటుండనిండు, రాష్ట్ర గానములోని యీకవివాణి మాత్ర మిట్టిదే. ఈయన ప్రాతవడినట్టి యాంధ్ర భూపతుల కథలు చదువుడొకసారి ”కండలు కదలియాడ” అని, తెల్గులను మేల్కొలుపుచున్నాడు. కొమ్మదిరిగినవారలే కొలువు సేయ దిక్కు లొత్తిన మొనగాడు. తెలుగు వాడట. ఉత్తమోత్తమ ధర్మ మెందున్న దాని కొలువు మరగెడి వాడట తెలుగువాడు. ఆంధ్ర సంపత్తి నెంతగా కవిగ్రహించెనోచూడుడు. ఆంధ్ర శిల్పినిగూర్చి,
లాలిత్యలక్ష్మీవిలాస రంగమ్ముని
ల్పితి వజంతా చిత్ర లేఖనమ్ము
సవరించితివి శైవభువనంబు నెల్లొరా
కొండను మైనంపుటుండజేసి
విఠలప్రభుని కోవెల కంబములమీఁదఁ
బలికింపగంటి సప్త స్వరాలు
ఒలికించి తౌర తిర్మలనాధు నగరిలో
వెలలేని సభ్యతా విలసనములు
భగవదన్వేషణార్ధమై పాటువడిన
యుత్తమతపస్వివై కళాయోగివైన
నీకు ఋణపడె రసలుబ్దలోక మెల్ల
నాంధ్ర శిల్పీ ! చిరంజీవివయ్య!నీవు.
ఇందలి సీసములన్నియు సరళమైన నడక గలిగి పఠితకు రసభావముల సముద్దీప్తిని గలిగించుచున్నవి. తెలుగుబాస మీది తగులము ముమ్మరమయ్యు నవసరమైన పట్టుల సంస్కృత సమాస భూయస్త్వము నీయన విస్మరింపలేదు.
”దీపిత విక్రమాఢ్యము నదీనద శైలసముద కానన ద్వీప విశిష్ట విశ్వజగతీవలయ ప్రభుతా సమంచిత శ్రీపదనిష్ట మైకడుబసిద్ధివహించిన తెల్గుజాతికిన్ దాపరమైన యీ క సటుదైన్యము బాపగ లేరె సోదరుల్.” –
పై సమాసము నన్నయ్య సమాసము వంటిది. నన్నయ్య పోలికలను మఱి చిన్నయ్య పోలికలను గూడ నీకవి కైవసము చేసికొన్నాడు. వేయేల ? చౌదరిగారికి రాష్ట్ర గానమను నీయొక్క కృతియే కవియశమును సంపాదింప జాలినదై నెగడెనన్న నిక్కమునకు తలవంపులు లేవు. ఈవి యాంధ్రాభిమానమును నుగ్గడించు నొక పద్యముతో నవ్వలికరుగుదము.
”ఎట్టి కఠోరదీక్షలు సహించితినో తొలుబొము నందు నీకెట్టి కదళంబు లెట్టి విరులిచ్చి సపర్య లొనర్చినాడనో పుట్టితి నీసుతుండనయి పోడిమి గంటిని తల్లి ! వీనికి ! బెట్టుము భిక్ష నీయనుగు బిడ్డడుగా నెపుడు జనింపగన్.
ఈ కృతినిబట్టి కవిజీవితవిశేషము లెన్నియేని వ్రాయవలిసి యున్నవి గాని వ్యాసవిస్తరభీతి యడ్డగించుచున్నది.
వీరి నాల్గవకృతి ”ధర్మజ్యోతి” చౌదరి గారి తండ్రి నారయ్య గారు. చందవోలులోని యొక కోమటి ఆపత్సమయమున నారయ్యగారికి మూడు బంగరు ఇటికలను దాచబెట్టనిచ్చెను. సత్యధర్మపరాయణుడగు నారయ్యగారు కొంతకాలమునకు సెట్టికి మఱల ‘నా బంగరు నంతటిని సమర్పించి బరువుతీరినదని సంభావించును. ఇది యిందలి యితివృత్తము. కలియుగములో నిది సంభావ్యమని మనము తలంపము. కాని నారయ్య గారివంటి సాధుసత్తముని విషయమున నిది చెల్లుబాటైనది. ఆయన లోకోత్తరాదర్శమును చాటినాడు, అట్టి నారయ్య గారి కడుపున బుట్టిన చౌదరి గారును ఆయనకుద్దియై పితృమార్గ గామియై ప్రకాశించినాడు. కావుననే కృతులు సమర్పించుటే గాని కృతిపతులవద్ద ధనముగొంట యీయన యెఱుగడు. ఈ కవికి గావలసినది కృత మెఱుక యొక్కటి మాత్రము.
”కృత మెఱుకచాలు నస్మ
న్మతికిం పదకబ్బ మిచ్చిమణిగొంట; జగ
ద్ధితశీలుం డొదవ నయా
చితముగ నేనిడుదు నాస్పజించిన కవితన్”
ఇది యెంతయు గొనియాడదగినసుగుణము. వాఱి యాదర్శము గూడను. నరాంకితమును గూర్చి వీరి యభిమత మిట్టిది.
”నరునకు గబ్బమిచ్చుట యనాదృత కృత్యమటంచు సత్కవీశ్వరులు పురాతనుల్ నుడువు చంద మదేమొ రుచింప దెంతయు సిరులకు నాసచెంది యొక చెన్నటి కిచ్చుట మచ్చ గాని స్వార్థరహితబుద్ధి నిద్ధగుణరాశి కొసంగినన్ దోసమున్నదే !”
ఇదికూడ బుధజనోపాదేయ మందును. ధర్మజ్యోతిలో నలతిగా ప్రబంధచ్ఛాయలు పొసంగినవి. చందవోలువర్ణన మందును నయ్యై ఘట్టములను కృత నిర్మితి ప్రాబంధికుల ధోరణి ననుగమించినది.
విజయవాడవద్ద కృష్ణ కానకట్ట గట్టి కాలువలు త్రవ్వునపుడు చందవోలు సమీపమున నొడ్డెర వాండ్రు కాలువ త్రవ్వుచుండగా నందు వారికి బంగరు టచ్చుల నిక్షేపము దొరకినది. వారు సంతోషము మెయి తలకొక యచ్చు దీసికొని చందవోలు బేహారుల కమ్మ జూప నా బేహారు లచ్చు విత్తడి వన్నారు. పాప మొడ్డివాండ్రేమి చేయుదురు !
”పొరపాటుచే నొకప్పుడు వచ్చు గాక
నిరుపేదకొంపలో నిలుచునా లక్ష్మి?”
ఏల నిలుచును ? నిలువదు. కోమట్లు ఒడ్డెరలకు తలకు రెండు రూకలిచ్చి యచ్చుల నిముడ్చు కొన్నారు. ఈ సంగతి ప్రభుత్వమునకు దెలిసి పరీక్షకు బూను కొన్నపు డొకవైశ్యుడు మన నారయ్య గారివద్ద మూడచ్చులు దాచి పెట్టినాడు. నారయ్య ఆ లిబ్బిని మఱల వైశ్యున కిచ్చుచు నాతని కెన్నియో నీతులు గూడ మప్పినాడు.
”ఇచ్చునెడ మెచ్చు వేళల
నచ్చముగా గుణము చూతు రంచితచరితుల్
త్రచ్చెదరు కులమతంబులు
తెచ్చెదరున్ ఖలులు గ్రామదేశాంతరముల్.”
ఇది పేదలసొమ్ము సుమీ ! యెదనుబ్బకు మస్మ దీయమే’ యని కోమటికి గఱపి బీదస్థితిని గూర్చి నారయ్య గారు
ఆకటికి మ్రగ్గి చలి దెబ్బ కలమటించి
మొండిరోగాల కవమానములకు లోగి
నాగరకలోకమున కొక్క నవ్వు విసరి
పిలుచుచున్నాడు యము నహో పేదవాడు. అన్నారు.
”ఇది ముమ్మాటికిని సత్యము కాదా ?
”బానిసీడు గుడుచు పరమాన్నమున కంటే
నుచిత మిచ్చుకొలది నొదవు గంజి”
”కోవెలలో గంగానది
రేవులలో రామకోటిరేఖలలో లే
డే వాని బుద్దికరుణకు
నావాలం బతని యంద హరి వసియించున్.
ఇవియెట్టి కఱడలో చూడుడు. సెట్టిగారి ముదుసలి పెండ్లమును వర్ణించు దిగువ పద్యములు శ్రీనాథుని యన్నపూర్ణావర్ణనమును జ్ఞప్తి కెలయించుచున్నవి.
చిఱుబంతి పసుపాడి సీమంతవీథి
గుఱిచేసి పెద్ద కుంకుమ బొట్టు నలది
ముత్యాలతాటంకముల నొప్పదాల్చి
ప్రభలు చిమ్మెడు నడ్డబాస ధరించి
పాటపాడగ వెల్లబాఱిన కురుల
విరులతో జతగూర్చి వేనలిదీర్చి
చెంద్రికపూవన్నె చీరనుగట్టి
కరువునం బోసిన గఱువ తనంబొ
కరుడు గట్టినయట్టి కారుణ్యరసమొ
మేను దాల్చిన జగా మేలి శీలంబొ
తొలుమిన్కు నాటియైదువయో యనంగ
నెదుటనిల్పిన సెట్టి యిల్లాలు”
ముమ్మూర్తులా వేదకాలపునాటి ముత్తైదువనే తలపించుచున్నది. ఈ చిఱుకబ్బములోనే కవిచూపిన మేలితీరులు లెక్కకు మిక్కిలి. తెలుగునాట నింటింట గుబాళించు తాలింపును గవి యెంత కమ్మగా వర్ణించినాడో తిలకింపుడు.
హైయంగవీన దివ్యామోదబంధువై
జీరక వాసనాశ్రీ బెనంగి
మెంతి కమ్మదనంబు నెంతేనిఁ జేపట్టి
యింగువ నెత్తావి పొంగు లొలసి
వేపవలపుతో గలసి కస్తుంబఱీ
లలిత పల్లవపరిమళము నెనసి
మాషఖండ ఘుమంఘుమనుగూడి సర్షప
గంధమ్ముతోడి సాంగత్య మంది
వంటయిలు వీడి వాడల వెంటజాగి
పౌరనాసాభితర్పణ కారి యగుచు
జవులు పుట్టించు తాలింపు సౌరభమ్ము”
ను ఎవ్వరేని వదలి పెట్టగలరా ? ఈ తాలింపువలె నీ కృతియు గమ్మదనాలు చిమ్ముచున్న దని యొక్క మాటచెప్పి యవ్వలి కరుగుచున్నాను.
ధర్మజ్యోతి వెలిగించిన పిమ్మట కవి మహోర్మింబోని కన్నీటితో సమరజ్యోతిని దర్శింపవలసి వచ్చినది. అమరజ్యోతి మహాత్ముని నిర్యాణమును గూర్చి వాసిన కరుణఖని. మహాత్ముని బ్రతుకును వ్రాసిన కవి ఆయన మృతినిగూర్చి వ్రాయవలసివచ్చినందుకు పెల్లు వాపోయినాడు.
”శతజన్మార్జిత మామకీన సుకృతస్థానమ్ముగా నీ జగా
బ్రతుకున్ జాటెడి కావ్యమున్ సుకవితాప్రౌఢమ్ము నిర్మించి నా
బ్రతుకున్ ద్రోయదలంచు
కొంటి మును; పాపం బెద్ది యోపండి నీ
మృతిపై నేడు కృతిన్ రచించితి మహోర్మింబోని కన్నీటితో.
గాంధీ మహాత్ముని దలంచుకొన్నంతనే కవి కనాలోచితముగనే కవితాశక్తి యావేశించి మధురమో హనములగు పద్యములను వ్రాయించును గాబోలును.
నానాట సుపరిణతమైన కవితాప్రజ్ఞతో కివి యీ చిఱుకబ్బమును సుమనోహర మొనర్చినాడు. ఒక్క తెలుగునకేకాదు. ఉభయభాషలకు నిందు సముచిత ప్రాధాన్యము బొడకట్టును. అనర్గళమగు ధారతో గాంగనిదరమువలె నీ ‘కవిత సాగిపోయినది. గాంధి మహాత్మునిలోని అయ్యై మహా గుణములను ప్రస్తావించుచు పాఠకుల కానందముతోబాటుపదేశమునుగూడ నీఖండ కావ్యము సేయు చున్నది. లోకోత్తరచరితుడగు గాంధీ దేవుని రామాదులతోజేర్చి పలుకుట యీ కవికి గిట్టదట.
”నిను రామాదుల జేర్చి మెత్తు రది మన్నింపన్ రిపు గ్రీవముల్
రణరంగమ్మున గోసి రక్తఝరిలో రామాదు లోలాడి రా
పనికిన్ నీకును లేదు పొత్తు
రిపుతన్ బాధించి విద్వేషి పై
నెనరుం జిమ్మెద వీవు చిక్కదు ప్రభూ నీ యోగ మెవ్వానికిన్”
అని యితరావతారములకన్న గాంధిలోని విశిష్టతను జాటుచున్నాడు. గాంధి రామరాజ్యము నాశించినాడు. అది యెట్టి రామరాజ్యమో కవి గారు వివరించి చెప్పుచున్నాడు.
”శంబుకువంటి సాధువుల జంపక సంపద లేమి యన్న భే
దంబులులేక సర్వజనతా సమతా సహజన్మతల్ నభ
క్చుంబులు గాగ శాంతిపరి శోభితమై నుతిగాంచు రామరా
జ్యంబున కాసచేసి చరితార్థత నందకమున్న సాగితే ?”
బ్రాహ్మణజాతివాడగు గోడ్సే గాంధిని జంపుట నుద్దేశించి
”బోయఁడు విప్రుడై భువనపూజ్యుని రాముని కీర్తినిల్ప రా
మాయణసృష్టి చేసి నుతులందె నొకా నొకనాడు; విప్రుడే
బోయతనమ్ము నంది ఋషి పుంగవు నేడు వధించె రామాసే
వాయజనార్ధచిత్తుందనవంగ డసమాఱ నిలజ్జల గ్రుంగఁగన్.”
”కుల వర్గముల గ్రుళ్ళి కుమిలిన నీ మతం
బుద్ధరింపఁగఁ జక్కదిద్దు కతన
మాల కై మందారమాల కైసేసి నీ
దేవాలయముతల్పు తెఱచు కతన
పొగలతో సెగలతో బొగులు హిందూ ముస్లి
ముల కౌగిలింతలు వలచు కతన
పేదసాదుల నెత్రు పీల్చి గజ్జున ద్రేచు
సాహుల నదలింప సాగు కతన
ప్రజ నెదిర్చిననాడు మీ బ్రతుకు లేదు
లేదనుచు గిం ప్రభుల మందలించు కతన
కాల్చి తటరా ! జగత్తయీకర్మయోగి
లోకమూర్థాభిషిక్తు గోడ్సే కిరాత !”
ఇట్టి పురుషోత్తముని జంపినజాతియే మరల దేశముపై బ్రభుత నెఱపి తరతమభావములతో భారతమును నవయింప జేయునా యని కవి భయమందుచున్నాడు.
”ఒడ్డారించి నినున్ వధించి కుటిలవ్యూహమ్ము పండించి మా
జడ్డల్ పోయెనటంచు బ్రేంఖణములన్ సారించి కజ్జాయముల్
లడ్డుల్ పంచిన మూ భారతము నేలన్ నేల దయ్యాలకే!
యడ్డంబాకయు లేని రంగమగు గాదా భావి యెట్లున్నదో.
గాంధి మరణానంతరము ఆయనకు గుళ్లుగోపురములను గట్టిస్వార్ధమును సంపాదించుకొన జూచిన వారిని కవి గర్హించినాడు. బుద్ధుని యెముకలకు స్తూపములను గట్టి ఆయన మతమును ”విదేశముల పాలు చేసిన వీరిచెయ్దములు కవికి పరితాపకారణములైనవి. ఈ కావ్యము గూడ మధుర గంభీరభావములను బ్రదర్శించుచు సాగిపోయినది. చివరకు గాంధీనిగూర్చి కవి యాశయ మిది.
”మనుజుడవు గావు నీవు కోమటివి గావు
బడలిపోయిన భారతీయుడవు గావు
కాపు గాంధివి లోకలోకముల వెల్గు
జూపు నిరవధికామరజ్యోతి వోయి !!
ఇది త్రికాలసత్యము. గాంధీ యేనాటికేని మరణింపక తీరడు. కాని ఆయన ఆదర్శములు మాత్రము అమృతములై యుగయుగమ్ముల వరకును లోకములకు వెలుగుబాటల జూపును.
ఇక కవిగారు నాడునాడు రచించిన ఖండ కృతులు పెక్కులు. వాని నన్నింటి నొక్కచో జేర్చి ”పఱిగ పంట”యని యొక కబ్బముగను, ఆ ”పెద్దకాపు” అని వేరొకగ్రంథముగను నచ్చొత్తించి నారు. ఈ ఖండకృతులనాంధ్రు లాయా పత్రికల యందప్పు డప్పుడే చదివియుందురు. చౌదరి గారు మహా కావ్యము మొదలుకొని ఖండ కావ్యము దనుకను ఏది వ్రాసినను వర్ణనీయ వస్తువును గన్నులకు గట్టినట్లు చిత్రించే రసభావముల రామణీయకముచేత పఠితల మానసముల నున్మీలింప గలరు.
పెద్ద కాపులో శివు నొకకర్షకునిగా భావించి కవి వర్ణించియున్నాడు. ఆ శివ కర్షకు డీతడు
చదలేటి నీటిసంపద రిత్తవోనీక
సిగముడి నానకట్టగ నమర్చి
యల జాహ్న చీవీ ముఖ్యములు చిన్న పెదకాల్వ
లఖిల భారతభూమి నల్లుకొల్పి
ముక్కారుపంటల ముద్దు టెక్కెంబన
గేలముమ్మొనల ముల్కోలనూది
మెడమువ్వపాటలో నొడలబుల్కలు రేగ
బసవన్న నసివాఱు పనికిబనిచి
యిల్లు వెండియు బంగారు విల్లుగాగ
బండి కై వ్రాలినజగమ్ము పంటపొలము
కావలికి ఘోర సర్వకంకణము గట్టు
శివుని మా పెద్ద కాపు నర్చింప రండు !
ఇందు శివునిలో బెద్దకాపుదన మెంతగా నచ్చున గుద్దినట్లంద మొందెనో చూడుడు. ఇందు ‘కర్ణుడు’ ‘ఆవేదన’, ‘కృత మెఱుక’ మున్నగు ఖండములు మనోజ్ఞములు. తెలుగువారు తెలుఁగు కవుల నభిమానించి పూజింపమికిని పెఱకవుల యడుగులకు మడుగు లొత్తుటకును గవి మిక్కిలి యేవగించుకొని యిట్లనుచున్నాడు.
”బెంగాలీ కృతికర్త పాదముల కర్పించున్నమస్కారము
ప్పొంగుం బారసి లేఖినీ విలసనంబు ల్సూచి రా వయ్య ! నా
బంగారంబ యటంచు నాంగ్లకవి నాహ్వానించు నేపాపమో !
రంగా! మెచ్చఁడు తెల్గు బిడ్డ కవిసమ్రాట్టు స్వదేశీయునిన్”
ఈ గుణ మాంధ్ర ప్రజానీకములో వేరుపురుగువలె పాదూనినట్టిది.దీనికి దిలోదకము లిచ్చినఁ గాని తెలుగువారు తెలుగు మీరరు.
పఱిగ పంటలో సంక్రాంతి, హంపీ క్షేత్రము, కూట వేదాంతులు, అనుతాపము, పలనాడు మున్నగునవి మానసమును చూఱలాడునవి. సంక్రాంతిపండుగ దినములలో
రేగటిపాలలో గ్రాగిమాగిన తీయ
తీయకప్పురభోగి పాయసంబు
చవులూరు కఱివేప చివురాకుతో గమ
గమలాడు పైర వంకాయకూర
తరుణ కుస్తుంబరీ దళమైత్రిమై నాల్క
త్రుప్పు డుల్చెడు నక్క దోసబజ్జి
క్రొత్త బెల్లపు దోడికోడలై మఱిగిన
మపదురు గుమ్మడి పండు ముదురు పులును
జిడ్డు దేఱిన వెన్నెలగడ్డ పెరుగు
గరగరికజాటు ముంగారు చెఱకురసము
సంతరించితి విందుభోజనము సేయ
రండు రండని పిలిచె సంక్రమణలక్ష్మి.”
ఇందు సంక్రాంతికి సిద్ధమగు నాయా భోజ్య పదార్దములు మఱపు వడక యెట్లొక్కచో జేరి చవులూరించుచున్నవో చూడుడు.
చౌదరిగారు తెలుగుదనమును వర్ణించు పట్టుల దన్మయులై జాను తెనుగుపదముల తియ్యం దనము మూరిబోవునట్లు కైత లల్లి తెలుగులను ఋణపడం జేసినారు. బీదలను, రైతులను గాంచిన యీయన మనస్సు కరగిపోవును. అద్భుతచరితములు కలిగి రచ్చ కెక్కలేక సుక్కిపోయిన దీనులను గాంచి వీరి కెంతయో సానుభూతి గలదు. ఆ విషయమున నాంగ్లకవి ‘గే’ ననుసరించును. పఱిగ పంటను లక్ష్మయ్యగారి కంకితమిచ్చుచు నాయంశమును ముద్దు ముద్దుగా సూచించినారు. వేయేల? గాంధీచరిత్ర కారుఁడగు నీకవి పెక్కువిషయముల నాయన కనుచరుడై యా మహనీయుని మహనీయగుణములకు గుదురై చెలువొందినాడు. సభ్యులు మెచ్చందగిన శీలము, శీలమునకుద్దియైన మధురకవితగల యీ కవి ధన్యుడు.
తెలుగుబాసయందు వీరు వెలయింపవలసిన సారస్వత భాగము లింకను బెక్కులున్నవి. ‘గద్యం కవీనాం నికషం వదంతి’, అని యభిజ్ఞులు వచించి యున్నారు. కొన్ని గద్యకృతులు, నవలలు, కథలు, నాటకములు, మున్నగునవి యల్లి తెలుగుతల్లి కర్పింపవలసిన బాధ్యత కవిగారిపై నున్నదని వక్కాణించుచున్నాను. ఆంధ్ర సాహితీరంగమున నన్ని భూమికలను నిర్వహించి మెప్పు వడయ వలసిన బాధ్యత నేటికవిపై నున్నది. షష్టిపూర్తి నాటికా కొఱత దీర్ప గలరని తలంతును.
కనకాభిషేక గండపెండేరాది మహాసమ్మానములకు నోచిన యీకర్షక కవి ‘శతమానంభవతి’ యను వైదికాశీస్సునకు బాత్రుడై యమూల్యమగు సారస్వతసేవ యొనర్చుచు దెలుగునాట వెలయ దెలుగుతల్లి మేల్మి దీవనల గురియించుగాక,
”జయతే సుకృతినో రసస్తిః కవీశ్వరాః”
– శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులు
~
నవరత్నహారము
శ్రీ స్వాతంత్య్రమలంకరించినది లక్ష్మీ యోగ్యమై మేల్కి మై
వస్వైశ్వర్యము పొంగియాడు భరత ప్రాశస్త్యమెల్లందు వ
జ్ర స్వామ్యంబయి యాధిపత్యము మహాప్రాజ్ఞత్యమున్ గాంచె బో
ధస్వాభావికమౌ వివేకమణి సీతారామమూర్తీ ! సఖా !
వైర్యంతంబును గాంచి భారతమహీభాగ్యంబునున్ బెంచి, వై
డూర్వంబౌ సిరి ముచ్చటించి, యలనాడున్ నేడుగావ్యాత్మ సూ
ర్య ర్యమ్ణంబయి నృత్యమున్ గొనెను, విద్యానాథులెందైననున్
ధైర్యస్ఫూర్తిని నుంటదెల్పితివి సీతారామమూర్తీ! విభూ!
గోస్తన్యంబటు ద్రాక్షరీతి రుచిమేల్ కోల్ కాంచి నీకైత మే
మే స్తవ్యంబునుగాంచినామను కవీంద్రేప్సల్ నుడుల్ కాగ స్వా
ధిస్తుత్యంబగు వ్యాప్తి పొందినది నీతిన్ గానుకల్ ”శత్రుజిత్
కస్తత్రేతి” పదంబుపాపినవి సీతారామమూర్తీ ! గుణీ !
పుత్రుల్ పెక్కురు భారతాంబికకు నింపు సొంపు బాటించి భా
ష్యత్రైగుణ్యమువోలెఁ బాండితియు రాజ్యాకాంక్ష శౌర్యం బహో
రాత్రం బాత్మ గుణించి వాక్సరణిమై రంజిల్లినావెందు ముద్
గత్రాణంబయి నీకలంబల సీతారామమూర్తీ ! ఘనా !
మతముల్ పెక్కులు నీతిమాత్రమొకటే మాన్యంబు కై సేసి భా
రతమాహాత్మ్యము నుద్ధరించుటకు బ్రారంభించి సాఫల్యమే
కతమున్ బొందుట గాంచినావు కవితాజ్ఞానర్తివై మించి సం
తతమోదమ్మును నింపినావు భువి సీతారామమూర్తీ ! బుధా !
మాన్య క్షేత్రము తుమ్మలాన్వయ మసామాన్య ప్రభావంబు ప్రా
ణిన్యాయాకృతి చౌదరి ప్రతిభవాణిన్ గమ్రరాజ్యాధి వా
క్వన్యాసాంబుధి భారతాభినవ తిక్కన్న ప్రచారంబు దీ
ప్తన్యస్తంబు గురూపదేశకత సీతారామమూర్తీ ! మణీ!
నీ త్యాగంబు మనః ప్రసన్నత పితృస్నిగ్ధుడు నారయ్య మే
లతం బలరించు మాతృమణి చెంచమ్మాంబ ధర్మంబులన్
నిత్యానంద మలంకరించినది వానిన్‌దమ్మిపూనోలె సాం
తత్యాకారముమై సిరిన్‌గొనెను సీతారామమూ ర్తీ ! ధనీ !
ప్రస్తావంబున నీవు పల్కినది శౌర్యస్ఫూర్తి భాసిల్లుచున్
వాస్తవ్యంబయి దేశ వైభవము సౌభాగ్యంబున్ బద్మనా
ళస్తుత్యంబగు సౌరభంబును మహోల్లాసంబునన్ హత్తి చి
త్తస్వస్తిన్ ప్రకటించి మించినది సీతారామమూ ర్తీ ! కవీ !
మౌల్యంబున్నతరాజ్యలక్ష్మికి మహామంత్రంబుదేశాప్తి, కౌ
క్తిల్యంబుత్త మధక్మమార్గమున, కుత్తీర్ధంబు సర్వార్ధ సా
కల్యస్వాభిసువర్ణ సంతతికి భాగ్య ప్రాపితామోద వా
త్సల్య శ్రీనవరత్నహారమిదె సీతారామమూర్తీ! కృతీ !
– విద్వాన్, శతావధాని, శ్రీభమిడిపాటి అయ్యప్పశాస్త్రి
(సశేషం)