వయసే వయసును…

0
3

[box type=’note’ fontsize=’16’] 14 ఫిబ్రవరి ప్రేమికుల రోజు సందర్భంగా ఈ కథని అందిస్తున్నారు ప్రసిద్ధ రచయిత శ్రీధర. [/box]

[dropcap]ఇం[/dropcap]కా తెల్లవార లేదు. కొమ్మల మీది పక్షిగణము ఇంకా గళము విప్పనే లేదు. అప్పుడే ఎవడో ఒక పక్షి ఫోన్ చేశాడు.

కలల అలలపైన తేలియాడుతున్న అమ్మాయి లెవరూ కనురెప్పలు విప్పే స్థితిలో లేరు.

మాణిక్యమ్మ నిద్ర లేచి చాలా సేపు అయింది. ‘నేచేసిన నేరము లేమి? సీతారామస్వామీ’ అని నిలదీస్తోంది. ఇంతలో ఫోన్ మ్రోగుతుంటే లేచి ఫోన్ అందుకుంది.

“లవ్ యూ డార్లింగ్” అన్నాడు ప్రవీణ్ అవతల నుంచి.

“ఈ వయసులో నాతో నీకు లవ్వేంటిరా పుండాకోర్ వెధవా?” అన్నది. ఫోన్ కట్ అయింది. ఆమె వాక్ప్రవాహం మాత్రం కట్టలు తెంచుకొని ప్రవహిస్తూనే ఉంది.

“తెల్లారక ముందే లవ్వా. పిడక మొహం వెధవ… వీడి శార్ధం చెట్టు కిందపెట్టా… వీడి పిండం కాకి ఎత్తుకు పోను… ఏమనుకున్నావురా ఈ మాణిక్యమ్మ అంటే… మా పిడుగురాళ్లలో నా పేరు చెబితే సర్పంచ్ కూడా పంచె తడుపుకుంటాడు. ఏమనుకున్నవో?” అంటూ స్తోత్ర పారాయణం జరుగుతుండగానే, సౌందర్య గదిలో నుంచి వచ్చింది కళ్లు తుడుచుకుంటూ.

“నీ నిదురించిన పౌరుషాగ్నిని రగిలించిన వాడెవడు బామ్మా?” అని అడిగింది.

“ఎవడో నెల తక్కువ వెధవ. నేను రాముడ్ని తల్చుకుంటుంటే ఈ వెధవ ఎవడో నన్ను లవ్ చేస్తున్నానంటాడు. నాకు డాక్టర్‌‌కు అయ్యే ఖర్చు వాడు భరిస్తాడేమో కనుక్కోవే…” అన్నది మాణిక్యమ్మ.

“ఇవాళ ప్రేమికుల దినం బామ్మా…” అన్నది సౌందర్య.

“ఎవడి దినం అయితే నాకేంటి?” అన్నది మాణిక్యమ్మ.

పిడుగురాళ్లలో మాణిక్యమ్మకు లంకంత కొంప ఉంది. ఆమె ఆ ఇల్లు విడిచి బయటకొచ్చిన సందర్భాలేమీ లేవు. నోరున్నవాడిదే రాజ్యం గనుక అక్కడ ఆమె మాటకు ఎదురు చెప్పేవాడు ఎవడూ లేడు. ఆమె కొడుకు ఫణిభూషణరావుకు గవర్నమెంటు ఉద్యోగం. పాడిగేదె లాంటి పోస్ట్. ఎంత పిండినా ఇంకా కొంత పిండుకునే వీలు ఉంటూనే ఉంది. నడమంత్రపు సిరి. పట్టపగ్గాల్లేవు. హైదరాబాదులో భవనంలో భార్యా ముగ్గురు పిల్లలతో ఆయన జీవితం పువ్వుల వానలో నవ్వుల నావలాగా నల్లేటి మీద నడకలాగా సాగిపోతోంది.

మాణిక్యమ్మ కూతురు అమెరికాలో స్థిరపడింది. మనవరాలు రుతిక చుట్టపు చూపుగా హైదరాబాదు వచ్చింది. ఆ మనవరాలు మీదున్న వల్లమాలిన ప్రేమ వల్ల, మాణిక్యమ్మ కొడుకు దగ్గర కొచ్చి నాలుగు రోజులు అయింది.

ఫణిభూషణరావు పెద్ద కూతురు సౌందర్య, ఆరని దాహపు తీరని కోర్కెలతో రగిలిపోతున్న సౌందర్యకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఆమె కాలు బయటపెడితే, అయిదారు కారులు ఆమెను అనుసరిస్తూనే ఉంటాయి. ఆమెకున్న అనుచరులంతా కోట్లకు పడగలెత్తిన వాళ్లే. ఆమె కన్నుల్లో వలపుల జలపాతాలు కురుస్తుంటాయి. కానీ ఎవరికీ ఎక్కడా చిక్కదు, చిక్కుల్లో చిక్కుకోదు.

ఫణిభూషణరావు రెండో కూతురు వెన్నెల. స్వైరవిహార ధీర. నా తాత జగదేక దాత అంటుంది. ఎప్పుడూ నలుగురిని చుట్టూ పెట్టుకుని ఉంటుంది, పెట్టని కోటలాగా.

ఫణిభూషణరావు కొడుకు మహానగరంలో మాయగాడు. పనిమనిషి పద్మ దగ్గర నుంచీ, దీపికా పడుకునే దాకా ఎంతో మంది అమ్మాయిలతో పడుకునే దాకా ఫోన్‌లో మాట్లాడుతునే ఉంటాడు ష్యూర్, ష్యూర్ ష్యూర్ అంటూ.

ఫణిభూషణరావు భార్య గంగిగోవు లాంటి మనిషి. వండి వార్చటం తప్ప, లోకం పోకడలేవీ తెలీని మహాసాధ్వి.

ఇదీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న సెటప్.

ఉదయం తొమ్మిది గంటల సమయంలో అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో సౌందర్యకున్న మూడు ఫోన్‌లలో ఒక ఫోన్ మోగింది ‘నువ్వొస్తానంటే, నేనొద్దంటానా?’ అన్న ట్యూన్‌లో.

“ఎవడో చూడవే” అని సౌందర్య చెల్లెలు వెన్నెలను ప్రోత్సహించింది.

వెన్నెల మాట్లాడింది.“ మా అక్క నీళ్లాడుతుంది. టైం పడుతుంది.” అని ఫోన్ పెట్టేసింది.

అరగంట తరువాత అందరూ ఎవరి పనుల మీద వాళ్లు వెళ్లిపోయారు. వెన్నెల కూడా బయలుదేరింది, అదిరేటి డ్రెస్ వేసి.

సౌందర్య కూడా ఇంకో ఏడాదికో, రెండేళ్లకో రెక్కలు కట్టుకొని అమెరికా వెళ్లాలన్న తాపత్రయంలో ఉంది. అందుచేత అమెరికా నుంచి వచ్చిన మేనత్త కూతురు రుతికతో అన్నీ చర్చిస్తోంది.

పన్నెండు గంటలకు కొరియర్‌లో పార్సెల్ వచ్చింది. అందులో ఒక చిన్న నెక్లెస్ పంపించాడు ఒక నగల షాపు యజమాని కొడుకు. ఒక వాలెంటేన్స్ డే గ్రీటింగ్ కార్డు మీద సందేశమూ పంపాడు.

“ప్రేమ లేని నాడు విల్లాకు వల్లకాడుకీ తేడా ఏముంది?

ప్రేమ లేని నాడు మనకూ ఎముకల గూడుకూ తేడా ఏముంది?”

సౌందర్య ఆ సందేశం పంపిన వాడికి ఫోన్ చేసి ‘ఐ లవ్ యు డియర్’ అని చెప్పింది. ‘మా బామ్మ హాస్పటల్‌లో అంపశయ్య మీద పడుకొని, నా చెయ్యి వదలటం లేదు. ఫైనల్ డిపార్చర్‌కి ప్రిపేర్ అవుతోంది’ అంటూ ఆ నగల షాపువాడిని చిచ్చుకొట్టింది.

ఇంకో గంట తరువాత ఇంకో కొరియర్ పార్సెల్ వచ్చింది. హృదయాకారపు కేక్‌తో. గ్రీటింగ్ కార్డు మీద ఆ ప్రియుడు తన సందేశాన్ని పంపాడు.

“ఈ భూనభోంతరాలల్లోని

దేవదానవ మానవ యక్ష కిన్నెరుల్లో

ఎవరు చెప్పు

నిండు జాబిల్లిలాగా, నీలాగా, నిర్మలంగా

నవ్వగలిగిన వాళ్లు?

ఎవరు చెప్పు

పగలే, నీలాగా, కలహంసలాగా

కలల అంచున నడిచి వచ్చేవాళ్లు?

ఎవరు చెప్పు

నీలాగా లలిత లలిత భావ

సుమసౌరభాలను మోసుకొచ్చే వాళ్లు ”

సౌందర్య అతనికీ ఫోన్ చేసి పావుగంట మాట్లాడి, మాయ పుచ్చి, చిచ్చుకొట్టి, పెట్టేసింది.

ఇంకో గంటకు ఇంకో గ్రీటింగ్ కార్డు వచ్చింది, ప్రేమ గీతంతో

“యెనక జల్మంలోన యెవరమె నంటి,

సిగ్గొచ్చి నవ్వింది సిలకనా యెంకి

ముందు మనకే జల్మముందో లెనంటి

తెల్లబోయింది పిల్ల నా యెంకి

ఎన్నాళ్లు మనకోలె ఈ సుకములంటి

కంట నీరెట్టింది జంట నా యెంకి.”

సౌందర్య అతనినీ చిచ్చుకొట్దింది.

“ఏంటీ, ఈ పిచ్చి?” అని అడిగింది రుతిక.

“ఏం చెయ్యను చెప్పు. ఇందులో నా ప్రయేయం చాలా తక్కువ. నా అందమే నాకు శాపం అవుతోంది. వీళ్లల్లో నిజమైన ఫ్రెండ్ ఎవడూ లేడు. పిల్లవాడికి ఆటవస్తువు కావాలి. ఎదిగిన పిల్లవాడికి ఆడుకోవటానికో అందమైన ఆడపిల్ల కావాలి. ఒకడికి తెలియకుండా మరొకడు వెంట పడుతుంటాడు. ఎవడి తోనైనా కాఫీ తాగుతూనో, సినిమాకెళ్తూనో, ఇంకోడి కంట పడ్డాననుకో వాడు పగతో రగిలిపోతాడు. కత్తితో పొడుస్తాడో తెలియదు. మొహాన యాసిడ్ పోస్తాడో తెలియదు. అందుచేత అందరితో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే, అల్లంత దూరంలో ఉంచుతున్నాను…” అన్నది సౌందర్య.

“ప్రేమ, ద్వేషం ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలవంటివి. ఇది వరకటి వాళ్లు వేరు. వీలు పడనప్పుడు, తప్పుకునేవాళ్లు. ఇప్పుడంత సంస్కారం లేదు. వికృత మనస్తత్వం పెరిగిపోతోంది…” అన్నది రుతిక.

“ఇంకో ఏడాది ఈ నాటకం సాగితే, నేను స్టేట్స్ వెళ్లి పోతాను. అవుటాప్ సైట్ కాగానే అవుటాఫ్ మైండ్ అయిపోతానూ” అన్నది సౌందర్య.

“నిజానికి ఈ ప్రేమే ప్రపంచాన్ని సజావుగా పరిభ్రమింపచేస్తోంది. ప్రేమే ప్రపంచాన్ని పాలిస్తోంది. లోకానికి అదే శ్వాస. అదే ధ్యాస. నిజానికి ప్రేమించటానికి సవాలక్ష అడ్డంకులున్నాయి. దేశం, మతం, రాష్ట్రం, భాష, నలుపూ, తెలుపూ, పోట్టీ పోడుగూ – ఎన్నో అడ్డంకులు, ఆనకట్టలు, అడ్డుగోడలు, మట్టీమసానం – ఎన్నో ఉన్నా, వానొచ్చీ, వరదొచ్చీ, ఉప్పెనలా ముంచెత్తినప్పుడు మాత్రం, ఈ మిట్టపల్లాలన్నీ మునిగిపోతయి…” అన్నది రుతిక.

ఇంతలో మాణిక్యమ్మ, సౌందర్య తల్లీ వచ్చి అక్కడ కూర్చోవటంతో సంభాషణ మారిపోయింది.

సౌందర్య టీ.వీ ఆన్ చేసింది. పార్క్‌ల్లోనూ, పబ్లిక్ స్థలాల్లోనూ చేరిన అమ్మాయిలు, అబ్బాయిలను ఎవరెవరో వచ్చి పట్టుకుంటున్నారు. వాళ్లు పారిపోతున్నారు.

“ఎవరే వాళ్లంతా?” అని అడిగింది మాణిక్యమ్మ.

“ఎవరికో కాబోయే కోడళ్లూ, అల్లుళ్ళూ…” అన్నది రుతిక.

“అమ్మా, నీ కొడుకూ, కోడలితో కాసేపట్లో రావచ్చు… హారతి పళ్లెంతో సిద్ధంగా ఉండు” అన్నది సౌందర్య తల్లితో.

“వాళ్ల పెద్దవాళ్ల అదుపూ, ఆజ్ఞా ఉండదా?” అని అమాయకంగా అడిగింది సౌందర్య తల్లి.

“సర్లే… పెద్దవాళ్లు అదుపులో ఉన్నప్పుడు గదా… వాళ్లూ ఎక్కడెక్కడో వెలుగు నీడల తోటలో, సుఖదుఃఖాల వేటలో బిజీగా ఉంటారు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా ఏమిటి?” అన్నది సౌందర్య.
“ఎవరి గోల వాళ్లదే. ఎవరి లోకం వాళ్లదే. రాధ కృష్ణుడ్ని ప్రేమిస్తే, హిడింబి భీముడ్ని ప్రేమించింది. ఆ టైం వస్తే, అదో మైకం, తనువంత వింత గిలిగింత…” అన్నది సౌందర్య.

“మా కాలంలో మేమూ ఏడిశాం గానీ, మరీ ఇంత బాహాటంగానా?” అన్నది మాణిక్యమ్మ.

“తప్పు అని తెలియదా?” అని అడిగింది సౌందర్య తల్లి.

“ఎందుకు తెలియదు? తెల్సు… కానీ నలుగురు నడిచే బాట అదే అయినప్పుడు, తప్పు కూడా ఒప్పే అవుతుంది. ప్రియుని పొగడ్తలు వింటున్నప్పుడు ప్రియురాలి మనసు, వెన్నెల రాత్రుల్లో పొంగిపోయే సముద్రంలా మారిపోతుంది…” అన్నది రుతిక.

“కళ్ల ముందు కాలం ఎంతగా మారిపోయింది?” అన్నది సౌందర్య తల్లి.

“ఎప్పుడో, ఎక్కడో ఒకడి మనసులో వచ్చే ఒక ఆలోచన ప్రపంచం మీద ఎంత ప్రగాఢమైన ప్రభావం చూపిస్తుందోనన్న దానికి ఇదే నిదర్శనం.”

“పూర్వం క్లాడియస్ అనే రాజుకి యుద్ధకాంక్ష అమితంగా ఉండేది. పొరుగుదేశాలపై దండెత్తటం కోసం యువకులందరూ సైన్యంలో చేరాలని ఆజ్ఞపించాడు. యువతీ యువకులెవరూ ప్రేమించుకోరాదనీ, పెళ్లిళ్లూ చేసుకోరాదనీ శాసించాడు. కానీ వాలెంటేన్ అనే మత ప్రబోధకుడు దీనిని వ్యతిరేకించాడు. ప్రజలలో ప్రేమాభిమానాలు పెంచాలి గానీ, ద్వేషం, పగ, ఘర్షణ పెంచి పోషించరాదని అభిప్రాయ పడ్డాడు. యువతీ యువకుల మధ్య ప్రేమను ప్రోత్సహించి, వాళ్లకు రహస్యంగా వివాహాలు జరిపించాడు. రాజు ఆయనకు మరణ శిక్ష విధించాడు. ఫిబ్రవరి పద్దానుగో తేదీన ఆయన్ను ఉరితీశారు. ప్రేమించటం మానవనైజం అన్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటేన్ జ్ఞాపకార్థం, ఆ తేదీని ప్రేమికుల దినోత్సవంగా కొన్ని చోట్ల జరుపుకుంటున్నారు. ఇదీ కథ. కానీ మన దేశంలో ఎప్పుడూ అలాంటి నిషేధమూ లేదు. దానికి వ్యతిరేకంగా ప్రచారమూ లేదు. కానీ గ్లోబల్ విలేజ్ అయిన కారణంగా, ఈ సంస్కృతి ఒక దేశం నుంచీ మరో దేశానికి వ్యాపిస్తోంది…” అన్నది రుతిక.

“బాగానే ఉంది” అని నిట్టూర్చింది.

రాత్రి ఎనిమిది గంటలకు వెన్నెల కొంప చేరింది.

“ఏవే ఒంటరిగానే వచ్చావు? ఇంకా అల్లుడ్ని వెంట బెట్టుకొని వస్తావేమోనని ఎదురు చూస్తున్నాం….” అన్నది సౌందర్య.
“నా పక్కన నిలబడే దమ్ము ఎవడికుందే?” అని నవ్వింది వెన్నెల.

“నువ్వే వెళ్లి వాళ్ల పక్కన నిలబడుతున్నావు గదా…”

“తెల్లారి లేస్తే వంద మంది పక్కన నిలబడతాం… అయితే ఏంటి?” అని అడిగింది వెన్నెల.

“అందమునకు, ఆనంద నిష్యందనమునకు, సరసమునకూ విరిగిన విరసములకూ, అన్ని రసములకూ నీవంటి యువతయే ఆయువు పట్టు” అన్నది సౌందర్య.

“నీ కొడుకు ఎక్కడే? ఇంకా ఇల్లు పావనం చెయ్యలేదు?” అన్నది మాణిక్యమ్మ కోడలితో.

“ఇంకా జనాన్ని ఉద్ధరించటం పూర్తి కానిదే… ఈ జగత్తు యావత్తు నిద్రాముద్రితమైన తరువాతగానీ, వాడికి ఇల్లు గుర్తుకు రాదు…” అన్నది సౌందర్య.

“అవునూ, మీ నాన్న కూడా ఇంకా రాలేదేం?” అన్నది మాణిక్యమ్మ.

“ఆయన ఎక్కడ ఎవరి గాఢ పరిష్వంగంలోనో మునిగి తేలుతుంటాడు” అన్నది సౌందర్య.

“పరిష్వంగం అంటే ఏమిటే?” అని అడిగింది సౌందర్య తల్లి.

“అది ఈ జన్మకు నీకు అర్థం కాదమ్మా…” అన్నది సౌందర్య.

నిజానికి ఫణిభూషణరావు మనసు ఆ సమయంలో ఇంద్రధనస్సులోని రంగుల కన్నా ఎక్కువ రంగులు పులుముకుంది… ఆయన అప్పుడు ఉరవడి వచ్చిన వాగులా ఉన్నాడు.

“నీవు నా సరసన చేరితే చాలు, శృంగార రససామ్రాజ్యానికి నేను చక్రవర్తినే అవుతాను…” అన్నాడు ఫణిభూషణరావు.

“చాల్లెండి, సంబడం, పొగడ్తలు మాత్రం అగడ్తలు దాటుతయి…”

“ఏం కావాలో కోరుకో భామినీ…”

“ఇప్పుడు నేను చెప్పింది అదే… వానే నిలువనప్పుడు, వానతో వచ్చే వడగళ్లు నిలుస్తాయా అని… తిన్నగా లేచి నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు, చెప్పే మాటలకు విలువ కూడానా?” అన్నదామె చిరునవ్వుతో. ఆ చిరునవ్వు అతని మొహం మీద తళుక్కున మెరిసిన మెరుపు అయింది.

“ఈ ప్రపంచంలో ప్రేమ ఎరుగని హృదయం ఎక్కడుంటుందో, దాని కన్నా, నిర్జనమైన, నిరర్ధకమైన, నిస్సారమైన ప్రదేశం మరొకటి ఉండదు. జీవితంలో కొంచెమైనా, అందమైన, ఆకర్షణీయమైన మార్పు లేకపోతే, ఈ బ్రతుకు గానుగెద్దులాగా మారిపోదా?” అన్నాడు ఆమెను అక్కున చేర్చుకొని.

ఎవరి జీవితంలోనూ ఈ ప్రేమ అనేది స్థిరంగా ఉండదు. చంద్రుడిలాగ పెరుగుతూనో, తరుగుతూనో ఉంటుంది.

గాలిలాగా, ధూళిలాగా అది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది.

“అసలు ఏమిటి ఈ ప్రేమ అంటే?” అని అడిగింది సౌందర్య.

“మండిపోయే ఎండతో రోజంతా అల్లాడిపోయినప్పుడు ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకుంటయి. వాటిని నువ్వు తాకలేవు. కానీ అవి కుంభవృష్టిని కురిపిస్తయి. పుడమి తల్లి పులకించిపోతుంది. వృక్షాలు పుష్పిస్తాయి. సుమనోహరంగా ఫలాలనూ అందిస్తుంది ఆ వర్షమే. ప్రేమ కూడా అంతే. దానిని నువ్వు తాకలేవు. అదే నిన్ను తన చేతులలోనికి తీసుకుంటుంది. మనసు చేత ఆనంద తాండవం చేయిస్తుంది. బ్రతుకు నిత్యనూతనంగా గోచరిస్తుంది. అదీ ప్రేమ ప్రభావం…” అన్నది రుతిక.

అందరూ ఆలోచిస్తున్నారు.

టి.వి.లో పాత సినిమా పాట వస్తోంది.

“వయసే, వయసును పలకరించినది…”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here