[box type=’note’ fontsize=’16’] 14 ఫిబ్రవరి ప్రేమికుల రోజు సందర్భంగా శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘మంచు పొద్దులలో మధుర జ్ఞాపకాలు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ఆ[/dropcap] రోజు…
నీ చిరునవ్వుల వెన్నలతో
నా హృదయం నిశీధిలో
ఆనందం వెలుగులు పరిచావు!
నీ కొంటె చూపుల మత్తులో
నా గుండె గల్లంతైన వేళ…
కస్తూరి పరిమళాల చందనంతో
నీ పాదాలను అభిషేకించాను!
నా కోసం…
నువ్వు అన్నీ వదులుకున్నావని
నీ కోసం…
నన్ను నేనే వదులుకున్నాను!
చలిపొద్దుల్లో…
కౌగిలి పద్దులు రాశావు!
నీ బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు
విరబూసిన వేళ…
నా ఎద కుంపటిలో సేదదీరి
వేడి సెగలు రగిలించావు!
నీ తనువులోని రస సౌందర్యం
వెన్నెల నిండిన సముద్రమై
నన్ను నీతో కలిపేసుకున్న
అమృత ఘడియల్లో…
విశ్వవిజెతలా పొంగిపోయాను!
నా జీవన ఆనంద నందనంలో
జ్ఞాపకాల మోడుల్ని మిగిల్చి
విషాదం లోయల్లోకి నెట్టేసి
సుదూర తీరాలకు వెళ్ళిపోయావు!
దశాబ్దాలు గడిచినా
నన్ను చేరుకుంటావనే ఆశ మాత్రం
ఆకాశంలా పెరిగిపోయింది!
ప్రేయసీ…!
ఈ చలి పొద్దులలో
మంచుతో బాటు
మధుర జ్ఞాపకాలను
మదిలో నింపుకొని
వెచ్చటి ఊహల శిబిరంలో
నీ కోసం…
కోటి జతల కన్నులతో ఎదురుచూస్తూ…!