[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]“ఇం[/dropcap]టికి పోతూనే బయట లోపల పేడతో అలికించి, ఎండలో ఆరబెట్టండి. రేపటికి పురుగులు చేతికి దొరుకుతాయి. ఎల్లుండి పురుగులన్నింటినీ తీసి, ఈ రెండు తట్టల్లో, పేపరుమీద దూరదూరంగా వెయ్యండి. ఆకును మరీ తరమక్కరలేదు. కొసనుండి 4, 5 ఆకుల వరకు కోసి, మనం పప్పులో వేసుకోడానికి తరుక్కుంటామే అట్లా తరిగి వెయ్యండి. తట్ట అంచుల వరకు ఆకు రావాలి. పురుగుల మీద కనీసం అంగుళంన్నర ఎత్తు ఆకు ఉండాలి” అని వివరించాడు అసిస్టెంటు.
జాగ్రత్తగా విన్నాడు పతంజలి. “ఎల్లుండి ఈ తట్టల్లోకి మార్చిన తర్వాత పగలు మూడుసార్లు రాత్రి రెండుసార్లు మేత పడాల” అని చెప్పాడా అసిస్టెంటు తట్టలు చెరొకటి పట్టుకుని బస్సెక్కారు. బస్సులో చెప్పాడు.
“మొత్తం 28 రోజులు మేస్తాయి. వారానికొకసారి జ్వరం వస్తుంది వాటికి. మొత్తం నాలుగు జ్వరాలు. 24 గంటల పాటు నిశ్చలంగా ఉండిపోతాయి. అప్పుడు మేత తినవు. వెయ్యకూడదు. మీకు అలవాటయ్యేంతవరకు నేను వారానికి రెండుసార్లు వచ్చి పోతూంటాలే. రోజూ ఒకసారి పురుగులను పక్కనపెట్టి లిట్టర్ (చెత్త) అంతా శుభ్రం చెయ్యాల. ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఒక ద్రావకం మన ఆఫీసులో ఇస్తారు ఫ్రీగా దాన్ని శుభ్రమయిన పాత గుడ్డలో తడిపి, క్లీన్ చేసిన తట్టలను తుడవాలి. మొదట జ్వరం నుండి లేచేసరికి ఏడెనిమిది తట్టలవుతాయి. మూడో జ్వరానికి ముఫ్పై తట్టలు సరిపోతాయి. రెండో జ్వరం వరకు ఆకు దూసి పోస్తాము. తర్వాత పెద్ద కత్తిపీటలు రెండు మూడు చేయించుకోవాల. మాడల్ ఆఫీసులో చూపిస్తా. రెండో జ్వరం నుండి తీస్తూనే మల్బరీ మొక్కలు కొడవల్లతో అడుక్కు కోసుకొని వచ్చి, కత్తిపీటలతో అర్ధడుగు ముక్కలు కోసి, కొమ్మలతోపాటు తట్టల్లో పరచడమే. చివరి వారంలో రెండెకరాల పంట తినేస్తాయి. ‘లిట్టర్’ శుభ్రం చేయడం సులభం. ఎందుకంటే ఆకును. తిని పురుగులన్నీ పైకి వచ్చేస్తాయి. చివరి దశలో మూడంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. అవి ఆకు తినే తోజు (వేగం) చూస్తే మతిపోతాది. తినడానికే ఏమన్న పుట్నాయా ఇవి అనిపిస్తాది”
“ఈ విషయాలన్నీ మీరెలా తెలుసుకున్నారు?”
“చిక్క బళ్లాపురంలో వారంరోజులు ట్రెయినింగుకు పంపినారులే మమ్మల్ని”
అసిస్టెంటు డోన్‌లో దిగిపోయాడు. పతంజలి తట్టలతో వెల్దుర్తిలో దిగి నడుస్తూంటే, బస్టాండులో అరటిపండ్లమ్మే ఆమె చూసి, “సామితోన బో, ఆ తట్టలు మోసుకోని” అని పది పన్నెండేళ్ల కూతుర్ని పంపింది. “ఎందుకమ్మా పెద్ద బరువు లేవులే” అన్నా వినలేదు.
వెల్దుర్తి చుట్టు పక్కల అరటితోటలు ఎక్కువ. ఆకుపచ్చ అరటిపండ్లు పెద్ద సైజులో ఉండేవి. గెలలు మగ్గించి, పనలు కోసి, గంపల్లో పెట్టుకొని ఆడవాళ్లు కూర్చొని ఉంటారు. బస్టాండులో బస్సు వచ్చి ఆగిన వెంటనే బస్సు చుట్టూ తిరుగుతూ.
“అరటిపండ్లేవ్. పచ్చరటిపండ్లేవ్. పావలాకు మూడు. రూపాయకు డజను” అని అరుస్తూంటారు. ప్రయాణీకులు కూడ వెల్దుర్తిలో అరటిపండ్లు బాగుంటాయి. కొనుక్కోవాలని మానసికంగా సిద్ధపడి ఉంటారు. బస్సు ఐదు నిముషాలు ఆపడానికి ఎవరో ఒకరు డ్రైవరుకు, కండక్టరుకు ఫ్రీగా రెండరటిపళ్లిస్తారు. అరటిపళ్లుకాక వెల్దుర్తి బస్టాండు మరోదానికి కూడ ఫేమస్. మసాలా వడలకు. అలసందలతో (బొబ్బర్లు) వడలు చేసుకొని, గంపల్లో పెట్టుకుంటారు. అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి ఉంటారు. చాలా రుచిగా ఉంటాయి. ప్రయాణీకులు వెల్దుర్తిలో బస్సాగగానే వాటిని కొనుక్కుంటారు. పొట్లం కట్టించుకొని తీసుకొని వెళతారు. అక్కడే తింటారు కొందరు. ఒక్కో వడ పది పైసలు. వడల గంపలవాళ్లు ఒక పదిమంది దాకా వుంటారు. బస్సు సిబ్బందికి వడలు కూడ ఫ్రీ.
రెండు తట్టలూ షెడ్‌లో పెట్టి. కాళ్లు చేతులు కడుక్కొని ప్లేటులోని పురుగులను చూశాడు. మేత తిని పైకి వచ్చి ఉన్నాయి. పగులుతూనే నలుపురంగులో ఉన్నవి. తెలుపు రంగులోకి మారాయి ఇప్పుడు.
తండ్రితో అన్ని విషయాలు చర్చించాడు పతంజలి. అంతా విని, “ఇదొక కొత్త అనుభవం నాయనా మనకు! జాగ్రత్తగా చెయ్యి ప్రాణమున్న జీవులతో పని” అన్నాడాయన.
మరుసటి దినం పురుగులన్నీ జాగ్రత్తగా తీసి ఒక స్టీలు బేసిన్‌లో వేశారు. ‘లిట్టర్’ పారబోసి, రాత్రే పేడతో అలికి ఆరబెట్టిన ఒక తట్టలో పేపరు పరచి, పురుగులను తట్టంతా పరచుకొనేలా వేశాడు. మేత టయం అయిందేమో తలలెత్తి చూస్తున్నాయి. అసిస్టెంటు చెప్పినట్లు ఆకును తరిగి, తట్టనిండా, పురుగులమీద వేశాడు. గబగబ తినడం ప్రారంభించాయి.
మరో రెండు రోజులు గడిచాయి. ఇంకో తట్ట పెంచారు మూడో రోజు మేత వేస్తూండగా, ఒక మనిషి వచ్చి, పతంజలిగారి యిల్లు ఇదేనా అని అడిగాడు. పతంజలి బయటకు రాగానే,
“సామీ, ప్యాపిలి నుండి తట్టలు, స్టాండు బొంగులు అన్నీ లారీ మీద ఏసుకొచ్చి బైపాసులో దింపినాం. లారీవాడు ఊర్లోకి రాక పాయ మన బండి పంపిస్తే తీసుకొస్తాం మళ్ల” అన్నాడు వచ్చినవాడు.
వెంటనే ఎద్దులబండి కట్టుకొని పొమ్మన్నాడు తోకోడిని. ఒక అరగంటలో అన్నీ తెచ్చి షెడ్‌లో ఒక మూలన పెట్టారు. “ఉరుకుందప్ప రేపొచ్చాడంట” అని చెప్పాడామనిషి.
అనుకున్నట్లుగానే ఉరుకుందప్ప ఉదయాన్నే దిగాడు ప్యాపిలినుంచి, వస్తూనే ‘షెడ్’ను పరిశీలించి బాగుందన్నాడు. వీధివైపు ఉన్న పెద్ద కిటికీని చూసి, “దానికి ‘జాలీ’ (మెష్) ఒకటి కట్టించండి సామి. పిల్లులు వచ్చి పురుగుల్ని దింటాయి లేకపోతే, ఎండపొద్దున వేడి తగలకుండా ఉల్లిపాయల కాలీ బస్తాను ఏకాండంగా చించి, తడిపి, పరదామాదిరి ఏస్తే సల్లగుంటాది. కిటికీ మాత్తరం ఎప్పుడూ ముయ్యగాకండి. గాలి వెల్తురు ముక్యం” అన్నాడు.
ఇంట్లోకి వెళ్లి కంచు గ్లాసుతో కాఫీ తెచ్చిచ్చాడతనికి పతంజలి. గ్లాసును పై గుడ్డ మీద చేతిలో పెట్టుకుని కాఫీ తాగాడు. వెంటనే పనిలోకి దిగాడు. టెంకాయ తాళ్ల చుట్టలు విడదీసి రెండడుగల పొడవున కట్ చేయమన్నాడు తోకోన్ని. వెదురు బొంగులు కట్ట నుండి విడదీసి పెట్టుకున్నాడు. ఒక్కో బొంగును నిలబెట్టి పట్టుకోమని అడ్డ బొంగులను నిలువు బొంగుకు రెండడుగుల ఎడంతో తాళ్లతో బిగించాడు. ముందు వరుసలో ఆరు, వెనుక వరుసలో ఆరు నిలువుగా, అడ్డంగా ఒక్కో వరుసలో ఆరు అరలు వచ్చేలా పకడ్బందీగా తాళ్లతో బిగించాడు. నిలువు బొంగులన్నింటి క్రిందా నీళ్లు పోసి పెట్టడానికి గుంత గిన్నెలు సత్తువి తెచ్చాడు. అవి కూడ పెట్టి, రోజు మార్చి రోజు నీళ్లు మార్చాలని చెప్పాడు. పన్నెండు కల్లా స్టాండు కట్టడం పూర్తయింది. ఆరువరుసల్లో వరుసకు ఐదు చొప్పున ముప్ఫై తట్టలు ఫ్రీగా పడతాయి. తట్టలను పేడతో అలికించమన్నాడు ఉరుకుందప్ప.
“కత్తిపీటలు కూడ తానే సప్లయి చేస్తానని ఒక్కోటి యాభై రూపాయలవుతుందని” చెప్పాడు. వాటికి కూడ కలిపి మొత్తం డబ్బు యిచ్చేశాడు పతంజలి. తనతో తెచ్చిన బిల్లు బుక్కు నుండి మూడు ఖాళీ బిల్లులు చింపి యిచ్చాడు పతంజలికి. వాటిమీద గురుదత్తా బ్యాంబూ వర్క్స్, ప్యాపిలి, డోన్ తాలూక, కర్నూలు జిల్లా అని ఉంది. పైన ఆధరైజ్డ్ బై డిపార్టుమెంట్ ఆఫ్ సెరికల్చర్. గవర్నమెంట్ ఆఫ్ ఎ.పి వైడ్ జీవో నం…” అని ముద్రించి వుంది. క్రింద “రీసీవ్‌డ్ విత్ థ్యాంక్స్ ఫ్రం…. టు వార్ట్స్ ది సప్లై ఆఫ్… అని వివరంగా ఉంది. కుడివైపు మూలన ఉరుకుందప్ప వేలిముద్ర కూడ.
“బ్యాంకోలకిచ్చేటప్పుడు ఎట్టగావాలంటే అట్ట రాసుకోండిసామి” అన్నాడు.
“ఇంగబోదునామళ్ల” అన్నాడు.
“ఉండు మధ్యాహ్నమయింది కదా! భోజనం చేసి వెళుదువుగాని” అన్నాడు పతంజలి.
“అంత బాగ్గెమాసామి!” అంటూ క్రింద కూర్చున్నాడు ఉరుకుంద.
ఇంట్లోకి వెళ్లి, అమ్మకు చెప్పాడు పతంజలి. వర్ధనమ్మ ఒక విస్తరాకు తెచ్చివేసింది. పప్పు, కూర, పచ్చడివేసి, అన్నం వడ్డించింది ఆకులో. నెయ్యివేసింది.
“నిదానంగా కూచోనాయనా! పొద్దుననగా ఏం తిన్నావో” అన్నది.
రెండు చేతులెత్తి ఆమెకు నమస్కారం పెట్టాడు. తర్వాత అన్నానికి మొక్కి తినడం ప్రారంభించాడు. రుచిని ఆస్వాదిస్తూ, ప్రశంసగా తల ఊపుతూ, ఒక్క మెతుకు వేస్టు చేయకుండా తిన్నాడు ఉరుకుందప్ప. ఆకు మడిచి, తీసుకొని, బైట ఎరువు దిబ్బ వద్ద పారవేసి వచ్చాడు. తిన్నచోట నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచాడు.
వర్ధనమ్మతో అన్నాడు, “అమ్మయ్యా, ఇట్టాంటి చారు నా జన్మలో తినలేదమ్మా! జిమ్మ లేసొచ్చి నాది” అన్నాడు. పతంజలిని చూపిస్తూ, “ఈసామి ఉండాడే సానా పనోడమ్మా ఎంత శాంతం! ఇంత చిన్న వగిసులో దేనికీ తొక్కులాడడే మానిక్కెం పుట్టిందమ్మా నీ కడుపున” అన్నాడు.
వర్ధనమ్మ మోము ప్రఫుల్లమయింది. సెలవు తీసుకొని వెళ్లిపోయాడా కష్టజీవి.
***
మధ్యాహ్నం బ్యాంకుకు వెళ్లి, ఫీల్డాఫీసరు గారి వద్ద లోన్ అప్లికేషను ఫారం, అకౌంటు ఓపన్ చేసే ఫారం తీసుకున్నాడు. ఒకసారి మేనేజరు గారిని కలిసి, పెంపకం ప్రారంభించామనీ, రేపు కాగితాలన్నీ సబ్మిట్ చేస్తాననీ చెప్పాడు. ఇంటికెళ్లి, ఫారాల్లో వివరాలన్నీ నింపి, తండ్రితో సంతకాలు చేయించుకున్నాడు. తాము మల్బరీ తోట పెంచుతున్నట్లుగా డిమాన్‌స్ట్రేటరు గారి దగ్గర ఒక సర్టిఫికెట్, సెరికల్చర్ డిపార్టుమెంటు వారి నుండి మరో సర్టిఫికెట్ సిద్ధంగా ఉన్నాయి. ఉరుకుందప్ప ఇచ్చిన బిల్లులపై తేదీలు, మొత్తాలు వేశాడు. మొత్తం ఎంతమంది కూలీలు అవసరం, చంద్రవంకలతో సహా సామగ్రి, షెడ్ నిర్మాణం అన్నీ ఎంతవుతాయో ఎస్టిమేట్ తయారు చేశాడు. పదమూడు వేల చిల్లర అయ్యింది.
అన్నీ తీసుకుని ఉదయం 11 గంటలకల్లా బ్యాంకుకు వెళ్లి అన్నీ సబ్మిట్ చేశాడు పతంజలి అన్నీ పరిశీలించి చూశాడు మేనేజరు.
“బాగుంది. ఎస్టిమేట్ సెరికల్చర్ వాళ్లు వేసిచ్చారా?” అనడిగాడు.
“లేదుసార్! నేనే తయారు చేశాను” అన్నాడు పతంజలి.
“గుడ్‌జాబ్! టేబులర్ ఫాంలో చక్కగా అన్ని వివరాలు వచ్చాయి. రూలు ప్రకారం మీకు రెండెకరాలకు పదివేల కంటే ఎక్కువ లోన్ రాదు. కాని నా డిస్‌క్రెషన్‌తో ఎస్టిమేట్ అప్రూవ్ చేసి మీరు కోట్ చేసిన అమౌంట్ శాంక్షన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. లోన్ అమౌంట్ నాన్నగారి అకౌంటులో క్రెడిట్ చేస్తాము. మూడు రోజుల తర్వాత కలవండి” అన్నాడాయన.
“లోన్ తీర్చడానికి ఎంత సమయమిస్తారుసార్!” అని అడిగాడు పతంజలి.
“ఒక సంవత్సరం మీరు పంట వచ్చినపుడల్లా కట్టుకోవచ్చు. ఈలోన్ తీరిస్తే తప్ప నెక్స్ట్ లోన్ ఇవ్వరు.”
“థ్యాంక్స్ సార్!” అని చెప్పి వచ్చేశాడు.
తట్టలన్నీ పేడతో అలికి ఆరబెట్టడానికి తోకోని భార్య వచ్చింది. ఆమె పేరు ‘బుడ్డక్క’. వాళ్లకింకా పిల్లలు లేరు. వస్తూనే,
“తట్టలు అలకనీకె వచ్చినా యాడుండాయి సామీ!” అనడిగింది.
తట్టలన్నీ మిద్దెమీదకు మోసుకుపోయింది. దిబ్బ దగ్గరకు పోయి గంపలతో పేడ తెచ్చుకుంది. మధ్యాహ్ననికల్లా తట్టలు అలకడం పూర్తి చేసింది. ఆరబెట్టి, పతంజలి దగ్గరికి వచ్చి, “ఐపాయె. సూడుపో” అన్నది. పతంజలి పైకి వెళ్లి చూసి వచ్చాడు. “బాగా అలికినావమ్మా, బుడ్డక్క!” అన్నాడు “సరే నే పోతాండా” అన్నదామె.
“తోటకు బోమ్మా. ఆకు దూసుకొనిరా, శానా ఆకుగావాల. రెండు గోనె సంచుల ఆకు దీస్కరాపో. రోజుకూలీ గిట్టుబాటవుతాదిగద!” అన్నాడు పతంజలి. కృతజ్ఞతగా చూసింది బుడ్డక్క. “సరే సామీ. సద్ది తోకోనికొక్కనికే కట్టిచ్చినా గబుక్కున యింటికిపోయి రెండు ముద్దలు దిని పోదునా?” అని అడిగింది. “ఇప్పుడు మాదిగ గేరికి బోయి, అన్నంతిని పోవాలంటే శానా టైము బడుతుండ్లా అమ్మయ్యనడిగి అన్నం పెట్టించుకొని తినుపో” అన్నాడు.
“మావోడు నిచ్చం నీ ద్యాసే మా పతంజలి సామి… అంటూ తలుస్తూనే ఉంటాడు నిన్ను. నీవు పాటలు పాడితే సుంకన్న మామ కుండ మీద దరువేచ్చాడంటకదా!” అనడిగిందామె.
పతంజలి అవునన్నట్లు నవ్వి, ఇంట్లోకి పోయి వర్ధనమ్మకు చెప్పాడు. ఒక విస్తరాకులో ఒక మనిషికి సరిపడ అన్నం, పప్పు, చింతకాయ తొక్కు వేసుకొని వచ్చిందామె.
“ఇది తోకోని పెండ్లాం కదూ! ఏమే! యిక్కడే తింటావా?” అనడిగింది.
“లేదులే! అమ్మయ్యా! తోట కాడికిబోయి ఇద్దరం తింటాం. చింతకాయ తొక్కంటే మావోడికిట్టం!” అన్నదామె. భోజనం కొంగులో కట్టుకొని వెళ్లిపోయింది.
సాయంత్రం ఆకు తెచ్చారు. సుంకన్న భార్యను కూడ రేపటినుండే పనిలోకి రమ్మన్నారు. ఆమె మూడునెలల బాలింత. పురుగులు ఒక అంగుళానికి పైగా పెరిగినాయి. లిట్టర్ శుభ్రం చేశాడు సుంకన్న. పురుగులను నాలుగు తట్టల్లోకి సర్దాడు. సగం గోనెసంచి ఆకు పెద్ద ముక్కలుగా తరిగి తట్టలమీద పరిచారు.
పట్టుపురుగు మల్బరీ ఆకును చాలా పద్ధతి ప్రకారం తింటుంది. ఒక ఆకును అంచు వెంబడి తింటూ ఆకు చివరి వరకు వెళ్లి మళ్లీ అక్కడి నుండి ప్రారంభించి యిటువైపు వస్తుంది. ఎక్కడా ఏ పురుగూ ఇంకో దానితో ‘క్లాష్’ అవ్వదు. అవి ఆకు తినేటప్పుడు ఒక విధమయిన కరకర శబ్దం వస్తుంది. వీళ్లు ఆకు దూయడం, తేవడం, తరగడం, తట్టలమీద పరవడమే ఆలస్యంగాని, ఆవి వేసిన ఆకును పది నిమిషాల్లో తినేసి పైకి వచ్చేస్తాయి.
జీతగాళ్లకు కూడ ఈ కొత్త పని ఆసక్తికరంగా ఉంది. “రేపటికి గుడ్లు పగిలి వారం” అన్నాడు సుంకన్న.
“బహుశా రేపు మొదటి జ్వరంలోకి వెళతాయి” అన్నాడు పతంజలి. జ్వరాల గురించి తాను విన్నదంతా వారికి చెప్పాడు.
రాత్రి పదిగంటల మేత పతంజలే వేస్తాడు. తెల్లవారు ఝామున కూడ. మరుసటి రోజు ఉదయం అసిస్టెంట్ వచ్చాడు. కత్తిపీటలు తీసుకుని “ఉరుకుంద నిన్న సాయంత్రం ఇచ్చిపోయినాడు” అని చెప్పాడు.
ఒక మందపాటి పలకమీద కత్తి బిగించి ఉంది. చాలా పదునుగా, మెరుస్తూ ఉంది. “ఒక కాలితో పీటను నొక్కిపెట్టి కత్తికి, పీటకు మధ్య మల్బరీ కొమ్మలు పెట్టి కత్తి పిడి పట్టుకొని మన వైపుకు బలంగా నొక్కితే, మొక్కలు కట్ అవుతాయి. ఒక్కసారి పది పన్నెండు కొమ్మలు కట్ చేయవచ్చు. చివరి వారంలో మల్బరీ కొమ్మలు బళ్లతో తోలాల్సి ఉంటుంది. మూడు పీటలు నిర్విరామంగా పనిచేయాల్సి వస్తుంది. లిట్టర్ శుభ్రం చేయడానికి, ఎత్తి దిబ్బకు వేయడానికి, ఆకు తరగడానికి రోజూ పదిమంది దాకా కూలీలుగావాల. మూడో వారం నుండే ఐదారు మందుండాల” అని చెప్పారు అసిస్టెంట్.
“ఈరోజు జ్వరానికి రావాలమరి. నేను మధ్నాహ్నం వరకు ఉండి చూసిపోతా” అన్నాడు. మధ్యాహ్నం భోజనం అక్కడే ఏర్పాటు చేశాడు పతంజలి. మధ్యాహ్నం మూడు గంటలకు పురుగులన్నీ కదలిక లేకుండా అయిపోయాయి. కామ్‌గా పడుకున్నాయి. అన్నింటినీ చూసి తృప్తి చెందాడు అసిస్టెంటు.
“రేపు మధ్యాహ్నం ఇదే టైముకు లేస్తాయి. అంతవరకు మేత వేయకూడదు. మిగిలిపోయిన ఆకు వాడిపోకుండా గోనె సంచుల్లోనే ఓపన్‌గా ఉంచాలి. రేపటి వరకు మీకందరికి రెస్టు” అన్నాడు. అతను వెళ్లేటపుడు ఛార్జీలకు ఐదు రూపాయలిచ్చి పంపాడు పతంజలి.
మరుసటి రోజు మధ్యాహ్నం అన్నిటికీ ఒకసారి చలనం వచ్చింది. ఐదు నిమిషాల్లో తలలెత్తి చూడసాగాయి. వెంటనే ఆకు తరిగివేశారు. స్టాండ్లకింద గుంత ప్లేట్లలో నీళ్లు మార్చారు. మధ్యాహ్నం వేడి రాకుండా గోనె తెరలు తడిపి కడుతున్నారు.
నాలుగు రోజుల్లో లోన్ డబ్బు ఖాతాలో జమైంది. రెండో జ్వరం నుండి లేచేసరికి పది తట్టలయ్యాయి. పని పెరిగింది. వీళ్లుకాక మరొక ఇద్దర్ని పెట్టుకున్నారు. మూడో జ్వరం తర్వాత పురుగులు రెండంగుళాల వరకు పొడవు పెరిగాయి. ఎక్కడ ఆకూ చాలడం లేదు. అసలు హడావుడి నాలుగో జ్వరం తర్వాతే ఆ చివరి వారం దాదాపు పదిమంది పనిచేశారు. మధ్యలో చలపతిసారు కూడ వచ్చి వెళ్లాడు.
ఊర్లోవాళ్లు, “సామోల్లు పట్టుపురుగులు పెంచుతున్నారంట” అని చూడటానికి రాసాగారు. ప్రక్రియను అడిగి తెలుసుకుంటున్నారు. ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక విలేఖరి వచ్చి పురుగుల స్టాండ్‌ను తట్టలతో సహా ఫోటో తీసుకొని వెళ్లాడు. “వెల్దుర్తిలో పట్టు పురుగులు పెంపకం” అని వార్త మరుసటి రోజు పేపర్లో వచ్చింది. రైతు పేరు తండ్రిదే చెప్పాడు పతంజలి.
చివరి వారం రోజూ రెండుబళ్లు అంటే దాదాపు పది పదకొండు పెద్ద మోపులు మల్బరీ మొక్కలు కావలసి వచ్చింది. మూడు కత్తిపీటలకు విరామమే లేదు. లిట్టర్ క్లీన్ చేసేవారు. పురుగులను జాగ్రత్తగా తీసి బేసిన్‌లలో వేసేవారు. తట్టలను… ద్రావకంతో తడిపిన బట్టతో తుడిచేవారు, లిట్టర్ బయటికి మోసేవారు, తోటలు కొమ్మలు అడుగంటా కోసి మోపులు కట్టేవారు ఇలా పని విభజన చేసుకొని చకచకా చేస్తున్నారు. చివరి దశలో రాత్రి కూడ పనిచేశారు. 27వ రోజుకల్లా ఆకు అయిపోవచ్చింది. వెంటనే డోన్‌కు వెళ్లి చలపతి సారును కలిశాడు. “మీ వెల్దుర్తికి దగ్గరలోనే ‘రామళ్లకోట’లో పంట పెంచుతున్నారు. ఒక్కరోజుకు పదిహేను మోపులు బదులడిగి తెచ్చుకోండి. మీరు కోసిన మొదళ్లు మళ్లీ పదిహేను రోజుల్లోగా పెరుగుతాయి. వాళ్లకు ఇవ్వొచ్చు” అని చెప్పాడాయన.
తెల్లవారుజామునే సైకిలు అద్దెకు తీసుకొని రామళ్లకోటకు వెళ్లాడు పతంజలి. మార్కండేయశర్మగారి కొడుకని తెలియగానే కూర్చోబెట్టి మర్యాద చేశారు. ఆ రైతు పేరు రుక్మాంగద రెడ్డి. “మల్లా మీ బండెందుకులే సామీ. మేం ఈ రోజే వెల్దుర్తి నుండి “గ్రోమోర్ సంచులు ఏసుకొని రావాలనుకుంటుండాం. ఒక గంట ఉండండి మల్బరీ కొమ్మలు కోయించి, మోపులు కట్టిచ్చా” అని పతంజలితో చెప్పి, “నలుగురు పోయి కొయ్యిపాండి” అని జీతగానితో చెప్పాడు. వాళ్లకిది రెండో పంట అట. సీడ్ తెచ్చుకొని నాల్గురోజులయిందట. ఇంకో ఎకరా ఎగష్ట్ర నాటించుకుంటే మంచిదని చెప్పాడాయన.
బండిలో మల్బరీ మోపులు వేసుకొని సైకిలు మీద అనుసరిస్తూ ఇల్లు చేరేసరికి మధ్యాహ్నమయింది. సాయంత్రం ఉరుకుందప్ప ప్యాపిలి నుండి చంద్రవంకలు వేసుకొని వచ్చాడు. ఆ రోజు 25వ రోజు. 29వ రోజు ఉదయానికి మేత అయిపోయింది! సరిగ్గా సమయానికి అసిస్టెంటు దిగాడు డోన్ నుంచి పురుగులను గమనించాడు.
“సామీ! ఇక మేత అవసరం లేదు. పురుగులు నిగనిగ మెరుస్తున్నాయి చూడండి!” అని చూపించాడు. మరో గంటలో క్రమంగా లేత బంగారు రంగులోకి తిరుగుతాయి. ఈలోగా చంద్రవంకలను దుమ్ము లేకుండా పాతగుడ్డతో దులిపి, ద్రావకం కలిపిన బట్టతో తుడిచి షెడ్డులో పడసాలలో, స్థలం ఉన్నచోట గోడల కానించిపెట్టుకోవాల. టైంలేదు!” అని కంగారు పడసాగాడు అసిస్టెంట్.
చంద్రవంకలు చతురస్రాకారంలో ఉన్నాయి ఐదడుగుల ఎత్తు, నాలుగడుగుల వెడల్పు ఉన్నాయి. సన్నని వెదురు బద్దలతో ఒక చట్రం చేసి, దానికి వెదురు తడికె సన్నని ఇనుప తీగలతో చట్రానికి అనుకొనేలా కట్టారు. తడిక మీద వృత్తాలు వృత్తాలుగా పల్చని వెదురు బద్దలను అర అంగుళం వెడల్పున తడికకు అమర్చారు. బయటి వృత్తం వ్యాసం అన్నిటికంటే పెద్దది. లోపలికి వచ్చే కొద్దీ వృత్తాల వ్యాసం తగ్గుతూ వస్తూంది. వృత్తానికీ వృత్తానికీ మధ్య రెండంగుళాల దూరం ఉంది. మొత్తం చంద్రవంక రెండు లావు బొంగులమీద నిల్చి ఉంది అటూ ఇటూ.
“తొందరగా ఏమయినా తినిరాపోండి. ఈ రోజు సాయంత్రం వరకు ‘బిడువు’ (గ్యాప్) ఉండదు” అని చెప్పాడు అసిస్టెంటు. పతంజలి ఎందుకయినా మంచిదని అమ్మతో చెప్పి ఉగ్గాని చేయించి ఉన్నాడు. దాదాపు పదిహేనుమంది ఉన్నారు. అందరూ ‘ఉగ్గాని’ తిని నీళ్లు తాగి రడీగా ఉన్నారు.
“తట్టలు క్రింద దింపుకోండి. ఇద్దరిద్దరు మూడు తట్టల్లో ఏరాల పురుగులను” అని చెప్పాడు. అదే విధంగా అమర్చుకున్నారు. పది గంటలకల్లా ప్రతి తట్టలో అక్కడ కూడా పురుగులు లేత బంగారు రంగులోకి మారడం ప్రారంభించాయి.
“అదిగో! మొదలయింది!” అని అరిచాడు అసిస్టెంటు “ఇద్దరి దగ్గర బేసినో, ప్లేటో గిన్నెనో యాదో ఒకటి ఉండాల. రంగుమారిన పురుగులను తీసుకొని రండి” అంటూ కొన్ని తీసి చూపించాడు. రంగుమారినవి ఎందుకో విపరీతంగా అలజడి చేస్తున్నాయి. తీవ్రమయిన అస్థిమితం ప్రదర్శిస్తూ ఉన్నాయి.
రంగు మారిన పురుగులను చంద్రవంకల్లో ఎలా వేయాలో చూపించాడు అసిస్టెంటు. ప్రతి వృత్తంలో పురుగుకు పురుగుకు అంగుళం ఎడం ఉండే విధంగా పురుగును నెమ్మదిగా తడికె మీద ఉంచాలి. ఒక చంద్రవంక పూర్తిగా నిండిన తర్వాతనే రెండో చంద్రవంకను వాడాలి. ఒక్కో చంద్రవంకలో మూడు తట్టల పురుగులు పడతాయి. పన్నెండు చంద్రవంకలు తెచ్చాడు ఉరుకుందప్ప “బ్రమ్మాండంగా సరిపోతాయి” అన్నాడు.
పతంజలితో చెప్పాడు “సామీ, ఆ లేత బంగారులో పుగురు శరీరంలో ఉన్నదే పట్టు ద్రావణం. తడకమీద వేసిన మరుక్షణంమే పురుగు తన వెనుక వైపును బేస్ చేసుకొని, నోటి ద్వారా సన్నని వెంట్రుక పరిమాణంలో పట్టు దారాన్ని వదులుతూ తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. మొత్తం గూడు తయారవడానికి పదారు నుండి ఇరవై గంటలు తీసుకుంటుంది. గూడు తయారయ్యే కొద్ది లేత బంగారు రంగుమారి లేత పసుపు పచ్చని వర్ణానికి వస్తుంది” అని చెప్పాడు.
దాదాపు ఇరవై మంది నిర్విరామంగా పనిచేశారు. వేసినవి వేసినట్లుగా శ్రద్ధగా గూళ్లు అల్లుకోసాగాయి. మొదటి పొర పూర్తయ్యేంత వరకు లోపలి పురుకు కనబడిరది. తర్వాత గూడు దట్టంగా మారేసరికి పురుగు కనిపించలేదు.
పాణిని, మల్లినాధ, మహిత కూడ వచ్చి ఆసక్తిగా గమనించసాగారు. పాణినయితే తానూ పురుగులను చంద్రవంకల్లో వేస్తానని గొడవ. వాడితో, చెల్లెలితో కొన్ని వేయించాడు పతంజలి. మల్లినాధకు భయమట. వాడు వేయలేదు.
సాయంత్రం నాలుగు గంటలకు అన్ని చంద్రవంకలూ నిండిపోయాయి. రేపుపొద్దున్న మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు అసిస్టెంటు. వెళ్లేముందు “రేపు మధ్యాహ్నానికి గూళ్లు పూర్తవుతాయినీ, 72 గంటల్లో వాటి నుండి పట్టు దారం తీయకపోతే పురుగు సీతాకోక చిలుకగా మారి, గూడుకు రంద్రం చేసి బయటకు వెళ్లిపోతుందనీ చెప్పాడు. కాబట్టి గూళ్లు పూర్తయిన 36 గంటల్లో మార్కెట్‌కు తరలించాలని చెప్పాడు. రేపు సాయంత్రానికి ప్రయాణానికి సిద్ధంగా ఉండమనీ, ఉల్లిపాయలు వేసే గోనె బస్తాలు ఏడెనిమిది సిద్ధంగా ఉంచుకోమన్నాడు. వాటిలోనే గూళ్లను ప్యాకింగ్ చేయాలి” అని చెప్పి వెళ్లిపోయాడతు.
‘ఈ అసిస్టెంట్ లేకపోయి ఉంటే ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించలేకపోయేవాళ్లం కదా’ అనిపించింది పతంజలికి.
అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది వర్ధనమ్మ. అసుర సంధ్యవేళ తినకూడదనీ, చీకటి పడి దీపాలు పెట్టింతర్వాత భోంచేయాలని చెప్పిందామె.
మార్కండేయశర్మ అంతా గమనిస్తూన్నాడు. కొడుకు పడుతున్న శ్రమనూ నిర్వహణా సామర్థ్యాన్నీ, కానీ ఆయన పొగడ్తగా ఒక్కమాట అనడు. ఏడుగంటలకు అందరూ భోంచేశారు. వేడి వేడి సొరకాయపులుసు (సాంబారు), మజ్జిగతో తృప్తిగా తిన్నారు ఉదయం తిన్న ‘ఉగ్గాని’ ఎక్కడ పోయిందో! మధ్యాహ్నం ఏదీ తినే అవకాశం లేదు. మాంచి ఆకలిమీద ఉన్నారు.
రాత్రంతా పతంజలి, తోకోడు సుంకన్న మేలుకొనే ఉన్నారు. చంద్రవంకలను కావలిగాస్తూ లేకపోతే పిల్లులో, ఎలుకలో, పాములో గూళ్లకు హాని చేయవచ్చు.
మరు రోజు ఉదయానికి గూళ్లు పూర్తయినాయి. లేత పసుపు వర్ణంలో, ఇంచుమించు ఒక్కసారిగా షెడ్డంతా బోసి పోయినట్లయింది. మేత సమయానికి మోరలెత్తి ఒక్కసారి చూసేవి. జీవమున్నవి కాబట్టి రోజూ వాటిని పట్టుకోవడం బేసిన్లలో వేయడం, వాటి లిట్టర్ శుభ్రం చేయడం ఇలా అందరికీ వాటితో ఒక అనుబంధమేర్పడిరది అందరికీ. దిబ్బ దగ్గర వాటి లిట్టరు, కొమ్మలు, చెత్త ఒక లారీడు పోగుపడిరది.
తోకోడు పోయి కిరణా షాపుల్లో ఉల్లిపాయల ఖాళీ బస్తాలు తెచ్చాడు. ఏడెనిమిది. అవి పల్చగా ఉండి రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి. పట్టు గూళ్లకు గాలి తగలాలి అని వాటిని ఆ సంచుల్లో ప్యాక్ చేస్తారని ఊహించాడు పతంజలి.
అసిస్టెంటు పదిగంటలకల్లా వచ్చాడు. చంద్రవంకలన్నీ తిరిగి చూసి, పతంజలికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
“సామీ, మీ తొలిపంట సక్సెస్!” అన్నాడు.
“మాదేముంది! అంతా మీ గైడెన్సే కదా!” అన్నాడు పతంజలి.
“అయ్యో సామీ, ఇది మా బాధ్యత, మా ఉద్యోగమే ఇదైతే” అన్నాడు.
ఉల్లిపాయల సంచులు బాగా దులిపి అంచులలో కత్తిరించి, సన్నని పురికోసతో ఏకాండంగా కుట్టించాడు. వాటిని ద్రావణంలో తడిపి ఎండలో ఆరేయమన్నాడు. ఒక గంటలో ఆరిపోయాయి.
“సామీ, ఒక్కో చంద్రవంకకు నాలుగు కేజీలు వేసుకున్నా, పన్నెండు చంద్రవంకలకు దాదాపు యాభై కేజీల పట్టు గూళ్లవుతాయని అనుకుంటున్నా. ఒక్క ప్యాకింగ్ పదిహేను కేజీలు చొప్పున మూడు ప్యాకింగ్‌లవుతాయి. గూళ్లను జాగ్రత్తగా నొక్కుకు పోకుండా బయటకు తీసి న్యూస్ పేపర్ మీద పల్చగా పరచాలి. తర్వాత గోనె సంచులలో పోసి అడ్డు కుట్టు వేయాలి. పంచల చాపుల్లో వచ్చే అట్టమీద మీ పేరు ఊరు, జిల్లా, ఎ.పి అని రాసి మూడింటిమీద 1/3, 2/3, 3/3 అని రాయండి. సంచి పై భాగాన పురికొసతో కడదాము. మార్కెట్‌లో మనవి ఏవో గుర్తుపట్టడానికి సులభంగా ఉంటాయి” అన్నాడు.
“స్వామీ! నేను కనుక్కున్నా. మన ఆంధ్రాలో దీనికి మార్కెట్ లేదు. కర్నాటకకు బోవాల్సిందే. మనకు దగ్గర చిక్ బళ్లాపూర్లో ఉందంటగాని ప్రయివేటు వ్యాపారులదట. తూకాల్లో కూడ మోసాలు చేస్తారంట. మైసూరుకుబోయే త్రోవలో రామ్‌నగర్ అని కర్నాటక గవర్నమెంటుది చాలా పెద్ద మార్కెట్టు ఉందట. ఇప్పుడు ధర కూడ బాగా పలుకుతుందట. సౌకర్యాలు కూడ గూళ్లు పెట్టుకోడానికి, రైతులకు చాలా బాగా ఉన్నాయట. రాత్రి మనకు డోన్‌లో బెంగుళూరు బస్సుంది తొమ్మిది గంటలకు. కర్నూలు నుండి వస్తుందది. యంజి బ్రదర్సు వాళ్లదే. వెల్దుర్తిలోకిరాదు. మీరు ఆ బస్సు పట్టుకుంటే తెల్లవారేటప్పటికి బెంగుళూరులో ఉంటారు. అక్కడ మైసూరు బస్సెక్కితే గంట గంటన్నర ప్రయాణమట. మీరు గూళ్లు అమ్ముకొని రేపు రాత్రి బయలుదేరవచ్చు” అన్నారు.
శ్రద్ధగా విన్నాడు పతంజలి.
(సశేషం)