[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ర[/dropcap]వళి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ మార్చుకు వచ్చేసరికి ఆదిలక్ష్మి ఎందుకో సీరియస్‍గా వుంది. ‘నేను లైబ్రరీకి వెళ్ళడం అచ్చొచ్చినట్టుగా లేదు. కిందటిసారి ఇలాగే అమ్మ సీరియస్‍గా వుంది’ అనుకుంది రవళి.
“ఏమ్మా ఎందుకలా వున్నావ్?”
“ఏం లేదే”
“ఏదో వుంది కారణం. మన బంధువులు మళ్ళీ వస్తున్నారా ఏమిటి?” అంది నవ్వుతూ.
“ఆ… వాళ్ళు వచ్చే పరిస్థితి మీ చెల్లెలు కల్పించింది.”
“అంటే?”
“అది వెనకాల గదిలో వుంది చూడు” అంది ఆదిలక్ష్మి.
“ఒక్కత్తీ ఆ గదిలో ఏం చేస్తుంది” అంటూ వెళ్ళింది రవళి.
అక్కడ స్నేహ ఒక కొయ్య కుర్చీలో కూర్చుని వుంది.
“ఏమైందే ఎందుకిక్కడ కూర్చున్నావ్” దగ్గరగా వెళ్ళబోయింది రవళి.
“దాన్ని తాకకు. స్నేహ పెద్దదైంది రవళి” అంది ఆదిలక్ష్మి.
“అలాగా మరి నలుగురినీ పిలిచి అక్షింతలు వేయించాలి కదమ్మా” అంది రవళి.
ఆదిలక్ష్మి మాట్లాడలేదు.
“నేను వెళ్ళి దుర్గా వాళ్ళ అమ్మగారిని, చుట్టుపక్కల వాళ్లను పిలుచుకురానా?”
“వద్దు రవళి, నేను ఏ పేరంటం చెయ్యదలచుకోలేదు. ఇరుగుపొరుగులను పిలిస్తే బంధువులనూ తాతగారిని, బామ్మగారిని పిలవాలి. మళ్ళీ పెద్ద హడావిడి.”
“అలా అని ఎవరికీ చెప్పకుండా ఎలాగమ్మా”
“నేను చాలాసేపటి నుండి అదే ఆలోచిస్తున్నాను రవళి. దానికి పదమూడు సంవత్సరాలు కూడా లేవు. పాపం ఇప్పటినుండీ ఈ సమస్యలు. పైగా అది కూడా పెద్దది అయిందని తెలిస్తే నీ పెళ్ళికి అందరూ తొందరపెడతారు. మీరిద్దరూ ఆడపిల్లలైనా బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు చేయాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నాలాగ ప్రతి రూపాయికి మగవాళ్ల మీద ఆధారపడకూడదు.”
“పాపం దానికి ఇలాంటి ఫంక్షన్స్ అవీ సరదా అమ్మా. పుట్టినరోజే ఏదో సినిమాల్లోచూపించినట్టు ఉండాలంటుంది.” అంది రవళి.
“నిజమే వేడుకలకు విలువేముంది. ఎంతైనా చేసుకోవచ్చు. మొన్ననే వీళ్లందరూ వచ్చి వెళ్లడంతో బోలెడు ఖర్చు అయింది. నాన్నగారు ఊరినుండి రాగానే ఈ విషయం చెబితే నన్ను తిడతారు. అంతగా అయితే దానికొక జత కొత్త బట్టలు కుట్టిద్దాములే” అంది ఆదిలక్ష్మి.
రవళి సానుభూతిగా చూసింది చెల్లెలి వైపు.
‘అవునవును, వచ్చే నెలలో నా పుట్టినరోజుకు కూడా అనే పనికొస్తాయ్’ అనుకుంది స్నేహ. తల్లి మాటలు ఆమెకు బాధని, కోపాన్ని కలిగించాయి.
***
వేసవికాలం సాయంత్రం ఆహ్లాదంగా వుంది. లైబ్రరీకి వెళ్ళినట్టూ వుంటుంది, అలా వాకింగ్ చేసినట్టూ వుంటుందని స్నేహ, రవళి లైబ్రరీకి వెళ్ళి తిరిగివస్తున్నారు. రవళి చేతిలో ‘మీనా’ నవల ఉంది. ఆ నవల చూసినప్పటి నుంచీ ఆమెకు సంహిత మరీ మరీ గుర్తుకువస్తోంది. ఆమె దొంగతనంగా క్లాస్ బుక్స్ మధ్యలో నవలలు పెట్టి చదివేస్తూండేది.
“విద్యార్థి జీవితం అంటే కేవలం చదువే కాదోయ్, ఇలాటి చిన్నచిన్న అల్లరి పనులు కూడా చేస్తుండాలి. పైగా ఇది ఎవరినీ బాధపెట్టే పనులు కావు. పెద్దయ్యాక ఇవే మన జ్ఞాపకాలు. మరీ మరీ గుర్తుచేసుకు నవ్వుకోవచ్చు” అనేది.
“అబ్బా ఏమిటక్కా ఆలోచనల్లో పడితే ఎవరినీ పట్టించుకోవు కృపామణి పిలుస్తోంది.” అంది స్నేహ.
“సారీ నేను చూడలేదు. ఎక్కడికో వెళ్ళొస్తున్నావ్?” అడిగింది రవళి.
“సెలవులు కదూ, మా మమ్మీ ఫ్రెండు టైలరింగ్ నేర్పిస్తానంటే వెళ్ళొస్తున్నా. మా యింటికి వెడదాం రండి” అంది కృపామణి.
“ఈ పార్కులో కూర్చుందాం, పార్కుకి వచ్చి చాలా రోజులైంది” అంది స్నేహ.
ముగ్గురూ పార్కులో కూర్చున్నారు. మామూలు స్కూలు మాటలు మాట్లాడుకుంటున్నారు.
“కొత్త చెట్లు ఏం వేశారో చూస్తాను” అంటూ స్నేహ అక్కడినుండి వెళ్ళిపోయింది.
“రవళి నీకు సంహిత ఉత్తరాలు రాస్తోందా?” స్నేహ అక్కడ లేకపోవడంతో సూటిగానే అడిగింది కృపామణి.
ఆ మాటకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో అర్థం కాలేదు రవళికి. ఇటీవలే పరిచయమైనా తామిద్దరూ ప్రాణ స్నేహితులుగా అయిపోయారని క్లాసు మొత్తం చెప్పుకోవడం తనకు తెలుసు. ఉత్తరాల సంగతి ఈ కృపామణికి చెప్పొచ్చో లేదో.
“నీకు ఇష్టం లేకపోతే చెప్పవద్దులే రవళి. కాని సంహిత విషయంలో నువ్వు జాగ్రత్తగా వుండడం మంచిది.”
“అంటే ఎందుకు, ఏమైంది, ఎందుకలా అంటున్నావ్, ఏం జరిగింది?”
“అంత కంగారుపడకు, తను కాస్త అబద్దాలు చెప్పే మనిషిలాగ వుంది.”
“అబ్బా అంతేకదా, తను కాస్త అల్లరిపిల్లలే…” అంది రవళి నవ్వుతూ.
“అల్లరి చేయవచ్చును. అది ఇంకొకరి బాధకు కారణం కానంతవరకు”
“అంటే…” రవళి సీరియస్‍గా చూసింది.
“ఈ మధ్య నాకు బజార్లో ఫాతిమా కనిపించింది, తను సంహిత వేసుకునే డ్రెస్‍లో వుంది.”
“అది నీకెలా తెలుసు”
“అలా అడుగుతావేం రవళి, శుక్ర, శనివారాలు మనకి యూనిఫాం ఉండదు. సివిల్ డ్రెస్ అనుకునేవాళ్ళం గుర్తులేదా. అప్పుడు సంహిత వేసుకొచ్చే డ్రెస్సుల్లో ఒకటి ఫాతిమా వేసుకుంది. ఆ విషయం నేను గుర్తిస్తానని కంగారుపడింది. అఫ్‍కోర్స్ ఆ విషయం నేను అడగలేదనుకో.”
సంహిత పాత డ్రెస్ ఫాతిమా కివ్వడం ఎందుకు?
“అంతేకాదు ఫాతిమా అక్కకు పెళ్ళి కుదిరింది. ఫాతిమా క్కూడా సంబంధాలు చూస్తున్నారు. కుదిరితే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తారుట.”
“ఛ… మరీ టెన్త్ చదవగానే పెళ్ళేమిటి?” అంది రవళి.
“అంతకంటే తనని వాళ్ళు చదివించలేరోయ్. మనతో చదివినా తను మనకంటే రెండేళ్ళు పెద్దది. పైగా సంహితకి వచ్చే ఉత్తరాలు ఫాతిమా ఎడ్రస్‍కి వస్తాయి. దానితో వాళ్ళింట్లో పెద్దగొడవే అయిందట”
“ఏమిటి కృపామణీ నీ మాటలు, సంహిత ఉత్తరాలు ఫాతిమాకు రావడం ఏమిటి?” రవళికి మతిపోయేటట్టుగా వుంది.
“నీకు గుర్తులేదా… వాళ్ళిద్దరి పుస్తకాలు మారిపోయినట్టుగా, ఒకరి పుస్తకాల్లో మరొకరివి చేరినట్టుగా మార్చుకొనేవారు.”
“అవునవును….”
రవళికి బుక్ కిందపడినప్పుడు దాన్లోంచి ఉత్తరం కూడా బయటపడడం గుర్తుకువచ్చింది.
“అదే మరి సంహిత తన ఫ్రెండ్స్ తనకు రాసే ఉత్తరాలకు ఫాతిమా ఎడ్రస్ ఇవ్వవలసిన అవసరం ఏముంది.”
“ఎందుకంటే అవి తన మగఫ్రెండ్స్ రాసే ఉత్తరాలు కాబట్టి.”
రవళికి అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి.
“నిజమా కృపామణి….”
“అవును సంహిత గురించి అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు.”
“ఫాతిమాకు తెలుసా ఈ ఉత్తరాలు ఎవరు రాసేది, ఎందుకు రాసేది.”
“తన కజిన్ రాస్తున్న ఉత్తరాలని, కుటుంబంలో ఏవో గొడవల వలన ఇలా వేరే వాళ్ళ ఎడ్రస్ ఇవ్వవలసి వచ్చిందని చెప్పిందట. అంతేకాదు ఫాతిమాకు చాలా ప్రెజెంట్లు, డబ్బు కూడా ఇచ్చేదట సంహిత.”
“అయితే మాత్రం ఈ ఫాతిమాకు బుద్ధిలేదా, తనెలా పుచ్చుకుంది.”
“ఫాతిమా పేదరికం మనకు తెలియదా? ఇంట్లో తన చిన్న చిన్న కోరికలు కూడా తీరవు, పైగా ఇచ్చేవాళ్ళుంటే పుచ్చుకోవడం తప్పేముంది అనుకుంది.”
“ఈ విషయాలన్నీ నీకు యింత వివరంగా ఎలా తెలుసు”
“ఫాతిమా అక్క మా అమ్మ వాళ్ల ఫ్రెండ్ దగ్గరే చాలారోజులుగా టైలరింగ్ నేర్చుకుంటోంది. పైగా ఆవిడకు బట్టలు కుట్టే ఆర్డర్లు ఎక్కువ వస్తే ఫాతిమా అక్క షమీమ్ కుట్టి యిస్తుంది. తను ఆవిడకు చాలా చేదోడు వాదోడుగా వుంటుంది. ఆవిడతో తన బాధలేవో చెప్పుకుంటూ ఫాతిమా గురించి చెప్పిందట. నేనూ తనూ ఒకే క్లాసు కాబట్టి మా ఆంటీ నాకీ విషయాలన్నీ చెప్పారు.”
“సంహితే ఆ అమ్మాయని వాళ్లకి ఎలా తెలుసు?”
“అంత పెద్దగా ఫ్రెండ్ దగ్గర నుంచి డ్రెస్ తెచ్చుకు వేసుకుంటే తెలియకుండా ఎలా వుంటుంది రవళి. పైగా ఆ డ్రస్ లూజుగా వుందని ఆంటీ దగ్గరే రిపేర్ చేయించుకుందిట”
రవళి మాట్లాడలేదు.
“ఏం రవళి యిలా మాట్లాడానని నామీద కోపంగా వుందా?”
“అహ అది కాదు. ఒక మంచిపని చేసేటప్పుడు మనం ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలా? అని”
“అంటే….” కృపామణికి అర్థం కాలేదు.
“సంహిత కుటుంబానికి, వాళ్ళ కజిన్ కుటుంబానికి కొన్ని కలహలు వున్నమాట నిజమే. అవి పోగొట్టి రెండు కుటుంబాలను మళ్ళీ కలపాలని సంహితా, వాళ్ళ కజిన్ ప్రయత్నిస్తున్నారు. అందుకే వాళ్ళు ఉత్తరాలు రాసుకుంటూ వుండవచ్చును. కానీ మనవాళ్ళు దాన్ని ఎంత అపార్థం చేసుకున్నారో చూడు.”
“అయితే ఇదంతా నీకు తెలుసా.”
“ఉత్తరాల సంగతి తెలియదు. కుటుంబపు గొడవలు వున్నాయని వాటిని తగ్గించడానికి సంహిత ప్రయత్నిస్తోందని తెలుసు.”
“అయితే ఇందులో సంహితదేమీ తప్పు లేదంటావ్” అంది కృపామణి.
“మనందరం ఒకేవయసు వాళ్ళం కృపామణి. పెద్దవాళ్ళంతలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేము. సంహిత కూడా ఇది మంచిపనే అనుకుంది. కానీ దానివలన ఇలా గొడవలు వస్తాయి అని అనుకుని వుండదు.”
కృపామణి ఏదో అనేలోపు స్నేహ తిరిగి వచ్చింది, “అక్కా! చీకటి పడింది వెడదామా?” అంటూ.
“ఇక్కడికి దగ్గరేగా మా యిల్లు, రండి మా యింటికి” అంది కృపామణి.
“లేదు, ఇప్పటికే మా అమ్మ కంగారు పడుతూ వుంటుంది. మరోసారి వస్తాము.”
ఇంకా ఎక్కువసేపు కృపామణితో ఉంటే యింకా ఏం వినవలసి వస్తుందో అని భయంగా వుంది.
“ఇవన్నీ నీకు చెప్పానని నన్ను అపార్థం చేసుకోకు రవళి” అంది కృపామణి.
“చిన్నప్పటినుంచి మనం ఫ్రెండ్స్‌మి. మనమధ్య ఏమైనా గొడవలు వచ్చాయా కృపామణి, నేను తొందరగా ఎవరినీ అపార్థం చేసుకోను.” అంది రవళి.
‘అవును అందుకే ఇంత జరిగినా నీకు సంహిత మంచిదానిలా కనిపిస్తోంది’ అనుకుంది కృపామణి. వాళ్ళిద్దరి మాటలు స్నేహకు అర్థం కాలేదు.
“అలా వున్నావేం” అని అక్కను రెండుసార్లు అడిగినా రవళి మాట్లాడలేదు. ఆమె ఆలోచనలు కృపామణి మాటల చుట్టూ తిరుగుతున్నాయి.
సంహిత మంచిది, కానీ తన చలాకీతనం, స్నేహ వాత్సల్యం చూసి అందరూ అపార్థం చేసుకుంటారు అనుకుంది రవళి.
“ఏమిటి రవళి లైబ్రరీకి వెళ్ళి అక్కడే వుండిపోయారు. చీకటి పడిందని నేను కంగారుపడుతున్నాను” అంది ఆదిలక్ష్మి.
“దారిలో కృపామణి కనపడిందమ్మా. కాసేపు మాట్లాడి రావడంలో లేటయింది” అంది రవళి.
“సరే… నీకు సంహిత ఉత్తరం రాసినట్టుంది, నాన్నగారి టేబుల్ మీద పెట్టాను చూడు.”
రవళి మంచినీళ్ళయినా తాగకుండా ఆ ఉత్తరం చదివింది. సంహిత ఊటీలో ఉంది ప్రస్తుతం. ఆ విశేషాలన్నీ రాస్తూ ఊటీ ఫోటోలు కూడా రెండు పంపింది. ఆ ఫోటోలు స్నేహకు, తల్లికి కూడా చూపించింది రవళి.
“ఏమిటక్కా ఇందులో సంహితా, వాళ్ళు ఎవరూ లేరే” అంది స్నేహ.
“ఆ…. వాళ్ళని మనం చూస్తూనే వుంటాం. ఊటీ చూడలేదుగా, అందుకే పంపి వుంటుంది.”
ఒక తెర వేయగానే వేదికపై ఏమున్నది ప్రేక్షకుడికి కనపడదు. అలాగే సంహిత రాసిన ఉత్తరం రవళి మనసుకు, ఆలోచనలకు తెరవేసి, కృపామణి మాటలను మర్చిపోయేలా చేసింది.
***
శలవులు పూర్తయ్యాయి. పిల్లలందరూ కొత్తక్లాసుల్లో స్కూళ్ళల్లో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందే టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి.
రవళి సెక్షనులో ఫాతిమా, సుందరి తప్ప అందరూ పాసయ్యారు. రవళికి, సంహితకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. రవళికి చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉంది. స్నేహంలో పడి తాము చదువును నిర్లక్ష్యం చెయ్యలేదు. పరీక్ష పాసయిన వాళ్లందరూ స్కూలుకి వెళ్ళి టీచర్లందరికీ కనిపించి తమ పరీక్షా ఫలితాలను వాళ్ళకు తెలియజెయ్యడం ఎప్పటినుండో వస్తున్న పద్ధతి.
రవళి ఈ విషయం ముందురోజు సాయంత్రమే సంహితకు చెప్పింది. “ఊరినుండి వచ్చిన అలసట తీరలేదు రవళి, నేను రాలేను” అంది సంహిత. అది పద్ధతి కాదని అందరూ వెడుతున్నారని చెప్పినా సంహిత రానంది. మర్నాడు పరీక్ష పోయిన ఓ నలుగురైదుగురు తప్ప రెండు సెక్షన్ల పిల్లలూ బడిలోనే వున్నారు. ఎక్కువ సంఖ్యలో పిల్లలు పాసయినందుకు అందులో ఎక్కువమందికి ఫస్ట్ క్లాసులు వచ్చినందుకు టీచర్లు కూడా చాలా ఆనందించారు.
“ఏం రవళి మీ ఫ్రెండ్ ఎక్కడ? వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అయిందా? తను రాలేదేం?” అడిగారు తెలుగు టీచర్.
“తను వూరికి వెళ్ళి వచ్చింది టీచర్, ఆరోగ్యం బాగోలేదని రాలేదు.” అంది రవళి.
***
“ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని కూడా ఆర్ట్స్ తీసుకుంటానంటావేం రవళి. మెడిసిన్ చదువుతానన్నావ్‍గా ఇన్నిరోజులు” అన్నాడు రవి.
“ఇప్పుడు చదవాలని లేదు అన్నయ్యా”
“ఏం ఎందుకు. ఇన్నాళ్ళు సైన్సు కాకుండా మేథ్స్ తీసుకున్నానని నన్ను కామెంట్ చేశావుగా”
రవళి మాట్లాడలేదు.
“అన్నయ్య చెప్పేది నీ మంచికోసమే. మాట్లాడవేం రవళి” అంది ఆదిలక్ష్మి.
రిజల్ట్ వచ్చిన వారానికే స్కూల్లో సర్టిఫికెట్స్ తీసుకున్నారందరూ. అప్పుడే సంహిత రవళికి తను ఆర్ట్స్ గ్రూప్‍లో చేరుతున్నానని, రవళి కూడా అదే గ్రూప్‍లో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పింది. చెప్పడం కాదు ఒక విధంగా బ్రెయిన్ వాష్ చేసింది.
“మీరైనా చెప్పండి నాన్నగారు” అన్నాడు రవి.
“దానికిష్టమైన చదువు చదనివ్వరా” అన్నాడాయన దీక్షగా పేపరు చదువుతూ.
ఆ రోజు సాయంత్రం అందరూ డాబామీద సమావేశం అయ్యారు. జూన్ నెల పూర్తవుతున్నా వాన జాడ లేదు. గాలికోసం అందరూ డాబా మీద చేరారు. కొత్తగా కట్టిన గదులు రంగులు వేసుకు ముస్తాబు అయ్యాయి. డాబా స్థలం కొంచెం మిగిలినా కూర్చోవడానికి సదుపాయంగానే వుంది.
“అలా అంటే ఎలాగ, మన పిల్లల్లో డాక్టరు అయ్యే తెలివి రవళికే ఉంది.” అంది ఆదిలక్ష్మి.
“ఎందుకు అది మెడిసిన్ చదవను అంటే అదే కోర్స్ చదవమంటావ్. అసలు ఆడపిల్లలకు అంత చదువెందుకు?”
అక్కడే కూర్చుని కొత్త పుస్తకాలకి అట్టలు వేసుకుంటున్న స్నేహకి నవ్వొచ్చింది. అప్పుడు ఈ చదువు మాత్రం ఆడపిల్లలకు ఎందుకంటారేమో.
“బాగుంది మీరు చదువుకుని ఉద్యోగం చేస్తున్నవారై వుండి ఆడపిల్లలను చదవొద్దు అంటారా”
“చదవొద్దు అనడం లేదు. దాదాపు ఆరేళ్ళు చదివే ఆ కోర్సు వద్దు అంటున్నాను. దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? పైగా అంతకంటే ఎక్కువ చదివినవాడికిచ్చి పెళ్ళి చేయాలి. ఇంత చదివినా కట్నం యివ్వక తప్పదు”
ఆదిలక్ష్మి ఏదో అనబోయింది. జగన్నాధం వినిపించుకోలేదు.
“రవళీ! నువ్వు ఆర్ట్స్ తీసుకో. నిన్ను మెడిసిన్ చదివించే ఓపికా, తాహతు నాకు లేవు. సందర్భం వచ్చింది కాబట్టి మరో మాట చెబుతున్నాను. కాలేజికి తలవంచుకుని వెళ్ళి, తలవంచుకుని రావాలి తెలిసిందా. చదువే నీ వ్యాపకంగా వుండాలి.”
తండ్రి మాటలు తనకి హెచ్చరికో, వార్నింగో అర్థం కాలేదు రవళికి. ఒకటే సంతృప్తి. తనూ సంహితతో పాటు ఆర్ట్స్‌లో చేరవచ్చును. తండ్రి తనని మెడిసిన్ చదివించలేనన్నారు కాబట్టి ఇంక గొడవలేదు. ఇదంతా సంహితకు చెప్పాలి.
అలా ఒక స్నేహితురాలి స్వార్థం, ఒక తండ్రి అసమర్థత ఒక మంచి స్టూడెంట్‍ను పక్కదారి పట్టించాయి.
(ఇంకా ఉంది)