సూర్యపుత్రి, స్త్రీవాద రచయిత్రి శ్రీమతి దినేశ్ నందిని దాల్మియా

5
3

[dropcap]ఫి[/dropcap]బ్రవరి 16వ తేదీ శ్రీమతి దినేశ్ నందిని దాల్మియా జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

బానిసలలా బతుకుతున్న భారతీయులను ముఖ్యంగా మహిళల వెనకబాటుతనాన్ని అవగాహన చేసుకుని, తన బాధని రచనలలో వ్యక్తపరచి, పరిష్కార మార్గాలనీ చూపిన గొప్ప స్త్రీవాద రచయిత్రి ఆమె. తొలి రచనకే హిందీ సాహితీవేత్తలందుకునే సక్సేరియా పురస్కారాన్ని అందుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, హరివంశరాయ్ బచ్చన్ ప్రశంసలను అందుకున్న విదుషీమణి ఆమె. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాని స్వీకరించిన తొలి మహిళ ‘శ్రీమతి దినేశ్ నందిని దాల్మియా’.

ఈమె 1928వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన నాటి బెంగాల్ ప్రావిన్సెస్, నేటి రాజస్థాన్ లోని ఉదయపూర్‌లో జన్మించారు. బాల్యంలోనే అనేక గ్రంథాలను చదివారు. దేశ కాల సమాజ పరిస్థితులను గమనించారు. ఈ అనుభవంతోనే పిన్న వయస్సు పదమూడేళ్ళ వయస్సులోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయులు బ్రిటిష్ వారి పరిపాలనలో అనుభవిస్తున్న బాధలకు కరిగిపోయారు.

1946లో భారతదేశంలోని ధనిక కుటుంబాల వ్యాపార సంస్థలలోని మూడవ అతి పెద్ద వ్యాపార సంస్థ దాల్మియా గ్రూపు సంస్థల అధిపతి శ్రీ రామకృష్ణ దాల్మియాతో ఈమె వివాహం జరిగింది. ఆయనకి అప్పటికే ఐదుగురు భార్యలున్నారు. మళ్ళీ వివాహం చేసుకోకూడదనే షరతును విధించారు దినేష్ నందిని. ఆ షరతుకి ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.

వివాహం తరువాత చదువు కొనసాగించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని తీసుకున్నారు.

ఈమె బాల్యం నుండి మహిళలు పడుతున్న బాధలను అర్థం చేసుకున్నారు. మూఢ నమ్మకాలు, నిరక్షరాస్యత, పర్దా పద్ధతి, బాల్య వివాహాలు, బాల వితంతువులుగా అనుభవించే బాధలు అన్నీ ఆమె మనసును కుదిపేశాయి. స్త్రీవాద రచయిత్రిగా మార్చేశాయి. ఈమె తన రచనలలో మహిళల స్థితిగతులను చర్చించేవారు.

విభిన్న సాహితీ ప్రక్రియలను వెలయించారు. పద్యాలు, వచనాలు, చిన్న కథలు, నవలలో వైవిధ్యభరిత విషయాలను వివరిస్తూ చర్చించారు.

ఈమె మొదటి పద్యగద్య కావ్యం ‘షబ్నం’కి ‘సక్సేరియా అవార్డు’ లభించింది. ‘నిరాష్ ఆషా’, ‘ముఝే మాఫ్ కర్నా’, ‘యేభీ జాత్ హై’ మొదలయినవి ఈమె రచనలలో ఎన్నదగినవి. ‘నిరాష్ ఆషా’ గ్రంథం ప్రముఖ హిందీ మహిళా సాహితీవేత్తలు శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్, మహాదేవి వర్మల ప్రశంసలను అందుకోవడం ముదావహం.

ఈమె రచనలలో ఆత్మాశ్రయత, భావోద్వేగాల తీవ్రత దర్శనమిసుంది. భారత మహిళల అంతర్గత, బాహ్య ప్రపంచాలపై లోతైన విశ్లేషణ కనిపిస్తుంది. వాక్య నిర్మాణపు పోకడలు వైవిధ్య భరితంగా కనిపిస్తాయి. ఒప్పుకోలు కవిత్వ సృజన చేసిన తొలి కవయిత్రి ఈమె. పత్రికా సంపాదకురాలిగా పేరు పొందారు. ఆ రోజులలో పేరు పొందిన హిందీ సాహిత్య పత్రిక ‘ధర్మయుగ్’. ఈ పత్రికకి సంస్థాపకులలో ఒకరు. ఇది ఈమె స్వంత పత్రిక. 2003లో ప్రారంభించినప్పటి నుండి 2007లో మరణించే వరకు ఈ పత్రిక ప్రధాన సంపాదకురాలిగా బాధ్యతలను నిర్వహించారు.

ఈమె రచనలను చదివిన భారత ప్రథమ ప్రధాన మంత్రి స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూ లేఖల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తపరిచేవారు. ప్రముఖ హిందీ సాహితీవేత్త శ్రీ హరివంశరాయ్ బచ్చన్ తన రచనలలో ఈమె రచనలను ప్రస్తావించి ప్రశంసించారు.

ఈమె వివిధ సంస్థలలో సభ్యురాలిగా, నిర్వాహకురాలిగా పని చేశారు. ‘ఇండో-చైనా ఫ్రెండ్‌షిప్ సొసైటీ’, ‘లేఖికా సంఘ్’, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపారిటివ్ రెలిజియన్ అండ్ లిటరేచర్ (ICRL) లలో పని చేసి ఆయా సంస్థలకు పేరును తీసుకుని వచ్చారు. ICRL కు తొలి రోజులలో క్రియాశీలక సభ్యులుగా పని చేశారు. తరువాత అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించడం విశేషం.

ఈమె ఇతర రచనలలో కందీల్ కా ధువాన్, హిరణ్య గర్భ, ఆంఖ్ మిచౌలి, అబ్ నహీ, దుఫారియా కే ఫూల్, స్పందన, శార్వరి, ఎ విమెన్స్ జర్నీ, అహోన్ కి బైసాఖియా, పీచే కర్నే వాలీ, సారంగ్ మొదలైనవి ప్రఖ్యాతి పొందాయి.

ఈమె రచించిన ‘ఫూల్ కా దర్ద్’ గ్రంథం టెలీఫిల్మ్‌గా నిర్మించబడింది.

ఈమెకి అనేక పురస్కారాలు లభించాయి. తొలి పుస్తకం ‘షబ్నం’ ముద్రణతోనే ‘సక్సేరియా అవార్డు’ను అందుకోవడమే ఒక చారిత్రక విశేషం.

2001లో హిందీ సాహిత్య అకాడమీ వారు ‘స్వశక్తీ కరణ్’ పురస్కారాన్ని అందించి గౌరవించారు. ‘ముఝే మాఫ్ కర్నా’కి ప్రేమచంద్ పురస్కారం లభించింది. 2005లో రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి గౌరవించారు. భారత ప్రభుత్వం 2006లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందించి సత్కరించారు.

‘మంత్రపుష్ప ఔర్ అన్య కహానియా’ ఈమె చివరి చిన్న కథల సంపుటి. దీనిని ఈమె మరణానంతరం 2007లో ప్రచురించారు.

ఈమె కుమార్తె నీలిమా దాల్మియా అధర్. ఈమె తన తండ్రి జీవిత చరిత్రను ‘ఫాదర్ డియరెస్ట్: ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ ఆర్కే దాల్మియా’ అనే పేరుతో గ్రంథస్థం చేశారు.

అధర్ తల్లి సాధించిన విజయాలను గురించి “సంఘర్షణలు, గందరగోళాలతో నిండిన ఆమె వ్యక్తిగత జీవితం ఆమెలో బాధను నింపింది. ఈ బాధ ద్వారానే రచనలు చేసింది. ఆమె ఆత్మను, అనుభవాలను, అభిరుచులను వాటిలో నిక్షిప్తం చేసింది. అపరిమితమైన భావనలను పొందుపరిచింది. సాహితీసుమాలను పాఠకులకు అందించింది” అని గొప్పగా తన రచనలలో ఉటంకించారు.

ఈమె గౌరవార్థం దేశ రాజధాని ఢిల్లీలోని – పాయింట్, తిలక్ మార్గ్ దగ్గరున్న మార్కెట్‌కి ‘దినేష్ నందిని దాల్మియా చౌక్’ అని పేరు పెట్టారు.

ఈమె 2007వ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన ఢిల్లీలో మరణించారు.

ఈమె జ్ఞాపకార్థం 2009 అక్టోబర్ 11వ తేదీన 5 రూపాయల విలువతో ఒక స్టాంప్‌ని విడుదల చేసింది భారత తపాలాశాఖ. రాజస్థాని మేలిముసుగు ధరించిన ఈమె చిత్రము ముద్రించబడింది. ఈ చిత్రము వెనుక ఈమె పుస్తకాల ముఖచిత్రాలు కనిపిస్తాయి. తెరచిన పుస్తకములో ఐదురూపాయలు అని వ్రాసి ఉంటుంది.

ఈ ఫైర్ బ్రాండ్ రచయిత్రి జయంతి ఫిబ్రవరి 16వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here