జ్ఞాపకాల తరంగిణి-34

1
4

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. కార్యక్రమాలు-1

[dropcap]తి[/dropcap]రుపతి బస్ స్టాండులో నిలబడి వున్నా, బస్సు కోసం ఎదురు చూస్తూ. నడి వయసులో, ఆరోగ్యంగా అందంగా వున్న యువతి దగ్గరకు వచ్చి ‘సార్’ అంటూ పలకరించింది. తనెవరో గుర్తురాలేదు. నా ముఖంలో భావాన్ని పసిగట్టి, “సార్! నేను స్వరాజ్యాన్ని, మీ స్టూడెంట్‌ని” అంది. అప్పుడు ఇక అంతా గుర్తొచ్చి ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొన్నా. తన పెనిమిటి తిరుపతిలో కాలేజీలో లెక్చరర్ అని, తన కుటుంబ వివరాలన్నీ సంతోషంగా వివరించింది. ఇన్నేళ్ల తర్వాత నా పూర్వ విద్యార్థి కలిసి, కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడడం, ఆమె జీవితంలో చక్కగా స్థిరపడిందని వినడం – చాలా సంతోషం కలిగింది. ఉపాధ్యాయులు పొందే అనితర సాధ్యమైన ఆనందం ఇదే! ఇంతలో బస్ రావడంతో ఆమెకు వీడ్కోలు చెప్పాను.

బస్సు కదిలింది. పుష్కరకాలం నాటి నా కాలేజి జీవితం కళ్ల ముందు మెదిలింది.

ఎప్పుడో 1980 నాటి మాట. మా కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావుగారు రూంకు పిలిపించి, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ బాధ్యత తీసుకోవలసిందిగా కోరారు, అంటే ఆర్డరు వేశారు. నాకు ఆ బాధ్యత తీసుకోడం ఏ మాత్రం ఇష్టం లేదు. అప్పటికే కాలేజిలో సీనియర్ అధ్యాపకుడిగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఇక వారి మాట కాదనలేక బాధ్యత స్వీకరించి, మళ్లీ ఎన్.ఎస్.ఎస్. యూనిట్‌లో ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభించాము. నాకు అండగా ఒకరిద్దరు సేవాతత్పరులైన సహ అధ్యాపకులు రామమోహన రెడ్డి, సత్య నిలబడ్డారు. అరడజను మంది అమ్మాయిలు, పాతిక మంది అబ్బాయిలను ఎంపిక చేసుకొన్నాము. అందరికి చాలా వరకు గ్రామీణ నేపథ్యం వుంది.

మా యూనిట్ కార్యక్రమాలు మొదలుపెడుతూ కావలి జవహర్ భారతి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణగారిని పిలిచాము. వారు ఎన్.ఎస్.ఎస్. కేంపులు విర్వహించే సమయంలో అధిక సంఖ్యాకులైన గ్రామీణులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టమని కొన్ని సూచనలు చేశారు. మొదట మా కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. నెల్లూరు సమీపంలో వెంకటచలంలో అటవీశాఖ వారి వద్ద బండెడు మొక్కలు తెచ్చి మా రెండు క్యాంపస్‍లలో నాటాము. నాటామంటే అవి పెరిగి పెద్దవయ్యే వరకు నీరు పోసి, ముళ్ల కంచె వేసి పరిరక్షించాము. ప్రిన్సిపాల్ గదికి వెళ్లేదారిలో రెండు వైపులా పది నిద్రగన్నేరు చెట్లు పెంచాము. ఆరేడేళ్లలో అవి పెరిగి నీడనిచ్చే వృక్షాలయ్యాయి. ఈకొలిప్టస్ చెట్లు ప్రహారీకి దగ్గరగా వేశాము. ఫ్లేమ్ ఆఫ్ ది పారిస్.. చెట్లు కూడా త్వరగా పెరిగి పూతకొచ్చాయి. ఇవన్నీకాక కొన్ని వెదురు మొక్కలు నాటాము. మాను సంపంగి మొక్కలు నాటాము. పదేళ్లలోపే వెదురు విస్తరించి రెండంకణాల పొదైంది. మాను సంపంగి డిసంబరు, జనవరి మాసాల్లో విపరీతంగా పూస్తుంది. క్యాంపస్ మొత్తం ఆ పువ్వుల సుగంధంతో నిండిపోయేది. మరొకటి కానుగ చెట్టు. నాలుగేదేళ్లకే కానుగలు పూచాయి. డిసంబరు మాసంలో రాత్రి పువ్వులు పూచి చెట్టు కింద తెలుపు, పింక్ వర్ణం కలిగిన పువ్వులు ముత్యాలు పరిచినట్లు, అద్భుతంగా వుండేవి. తర్వాత వచ్చిన తుఫానుల్లో మహావృక్షాలైన నిద్రగన్నేరు కొన్ని కూలిపోయాయి. క్రీడామైదానం కోసం కొన్నింటిని తొలిగించారు. మా ప్రిన్సిపాల్ గారు తన గదికి వెళ్లేదారిలో ఏపుగా పెరిగిన వృక్షాలను చూసి ‘పురుషోత్తం అవెన్యూ, ఎన్.ఎస్.ఎస్ అవెన్యూ’ అని సరదాగా అంటూండేవారు.

నేను ఎస్.ఎస్.ఎస్. యూనిట్ కోఆర్డినేటర్‌గా నాలుగేళ్లే వున్నాను. ఆ చెట్లను మా విద్యార్థులు నాటినవని అన్ని బ్యాచ్‌ల వాళ్లకి తెలుసు. ఎవరో సిద్ధాంతి మా కాలేజి కమిటి వాళ్లతో వెదురు చెట్లు కాలేజీలో వుండకూడదని అన్నారట! మరసటి రోజే కూలీలను పెట్టి కొట్టించారు. కలప అడితి వాళ్లు ట్రాక్టరు నిండా వెదుళ్లు వేసుకొని పోతుంటే మా స్టాఫ్ మెంబర్లం నిర్ఘాంతపోయి చూస్తున్నాం.

ఎన్.ఎస్.ఎస్. విద్యార్ధులు వేసిన చెట్లంటే రెండు విషయాలు గుర్తొస్తాయి. మా కళాశాల కమిటిని రద్దు చేసి, తాత్కాలికంగా ఒక కమిటిని ప్రభుత్వం నియమించింది. అందరూ రాజకీయ రంగున్న వారే. ఆ సమయంలో కార్యదర్శి స్థానంలో ప్రభుత్వ అధికారి స్పెషల్ ఆఫీసర్‌గా వున్నారు. తుఫాను వచ్చి కళాశాలలో కొన్ని చెట్లు కూలిపోయాయి. ఒక మాను సంపెంగ వృక్షం బాగా ఏపుగా, పుష్టిగా పెరిగిన చెట్ల దారికి అడ్డంగా కూలింది. అధ్యాపకులు, విద్యార్ధులు సైకిళ్లను ఎత్తి పట్టుకొని ఆ కూలిన వృక్షం మీద నుంచి దాటించి తీసుకెళుతున్నారు. నెల రోజులైనా, కమిటిగాని, స్పెషన్ ఆఫీసరు గాని పట్టించుకోలేదు. ప్రిన్సిపల్‌గా నాకు బాధ్యత వుంది. ఒక కొయ్య అడితి వాణ్ణి పిలిపించి దాన్ని తొలగించమన్నాను. అతను 800 రూపాయలు ఇచ్చి దాన్ని పట్టుకొనిపోయాడు. మను సంపెంగ కలప కుర్చీలు, ఇతర వస్తువులు చేయించుకోడానికి అనువైనది. చాలా సాఫ్ట్‌గా వుంటుంది.

కలప అడితి అతను ఇచ్చిన డబ్బుతో కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు కొని స్టాఫ్ రూంలో వేయిద్దామని నా ఆలోచన. మా అకౌంటెంట్”సర్! ఆ డబ్బు కమిటి అకౌంట్‌లో జమ చేయ్యండి, నా మాట విని” అన్నాడు. అలాగే చేశాము. రెండు రోజుల తర్వాత, మా కమిటి సభ్యులొకరు – వేలం వేసి వుంటే ఆ కూలిన వృక్షాన్ని తాను కొనేవాణ్ణని, కొంచెం నిష్ఠూరంగా మాట్లాడారు ఫోన్‌లో. మా కాలేజీ స్పెషల్ ఆఫీసరైతే, ప్రభుత్వ నియమాలు గుర్తు చేసి ఆరో పదో కలప అడితల వద్ద టెండర్ కాగితాలు తెప్పించాలని, కరపత్రం ద్వారా చెట్టును వేలం వేస్తున్నట్లు ప్రకటించాలని ఏవో రూల్సు చెప్పాడు.”అలాగే! మా స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేస్తాను, మీరు వచ్చి మాట్లాడండి!” అని ఫోన్ పెట్టేశాను. వారెవరూ రారు. స్టాఫ్‌కు సమాధానం చెప్పలేరు.

నేను పదవీ విరమణ చేస్తున్న సమయంలో కాలేజిలో ఎన్ని చెట్లు మిగిలాయో లెక్క వేయించాను. సుమారు 360 చిల్లర ఎదిగిన చెట్లున్నాయి. జన్మభూమి కార్యక్రమంలో మా ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు చెట్లు నాటారు – కాలేజిలోనే కాక, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో, నెల్లూరు డ్రైయినేజి శుద్ధి చేసే ప్రాంతంలోనూ, కేంపులు జరిగినపుడు. అవన్ని పెరిగి పెద్దవైన తర్వాత ఏవో కారణాల వల్ల తొలగించారు. ఆ రోజుల్లో ప్రతి నెల 25 లోపల ప్రతి కాలేజి జన్మభూమి కార్యక్రమంలో ఎన్ని మొక్కలు నాటారో ఒక నివేదిక పంపాలి. లేకపోతే జీతాల బిల్లు ఆగిపోతుంది. అందరూ కాకి లెక్కలు పంపేవారు. మేం ఏదో గుడ్డిలో మెల్ల. ప్రభుత్వం ఆడంబరంగా ప్రణాళికలను ఆరంభిస్తుందే గాని, కొనసాగించే విషయంలో పట్టుదలగా సాగించదు.

మా ఎన్.ఎస్.ఎస్. యూనిట్‌లో పని చేసిన అమ్మాయి విషయం ఇప్పుడు చెప్తాను. మా యూనిట్‌లో అరడజను మంది అమ్మాయిలు, పాతిక మంది అబ్బాయిలు వుండేవారు. గ్రామాల్లో మురికివాడల్లో శరీర కష్టంతో చేసే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాము. విద్యార్థులు ఎంతో నిబద్ధతతో వ్యవహరించారు. స్వరాజ్యం, ఆమె చెల్లెలు వైజయంతి ఇద్దరూ అన్ని కార్యక్రమాల్లో క్రమశిక్షణతో పాల్గొనేవారు. ఒకసారి అవేర్ సంస్థ నెల్లూరు చుట్టుపట్ల పల్లెల్లో యానాదులకు సంబంధించిన గణాంకాలను సేకరించే బాధ్యత ఎన్.ఎస్.ఎస్. యూనిట్లకు అప్పగించింది. మా యూనిట్ 15 గ్రామాల్లో ఈ గణాంకాల సేకరణ నిర్వహించింది. మా పిల్లలు ముగ్గురు ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి ఒక్కో గ్రామంలో లెక్కలు తీశారు. అవేర్ సంస్థ ప్రతినిధులు అన్ని గ్రామాలూ కార్లో తిరిగి పని జరుగుతున్న తీరును పరిశీలించారు.

మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఎండ చాలా తీవ్రంగా వుంది. పంటకాలువ గట్టు మీద కొన్ని గుడిసెలు. కొయ్య పీట మీద కూర్చొని స్వరాజ్యం ఓపికగా వివరాలు రాసుకోంటుంది. చుట్టూ ఆడా మగ గుంపు. అవేర్ ప్రతినిధులు మా విద్యార్థుల నిబద్ధతను చూసి, చాలా ముచ్చటపడ్డారు. తర్వాత జరిగిన రెవ్యూ సమావేశంలో అవేర్ ప్రతినిధులే ఈ దృశ్యాన్ని వివరంగా వర్ణించి చెప్పారు.

స్వరాజ్యం కుటుంబం వ్యాపారంలో అంతా పోగొట్టుకొని చివరకు చిన్న అంగడి నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. స్వరాజ్యం చెల్లిని పెళ్లి చేసుకొంటానని ఒక పోకిరి, మా విద్యార్థే వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం అక్కా చెల్లెళ్లు మా దృష్టికి తెచ్చారు. మా స్టాఫ్ ఆ విద్యార్థికి బుద్ధి చెప్పి సమస్యను పరిష్కారించారు. స్వరాజ్యం చెల్లి విద్వాన్ చదివి అధ్యాపకురాలైంది.

ఒక రోజు క్లాసు తీసుకొంటున్నా. స్వరాజ్యం క్లాసురూం వద్దకు వచ్చి నాతో మాట్లాడాలని అభ్యర్ధించింది. తను కళాశాల విడిచిపెట్టి రెండేళ్లు దాటింది. మళ్లీ ఇదే చూడడం. క్లాసు అయిపోయాక, దూరంగా చెట్ల కింద నా కోసం వేచి వున్న అమ్మాయి వద్దకు వెళ్లాను. ఈ రెండేళ్లలో తను చాలా మారిపోయి కళావిహీనంగా, దయనీయంగా చిక్కపోయింది. పలకరించగానే కన్నీళ్లు పెట్టుకొని “నాకు కుష్ఠు రోగం వచ్చింది సార్” అంది. ఈ విషయంలో మా ఎన్.ఎస్.ఎస్. విద్యార్థలకు, స్టాఫ్‍కు కొంత అవగాహన వుంది. తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల సహకారంతో ఆ యవతికి తక్షణమే వైద్యం ఏర్పాటు చేశాము. మూడు నెలలలో ఆమె పూర్తిగా రోగం నుంచి విముక్తి పొందింది. అయితే ఆమెకు తక్షణమే ఉపాధి కలిగించవలసిన పరిస్థితి ఏర్పడింది. మా రసాయన శాఖ అధ్యాపకులు దశరథరామయ్యగారు మద్రాసులో తన మిత్రులు నడిపే హస్టల్‌లో వార్డన్ పని ఇప్పించారు. పదవ తరగతి వరకు స్కూళ్లలో చదివే ధనికుల బిడ్డలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్ అది. మూడేళ్ల తర్వాత ఆమె తిరుపతిలో ఏదో స్కూల్లో అధ్యాపికగా చేరినట్లుంది. అక్కడే ప్రేమ వివాహం వర్ణాంతర వివాహం చేసుకొంది.

మంచి క్రమశిక్షణతో పెరిగిన ఆ యువతి కష్టాల నుంచి గట్టెక్కడానికి మా అధ్యాపక బృందం కూడా తన వంతు కర్తవ్యం నిర్వహించింది. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్.ఎస్.ఎస్. ఎట్లా దోహదం చేసిందో చెప్పడానికే ఇదంతా రాయవలసి వచ్చింది.

నేను మొత్తం నాలుగేళ్లు కాబోలు ఎన్.ఎస్.ఎస్. ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహించాను. నెల్లూరుకు అయిదారు మైళ్లల్లో బుజబుజ నెల్లూరు గ్రామంలో యనాది కాలనీని దత్తత తీసుకొని అక్కడ మా సేవలు అందించాము. మొదట ఆ కాలనీలో పదిరోజుల కేంపు నిర్వహించాము. అప్పుడు ప్రభుత్వం కాలనీవాసులకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు కట్టుకోడానికి గ్రాంటు మంజూరు చేసింది. ఆ ఊరికి అధ్యక్షుడిగా యానాది కాలనీలో నివాసం వుంటున్న వ్యక్తే ఎన్నికయ్యాడు. మా విద్యార్థులు బుజబుజ నెల్లురులో ట్రంక్ రోడ్డు సమీపంలోనే వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా కట్టిన చిన్న కల్యాణమండపంలో దిగారు. నేను కూడా వారితో పాటు వుంటూ, తింటూ పదిరోజులూ వుండేటట్లు ఏర్పాటు. హాస్టల్‌లో వంట చేసే యువకుణ్ణి వంటకు కుదుర్చుకున్నాము. కేంప్ జరిగినన్ని రోజులూ రోజూ కొందరు అధ్యాపకులు మాతో ఉండే ఏర్పాటు చేసుకొన్నాము. మా క్యాంపులో అరడజను మంది ఆడపిల్లలు కూడా పాల్గొన్నారు. ఐతే సాయంత్రం 6 గంటలకు వాళ్లకు టౌనుబస్సులో ఇళ్లకు పంపించేవాళ్లం.

మొదటి రోజే మా విద్యార్థులు కాలనీవాసుల గుడిసెలన్నీ గుడిసెల సొంతదారుల సహకారంతో విప్పిపెట్టారు. మరుసటి రోజు నుంచీ ఏమి చెయ్యాలనే సమస్య తల ఎత్తింది. ఆ కాలనీ మధ్య ఒక పెద్ద బావి త్రవ్వారుగాని నీళ్లు పడక నిరుపయోగంగా వుంది. పశువులు, మనుషులు చీకట్లో ఆ నీళ్లు లేని బావిలో పడిపోయారు కూడా. దాన్ని మా విద్యార్థులు బావి తవ్వినప్పుడు గుట్ట పడిన మట్టి బుట్టల్లో నింపి పూడ్చాలని సమకట్టారు. ఇప్పుడైదే ప్రొక్లెయనర్‌తో ఒక్కరోజులో పని పూర్తవుతంది. అవసరమైన పలుగులు, పారలు తట్టలు కొని తెచ్చుకొని పని మొదలు పెట్టాము. మట్టి పని, బండ పని అయినా మా విద్యార్థులు శ్రమకోర్చి పని చేశారు. అమ్మాయిలు కూడా పని చేయ్యడం వల్ల, అబ్బాయిలు పోటీ పడి పని చేశారు.

మాకు కేంపులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి రోజుకు 8 రూపాయలు చొప్పున విశ్వవిద్యాలయము మంజూరు చేసింది. అన్ని ఖర్చులు అందులోనే. నేను ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టాను. అకౌంట్ రాయగల మంచి విద్యార్థికి అకౌంట్ రాయడం, స్టోరు సామాన్లు జాగ్రత్త చెయ్యడం అప్పగించాను. ప్రతిరోజు సాయంత్రం ఏ విద్యార్థియినా అకౌంట్ బుక్ చూడవచ్చని అందరికి అందుబాటులో ఉంచాను. అట్లా చేయడం వల్ల, ఏదీ గోప్యంగా పెట్టకపోవడం వల్ల పిల్లల్లో ఆఫీసరు మీద నమ్మకం కలుగుతుందని నా అనుభవం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here