[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం తలుపు అంతరంగం తెలుసుకుందాం. [/box]
[dropcap]ఈ[/dropcap] ఇంటికి నేనొచ్చి వారం రోజులే అయింది. ఇక్కడ నాకింకా కొత్తగానే ఉంది. అతిథులకు హృదయ పూర్వకంగా స్వాగతాలు పలుకుతున్నా. అలాగే మర్యాదగా వీడ్కోలు పలుకుతున్నా. ప్రధాన ద్వారాన్ని కావడంతో ప్రతి ఒక్కరి చూపు నా మీదే. చూడగానే ‘అబ్బ! ఎంత బాగుందో. గణేశుడు, లక్ష్మీదేవి.. జీవకళ ఉట్టి పడ్తున్నట్లుగా చెక్కారు. పైన మామిడాకుల డిజైన్, అదుగో ఆ పూర్ణకుంభం ఎంత నిండుగా ఉందో’ అంటూ పదేపదే నావంకే చూడటం నాకెంతో గర్వ కారణంగా ఉంది. నా సంతోషాన్ని గుర్తించిందేమో నాకు అలంకరించిన ముద్దబంతి పూలదండ సుకుమారంగా కదిలి, నా సంతోషంలో పాలుపంచుకొంది. కొన్ని రోజుల పాటు వడ్రంగి నన్నెంతో నైపుణ్యంతో, శ్రద్ధగా తయారు చేశాడు. ఈ బొమ్మలు లేకపోతే నేను సామాన్య చెక్క తలుపునే అయ్యేదాన్ని. ఈ ఇంటి యజయాని శ్రీపతిగారు కరోనా కాలమని గృహప్రవేశం ఎలాంటి హడావిడి లేకుండా చేశారు. అయితే అన్నశాంతి చేయాలని కొంతమంది మిత్రుల్ని ఈ రోజు భోజనానికి పిలిచారు. అంతా భోజనం చేశారు. పిల్లలంతా ఆడుకుందామంటూ పిల్లల గది లోకి వెళితే, పెద్దవాళ్లంతా ముందు హాల్లో విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
“మీ ఇల్లు చాలా బాగుందోయ్! తలుపుల డిజైన్లు అన్నీ బాగున్నాయి. బలంగా కూడా ఉన్నాయి. తలుపులే కదా ఇంటికి రక్షణనిచ్చేవి, ఏకాంతాన్నిచ్చేవి.” అందొకామె.
అందుకు శ్రీపతిగారి భార్య శ్రీదేవి “థ్యాంక్యూ హారికా! నాదే ఎంపిక. కొన్ని మా పాత ఇంటి తలుపుల్ని రీడిజైన్ చేయించి స్టోర్ రూమ్‌కు, వంటగదికి, పిల్లల గదికి వాడాం” చెప్పింది. హారిక వెంటనే “తలుపుల్లో ఎన్ని రకాలో.. చెక్క తలుపులు, స్టీల్ తలుపులు, అల్యూమినియం తలుపులు, ప్లాస్టిక్ తలుపులు, అద్దాల తలుపులు.. ఈ రోజుల్లో అయితే పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లకు ఉండే తలుపులు మనిషి దగ్గరకు రాగానే వాటంతట అవే తెరుచుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరీ పెద్ద హోటళ్లలో అయితే ద్వారపాలకుడు వచ్చిన వారిని ఎంతో మర్యాదగా స్వాగతం పలుకుతూ తలుపు తెరుస్తాడు. కొన్ని చోట్ల తలుపులు ఎంత బలంగా ఉంటాయంటే మనకున్న శక్తినంతా ఒడ్డి వాటిని నెట్టవలసి వస్తుంది. ఇంకొన్ని చోట్ల స్వింగ్ డోర్లు ఉంటే, మరికొన్ని చోట్ల స్లైడింగ్ తలుపులుంటాయి. ఇక అహమ్మదాబాద్ పాత నగరంలో అయితే ప్రాచీన రాతికట్టడాలు, వాటికున్న రాతి తలుపులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి” అంది. అవన్నీ వినటం నాకెంతో ఆసక్తికరంగాను, సరదాగానూ ఉంది. మా జాతి గురించిన సంగతులు కదా మరి.
“ప్రాచీన కాలంలో మనిషి కొండ గుహల్లో నివసించిన రోజుల్లో కొండ రాళ్లే గుహలకు అడ్డంగా ఉంచేవారు. అంటే అవే తలుపులుగా వారికి రక్షణనిచ్చేవన్న మాట” అన్నాడు హారిక భర్త. “అవును ఆనంద్! నువ్వు గుహ అనగానే చిన్నప్పుడు చదువుకున్న ‘ఆలీబాబా నలభై దొంగలు’ కథ గుర్తొస్తోంది. అందులో దొంగలు ‘తెరుచుకో సెసెమ్’ అనగానే ద్వారం తెరుచుకోవడం.. ‘మూసుకో సెసెమ్’ అనగానే మూసుకోవడం.. అది ఆలీబాబా గమనించి, దొంగలు వెళ్లిపోయిన తర్వాత గుహ వద్దకు వెళ్లి, వారిలాగే ‘తెరుచుకో సెసెమ్’ అని, లోపలకు వెళ్లి అక్కడున్న బంగారు నాణేలను సంచుల్లో నింపి తెచ్చుకోవడం.. అప్పుడు అది చదువుతుంటే ఎంత థ్రిల్లింగ్‌గా ఉండేదో” అన్నాడు బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీపతి.
“నిజమే. చిన్నప్పుడు ఓ పొడుపు కథ కూడా చెప్పేవారు. ‘కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు’ అని, కంటి రెప్పలని జవాబు చెపితే ఎంత గొప్పగా ఉండేదో” అంది శ్రీదేవి. ఆ వెంటనే “మీరు తలుపులంటుంటే నాకు శనిసింగణాపూర్ గుర్తొస్తోంది. ఆ మధ్య షిరిడీ వెళ్లినప్పుడు దారిలో కనిపించింది. అక్కడ శని మహాత్మా ఆలయం ఉంది. అందువల్లే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందంటారు. ఆ ఊళ్లో ఏ ఇంటికీ తలుపులనేవే ఉండవు. అయినా అక్కడ దొంగతనాలు, దోపిడీలు జరగనే జరుగవు. శనిదేవుడే వారిని రక్షిస్తాడని అక్కడి ప్రజల విశ్వాసం. అంతేకాదు, ఎవరైనా దుర్బుద్ధితో దొంగతనానికి పాల్పడితే ఆ వ్యక్తి గ్రామ సరిహద్దులు దాటే లోపే మరణించడమో లేక పిచ్చివాడవటమో జరుగుతుందని గట్టిగా నమ్ముతారు. అక్కడ ఉన్నఓ బ్యాంకుకు కూడా తలుపులనేవే ఉండవు. ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుందట” అన్నాడు మరో ఆయన. ‘అవును కుమార్, మేం కూడా విన్నామ’ని కొందరంటే, ‘అవునా’ అంటూ ఆశ్చర్యపోయారు మరికొందరు. నేను కూడా ఆశ్చర్యపోతూ ‘ఔరా! అక్కడ మా వాళ్ల ఉనికే లేదా!’ అనుకున్నాను.
అంతలో ఆనంద్ అందుకుని, “అన్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరు పేటలో చెంగాలమ్మ తల్లి దేవాయలం ఉంది. ఆ గుడికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ గుడికి కూడా తలుపులు ఉండవు. చాలా ఏళ్లకిందట ఆ గుడికి తలుపులు పెట్టే ప్రయత్నాలు చేయబోతే, చెంగాలమ్మ తల్లి, ఊరి పెద్దకు కలలో కనిపించి, ఆలయానికి తలుపులు పెట్టవద్దని, భక్తులు ఏ సమయంలో అయినా వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని చెప్పిందట. దాంతో వారు ఆ ఆలోచన విరమించుకున్నారట” చెప్పాడు. ‘వింతగా ఉందే’ అనుకుంటుండగానే, “నేనూ ఓ సంగతి చెపుతాను, అసలు తలుపులమ్మ అని అమ్మవారే ఉంది తెలుసా? తుని దగ్గర ‘లోవ’ లో తలుపులమ్మ తల్లి దేవాలయం ఉంది. భక్తుల తలపులను నెరవేర్చే తల్లి కనుక ఆమెను తలపులమ్మ.. క్రమంగా తలుపులమ్మ అన్నారు” హారిక చెప్పింది.
“చిత్తూరు జిల్లాలో తలుపుల పేరుతో ఓ ఊరే ఉంది” అంది శ్రీదేవి. “మీరు దేవాలయాలు అంటున్నారు. ఈ కరోనా కాలంలో అన్ని దేవాలయాల తలుపులు మూసేశారు కదా. అసలు దీంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక రోజు అదీ కేవలం అయిదు గంటల సమయం మాత్రమే తెరుచుకునే నీరయ్ మాతా ఆలయం ఛత్తీస్‌గఢ్ లోని గరియాబండ్ జిల్లా దగ్గరలో ఉంది. చైత్ర నవరాత్రి రోజున తెల్లవారు జామున నాలుగు గంటలనుంచి ఉదయం తొమ్మిది గంటలవరకు మాత్రమే ఆ దేవాలయం తలుపులు తెరుస్తారు, ఆ తరువాత మూసివేస్తారు” చెప్పాడు మరొకాయన. “భలే విషయం చెప్పావు ప్రసాద్. భారత్‌లో ఇలాంటి విశేషాలెన్నో” అన్నాడు ఆనంద్. “అసలు పెద్ద పెద్ద క్షేత్రాలలో అలనాటి దేవాలయ ద్వారాలు ఎంత పెద్దగా, పటిష్టంగా ఉంటాయో. పెద్ద పెద్ద చెక్క, ఇనుప తలుపులు, వాటికి గంటలు, గుబ్బల వంటి డిజైన్లు.. ఎంత పనితనం, అలాగే కోటల తలుపులు కూడా” తాను చూసిన కోటలు, ఆలయాలు గుర్తు చేసుకుంటూ అంది ప్రసాద్ భార్య అంజలి. “అవునవును” అన్నారందరూ. నేను ఆ తలుపుల్ని ఊహించుకుంటూ మా జాతిలో అంత గొప్పవాళ్లున్నారన్నమాట అనుకున్నాను.
ఇంతలో శ్రీపతి అందుకుని వేమనగారు కూడా ఓ పద్యంలో తలుపులను ప్రస్తావిస్తూ.
‘ద్వారబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటి కొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ…’
అన్నాడంటూ పద్యం వినిపించాడు.
“చాలా బాగా చెప్పాడు వేమన. తలుపులు రక్షణకు, ఏకాంతానికే గాదు, మనిషిని బందీని చేయడానికి కూడా అవే సాధనమవుతాయి. ఇప్పుడయితే సెన్సర్ ఏర్పాటుతో తలుపులు మనిషి రాగానే తెరుచుకునేలా చేస్తున్నా, ఇతిహాసాల్లో దేవుడి లీలగా తలుపులు తెరుచుకోవడం ఉంది. శ్రీకృష్ణుడు పుట్టగానే పెద్ద వర్షం రావడం, కాపలావారు మత్తులో జోగడం, చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం, వసుదేవుడికి వేసిన సంకెళ్లు తెగిపడటం, కర్తవ్యం స్ఫురించి వెంటనే చిన్నికృష్ణుడిని తీసుకొని యమునానది దాటి, యశోదమ్మ వద్దకు చేర్చటం జరిగింది” అన్నాడు కుమార్. నేను ఆ దృశ్యాన్ని ఊహించుకుని అందులో మా తలుపుల పాత్ర కూడా ఉండడం గుర్తుచేసుకుని పులకించిపోయాను.
“ఆనంద్! మరి మీరెప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటారు?” అడిగాడు శ్రీపతి. “అదృష్టం తలుపు తట్టాలిగా” నవ్వుతూ బదులిచ్చాడు ఆనంద్. “బాగుంది. మళ్లీ తలుపు దగ్గరకే వచ్చాం” అంది హారిక. “అబ్బో! కబుర్లలో పడి టైమ్ గమనించనే లేదు. మేం బయల్దేరతాం’ అన్నాడు కుమార్. “ఆగండి, కాఫీ తాగి వెళ్తురుగానీ” అంటూ లేచి వంటింటి వైపు వెళ్లింది శ్రీదేవి.
“అవునూ.. నిన్న మన బాసెందుకు ముఖం మాడ్చుకున్నాడు?” అన్నాడు ఆనంద్. “ఏం ఉంటుంది.. ఇంటింటి రామాయణం.. తమలపాకుతో తానొకటంటే తలుపుచెక్కతో తానొకటనే రకంట మేడమ్.. ఆ మధ్య అటెండర్ వెంకటేశ్ అంటుంటే విన్నాను” అన్నాడు శ్రీపతి. “అయితే తలుపు చాటుగా ఉండి అన్నీ వింటాడా ఏమిటి ఈ వెంకటేశ్” అన్నాడు కుమార్. అది విని అంతా నవ్వారు. ‘అన్నిటా మేమే ఉన్నట్టున్నామే’ అనుకున్నాను నేను.
అంతలో శ్రీదేవి వచ్చి అందరికీ కాఫీలు అందిస్తూ “ఏంటి అంతలా నవ్వుతున్నారు?” అడిగింది. హారిక టూకీగా చెప్పింది. అందుకు శ్రీదేవి “అటెండర్ తలుపు చాటు నెందుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఆఫీసర్ గది తలుపు వద్దే ఆగి, లోపలికి రావచ్చా అని అడిగి వెళ్లేది మీరు. కానీ అటెండర్ అన్ని వేళలా ఏ ఆటంకం లేకుండా ఆఫీసర్ వద్దకు వెళ్లగలడు. ఆఫీసర్ గారి భోగట్టా అతడికి కాక ఇంకెవరికి తెలుస్తుంది” అంది. “ఆమాట నిజమే” అన్నాడు ఆనంద్. కాఫీ తాగి అంతా “ఇక వస్తామోయ్!” అంటూ బయల్దేరారు.
పిల్లలుకూడా ఆటలు ముగించి పెద్దలను అనుసరించారు. శ్రీపతి జంట వారికి వీడ్కోలు చెప్పింది. నేనూ వీడ్కోలు పలికాను కానీ వారికర్ధం కాదుగా. సందడంతా సద్దుమణగడంతో నిట్టూర్చాను.
అంతలో అతిథుల గది తలుపు ‘ఓయ్’ అంటూ పలకరించింది. ఏమిటన్నాను. “ఈ మనుషులు ఇన్ని కబుర్లు చెపుతారా? వాళ్లకు మానవత్వమే ఉండదు. నువ్వు ప్రధాన ద్వారానివే అయినా నీకు ఇంకా కొత్త. నేను కొత్త ముస్తాబు చేసిన పాత తలుపును కదా. అందుకే వీళ్ల సంగతి నాకు బాగా తెలుసు” అంది. “అదేమిటో నాకూ చెప్పు” అన్నాను కుతూహలంగా. “వాళ్లు తలుపు తట్టే పద్ధతిని బట్టి వాళ్ల తీరు అర్థం చేసుకోవచ్చు. మెల్లిగా తలుపు తడితే లోపలివారిని ఉలిక్కిపడేలా చేయని సంస్కారం గలవారుగా అర్థం చేసుకోవచ్చు. కోపంగానో, హడావుడిగానో ఉంటే తలుపులు దబదబ బాదటం, ఫెడీమని వేయటం, తన్నటం చేస్తుంటారు. మనకెంత బాధగా, అవమానంగా ఉంటుందో ఆలోచించరు. టీవీలో వచ్చే సినిమాల్లో చూశాను. దొంగలయితే తలుపుల్ని పగలగొట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడతారు. అయితే తలుపు చాటునే దాక్కొని, లోపలికి వచ్చే విలన్ తలపై ఒక్కటిచ్చినప్పుడు మాత్రం భలేభలే అని సంతోషిస్తామనుకో. ఇంక హోలీ లాంటి పండగలొస్తే పల్లెల్లో పాతబడి విరిగిన తలుపుల్ని ఏకంగా కామదహనం మంటల్లో పడేస్తారుట. వాడుకున్నంత కాలం వాడుకుని మంటల్లో పడేస్తే ఆ తలుపు మనసు మండదూ? తలుపులు మూసి తప్పుడు పనులు చేస్తూ ఉంటే మనం మౌన సాక్షుల్లా ఉండిపోవాల్సిందే” అంది అతిథుల గది తలుపు.
“నువ్వు నాకింకా అనుభవంలోకి రాని విషయాలెన్నో చెప్పావు. రక్షణను, ఏకాంతాన్ని కల్పించే మనలను బాధించడం సబబు కాదు. మనిషికి అపారమైన మేధాశక్తి, విచక్షణా జ్ఞానం ఉండి కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడో” అన్నాను నేను. అందుకు అతిథుల గది తలుపు “మనిషి బుద్ధి అంతే. సరేలే కానీ నేను గతంలో టీవీలో చూసిన మన జాతి ప్రస్తావన ఉన్న కథలు చెపుతాను వింటావా?” అడిగింది. “కథలా.. అందులోనూ మన వాళ్ల పాత్ర కూడా ఉన్నవంటే ఎందుకు విననూ.. త్వరగా చెప్పు” అన్నాను నేను.
“ముందుగా కాళిదాసు కథ చెపుతాను. పూర్వం కాళిదాసు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతడు వఠ్ఠి మూర్ఖుడు. ఓ రోజు అడవిలో ఓ చెట్టెక్కి తను కూర్చున్న కొమ్మనే నరకడం మొదలు పెట్టాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ రాజ్య మంత్రి అది చూసి కూర్చున్న కొమ్మ నరుక్కోవడం ప్రమాదమని కాళిదాసుని హెచ్చరించాడు. మూర్ఖుడు కదా ఆ మాట పెడచెవిని పెట్టాడు. మంత్రికి వెంటనే తన కొడుకును, చదువు తక్కువన్న నెపంతో పెళ్లికి అంగీకరించని రాజకుమార్తె గుర్తుకొచ్చింది. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనుకుంటూ ఈ మూర్ఖుడితోనే రాజకుమారి పెళ్లి జరిగేందుకు కుట్ర పన్నాడు. రాజుగారితో కాళిదాసు మూర్ఖుడుగా కనిపిస్తాడేగానీ వాస్తవానికి పండితుడని మాయ మాటలు చెప్పి కాళిదాసుతో రాజకుమారి వివాహం జరిగేలా చేస్తాడు. చివరకు కాళిదాసుకు చదువు రాదని రాజకుమారికి తెలిసిపోయింది. వెంటనే అతడికి ‘విద్య’ అనే మాట నేర్పించి రాత్రివేళ కాళికాదేవి ఆలయం విడిచి ఊళ్లోకి వెళ్తుందని, కాళిదాసును గుడిలోకి వెళ్లి తలుపులు మూసివేసుకొని లోపలే ఉండమని, కాళికాదేవి వస్తే, తలుపులు తీయవద్దని, విద్య, విద్య అనమని చెప్పి పంపుతుంది. కాళిదాసు అలాగే చేస్తాడు. కాళిదాసు తలుపులు తీయక పోవడంతో, తెల్లవారిపోతున్నదని, జనం వచ్చేస్తారని, కాళికాదేవి కాళిదాసును తలుపు కొద్దిగా తెరిచి నాలిక బయట పెట్టమంటుంది. కాళిదాసు అలా చేయగానే కాళికాదేవి అతడి నాలికపై బీజాక్షరాలు రాస్తుంది. ఆ ప్రభావంతో కాళిదాసు వెంటనే అద్భుతమైన సంస్కృత భాషలో కాళీస్తవం చేస్తాడు. అలా కాళిదాసు గొప్ప పండితుడవుతాడు” చెప్పింది. నాకు భలే నచ్చింది.. మొత్తానికి తలుపులు మూయడం వల్లే కాళీమాత సత్వరంగా అతడి నాలికపై బీజాక్షరాలు రాయడం, అతడు పండితుడు కావడం.. “ఆహా పొగడతరమా మన జాతి ఘనత” అన్నాను ఆనందావేశాలతో.
“నీకు మరో కథ చెపుతా విను.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన ఆలయం. ప్రాచీన కాలంలో బావాజీ అనే రామభక్తుడు యాత్రలు చేస్తూ తిరుమల చేరుకున్నాడు. స్వామివారిని ఎంత సేపు చూసినా అతడికి తనివితీరలేదు. తిరుమలలోనే ఉండిపోయి ప్రతిరోజు స్వామిని దర్శించుకుంటూ గంటల తరబడి స్వామి సన్నిధిలో నిలబడి ఉండేవాడు. ఓ అపరిచిత వ్యక్తి గుడిలో నిరంతరం ఉండిపోవడం అర్చకులకు నచ్చక, అతడిని అనుమానించి బయటకు గెంటేశారు. దాంతో బావాజీ వేంకటేశ్వరుడికే మొర పెట్టుకున్నాడు. భక్త వరదుడైన వేంకటేశ్వరుడు తానే అతడి వద్దకు వస్తానని అభయమివ్వడమే కాదు, రాత్రి పవళింపు సేవ అయ్యాక, అంతా వెళ్లిపోయాక, స్వామి, బావాజీ మఠానికి వచ్చి, ఆయనతో పాచికలు ఆడుతూ ఎంతో సమయం గడపసాగాడు. బావాజీ ఆనందానికి అంతేలేదు. ఓరోజు ఆటలో లీనమై తెల్లవారిన సంగతి గమనించడం ఆలస్యమైంది. దాంతో స్వామి హడావుడిగా ఆలయం లోకి వెళ్లారు. ఆ వెళ్లటంలో ఆయన కంఠాభరణం ఒకటి మఠంలో పడిపోయింది. అర్చకులు స్వామి మెడలో ఆభరణం లేకపోవడం గమనించారు. అదే సమయంలో ఆభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ అక్కడికి చేరుకున్నాడు. అయితే అర్చకులు బావాజీ చెప్పిన మాటలను నమ్మలేదు. చివరకు అతడిని కారాగారంలో పెట్టి అక్కడ బండెడు చెరుకు పడేసి, స్వామి అతడి వద్దకు వచ్చేది నిజమైతే ఆ చెరుకు గడలన్నీ తెల్లవారే లోపు పిప్పి అయిపోవాలని తలుపులు మూసి వెళ్లారు. అర్ధరాత్రి కారాగారం నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. ఏమిటా అని చూసిన సైనికులకు ఓ ఏనుగు చెరుకు గడలను పిప్పి చేయడం కనిపించింది. కారాగారం తలుపులు వేసే ఉన్నాయి, కావలివారు అక్కడే ఉన్నారు. ఏనుగు లోపలకు ఎలా ప్రవేశించిందీ వారికి అర్థం కాలేదు. బావాజీ భక్తి విశేషాన్ని అర్థం చేసుకొని బావాజీని ఆలయ అధికారిగా నియమించారు. అప్పట్నుంచి బావాజీకి ‘హాథీరాం బావాజీ’ అని పేరొచ్చింది” చెప్పింది. “భలేఉంది. మనజాతిని అడ్డం పెట్టుకుని ఏదో సాధిద్దామనుకున్న వారి ఆటలు సాగలేదన్నమాట” నవ్వుతూ అన్నాను నేను. అతిథి గది తలుపు కూడా నవ్వేసింది. మేం కథల్లో పడి గుర్తించలేదు.. చీకటి పడింది.
శ్రీపతి, శ్రీదేవి ఎదురెదురుగానే ఉన్నారు కానీ వారివారి మొబైల్స్‌లో లీనమై ఉన్నారు. పిల్లలు టీవీ చూస్తున్నారు.
“ఇదుగో ఈ ఆణిముత్యం విను.. ‘ఒక తలుపు మూసుకుపోతే, మరోతలుపు ఎక్కడో తెరుచుకునే ఉంటుంది. నీ ప్రయత్నాన్ని వదలకు.’ బాగుంది కదూ” అంది శ్రీదేవి. “నాకూ మరో ఆణిముత్యం వచ్చింది.. ‘మూసి ఉన్న తలుపువైపు చూస్తూ కాలం గడిపేస్తే, తెరిచి ఉన్న తలుపులు ఎప్పటికీ కనిపించవు’ చదివాడు శ్రీపతి.
అంతలో ఓ పాట.
..తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక, అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది
॥ నేనొక ప్రేమ పిపాసిని.. ॥
‘అంతా మమ్మల్నే జపిస్తున్నారు’ అనుకున్నాను నేను. నా మాట వినేట్లయితే మనుషులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. అది.. ‘మంచికి తలుపులు తెరవండి, చెడుకు తలుపులు మూయండి’ అని. కానీ వారి భాషనే వారు అర్థం చేసుకోరు, ఇక నా భాషేం అర్థమవుతుంది అనుకుంటుంటే శ్రీదేవి లేచి “భోజనానికి లేవండిక” అంటూ వచ్చి నన్ను మూసేసి లోపలికి నడిచింది. నాకూ అలసటగా అనిపించి ఆలోచనను మూసేసే ప్రయత్నం చేస్తున్నా.