[dropcap]5[/dropcap]-2-2022 తేదీన విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన సుప్రసిద్ధ రచయిత భమిడిపాటి రామగోపాలం (భరాగో) గారి 90వ జయంతి పూర్వ సంధ్య కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో జరిగినది.
వసంత పంచమి పవిత్ర దినాన, ఆచార్య కోలవెన్ను పాండురంగ విఠల్ మూర్తి గారి సరస్వతీ స్తుతి, శ్రీమతి భమిడిపాటి కళ్యాణిగౌరి గారి సరస్వతీవందనతో ప్రారంభమైన సభలో ఆచార్య మలయవాసిని గారు మాట్లాడుతూ, భరాగో గారు తమ బాణీతో తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందారని చెబుతూ వారు విశాఖ సాహితికి చేసిన కృషిని కొనియాడారు.
తమ ఆత్మీయ భాషణాలలో భరాగో గారి కుమారుడు శ్రీ భమిడిపాటి భాస్కరం, కుమార్తె శ్రీమతి నాగులకొండ కనకలత కాకుండా వారితో అత్యంత సన్నిహిత సంబంధమున్న డా. చాగంటి తులసి, శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ ద్వారం దుర్గాప్రసాద రావు, శ్రీ వి.వి.సత్యప్రసాద్, శ్రీ సుస్మితా రమణమూర్తి, శ్రీ ఎన్.ఎస్.మూర్తి, శ్రీ వున్నవ హరగోపాల్ (మానస), శ్రీ జయంతి ప్రకాశ శర్మ ప్రభృతులు భరాగో గారితో తమకు కల ఆత్మీయనుబంధాన్నితెలియజేసారు.
సభ చివరలో, ఆచార్య మలయవాసిని గారు, ఈ సభలో ఆత్మీయ భాషణాలలో చర్చించిన విషయాలు అక్షరీకరించి పుస్తకరూపంలో విశాఖ సాహితి ప్రచురణగా వెలువరించితే అది భారాగోగారికి సరియైన నివాళిగా నిలుస్తుందని పేర్కొన్నారు
దేశ విదేశాలనుంచి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ అంతర్జాల సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం ప్రారంభంలో స్వాగతవచనాలు పలికి సభాంతంలో వందన సమర్పణ చేసారు.