మధురమైన బాధ – గురుదత్ సినిమా 8 – సాంజ్ ఔర్ సవేరా

0
9

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నటించిన ‘సాంజ్ ఔర్ సవేరా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]‘సాం[/dropcap]జ్ ఔర్ సవేరా’ గురుదత్ ఆఖరి సినిమా అని చెబుతారు. కాని అబ్రర్ అల్వీ TEN YEARS WITH GURUDUTT అన్న పుస్తకంలో గురుదత్ సినిమాల గురించి ఇచ్చిన సమాచారం ఆధారంగా ‘సుహాగన్’ వారి ఆఖరి సినిమా అని తెలుస్తుంది. ‘సుహాగన్’ సినిమా కోసం పని చేసిన వారు కూడా ఆ సినిమా ఎడిటింగ్ సమయంలో గురుదత్ మరణ వార్త వారికి చేరిందని ఒక వ్యాసంలో చెప్పడం జరిగింది. అలాగే ‘సుహాగన్’ సినిమాకు ముందు గురుదత్‌కి ఆ సినిమా అంకితం ఇస్తున్నట్లు దర్శకులు చెప్పుకున్నారు. కాబట్టి నెట్లో వచ్చిన సమాచారాన్ని పక్కన పెట్టి ‘సాంజ్ ఔర్ సవేరా’ గురుదత్ నటించిన ఆఖరి చిత్రం కాదని, దీని తరువాత వచ్చిన ‘సుహగన్’ వారి ఆఖరి సినిమా అని చెప్పవలసి వస్తుంది.

అత్యుత్తమ కళ్ళాఖండాలను సృష్టించిన గురుదత్, తన కళారూపాలకు ఆదరణ లేదని అర్థం చేసుకుని ఒక మామూలు నటుడుగా మిగిలిపోయిన క్రమంలో నటించిన సినిమా ‘సాంజ్ ఔర్ సవేరా’. అసలు నిజం చెప్పాలంటే నటుడిగా అతను అత్యుత్తమ నటనను చూపించింది అతని జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలలోనే. మిగతా సినిమాలన్నీ ఒక మూసగా ఉంటాయి. ‘కాగజ్ కే ఫూల్’ సినిమా తరువాత గురుదత్ లోపలి కళాకారుడు గతించాడు. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలలో గురుదత్ ఆత్మ కనిపించదు.

‘సాంజ్ ఔర్ సవేరా’లో గురుదత్ ఒక డాక్టరుగా కనిపిస్తారు. వీరి సినిమాలన్నింటిని చూస్తున్న క్రమంలో గమనిస్తే వృత్తి పరంగా విజయం సాధించిన విద్యాధికుడిగా ఆయన నటించిన ఒకే ఒక సినిమా ‘సాంజ్ ఔర్ సవేరా’. ఇందులో డా. శంకర్ చౌదరి అనే ఒక డాక్టర్ పాత్రలో ఆయన కనిపిస్తారు.

గౌరి తల్లీ తండ్రిని కోల్పోయిన ఒక అనాథ. ఆమెను తన ఇంటికి తీసుకుని వస్తాడు ఆమె తండ్రి స్నేహితుడు మధుసూదన్. ఆయన కూతురు మాయ. శంకర్ తల్లి అతని పెళ్ళి మాయతో నిర్ణయిస్తుంది. కాని మాయ రమేశ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. మాయని అతని తల్లి రుక్మిణి కూడా అంతకు ముందు చూడదు. కేవలం మధుసూదన్ కున్న మంచి పేరు, ఆ కుటుంబానికున్న సామాజిక గుర్తింపు నచ్చి ఈ వివాహం నిర్ణయిస్తుంది. శంకర్ కూడా అమ్మాయిని చూడకుండానే ఈ వివాహానికి ఒప్పుకుంటాడు. మాయ తన ప్రేమ సంగతి ఇంట్లో చెప్పకుండా పెళ్ళిపీటలు ఎక్కుతుంది. ఆమె పెళ్ళి శంకర్‌తో జరుగుతున్నప్పుడు ఆ మంటపంలోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమెని ఆ పెళ్ళి ముసుగుతోనే పరిచర్యల కోసం ఇంటిలోకి తీసుకువెళతారు బంధువులు. మరుసటి రోజు ఆమె రమేశ్‌తో పారిపోతుంది. తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోతున్నానని ఒక ఉత్తరం రాసి పెడుతుంది. కూతురు చేసిన మోసం తెలిసి మధుసూదన్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు కాని ఇంతలోనే అతనికి గుండె నొప్పి వస్తుంది. పరువు కోసం ప్రాణం ఇచ్చే అతన్ని కాపాడుకోవాలని అతని మేనల్లుడు ప్రకాశ్ గౌరి సహయం కోరతాడు. ఆమెను మాయ స్థానంలో అత్తగారింటికి వెళ్ళమని అడుగుతాడు. పెళ్ళి కొడుకు అమ్మాయి మొహం చూడలేదు కాబట్టి గౌరి మాయ స్థానంలో వెళితే జరిగిన సంఘటన మరుగున పడిపోతుందని ఆ విధంగా మధుసూదన్‌ని దక్కించుకోవచ్చని చెబుతాడు ప్రకాశ్.

ప్రకాశ్ మాట విని తండ్రి స్థానంలో ఉన్న మధుసూదన్ కోసం గౌరి పెళ్ళికూతురి బట్టలలో పల్లకి ఎక్కుతుంది. మొదటి రాత్రి తాను ఉపవాస దీక్షలో ఉన్నానని భర్తకు దూరంగా ఉంటుంది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య మొహాన్ని చూసిన శంకర్ ఆమెతో ప్రేమలో పడతాడు. గౌరి శంకర్‌కు దగ్గర కాలేకపోతుంది. మాయతో వివాహం జరిగిన వ్యక్తితో తాను కలిసి ఉండడం పాపం అని ఆమె భావిస్తుంది.

ఈ సమయంలోనే మధుసూదన్ ప్రకాశ్‌ను గౌరి అత్తగారింటికి పంపిస్తాడు. ప్రకాశ్ దంపతులిద్దరినీ బనారస్ తీసుకువస్తాడు. గౌరి స్వభావం తెలిసి మాయ బదులుగా గౌరీ అత్తవారింటికి వెళ్ళిందని ఆరోగ్యం బాగయిన తరువాత తెలుసుకున్న మధుసూదన్ గౌరి కాపురం సజావుగా సాగుతుందని అనుకోలేకపోతాడు. అప్పటికే మాయ మరణించిందనే వార్త వారిని చేరుతుంది. తాను ప్రేమించిన రమేశ్ ఒక మోసగాడు అని తెలిసి మాయ అతన్ని హతమార్చి తాను మరణించాలని ప్రయత్నించి ఆక్సిడెంట్ చేస్తుంది. ఆమె మరణించిందని కబురు ఇంటికి చేరుతుంది. తన దగ్గరకు వచ్చిన గౌరి, శంకర్ లను చూసిన మధుసూదన్ ఆ దంపతుల మధ్య ఉన్న దూరం అర్ధం చేసుకుంటాడు. గౌరి శంకర్ లకు ఏదో సాంప్రదాయం పేరుతో మరో సారి దేవుని ఎదుట వివాహం జరిపిస్తాడు మధుసూదన్. వివాహ మంటపంలో పెళ్ళి కూతురు స్పృహ తప్పి పడిపోయిన సందర్భంలో ఆ వివాహం సంపూర్ణంగా జరగలేదని గౌరి భావిస్తూ ఉందని శంకర్ని నమ్మించి మరో సారి అ వివాహ కార్యక్రమాన్ని జరిపి గౌరి మనసులోని భయాన్ని తొలగిస్తాడు మధుసూదన్. ఈ వివాహంతో గౌరి తాను ఇప్పుడు శంకర్ భార్యనని నమ్ముతుంది. అతనితో జీవితానికి సిద్ధపడుతుంది.

కొన్నాళ్ళు గౌరీ ప్రకాశ్‌ల కాపురం సజావుగా సాగుతుంది. గౌరి గర్భవతి అని తెలుస్తుంది. ఆ సమయంలో మాయ బ్రతికే ఉందని తెలుస్తుంది. గౌరి కాపురంలో కొందరు బంధువులు విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తారు. చివరికి కొన్ని మలుపుల తరువాత దంపతుల మధ్య అపార్థాలు తొలిగి వారు ఒకటవ్వడం సినిమా ముగింపు.

‘సాంజ్ ఔర్ సవేరా’ సినిమాకు దర్శకత్వం వహించింది హృషికేశ్ ముఖర్జీ. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన గొప్ప దర్శకులలో హృషికేష్ ముఖర్జీ ఒకరు. భారతీయ సినిమాలో మధ్యతరగతికి చాలా ప్రాముఖ్యత ఇచ్చిన దర్శకులు ఆయన. 2001లో ఎన్.టీ.అర్ జాతీయ పురస్కారం, పద్మవిభూషణ్ పురస్కారాలతో పాటు ఎన్నో సార్లు ఫిలింఫేర్ పురస్కారాన్ని  అందుకున్నారు ఈయన. బిమల్ రాయ్ సహాయకులలో ఒకరిగా పని చేసిన హృషికేష్ భారతీయ కమర్షియల్ సినిమాకు, పారెలెల్ సినిమాకు మధ్య వారధిగా నిలిచిన వారిలో ఒకరు. గురుదత్‌ని వీరు ఈ ఒక్క సినిమాలోనే డైరెక్ట్ చేసారు. గురుదత్ చివర్లో చేసిన కొన్ని సినిమాలతో ఈ సినిమాను పోలిస్తే ఆయన రొమాంటిక్‌గా కనిపించిన మరో సినిమా ఇది. మీనా కుమారి ట్రాజెడీ క్వీన్‌గా యాభైలలోనే పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో మెలోడ్రామాని బాగానే పండించగలిగారు. హృషికేశ్ ముఖర్జీ శైలి ఈ సినిమాలో పూర్తిగా కనిపించదు. ఆ తరువాతి సినిమాలలోనే ఆయనలో ఒక స్పష్టమైన శైలిని మనం గమనిస్తాం. ఇందులో మెలోడ్రామాకే పెద్ద పీట వేసారు ఆయన. అప్పట్లో దక్షిణ భారతీయ సినిమాలలోని మెలోడ్రామా హిందీ సినిమాలలోకి చొచ్చుకు వచ్చింది. ఈ సినిమా కూడా దక్షిణాది కథల ప్రభావంతో తయారయిందని అనిపించక మానదు.

‘సాంజ్ ఔర్ సవేరా’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించింది ద్రువ చటర్జీ. శంకర్ జైకిషన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలుంటాయి. ముహమ్మద్ రఫీ, లతా, ఆశా, సుమన్ కళ్యాణ్‌పూర్ గీతాలను గానం చేసారు. హస్రత్ జైపురి రాసిన ఈ పాటలు ప్రస్తుతం వినిపించట్లేదు కాని అప్పట్లో శంకర్ జైకిషన్ లకి మంచి పేరును తీసుకువచ్చాయి. ఈ పాటల్లో సాహిత్యం బావుంటుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌ను చాలా బాగా రాసారు హస్రత్ జైపురి.

‘సాంజ్ ఔర్ సవేరా’ సినిమాలో ప్రత్యేకంగా మెహమూద్‌ని ప్రస్తవించుకోవాలి. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న ఆయనకు ఈ సినిమాలో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్ర లబించింది. మధుసూదన్ మేనల్లుడిగా, గౌరిని ప్రేమించే అన్నగా ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండి సినిమాను నడిపిస్తుంది. అప్పటికి ఆయనింకా కామెడీ నటుడిగా స్థిరపడలేదు. మెహమూద్‌ని కామెడీ నటుడిగానే చూసిన సినీ ప్రేక్షకులకు ఇందులో ఆయన నటించిన ప్రకాశ్ పాత్రలో కొత్త మెహమూద్ కనిపిస్తారు.

గురుదత్ నటించిన సినిమాలలో పెద్దగా ప్రాముఖ్యత సంపాదించికోలేని సాధారణ సినిమా ‘సాంజ్ ఔర్ సవేరా’. అయినా గురుదత్ సినిమాలలో ఈ సినిమాకు ఒక విశిష్టత ఉంది. వారిని విషాదానికి చాలా దూరంగా ఉంచారు దర్శకులు. గురుదత్ తన కెరీర్‌లో మొదట చేసిన రొమాంటిక్ పాత్రల ఇమేజ్ తోనే శంకర్ పాత్రను కూడా మలచడం జరిగింది. అయితే డాక్టర్‌గా ఆయనను సొఫెస్టికేటెడ్‌గా చూపించే ప్రయత్నం చేసారు హృషికేశ్ ముఖర్జీ. గురుదత్ సినిమాలన్నిటిలో భగ్న ప్రేమికుడిగా, కవిగా, సంపాదన లేని వ్యక్తిగా, అమాయకుడిగా, పల్లెటూరి వాడిగా కనిపిస్తారు. ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో మాత్రం సినీ దర్శకునిగా కొంత గాంభీర్యాన్ని చూపినా, ‘సాంజ్ ఔర్ సవేరా’ లో చదువుకున్న ఒక ప్రొఫెషనల్ డాక్టర్‌గా డిగ్నిఫైడ్‌గా కనిపిస్తారు అయన. గురుదత్ చేసిన మిగతా పాత్రలన్నిటిలో ఆయన పరిస్థితులకు బలి అయిపోయిన ఒక యువకునిగా కనిపిస్తారు. కాని ఇందులో భార్య ప్రేమ కోసం తాపత్రయపడే ప్రేమికుడిగా, భార్య దూరం అయి బాధపడే యువకునిగా కనిపిస్తూనే ఎక్కడా విక్టింలా మాత్రం కనిపించారు. హృషికేశ్ ముఖర్జీ చాలా జాగ్రత్తగా అయనకి ఏర్పడిన ఇమేజ్ నుండి దూరంగా ఆయనను తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. మిగతా సినిమాలలో ప్రేమ కోసం, ఆరాధన కోసం, తపించిపోయే ఒంటరివానిగా గురుదత్ కనిపిస్తే ఈ ఒక్క సినిమాలో మాత్రం కొంత గంభీరమైన వ్యక్తిత్వంతో ప్రేమను పంచే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ సినిమాలో గురుదత్‌ని భిన్నంగా చూపిస్తూనే, ఆ భిన్నత్వం వారి పాత్రను సంపూర్ణంగా ప్రభావితం చేస్తూ వారి మిగతా పాత్రలకు పూర్తి కాంట్రాస్ట్‌గా ఉండకుండా, జాగ్రత్త పడ్డారు దర్శకులు. జాగ్రత్తగా వారి బాడీ లాంగ్వేజీని కొంత మార్చే ప్రయత్నం చేస్తూ దానితో శంకర్ వ్యక్తిత్వంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని చూపించే ప్రయత్నం చేసారు ముఖర్జీ.

ఇక్కడ ప్రతి సారి హృషికేశ్ ముఖర్జీ గారి ప్రతిభనే ప్రస్తావించడానికి కారణం, అప్పటికే గురుదత్ లోని దర్శకుడు మరణించాడు. అతను దర్శకుల చేతిలో నటించే కీలుబొమ్మగా మాత్రమే మిగిలారు. అలాంటి సమయంలో గురుదత్ పూర్వపు ఇమేజిని మార్చి కొంత ఆత్మవిశ్వాసపు ఛాయలున్న ఒక ప్రొఫెషనల్‌ని ఈ చిత్రంలోని పాత్ర ద్వారా హృషికేశ్ ముఖర్జీ చూపించే ప్రయత్నం చేసారు. నిశితంగా గమనించి, గురుదత్ ఇతర సినిమా పాత్రలను కూడా స్టడీ చేస్తే ఈ తేడా స్పష్టమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here