అవధానం ఆంధ్రుల సొత్తు-8

1
5

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

వివిధ రకాల అవధానాలు:

[dropcap]అ[/dropcap]ష్టావధాన, శతావధానాలే గాక పలు రకాలైన ఇతర అవధానాలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటి వివరాలలోకి వెళితే…

వేదావధానం:

వేదం నేర్చుకొన్న పండితులను అవధానులని పిలుస్తారు. కొందరికి అది పేరులో భాగమైపోయింది, దివాకర్ల వెంకటావధాని వంటి పేర్లలో. గతంలో చిలుకూరి వీరభద్రశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు వేదావధానాన్ని, నేత్రావధానాన్ని నిర్వహించేవారు. వేదంలోని పనసలను విలోమంగా, అనులోమంగా ఫలాన అక్షరం అని గాని, ఆ అక్షరం ఎన్ని సార్లు మళ్లీ మళ్లీ వచ్చిందని గాని అడిగితే చెప్పాలి. ఫలాన వేద భాగంలో అక్షరాల సంఖ్య ఎంత? అని అడగవచ్చు. లేదా ఈ మండలంలో ఈ సూక్తంలో ఫలాన రుక్కు చెప్పండి అని ప్రశ్నించవచ్చు. అప్పుడు ఘనాపాఠీలైన వారు చటుక్కున చెప్పేవారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (1891-1961) రాజమండ్రి వాసులు. వీరిది పండిత వంశము. 1921లో ప్రబుద్ధాంధ్ర మాసపత్రిక వీరు ప్రారంభించి 9 సంవత్సరాలు నడిపారు. రవీంద్రభారతిలో సుబ్రహ్మణ్యశాస్త్రి వేదావధానం ప్రదర్శించారు.

నేత్రావధానం:

చిత్తాన్ని ఏకాగ్రం ఉంచడం – అని ఆలంకారికుడైన వామనుడు నిర్వచించాడు. కొప్పరపు సోదర కవులు తిరుపతి వేంకట కవులతో ఏర్పడిన వివాదంలో ఒక విసురు విసిరారు:

“నేత్రావధానంబు నేర్పు చూపెదరేని

అద్దాని మించి చేయంగలేమె?” అన్నారు.

పిశుపాటి చిదంబరశాస్త్రి పిఠాపురం రాజాస్థాన సందర్శన సమయంలో –

“నేత్రావధానంబు నెరవేరిచితినేని

చక్షుఃశ్రవుండైన జంకవలయు” అని గంభీరంగా పలికారు.

కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు నేత్రావధాన ప్రక్రియను అవలీలగా నేర్చుకుని ప్రేమ పాఠాలు మొదలెడుతున్నారు. ‘కన్ను కొట్టడం’ అనే సంజ్ఞ లోకంలో అలవాటులో వుంది. ఈ నేత్రావధాన ప్రక్రియను ఆధునిక కాలంలో విజయనగరంలో మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రధానాచార్యులు అయలసోమయాజుల గోపాలరావు వివిధ ప్రాంతాలలో ప్రదర్శించారు. వివిధ ప్రాంతాలలో నేత్రావధాన ప్రదర్శనిలిచ్చి సత్కృతులందుకొన్నారు. వారు తన గ్రంథం ‘వ్యాస మంజూష’ (2015)లో ఒక వ్యాసంలో నేత్రావధాన విధానాన్ని సంపూర్ణంగా వివరించారు:

“నేత్రావధానం నిర్వహించడానికి అవధానితో బాటు, అదే ప్రతిభ గల మరొక వ్యక్తి సహాయకుడుంటాడు. టైప్ మిషన్ మీద అక్షరాల వలె, టెలెక్స్ సంకేతాల వలె ఈ అవధానికీ తెలుగు, సంస్కృతం, (హిందీ), ఆంగ్లభాషలలోని అక్షరాలకూ కీబోర్డు వంటి సంకేతాలుంటాయి. కనుగుడ్డు కదలికలను బట్టి వర్ణాల ఉత్పత్తి ఏర్పడుతుంది. అష్టావధానంలో వలె ఇందులో ప్రత్యేకంగా పృచ్ఛకులు అవసరం లేదు. సభలో ఎవరో ఒకరు తెలుగులో/ఇంగ్లీషులో/సంస్కృతంలో ఒక పద్యం/శ్లోకం/వచనం కాగితం మీద వ్రాసి ఇస్తారు. వారిచ్చినది బాగా ప్రసిద్ధమైన శ్లోకం కాకూడదు. ఏ మారుమూలదో లేక వారు స్వయంగా కల్పించినదో కావాలి. అవధాని ఆ కాగితాన్ని తీసుకుని ఎదురుగా ఉన్న సహాయకుని వేపు చూస్తూ నేత్రాలలో ఆ విషయాన్ని అందిస్తాడు. సహాయకుడు ఆ సంకేతాలు గుర్తించి అక్షరాలుగా వ్రాస్తాడు. పూర్తి అయిన తరువాత సభ్యులిచ్చిన దానికీ, నేత్రావధానంతో గుర్తించిన దానినీ సరిపోల్చి చూస్తారు. సరిపోతే అవధానం విజయవంతం అయినట్టు ప్రకటిస్తారు. ఇంగ్లీషు భాషలో అక్షరాలు 26 కాబట్టి వేగంగా పూర్తి అవుతుంది. తెలుగు సంస్కృతాలలో ఒక్కొక్క పద్యం కనీసం 30 నిముషాలు పడుతుంది. నేత్రావధానం జరుగుతున్నంత సేపు సభ అంతా ప్రశాంత పద్మాకరంగా వుంటుంది.” అంటారు గోపాలరావు.

డా. అయలసోమయాజుల గోపాలరావు

గోపాలరావు హైదరాబాదు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి టి. అంజయ్య సమక్షంలో తమ శిష్యుడు ధవళ నాగేశ్వర శర్మ సహాయకుడుగా నేత్రావధానం చేశారు. అవధానం పూర్తి అయిన తర్వాత కొద్ది గంటల వరకు కళ్ళు పీకుతాయన్నారు గోపాలరావు.

ఇక్కడొక చమత్కారం వుంది. పరీక్షలలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తున్న విద్యార్థి మిత్రులు పరస్పరం ఈ నేత్రావధానం ద్వారా సహకరించుకునే అవకాశం వుంది. వెనుక బెంచీలో కూచున్నవారికి గానీ, పక్క బెంచీలో విద్యార్థి/విద్యార్థినికి సైగల ద్వారా సంకేతాలను పంపవచ్చు. ఇన్విజిలేటర్ కంటిలో పడకుండా జాగ్రత్త పడాలి.

నేత్రావధాన సందర్భంలో బొబ్బిలి కళాభారతి వారి ఆధ్వర్యంలో అయలసోమయాజుల గోపాలరావును ఓ పృచ్ఛకుడిలా అడిగారు. “మేమొక సమస్య ఇస్తాం. దాన్ని పూరించి నేత్రావధానంగా చూపండి!” అని. దానికి అవధాని ఇచ్చిన సమాధానం సహేతుకంగా వుంది:

“అయ్యా! మీరిచ్చిన పద్యాన్ని అవధానం చేయడానికి (సైగల ద్వారా) అరగంట పడుతుంది. అప్పటివరకు సభ్యులు నిశ్శబ్దంగా కూర్చుంటారు. సమస్యను పూరించి నేత్రాల ద్వారా సూచించటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది” అన్నారు.

2014 మార్చి 30న అమెరికాలోని సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి లలితా కామేశ్వరి, శ్రీమతి రమాకుమారి నేత్రావధానం జయప్రదంగా నిర్వహించారు. అంగుష్టావధానం, పుష్పావధానం, ఘంటావధానం కూడా ప్రచారంలో ఉన్నాయి. గణితావధానం, జ్యోతిషావధానం, అక్షరావధానం, వైద్యావధానం శాస్త్ర సంబంధ అవధానాలు.

గోపాలరావు, ద్వానాశాస్త్రి,మానాప్రగడశేషసాయిచే రచయితకు సత్కారం,విజయనగరం 2018

ఒకసారి తిరుపతి వెంకట కవులకు ఒక సభలో ఒక పృచ్ఛకుడు సమస్యాపూరణను ‘బంధకవిత్వం’లో చెప్పమన్నాడు. అది ఎలాంటిదంటే సాముగారడీ చేసే వ్యక్తి  ఊపిరి అంతా బిగబట్టి నడుస్తున్నాడనుకొందాం! అతణ్ణి ఒంటికాలి మీద నడవమన్నట్లు వుంటుంది. తిరుపతి వెంకట కవులు సమాధానంగా ఆశు పద్యం ఇలా చెప్పారు.

“మానస మన్య కార్యముల మగ్నముగాన చెలంగు కాలమం
దైనను బంధ చిత్ర కవితాదులు పెట్టతి ప్రయాసమౌ
వాననె కోరు హాలికుడు పైరు ఫలింపగ నంతియెకాని ఎం
తో నినదమ్ముతో పిడుగు లుప్పతిలన్ పడగోరునే!”

పంట పండడానికి అవసరమైన వర్షం పడాలని కోరుకునే రైతు పిడుగులు పడాలని కోరుకోడు గదా! అని చమత్కరించారు. నిజమే!

పద్యావధానం:

విశాఖపట్టణానికి చెందిన పద్యనాటక నంది అవార్డు గ్రహీత డా. మీగడ రామలింగేశ్వరస్వామి ఈ ప్రక్రియను ప్రచారంలోకి తెచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందినవారు ఆయన. తెలుగు పద్యాలకు సంగీతాన్ని జోడించి సంగీత నవావధానం అనే పేర 2006 నుంచి ప్రదర్శనలిస్తున్నారు. 50 మంది కవులు వ్రాసిన 150 పద్యాలను ఎంచుకుని 20 రాగాలలో 2800 విధాలుగా పృచ్ఛకులు కోరిన రీతిలో ఆలపిస్తారు. స్వతహాగా స్టేజి నటులు. దేశ విదేశాలలో అనేక ప్రదర్శన లిచ్చారు. వొలుకుల శివశంకరరావు కూడా ఈ విధమైన ప్రక్రియను ప్రదర్శించారు.

వార్తలలో కెక్కిన వేగేశ్వరపురం:

ఎక్కడిదీ ఊరు? పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో వుంది. ఇక్కడ కైకాల సూర్యచంద్రం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. మోపిదీవి భాస్కరరావు తెలుగు పండితుడు. ఆయన స్కూలులోని 6 నుండి 10వ తరగతి వరకు చదువుకునే 32 మంది పిల్లలకు అష్టావధాన ప్రక్రియ నేర్పించారు. 7వ తరగతి చదివే లక్ష్మీ దుర్గా సింధుజ, వీరనాగు, రూపికా రాణి, నాగ సత్యవతి, కనకదుర్గ లలితాంబిక, మంగతాయారు ఈ సమరానికి సైనికులు. వీరు ఆశువుగా పద్యాలు చెప్పగలరు.  2011-12లో తెలుగు భాషా దినోత్సవం రోజు కడిమెళ్ళ వరప్రసాద్ సమక్షంలో వీరు అవధాన ప్రదర్శన చేశారు. సుమసాయి స్నేహ పూరించిన దత్తపది:

ఇచ్చిన పదాలు: గాడిద, దున్న, కుక్క, పంది.

పూరణ ఇదీ:

తే.గీ.

జాతిపిత గాడిదప్పని శాంతిరణ వి
ధాత, మీదున్నతంబైన నీతిహేతి
తరిమి ఆ తెల్ల కుక్కల దండునెల్ల
పరిచె దేశమల్ల చలువ పందిరులను

అద్భుతమైన పూరణ. వీరిని చూసిన తర్వాత అవధానం దినదినాభివృద్ధి చెందగలదనే ధైర్యం కలుగుతుంది. తెలంగాణలోని ఒక ఉపాధ్యాయుడు ఇలా అవధానం నేర్పించిన వార్త విన్నాం, కన్నాం.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here