మానవీయ కథల స్పర్శవేది

1
3

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత శ్రీ ఎమ్వీ రామిరెడ్డి రచించిన కథల సంపుటి ‘స్పర్శవేది’. ఇది రచయిత మూడవ కథా సంపుటి. ఇందులో 1. మాధవసేవ 2. సేవే మార్గం 3. కుఛ్ తో హై 4. యాసిడ్ టెస్ట్ 5. స్పర్శవేది 6. గుండె చెరువై… 7. మరణానికి ఇవతలి గట్టు 8. నాగలి గాయాల వెనక 9. వ్యర్థాన్వేషి 10. సంకెళ్లు తప్ప 11. అరుణారుణం 12. శివతాండవం 13. చీపురుపుల్ల 14. ‘కురు’క్షేత్రం 15. శ్రీమంతులు 16. షకీలా మరణం – అనే పదహారు కథలు ఉన్నాయి.

***

కూతురు ఎంగేజ్‍మెంట్‍కి రాలేకపోతాడేమోనని భయపడిన భార్య తన భర్తని తోటివారికి సాయపడడానికి వ్యతిరేకిస్తుంది, ఎంగేజ్‍మెంట్ జరుగుతున్న కూతురు మాత్రం తండ్రిని ఆ పని సక్రమంగా పూర్తి చేసే రమ్మంటుంది. ఆసుపత్రిలో ప్రాణమూ, అతని ఆశయమూ రెండూ నిలుస్తాయి. ఆసక్తిగా చదివించే కథ ‘మాధవ సేవ’.

తల్లిదండ్రులు గొడవలు పడితే, ఆ ప్రభావం పిల్లలమీద ఎలా ఉంటుందో ‘సేవే మార్గం’ కథ చెబుతుంది. ఆ నేపథ్యంలో ఎదిగిన ప్రత్యూష నిరాదరణకి గురైన ఎందరికో ఆశ్రయం కల్పిస్తుంది. తనని హింసలకి గురిచేసిన పినతల్లిని సైతం క్షమించి ఆదరిస్తుంది.

బలవంతంగా వేశ్యావృత్తిలోకి దిగిన వనజ గౌరవంగా బ్రతికేందుకు మరో వృత్తిని ఎంచుకోవాలనుకుంటుంది. అందుకు డబ్బు కూడా దాచుకుంటుంది. అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి ఎదురవున్న శారీరక/లైంగిక హింసని తప్పించుకోవాలనుకున్న వనజ ఏం చేసిందన్నది ఆసక్తికరంగా చెబుతుంది ‘కుఛ్ తో హై’ కథ.

యాసిడ్ దాడికి గురయిన యువతి మానసిక స్థితిని అద్భుతంగా వ్యక్తీకరించిన కథ ‘యాసిడ్ టెస్ట్’. ఆమె తండ్రి చేసిన కౌన్సిలింగ్ నేటి యువతకి ఎంతో ప్రయోజనకరం. సేవామూర్తిగా నటించిన భర్త అసలు రూపం తెలిసాకా ఆమె ఏం చేసిందో కథలో చదవాల్సిందే.

కరోనా క్లిష్ట సమయంలో చెత్త సేకరించే కార్మికుల జీవనాన్ని ప్రదర్శించే కథ ‘స్పర్శవేది’. రాజమ్మ, రాముడు దంపతుల అనుభవాలు సమాజంలో మనం నిత్యం గమనిస్తున్నవే. పరస్పర సహాయాలు జీవితాలను ఎలా కాపాడుతాయో ఈ కథ చెబుతుంది.

ఓ చెరువు తన గురించి తాను చెప్పుకుంటూ, తనపై ఆధారపడి ఉన్న మనుషుల జీవితాలను స్పృశిస్తూ తల్లడిల్లుతూ చెప్పిన కథ ‘గుండె చెరువై…’

కరోనా కష్టకాలంలో కొన్ని ఆసుపత్రులు రోగులతో ప్రవర్తించిన తీరుని వివరిస్తుంది ‘మరణానికి ఇవతలి గట్టు’ కథ. ఆ కాలంలో విదేశాల నుంచి దేశానికి వచ్చినవారు ఎయిర్‍పోర్టులలో ఎదుర్కుకున్న ఇబ్బందులు వెల్లడిస్తుందీ కథ. మానవ స్పందనలు మారణాయుధాలైనపోయిన వైనాన్ని చాటుతుంది.

రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేసే ఉదయ్ కథ ‘నాగలి గాయాల వెనక’. స్వయంగా రైతుగా మారితేగాని రైతుల సమస్యలు అర్థం కావని చాటే కథ.

చెత్తలోంచి విలువైన వస్తువులను అమ్ముకుని జీవించే సుందరి కథ ‘వ్యర్థాన్వేషి’. రాజకీయాలకు బలైన నిస్సహాయుల వేదనకు ప్రతిబింబం ‘సంకెళ్లు తప్ప’. కరోనా వార్డులో పనిచేసే నర్సు కథ ‘అరుణారుణం’.

ఓ పల్లెటూరి కళాకారుడి ఆస్ట్రేలియాలో తన కళని ప్రదర్శించిన వైనాన్ని చెబుతుంది ‘శివతాండవం’. ఫారిన్‍లో పిల్లలు తమ కాళ్లపై తాము నిలబడతారనీ, పార్ట్ టైమ్ పని చేస్తూ చదువుకుంటారనుకున్న ఆయన భావం దూరమవుతోంది. అవలక్షణం ఉందని మనిషిని వదిలేయకూడదని చెబుతుందీ కథ.

ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం, ప్రైవేటు ఆసుపత్రి ధనదాహం ‘చీపురుపుల్ల’ కథలో చూస్తాము. మనుషుల్లో ఇంకా మంచితనం మిగిలి ఉందని చెప్పిన కథ ఇది.

కేన్సర్ పేషంట్లకు విగ్గుల కోసం ఆరోగ్యవంతులైన మహిళల నుంచి కేశాల సేకరించే ఉదయ్ మాటలకి ప్రభావితమైన సంఘసేవిక కృష్ణవేణి తన జుట్టును విరాళమిచ్చి ఏం పోగొట్టుకుంది/ఏం సాధించిందో ‘కురు’క్షేత్రం కథ చెబుతుంది.

ఒక హోమ్‍లో ఆశ్రయం పొందుతున్న పిల్లలు జీవితంపై గొప్ప భరోసాగా ఉన్నట్లు కన్పిస్తారంటూ, జీవితంలో వెలుగులు నింపుకోవడం ఎలాగో ‘శ్రీమంతులు’ కథ చెబుతుంది.

నిర్భాగ్యుల జీవితంలో వ్యథని కళ్ళకు కట్టే కథ ‘షకీలా మరణం’.

రచయిత స్వయంగా సేవాపథంలో ఉండడం వల్ల చాలా కథలలో స్వచ్ఛంద సేవకులు కనబడతారు. సమాజంలో మంచి మార్పుకు కృషి చేసే వ్యక్తులు తారసపడతారు. మనిషి మనిషికి సాయం చేయాల్సిన అవసరాన్ని ఈ మానవీయ కథలు చాటుతాయి. మంచితనం బ్రతకాల్సిన అవసరాన్ని వెల్లడిస్తాయి ఈ కథలు. రచయిత అభినందనీయులు.

***

స్పర్శవేది (కథా సంపుటి)
రచన: ఎమ్వీ రామిరెడ్డి
పుటలు: 176
వెల: ₹ 160/-
ప్రచురణ: మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు, పెదపరిమి, గుంటూరు జిల్లా
ప్రతులకు:
ఎం.వి.రాజ్యలక్ష్మి
ఫ్లాట్ నెం: A-904, ఫేజ్ 1,
రాంకీ గెలాక్సియా,
నల్లగండ్ల విలేజ్, హైదరాబాద్-500019
9866777870
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here