యాదోం కీ బారాత్-6

0
3

[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

దోస్తులూ – షాదీ ముబారక్‌లూ

[dropcap]ఇ[/dropcap]ష్టం గానూ అయిష్టం గానో నేనయితే 21 దాటి 22 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంలో చేరి పోయాను. అప్పుడు అట్లా ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే గొప్ప అన్న వాళ్ళూ వున్నారు. నాకయితే ఏ భావమూ ఉండేది కాదు. మా సుమిత్ర పెద్దమ్మేమో వానికి ఉద్యోగం వచ్చింది ఇంకేముంది పెళ్లి చేయవా అని మా అమ్మతో అనేది. నేను నవ్వుతూ వినేవాన్ని. కానీ నా తోటి వాళ్లకు దోస్తులకు పిల్లల్ని చూడ్డం పెళ్లిళ్ళు చేయడం కూడా ఆ వయసులోనే జరిగింది. అప్పటికి వాటిని బాల్య వివాహాలు అనలేం. కానీ అవి ముందస్తు పెళ్లిల్లే. మా మిత్రుల్లో చాలా మంది జీవితాల్లో స్థిరపడక ముందే మూడు ముళ్ళూ వేసేసారు. అలాంటి వాటికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తాయి.

పిల్లగాడు పక్క చూపులు చూస్తున్నాడు, గోడలు దుంకుతున్నాడు అన్నది గ్రామీణ ప్రాంతాల్నించి వచ్చిన దోస్తుల ఇంటివాళ్ళ గోస. దాన్ని తప్పించేందుకు పెళ్లి చేసారు. ఇంకొకరు పెళ్ళిళ్ళలో వేరే అమ్మాయిల పైన తలంబ్రాలు చల్లుతున్నాడని, గొడవలవుతున్నాయని లగ్గానికి పూనుకొన్నారు. ఇంకొకరేమో వయసొచ్చేసింది ఇక ఆగడని పెళ్లి చేసేయాలని చేసిన వారున్నారు. మరొకరేమో ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యాలు బాగా లేవు వాళ్ళ కళ్ళ ముందర చేయాలనీ చేసారు. ఇట్లా మా మిత్రులనేక మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నేనేమో దాదాపు అన్ని పెళ్ళిళ్ళూ చూసి చేసి ఆనందించాను. ఆహ్లాదంగా గడిపాను. సెలెబ్రేట్ చేసాను.

***

మా దోస్తుల్లో నాకు గుర్తున్న మొదటి పెళ్లి చింతకింది వేణుగోపాల్‌ది. ఆ పెళ్లి మేము ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉండగానే జరిగింది. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారి అందుకేనేమో తన పెద్దకొడుకు పెళ్లి అంత త్వరగా చేసాడు. కరీంనగర్ కాపువాడలో జరిగిన ఆ పెళ్లి విశేషాలు అంతగా గుర్తుకు లేవు. కోడాక్ కెమెరాతో ఆనాడు తీసిన ఫోటోలూ లేవు. కానీ వాడు మా అందరికంటే సీనియర్ అయిపోయాడు.

ఇక స్నేహితుల్లో రెండవ పెళ్లి. అప్పటికి నాకు అత్యంత దగ్గరివాడూ ఆరవ ప్రాణంగా తిరిగిన వాడూ అయిన కే.దామోదర్ రెడ్డిది. కేడీ అనీ దామోదర్ అనీ ముద్దుగా పిలుచుకునే తన పెళ్లి 10 మే 1978న భూంపెల్లిలో జరిగింది. అప్పటికి మా డిగ్రీ చదువులు పూర్తి అయ్యాయి. నేను ఇతర మిత్రులం కరీంనగర్‌లో చదివితే దామోదర్ హైదరాబాద్‌లో చదివాడు. లేదా చదివినట్టు చేసాడు. దామోదర్ వాళ్ళది పోరండ్ల గ్రామం. భూస్వామ్య కుటుంబం. వాళ్ళ బాపు అప్పటికే జిల్లా స్థాయిలో సహకార శాఖలో ఉన్నతాధికారి. వందెకరాల ఆసామికి సంబంధాలకేమి తక్కువ. పెళ్లి కుదిరింది. మిత్రులం అందరమూ వెళ్ళాలి.

కానీ అప్పుడే మాకు రామగుండం ఫెర్టిలైజర్ కంపనీలో ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఆఫీసు నుంచి కాల్ లెటర్స్ వచ్చాయి. 9 మే రోజున హాజరవ్వాలి. నేనూ, లింగమూర్తి, నర్సిరెడ్డి ఇట్లా పలువురం వెళ్లాం. మొదట రాత పరీక్ష అన్నారు. అందులో ఎంపికయిన వారికి తర్వాత ఇంటర్వ్యు అన్నారు. రాతలో నేగ్గాం. ఇంటర్వ్యుకి కొందరిని అదే రోజు ఏర్పాటు చేసారు. నాతో పాటు మరికొందరికి మర్నాడు రమ్మన్నారు. తెల్లారితే దామోదర్ పెళ్లి. ఎట్లా.. ఇంటర్వ్యు ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఇంట్లో వాళ్లకు బాగా లేదని నాకు ఇవ్వాలే ఇంటర్వ్యు పూర్తి చేయమని బతిమిలాడాను. మొదట కాదన్నా తర్వాత ఎట్లాగో ఒప్పుకుని పూర్తి చేసారు. అమ్మయ్య అనుకుని రాత్రికి కరీంనగర్‌కు చేరుకున్నాను. తెల్లారి ఉదయం సిద్దిపేట దగ్గరిలోని భూంపెల్లి పెళ్లికి చలో. కారణమేంటో కానీ నాకా ఉద్యోగం రాలేదు. లింగమూర్తి వాళ్లకు వచ్చింది. అప్పుడు ఎఫ్.సి.ఐ.కి లీగల్ అడ్వైజర్‌గా వున్న మా మామ బొమ్మ వెంకన్నను కలిసాం. ఆయన ఎఫ్.సి.ఐ. అధికారులతో మాట్లాడి అంతా అయిపోయిన తర్వాతనా చెప్పేది అని చివాట్లు పెట్టాడు. అదట్లా ముగిసింది. కానీ దామోదర్ పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది. వాళ్ళ వైవాహిక జీవితమూ గొప్పగా జరిగింది. కరీంనగర్‌లో అనేక ఏళ్ళ పాటు పెళ్లి రోజుల్ని జరుపుకున్నారు. నేనూ హాజరయ్యాను.

***

ఇక 1978 లోనే జరిగిన మరో పెళ్లి మిత్రుడు కవి వఝల శివకుమార్‌ది. అప్పటికే కవిగా పేరున్నవాడు. నటుడిగా గాయకుడిగా వేములవాడలో కృషి చేస్తున్నవాడు. తన పెళ్లి భీమేశ్వర సభామంటపంలో ఘనంగా జరిగింది. నేను కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా వెళ్లాను. పెళ్ళిలో ఏదయినా ప్రత్యేకంగా చేయాలినిపించింది. చిన్న చిన్న కవర్లల్లో రెండేసి చాక్లెట్స్ పెట్టి పెళ్ళికి వచ్చిన వారందరికీ పంచాలని అన్నాను. దాంతో మిత్రులంతా ముందుకొచ్చి కవర్ల తయారీలో పడ్డారు. రాత్రి పెళ్లి. పెద్ద ఊరెంగింపు. రఫీక్ గాడేమో ఆనంద్ నా టీ షర్ట్ వేసుకో అన్నాడు. మొదటిసారిగా టీ షర్ట్‌తో పెళ్ళిలో హడావిడి చేసాం. పెళ్లి కూతురు శారద మా మిత్రుడు మధు రవీందర్ చెల్లెలే. వాళ్ళ నాన్న మధు మృత్యుంజయ శర్మ గారు మంచి అధ్యాపకుడు. చూడగానే దండం పెట్టాలనిపించెంత సౌమ్యుడాయన. ఇక శారద రవిందర్ వాళ్ళ అమ్మ శకుంతల గారూ, ఉపాధ్యాయుల సాంబశివుడి అమ్మ విశ్వేశ్వరమ్మ గారూ, మా అమ్మ రాధ చిన్నప్పటినుండి మంచి స్నేహితులు. కలిసి చదువుకున్నవాళ్ళు. నేను కనిపించినప్పుడల్లా ఆ యిద్దరూ సొంత కొడుకులాగా చూసేవాళ్ళు. మా రాధ కొడుకు అని సంబరంగా పిలిచేవాళ్ళు. నాకయితే ఎంతో సంతోషం వేసేది.

అట్లా మంచి వాళ్ళయిన కుటుంబం లోంచి వచ్చిన శారద గారి మంచితనం, నెమ్మదితనం, సర్దుకుపోయే తత్వం వల్లనే మా శివకుమార్ జీవితం ఇప్పటికీ సాఫీగా సంతోషంగా సాగిపోతున్నదని నేననుకుంటాను. ఆ మేరకు బాగా అదృష్టవంతుడు మా వఝల శివకుమార్. ఆ జంట తమ కుమారుడికి ఆనంద్ అని పేరు పెట్టుకున్నారు. దాంతో వాళ్ళని డాడీ మమ్మీ అని నేను పిలుస్తాను తను కూడా కోడక్ అంటాడు. ఏది ఎట్లున్నా కలిసి ఉన్నాం ఉంటాం కూడా.

***

1981లో మా క్లాస్మేట్ మంగలంపెల్లి వెంకటేశ్వర్లు పెళ్లి. గుండి గ్రామంలో జరిగింది. అయ్యగార్ల పెళ్లి. వెంకటేష్, నేను, వేణు, దామోదర్ తదితరులం వెళ్లాం.

ఇక మా స్నేహితుల పెళ్లిళ్ళ విషయంలో 1982 ముఖ్యమయిన సంవత్సరం. ఎందుకంటే ఆ ఏడు నాకు చాలా ఆప్తులయిన ముగ్గురి వివాహాలయ్యాయి.

అందులో మొదటి పెళ్లి పి.ఎస్.రవీంద్రది. తను నాకు చిన్ననాటి స్నేహితుడు. కవి మంచి ఫోటోగ్రాఫర్. చాలా విషయాల్లో కలివిడిగా వుండేవాళ్ళం. పీఎస్ తాను చిన్నప్పుడు మొట్ట మొదటిసారి కరీంనగర్‌కు మా అమ్మతో కల్సి వచ్చానని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు మేము మిఠాయి దుకాణం ఇంట్లో వుండే వాళ్ళం తర్వాత మంకమ్మ తోటకు మారిన తర్వాత కూడా రవి కరీంనగర్‌కు ఎప్పుడువచ్చినా మా దగ్గరే ఉండేవాడు. ఇద్దరమూ ఎన్ని సినిమాలు కలిసి చూసామో, ఎన్ని రాత్రులు ముచ్చట్లతో గడిపామో లెక్కలేదు. తాను ఇంటర్ తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకునేందుకు అలిశెట్టి ప్రభాకర్ వద్దకు జగిత్యాల వెళ్ళాడు. అక్కడే ప్రభాకర్ మిత్రుడు సురేందర్ ప్రేరణతో పెళ్ళికి సిద్ధమయ్యాడు. శ్రీ వాసాల నర్సయ్య గారి కూతురు వసుంధర గారి గురించి చెప్పాడు. వసుందరను చూడ్డానికి, కలవడానికి పీఎస్‌తో నేనూ వెళ్లాను. అప్పటికి తను టీచర్ ట్రైనింగ్ లోవుంది. పీఎస్‌కి ఇష్టమయింది. నా అభిప్రాయమూ ఓకే నన్నాను. అట్లా పెళ్లి సెటిల్ అయింది. పీఎస్ మేనమామ మంచే సత్యనారాయణ మాత్రం తనకు ఇష్టం లేనట్టు నాతో కొంచెం కినుకుగా మాట్లాడాడు. ‘జబ్ మియా బీవీ రాజీ హో తో క్యా కరేగా ఖాజీ’ అనుకున్నాను. పిల్లా పిలగాడూ ఒకే అన్నంక ఆగేదేముంది. 30 జనవరి 1982 రోజున రాత్రి మెట్పెళ్లిలో పెళ్లి జరిగింది. పీఎస్ అప్పటికే కొంతకాలం అవుట్‌డోర్ ఫోటోగ్రఫి చేసి 1981 లో ‘ప్రతిమ’ స్టూడియో ప్రారంభించాడు. మిత్రుడు బొడ్ల అశోక్ కట్టిన కొత్త ఇల్లు షాపింగ్‌లో ప్రతిమ స్టూడియోని జింబో, అలిశెట్టి ప్రభాకర్‌లు కలిసి ప్రారంభించారు. తనని ఫోటోగ్రఫి వైపు ప్రోత్సహించిన జింబో, ఫోటోగ్రఫి నేర్పించిన అలిశెట్టి లతో ప్రతిమ ప్రారంభించడం తనకు చాలా సంతోషం కలిగించిన అంశమని పీఎస్ అంటాడు. తర్వాత వసుంధర టీచర్ ఉద్యోగంలోనూ పీఎస్ ఫోటోగ్రఫి లోనూ, ఆ తర్వాత జర్నలిజం లోనూ బిజీ అయిపోయారు.

***

ఇక 2 ఫిబ్రవరి 1982 రోజున మిత్రుడు ఇట్టేడు కిరణ్ కుమార్ పెళ్లి జరిగింది. కిరణ్ నన్ను బావా అని పిలిచేంత దగ్గరి మిత్రుడు. అప్పటికే 1981లో మేము వేములవాడలో ఫిలిం సొసైటీ ప్రారంభించాం. దాన్లో నన్ను ప్రోత్సహించి, వెన్నంటి వుండి నడిచి నడిపించినవాడు కిరణ్. చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. అప్పటికే ఒకసారి బాంబే వెళ్లి కొంతకాలం ఇంటికి దూరంగా వున్నాడు. బాంబేలో సినిమాల కోసమో అడ్వర్టైజ్మెంట్ చిత్రాలకోసమో పని చేసానని చెప్పేవాడు. వేములవాడ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న నిర్వహిస్తున్న షాబాద్ బండ, బెంగళూరు గూనల షాప్ నిర్వహించడం మొదలుపెట్టాడు. వాళ్ళ షాప్ మా తాతయ్య ఇంటికి వెనకాలే వుండేది. నేను సిరిసిల్లా కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే వెళ్లి కిరణ్‌తో కలిసి కాలం గడిపేవాన్ని. కిరణ్ సహకారం లేకుంటే వేములవాడలో ఫిలిం సొసైటీ స్థాపన సాధ్యం అయ్యేది కాదు. కిరణ్ తల్లిదండ్రులు శ్రీమతి శారదా బాయి, శ్రీ జగదీశ్వరయ్య గార్లు కిరణ్ అంటే చాలా ప్రేమగా వుండేవాళ్ళు. ఒక్క కిరణ్ అనే కాదు కూతురు విష్ణువందన, మిగతా కుమారులు గౌతం, శరత్ లను కూడా ప్రేమతో అపురూపంగా పెంచారు.

కిరణ్‌కు నిజామాబాద్ కు చెందిన కమళావతితో ఘనంగా పెళ్లి జరిగింది. మిత్రులమంతా నిజామాబాద్ వెళ్లాం. పెళ్ళికి జింబో, శివప్రసాద్, బల్మూరి యుగంధర్, రఫీక్, సాంబశివుడు, రమేష్ చంద్ర, జక్కని రాజయ్య, ఎడ్ల రాజేందర్, మహేష్ ఇంకా ఎంతో మంది మిత్రులం హాజరయ్యాం. పీఎస్ అప్పటికి తన పెళ్ళయి మూడు రోజులే అయినా ఫోటోలు తీయడానికి వచ్చాడు.

***

ఇక 1982 లోనే జరిగిన మరో పెళ్లి మంగారి రాజేందర్ అంటే మా రాజు మామది. అప్పటికే తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పెళ్ళికి సిద్ధపడ్డారు. ఇంటికి దగ్గరే. పోలీసు స్టేషన్ ముందు వున్న కుటుంబం తోటే సంబంధం. శైలజ సిరిసిల్లాలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ వరంగల్‌లో చదువుతున్నట్టు గుర్తు. ఆమె తండ్రి గారు శ్రీ సత్యనారాయణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. అయతే శైలజ వాళ్ళ మేనత్త శ్రీమతి ఆండాలమ్మ, మామయ్య శ్రీ వెంకట్ రెడ్డి(తాసీల్దార్) గార్లు శైలజను adopt చేసుకున్నారు. 29 మే 1982రోజున పెళ్లి. మంగారి వాళ్ళింట్లో చిన్నవాడి పెళ్లి కనుక అంతా ఆడంబరంగా చేయాలనుకున్నారు. దాంతో అయిదుగురు అక్కా చెల్లెళ్ళు సుమిత్ర, రాధ, శాంత, వినోద, ప్రమదలు కొన్ని రోజుల ముందే వేములవాడ చేరుకొని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నీ తామే అయి నిర్వహించారు. ఇరుపక్షాలూ స్థితిమంతులయిన వాళ్ళే కనుక పెళ్లి కూడా ఘనంగా జరిపించారు. బంధు మిత్రులు అనేక మంది హాజరయ్యారు. మేము వేములవాడ ఫిలిం సొసైటీ, నటరాజ కళా నికేతన్‌ల పక్షాన ఒక కవర్లో అక్షింతలు, మరో కవర్‌లో రెండు చాక్లెట్స్ వచ్చిన అతిథులందరికీ అందించాం.

అట్లా మా దోస్తుల్లో పలువురి పెళ్ళిళ్ళు జరిగి వాళ్ళంతా కాపురాల్లోకి ఒదిగిపోయారు. అయినా సృజనాత్మక రంగాల్లోని వారు తమ రచనల్ని కొనసాగించారు. మాతో పాటు సాహితీ కళారంగ కార్యక్రమాల్లో ఉత్సాహంగానే పాల్గొన్నారు.

మిగతా వచ్చే వారం….

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here