[dropcap]ము[/dropcap]క్కోటి దేవతలుంటే, వారి పట్ల భక్తి చూపించటంలో కూడా వేయిన్నర, ఇంకా మాట్లాడితే లక్ష రకాలు!!
పూజ ముఖ్యం గాని ఎందులో ఏం చూసి, ఏమూహించు కొని, జనం నమ్మకాన్ని పెంచుకుంటారో, కనిపెట్టి ఉండటం దేవతల పనా ఏమిటి?!! అయినట్టు కనబడట్లేదు మరి!!
ఒకడికి బొట్టు ఎంత పెద్దది పెట్తే అంత లావు తన భక్తని నమ్మకం! ఒకమ్మకి దీపంలో వత్తుల సంఖ్య బట్టి, తను వెలిగించే అగరొత్తుల ధూప పరిమళాన్ని బట్టీ, తన దైవభక్తి యెన్ని టన్నులో కొలుచుకొనే మురిపెం!!
ఇక చన్నీళ్ళ స్నానాలు, దేవుళ్ళ పేళ్ళతో ఉపవాసాలు, ముడుపులు, వీటి తంతు చెప్పనే అక్కర్లేదు, వీటిల్లో ఎవరి యార్డ్‌స్టిక్కులు వారివే! వేలెత్తి చూప బోయావో, అదే స్టిక్కై, అదేనండీ, కర్రై భరతం పడుతుంది! ఇది తథ్యం!
కనుక “దాని జోలి మన కొద్దు గురో”!! పాతాళ భైరవిలో సదాజపుడు హెచ్చరించాడుగా, ఆ మాంత్రికుణ్ణి, అట్లా!! వాడు వినలేదు, తోటరాముడు డొక్క చీల్చి డోలు కట్టాడు! కనుక మన జాగ్రత్తలో మనం ఉంటే, వీపుకు బోల్డు ఇన్స్యూరెన్స్ చేసినట్టే!!
ఇంకొక భక్తి వెరైటీ- ప్రవచనాలు!
ఎవరా బోర్డ్ పెట్టుకొని, చెప్పినా వినటం – అర్థం అయినా, కాకపోయినా! ఆచరించే ఉద్దేశం ఉన్నా, లేకపోయినా!!
ఏదో ఒక రోజు పూర్ణాయుష్షులో జ్ఞాన రేఖ పొడ సూపి, ఆచరించక పోతామా అని గొప్ప ఆశావాదంతో వారు వింటుంటే, మధ్య మన ఆక్షేపణకు తావేది?! కనుక ఇది కూడా యథావిధిగా సాగాల్సిందే! జరుగనిండు, దైవేచ్ఛ!!
ఇక ధర్మ సందేహాల సంగతి అయితే నాకు ఎటువంటి సందేహమూ లేనట్లే!!
బీరువా ఏ దిక్కులో పెట్టాలి దగ్గర నుంచి, తులసిలో ఎన్ని నీళ్ళు ఏ చెంబుతో ఏ దిక్కుగా నుంచొని పోయాలో వరకు, అన్నీ అడగవచ్చు! వచ్చి మఠం వేసుకొని కూచొని, సమాధానం చెపుతానన్న మనిషికి, తప్పుతుందా!తప్పదు!
మఠం వేసుకోకుండా, సోఫాలోనో కుర్చీలోనో కూచున్నా తప్పదు! ఎంచేతా?! చెపుతానని వచ్చినందుకు, అంతే!!
పాత సామెత గర్తు వస్తోంది కదూ,”అడిగే వాడికి చెప్పేవాడు లోకువని”! అక్కడే పప్పులో కాలేయగూడదు! ఇక్కడ వారు లోకువేమో అన్న సందేహమే అక్కరలేదు,
చెప్పేవారి చేకువ మీది నమ్మకమే ఆ ప్రశ్నల నడిగిస్తోందని గ్రహిస్తే చాలు!!
అట్లా గ్రహిస్తే, అడిగిన ప్రశ్నకు, మనకు తెలిసిన సమా ధానమే దొరికినంత త్రృప్తి మరి!!
ధర్మ సందేహాలంటే గుర్తొస్తోంది, గడుసు పిండం, ఒక అవధానిగారు చెప్పిన ఉదంతం!!
ఒకామె ఫోన్లో ప్రశ్న, “ఏమండీ, ఫలానా పూజ చేశాం, ముందు మా కోడలు ప్రసాదం తినాలా, నేను తినాలా”?!,
ఫోన్లోనే వారి జవాబు: “అమ్మా, ఎందుకు ఈ సందేహ ప్ప్రయాసా,ఆ తినే శ్రమా,మీకిద్దరికీ! పొట్లాం కట్టి కొరియర్ చేయండి, నేను తిని పెట్తాను శుభ్భరంగా”!!
ఇంక ఆమె ప్రసాదం సంగ త్తరవాత,ఆ పూట భోజనం కూడా చేసిందో లేదో పాపం,ఈ సమాధానం ఘాటుకి!!
పుణ్య క్షేత్రాలు, గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయటం, గుళ్ళలో ప్రదక్షిణాలు చేయటం ఇంకొక తరహా!!
నేను ప్రతి సంవత్సరం ఫలానా క్షేత్రానికి వెళ్తానంటే, నీదొక లెఖ్ఖా, నేను ప్రతి నెలా హాజరీ వేయించుకంటానని తన భక్తి వేనోళ్ళ, కాదు కాదు, ఒక నోటితోటే, వెయ్యి విధాల ఢంకా బజాయించి చెప్పేవాడు ఇంకోడు!!
ఇది గుళ్ళ సంగతి! గుళ్ళలో ప్రదక్షిణాల సంఖ్య,ఆ సంఖ్య ఎన్ని సార్లూ అన్నది వేరే స్పెషలైజేషన్!!
ఊర్కే వస్తాయేంటి విద్యలు, అందునా ఇది సవ్యాప సవ్యాలు సరిగ్గా తెలియవలసిన విద్య!!
సరేలెండి, గుళ్ళ చుట్టూ, గుళ్ళ లోపలా తిరిగి తిరిగీ కాళ్ళు నెప్పి పుట్టో, కళ్ళు తిరిగో వాళ్ళే ఆపేస్తారు, మన కెందుకు, ఈ అనవసరపు వ్యాఖ్యానాలు! అంతగా అయితే ఏ డాక్టరు బిల్లుకో ఓ లక్ష వదిలించుకొని, తగ్గించుకొని, ఆ దరిమిలా, రికామీగా దర్శించుకుంటారు, గుండ్రంగా తిరుగుతారు. వాళ్ళ కాళ్ళు, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇష్టం!
అయినా భానుమతి “మల్లీశ్వరి”లో, బసక్క లాగా చెప్పేవన్నీ చెప్పి,”ఎవరెట్టా పోతే నాకెందుకమ్మా, నే పోతున్నా”, అంటావేమిటి అంటారా?! నే ఇంకా పోనిదే!!
దేనికైనా జవాబు దొరికేది వికీపీడియా అయితే, దేన్నైనా రాసేసి, గీసేసి,తీసేసి అవతలి వాళ్ళకు బట్వాడా చేసే మాధ్యమం యీ వాట్సాప్ అనబడే,”ఏమిటట”!!
రాసేసేవి కవితలు, గీసేసేవి బొమ్మలు, తీసేసేవి ఫొటోలూ, అని కూడా చెప్పేస్తా ,అపార్థాలు తలెత్తకుండా!!
మొన్నీ మధ్య ఈ వాట్సాప్ లో ఒకరు ‘అట్టు’, అదేనండీ,దోసె ఫోటో తీసి పంపించారు.
దాని కింద భక్తి కొట్టొచేట్లు కనిపిస్తోంది వారు రాసిన Caption లో! “ఆహా,ఏమి నా భాగ్యము! ఇన్నాళ్ళకు అమ్మ కరుణించింది ,ఓంకార రూపంలో నా అట్టు మీద ప్రత్యక్షమయింది, అమ్మా కోటి దండాలు,రక్షించు తల్లీ” అని రాసి ఉన్నది అందులో!!
అట్టులో ఏ ఆకారం వచ్చినా అస్సలు పట్టించుకోకుండా చట్నీతో ఒక పట్టు పట్టడమే నాకు తెలిసిన విద్య!!
ఈ ఓంకారమేమిటో అమ్మ ప్రత్యక్షమవటం ఏమిటో అర్థం కాక తికమక పడుతుంటే వారే దయతో వ్యాఖ్యానం పంపించారు నెక్స్ట్ పోస్టులో!
‘ఓంకారాకారిణి’ట అమ్మ! అమ్మంటే మీ అమ్మ మా అమ్మ కాదండోయ్ వారు చెప్పేది! ‘అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ’ట! ఆ అమ్మ తన తపస్సుకి సంతోషించి, సరే తపస్సు కాకపోతే, పూజలనుకోండి, వాటికి మెచ్చి, ‘ఒకసారి కనబడి పోదాం, పిచ్చి మొహంవాడు, ఎన్నేళ్ళుగా సేవిస్తున్నాడో మినప దోసెలను’ అని జాలి తలచి, అట్టులో అవతరించిందని ఆ వ్యాఖ్యానం సారాంశం!!
చదవంగానే, గ్లాసెడు మంచినీళ్ళు తాగాల్సొచ్చింది.! భక్తి నిడివి,లోతు ఎంతదో తెలిసి పోయిన కళ వెలిగినట్టయింది కళ్ళ ముందర!!
అర నిమిషం తరువాత సన్నగా ఒక అనుమానం బయలుదేరింది!
ఇంతకీ ఆ భక్తి అట్టు వారు ఏం చేశారా అని!
తిని ఉంటారా, ఛ అట్లా ఎట్లా చేస్తారు, అందులో అమ్మ వెలసి ఉండగా!!
మరి పూజ చేస్తారా?! చేస్తే ఎన్ని రోజులు సాగ గలదు?! వీరికి తినకుండా ఎల్లకాలం పూజించే సంకల్పం ఉన్నా,అది రూపం, రంగు, వాసనా అన్నీ మారిపోతుందే!!
అయినా ఒకళ్ళ సంగతి పట్టించుకోని మనిషిని నా కెందుకు ఈ ఆరా?!
వారి అట్టు,వారి భక్తి,వారికి సాక్షాత్కరించిన అమ్మవారు!
వారే చూసుకుంటారు!
అవును ఎందుకు చూసుకోరూ?!!
నే పోతున్నా!!
***
వినతి:
ఎవరి భక్తినీ ఉద్దేశించి రాసినది కాదనీ, కేవలం సరదాగా వ్రాసినది అనిన్నీ, అందరి పట్లా భక్తి భావంతో మెలిగే మనిషి చెప్పే మాటగా తీసుకోవలసిన దనిన్నీ ఇందు మూలముగా మనవి!!