[dropcap]ఎ[/dropcap]న్ని తరాలుగానో
అలాగే ఉంది పెరట్లో చింత చెట్టు.
ఆరడుగుల వెడల్పున్న ఇంటి స్థలానికి
మించి పెరిగింది దాని వెడల్పాటి మొదులు.
అడ్డంగా ఆరడుగులేనా? అంటే.. అంతే!
సిరిల్లు కదా!
ప్రతి తరానికీ పంపకాల్లో ముక్కలై
ఆ మాత్రమే మిగిలింది మరి.
మూడొందలడుగుల పొడవున్న జాగాలో
ముందుకు మూడుగదుల ఇల్లు..
పెరడంతా పరిమళాలతో పగలబడి నవ్వే
రకరకాల మొక్కలు..
మా వేసవి బాల్యమంతా
ఆ చెట్టు చుట్టూ ఆడుతూ తిరిగేది.
పెద్ద పెద్ద ఒండలుండబట్టి
దెయ్యాల కథలన్నీ
ఆ చింత మాను పైనే తిరిగేవి.
మబ్బుల కొంగు పట్టుకుని
ఆకాశాన్ని ఈదుకొచ్చే పిట్టలెన్నో
మా చూపుల్నెత్తుకపోయి
కొమ్మలపై వాలేవి.
దూరాన కొండ మీద –
మేకలరాయి పల్లంలో ఊటబాయి
నింగి అంచుకి కదలాడే కొమ్మచేతులతో
రమ్మని పిలుస్తుంటే ఆగలేకపోయేవాళ్ళం.
స్నేహితుడి పెంపుడు కుక్క
“చిట్టి”ని వెంటేసుకుని
గాటి వెంట సాహసయాత్రకు వెళ్ళేవాళ్ళం.
కొండపైనుండి దిగువన చూస్తే
వేల సూర్యుల కాంతితో మా ఊరు
అప్పుడే గుప్పున తెలవారినట్టుండేది.
కొండచెరువు అలల నోట్లో కొండరాళ్ల నీడ
కొత్త కొమ్మల్ని మొలిపించేది.
ఎంతెత్తుకు ఎక్కినా శిఖరంపైనుండి
చింత చెట్టు చిగురు కొమ్మ మాత్రం
చేతికి అందినంత దూరమే అనిపించేది.
అప్పుడు “చిట్టి” మోసుకొచ్చిన రాళ్లతో
ఆ చెట్టు కింద మేము కట్టిన బొమ్మరిల్లుకి
తలుపులు వేయడం మర్చిపోయినట్లున్నాం.
అవి ఇప్పటికీ తెరుచుకునే ఉన్నాయి
… మాకోసం.
మాకే, ఇప్పుడు అటు వెళ్ళే దారికి అడ్డంగా
ఎన్నెన్నో తలుపులు మూతబడ్డాయి!
తొందరలోనే అటు వెళ్లకపోతే
చింతచెట్టు కూడా అలిగి తలుపులు
మూసుకుంటుందేమో!?