[box type=’note’ fontsize=’16’] తెలుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]
[dropcap]”హ[/dropcap]లో” అంది మాళవిక.
అవతల నుండి “హలో… నా పేరు సతీష్ చంద్ర” అని వినిపించింది.
మాళవికకి ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించింది.
“ఎవరూ?” అంది.
“మొన్న మీ సన్మాన సభ స్పాన్సరర్స్‌లో నేనూ ఒకడ్ని. గ్రోవెల్ కంపెనీ ఎం.డి.ని” అన్నాడు.
మాళవికకి అప్పుడు గుర్తొచ్చింది.
“ఓ… సారీ! గుర్తు పట్టలేకపోయాను” అంది.
“ఇట్స్ ఆల్ రైట్… నేను మిమ్మల్ని ఓ అందమైన సాయంత్రం కలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు ఆ అందమైన సాయంత్రం కాకూడదా?” అన్నాడు.
మాళవిక నవ్వుకుంది. “ఎన్ని గంటలకి?” అని అడిగింది.
అతను చెప్పాడు.
ఇతరుల అదృష్టాన్ని చూసి అసూయ పడకుండా వుండగలగటం దైవ లక్షణం అన్నాడు రవీంద్రనాథ్ టాగోర్!
మాళవికకి సతీష్ చంద్రని చూస్తున్న కొద్దీ అతని భార్య మీద అసూయ రెట్టింపయింది.
సతీష్ చంద్రకి నీట్‍గా డ్రెస్ అప్ అవడం, చక్కని ఏక్సెంట్‍లో ఇంగ్లీషు మాట్లాడడం, జోక్స్ కట్ చేయడమే కాదు, ఎదుటివాళ్ళను చక్కలిగింతలు పెట్టేట్లు చూడడం కూడా వచ్చు. అతను చాలా హేండ్సమ్‍గా వున్నాడు.
మాళవిక అతని చేతి వేళ్ళ కేసి చూస్తూ మాట్లాడింది. వేలికున్న వుంగరంలో డైమండ్ చమక్కుమని మెరుస్తోంది!
సిటీలో కెల్లా పెద్దదైన ఫైవ్ స్టార్ హోటల్‍లో వాళ్ళిద్దరూ డిన్నర్ చేసారు.
“ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను” అన్నాడు.
ఆమె అంగీకారం తెలిపింది.
కార్లో అతను ఆమెకి తగులుతూ కూర్చున్నాడు. అతని నుంచి మత్తైన ఇంటిమేట్ స్ప్రే పరిమళం ఆమె ముక్కుపుటాలకు సోకుతోంది.
అతను ఓ పెద్ద కంపెనీకి ఎం.డి. ఒకప్పుడు తను వుద్యోగం కోసం వెళితే ఈ టాప్ ఎగ్జిక్యూటివ్స్ అసలు మొహం చూసి మాట్లాడేవారు కూడా కాదు!
మాళవికకి తన ఒంటి రంగూ, పన్ను మీద పన్నూ, గెడ్డం కింద దెబ్బ మానిన మచ్చా అంటే చాలా అసహ్యం. అందుకే ఆమె ఎప్పుడూ తెల్లని వాళ్ళతో, అందమైన వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చెయ్యదు!
కానీ… ఇవన్నీ సతీష్ చంద్రకి తనతో స్నేహం చెయ్యడానికి అడ్డు కాలేదు. అతను తన రచనల్ని పొగుడుతూ మాట్లాడుతున్నాడు.
“స్త్రీలో ఎంత అందం వున్నదన్నది పాయింట్ కాదు! ఎంత భావుకత్వం, ప్రేమించే హృదయం వున్నాయి అనేవి ముఖ్యం! అవి మీ రచయితలకి వుంటాయి” అన్నాడు.
‘నేను ఒకప్పుడు ఇలాగే అనుకుని పెన్ను పట్టాను’ అనుకుంది మాళవిక.
“ఎన్నో వ్యాపకాలతో, వ్యవహారాలలో మునిగి తేలుతూ, అలసిపోయే మగాడు కేవలం మనసిచ్చిన స్త్రీ సాహచర్యంలోనే సేద దీరగలడు. అలాంటి ఆనందం నాలాంటి వాడికి మృగ్యం!” అని నిట్టూర్చాడు.
మాళవిక ఆశ్చర్యంగా, “ఏం… మీ భార్య మీతో ప్రేమగా వుండదా?” అంది.
“ప్రే… మ! హు, అలాంటి పదం ఒకటున్నది అనే విషయం కూడా ఆమెకు తెలియదేమో. బ్యాంక్ బాలన్స్, కిట్టీ పార్టీలూ, ఫ్యాషన్ షోలూ, స్టేటస్ మెయిన్‍టెయినెన్స్… ఇవే ఆమెకి తెలిసిన ప్రాపంచిక విషయలు. డబ్బు కావలసినప్పుడు మాత్రం ఆమెకి నేను గుర్తొస్తుంటాను. నేను ఇంటికెళ్ళగానే మా పెంపుడు కుక్కా, ‘కాఫీ కావాలా అయ్యా’ అనే ముసలి నౌకరూ లేకపోతే నా బ్రతుకు ఇంకా దుర్భరంగా తయారయ్యేది. అసలు రోజురోజుకీ నాలో డిప్రెషన్ పేరుకుపోతోంది. ఎందుకీ సంపాదనా… ఏం సాధించానని ఈ బ్రతుకూ? అనిపిస్తోంది!” ఆవేదనగా అన్నాడు.
మాళవిక కళ్ళు చీకట్లో సైతం మెరిసాయి. ఆ డిప్రెషన్, హ్యుమిలియేషన్ తనకు కావాలి! మగాడు సేద దీరడం కోసం తన కౌగిలి కన్నా అనువైన ప్రదేశం ఏముంటుందీ?
ఆమె అతని చేతి మీద తన చేతిని వేసి “నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను” అంది.
అతని చెయ్యి స్వల్పంగా వణికింది.
“స్త్రీ స్పర్శకి కూడా నేను మోహం వాచేట్టు చేసింది నా భార్య!” అన్నాడు.
పెళ్ళయిన ఆడవాళ్ళందరూ ఇంతే! పెళ్ళయ్యే దాకా భర్తనీ, పెళ్ళయ్యాకా, అతన్ని తప్ప మిగతా ఆనందాలనీ ప్రేమిస్తారు. పెరట్లోని పారిజాతాలని ఏరుకోకుండా ప్లాస్టిక్ కవర్లలో పెట్టిన వడలిన పూలని కోరుకుంటారు. వాళ్ళ అజ్ఞానం ఇంకొకరికి వరం అవుతుంది.
‘ఓ మహిళా నువ్వు జాగృతం కాకు! అలాగే వుండు!’ అనుకుని నవ్వుకుంది మాళవిక.
కారు ఆగిపోయినట్లు ఆమెకి తెలిసింది.
సతీష్ చంద్ర తల ఆమె గుండెల మధ్యలో చేరింది. “మాళవికా నాకు కావల్సింది సెక్స్ మాత్రమే కాదు… ప్రేమ! ఐ యామ్ స్టార్వ్‌డ్!” అతను గొణుగుతున్నాడు.
మాళవిక అతని జుట్టును నిమురుతూ “నా అపార్ట్‌మెంట్‌కి వెళ్దాం” అంది.
ఆ రాత్రంతా మాళవిక సతీష్ చంద్రని ప్రేమించింది.
ఆమె అందంగా వుందా లేదా అని కానీ, తెలివైనదా కాదా అని కానీ అతనికి అనవసరం! ఆమె స్త్రీ… పైగా భార్య కాదు. ఇది చాలు మగవాడి ఈగో తృప్తి చెందడానికి.
సతీష్ చంద్రకి స్త్రీ స్కేర్సిటీ కాదు. కావాలనుకుంటే చాలా మంది వస్తారు. కానీ మాళవిక అతని కళ్ళకి స్పెషల్‍గా అనిపించింది. ఆమెలో తనకి కావలసినది ఏదో దాగుంది అనుకున్నాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. అతనికి కావలసింది అతని సామర్థ్యం మీద అతనికి నమ్మకం. ఆ నమ్మకాన్ని మాళవిక నిలబెట్టింది.
ప్రతీసారీ తమకంతో కరుగుతూ ఆమె చేసిన ఆర్తనాదాలూ, భావప్రాప్తి సంకేతాలూ అతన్ని ఎవరెస్ట్ పర్వతం మీద నిలబెట్టాయి.
“ఐ లవ్ యూ” అంటూ వుంటే అతని కళ్ళ లోంచి నీళ్ళు జలజలా రాలాయి.
శీతాకాలం రాత్రి చలినెగడులా ఆమె అతన్ని అక్కున చేర్చుకుంది.
‘ఐ లవ్ ఎ పెర్‌ఫెక్ట్ మేన్… మేన్! నాట్ ఏ బ్రూట్! బట్ ఇప్పటిదాకా తగలలేదు’ అనుకుంది మాళవిక. తగిలితే ప్రేమించగలదా? ఏమో…
***
ఒకప్పుడు మాళవిక కూడా ప్రేమించింది. అదీ ఆమె పన్నెండో ఏట! పక్కింట్లో అద్దెకి దిగిన రమామణి భర్త సాగర్‌ని.
సాగర్ భార్యకి ప్రతిరోజూ రాత్రి మల్లెపూల పొట్లం, స్వీట్లూ పట్టుకుని హుషారుగా ఈల వేస్తూ వచ్చేవాడు.
“రమా… రమా… ” అంటూ ఆమె వెంట వెంట తిరుగుతూ అన్ని పనుల్లో సాయం చేసేవాడు. సాయంత్రాలు స్కూటర్ మీద కూర్చోపెట్టుకుని షికారుకి తీసుకెళ్ళేవాడు.
ఒకనాడు రమామణికి యిచ్చి రమ్మని తల్లి చింతకాయ పచ్చడిచ్చి పంపిస్తే మాళవిక వాళ్ళ యింటికి వెళ్ళింది. ఆ సమయంలో వాళ్ళిద్దరూ బెడ్ రూమ్‍లో వున్నారు. తలుపు దగ్గరికి వేసి వుంది. రమామాణి మూల్గులూ, సాగర్ మాటలూ వినిపిస్తున్నాయి.
మాళవికకి భయంతో కలగలిసిన కుతూహలం కలిగింది. నెమ్మదిగా శబ్దం కాకుండా వెళ్ళి తలుపు కొద్దిగా తోసి, ఆ సందులోంచి చూసింది. ఆ దృశ్యం చూడగానే మాళవికకి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంతవరకూ వూహకు మాత్రమే పరిమితమైన విషయం కళ్ళారా చూసేసరికీ ఆమెకి గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మిగతా ఆడపిల్లల్లా ఆ దృశ్యం ఆమెకు భయాన్నీ, విస్మయాన్నీ బదులు ఆపుకోలేని కోరికని కలిగించింది!
మాళవిక నెమ్మదిగా ఇల్లు చేరింది. ఆమెకి కళ్ళలోంచి ఆ దృశ్యం మాయం అవడం లేదు. నగ్నంగా మెరుస్తున్న సాగర్ వీపు మీద రమామణి చేతుల కదలికా, ఆమె అనుభవిస్తున్న ఆనందం తాలూకు నిట్టూర్పులూ… ఆమె చెవుల్లో మార్మ్రోగాయి.
మాళవికకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
మరునాడు ఆమె రజస్వలయింది.
మొదటిగా ఆ విషయం ఆమె తల్లికి తెలిసింది. ఆవిడ వెంటనే మాళవికతో, “ఈ సంగతి ఎక్కడా అనకు!” అంది.
మాళవిక కచ్చగా పెదవిని మునిపంట బిగబట్టింది. తన తల్లి ఎవరింట్లో ఆడపిల్లలు సమర్తాడినా వెళ్ళి భోంచేసి వస్తుంది.
తల్లి లోగొంతుతో తండ్రికి ఈ సంగతి వివరిస్తోంది. ఆయన కూడా కంగారుగా ఏదో అంటున్నాడు.
మాళవిక ఆలోచిస్తోంది. ఈ సంగతి నలుగురికీ తెలియకపోతే ఎలా? తను పెద్ద మనిషైనట్లు ఆ వీధిలో కుర్రకారుకి… ముఖ్యంగా సాగర్‍కీ తెలియకపోతే ఎలా? అనుకుంది.
తల్లి మామూలుగా తలంటు పోసి, కంచంలో అన్నం, పెసరపప్పూ వడ్డించి, “ఓ నాలుగు రోజులు పచ్చడి సుద్దలు మింగకు” అంది.
మాళవిక రెండు రోజుల తర్వాత బడికి బయల్దేరింది. ఎదురు గుమ్మంలో సాగర్ కనిపించాడు. ఆమెకి ఆ రాత్రి సంఘటన కళ్ళల్లో మెదిలింది. అతని వైపు సూటిగా చూసింది. ఆ తర్వాత చిన్నగా నవ్వింది.
సాగర్ కూడా జవాబుగా నవ్వాడు.
మాళవికకి స్కూల్లో కూడా సాగర్ తనని చూసి నవ్వడం మాటిమాటికీ గుర్తొస్తునే వుంది. మధ్యాహ్నం లంచ్ బెల్‍లో ఇంటికొచ్చేసింది. మంచం మీద బోర్లా పడుకుని అతని గురించి పదే పదే ఆలోచించింది. సాయంత్రం అతను వచ్చే టైంకి మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని, బొట్టు పెట్టుకుని, జుట్టు పైపైన దువ్వుకొని, పెరట్లో పూసిన జాజిపూలతో వాళ్ళింటికి బయల్దేరింది.
రమామణి అప్పటికే నీట్‍గా తయ్యారయి వంటింట్లో పకోడీలు వేస్తోంది.
“అక్కా…” అంటూ మాళవిక లోపకికి వెళ్ళింది.
రమామణి వెనక్కి తిరగకుండానే, “రా… రా…” అంది.
మాళవిక పూలు కడ్తూ రమామణితో కబుర్లలోకి దిగింది.
సాగర్ స్కూటర్ చప్పుడు వినిపించింది.
“నే వెళ్తానక్కా… బావగారు వచ్చినట్లున్నారూ!” అంది కదిలే ప్రయత్నం చెయ్యకుండానే.
“బావగారొస్తే నీకేం? చిన్నపిల్లవీ” అంది రమామణి.
“రమా… రమా…” అని పిలుస్తూ స్పీడ్‍గా వచ్చిన సాగర్ మాళవికని చూసి ఆగిపోయాడు.
మాళవిక అతని వైపు చూసి అదోలా నవ్వింది.
సాగర్ తల నిమురుకుంటూ “రమా… మంచినీళ్ళు పట్రా…” అని వెళ్ళిపోయాడు.
రమామణి ముసిముసిగా నవ్వుతూ, “అబ్బా! ఒక్క నిమిషం వూపిరి ఆడనియ్యరుగా… మాలా… వెళ్ళి మంచినీళ్ళిచ్చిరా” అంది.
మాళవికకి చాలా సంతోషమేసింది.
మంచినీళ్ళ గ్లాసు పట్టుకుని సాగర్ రూమ్ లోకి వెళ్ళింది.
అతను ఒంగి షూస్ విప్పుకుంటున్నాడు.
ఆమె గ్లాసు కొద్దిగా వంచింది. నీళ్ళు అతని మెడ మీద పడి దిగ్గున తలెత్తాడు.
“సారీ… అక్క ఇచ్చి రమ్మంది” అంది.
సాగర్ నవ్వేసి, “సరే… అక్కడ పెట్టి వెళ్ళు” అన్నాడు.
మాళవిక వెళ్ళలేదు. ఎదురుగా వున్న పత్రిక తీసి పేజీలు తిప్పుతూ “ప్రేమ సమరం సీరియల్ చదువుతున్నారా?” అంది.
అతను మంచినీళ్ళు తాగుతూ, “అలాంటివి నువ్వు చదవకూడదు… బాలజ్యోతి చదువుకో!” అన్నాడు.
మాళవిక కోపంగా “టీనేజ్ అంటారు, ఎప్పటి నుండో తెలుసా?” అని అడిగింది.
అతను అర్థం కానట్లు చూసాడు.
“థర్టీన్ నుంచి నైన్‍టీన్ వరకూ టీన్స్! నాకు ట్వెల్వ్ నిండాయి!” అంది.
సాగర్ పెద్దగా నవ్వుతూ “రమా… రమా… ఇట్రా” అని పిలిచాడు.
రమామణి పకోడీల ప్లేట్‌తో “ఏవిటా నవ్వు? ఏవైందీ?” అంటూ వచ్చింది.
సాగర్ చిలిపిగా “మాళవికకి టీనేజ్‌కి అర్థం తెలిసిపోయింది. నీకన్నా ఫాస్ట్!” అన్నాడు.
“పోండీ… చిన్నపిల్లతో ఏమిటా మాటలు? మాలా… గట్టు మీద పెట్టిన పకోడీల ప్లేటు తీసుకుని ఇంటికి వెళ్ళు” అంది.
మాళవికకి ఆ నిమిషంలో రమామణి విలన్‍లా కనిపించింది. విధి లేక ఇంటికి వెళ్ళిపోయింది. కానీ సాగర్‍తో మాట్లాడే నెపం వెతుకుతూనే వుంది.
మాళవిక కోరిక అనుకోని విధంగా తీరింది.
“మాలా… ఈ రోజు రమక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. భోజనానికి రమ్మంటే అబ్బాయి మొహమాటపడ్డాడు. కాస్త ఈ కూరా, చారూ ఇచ్చి రామ్మా” అంది తల్లి.
మాళవిక హుషారుగా బయల్దేరబోతూ వుంటే, తండ్రి అడ్డుపడి “వయసొచ్చిన పిల్ల చేత పంపిస్తావేమిటే? మన నందిని చేత పంపించు!” అన్నాడు.
మాళవికకి తండ్రి పీక కసిగా నొక్కేయాలనిపించింది.
“నా మొహం! దానికేం వయసొచ్చింది? అయినా సాగర్ అందరిలాంటి వాడు కాదు! రమ అదృష్టవంతురాలు. బుద్ధిమంతుడైన కుర్రాడు. నువ్వెళ్ళి రావే” అంది ఆవిడ.
మాళవిక పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళేసరికీ సాగర్ వంట గిన్నెలతో కుస్తీ పడ్తున్నాడు.
(ఇంకా ఉంది)