[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]
[dropcap]‘‘మొ[/dropcap]త్తం అంతా అంటే ఎంత చూసావ్? ఏం చూశావ్?”
మాయ నా గదిలోకి వచ్చింది, నేను చూసుకోలేదు.
“సారీ! డోర్ ఓపెన్ చేసి ఉంటే, నాక్ చేయలేదు.” నవ్వుతూ అంది
“ఫరవాలేదులే!”
“సరే! ఇంతకీ ఏం చూసావ్?”
“అబ్బా మాయా! ప్లీజ్ వదిలేయ్!”
“లేదు, నేను నిజంగానే అడుగుతున్నా…”
“ఆ…!, హైదరాబాదు సెంట్రల్‌కి వెళ్ళా, ఐమాక్స్, గచ్చిబౌలి, ఇలా చాలా చాలా…”
“‘ఓల్డ్ సిటి’ చూసావా?”
“అంటే?”
“ఏంటీ నువ్వు ఓల్డ్ సిటీ చూడలేదా? మరి ఇంకేం చూసావు హైదరాబాదులో? మిగతావన్నీ వేస్ట్. ఇప్పుడే చూడటానికి వెళుతున్నాం.”
“ఇప్పుడా?”
“ఏం, నీకు ఇంకేం పని ఉంది బాబు?”
“రేపు వెళదాo, రేపు ఎలాగో అందరు పార్టీకి వెళుతున్నారు..”
“నన్ను రమ్మని అన్నారు, కానీ నాకు ఇష్టం లేదు. ఈ వంక చెప్పి మానేయొచ్చు.” మాయ చప్పట్లు కొట్టింది.
***
“ప్లీజ్ మాయా …..”
“కారులో వెళదాం.”
“నీకేమన్నా పిచ్చా? కారేంటి. ఓల్డ్ సిటీలో బైక్ కూడా కష్టం. ముందు ఎక్కు.”
నేను అనుమానంగా చూసాను. ఇవేమి మాయ పట్టించుకోవట్లేదు.
“ఎక్కవోయ్…. నీ గ్లామర్ ఏమి తగ్గిపోదు.” తొందర పెట్టింది.
చిన్నచిన్న సందుల్లోంచి, ఊపిరి కూడా ఆడనంత కిటకిటలాడే జనం మధ్య నుంచి చార్మినార్ చేరాం.
మాయ నిజమే చెప్పింది.
నేను హైదరాబాద్లో చూసినవన్నీ వేస్ట్ – చార్మినార్ ముందు.
చరిత్రాత్మక కట్టడాలు చాలా చూసాను. ఇలాంటిది మాత్రం మొదటిసారి. చాలా విచిత్రమైన ప్రదేశం.
గజిబిజి జీవితంలో, వేలాదిమంది పరుగు మధ్య, వందలాది సంవత్సరాలుగా పాతుకుపోయిన సంస్కృతికి సాక్షిగా, నాలుగు దారుల కూడలిలో నిటారుగా నిబడిన చార్మినార్ అద్భుతంగా ఉంది.
“ఇక్కడ గాజులు చాలా ఫేమస్ తెలుసా?”
“అవునా?”
“ఏమైనా కొంటావా?” మాయ అడిగింది.
“సరే ఇంట్లో అంతమంది కజిన్స్ ఉన్నారుగా. తీస్కో.”
మాయ డిజైన్స్ చూస్తోంది.
ఏదో వింత అనుభూతి, ఇంకా బయటకు రాలేకపోతున్నాను.
ప్రతి కట్టడం… కాలగర్భంలో కలిసిపోతుంది. మనం దాని దగ్గరకు వెళ్ళినపుడు ఆ సమయాన్ని అంచనా వేస్తాం. కాని ఇది వేరు.
చార్మినార్ చరిత్ర కాదు,. జీవన శైలి.
ఈ షాప్ వాడిని ఇక్కడే పుట్టి పెరగడం చూసింది. అతని తండ్రిని చూసింది… రేపు వాడి కొడుకుని చూస్తుంది….
“ఒక్క నిమిషం వదిలేస్తే చాలు… అలా ఎటో వెళ్ళిపోతావు.” మాయ కదిలించింది.
మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను.
“మాయా! నువ్వు ఇక్కడే చూస్తూ వుండు… నేను ఈ గల్లీ చివరి వరకు వెళ్లొస్తాను.”
“ఎక్కువ దూరం వెళ్ళకు, మళ్ళీ తప్పిపోతే చాలా కష్టం.”
“లేదు, కొంచెం దూరం అంతే.”
“సరే! ఒక్క నిమిషం.” మాయ నా దగ్గరకు వచ్చింది.
“చూడు …. నువ్వు కొత్తవాడివని అందరూ గుర్తుపట్టేస్తారు. నీకు అన్నీ ఎక్కువ రేట్ చెబుతారు. నువ్వు ప్రతీది బేరం ఆడాలి. వాళ్ళు వంద చెబితే… నువ్వు యాభై అనాలి. సరేనా!” చెవిలో చెప్పింది.
అరే! భలే ఉంది. బార్గెయిన్ నాకు ఇదే మొదటిసారి. చూద్దాం.
“బాబు…. ఇది ఫ్రెష్ కొబ్బరి నీళ్ళా?”
కొబ్బరి బొండాం బండి వాడు ఎగాదిగా చూసాడు.
“జీ! సాబ్”
“ఒకటి ఎంత?”
“ఇరవై రూపాయిలు సాబ్.”
“అవునా…. పది కిస్తావా?”
“మనది ఎక్కడ సాబ్?”
“అంటే?”
“ఏ దేశం సార్?”
అమ్మో! గుర్తు పట్టేశాడు…
“నీ కెలా తెలుసు?” నాకు విపరీతంగా ఆశ్చర్యం వేసింది.
“ఒక్క కొబ్బరి బోండం బేరం ఎవరు చేస్తారు సాబ్? పది, ఇరవై కొబ్బరి బోండాళ్లు అయితే బేరం చెయ్యి సాబ్.” వాడు పళ్ళికిలించాడు.
తలాడించి, అక్కడి నుంచి ముందుకెళ్ళాను. వరుసగా పదికి పైనే గాజుల దుకాణాలు ఉన్నాయి. జనాలు చిన్నచిన్న గుంపుగా.. భలేగా ఉన్నారు.
చూద్దాం నా బేరం టాలెంట్ ఎలా ఉందో?
కొబ్బరి బొండాం వాడు పది ఇరవై అయ్యితే బేరం అన్నాడు కదా!
“బాబు ఒక పది గాజులు కావాలి.”
“డజనా సాబ్?”
“సరే, ఎంత?”
“రెండు వంద యాభై.”
నూట ఇరవైకి ఇస్తావా?
“లేదు, సాబ్. నక్కో, లేవ్ సాబ్! నక్కో, లేవ్ సాబ్ …..”
ఏం మాట్లాడుతున్నాడు వీడు?
మొదట ఆశ్చర్యమేసింది. తరువాత విపరీతంగా కోపం వచ్చింది. ఒకటా రెండా? డజన్ గాజులు కొంటున్నా.
“అరే నేనెంత మర్యాదగా అడిగాను. నువ్వేంటి తిడతావ్?”
“ఆరే ‘నక్కో, లేవ్ సాబ్… ’ బోలా సాబ్. తిట్టలేదు.”
“అదిగో, మళ్ళీ తిడుతున్నావ్.”
“నక్కో సాబ్, కైకు భేజా ఖాతే సాబ్?”
ఎంత పొగరు?
“ఉండు, ఇప్పుడే పోలీస్‌కి ఫోన్ చేస్తా.”
“అదే సాబ్ కైకు ఫోన్?”
“షటప్!” కొంచెం గట్టిగా అరిచాను.
తల పైకెత్తే సరికి, కొట్టువాడి వెనుక నలుగురు నిల్చొని ఉన్నారు. కొంచెం గట్టిగానే.
చూసి కొంచెం భయం వేసింది.
ఎక్కడి నుంచో మాయ సమయానికి పరిగెత్తుకుంటు వచ్చింది.
“సారీ భాయ్! సారీ సారీ!”
“వీడు నన్ను తిడుతున్నాడు మాయా!”
“నువ్వు నోరుమూసుకొని ముందు రా!” మాయ నన్ను లాక్కుని, తీసుకుని వెళ్ళింది.
“ఏంటి మాయ?” నేను చిరాగ్గా చేయి విదిలించాను.
“నీకేమన్న పిచ్చా? వాడితో ఏంటి గొడవ?”
“వాడు నన్ను ఎలా తిట్టాడో తెలుసా?”
“బాబు ఇది హైదరాబాదీ ఉర్దు. తిట్టలేదు.”
“ఆ మాత్రం నాకు తెలుసు ఉర్దు ఎలా ఉంటుందో. కాని వాడు నాక్కో.. నాక్కో… కక్కు… కక్కు… అన్నాడు.”
మాయ ఒక్క క్షణం ఆగిపోయింది.
తరువాత భళ్ళున నవ్వు మొదలు పెట్టింది.
“బాబు అది నక్కో… నాక్కో కాదు. నక్కో అంటే వద్దు అని. కక్కు కాదు. కైకు అంటే ‘వై’ అని, ‘ఎందుకు’ అని. హహహహ….!” నవ్వుతూనే ఉంది.
నాకు మాత్రం మొత్తం మూడ్ఆఫ్ అయిపోయింది.
“సరే! ఇంటికి వెళ్ళిపోదాం” సీరియస్‌గా అన్నాను.
“కక్కు?…. ఇంకొంచెం సిటి చూద్దాం. హ హ హ…”
“మాయా ప్లీజ్…!”
“ఓ! సారీ… నాక్కో …. హ హ హ….”
ఇంటికి వచ్చి గంట దాటింది. అందరు పార్టీ నుంచి అప్పుడే తిరిగి వొచ్చారు.
మాయ జరిగిందంతా చెబుతుంటే పడి పడి నవ్వుకుంటున్నారు.
“పోనిలే పార్టీలో జరిగిన గొడవకి తలా వేడెక్కి పోయింది. ఇదంతా విని హాయిగా ఉంది.” పిన్ని అన్న మాటలకు అందరు నిశబ్దం అయిపోయారు.
***
“అక్కడ నువ్వు చేసిన పని ఏంటి?” అరవింద్ కోపంతో ఊగిపోతున్నాడు
“నేనేం చేశాను?” రచన అయోమయంగా అంది
“ఇంకేం చెయ్యాలి మొత్తం నా పరువు తీశావు. అది చుట్టాల పార్టీ అని నీకు తెలుసు కదా. మా ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారు?”
“అంత తప్పు నేనేం చేశాను అరవింద్??”
“నువ్వు మందు తాగుతావా అని సరదాగా మా కజిన్ అడుగుతే తాగుతానని ఎందుకు చెప్పావ్? సిగ్గుగా లేదా అలా మాట్లాడడానికి? మా వాళ్లు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంత చెత్త అని అనుకుంటారు”
“నోరు అదుపులో పెట్టుకో” రచన గట్టిగా అరిచింది.
“నేను అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను నీకు తెలుసు కదా, అయినా నేను ఏదో మైకం వొచ్చినట్టు తాగుతానా? ఏదో కొంచం, అది పార్టీలోనే, ఆ సంగతంతా నీకు తెలుసు”
“అది నిజమే రచన కానీ మా వాళ్ల ముందు చెప్పాల్సిన అవసరం ఏంటి?”
“నేను ఎందుకు అబద్దం చెప్పాలి? నేను ఎందుకు దాచి పెట్టాలి అరవింద్? మీ ఫ్యామిలీని ఒప్పించే కదా పెళ్లి చేసుకున్నావ్?”
“చాలా మంచిదానివి అని చెప్పి పెళ్లి చేసుకున్నా. అంత నా కర్మ! ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పటికే నువ్వు చేసే పనుల వల్ల అందరు విసిగిపోయారు.”
“నేనే చేశాను?” రచన ఆశర్యపోయింది.
అంత మతిపోయినట్టయింది
తన భర్తేనా ఇలా తన గురించి మాట్లాడుతుంది?? ఒక్క నిమిషం అర్థం కాలేదు.
“ఇంకేం చేయాలి?” అరవింద్ కోపం ఎక్కువైపోయింది.
“ఎప్పుడైనా ఇంటిపట్టున ఉన్నావా? రోజంతా ఆఫీస్ ఆఫీస్ అంటావ్. శని ఆది వారాలు ట్రైనింగ్ అని కబుర్లు చెప్పి తప్పించుకుంటావు. ఏదో ఊరుకుంటున్నాను కదా అని ఇంకెన్ని రోజులే కాంప్రమైజ్?”
“నువ్వేం మాట్లాడుతున్నావ్ అరవింద్? కాంప్రమైజ్ ఏంటి? నేను ఎలా ఉంటాను నీకు ముందే తెలుసు కదా? నీకు నేను నాలుగేళ్లుగా పరిచయం. నా జీవితం గురించి, ఆశల గురించి అన్ని తెలుసు కదా? అప్పుడు నచ్చి పెళ్లి చేసుక్కున్నావ్ కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంప్రమైజ్ ఏంటి?”
“మరి ఇంకేం అంటారు రచనా?. నేను మాత్రం ఇవన్నీ చేయాలా, నీ తరఫునుంచి ఏమైనా చేసావా??”
అరవింద్ మాటకి రచనకు కోపం వచ్చింది.
“నేను కాలేదా కాంప్రమైజ్? పెళ్లి చేసుకునే సమయానికి నీకు నాకంటే నీకు జీతం తక్కువ, స్టేటస్ తక్కువ. అయినా పెళ్లి చేసుకున్నా కదా? అది కాంప్రమైజ్ కాదా?”
“ఓహ్, అదా సంగతి, అందుకు ఏదిపడితే అది చేస్తావ్, ఎలా పడితే అలా ఉంటావ్. అందుకే నేనంటే చీప్‌గా చూస్తావ్. నా మాటంటే నీకు గౌరవం లేదు.”
“అదేంటి అలా మాట్లాడతావు అరవింద్!!” రచన గొంతు పూడుకుపోయింది.
“నేను నీతో ఎలా ఉన్నా అది నీకు ఇష్టం అనుకున్నాను. నువ్విలా ఆలోచిస్తావ్ అనుకోలేదు.”
“నేను ఇలానే ఆలోచిస్తాను. నీ అంత ఇంటెలిజెంట్ కాదు కదా. కాని ఇది నా ఇల్లు. ఇక్కడ నీకు ఇష్టం ఉన్నట్టు చెయ్యలేవు.”
“నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఏం చేస్తున్నాను అరవింద్. అలా అయితే మా నాన్నతో ఎప్పుడో మాట్లాడేదాన్ని. నిన్ను అవమానించాడని నేను ఆయనతో మూడేళ్ల నుంచి మాట్లాడటం లేదు. మా నాన్న అంటే ఎంత ప్రేమో తెలుసా? ఇంకా నేను ఏం ప్రూవ్ చేసుకోవాలి?”
“ఓహో ఏంటి పెద్ద త్యాగం చేశా అనుకుంటున్నావా? అవసరం లేదు నువ్వు నా కోసం కాంప్రమైజ్ కావొద్దు. నువ్వు నా కోసం మీ నాన్నకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఫో మీ నాన్న దగ్గరికి. ఛీఛీ! మా వాళ్ళు చెప్పిన వినకుండా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది.”
***
(సశేషం)