మరోసారి స్మరించుకోవలసిన సినిమా ‘న్యాయం కావాలి’

1
7

[dropcap]డి. [/dropcap]కామేశ్వరి గారి ‘కొత్త మలుపు’ నవలను 1981లో తెలుగులో సినిమాగా తీసారు. అదే ‘న్యాయం కావాలి’. మినిమం బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఎన్ని చర్చలకు కారణమయ్యిందో తెలుసుకోవాలంటే అప్పటి సినీ ప్రేమికులను, పుస్తక ప్రేమికులను కదిలించాలి. తెలుగులో స్త్రీ సమస్యలపై వచ్చిన గొప్ప సినిమాగా నిస్సంకోచంగా చెప్పుకోదగ్గ మంచి సినిమా ఇది. రాధిక, చిరంజీవి, శారద, జగ్గయ్య, రోహిణి, ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను తరువాత అన్ని దక్షిణాది భాషలలో పునర్నిర్మించారంటే ఈ కథకు ఉన్న బలం అర్థం చేసుకోవచ్చు. అన్ని భాషలలోనూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తమిళంలో ‘విధి’, కన్నడంలో ‘కెలళిద హెణ్ణు’, మళయాళంలో ‘థాలం థెట్టియ తారాట్టు’, హిందీలో ‘ముఝె ఇన్సాఫ్ చాహియే’ పేర్లతో తీసిన ఈ సినిమా, దేశంలో అవివాహిత తల్లుల గొంతుకను వినిపిస్తుంది.

భారతి డిగ్రీ అయిపోయి ఒక టైపు ఇన్‌స్టిట్యూట్‌లో టైప్ నేర్చుకుంటూ ఉంటుంది. ఆమెను చూసి మోహిస్తాడు సురేష్. అతను తనతో మాట్లాడడానికి తాపత్రయపడడం, తన వెంట పడడం చూసి అది ప్రేమ అని నమ్మి అతన్ని ఇష్టపడుతుంది భారతి. ఒక రోజు అతనితో పిక్నిక్‌కి వెళుతుంది. అతనో హోటల్‌కు తీసుకు వెళితే అతన్ని నమ్మి వెళుతుంది. అక్కడ ఇద్దరూ తొందరపడతారు. భారతికి ఇది ప్రేమికుల మధ్య అతి సహజం అని చెప్పి ఆమెను ఇంటికి తీసుకువస్తాడు సురేష్. భారతి తండ్రి కోర్టులో పని చేస్తున్న ఒక గుమస్తా. సాధారణ మధ్యతరగతికి ప్రతినిధి అతను. లోకనిందకు భయపడే సగటు మానవుడు. కూతురు సురేష్‌తో తిరుగుతుందని తెలుసుకుని ఆమెను నిలదీస్తాడు. తాను సురేష్‌ని ప్రేమించానని అతన్నే వివాహం చేసుకుంటానని, సురేష్‌కి తనంటే ప్రాణమని తండ్రిని ఎదిరిస్తుంది భారతి. ఇంట్లో తమ ప్రేమ విషయం తెలిసిపోయిందని సురేష్‌కి చెబుతుంది. తాము పెళ్ళి చేసుకుందాం అంటుంది. ఇప్పుడే పెళ్ళేమిటీ అన్న సురేష్‌తో కనీసం తన తండ్రితో వచ్చి మాట్లాడమని కోరుతుంది. తాను ఆమెను వివాహం చేసుకునే ఆలోచనతో ఆమెకు చేరువ కాలేదని, తామిద్దరి మధ్య ఉన్నది కేవలం సరదా అని, భారతిని వివాహం చేసుకునే ఉద్దేశం తనకు లేదని తెగేసి చెబుతాడు సురేష్.

భారతి తండ్రి ద్వారా లాయర్ శకుంతల గురించి వింటూ ఉంటుంది. ఆమె స్త్రీ పక్షాన వాదించే లాయర్ అని అమెకు తెలుసు. తానుగా శకుంతలను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళుతుంది. తనకు జరిగిన మోసం చెప్పి తాను సురేష్‌ని వదిలిపెట్టనని, తప్పు చేసింది తామిద్దరూ అయితే శిక్ష కేవలం స్త్రీగా తానే ఎందుకు భరించాలని, సురేష్ మర్యాదస్థుడిగా ఎందుకు మిగిలిపోవాలని, న్యాయం కోసం తాను కోర్టుకు వెళ్ళాలని అనుకుంటున్నానని సహయపడమని భారతి శకుంతలను అభ్యర్థిస్తుంది. దీని పర్యవసానం దారుణంగా ఉంటుందని, భారతి లోకం ముందు దోషిగా నిలబడవలసి వస్తుందని, ఆమె కుటుంబం అవమానాలకు గురి కావలసి వస్తుందని శకుంతల భారతికి చెబుతుంది. తాను అన్ని అనుభవించడానికి సిద్ధమని, ఇప్పుడు తాను గర్భవతినని, ఆ బిడ్డను కని తీరతానని, ఆ పై తానే పెంచుకుంటానని శకుంతలకు చెబుతుంది భారతి.

పెళ్ళి కాకుండా బిడ్డను జన్మ నివ్వడానికి సిద్దపడిన భారతిని తండ్రి ఇంటి నుంఛి వెళ్ళిపొమ్మంటే శకుంతల ఆమెకు ఆశ్రయం ఇస్తుంది. సురేష్ తండ్రి ప్రఖ్యాత లాయర్ దయానిధి. అతనో కోటీశ్వరుడు. శకుంతల సలహా మీద భారతి సురేష్‌ను కలిసి తాను తల్లిని అవబోతున్న నిజం చెబుతుంది. సురేష్ అమెను అవమానించి దూషిస్తాడు. భారతి సురేష్ ఇంటికి వెళ్ళి దయానిధిని కలుస్తుంది. దయానిధి కూడా ఆమెను అవమానిస్తాడు. భారతి తండ్రిని కోర్టులో నలుగురి ఎదుటా అనరాని మాటలంటాడు.

శకుంతల ఒక బిడ్డను పెంచుకుంటుంది. అయితే ఆ బిడ్డ తనకు దయానిధికి పుట్టిన బిడ్డ అని. ధైర్యం లేక ఆమెను అనాథలా కొన్ని రోజులు తాను వదిలేసానని, చివరకు తెచ్చుకుని పెంచుకుంటున్నా ఆ బిడ్డ తనను అమ్మగారు అని తప్ప అమ్మ అని పిలవట్లేదని బాధపడుతుంది శకుంతల. భారతికి ఉన్నధైర్యం తనకు లేక తన బిడ్డకే తాను పెంపుడు తల్లిగా మారానని బాధపడుతుంది. శకుంతల కోర్టులో భారతి తరుపున వాదించి, సురేష్ ఒక పద్దతిగా భారతిని లోబర్చుకున్నాడని, అతనిది మోసం అని నిరూపిస్తుంది. కేసు గెలిచిన సమయంలోనే తన బిడ్డను భారతికి అప్పజెప్పి, శకుంతల మరణిస్తుంది. కేసు గెలిచిన తరువాత సురేష్‌ని వివాహం చేసుకోవడనికి భారతి నిరాకరిస్తుంది. ఒంటరిగా తన బిడ్డను పెంచుతుంది. తరువాత ఒక సందర్భంలో పరిచయం అయిన సురేష్ భార్యకు తన కథను ఆమె చెప్పడంతో సినిమా అంతా ప్లాష్‌బాక్ పద్దతిలో నడుస్తుంది.

‘న్యాయం కావాలి’ సినిమాకు దర్శకత్వం వహించింది ఏ. కోదండరామి రెడ్డి, సినిమాకు నిర్మాత క్రాంతి కుమార్. చక్రవర్తి సంగీతం ఇచ్చిన ఈ సినిమా కేవలం బలమైన కథ కారణంగానే సినీ ప్రేక్షకులను మెప్పించగలిగింది. ఎక్కడ కూడా వివాహానికి ముందు శారీరిక కలయికను సమర్థించినట్లు కనిపించదు. కాని ఆ పొరబాటు వయసు కారణంగా, అపరిపక్వత కారణంగా, ఒక జంట మధ్య జరిగినప్పుడు దాని పర్యవసానం ఇద్దరూ భరించడం న్యాయం అన్న విషయం మీద కథ నిర్మించారు కామేశ్వరి గారు. స్త్రీ వివాహం కాకుండా బిడ్డను కని పెంచడం గురించి ఆలోచించలేని సమాజం మధ్య ఈ కథ ఒక దుమారం రేపిందని చెప్పవచ్చు. బిడ్డను కనాలనే నిర్ణయంలో స్త్రీకి సమాన భాగస్వామ్యం ఉండాలని, స్త్రీ ఒంటరిగా బిడ్డలను పెంచుకోగలదని, ఒంటరి తల్లుల గురించి ఇప్పుడు బాహాటంగా చర్చించుకుంటున్నాం కాని, ఆ ఆలోచనలకు బీజం వేయడంలో ఈ నవల, సినిమా కూడా అప్పట్లో దోహదం చేసాయి.

ఎనభైలలో ఆలోచింపజేసే కథలు వచ్చేవి. సాహిత్యం కూడా చాలా ప్రొగ్రెసివ్ ఆలోచనలతో నిండి ఉండేది. అప్పటి తెలుగు సినిమాను గమనిస్తే వాస్తవానికి సినిమా దగ్గరగా ఉండేది. నటీనటులందరూ సాధారణ మనుష్యులుగా కనిపించాలని తాపత్రయపడేవారు. మేకప్ అవసరానికి ఎంత ఉండాలో అంతే ఉండేది. అనవసరపు విలాసవంతమైన జీవితాలు స్క్రీన్‌పై కనిపించేవి కావు. కథను బట్టి హీరో ఉండే సందర్భాలే ఎక్కువగా ఉండేవి. హీరోయిజం కథను డామినేట్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉండేవి. చిన్న సినిమాలను, కథా బలం ఉంటే ప్రేక్షకులు నడిపించేవారు. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాలను ఆదరించేవారు. నవలలకు పెద్ద పీట వేసేవారు. ఇది యద్దనపూడి గారితో మొదలయి యండమూరి గార్ల వరకు నడిచింది. అంతకు ముందు నవలలు తెలుగు తరపై సినిమాలుగా వచ్చినా మాస్ అపీల్ ఉండేది కాదు. డెభ్భైల నుండి కమర్షియల్ సినిమాను నవల కూడా ప్రభావితం చేయడం మొదలయ్యింది. సాహిత్యం సినిమా రెండు కళా రూపాలుగా సమాంతరాలుగా ఉండేవి. ఆ రోజులలోనే తెలుగు సినిమా అన్ని రకాల భావజాలాలతో ప్రేక్షకులకు ఆలోచించడం నేర్పింది. అలాంటి వాతావరణాన్ని వ్యాపార కోణం డామినేట్ చేయడం మొదలెట్టినప్పటి నుండే సినిమాలో ఆలోచన తగ్గి అతి పెరిగింది. ఆనాటి సినీ ప్రేక్షకుల జీవితాలను ఇప్పటి తెలుగు సినిమా ప్రేక్షకులను గమనిస్తే విలువల పరంగా ఎంతగా సినిమా సమాజాన్ని దిగజార్చిందో గమనించవచ్చు. సమాజంలో కొట్టుకువచ్చిన ఈ అతి వాదాన్ని సినిమా కూడా వ్యాపారం కోసం సమర్థించిందని ఒప్పుకోవడానికి ఇప్పటికీ మనం సిద్ధంగా లేం. ‘న్యాయం కావాలి’లో ప్రస్తావించిన సమస్య ఇప్పుడు కూడా స్త్రీలు అనుభవిస్తున్న సమస్యే. దాని రూపం మారలేదు. దాని చుట్టూ ఉన్న భావజాలం మారలేదు. కాని జీవితంలో పోరాడవలసిన అంశాలు అప్పట్లో ఆత్మగౌరవానికి సంబంధించినవి అయితే ఇప్పుడూ కేవలం అహం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ తేడా స్పష్టంగా ఇటువంటి సమస్యలను ఇప్పుడు ప్రస్తావించే సినిమాల మాధ్యమంగా చూడవచ్చు. అందుకే ‘న్యాయం కావాలి’ సినిమాను మరోసారి స్మరించుకోవలసిన అవసరం ఉంది.

భారతిగా రాధిక, సురేష్‌గా చిరంజీవి, దయానిధిగా జగ్గయ్య, శకుంతలగా శారద గార్లు నటించిన ఈ సినిమా తెలుగు భాషలో వచ్చిన ఒక ఉత్తమ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here