అలనాటి అపురూపాలు-104

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మద్రాసులో సంచలనం సృష్టించిన వైజయంతిమాల తల్లిదండ్రుల కోర్టు కేసు:

వైజయంతిమాల పూర్వీకులు మైసూరు ప్రాంతంలోని మాండ్యాకి చెందినవారు. కానీ వారు 1800 చివరలో మద్రాసుకు వలస వచ్చారు. యదుగిరి దేవి అమ్మాల్ వైజయంతిమాల అమ్మమ్మ. ఆమె తాతగారు ఎం.ఎన్. శ్రీనివాసన్ ఇంపీరియల్ బ్యాంకులో క్లర్కుగా పని చేసేవారు. ఆయనకి లలితకళలంటే ఆసక్తి అమితం. సుగుణ విలాస సభ అనే సంస్థని స్థాపించి, నాటకాలు ప్రదర్శించి, వాటిల్లో నటించారు. ఆయన శ్రీమతి పరిణయం, మైనర్ రాజామణి, విష్ణులీల, బాలామణి వంటి తమిళ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు సైతం పోషించారు. ఈ దంపతులకు 1918లో వసుంధర అనే కూతురు పుట్టింది.

వసుంధరకి కూడా లలితకళలంటే ఆసక్తి కలిగింది. ఆమె చక్కని గాయని, గ్రామఫోన్ రికార్డులకి కూడా పాడారు. మీరా భజనలకు నృత్యం చేస్తూ పాడడానికి వసుంధర పేరు పొందారు. ఈ భజనల గ్రామఫోన్ రికార్డు బాగా అమ్ముడుపోయింది. శ్రీనివాసన్ మీరా కథని నాటకంగా మలచి, కుమార్తెని అందులో నటింపజేశారు. అసలే అందగత్తె అయిన వసుంధర, తన నటనతోనూ ప్రేక్షకులను కట్టిపడేశారు.

వసుంధరకి చిన్నతనంలోనే ఎం.టి.రామన్‌తో వివాహం అయింది. ఆయన అత్యంత నెమ్మదస్థుడు. చాలా తక్కువగా మాట్లాడేవారు. తన భార్య మాటని కాదనలేకపోయేవారు, తన మాట నెగ్గించుకోలేకపోయేవారు. ఆమె ఏం చేయాలనుకుంటే, చేయనిచ్చారు. పి.డబ్ల్యూడి.లో ఆయన డ్రాఫ్ట్స్‌మన్‍గా పనిచేసేవారు. వసుంధరకి 15 ఏళ్ళు ఉండగా వైజయంతిమాల జన్మించారు (క్రింద ఫోటో చూడండి. వసుంధర భర్త కన్నా పొడుగ్గా ఉన్నారు. ఆడపిల్లలకి చిన్నతనంలోనే పెళ్ళి చేస్తే, ఇలానే అవుతుంది. ఆమె భర్త కన్నా పొడుగయ్యే అవకాశం ఉంటుంది).

1939లో వసుంధర మద్రాస్ సంగీత విద్వత్ సభలో గాన ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శనకి మైసూర్ రాజ్‍కుమార్ ప్రత్యేక అతిథి. ఆమె ప్రతిభకి అబ్బురపోయిన ఆయన, మైసూరుకు వచ్చి ప్రదర్శనలీయవలసిందిగా ఆహ్వానించారు. ఆమె భర్తకి నచ్చలేదు, కానీ ఆవిడ తల్లి యదుగిరి దేవి ఉత్సహపడ్డారు. తన కూతురికి ఇదో గొప్ప అవకాశంగా ఆవిడకి అనిపించింది. కుమార్తెను మైసూరు పంపారు. మైసూరులో వసుంధర ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. ఆ తర్వాత మైసూర్ రాజకుమార్ విదేశాలకి వెడుతూ, వసుంధరని కూడా వచ్చి అక్కడా ప్రదర్శనలు ఇవ్వమన్నారు. ఈసారి వసుంధర తండ్రి, భర్త ఇద్దరూ వ్యతిరేకించారు. అయినా తల్లి యదుగిరి దేవి పట్టుపట్టి అందరినీ ఒప్పించారు. వసుంధర తల్లిదండ్రులతోనూ, భర్తతోనూ, ఆరేళ్ళ వైజయంతిమాలతోనూ ఓడలో బయల్దేరారు. వసుంధర పోప్ సమక్షంలో ప్రదర్శన ఇచ్చారు. మొత్తం యూరప్ అంతా తిరిగి వచ్చారు.

వసుంధర మీరాబాయి రికార్డు గురించి తెలిసిన ఎందరో నిర్మాతలు ఆమెని తమ సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నించారు. అయితే ఆమె సందేహించారు, ఎందుకంటే భర్త, అత్తమామలు, తండ్రి విముఖత వ్యక్తం చేశారు. కాని తల్లి యదుగిరి దేవి అందరిని ఒప్పించి ప్రోత్సహించారు. ఆ విధంగా వసుంధర 1941 ఋష్యశ్రింగర్ అనే సినిమాలో తొలిసారి నటించారు. తర్వాత మంగమ్మ శపధం, ఉదయనన్ వాసవద్దత, నాట్యరాణి అనే తమిళ చిత్రాలలో నటించారు.

యూరప్ పర్యటన నుంచి వచ్చాకా, వసుంధర తన కూతురిని గొప్ప నృత్యకారిణిని చేయాలనుకున్నారు. అందుకని కూతురికి సంగీతంలోనూ, నాట్యంలోనూ శిక్షణనివ్వసాగారు. కూతురుని ప్రసిద్ధ నాట్య గురువు వళవూరు రామయ్య పిళ్లయ్ వద్దకు శిక్షణకు పంపారు. 1946లో వైజయంతిమాల తన ఇంట్లోనే ఘనంగా ఆరంగేట్రం చేశారు. ఆమె తన తల్లికంటే గొప్ప నాట్యకారిణి అవుతుందని అతిథులంతా పేర్కొన్నారు. ఆ తర్వాత వైజయంతిమాల తమిళనాడు అంతా పర్యటించి నృత్యప్రదర్శనలిచ్చారు.

తనకి బాగా పేరు ప్రఖ్యాతులు రావడంతో వసుంధర స్వతంత్రురాలయ్యారు, కుటుంబాన్ని పట్టించుకోవడం తగ్గించారు. ఓ కుటుంబ మిత్రుడికి దగ్గరయి, బొంబాయి వెళ్ళి ‘దీపావళి’ అనే సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తల్లి అభ్యంతరం చెప్పారు. వసుంధర తల్లి మాట వినలేదు. భర్త వారిద్దరి మధ్య రాజీ కుదర్చాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కుటుంబ మిత్రుడితో కలిసి బొంబాయి వెళ్లిపోయారు వసుంధర.

అప్పుడే రామన్, తన అత్తగారితో కలిసి వైజయంతిమాలని ఆ ఇంట్లోంచి తెచ్చేసి, ఓ అద్దె  ఇంటికి మకాం మార్చారు. ఈ సంగతి తెలిసిన వసుంధర మద్రాసు వచ్చి ఆ అద్దె ఇంటికి వెళ్ళారు. తన కూతురుని తనకిచ్చేయమని భర్తనీ, తల్లినీ బ్రతిమిలాడారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. తన కూతురిని దక్కించుకోడానికి ఆమె అన్ని విధాలుగా ప్రయత్నించారు. చివరికి 1946 ఆగస్టు నెలలో కోర్టులో కేసు వేశారు. తన కూతురు మైనర్ అనీ, వాళ్ళు తన కూతురిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. తాను తన కూతురికి సరైన గార్డియన్‍ని అనీ, తల్లి కాదని, ఆమె తన సినీకెరీర్‍లో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉంటుందని రామన్ వాదించారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రాజగోపాలను ఇరువర్గాల వారి వాదనలు విని తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. వైజయంతిమాల బంగారం వివరాలు, నృత్య ప్రదర్శనల ద్వారా ఆమె సంపాదించిన డబ్బు వివరాలలను ప్రతీ నెలా ఐదో తారీఖులోపు కోర్టులో నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ కేసు మళ్ళీ 1950 ఏప్రిల్ 12, 13 14 తేదీలలో హియరింగ్‍కి వచ్చింది. అప్పుడు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృష్ణస్వామి నాయుడు. ఆయన రామన్, యదుగిరి దేవి, వసుంధరల వాదనలు విన్నారు. చివరగా ఈ విధంగా తీర్పు వచ్చింది – రామన్ తన కూతురి కెరీర్‍ని సక్రమంగా నిర్వహించలేరు. అప్పటికే వైజయంతిమాల కూడా తల్లి లానే సినీరంగంలోకి ప్రవేశించారు. ఆమె సంపాదనంతా హైకోర్టు న్యాయవాది ఎం. సుబ్రమణ్యం ముదలియార్ గారికి అప్పగించాలి. తండ్రి రామన్ కేవలం గార్డియన్ మాత్రమే. వసుంధర కూతురుని చూడాలనుకున్నప్పుడు – రామన్ అనుమతి ఈయవలసి ఉంటుంది. సినీరంగంలో వసుంధరకి అనుభవం ఉన్నందున ఆమె తన కూతురుకి ఆ రంగంలో మార్గదర్శనం నెరపవచ్చు. వైజయంతిమాల సంరక్షణ కోసం నెలకి 750/- రూపాయలు మంజూరు అయ్యాయి.

ఈ తీర్పు తరువాత మే 5వ తేదీన భర్త అనుమతి తీసుకుని వసుంధర – ఎన్నో నెలల తర్వాత వైజయంతిమాలని కలిసారు. రామన్ లేకపోవడంతో, అన్నీ మరిచిపోయి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. మూడు గంటల సేపు మాట్లాడుకున్నారు. అయితే కేసు ఇక్కడితో ముగియలేదు. తన కూతురు సొమ్మును మూడో వ్యక్తి నియంత్రించడం ఏంటంటూ, తాను మాత్రమే కూతురికి గార్డియన్‍ని అంటూ రామన్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు 10 మే 1950నాడు హియరింగ్‍కి వచ్చింది. కానీ కోర్టుకు వేసవి సెలవలు మొదలవబోతున్నాయి. అయితే వెళ్ళేముందు న్యాయమూర్తి తాత్కాలిక ఉపశమనం కలిగేలా తీర్పు ఇచ్చి వెళ్ళారు. ఆ ప్రకారం రామన్ న్యాయవాది సుబ్రమణ్యం ముదలియార్ గారితో చర్చలు జరిపి వైజయంతిమాల కెరీర్‍కి మార్గదర్శనం చేయవచ్చు. మద్రాసులో ప్రదర్శన అయితే 1500 రూపాయలు, బయటి ఊర్లలో అయితే 2000 రూపాయలు వసూలు చేయవచ్చు. అందులో యాభై రూపాయలు తన ఖర్చులకు గాను వైజయంతిమాలకు ఇవ్వాలి. మిగతా ధనాన్ని న్యాయవాది సుబ్రమణ్యం ముదలియార్ భద్రపరుస్తారు.

1949లో ఎ.వి.ఎం.వారి ‘Vaazhkai’ విడుదలైంది, తమిళంలోనే గాక, తెలుగు, హిందీ భాషలలో అఖండ విజయం సాధించింది. ఈ చిత్రానికి గాను మూడు భాషలలో వైజయంతిమాల ఆర్జించిన మొత్తాన్ని తనకు అందజేయవలసిందిగా సుబ్రమణ్యం ముదలియార్ – మెయ్యప్పన్ గారికి నోటీసు పంపించారు. ఆ డబ్బంతా ఆమె కుటుంబం తీసేసుకుందనీ, పైగా తాను ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చానని, అందుకని న్యాయవాదికి ఏమీ ఇవ్వలేనని మెయ్యప్పన్ చెప్పారు. అప్పుడు తనకి చెప్పకుండా, ఆమె ఆదాయ కుటుంబం తీసేసుకుందని సుబ్రమణ్యం ముదలియార్ కోర్టులో కేసు వేశారు. ఈసారి ఎ.ఎం.పి. అయ్యరు న్యాయమూర్తి. ఆయన – ఎవిఎం  – వైజయంతిమాల వాళ్ళకి పని చేసిన రోజుల ప్రకారం – నెలకి 1500/- రూపాయలు సుబ్రమణ్యం ముదలియార్‍కు చెల్లించాలని ఆదేశించారు. రామన్ గారికి నెలకి 100/- రూపాయల కారు ఎలవన్స్ ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఇక నుంచీ వైజయంతిమాలకి గార్డియన్ అక్కరలేదని తీర్పులో పేర్కొన్నారు.

ఈ తీర్పుకు వ్యతిరేకంగా, వసుంధర, రామన్‌లిద్దరూ విడివిడిగా అప్పీల్ చేసుకున్నారు. న్యాయమూర్తి వసుంధర అప్పీల్‍ని తోసిపుచ్చారు. రామన్ వాదనలను మాత్రమే విన్నారు. తల్లిదండ్రులిద్దరూ వైజయంతిమాలకి గార్డియన్‍లుగా ఉండే హక్కు ఉందని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నిజానికి భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం ఇదే. ఇకపై వైజయమంతిమాల బాధ్యత అంతా తండ్రి రామన్‌దేననీ, వైజయంతిమాల విషయంలో సుబ్రమణ్యం ముదలియార్ ప్రమేయం అక్కరలేదని తీర్పు చెప్పారు. ఆయన వసూలు చేసిన డబ్బంతా, రామన్ గారికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. కెరీర్ విషయంలోనూ, ఆదాయం విషయంలోనూ వైజయంతిమాలకి అమె తండ్రి, అమ్మమ్మ మార్గదర్శనం చేయవచ్చని పేర్కొన్నారు. మనవరాలిని అప్పటికే ఆల్ ఇండియా స్టార్‍ని చేసిన అమ్మమ్మ యదుగిరి దేవికి ఆ హక్కు ఉందని తీర్పులో పేర్కొన్నారు. ఈ ఆటంకాల మధ్య వసుంధర ‘దీపావళి’ సినిమాని మధ్యలో ఆపేసి వచ్చారు. తన తల్లి అల్లుడి వైపు మొగ్గు చూపడంతో వసుంధరకి తల్లితోనూ, భర్తతోనూ సంబంధాలు తెగిపోయాయి. వైజయంతిమాల కూడా అమ్మమ్మ వైపే మొగ్గడంతో వసుంధరకి కూతురితోనూ సంబంధాలు చెడాయి. కుటుంబ బంధాలు చెదిరిపోవడం, సినిమా ఆగిపోవడం వల్ల వసుంధర మానసికంగా దెబ్బతిన్నారు.

ఎస్.ఎస్. వాసన్ తాను తీస్తున్న హిందీ చిత్రం ‘పైగామ్’ (1959)/ తమిళంలో ‘ఇరుంబు తిరై’ (1960) లో వైజయంతిమాలనీ, వసుంధరనీ ఇద్దరిని నటింపజేయాలని చూశారు. తల్లీకూతుళ్ళిద్దరూ విపరీతంగా గొడవ పడ్డారు. దీని తర్వాత కూడా ఏం మారలేదు. ఈలోపు రామన్ మరణించారు. వసుంధర రంగరాజన్ అనే వ్యక్తిని విహాహం చేసుకుని కవలలకు జన్మనిచ్చారు. ఈ కుటుంబం గురించి పెద్ద వివరాలు తెలియవు. వసుంధర తన కొత్త కుటుంబంతో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు.

తన కెరీర్ ఉచ్చదశలో ఉండగా వైజయంతిమాల రాజ్ కపూర్ సరసన ‘సంగం’లో నటించారు. రాజ్‍ కపూర్ వైజయంతిమాలని మోసం చేసి, ఆమెకి ధనం లేకుండా చేశారనే పుకారు ఉంది. ఆమెకి రాజ్ కపూర్ ప్రేమ కూడా దక్కలేదు. అవన్నీ పక్కన పెట్టి, రాజ్ కపూర్ ఫ్యామిలీ డాక్టర్ అయిన డా. బాలిని వివాహం చేసుకుని సినీరంగానికి వీడ్కోలు పలికారు వైజయంతిమాల. మద్రాసులోనే నివసించినా తల్లికి దూరంగా ఉన్నారు. తన కూతురు తనకి కావాలని వసుంధర మళ్ళీ కోర్టులో కేసు వేసినా, వైజయంతిమాల తల్లితో ఉండాలనుకోలేదు. ఈవిధంగా మద్రాసులో సంచలనం సృష్టించిన కుటుంబ కలహం ముగిసింది.


ఒక్క పాటకి విశిష్ట గుర్తింపు పొందిన నటుడు సురేష్:

హిందీ నటుడు సురేష్ అసలు పేరు నజీమ్ అహ్మద్. ఆయన 13 నవంబర్ 1928న ఆనాటి తూర్పు పంజాబ్‍ లోని గుర్‌దాస్‌పూర్‍లో జన్మించారు. ఒక్క పాటకి విశిష్ట గుర్తింపు పొందిన నటుడాయన. ‘దులారీ’ (1949) చిత్రంలో రఫీ పాడిన ‘సుహానీ రాత్ ఢల్ చుకీ నా జానే తుమ్ కబ్ ఆవోగే’ అనే పాట సురేష్ గారికి అజరామరమైన కీర్తిని తెచ్చిపెట్టింది.

సురేష్ తన కెరీర్‍ని బాలనటుడిగా బాంబే టాకీస్ వారితో ప్రారంభించారు. అంజన్ (1941), నయా సంసార్ (1941), ఇంకా బసంత్ (1942) వంటి చిత్రాలలో నటించారు.

తరువాత కథానాయకుడై, ఆనాటి ప్రసిద్ధులైన హీరోయిన్స్ – మధుబాల, సురయ్యా, వైజయంతి మాల, గీతా బాలి వంటి వారి సరసన నటించారు. సురేష్ అంటే దర్శకనిర్మాత ఎ.ఆర్. కర్దార్ గారికి బాగా అభిమానం. ఆయన – దులారీ (1949), జాదూ (1951), దీవానా (1952) యాస్మిన్ (1955) వంటి ఎన్నో సినిమాలో సురేష్‌ని ప్రముఖపాత్రలో నటింపజేశారు.

అయితే 50వ దశకం మధ్య నుండి సురేష్ కెరీర్ తిరోగమనం ప్రారంభించింది. వజీర్-ఎ-అజామ్ (1961), షేర్-ఎ-అఫ్ఘన్ (1966) వంటి బి/సి గ్రేడ్ సినిమాల్లో నటించారాయన.

1970లలో ఆయన ఓ పెద్ద పొరపాటు చేశారు. నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. ఎన్.ఎ. సురేష్ బ్యానర్‍పై ‘గంగా ఔర్ సూరజ్’ అనే చిత్రం ప్రారంభించారు. ఈ సినిమాలో అన్వర్ హుస్సేన్ ప్రధాన విలన్. చాలా భాగం సినిమా పూర్తయ్యాకా, అన్వర్ హుస్సేన్‌ పక్షవాతం బారిన పడ్డారు. ఆయన స్థానంలో కాదర్ ఖాన్‍ని పెట్టి, సినిమా అంతా మళ్ళీ తీసారు. సినిమా బడ్జెట్ అదుపుతప్పింది, ఎట్టకేలకు సినిమా 1980లో విడుదలై, ఘోర పరాజయం పాలయింది.

సురేష్ రెండు పాకిస్థానీ సినిమాలు – దో కినారే (1950), ఈద్ (1951) – లలో నటించారు.

దారుణమైన పరిస్థితులలో, చేతులో డబ్బులు లేని స్థితిలో మరణించారు సురేష్.

ఆయనకు అత్యంత కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన పాటని యూట్యూబ్‍లో చూడండి.

https://www.youtube.com/watch?v=RPNMFQDISIY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here