ధీరవనిత కస్తూర్బా గాంధీ

20
7

[dropcap]22 [/dropcap]-02-2022 కస్తూర్బా వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మహాత్మాగాంధీ జాతిపిత అయితే ఆయన భార్య కస్తూర్బా భారతీయులకు మాత (అంటే బా). ఈమెకి మహాత్మా భార్యగా మాత్రమే ఈ ఖ్యాతి దక్కలేదు. ఆయన కనుసన్నలలో మెలిగినప్పటికీ/తన స్వీయ వ్యక్తిత్వంతో, ఆశయాలు, ఆలోచనలు, ఆచరణతో ఈ స్థానానికి చేరుకున్న కార్యశీలి. ఆమె, దేశం కోసం త్యాగాలు చేశారు. కష్టాల కడగండ్లు దరిచేరినా వెన్ను చూపని ధైర్యవంతురాలు.

సాధారణంగా భర్త వల్ల కానీ, ఆర్థిక, ఆర్థికేతర కారణాల వల్లకానీ భారతీయ కుటుంబాలలోని మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలు, మనోవేదనలను ఈమె కూడా ఎదుర్కున్నారు. అయితే వాటిని ఆమె మనోనిబ్బరంతో అధిగమించారు. భర్త చదువు కోసం ఆర్ధిక సాయాన్ని అందించారు. ఎదురీదిన అన్ని సమయాలలోను తన స్వాభిమానాన్ని నిలుపుకుంటూ జీవితాన్ని కొనసాగించడం విశేషం. ఈమె 1869 ఫిబ్రవరి 11వ తేదీన నాటి బ్రిటిష్ ప్రెసిడెన్సీలోని కథియవార్ ఏజన్సీలోని పోర్‌బందర్‌లో జన్మించారు. తల్లిదండ్రులు వ్యజకున్వర్ బా కపాడియా, గోపాల్ దాస్ కపాడియాలు. గోపాల్ దాస్ విదేశాలతో వ్యాపారం చేసే ప్రముఖ గుజరాతీ వ్యాపారస్తుడు. పోర్‌బందర్ మేయర్‌గా కూడా పనిచేశారు.

వీరి పొరుగున దివాన్ కరంచంద్ కుటుంబం నివసిస్తూ ఉండేది. రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు వెల్లివిరిశాయి. స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని ఆశించారు. కస్తూర్బాతో కరంచంద్ కుమారుడు మోహన దాస్ గాంధీకి పదమూడేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. అప్పటి నుండి కస్తూర్బా కపాడియా కస్తూర్బా గాంధీగా మారారు.

మోహన్ దాస్ తన భార్య కస్తూర్బాకి చదువు నేర్పించాలని ఆశించారు. అయితే తోడికోడళ్ళు, అత్తగారి ముందు మొహమాటపడి చదువు నేర్చుకోలేకపోయారామె. భర్త పెట్టే ఆంక్షలకి ఆమె భయపడేవారు.

గాంధీజీ తండ్రి అనారోగ్యం పాలయ్యారు. దివాన్‌గిరీ ఉద్యోగం పోయింది. ఆయన కుమారులకి దివాన్ ఉద్యోగం రావాలంటే ఆంగ్ల భాష వచ్చి ఉండాలి. మోహన్ దాస్ ఇంగ్లండ్ వెళ్ళి చదువుకోవాలనుకున్నారు. విదేశాలకు వెళుతున్నందుకు గాను వీరి కుటుంబాన్ని వారి సామాజిక వర్గం వెలివేసింది. మోహన్ దాస్ చదువు కోసం కస్తూర్బా తన బంగారు నగలను అమ్మి ధనాన్ని సమకూర్చారు. బారిస్టర్ పట్టా తీసుకుని స్వదేశానికి వచ్చారు. అయితే దివాన్ ఉద్యోగం రాలేదు.

1893లో దాదా అబ్దుల్లా అనే గుజరాతీ వ్యాపారికి న్యాయసహాయకుడిగా ఉదోగ్యం చెయ్యడం కోసం దక్షిణాఫ్రికా వెళ్ళారు. కస్తూర్బా ఇద్దరు కుమారులను చూసుకుంటూ రాజకోట్ లోనే ఉండిపోయారు. మూడేళ్ళ తరువాత గాంధీ మన దేశానికి వచ్చారు. 1896లో కుమారులు, భర్తతో కలిసి దక్షిణాఫ్రికాకి వెళ్ళారామె.

అక్కడ మరో ఇద్దరు పుత్రులు కలిగారు ఈ దంపతులకి. దక్షిణాఫ్రికా లోని భారతీయులకు ఓటుహక్కును తొలగించేటందుకు నేటాల్ శాసన సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ న్యాయపరంగా పని చేశారు. వారికి మర్యాదలు చేయడం కోసం కస్తూర్బా గాంధీ తన శాయశక్తులా కృషి చేసేవారు.

ఇటువంటి ఒక సందర్భంలో ఈమె అతిథి మర్యాదలలో లోపం చేశారు. ఆ సమయంలో గాంధీజీ ఆమెను ఇంటినుండి గెంటివేసేందుకు సిద్ధమయ్యారు. ఈమె “ఈ దేశంలో ఒంటరి దానిని. ఎక్కడకు వెళ్ళామంటా”వని ప్రశ్నించారు. ఈ మాటలలో నిజాన్ని గమనించి, సిగ్గుపడ్డారు గాంధీజీ. ఈ విధంగా అవసరమయిన సమయంలో భర్తని ఎదిరించయినా తన హక్కును, అభిమానాన్ని కాపాడుకునే ఆత్మస్థైర్యం ఆమెది.

వీరు జొహెన్నెస్‌బర్గ్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 1904లో ఈ నగరంలో బుబోనిక్ ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. గాంధీజీతో పాటు కస్తూర్బా కూడా సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. అక్కడి భారతీయులకు శుభ్రత, ఆరోగ్య చిట్కాలను గురించి ఈమె వివరించేవారు. తన భార్యలోని సేవాగుణాన్ని ఆయన అవగాహన చేసుకున్నారు.

జోహెన్నెస్‌బర్గ్ నుండి ఫినిక్స్ సెటిల్‌మెంట్‌కి కస్తూర్బా కుమారులతో సహా తరలి వెళ్ళారు. తన కుటుంబ బంధువులు, దక్షిణాఫ్రికా భారతీయ కుటుంబాలతో ఈమె స్నేహ పూరిత సౌహార్ద్రాన్ని కొనసాగించారు. ఆమె ఈ ప్రదేశంలో ఎంత మమేకమయారంటే గాంధీజీ జోహెన్నెస్‌బర్గ్‌లో ఉన్న సమయంలో కూడా ఈమె ఫీనిక్స్‌లో అందరితో కలిసిమెలసి గడపగలిగారు.

ప్రభుత్వం ప్రకటించిన ట్రాన్స్‌వాల్ ఆసియాటిక్ రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా ‘ఇండియన్ ఒపినియన్’ పత్రికలో వ్యాసాలు ప్రచురించారు గాంధీజీ. ఈ రెండు నెలల కాలంలో కస్తూర్బా కూడా పోషకాహారం తీసుకోలేదు. రక్తహీనతతో నీరసించారు. వైద్యులు మాంసాహారం తీసుకోమని సలహా ఇచ్చారు. ఈమె తిరస్కరించారు. ఈ విధంగా తమ ఆహారపు అలవాట్లకు కట్టుబడే ఉన్నారు.

1913లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం క్రైస్తవేతర వివాహాలను రద్దుచేసింది. ఇంకా ఈ చట్టం ప్రకారం దక్షిణాఫ్రికా భారతీయులు ట్రాన్స్‌వాల్‌ని దాటి వెళ్ళాకూడదని లక్ష్మణరేఖను గీసింది. 1913 సెప్టెంబర్ 15వ తేదీన ముగ్గురు మహిళలతో, పన్నెండు మంది పురుషులతో కలిసి ఈ గీతను దాటారు. ఈ మహిళలను అరెస్టు చేసి మారిట్జ్‌బర్గ్ జైలులో నిర్బంధించారు. ఈ విధంగా ఆమె ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయి నిబద్ధతను నిరూపించుకున్నారు. అక్కడ సరయిన ఆహారం లభించలేదు. నీరసంతో అనారోగ్యం పాలయ్యారు.

ఈమె కంటే ముందే అరెస్టయిన గాంధీజీ 1913 డిశంబర్ 18వ తేదీన, కస్తూర్బా డిశంబర్ 22 వతేదీన జైలు నుండి విడుదలయ్యారు. సమస్యలు అన్నీ పరిష్కరించబడలేదు. కాని విద్యావంతులయిన

భారతీయుల కోసం కొన్ని ఇమ్మిగ్రేషన్ చట్టాలు సడలించి, సవరించబడ్డాయి. ఒప్పంద కార్మికుల దిగుమతి ఆపడం వల్ల వారి బాధలు కొంత వరకు తగ్గాయి.

తరువాత భారతదేశానికి తిరిగి రావడానికి బయలుతేరారు కస్తూర్బా దంపతులు. వారికి సంతోషంగా వీడ్కోలు పలికారు దక్షిణాఫ్రికా భారతీయులు. దంపతులను సభలు సమావేశాలు నిర్వహించి గౌరవించారు. వీటిలో కస్తూర్బా సంతోషంతో పాల్గొన్నారు. 1915 జనవరి 8వ తేదీన భారతదేశాన్ని చేరుకున్నారు.

1917లో బీహర్ లోని నీలిమందు రైతుల కోసం చంపారన్ సత్యాగ్రహం జరిగింది. ఈ సమయంలో రైతులు పోలీసుల మీద దాడి చేశారు. ఈ హింసాకాండ చెలరేగడంతో గాంధీజీ విరమించారు. కాని అక్కడ పర్యటించి రైతులకు మనోనిబ్బరం కలిగిస్తూనే ఉన్నారు. ఈ పమయంలో కస్తూర్బా కుమారునితో చంపారన్ వెళ్ళారు. అక్కడి స్త్రీలకు నూలు వడకడం, అల్లికలు అల్లడం, స్వయం సమృద్ధి కోసం కృషి చేయడం, పారిశుధ్య ప్రాముఖ్యం వంటి వాటిని గురించి ప్రచారం చేశారు. అంతేకాదు స్వయంగా ఆచరించి చూపారు. వారికి ఈ విషయాలలో శిక్షణను ఇచ్చారు.

స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గించి ఆర్థిక స్వావలంబన చేకూర్చుకోవచ్చని ఈమె ఉద్దేశం. విదేశీ వస్తువులను బహిష్కరించవచ్చని చెప్పేవారు. భోగిమంటలు వేసి విదేశీ వస్తువులను, వస్త్రాలను తగలబెట్టమని ప్రోత్సహించారు. తన చీరలను అలాగే చేసి ఆచరించి చూపిన కార్యశీలి ఆమె.

1922వ సంవత్సరంలో గాంధీజీని అరెస్టు చేసి 6 సంవత్సరాల పాటు జైలు శిక్షని విధించారు. అప్పుడు భర్త ఇంత దీర్ఘకాల శిక్షకు గురయినందుకు ఆమె కలత చెందారు. అది తాత్కాలికమే! ఈ సమయంలో “మా భార్యాభర్తల పట్ల గౌరవం, అభిమానాలు చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మా అభిమానులు అందరూ నిర్మాణాత్మక కార్యక్రమాలలో, ఉద్యమాలలో బాధ్యతలను తీసుకోవాలని కోరుతున్నాను” అని బాపూజీ భార్యగా పిలుపును అందించారు.

ఆమె బాపూ పిలుపును అందుకుని అన్ని ఉద్యమాలలోను పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనోద్యమాలలో ఆమె నిర్వహించిన పాత్ర అసామాన్యం. ఈ ఉద్యమాలలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించారు. మహిళా నాయకులు, వాలంటీర్లతో సమావేశాలను నిర్వహించేవారు. ఉద్యమ కార్యకలాపాలను తెలియజేసేవారు. మద్యనిషేధ ఉద్యమాలలోను, హరిజనోద్యమంలోను పాల్గొన్నారు. పికెటింగ్‌లు చేశారు. ధర్నాలలో పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమ మహిళలకు అనేక విషయాలలో స్ఫూర్తినిచ్చేవారు.

1932, 1933, 1938 సంవత్సరాలలో చాలా సార్లు అరెస్టయి జైలు శిక్షను అనుభవించారు. ఆమెను ఒక మారుమూల గ్రామంలో ఏకాంతంగా నిర్బంధించినప్పుడు బాపూజీ ఆమెను విడుదల చేయమని నిరాహార దీక్ష చేశారు. ఆయన తనకి చెప్పకుండా అలా చేసినందుకు కోపగించుకున్నారు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రకటన జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం, భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులందరినీ అరెస్టు చేసింది. గాంధీజీ అరెస్టుయిన తర్వాత ఆయన బాధ్యతలను స్వీకరించారు కసూర్బా. 1942 ఆగష్టు 9వ తేదీ సాయంత్రం శివాజీపార్క్ వద్ద సమావేశంలో ప్రసంగించడం కోసం బయలుదేరారామె. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేశారు. 1,00,000 మంది కార్యకర్తలు ఈ పార్క్‌లో ఆమె సందేశం వినడం కోసం వేచి ఉండడం విశేషం.

గాంధీజీని నిర్బంధించిన ఆగాఘాన్ ప్యాలస్ లోనే ఈమెను కూడా నిర్బంధించారు. ఈమె బంధించబడిన కొద్ది రోజుల తరువాత శ్రీ మహదేవదేశాయ్ మరణించారు. దేశాయ్ కూడా గాంధీజీతో పాటు ఆగాఖాన్ ప్యాలెస్‍లో బంధించబడిన గొప్ప నాయకుడు. కస్తూర్బా ఇతనిని స్వంత కుమారుని కంటే ఎక్కువగా అభిమానించి, ఆదరించేవారు.

దక్షిణాఫ్రికాలో జైలు శిక్షను అనుభవించినప్పుడే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. అది భారతదేశం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. అయితే ఆమె ఉద్యమాలను విజయవంతంగా నడిపింది. అందుకు కారణం ఆరోగ్యబలం కాదు. సంకల్పబలం అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

అయితే 74 ఏళ్ళ వయసులో ఈ బలాలేవీ ఆమెను కాపాడలేకపోయాయి. విపరీత గుండెపోటులు ఈమెను అతలాకుతలం చేశాయి. చివరకు 1944 ఫిబ్రవరి 22 వ తేదీన ఆమె ఆగాఖాన్ ప్యాలెస్ లోనే మరణించారు.

నలుగురు కొడుకులలో మొదటి కొడుకు హరిలాల్ గాంధీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిన వారు దక్షిణాఫ్రికాలోని వివక్ష కారణంగా ఇంటి దగ్గరే తండ్రి దగ్గరే విద్యను అభ్యసించారు. అయితే బాపూజీకి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు చాల ఎక్కువగా ఉండేవి. ఈమె తండ్రి కొడుకుల మధ్య వారధిలా మసలవలసి వచ్చింది. ఈ సమయంలో ఈమె అనుభవించిన మనోవేదన వర్ణనాతీతం. అయినప్పటికీ భర్త ఆశయం కోసం, దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం కష్టాలను భరించారామె. అన్నింటికీ అధిగమించిన పోరాటపటిమ ఆమెది.

“మహిళలు ముందుండి ఉద్యమాలను నడిపించాలి. మహిళలను త్వరగా అరెస్టు చేయరు కాబట్టి” అని తన తోటి మహిళలను తెలివిగా ప్రోత్సహించేవారామె.

కానీ స్వతంత్ర భారతాన్ని గురించి కలలుగన్న ఆమె కోరిక తీరకుండానే మరణించడం బాధాకరం. ఏది ఏమయినప్పటికీ భర్తకు తగిన భార్యగా జీవిస్తూనే తన ఉనికిని, స్వాతంత్ర్య పోరాటంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకోగలిగారు కస్తూర్బా.

ఈమె జ్ఞాపకార్ధం భారత తపాలశాఖ స్టాంపులను విడుదల చేసి గౌరవించింది.

1964 ఫిబ్రవరి 22వ తేదీన ఈమె 20వ వర్ధంతి సందర్భంగా మొదటి స్టాంపు విడుదలయింది.15 నయాపైసల విలువతో విడుదలయిన ఈ స్టాంపు మీద గుజరాతీ మేలిముసుగుతో దయాపూరిత నయనాలతో బా కనిపిస్తారు.

22-02-1964 న విడుదలయిన స్టాంపు

1969 అక్టోబర్ 2వ తేదీన బాపూజీ శతజయంతి సందర్భంగా 4 స్టాంపులను విడుదల చేసింది తపాలశాఖ. వీటిలో తొలి స్టాంపు మీద కస్తూర్బా బాపుల చిత్రాన్ని ముద్రించారు. 20 పైసల విలువతో విడుదలయిన ఈ స్టాంపు మీద ‘బా-బాపు’ అని వ్రాసి ఉంది.

02-10-1969 న విడుదల యిన స్టాంపు

1996 ఫిబ్రవరి 22వ తేదీన ‘కస్తూర్బా గాంధీ ట్రస్ట్’ 50వ వార్షికోత్సవం సందర్భంగా 1 రూపాయ విలువతో ఐదు స్టాంపులు విడుదలయింది. దీని మీద కస్తూర్బా చిత్రంతో పాటు కసూర్బా గాంధీ భవనాన్ని ముద్రించారు. అంబరంలోని మబ్బులలో నుంచి తన భవనాన్ని మురిపెంగా చూసుకుంటున్నట్లు కస్తూర్బా ఆనందంగా కనిపిస్తారు.

22-02-1996 న విడుదలయిన స్టాంపు

2015 జనవరి 8వ తేదీన మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగివచ్చి 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా రెండు స్టాంపులు విడుదలయ్యాయి. వీటిలో 25 రూపాయల స్టాంపు ఒకటి ఉంది. దీని మీద అరేబియా సముద్రంలో ఓడ దిగి వస్తున్న కస్తూర్బా, గాంధీలు గుజరాతీ వస్త్రధరణలో కనువిందు చేస్తారు. ఈ స్టాంపుకు బ్యాక్‌గ్రౌండ్‍గా ఉన్న మేఘాలు ముచ్చటయిన జాతీయ పతాక రంగులతో కనువిందు చేస్తాయి.

08-01-2015 న విడుదలయిన స్టాంపు

2017 మే 13 వ తేదీన చంపారన్ సత్యాగ్రహనికి 100 సంవత్సారాలు నిండిన సందర్భంగా మూడు స్టాంపులు విడుదలయ్యాయి. 10 రూపాయల విలువగల స్టాంపు మీద ఆదర్శగ్రామంగా అక్రనిపించే చంపారన్ గ్రామంలో ఆధునిక పద్దతిలో ఇళ్ళు కనిపిస్తాయి. స్టాంపు మీద ఎడమవైపు పై భాగంలో చదువుకుంటున్న వయోజనులు కనిపిస్తారు. ఈ స్టాంపు మీద సింహభాగం కస్తూర్బా కనువిందు చేస్తారు. నీలిమందు తోటల రైతులకు అనుకూలంగా జరిగిన సత్యాగ్రహమనేమో ఈ స్టాంపులన్నీ నీలిరంగులో మనోహరంగా ముచ్చట గొలుపుతాయి. చంపారన్‌లో కుమారులతో కొంతకాలం నివసించారు కస్తూర్బా. ఆ సమయంలో వారు అక్కడి ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా ఈ స్టాంపు ద్వారా నివాళిని అర్పించింది భారతీయ తపాలాశాఖ.

13-05-2017 స్టాంపు, 3 వ స్టాంపు వీరిది

బాపూజీ నూటయాభైవ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2వ తేదీన ఆరు స్టాంపులను ఒక సెట్‌గా విడుదల చేశారు. 25 రూపాయల స్టాంపు మీద ‘బా-బాపులు’ నిలబడిన చిత్రాన్ని ముద్రించారు.

కస్తూర్బా బాపూజీ యొక్క ధర్మపత్నీయే కాకుండా, ధీరవనితగా ఎట్టి పరిస్థితిలలోనూ, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కోల్పోని మహిళా మూర్తిగా, స్త్రీలను ఉత్తేజ పరిచే స్త్రీ మూర్తిగా, పుట్టినింటీ – మెట్టినింటి పేరును నిల్పిన గొప్ప మహిళగా బహు విధాలుగా తన కుటుంబానికి, మనదేశానికి ఖ్యాతిని తీసుకోచ్చారు.

ఆమె వర్ధంతి ఫిబ్రవరి 22వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here