[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
మామగారైన బావగారు..!!
[dropcap]మ[/dropcap]నిషిని ఇప్పుడు శాసిస్తున్న అంశాలు, కులం, మతం, ప్రాంతం. మనిషి వ్యక్తిత్వం, మానవతా విలువలతో సంబంధం లేకుండానే, మనిషి మూర్ఖంగా ఆ మూడు అంశాలు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు. మంచి చెడ్డలతో పనిలేకుండా, మన కులం వాడైతే, మన మతం వాడైతే, మన ప్రాంతం వాడైతే ఏదైనా చేసెయ్యడానికి మనిషి సిద్ధపడుతున్నాడు. మనిషి సంఘ జీవి. సమాజంలో అందరితోనూ ఒకరికొకరు అవసరం వచ్చి తీరుతుంది. అలాంటప్పుడు, ఎవరికివారు గిరి గీసుకుంటే, ప్రయోజనం ఏమి ఉంటుంది. కలసి మెలసి బ్రతికే అవకాశం ఎట్లా వస్తుంది? ఆరోగ్య ప్రధానమైన సమాజం ఎట్లా ఏర్పడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. కులాల పేరుతో ఒకరికొకరు వైషమ్యాలు పెంచుకోవడం, మతాల తెర వెనుక, ఒకరికొకరు కుట్రలు పన్నుకోవడం ఎంత దురదృష్టకరమైన విషయం!
కులాలే కాదు, ఉపకులాల సమస్య కూడా ఇప్పుడు ఒక తలనొప్పిగా మారింది. ఒకరినొకరు దూషించుకోవదమే కాదు,శత్రుత్వం కూడా పెంచుకుంటున్నారు. ఇతరులకు ఇది ఒక హాస్య సన్నివేశంగా మారింది. విభజించి చూసేవారికి ఇదొక వినోదం అయింది. అంతర్గత విభేదాలతో వాళ్లకు వాళ్ళే విడిపోయి ఇతరుల ముందు చులకన కావడం వంటి దురదృష్టకర సందర్భాలు కూడా మొదలయ్యాయి. బంధుత్వాలకు చెల్లుచీటీ పలకడం మొదలు పెట్టారు. పెళ్లిళ్లు కులాలు – ఉపకులాల మధ్య ఆగిపోయాయి. వాళ్ళ మధ్య ఉండాల్సిన ఐక్యత కోల్పోయి, ఎదుటివారికి వేళాకోళంగా కనిపించడం మొదలైంది. ఒక కులంలోగానీ, మతంలోగానీ ఐకమత్యం కోల్పోతే, ఎదుటివాళ్ళకు అలుసుగా తయారవడం ఖాయం. ఇలాకాకుండా ఒక మతం వాళ్ళు కులాలుగా విడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాకు తెలియని కులాలు మతాల గురించి ఇక్కడ చర్చించలేను గానీ, తెలిసిన క్రైస్తవ మతం గురించి చెప్పక తప్పదు. ఇది ఎవరినో కించ పరచడానికో, అవమాన పరచడానికో చెప్పడం కాదు, నాకు అతి సమీపంగా వున్న అంశం కనుక దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి సాహసిస్తున్నాను. ఒక సామాన్యుడు, భారతదేశం యొక్క సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకుని క్రైస్తవ మతం గురించి ఆలోచిస్తే అది ‘దళితుల మతం’ అని బ్రాండ్ చేస్తాడు. ఎందుచేతనంటే ఒకప్పుడు బలహీన వర్గాలకు చెందిన దళితులే క్రైస్తవత్వాన్ని స్వీకరించారు కనుక!
కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. మనమంతా ఒక్కటే అని చెప్పే ‘పరిశుద్ధ గ్రంథం’ (ది బైబిల్) చదువుకునే క్రైస్తవ సోదరులు, కులాల వారీగా విడిపోవడం చూస్తున్నాం. దళిత (మాల/మాదిగ) క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, కమ్మ క్రైస్తవులు ఇలా విడిపోవడం, వారి మధ్య ఆత్మీయ సత్సంబంధాలు కరువు కావడం, వాళ్ళ మధ్య వివాహ బంధాలు, ఇతర సంబంధాలు లేకపోవడం, పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా తయారైంది. ఇది బాధాకరం. క్రైస్తవంలో వున్నరకరకాల డినామినేషన్లు, వారికి ప్రత్యేకమైన చర్చిలు, ఇది పరిస్థితి. ఎటు తిరిగి చూసినా, ప్రజల్లో ఈ వ్యత్యాసాలూ, ప్రాధాన్యతలూ తగ్గడం లేదు. ఒక క్రైస్తవ కుటుంబ సభ్యుడిగా నేను (ఎవరికైనా ఇలా రాయడం ఇబ్బంది ఐతే మన్నించాలి) ఇలా రాయడానికి, నేను ఇన్ని సమస్యల్లో చిక్కుకోకున్నా, ఇంచుమించు ఇలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడ్డ వ్యక్తిగా, నా అనుభవం కొందరికి కనువిప్పు కలుగుతుందనే నమ్మకంతో మీ ముందు పెడుతున్నాను.
మాది ప్రేమ వివాహం. ప్రేమ వరకే ఆలోచించాము గానీ తర్వాతి పరిణామాలు అసలు అసలు ఆలోచిస్తోలేదు. ‘ప్రేమ’ అంటే అంతేనేమో! పెళ్లి అంశం తెర మీదికి వచ్చేసరికి అసలు సాంకేతిక సమస్య మా పెళ్ళికి స్పీడ్ బ్రేకర్‍గా తయారైంది. అది కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది. మా కుటుంబం నేపథ్యం ‘నాస్తికత్వం’. మా ఆవిడ నేపథ్యం ’క్రైస్తవత్వం’. రెండు కుటుంబాల మధ్య దగ్గరి బంధుత్వం వుంది. మా ఆవిడకి నేను మేనమామ వరుస. అయినా ఇక్కడ మతం డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. నన్ను ’అన్యుడు’గా బ్రాండ్ చేసి, ఈ పెళ్లి జరిగేది కాదని తేల్చేశారు. అన్యుడు అంటే క్రైస్తవత్వం స్వీకరించని వాడని అర్థం. మా మామగారితో మొదలుపెట్టి సన్నిహిత బంధువర్గం అంతా అదే పాట పాడారు. వాళ్లకి ఇష్టం వున్నా బయటి వారికి సమాధానం చెప్పలేక, తమకు తాము సమస్యలు సృష్టించుకుని జీవితాలను విషాదంలోకి నెట్టుకున్నవారు చాలామంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా,జీవితంలో సుఖపడాలంటే కొన్ని వదులుకోక తప్పదు.
ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. చివరికి ‘చర్చిలో పెళ్లి చేసుకుంటే చాలు’ అన్న దగ్గర వాళ్ళు దిగివస్తే (అది మా అత్తగారి సాహసమూ, ముందుచూపే) ఆ పద్ధతిలో వివాహం చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను. అనవసరమైన సమస్యలు అడ్డుపెట్టుకుని జీవితాంతం బాధపడేకంటే, కొన్ని త్యాగాల వల్ల జీవితం సుఖమయం చేసుకోవచ్చునన్న సూత్రం గట్టిగా నమ్మినవాడిని నేను, అందుకే ఒప్పుకున్నాను. మామామ గారు అయిష్టంగానే పెళ్ళికి ఒప్పుకోవడమూ, ఆ కార్యక్రమం జరిగినంత సేపూ ఆయన ముభావంగా ఉండడం నేను గమనించక పోలేదు. కానీ, పెళ్లి అయిన తర్వాత ‘నేను’ ఏమిటో ఆయన గమనించిన తర్వాత, నా జీవన శైలిని పరిశీలించిన తర్వాత, నన్ను మా మామగారు ప్రేమించిన విధానం వర్ణించడానికి మాటలు చాలవు. తన అల్లుడి గురించి గొప్పలు చెప్పుకోవడం నా చెవిన పడకపోలేదు. ఆ తర్వాత ఆ వైపు బంధువర్గం అంతా నన్ను బాగా ఇష్టపడ్డారు. నన్నొక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించారు, గౌరవించారు. ఆ తర్వాత నేను మామగారైన గిల్బర్ట్ గారు, మామా-అల్లుళ్ళ మాదిరిగా కాకుండా, స్నేహితుల్లా మారిపోయాము. చాలా బాగా ఉండేవాళ్ళం.
అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. మా అభివృద్ధిని ఆయన పూర్తిగా చూడలేదు. సర్వీసులో ఉండగానే ఆయన హృద్రోగంతో మరణించడం మా దురదృష్టం. ఇది ఊహించనిది. మా ఇద్దరు బావమరుదుల పెళ్లిళ్లు చూడకుండానే ఆయన వెళ్ళిపోయారు. కుటుంబంలో ఒక సహృదయ ప్రేమమూర్తిని కోల్పాయాము.
ఇక్కడ ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం, మనిషిని, మనిషి వ్యక్తిత్వానికి, వారి జీవన విధానానికీ ప్రాధాన్యత నివ్వాలి గాని, తప్పని పరిస్థితిలో, కులాలకూ, ఉపకులాలకు మతాలకు, ప్రాంతాలకూ మంకుపట్టుతో ప్రాధాన్యత నిచ్చి సుఖమయ జీవితాలను దుఃఖమయం చేసుకోకూడదు. ఇష్టమైన జీవితాలను జీవించనీయకుండా మనకు మనం అడ్డుగోడలు కట్టుకోకూడదు. లేదంటే ఇలాంటి సమస్యలు ఎక్కడో ఒకచోట ఎదురవుతుంటాయి. మిగతావారికి వీటితో సంబంధం ఉండవు.
నా విషయంలో అలా ప్రతికూల, అనుకూల పరిస్థితులను దాటుకొని జీవితం సుఖమయ మార్గంలో నడుస్తూనే వుంది. అర్థం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, కలిసి ఆనందంగా, సుఖంగా, ఆరోగ్యంగా బ్రతకడానికి ఏవీ అడ్డురావు. అక్క అత్తగారిగా మారడం, బావగారు మావగారిగా మారడం నా వైవాహిక జీవితానికి కలిసొచ్చిన అదృష్టమని చెప్పాలి.
(మళ్ళీ కలుద్దాం)