మధురమైన బాధ – గురుదత్ సినిమా 9 – చౌదవీ కా చాంద్

2
3

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నటించిన ‘చౌదవీ కా చాంద్’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]‘కా[/dropcap]గజ్ కె ఫూల్’ సినిమా ఘోర పరాజయం తరువాత గురుదత్ దర్శకత్వం చేయనని నిశ్చయించుకున్నారు. ఎంతో ఖర్చుతో తీసిన ఆ సినిమా పరాజయం గురుదత్‌ని చాలా కృంగదీసింది. ఆర్థికంగా కూడా అది గురుదత్ ప్రొడక్షన్స్‌కి కోలుకోలేని పెద్ద దెబ్బ. మొదటి నుండి గురుదత్ సినిమాలు తీసిన విధానం చూస్తే, ఒక సినిమా పూర్తిగా తనకు కావలసిన విధంగా తీసాక రెండవది కమర్షియల్ సినిమాగా ఉండేలా జాగ్రత్తపడేవారు. కమర్షియల్ సినిమాను తన పంథాలో తీస్తూనే కథాపరంగా అది మాస్‌ని ఆకట్టుకునేలా జాగ్రత్త పడేవారు. అలా ‘కాగజ్ కే ఫూల్’ పరాజయం తరువాత, ఆ ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కడానికి తీసిన సినిమా ‘చౌదవీ కా చాంద్’. గురుదత్ సినిమాలలో అతి పెద్ద హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఆయనను ఆర్థికంగా మళ్ళీ నిలిపిన చిత్రం కూడా.

గురుదత్ సినిమాలను వరుసగా విశ్లేషిస్తూ భారతీయ సినీ రంగానికి ఆయన ద్వారా లభించిన గౌరవం గురించి ప్రస్తావిస్తే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. అతి తక్కువ సినిమాలతో భారతదేశపు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన కళాకారుడిగా ఆయనను సినిమా ప్రియులు తప్పకుండా గౌరవించాలి. భారతదేశంలో మొదటి క్రైమ్ నౌర్ పద్దతిలో తీసిన సినిమా (బాజీ). మొదటి పూర్తి నెగిటివ్ పురుష కారెక్టర్‌ను (జాల్) స్త్రీ కారెక్టర్‌ను (ఆర్ పార్) సినీ జనానికి పరిచయం చేసింది గురుదత్. మొదటి సెవెన్టీ ఎం.ఎం. సినిమా (కాగజ్ కే ఫూల్), ఛాయాగ్రహణంలో అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్రయోగాలు,(కాగజ్ కే ఫూల్), జర్మన్ ఎక్ప్రెషనిజాన్ని పోలిన సినిమాలు, ఇవన్నీ గురుదత్ ద్వారా భారతీయ చిత్ర సీమ రుచి చూసింది. కాస్టూమ్స్ విభాగంలో మొదటి ఆస్కార్‌ని దేశానికి అందించిన భానుమతి లాంటి వారికి మొదటి అవకాశం ఇచ్చిన వ్యక్తి (సీ.ఐ.డీ) గురుదత్. చాయాగ్రహణంలో దాదా సాహెబ్ అవార్డు పొందిన ఏకైక వ్యక్తి వీ.కే.మూర్తి, గురుదత్ మలిచిన మరో కళాకారుడు. ఇక సినిమాలో పాటల చిత్రీకరణను గమనిస్తే, గురుదత్ ప్రత్యేకత గురించి ఎంత రాసినా తక్కువే. ప్రపంచ గొప్ప సినిమాలలో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న ‘ప్యాసా’ని నిర్మించి నటించి దర్శకత్వం వహించిన వ్యక్తి గురుదత్. అలాగే అతి గొప్ప ముస్లిం సోషల్ డ్రామాని తెర కెక్కించే సాహసం చేసింది కూడా గురుదత్తే. అంతకు ముందు ముస్లిం సోషల్ డ్రామాలు కొన్ని వచ్చాయి. కాని వాటన్నిటిని ఇప్పుడు పరిశీలించి, గొప్ప ముస్లిం సోషల్ డ్రామాలను భారతీయ సినిమాలో ఎంచితే మొదటి స్థానంలో ఉండే సినిమా ‘చౌదవీ కా చాంద్’.

వహిదా రెహమాన్ అప్పటి హీరోయిన్లతో పోలిస్తే పెద్ద అందగత్తె కాదు. గురుదత్ అప్పటికే ఆమె ప్రభావంలో ఉన్నారు. వహిదాలో ఆయన ఏ రూపాన్ని తన కళ్ళతో చూసారో, దాన్ని అంతటి పోయెటిక్ ఎసెన్స్‌తో స్క్రీన్ పై ‘చౌదవీ కా చాంద్’ సినిమాలో చూపించగలిగారు. తన ఊహను, భావనా ప్రపంచంలో వహిదా రూపాన్ని తెరపై చూపించ గలగడంలో వీ.కే మూర్తి ఫోటోగ్రఫీ గొప్పగా పని చేసింది. వహిదా ఏ యాంగిల్స్‌లో ఎలా కనపడాలో అతి జాగ్రత్తగా  ప్లాన్ చేసి ఆమెను స్క్రీన్‌పై చూపించారు మూర్తి. వహిదా రెహ్మాన్ ఎన్నో సినిమాలలో తరువాత నటించినా, ఆమె ‘చౌదవీ కా చాంద్’లో కనిపించినట్లు మరే సినిమాలోనూ కనిపించరు. ఆమె పేరున అత్మకథ రాసిన నస్రీన్ మున్నీ కబీర్ ఆ పుస్తకం కవర్ పేజీకి ఎంచుకున్న ఫోటో కూడా ఈ సినిమా లోదే. గురుదత్ దగ్గర పని చేసిన వారినందరినీ గమనించండి. రాళ్లను వజ్రంగా మార్చగల శక్తి ఉన్న దర్శకుడు గురుదత్ అని అర్థం అవుతుంది. గురుదత్ సినిమాలు తీస్తున్న సమయంలో అతనితో చేరిన వారంతా సినీ రంగానికి కొత్త వారే. వీ.కే మూర్తికి పెద్ద పేరు లేదు. అబ్రర్ అల్వీ ఇంకెవ్వరికీ అంతకు ముందు పని చేయలేదు. ఓ.పీ. నయ్యర్‌కు మొదటి హిట్ అవకాశం గురుదత్ సినిమాతోనే వచ్చింది. రాజ్ ఖోస్లా అసిస్టెంట్‌గా పని చేసేవారు. భాను అత్తయ్య అనే కాస్టూమ్ డిజైనర్‌కు అవకాశం ఇచ్చింది గురుదత్ సినిమాలే. ఇలా ఒక టీంలో వారి సక్సెస్ చూసి కాక వారిలో పనితనాన్ని గమనించి, వారిని నమ్మి వారితో పని చేయించి వారందరికీ సినీ ప్రపంచంలో ఒక స్థానం రావడానికి దోహదపడిన వ్యక్తి గురుదత్. తనకేం కావాలో చెప్పి వారికి పని చేసుకోవడానికి ఎంతో సమయాన్నిచ్చి తన టీంలో ప్రతిభను రాబట్టుకోగలిగారు గురుదత్. అందుకే ఆయనతో పని చేసిన వారందరూ కూడా వారి వారి రంగాలలో నిష్ణాతులు కాగలిగారు. వహిదా రెహమాన్ నటనను గమనించండి అమెలో స్వీయ ప్రతిభ కన్నా గురుదత్ సినిమాలలో ఒకో మెట్టూ ఎక్కుతూ నటనలో మెళుకువలు నేర్చుకున్న వైనం గమనించవచ్చు. ఈ సినిమా దగ్గరకు వచ్చే సరికి అద్భుతమైన సౌందర్యవతిగా వహీదాను చూపించడంలో సక్సెస్ అయ్యారు గురుదత్. ఈ సినిమా విజయం వహీదా రెహ్మాన్‌ను హిందీ సినిమాలలో తిరుగులేని స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇందులో ప్రతి ఒక్కరి మీద తీసిన క్లోజ్ అప్ షాట్స్‌ను గమనిస్తే గురుదత్ సినిమాలలో ప్రతి ప్రేమ్ ఒక పెయింటింగ్ అనిపించక మానదు.

‘చౌదవీ కా చాంద్’ టైటిల్ పాట హిందీ చిత్ర గీతాలలో ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని అద్భుత గీతంగా నిలిచిపోతుంది. “చౌదవీ కా చాంద్” 1960లో రిలీజ్ అయ్యింది. అదే సంవత్సరం ‘ముఘల్ – ఏ- ఆజం’ కూడా రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. అ సినిమాతో పోటీ పడి కూడా ఇది గురుదత్ నిర్మించిన ఇతర సినిమాల కన్నా అత్యధిక వసూళ్ళు సాధించింది అంటే ఈ సినిమా ఎంతగా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. ‘చౌదవీ కా చాంద్’ పాట మహమ్మద్ రఫీకి మొదటి ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టిన గీతం. ఉత్తమ ప్లే బాక్ సింగర్ అవార్డుని 1959లో ప్రవేశ పెట్టారు. గాయనీ, గాయకులలో ఒకరికి మాత్రమే ఆ అవార్డు ఇచ్చేవారు. మొట్ట మొదటి అవార్డు మధుమతిలో ‘ఆజా రే పరదేశీ’ పాటకు లతా మంగేష్కర్ అందుకుంటే, రెండవ అవార్డు రఫీ “చౌదవీ కా చాంద్ హో” అన్న పాటకు అందుకున్నారు. దీనితో వారి అవార్డుల ఖాతా తెరుచుకుంది. ఇప్పటికీ రఫీ అభిమానులు మర్చిపోలేని గీతం ఇది.

ఈ పాట చిత్రీకరణ కూడా అతి గొప్పగా ఉంటుంది. ఇంత అందంగా పాటను తీయగలగడం ఒక్క గురుదత్‌కి మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. సినిమాకు దర్శకత్వం వహించింది కే. సాదిఖ్ . అయితే పాటల దర్శకత్వం గురుదత్‌ది అని సినీ విశ్లేషకులు చెబుతారు. ఈ పాట రాసిన షకీల్ బదాయుని, సంగీతం ఇచ్చిన రవితో పాటు ఆర్ట్ డైరెక్షన్ చేసిన బీరెన్ నాగ్ కూడా ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఈ పాటను కలర్‌లో చాలా ప్రేమగా తీసారు గురుదత్. వారి శ్రద్ధను ప్రతి ఫ్రేంలో వహీదా రెహ్మాన్‌ను తెర పై చూపించిన విధానంలో గమనించవచ్చు. ఈ పాటకు మొదట సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం చెప్పారట. వహీదా రెహ్మాన్ కళ్ళలో ఆ ఎరుపు, శృంగారపు మైమరపుగా స్క్రీన్ పై రావడంతో ఇది ప్రేక్షకుల మనసులలో అనారోగ్యకరమైన కలకలాన్ని తీసుకువస్తుందని, ఒక స్త్రీ కళ్ళల్లో అంత కైపుని చూపించడం తప్పని వాదించారట. అయితే అప్పట్లో కొత్తగా వచ్చిన కలర్ లైట్ల కారణంగా వహిదా రెహ్మన్ కళ్ళు ఎర్రబడ్డాయని అది స్కీన్‌పై మరోలా వచ్చి ఆ పాటలోని శృంగార రసానికి జత కలిసిందని, ఆ ఇబ్బందిని కూడా అందంగా స్క్రీన్‌పై వీ.కే మూర్తి చూపించగలిగారని, అందువలన అ పాట అంత అద్భుతంగా వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో వహీదా రెహ్మాన్ చెప్పారు.

ఈ సినిమా అప్పటికే గురుదత్ సంసార జీవితం సరిగ్గా లేదు. వహీదా రెహ్మాన్‌కి తన భర్త దగ్గరవ్వడం గీత దత్‌ను చాలా నిరాశలోకి నెట్టేసింది. గురుదత్ సినిమాలకే పరిమితమైన ఆమె గానం, ఆమె మనసుకు తగిలిన గాయం కారణంగా, వహీదా రెహ్మాన్‌కు ఇక పాడననే నిర్ణయం తీసుకోవడానికి కారణం అయింది. అందువలన ఈ సినిమాలో గీతా దత్ గొంతు “బాలం సే మిలన్ హోగా” అనే పాటలో మాత్రమే వినిపిస్తుంది. మొత్తం పది పాటలున్న ఈ సినిమాలో ఐదు పాటలు రఫీ పాడిన సోలోస్. ‘చౌదవీ కా చాంద్ హో’ పాట కాకుండా ‘మిలీ ఖాక్ మే ముహబ్బత్’ అన్న మరో పాట కూడా చాలా గొప్పగా గానం చేసారు రఫీ. ‘యే బహార్ కైసి ఆయి జో ఖిజా భీ సాథ్ లాయి, మై కహా రహూ చమన్ మే,  మెరా లుట్ గయా ఠికానా’ అన్న పాట దగ్గర గురుదత్ మీద క్లోజ్ అప్ షాట్ గమనిస్తే ఆ కళ్లల్లో మెదిలో బాధ మనలోకి పాకుతుంది. ఈ రెండు వాక్యాల దగ్గర గురుదత్ కళ్లతో చేసిన అభినయం చూడవలసిందే. ‘చౌదవీ కా చాంద్ హో’ పాటలో కూడా ప్రతి ప్రేం క్లోజ్ అప్ లోనే ఉంటుంది. “మిలి ఖాక్ మే ముహబ్బత్” అన్న పాటలో ఆయన కళ్ళతో పలికించిన విషాదాన్ని, ఈ టైటిల్ పాటలో ఆయన కళ్ళు చిలకరించే ప్రేమను, ప్రియురాలి అందాన్ని విస్మయంగా చూస్తూ ఆమెపై అంతులేని ప్రేమను చూపించే ఆ సన్నివేశాన్ని పోల్చితే, ఆయన కళ్ళు ఎన్ని భావాలను అధ్బుతంగా పలికించేవో చూసి ఆశ్చర్యపోతాం.

గురుదత్ తన సినిమాలో నటించే వారందరికీ క్లోజ్ ఆప్ షాట్లపై దృష్టి పెట్టమని చెప్పేవారట. ముఖ్యంగా కళ్ళను ఎలా వాడుకోవాలో, ఒక చిన్న పెదవి విరుపు, చిరునవ్వుతో ఎన్నీ భావాలను ప్రకటించవచ్చో నేర్పించేవారట. సరైన ఫీల్ వచ్చేదాకా షూట్ చేస్తూనే ఉండేవారట. గురుదత్‌తో పని చేసిన వారంతా సినిమాకు ఆయన వాడిన ఫిలిం కన్నా సీన్ సరిగ్గా రాలేదని పడేసిన ఫిలిం మూడింతలు ఉండేదని చెబుతారు. ఒక్క చిన్న షాట్ కోసం కూడా ఎక్కడా రాజీపడని తత్వం ఆయనది.

ఈ సినిమాలో లతా మంగేష్కర్ ‘బదలే బదలే మెరే సర్కార్’ అనే పాటను పాడారు. గురుదత్ సినిమాలకు లత పాడిన ఒకే ఒక పాట ఇది. ఇస్మత్ చుగ్తాయి ‘A VERY STRANGE MAN’ అన్న నవల గురుదత్ జీవితం ఆధారంగా రాసారు. అందులో గీతా దత్, లతా మంగేష్కర్ వద్దకు వెళ్ళి వహీదా అనే వ్యక్తి మాయలో పడి తన భర్త తనకు చేస్తున్న అన్యాయం గురించి, దాని వలన తమ కుటుంబంలో రేగుతున్న తుఫాను గురించి ప్రస్తావించినప్పుడు ఆమె గీతా దత్ బాధను అర్థం చేసుకుని తాను ఇక ఎప్పటికీ గురుదత్ సినిమాలకు పాడని చెప్పారట. ఆ విధంగా గీతా దత్ పక్షాన ఆమె నిలిచారు అంటారు. ఏ కారణంతో నైనా కాని లతా మంగేష్కర్ గురుదత్ సినిమాలకు పాడిన ఒకే ఒక పాట ‘బదలే బదలే మెరే సర్కార్’ అన్నది. ఇది వహిదా రెహ్మాన్ మీద చిత్రించిన గీతం. ఒక ఖవ్వాలి శంషాద్ బేగం ఆశా భోంస్లే పాడితే, మరో రెండు సోలోలు ఆశా భోంస్లే తో రవి పాడించారు. హిందీ ఖవ్వాలీలలో ‘షర్మాకే క్యూ సబ్ పర్దా నషీన్’ అన్న పాట ఒక అద్భుతం. ఇందులోని సవాల్ జవాబ్ ఉర్దూ భాషలోని గొప్పతనాన్ని సూచించే ఒక చక్కని ప్రయోగం.

మరో రెండు పాటలు ఆశా భోంస్లే గొంతుతో మిన్నూ ముంతాజ్ మీద చిత్రించారు. జానీ వాకర్ మీద మరో రెండు పాటలు రఫీ గొంతులో హాయిగా సాగుతాయి. ఇక మరో రఫీ పాట లక్నో నరగరం మీద షకీల్ రాసిన గేయం. ఇది సినిమా క్రెడిట్స్ అప్పుడు బాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. సినిమా క్రెడిట్స్‌లో పాట రావడంతో అ సినిమా వాతావరణం ప్రేక్షకులకు ముందే అర్థం అవుతుంది. ఇలా క్రెడిట్స్‌లో పాటను వాడుకోవడాన్ని పాపులర్ చేసిన సినిమా కూడా ‘చౌదవీ కా చాంద్’.

ఇది ముగ్గురు మిత్రుల కథ. లక్నౌ నవాబ్ ప్యారే మోహన్, అస్లం, షైదా ముగ్గురు స్నేహితులు. నవాబ్ ధనవంతుడు. అతనికి తండ్రి లేడు. తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. షైదా తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్. షైదా మంచివాడే కాని బాధ్యత తెలిసినవాడు కాదు. అస్లం అనాథ. నవాబ్ అతన్ని అన్నిరకాలుగా ఆదుకుంటాడు. ఒక రోజు నవాబ్ జమీలా అనే యువతిని మార్కెట్‌లో చూస్తాడు. ఆమెపై మనసు పారేసుకుంటాడు. బుర్కా ధరించిన జమీలా మోము క్షణకాలం చూసి ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాని ఆమె ఎవరో తెలియదు. అతని చెల్లెలి పుట్టిన రోజు వేడుకలకు జమీలా అతిథిలా వస్తుంది. ఆమెను అక్కడ చూసిన నవాబ్ ఆమె వివరాలు కనుక్కొమ్మని పని అమ్మాయికి చెబుతాడు. తనను చూసి పారిపోతున్న జమీలా దుపట్టా తలుపు సందులో పడి చిరిగి పోతుంది. అక్కడ ఇరుక్కున దుపట్టా ముక్కను, పనిఅమ్మాయికి ఇస్తాడు నవాబ్. ఆ దుపట్టా ధరించిన అమ్మాయి వివరాలు కావాలని అడుగుతాడు. అయితే అమ్మాయిలు వేడుకలలో భాగంగా ఒకరి దుప్పట్టా మరొకరు మార్చుకుంటారు. అలా మారిన దుపట్టాను బట్టి ఆ దుపట్టా ధరించిన అమ్మాయి వివరాలు నవాబ్‌కి ఇస్తుంది పని మనిషి.

తను ప్రేమించిన అమ్మాయిని కలిసే ప్రయత్నం చేస్తుంటాడు నవాబ్. ఇంతలో అతని తల్లి హజ్ యాత్రకు అన్నీ సిద్ధం చేసుకుంటుంది. కాని ఆమెను పరీక్షించే వైద్యుడు అమె అంత పెద్ద యాత్ర చెయగల స్థితిలో లేదని చెబుతాడు. మొదలెట్టిన యాత్ర ఆగకూడదు కాబట్టి ఆమె బదులు అ ఖర్చుతో మరొకరు ఆ యాత్ర చేయడం మంచిదని చెబుతాడు ఖాజీ. చివరకు ఆ ఖాజీనే తల్లికి బదులు హజ్‌కి వెళ్ళడానికి ఒప్పిస్తాడు నవాబ్. అయితే ఆ ఖాజీ తనకో వయసుకు వచ్చిన కూతురుందని, ఆమె వివాహం అయిపోతే తాను నిశ్చింతగా హజ్‌కు వెళతానని నవాబ్ తల్లితో చెబుతాడు. అవివాహిత అయిన వయసొచ్చిన కూతురిని ఇంట ఉంచి హజ్‌కు వెళ్ళకూడదనే ఆచారం కూడా ఉంది. ఖాజీ కోరిక విని నవాబ్ తల్లి అతని మనసులో ఉద్దేశం గ్రహిస్తుంది. కొడుకుని ఖాజీ కూతురు అందగత్తె అని ఆమెను వివాహం చేసుకొమ్మని చెబుతుంది. ఖాజీ కోరిక కూడా అదే అని నవాబ్‌కు వివరిస్తుంది.

మార్కెట్‌లో కనిపించిన అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటున్న నవాబు తల్లి ప్రస్తావన తిరస్కరిస్తాడు. స్నేహితుడు అస్లంకు విషయం చెప్ప ఖాజీ కూతురిని వివాహం చేసుకొమ్మని అడుగుతాడు. స్నేహితుని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అస్లం ఆమెను వివాహం చేసుకుంటాడు. మొదటి రాత్రి ఆమె ముసుగు తీసినప్పుడు ఆమె జమీలా అని ప్రేక్షకులకు తెలుస్తుంది. నవాబ్ తన ప్రేయసి కోసం పని అమ్మాయి చెప్పిన ఇంటికి వెళతాడు. కాని అక్కడ కనిపించిన అమ్మాయి తాను ప్రేమీంచిన స్త్రీ కాదని ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అర్థం చేసుకుంటాడు. స్నేహితుల సహాయంతో మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళి ఆ అమ్మాయి కోసం వెతుకుతాడు.

అస్లం ఇంట్లో జమీలాతో తన స్నేహితులకి ఆమెను చూపిస్తానని పందెం కాస్తాడు. జమీలాను నల్ల బురఖాలో మరో సారి నవాబ్ చుస్తాడు. జమీలా భర్తతో ఉన్న స్నేహితులను చూసి, భర్త తనను అల్లరి చేస్తాడని అనుకుని, తనను వారికి పరిచయం చేసి మాట్లడమని బలవంతం చేస్తాడని అనుకుని జమీలా, అస్లం చెల్లెలితో బురఖా మార్చుకుంటుంది. నల్ల బురఖా వెంట బడిన నవాబ్ అస్లంకు ఆ అమ్మాయి వెళ్ళిన ఇల్లు చూపిస్తాడు. ఆ అమ్మాయి తన చెల్లెలని నవాబ్‌కు చెబుతాడు అస్లం. రెండు వైపుల మాట్లాడి వారి వివాహం నిర్ణయిస్తాడు.

వివాహం దగ్గర పడుతున్నప్పుడు ఒక రోజు నవాబ్ అస్లం ఇంటికి అనుకోకుండా వస్తాడు. ఆ ఇంట్లో పరదా లేకుండ ఉన్న జమీలాను చూస్తాడు. ఆమెనే తాను వివాహం చేసుకుంటున్నానని అనుకుంటాడు. అస్లంతో అతని చెల్లెలిని పరదా లేకుండా చూశానని చెబుతాడు. ఇంటికి వచ్చి అస్లం తన చెల్లెలి కోసం వెతుక్కుంటున్నప్పుడు జమీలా నవాబ్ వచ్చి తనను బురఖా లేకుండా చూసాడని చెబుతుంది. అప్పుడు అస్లంకు తన స్నేహితుడు ప్రేమిస్తుంది తన భార్యనే అని తెలుస్తుంది. భార్య పై ప్రేమను చంపుకోలేక స్నేహితుడికి అసలు సంగతి చెప్పలేక ఇబ్బంది పడతాడు అస్లం. భార్యకు కోపం తెప్పించి తలాఖ్ వరకు తిసుకు రావాలని అనుకుంటాడు. తరువాత ఆమె నవాబ్‌ను పెళ్ళి చేసుకోవచ్చని అలా స్నేహితుని కోరిక తీరుతుందని అనుకుంటాడు. జమీలా అన్నలతో గొడవ పడతాడు కూడా. తాగుతున్న భర్తతో గొడవ పడుతున్న అన్నలతో జమీలా, భర్త తాగినా, తనను తన్నినా తాను అతన్ని వదిలే ప్రసక్తే లేదని వారిని పంపించి వేస్తుంది. తనకు భర్తే సర్వం అని ఎన్ని అన్యాయాలనయినా సహించి అతనితోనే ఉంటానని చెబుతుంది.

గురుదత్ సినిమాలను నిశితంగా గమనిస్తే తాను ప్రేమించే స్త్రీ పూర్తగా తనను అన్ని బలహీనతలతో స్వీకరించాలి అన్న కోరిక వారి పాత్రలలోఎక్కువగా కనిపిస్తుంది. జమీలా నా భర్త నన్ను తన్నినా  చంపినా అతనే నాకు దేవుడు అని చెప్పుకొచ్చె సన్నివేశం ఇప్పడు అతిగా అనిపిస్తుంది. ఇలాంటి సంభాషణే “మిస్టర్ అండ్ మిసెస్ 55” లో కూడా ఒక చోట గమనిస్తాం. అన్ని విషయాల్లో ప్రొగ్రెసివ్‌గా అనిపించే గురుదత్ ప్రశ్నలు, ఆలోచనలు స్త్రీ ప్రేమ విషయనికి వస్తే మరీ ఇంత లొంగుబాటును కోరుకునే విధంగా ఉండడం కొంత అయోమయానికి గురి చేస్తుంది. గురుదత్ సినిమాలన్నిటికీ స్క్రీన్ ప్లే రాసింది అబ్రర్ అల్వీ. ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’ సినిమాలలో స్త్రీ పాత్రలకి గురుదత్ సినిమాలో ఇతర స్త్రీ పాత్రలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే గురుదత్ మనసుకు దగ్గరగా ఉన్న సినిమాలు, గురుదత్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కమర్షియాలిటీకి దూరంగా తీసిన సినిమాలలో స్త్రీ పాత్రలు, అతని ఇతర కమర్షియల్ సినిమాలలో స్త్రీ పాత్రల వ్యక్తిత్వంలో చాలా వైరుద్యం కనిపిస్తుంది.

చివరకు నవాబ్‌కు తాను కోరుకుంటున్నది స్నేహితుని భార్యనే అని తెలుస్తుంది. స్నేహితుడు తన కోసం భార్యను వదులుకోవడానికి సిద్ధపడ్డాడని అర్థం అవుతుంది. ఇది పాపం అని, తాను ఆ దంపతులకు అన్యాయం చేయకూడదని అర్థం చేసుకుంటాడు. చేతికున్న వజ్రపు ఉంగరాన్ని మింగి ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోతూ తాను జమీలాను ప్రేమించిన విషయం మరెవ్వరికీ తెలియకూడదని అస్లంని కోరతాడు. అస్లంగా గురుదత్, నవాబ్‌గా రెహమాన్, జమీలాగా వహీదా రెహ్మాన్ నటించిన ముక్కోణపు ప్రేమ కథ ‘చౌదవీ కా చాంద్’.

‘చౌదవీ కా చాంద్’ కథ మనకు నచ్చదు. కాని ఈ కథలోని పోయెటిక్ సెన్స్ ఆకట్టుకుంటుంది. ఆ ఉర్దూ భాష మాధుర్యం, ఆ పాటలు, ఆ షాయరీ మళ్ళీ మళ్ళీ సినిమాను చూడాలనిపించేలా చేస్తాయి. ముఖ్యంగా వహీద రెహ్మాన్‌ను గురుదత్ చూపించినంత హృద్యంగా మరెవ్వరూ స్క్రీన్‌పై చూపించలేకపోయారన్నది నిజం. సినిమాకు దర్శకత్వం వహించిన సాదిఖ్ ఏ.ఆర్. కర్దార్ దగ్గర పని చేసారు. ‘రత్తన్’ సినిమా ఘన విజయంతో హిందీ సినీ ప్రపంచంలో పెద్ద దర్శకుల జాబితాలో చేరారు. సొంత ప్రొడక్షన్స్‌లో సినిమాలు తీసి చాలా డబ్బు పోగొట్టుకున్నారు కూడా. కొన్ని వరుస పరాజయాలతో ప్లాప్ డైరక్టర్‌గా ముద్ర పడింది. అతనికి ఎవ్వరూ పని ఇవ్వని సమయంలో గురుదత్ సాదిఖ్‌ని కావాలని ఈ సినిమాకు దర్శకునిగా తీసుకున్నారు. సాదిఖ్‌కు లక్నో నగరం జీవితం ముస్లిం సాంప్రదయాలపై చాలా పట్టు ఉందన్నది గురుదత్‌కు తెలుసు. ఫ్లాప్ హిట్ల అధారంగా కళాకరులని ఎంచకూడదని నమ్మి తన టీంని సాదిఖ్‌తో పని చేయడానికి ఒప్పించారట. ఈ సినిమా ఎంత పెద్ద్ హిట్ అయ్యిందంటే సాదిఖ్‌కి బాంబే ఫిలిం జర్నలిస్ట్ అవార్డు తెచ్చిపెట్టింది. తరువాత మూడు సంవత్సరాలకు “తాజ్ మహల్” సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం సాదిఖ్‌కు రావడానికి “చౌదవీ కా చాంద్” సక్సెస్ కారణం. తరువాత ముస్లిం సోషల్ సినిమాకు సాదిఖ్ ప్రత్యామ్నాయం  అయ్యారు. గురుదత్ టీంలో పని చేసి సినిమాలో నిలదొక్కుకున్న వ్యక్తులలో అలా సాదిఖ్ ఒకరయ్యారు.

రెండవ మాస్కో ఇంటర్నేషల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికయిన ‘చౌదవీ కా చాంద్’ కథా పరమైన అభ్యంతరాల మధ్యన కూడా ఇప్పటికీ చాలా మంది ఇష్టపడే క్లాసిక్. SEVEN MUSLIM SOCIALS YOU NEED TO WATCH అనే లిస్ట్‌లో మొదట ప్రస్తావించే సినిమా ‘చౌదవీ కా చాంద్’. ఈ సినిమాకు గురుదత్ నిర్మాత మాత్రమే కాని ప్రతి ప్రేంలో గురుదత్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రెహ్మాన్, జానీ వాకర్‌తో సమానంగా ఉర్దూ పలికిన గురుదత్ ఈ పాత్రకు చేసిన హోం వర్క్ కూడా అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం లాజిక్ లేని అతి మామూలు కథకు గొప్ప కళాత్మకతను ఈ సినిమా టీం అంతా తీసుకువచ్చారని ఖచ్చితంగా చెప్పాలి. ఈ సినిమా కాస్టూమ్ డిజైనర్‌గా భానుమతి గారే పని చెసారు. బ్లాక్ అండ్ వైట్‌లో కూడా అద్భుతంగా కనిపిస్తాయి పాత్రల కాస్టూమ్స్ అన్నీ కూడా. ‘చౌదవీ కా చాంద్ హో’ పాట చిత్రీకరణను కాపీ చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఈ పాట స్థాయిలో పాటలు రాయాలని స్క్రీన్‌పై చూపాలని చాలా మంది ప్రయత్నించారు. కొన్ని మంచి పాటలు రాసారు కూడా. అయినా ‘చౌదవీ కా చాంద్ హో’ లోని మేజిక్‌ను పండించలేకపోయాయి. ఉదాహరణకు అబ్దుల్లా సినిమాలో ‘మైనే పూచా చాంద్ సే’ అన్న పాటని వినండి. మంచి పాట, మంచి సాహిత్యం, అదే భావం కాని “చౌదవీ కా చాంద్’ స్థాయి అందుకోలేకపోయింది. హిందీ క్లాసిక్స్‌ని ప్రేమించే వారెవ్వరూ మిస్ కాకూడని సినిమా ‘చౌదవీ కా చాంద్’.

‘చౌదవీ కా చాంద్’ అంటే పౌర్ణమి ముందు రోజు చంద్రుడు. కాని పౌర్ణమి నాటి చంద్రుడు ఇంకా పెద్దగా అందంగా ఉంటాడు. మరి పంద్రహవీ కా చాంద్ అనో, పూనం కా చాంద్ అనో ప్రియురాలిని పోల్చరు ఎందుకు అని ఈ సినిమా చూసిన నా కాలేజీ రోజుల్లో ఆలోచించే దాన్ని. నా మనసుకు తట్టిన సమాధానం కరెక్ట్ కాకపోవచ్చు కాని అది నాకు నచ్చిన సమాధానం. పౌర్ణమి నాటి చంద్రుడు అందంగా ఉంటాడు. కాని దానికి భవిష్యత్తు లేదు, మరునాటి నుంచి తరుగుదలే కదా. ‘చౌదవీ కా చాంద్’ అంటే దాని భవిష్యత్తు ఇంకా అందంగా ఉంటుంది. మరుసటి రోజు ఇంకా పెద్దగా ఇంకా కొత్త అందాలతో కనిపిస్తుంది. అందుకని అందమైన అమ్మాయి మోమును ‘చౌదవీ కా చాంద్’తో పోల్చారేమో. ఇది నా మనసుకు తట్టిన ఆలోచనే సుమా. ఏమైనా ఈ సినిమా, ఈ పాటలో రఫీ గొంతు, గురుదత్ అభినయం కొన్ని వందల సార్లు చూసాక, నిండు చందమామను చూసిన వెంటనే మనసులో మెదిలేది ఈ పాటను హృద్యంగా పాడుతున్న గురుదత్. ఇది గురుదత్‌పై నాకున్న అభిమానం కావచ్చు కాని చందమామను వెన్నెలను చూసినప్పుడు ఈ పాట, గురుదత్ ఇద్దరూ మదిలో మెదులుతారు. నాలాగా ఎందరున్నారో మరి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here