తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-17

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

[dropcap]ఆ[/dropcap]శీర్వాదము

“శ్రీరాస్తాం ధీరాస్తాం

భూరాస్తా” మన్న సిద్ధములు తుమ్మల సీ

తారామమూర్తి చౌదరి !

యౌరా! ”శతవర్ష మాయురాస్తాం భవతే”

కమ్మని పానకమ్ము వడిగట్టిన తేనియ సత్కవీశ్వరుల్‌

తుమ్మెదలై భ్రమించు నొకతోట యదేమది? ‘రాష్ట్రగాన’ మీ

తుమ్మల కమ్మ సత్కవి విధుండు కలమ్మును జేతదూయగా

నమ్మ సరస్వతమ్మ తనయందెల యందము గ్రుమ్మరించెఁగా !

శాంతికి బుట్టినిల్లు, కవిచాతురి మెట్టిన యిల్లు, కల్ల యొ

క్కింతయు గల్ల, భేషజ మదేమియు నాస్తి, సదాస్తికుండు, నా

శాంతవిశాలనిర్మలయశస్సుషమా శరదించుచంద్రికా

కాంతచరిత్రు డందు గలకాల మిదంవిధ గౌరవమ్ములన్‌.

దగ్గరవాడు మాకు, గవితా నవతా నవసృష్టికర్తయున్‌

దగ్గనివాడు లక్షణమునన్‌ గృతహస్తుడు, సద్విమర్శలన్‌

నెగ్గినవాడు కాకవి వినిగ్రహమందు, గవిత్వమందునన్‌

నిగ్గును దీయు, గక్కురితి నేరడు, మీరడు హద్దుపద్దులన్‌.

దీర్ఘాయురస్తు, భవతే, నవసత్కవిత్వ

సిద్దాన్తమూల గురుణాం గురవే, కవీశే,

పూర్ణాయురస్తు భవతే శతవర్ష పూర్ణం

సంపూర్ణ సద్గుణగణ ప్రమితోత్సవాయ.

వైయాకరణభూషణ, బాలసరస్వతి, శ్రీ తాడేపల్లి  సాంబమూర్తిశాస్త్రి

~

సఖా!

కవితా సత్కళ సార్ధకంబుగనె నీ కావ్యేఘసంపత్తిచే

గవిలోకంబు నుతించె నీ సరళ వాక్కావ్య ప్రతానైక వై

భవముం జూచి త్రిలింగ దేశ లలిత ప్రాచీన విద్వత్కవి

స్తవనీయంబు భవత్కవిత్వ మది సీతారామమూర్తీ! సఖా!

ధారాశుద్ధి యుదారభావములు, గాధాకల్పన ప్రౌఢి నిం

డార వ్రాసిన గాంధిజీవితము లోనన్‌ దెగ్గు తెన్నుల్‌ చమ

త్కారమ్ముల్‌ ననుఁ దన్పె ఆంధ్రకవితాతత్త్వంబు నీసొమ్ము నీ

ధారాళంబగు, శయ్య అద్భుతము సీతారామమూర్తీ ! సఖా !

కలము బట్టితివేని కవితా విలాసినీ, శృంగారగరిమ చిత్రింపగలవు

పాఠముల్‌ చెప్పిన ప్రత్యాంధ్ర విద్యార్థి,హృదయ రాజ్యంబుల నేలగలవు

వ్రాయబూనిన రసవత్పద్య గద్యాదికృతులతో వాణి నర్చింప గలవు

తీర్ప నెంచిన భారతీ దివ్యతరమూర్తి, తీరుతీయములుగా దిద్దగలవు

అన్నిట సమర్ధుడవు కూర్పు నందు దిక్క

యజ్వతో సరియంచు నిన్నాంధ్ర కవులు

బేర్కొనుచు నున్న వారు నీ పెంపు వేఱె

పొగడగా నేల ఓ రామమూర్తి సుకవి !

కవిసన్మాన మహోత్సవంబునకు గాన్కల్‌ పంపి స్వర్ణాభిషే

కవిధిన్‌ బూజలొనర్చు భూపతులకున్‌ క్షామంబు వాటిల్లినన్‌

గవిరాజేంద్రుని గౌరవింపగ బ్రజల్‌ గైకొన్న భారంబు సం

స్తవనీయంబుగ దోచె నామదికి సీతారామమూర్తీ ! సఖా!

కవితాప్రపంచ భాస్కరుడైన రామలిం,గారెడ్డి యధ్యక్షుడై రహింప

ప్రజలు సారస్వత పరిణతబుద్ధులై స్వర్ణాభిషేకంబు సంతరింప

పండిత ప్రవరులు పద్య సుమంబు ల,ర్పించుచు నాశీర్వదించుచుండ

కవితారసజ్ఞులు గజమహోత్సవములో, నానందమున వెంట నరుగు దేర

తుమ్మలాన్వయ వార్ధివిధుండు సుకవి

జనవిధేయుండు సార సారస్వత ప్ర

సన్న హృదయుండు నేటి యుత్సవమునందు

వాఙ్మయోపాసకుల కుత్సవంబు గూర్చె.

నీకు జిరాయువు గృతు లనేకములన్ రచియించు నేర్పు సు

శ్రీకకవిత్వ వైభవము చేకురజేసి శతాయు విచ్చి వా

ణీకమలాసనుల్‌ తనిసి నిర్బర సౌఖ్యముఁ గూర్త్రు గాత; నీ

ప్రాకట కావ్యజాలములు భాషకు వన్నియఁ గూర్చుతన్‌ సఖా!

శ్రీ శేషాద్రిరమణ కవులు

~

ప్రశంస

నీరచితాంధ్ర కావ్య రమణీయ హిరణ్మయ సౌధసీమ నిం

పారగ గీర్తికాంత యనయంబు చరించుచు జూపు మేటి సిం

గారపుభావ చిత్రముల కాంతి పరంపరలందు జిక్కు  కొ

న్నారు కవీశులెల్లరు మనంబులు తన్మయమందిపోవగన్‌

శ్రీ జి.జోసపుకవి

~

విజయోత్సవము

ప్రాయః ప్రస్తుతి ప్రాతముల్‌ రుచిరముల్‌ ప్రాచాం కవీనాం కృతి

చ్ఛాయా విభ్రమ గర్భితమ్ములు శ్రవస్సౌగమ్య సంభాషణ

వ్యాయామమ్ములు వర్ధిలున్‌ గృతకవిద్యాపాండితీభావనా

వైయర్ధ్య ప్రతిపాదకమ్ములు భవ ద్వ్యాహార వైయాత్యముల్‌

అధునాతనాంధ్రకవితా

విధాన నిర్మాణచణకవిత్వమయోక్తి

ప్రథముడు సభాధిపతియై

కథించుచున్నాడికేమి కావలె నీకున్‌.

నన్నయ్యమాటల కున్న గౌరవ మాంధ్ర, పఠితల కెల్ల సంప్రాప్త మయ్యె

దెలుగు భారతములో దిక్కన్న నడచిన బాట, లాంధ్రుల రాచబాటలయ్యె

నెఱ్ఱన్న వాక్కలాహేవాకము త్రిలిఙ్గ జాతిపిల్లల కుగ్గుపోత లయ్యె

సూరన్న పలికెడు చొప్పు తెలుగునాటి, బాలబాలికల కభ్యాసమయ్యె

దెలుగు గవితపై మమత సంధిల్లె నంధ్ర

విశ్వవిద్యాలయములోని పిన్నవయసు

బాలకుల కెల్ల నెవ్వని పలుకుబడి న

తండె నిను బిరుదాడ నెవ్వండు వలయు.

పొగడుట పొగడించు కొనుట

యు గుణమ్ములు నేటి తెలుగు యుగము కవుల కీ

తెగులు మొదలంట నూచగ

దెగటార్చుట నీగుణమ్ము ధీరవిచారా !

సకల భారతవర్ష సమవాయి శ్రుతిగల్పి, రాగమాలాపించు రాష్ట్రగీతి

భారతీయకలాప్రపంచమ్మునెల్ల సుభిక్షమ్ముగా జేయు పెద్దకాపు

మీ దౌచు నెల్లకు మిగిలి ధర్మజ్యోతి, వెలిగించు భారతీయుల మనమ్ము

తెలుగుబిడ్డల త్యాగ విలసనశ్రీల వి, శ్వాదర్శమైన ఆత్మార్పణమ్ము.

గాంధిజీ ఆత్మకథ పద్యకవితనడపి

కవుల రచనా చమత్కృతి గనుపఱచితి

వీదృశంబగు సన్మాన మిపుడు పడయు

చుంటి నీ జనియే సార్థమో కవీంద్ర !

అతుకుల బొంతలల్లి కవితాంగనకున్‌ సరిక్రొత్త దుస్తు తె

చ్చితిమని వాడవాడకడ జేతులుద్రిప్పి యుపన్యసించుచున్‌

బ్రతికెడు శాంబరీకవుల బండరు వెల్లను దూరు పెత్తి క్రొ

త్త తెలుఁగుఁ గైతగాండ్ర బిరుదమ్ములు డుల్చితివయ్య సత్కవీ !

సుకవుల కెద్దడి కాకవు

లకును సుభిక్షమగు నీ పొలమ్మున ద్వాదృ

క్సుకవులగన్న తెలుగుమా

త కడుపు చల్లనగు గావుతను నేడు మొదల్‌

కనకపు గండ పెండెరము కాలికిడం జలపల్లినేత వ

చ్చుననగ బెద్దనార్యకవిశూరుని పల్లకి బట్టి పెండెర

మ్ము నొసంగి యూళు లిచ్చిన ప్రభుం డల రాయలు జ్ఞప్తివచ్చెడున్‌

మనకవులుం గలాచతురిమం బ్రకటింతు రటంచు నెంచెదన్‌

కాకవి మూఢగుండెలకు గంపన మాంధ్రకవిత్వశక్తి కిం

డీక కులమ్ము కీరితికి డిండిమ మాప్తరసాయనమ్మునై

నీ కనకాభిషేకము మనీషులకున్‌ హృదయప్రియమ్ముగా

నో కవిముఖ్య ! నీకవిత కుజ్జ్వల దీప్తి ఘటించు గావుతన్‌.

శ్రీ వాసిరెడ్డి వేంకటసుబ్బయ్య

~

త్రయి

‘కమ్మదనమ్ము మూర్తి గనగా, నవజాగృతి తోరణాలతో

గుమ్మయిపోయెరా తెలుగు గుమ్మములన్ని తదీయ రాష్ట్రగా

నమ్ము న – ఆంధ్రమాతచరణమ్ముల కర్చలొనర్చినాడు మా

‘తుమ్మల’ నేడు క్రొన్ననల దోయిలి కూతురు సేకరింపగన్‌.

నీ కనకాభిషేక మహనీయ మహోత్సవ మాంధ్ర సాహితీ

శ్రీకొక వింత శోభ విరచించెను లెమ్ము; భవద్యశోలతల్‌

ప్రాకును లెమ్ము స్వేచ్ఛమెయి భారతమెల్ల; రసప్రసన్నముల్‌

నీ కవితా ప్రసూనములు నింపును లెమ్ము సుగంధమాధురుల్‌.

నన్నయభట్టు ”శబ్దనటనమ్ములు” తిక్కనయజ్య ”యర్థ సం

పన్నత” శంభుదాసుని ”ప్రబంధవిభూతి” సమైక్యభావముం

గన్నవి నీయెడన్‌ తెలుగుగడ్డ భవత్కవితా త్రివేణిచే

కన్నులవిందుగా వెలయుగావుత పచ్చని పైరుపంటలన్‌.

కరుణశ్రీ

~

మహాకవి

అభినవతిక్కన బిరుదాంచితులును, మహాకవులును, బహుప్రబంధ నిర్మాతలును అయిన శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు తెలుగు సాహిత్వమునకు చేసిన సేవ అనల్పమయినది. వారి రచనలను జదివి యానందమునొందని యాంధ్రుండడని నా నమ్మకము. దేశాభిమానము నుద్దీపింపజేయు వారి పద్వరత్నములను తెలుగువారెన్నటికి మరచి పోలేరు. చదివిన కొలది రుచులు గొల్పి నోరూరింప జేయు రసగుళికలు వారి కావ్యఫలములు. అటువంటి మహాకవికి ఉచిత రీతిని సన్మానగౌరవము జరుగుట నా కధికానందము గలిగించినది. శ్రీ చౌదరిగారు ఆంధ్ర సాహిత్యమున కింకను అధికమైన సేవ చేసి యశస్సు గడింప వలయునని, పరమేశ్వరుడు వారికి దీర్ఘాయురారోగ్యములు ప్రసాదింపవలయునని కోరుచున్నాను.

శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ

~

సఖా!

పొలముల్‌ పచ్చల సెజ్జలై ఋతునయంబుల్‌ సూప రాగిల్లి తా

రలు విచ్చేసెడి సంభమశ్రమతను ప్రస్వేద ముక్తామణుల్‌

కలయంపుల్‌ వడ నీ సుఖానుశయ సంక్రాంతి ప్రభాతంబులన్‌

తలిరాకొత్తుత నీమహాకవిత సీతారామ వాచావ్రతీ !

పృధివీకుశలాధ్వరమయ

మధురసగంధములు సస్య మంజరులను సం

గ్రధితమయినగతి సహజరు

చి ధామమాయె భవదమృతశీధూక్తి సఖా !

శ్రీ రాయప్రోలు సుబ్బారావు

~

కవితాభినందనము

ఎపుడొగాని – ఆమని వచ్చినపుడెగాని

వినబడదు కోయిల యెలుంగు; తెనుగునాట

నెడ తెగక మ్రోగు కవిగళమ్మిపుడు అందు

మురువు లొలుకు సీతారామమూర్తి పలుకు.

విమలాంథ్రోన్నత సన్ను తాశయము లే వేమారు భావార్థక

బ్దమనోజ్ఞమ్ముగ పద్యరీతి రసవత్కావ్యమ్ముగా రాష్ట్రగా

నము చేయున్‌ వినిపించు సర్వజన సన్మాన్యమ్ము బాపూచరి

త్రము  ఈ సత్కవిదేశభక్తి నిజధర్మాసక్తి సామాన్యమా!

కవి సదా ద్రష్టయై, పురోగామియగుచు

విశ్వమునకు శ్రేయస్సు కల్పింపవలయు

కవిని ప్రజలే యధారీతి గౌరవింప

వలయు; ఆమాట సరియంచు తెలిసె నిపుడు.

శారదాచరణ మంజీరనాదము లుండ నడుగుదమ్మికి బైడియందె లేల

స్ఫిక ప్రభాసుమసౌకుమార్యము లుండనెమ్మేనికిన్‌ రాంకవమ్ము లేల

రసరాజ్యపట్టగౌరవమున్న మౌళికి నే లయా బంగారుపూలజల్లు

నెయ్యమార నీ నాలుక వెలవుకొన్న

భాగ్యశాలిని కివి విడంబనలె యైన

ఆంధ్ర రసికలోకము ప్రియమార నెరపు

నర్హ సత్కృతి సుకవీంద్ర ! అందికొనుము.

రమణీయార్థ సర స్వతీవదన నిర్యాతావ్యయామోదమున్‌

స్వమహారాజ్యరమోపగూహనముకన్న మిన్న మన్నించు నాం

ధ్ర మహీపాలుర నాటిదౌ రసిక తాధన్యత్వమా ! నీకు భ

ద్రమగున్‌, గావ్యకళా విలాస రతులారా ! మీకు గల్యాణమౌ.

శ్రీ వింజమూరి శివరామారావు

~

రసరాజ్య మహాభిషేకము

పట్ట పేనుంగుపై, పైడిపల్లకులపై నూరేగితిని బారుబూరుమనుచు

దీనారటంకాల దీర్ఘమ్ము లాడి, రాజసపర్యలకు నంఘ్రిసాచినాడ

చక్రవర్తుల సహాసన ముండి, సహపంక్తి వడసితి భోజన భాజనముల

గురుడును బ్రగడనై, కూర్చుచుట్టమ్మునై భూపులతోనిచ్చి పుచ్చుకొటిం

నిగ్రహానుగ్రహములకు నేర్చి, కార్య

ఖడ్గముల కేన చాలిన కవిని; నేడు

కడుపు గక్కురితికి బలైబడులు, నచ్చు

కూటములు నెక్కితినటంచు గుతిలపడకు

నీవు పేదవైన, నీ కైత పేద గా

దన్న ! ఆభిజాత్యమున్న సాధ్వి;

ఆపె పేదయైన, అన్యభోగములు నీ

కెన్ని యున్న నీ వకించనుడవె

మకుటము లేల, అశ్వములు మత్తకరుల్‌ శిబికాదు లేల, సా

యక నివహమ్ము లేల, చతురంగబలమ్ములు నేల నీకు ? మా

ధుకణమృదూక్తి సంపదలలో హృదయమ్ముల నేలు లోక శా

సకుడవు నీ వసించు చిచాపకు నోపవు సింహపీఠముల్‌

అదె ! పరతంత్రము క్తమగు నాంధ్రమహిన్‌ నవజీవనోత్సవా

భ్యుదితులు నీ ప్రజల్‌ వికసితోత్పలమాలిక లూని, నల్లడల్‌

వెదకుచు నేగుదెంచిరి కవీ ! రసరాజ్యమహాభిషేక సం

పద నిను బూన్పగా; వరణమాల్యము మౌళి బరి గ్రహింపుమా.

గువకుత్తుక యౌచు గుండియల్‌ కరగించె నన్న! త్వద్రచిత మాత్మార్పణమ్ము

కనక తప్పెటలు, శంఖములు, కాహళ లౌచు నీ రాష్ట్రగానమ్ము నింగిముట్టె

అపురూపమైన మీ యయ్యధర్మచరిత్ర వెలిగించితివి కలివిహృతి యడగ

పరిగయేరిన నీదుపంట కుత్తుకబిం రసికుల కమృతసత్రమ్ము వెట్టె

ఆత్మకథ’ స్పె’ తిక్కన వైతి, నేడు *పెద్దనకు నుద్ది వైతి, నీ పెంపటుండ

సుకవితాప్రియంభావుక, మకుటిలమ్ము

నాంధ్రజనుల రాసిక్యమ్ము నభినుతింతు.

గమనముల్‌ మదమంధరములు, సాజము లామె కేనుగు నెక్కి యూరేగ నేల

శ్రీ కాటూరి వేంకటేశ్వరరావు

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here