నాన్న లేని కొడుకు-8

1
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]నా[/dropcap]లుగు రోజులు గడిచాయి. హరిత నెమ్మదిగా కోలుకుంటోంది. ఆమె మొహంలో క్రమంగా పూర్వపు నాజూకుదనం, కళ , కాంతి వస్తోంది. కళ్ళల్లో వెలుగు నిండి కళ్ళు ప్రకాశవంతం అవుతున్నాయి.

బాబుని పరీక్షించిన సూర్యనారాయణ వాడికి తప్పకుండా మాటలు వస్తాయని నిర్ధారించి, స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. హరితని మళ్ళీ కాలేజ్‌లో చేరమని ప్రోత్సహించాడు.

తండ్రి ఇస్తున్న ప్రోత్సాహం, ఆయన తనకి జీవితం పట్ల కలిగిస్తున్న మమకారం, ప్రేమ చూసిన హరిత కళ్ళు చెమ్మగిల్లాయి. ఇలాంటి అమ్మ, నాన్నలకి నాలుగేళ్ళు దూరంగా ఉన్నానన్న భావనే ఆమెని దుఃఖంలో ముంచేస్తోంది.

“నాన్నా! నా జీవితం నాశనం అయింది ఇంక నాకు చావే శరణ్యం అనుకున్నాను.. కానీ నువ్వు నాలో ఆశలు చిగురింప చేస్తున్నావు.. నాకు ఇప్పుడు ఇదివరకు కన్నా ఎక్కువ ఉత్సాహం కలుగుతోంది. ఎప్పటికన్నా ఇంకా గొప్పగా బతకాలని ఉంది. తప్పకుండా చదువు కంటిన్యూ చేస్తాను” అంది ఆయన గుండెల మీద వాలిపోయి.

ఆమె తల మీద వాత్సల్యంగా రాస్తూ మనసులో అనుకున్నాడు.. ‘ఉన్నతమైన చదువు, ఉన్నతమైన ఉద్యోగం సంపాదించావంటే నీకు జరిగిన ప్రమాదంలో తగిలిన గాయాల తాలూకు మచ్చలు పూర్తిగా మాసిపోతాయి తల్లి.. అప్పుడు నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు.. తన తప్పు లేకున్నా తన జీవితంలో ఎదురయే ఇలాంటి ప్రమాదాలకి స్త్రీనే బాధ్యురాలిని చేసే ఈ దిక్కుమాలిన సమాజాన్నిఎదుర్కోడానికి నీ చదువే నీకు అండగా నిలబడుతుంది’.

మరునాడు ఇన్‌స్పెక్టర్  మురళి ఫోన్ చేసి నేరస్థుడు దొరికాడని ఒకసారి స్టేషన్‌కి రమ్మని చెప్పాడు.

ఆ వార్త వినగానే భయంతో నిలువెల్లా వణికిపోయింది హరిత.. విహ్వలంగా తండ్రి వైపు చూస్తూ “వెంటనే వాడికి ఉరిశిక్ష వేయమని చెప్పు నాన్నా..వాడు నన్ను వదిలిపెట్టడు. పగ పడతాడు” అంది.

జ్యోతి కూతురుని దగ్గరకు తీసుకుని భర్తతో అంది “మనం ఈ ఊరు నుంచి ఏటన్నా వెళ్ళిపోదామండి. ఇక్కడ ఉంటే దీనికి రక్షణ ఉండదు..మనకి శాంతి ఉండదు.”

సూర్యనారాయణ హరిత భుజం మీద చేయి వేసి మృదువుగా అన్నాడు “సమస్యలను చూసి పారిపోవడం పిరికివాళ్ళ లక్షణం.. మనం పారిపోతే అవి ఆగిపోతాయా, వెంటపడి తరుముతాయి. ఎదురు నిలిచి పోరాడి గెలవాలి.. ఇవాళ ఒక రాక్షసుడి నుంచి నువ్వు పారిపోతే అడుగడుగునా రాక్షసులే ఉన్న ఈ సమాజంలో ఎక్కడ నువ్వు స్థిమితంగా బతకగలవు! ఇది కాదమ్మా పరిష్కారం.. పద వెళ్దాం.. అక్కడికి వెళ్ళాక నీకు తప్పకుండా ధైర్యం వస్తుంది.. నేను నీ పక్కనే ఉంటాను. యువకుడు, నిజాయితీపరుడు, ఆదర్శభావాలు ఉన్నవాడు పోలీస్ ఆఫీసర్ మురళీకృష్ణ ఉన్నాడు.. అన్నిటికన్నా నీ ఆత్మధైర్యం నీకుంది.. గో అహెడ్..”

నిశ్చలమైన స్వరంతో, ఆయన చెప్తున్న ఆ మాటలు హరితలో కొత్త శక్తిని పుంజుకుంటున్నట్టుగా అనిపించింది. ఆయన సూక్ష్మమైన దృష్టి నరనరానికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. అప్రయత్నంగా ఆమె నిటారుగా అయింది. ధృఢమైన స్వరంతో అంది “పదండి వెడదాం.”

“అమ్మా హరీ!..” వారింపుగా పిలిచింది జ్యోతి.

హరిత తల్లి రెండు చేతులూ అందుకుని ఆవిడ మొహంలోకి సూటిగా చూస్తూ చిరునవ్వుతో “భయపడకమ్మా” అంది.

ఆవిడ నిరుత్తరురాలై చూస్తుంటే తండ్రి, కూతురు బయటకి నడిచారు.

పోలీస్ స్టేషన్..

సూర్యనారాయణ, హరితలను చూడగానే ఇన్‌స్పెక్టర్ వివేక్ చిరునవ్వుతో విష్ చేసి కుర్చీ చూపించాడు. అతని పక్కనే కూర్చుని ఉన్నాడు వికారాబాద్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ. తండ్రి, కూతుళ్ళను చూడగానే మర్యాదగా లేచి నిలబడి విష్ చేసాడు.

అతని భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి “ఎలా పట్టుకున్నారు?” అడిగాడు సూర్యనారాయణ..

“ఆవిడ ద్వారా” అక్కడే కొంచెం ఎడంగా గోడకి ఆనించి ఉన్న కుర్చీలో కూర్చున్న స్త్రీ వైపు చూపించాడు ఇన్‌స్పెక్టర్ వివేక్.

హరిత, సూర్యనారాయణ ఒకేసారి తల పక్కకి తిప్పి తలవంచుకుని కన్నీళ్లు కారుస్తున్న స్త్రీ వైపు చూసారు.

హరిత కళ్ళు పెద్దవి చేసి ఆవిడని, ఇన్‌స్పెక్టర్‌ని మార్చి, మార్చి చూస్తూ “ఆవిడ ఎవరు?” అంది.

“అతని తల్లి” చెప్పాడు ఇన్‌స్పెక్టర్ మురళి.. సూర్యనారాయణ అదిరిపడి చూసాడు.. తల్లా..

హరిత విభ్రాంతిగా చూసింది. తల్లా.. తల్లే కొడుకుని పోలీసులకి పట్టించ్చిందా.. ఎలా? ఇదెలా జరిగింది?

ఆమె ఆలోచనలు గ్రహించిన ఇన్‌స్పెక్టర్ ఆ స్త్రీ వైపు చూసి “మీ కొడుకు గురించి చెప్పండి” అన్నాడు.

ఆవిడ సూర్యనారాయణ వైపు చూసి నమస్కారం పెట్టి, “నా కొడుకుని క్షమించండి బాబూ” అంది.

“ముందు మీ అబ్బాయి గురించి మాకు చెప్పిన విషయాలు వారికి చెప్పండి” అన్నాడు మురళీకృష్ణ.

ఆవిడ చెప్పసాగింది. “నా పేరు చంద్రకళ…మాది కోడూరు… నా పెనిమిటి షుగర్ ఫాక్టరీలో పని చేసేవాడు. పదేళ్ళ క్రితం ప్రమాదం జరిగి చనిపోయాడు. నేను నా కొడుకుని తీసుకుని బతకడం కోసం హైదరాబాద్ వచ్చినాను. బాలాపూర్‌లో ఒక ఫ్యాక్టరీలో పని ఇప్పించినాడు మా ఊరి పెద్దమనిషి.

నా కొడుకుకి అప్పుడు పద్నాలుగేళ్ళు. వాడి పేరు శంకర్. చిన్నప్పటి నుంచి బుద్ధి ఎదగలేదు. చదువు అబ్బలేదు. చెప్పిన మాట వినేవాడుకాడు.. బడికి కూడా సరిగా పోయేవాడు కాదు.. అప్పటినుంచే సిగరెట్లు, తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఎంత చెప్పినా, ఎంత కొట్టినా వినేవాడు కాదు.. తాగుడికి డబ్బులు కావాలి కదా.. దొంగతనాలు చేసేవాడు.. నేను ఏదన్నా చెప్పబోతే నన్ను కూడా కొడుతుండేవాడు..అట్లాగే భరిస్తా వచ్చినాను.. కనీసం పదో తరగతి అన్నా పాస్ అయితే మా ఫ్యాక్టరీ లోనే ఉద్యోగం ఇస్తా అన్నాడు మా యజమాని. కానీ వాడు చదువుమీద అసలు మనసు పెట్టలేదు. ఇరవై ఏళ్ళు వచ్చినా బాద్యత లేకుండా తిరుగుతా ఉంటే ఒకసారి ఇంట్ల నుండి ఎల్లగొట్టినాను. యాడనో తిరిగి మల్ల వచ్చినాడు. నాలుగేండ్ల క్రితం ఒక పది రోజులు ఎటో పోయినాడు.. కనపడలేదు సారూ. పదిరోజులు పోయినాక వచ్చినాడు. యాడకి పోయినావు.. బండి ఎక్కడిది అని అడిగినాను వాకిట్లో ఉన్న బండి చూసి.

నీకెందుకు అని కసిరి కొట్టినాడు. అప్పటి నుంచి మద్య, మద్య మూడేసి రోజులు కనిపించకుండా ఎటో పోయేవోడు.. యాడకి పోతుండావు? ఏం చేస్తుండావు అని అడిగితే కొట్టడానికి వచ్చేవాడు. ఇట్లా కాలం గడిచింది సారు.. ఏమడిగినా చెప్పడు.. ఇంటికాడ ఉండడు. పోనీ పూర్తిగా ఏడకన్నా పోడు.. ఇట్టాంటోడిని ఎట్ల కన్నానా అని రోజు యాడవడం తప్ప నేనేం చేయలేకపోయినా. వారం క్రితం తలకి, మొకానికి చేతులకి కట్లు కట్టించుకుని ఇంటికి వచ్చినాడు. ఏమైంది అని అడిగితే చెప్పడు .. పిచ్చోడి మాదిరి ఇంట్ల ఉన్న సామాను ఇరగగొట్టుడు, నా మీదకి కత్తి పీట ఎత్తుడు.. వాడి వాలకం చూసి భయమేసి ఏం చేయాలో పాలుపోక మా యజమానికి చెప్పినాను. ఆయన కూడా ఇంటికి వచ్చి ఎంతో సముదాయించి ఆ దెబ్బలేంది? ఏమైంది…ఎక్కడ తిరుగుతున్నావు అని చాలా సేపు అడిగితే ఆయన పీకపట్టుకున్నాడు.

ఈ లోపల టి.వి. లో ఎవరో ఆడపిల్లని అత్యాచారం చేసినాడని యాడనో పెట్టి నానా బాదలు పెట్టినారని ఏందో చెప్పినారంట గదా.. అది విన్న మా యజమానికి వీడి మీద అనుమానం వచ్చినాదంట.. పోయి పోలీసులకి చెప్పినాడంట.. ఇంటికాడ పడుకున్న నా కొడుకుని పోలీస్‌లు ఒచ్చి పట్టుకునినారు… నన్ను గూడ తెచ్చి ఈడ కూర్సోబెట్టినారు” అంటూ చెప్పడం ముగించింది.

అంతా విన్న ఇన్‌స్పెక్టర్  అన్నాడు. “మనం మీడియాకి ఇచ్చిన ప్రకటన చూసిన ఈవిడ యజమాని మాకు సమాచారం ఇచ్చాడు. అతని సమాచారం ఆధారంగా వెళ్లి అతన్ని అరెస్ట్ చేసాము. మురళీ, నేను మంచి స్నేహితులము. ఈ కేసు ఇచ్చి ఎలాగైనా ఈ నేరస్థుడిని పట్టుకుని తీరాలి.. నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు.”

“ఎక్కడున్నాడు వాడు?” ఆత్రంగా అడిగాడు సూర్యనారాయణ.

“పోలీస్‌ల మీద దౌర్జన్యం చేసిన నేరం కింద అరెస్ట్ చేసాము సర్.” అని చెప్పి “మీరు కన్ఫర్మ్ చేయాలి” అన్నాడు ఇన్‌స్పెక్టర్ హరితను చూస్తూ.

హరిత గబుక్కున తండ్రి చేయి పట్టుకుంది. ఆమె చేయి సన్నగా కంపించడం గమనించిన సూర్యనారాయణ భయం లేదు అన్న సంకేతం ఇస్తూ గట్టిగా బిగించాడు.

“అతడిని చూసి గుర్తుపట్టి మీరు కంప్లయింట్ రాసి ఇవ్వాలి” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

హరిత తల ఊపింది కానీ ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన బెదురు చూసి జాలిపడ్డాడు ఇన్‌స్పెక్టర్.

ముగ్గురూ కుర్చీలో నుంచి లేచారు. కాళ్ళు, చేతులు వణుకుతోంటే , నిగ్రహించుకుంటూ సెల్ దగ్గరకి నడిచింది హరిత.

మొహం నిండా ప్లాస్టర్, తలకి కట్టు, ఎర్రటి కళ్ళు, నల్లగా, ఎత్తుగా, లావుగా మొరటుగా ఉన్న వ్యక్తీ ఊచల మధ్య ..

హరిత కెవ్వుమంటూ తండ్రి గుండెల మీద వాలిపోయి కళ్ళుమూసుకుంది.

అతను హరితను చూడగానే పెడబొబ్బలు పెట్టసాగాడు..

“ఒసేయ్.. నువ్వు ఎక్కడికి పోవు.. నువ్వు నా సొంతం.. నిన్ను ఎవరికీ దక్కనియ్యను..” ఊచల మధ్య నుంచి చేతులు బయటకి పెట్టడానికి ప్రయత్నించసాగాడు.

సూర్యనారాయణ వొళ్ళు జలదరించింది అతన్ని చూడగానే..

“ఈ పశువా నా కూతురిని తల్లిని చేసింది.. ఛీ” మొహం తిప్పేసుకున్నాడు.

ఇన్‌స్పెక్టర్  వివేక్ అతన్ని అదిలిస్తూ “అరవకు..” అన్నాడు గట్టిగా.

“అది నా పెళ్ళాం … అవును నా పెళ్ళాం.. నేను పెళ్లి చేసుకున్నా.. కొడుకుని ఇచ్చా.. నేను వదలను.. నేను దాన్ని ప్రేమిస్తున్నా… అది నాదే.. నాదే.. నన్ను వదలండి.. నాకు దక్కకుంటే చంపేస్తా..” పిడికిళ్ళు బిగించి ఊచలను బలంగా కొడుతూ ఉన్మాదిలా అరవసాగాడు.

కానిస్టేబుల్‌కి ‘వాడి సంగతి చూడు’ అన్నట్టు సైగ చేసి “రండి” అంటూ హరితను, సూర్యనారాయణని తీసుకుని తన టేబుల్ దగ్గరకు నడిచాడు ఇన్‌స్పెక్టర్.

అతని అరుపులు, ఊచలు వంచడానికి చేస్తున్న ప్రయత్నం వినిపిస్తూనే ఉంది.

హరిత తండ్రి భుజ మీద వాలిపోయి వెక్కి, వెక్కి ఏడవసాగింది.

కొంతసేపు ఆమెనలా ఏడవనిచ్చి అన్నాడు ఇన్‌స్పెక్టర్ “డాక్టర్ గారు.. కంప్లైంట్ రాసి ఇవ్వండి. నేను ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేస్తాను.”

హరిత విహ్వలంగా చూస్తూ అంది అతను.. “అతను జైలు నుంచి బయటకు వచ్చాడంటే నా జీవితం నాశనం అయిపోయినట్టే..వస్తాడా ఇన్‌స్పెక్టర్.”

“చూస్తుంటే అతను పెద్ద సైకో అనిపిస్తున్నాడు. మీరేం భయపడకండి. మీకేం కాదు..” అభయం ఇస్తున్నట్టుగా అన్నాడు మురళీకృష్ణ మృదువుగా.

“సైకో కాదు.. హంతకుడు.. నా కూతురిని చంపేసాడు.,. వారికి ఉరిశిక్ష వేయండి” అన్నాడు సూర్యనారాయణ కంపిస్తున్న స్వరంతో.

“ఇతని మీద రేప్, కిడ్నాప్, కేసులు పెడతాము. ఈ రోజుల్లో ఇలాంటి కేసులు చాల ఎక్కువైపోయాయి డాక్టర్. ఇటీవల ఒక కేసులో ఒక కుర్రాడు ఇలాగే ప్రేమ అని వేధిస్తుంటే ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళింది. కోర్టులో కూడా అతను ఆ అమ్మాయే కావాలని లేకపోతే చచ్చిపోతానని జడ్జి గారి ఎదురుగానే రివాల్వర్ తీసుకుని కాల్చుకోబోతుంటే అతన్ని అరెస్టు చేసారు. తరవాత జడ్జ్ గారు ఆ అమ్మాయిని అడిగారట అతను అంతగా ప్రేమిస్తున్నాడు కదా ఎందుకు యాక్సెప్ట్ చేయవు అని.. ”

“ఆ అమ్మాయి ఏమంది?” కుతూహలంగా అడిగాడు సూర్యనారాయణ. హరిత కంపిస్తూ చూసింది.

“ప్రేమ అనేది రివాల్వర్ గురి చూపించగానే పుట్టదు జడ్జి గారు. ఎవరిని చూస్తే హృదయం స్పందిస్తుందో, ఎవరితో అయితే అమూల్యం అయిన సమయాన్ని వెచ్చించాలని అనిపిస్తుందో, ఎవరితో జీవితం బాగుంటుంది అనిపిస్తుందో, ఎవరికీ సర్వం అర్పించాలని అనిపిస్తుందో అలాంటి వాడిని ప్రేమిస్తుంది స్త్రీ. అంతే కాని రివాల్వర్‌ని, యాసిడ్ బాటిల్‌ని చూసి భయపడి ప్రేమించదు. వాడు చస్తే చావనివ్వండి ఐ డోంట్ కేర్ అందిట.”

“మంచి పని చేసింది” కసిగా అంది హరిత..

“ఆడపిల్లలకి మనసుంటుంది, ఇష్టాఇష్టాలుంటాయి, వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి.. కొన్ని కోరికలు ఉంటాయి అని స్పృహ లేకుండా మేము ప్రేమిస్తున్నాం నువ్వు ప్రేమించాలి.. లేకపోతే యాసిడ్ పోస్తా, లేదంటే చంపేస్తా అంటూ ఈ బెదిరింపులు, ఈ కిడ్నాప్‌లు న్యాయంగా ఉందా? నా జీవితం ఇలా నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు వాడికి.. వాడిని మీరు స్పేర్ చేయద్దు.. ఉరిశిక్ష వేయండి..పేపర్ ఇవ్వండి నేను రాసి ఇస్తాను” ఉద్రేకంగా అంది హరిత.

“వెరీగుడ్ తల్లీ… ఈ ధైర్యం, ఈ తెగింపు ఎప్పటికీ ఇలాగే ఉండనీ” అన్నాడు సూర్యనారాయణ.

“అంతే కాదు డాక్టర్ గారూ! జనరల్‌గా మన సొసైటీలో ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా కొందరు అమ్మాయిలు మెడలో పసుపుతాడు పడగానే వాడిని భర్తగా భావించి సెంటిమెంటల్‌గా ఫీల్ అవడం, పిల్లలుంటే ఎలాంటివాడు అయినా సరే ఆ పిల్లల కోసం వాడిని భరించడానికి సిద్ధపడడం కూడా ఇంకా కొంతమంది కేసులు పెట్టడానికి జంకుతున్నారు. మీరు ఇంత ధైర్యంగా బాబుకి తండ్రి ఎలా అనే ఆలోచనకి తావివ్వకుండా అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఐ అప్రిషియేట్ యు డాక్టర్. మీ అమ్మాయికి కూడా ఆ ధైర్యం కలిగించడం నిజంగా ఇదే ప్రతి తండ్రి తన పిల్లలకు ఇవ్వాల్సింది.” టేబుల్ సొరుగులో నుంచి పేపర్ తీసి ఇస్తూ అన్నాడు ఇన్‌స్పెక్టర్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here