సాఫల్యం-13

4
4

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]వే[/dropcap]రుశనగ వర్షాధారపంట. మంచి ఎర్రనేల. వర్షం సమృద్ధిగా పడితే మాత్రం బాగా పండుతుంది. లేకపోతే ఎండుతుంది. పండినపుడు తనకు రావాల్సిన సగభాగం డబ్బును మార్కండేయశర్మ దగ్గరే దాచుకొన్నాడా రైతు. ప్రతి సంవత్సరం వెయ్యో, పన్నెండు వందలో అలా పది సంవత్సరాలు దాటింది. ఆ రైతు పేరు ‘అడివప్ప’. దానికి అర్ధరూపాయ వడ్డీ కూడా మార్కండేయశర్మ లెక్కవేసి, ఒక నోటు బుక్కులో రాసి పెట్టేవాడు.

అది దాదాపు పదివేలు దాటిపోయింది. ఏ సంవత్సరానికాసంవత్సరం ఇంటి ఖర్చులకు వాడేసేవాడు. మార్కండేయశర్మ. ఒకరోజు అడివప్ప వచ్చి, “స్వామీ నా పాత యిల్లు తాతల నాటిది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. దానిని పడగొట్టి కొత్త యిల్లు కట్టుకుందామనుకుంటూండాం. మీ దగ్గర నేను దాచుకున్న లెక్క ఇప్పిస్తే నా నెత్తిన పాలుపోసినట్లయితాది” అన్నాడు.

మార్కండేయశర్మకేం చేయాలో తోచలేదు. అడివప్ప అడిగిదాంట్లో న్యాయముంది. పతంజలితో వర్ధనమ్మతో చర్చించాడు ఆయన. డబ్బెలాగూ ఇవ్వలేం కనుక, వాగ్దేవి పెళ్లికని అమ్మిన రెండెకరాలూ పోగా, మిగిలిన రెండెకరాలూ ‘అడివప్ప’కు రాసిచ్చేద్దామని నిర్ణయించాడు.

“రెండెకరాలిచ్చినా సాలదే” అన్నాడు అడివప్ప. అంతకంటే తానేం చెయలేనని చేతులేత్తేశాడు మార్కండేయశర్మ. అడివప్ప విధిలేక అంగీకరించాడు. అలా మెట్టపొలం నాలుగెకరాలూ పోయింది.

మార్కండేయశర్మ ప్రవచనాలకు కూడ ఆదరణ తగ్గసాగింది. వెల్దుర్తి కోడుమూరు, డోన్‌, ఇలా చుట్టు పక్కల పట్టణాల్లో సినిమా హాళ్లు వచ్చాయి. మేజరు పంచాయితీలయిన ఉలిందకొండ, రామళ్లకోట బేతంచెర్ల లాంటి ఊర్లలో కూడ టూరింగ్‌ టాకీసులు వెలిశాయి. సినిమా ప్రభావంతో, మార్కండేయశర్మ లాంటి పౌరాణికులు, హరికథలు చెప్పేవాళ్లు, బుర్ర కథలవాళ్లు, తోలు బొమ్మలాడించేవారు, పగటి వేషగాళ్లు తమ తమ వృత్తులకు ఆదరణ లేక అలమటించసాగారు.

అంతకుముందు పౌరాణిక నాటకాలంటే ప్రజలు మోజు పడేవారు. కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం చింతామణి, తులసీ జలంధర, సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలు వేసేవారు.

రాత్రి పదిగంటలకు ప్రారంభిస్తే తెల్లవారేంతవరకు నాటకం సాగేది. కురుక్షేత్రం లాంటి నాటకాల్లో కృష్ణుని పాత్రను ముగ్గురు పోషించేవారు. వారిని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేవారు.

షణ్ముఖ ఆంజనేయరాజు, కృష్ణుని పాత్రకు ప్రసిద్ధి. వెల్దుర్తికే చెందిన వెంకట నర్సు నాయుడుగారు అర్జున పాత్ర వేసేవారు. ఆయన మార్కండేయశర్మ వద్దే పద్యం పాడటంలోని మెళకువలు నేర్చుకున్నాడు. పి. లక్ష్మణరావుగారు ఆంజనేయుని పాత్రకు పెట్టింది పేరు. ఆచంట వెంకటరత్నం నాయుడు. ఇలా ఎందరో నాటక కళకు ప్రాణం పోశారు. ఉపాధి పొందారు.

అంత ఉత్కృష్టమయిన నాటక కళ కూడ సినిమాల ప్రభావం వల్ల కళాహీనమయింది.

నంద్యాల రోడ్డులో ‘బ్రహ్మగుండం’ క్షేత్రం దాటిన తర్వాత, ఇనుప ఖనిజం గనులు విస్తారంగా ఉన్నాయి. వాటికి కొంచెం ఎగువన NMDC (నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) వారు పరిశోధనలు జరిపి, విలువయిన రాళ్లు, వజ్రాలు దొరుకుతాయని నిర్ధారించారు.

అక్కడ డిపార్టుమెంటువారు టెంట్స్‌ వేసుకొని, ఆఫీసు, జీపులు, హడావిడి ప్రారంభించారు. ఆ ప్రాంతంలో త్రవ్వకాలు జరుపడానికి, విలువయిన రాళ్లను, వజ్రాలను వెలికి తీయడానికి బోలెడుమంది కూలీలు కావలసి వచ్చింది.

గవర్నమెంటు సంస్థ కాబట్టి, వ్యవసాయ పనులకు వెళితే వచ్చే కూలీ కంటే రెట్టింపు కూలీ, వారానికొకసారి బట్వాడా, ఇవన్నీ కూలి జనాన్ని ఆకర్షించాయి. సుంకన్న, తోకోడు, వారి భార్యలు, పతంజలి కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా తోటలో పనికి వస్తున్నారు కాబట్టి సరిపోయింది. ‘రవ్వల కొండ’ అని పిలిచేవారు ఆ ప్రాంతాన్ని. కూలీలు డిపార్టుమెంటు వాహనాల్లో ఫ్రీగా వెళ్లేవారు. NMDC సిబ్బంది వెల్దుర్తిలో కాపురముండేవారు. దానివల్ల అద్దె యిండ్లకు డిమాండ్‌ పెరిగింది.

సహజంగానే వ్యవసాయ కూలీ రేట్లు కూడ పెరిగాయి బాగా. జీతగాండ్లకు కూడ సరిగా చెల్లించలేని స్థితి. పిల్లలు పెరుగుతున్నారు. మహిత తొమ్మిదో తరగతి, మల్లినాధ ఏడు, పాణిని ఐదో తరగతికొచ్చాడు.

ఇంతలో వాగ్దేవి అక్క ఉత్తరం రాసింది. శుభవార్తే. తాను కడుపుతో ఉన్నానని, మూడో నెల అనీ. తల్లిదండ్రులు సంతోషించారు. ఆ అమ్మాయిని కనీసం ఏడో నెలలోనైనా పురిటికి తీసుకురావాలి. కాన్పు చేయాలి. తర్వాత బారసాల, మనమడో మనుమరాలో పుడితే, ఏదైనా బంగారు వస్తువు పెట్టాలి. ఇవన్నీ తల్చుకొని ఆ దిగువ మధ్యతరగతి కుటుంబం దిగులుపడింది.

పతంజలి ఏడో నెలలో చిత్తూరు వెళ్లి అక్కయ్యను పిల్చుకొని వచ్చాడు. వాగ్దేవిలో కొత్త కళ వచ్చింది. రామ్మూర్తి బావ కూడ మధ్యలో వచ్చి వెళ్లాడు.

మళ్లీ పట్టుపురుగులు తెచ్చినా పంట బాగా రాలేదు. ఖర్చులు కూడ గిట్టడం లేదు. ఒక్క అనంతపురం జిల్లాలో తప్ప, మిగతా రాయలసీమలో పట్టు పరిశ్రమ ఫెయిలయినట్లే. మల్బరీ మొక్కలు దున్నించి, వేళ్లతో సహా పెకలించి, పొలం చదును చేయించారు. ప్రభుత్వం వారిచ్చిన అప్పు మాత్రం మిగిలింది.

నిమ్మతోట మాత్రం అంతంత మాత్రంగా నిలబడింది. కర్నూలు మార్కెట్‌లో రోజూ వచ్చే నలభై రూపాయలు చిల్లర ఖర్చులకు సరిపోతున్నాయి. ఇంతకుముందు ఇంట్లో ఒక బుట్టలో నిమ్మకాయలుంచుకొని, ఎవరయినా వచ్చి అడిగితే ఫ్రీగా మూడో నాలుగో యిచ్చి పంపేవారు. ఇప్పుడు పది పైసలు ఒకటి పావలాకు మూడు చొప్పున అమ్ముతున్నారు యింటి దగ్గరే. మహిత, మల్లినాధ, పాణిని, ఎవరుంటే వారు వచ్చి వారికి నిమ్మకాయలిచ్చి, చిల్లర తీసుకుని దేవుడి గూటి పైగూట్లోని కంచు చెంబులో వేస్తున్నారు. పది రోజులకొకసారి చెంబు నిండిపోయేది. కూరగాయలకు పనికొచ్చేది ఆ చిల్లర.

అక్కయ్యకు నెలలు నిండుతూ ఉన్నాయి. ఊర్లోనే మంత్రసాని రామక్కతో కాన్పు చేయిద్దామనుకున్నారు. కానీ బావ ఒప్పుకోలేదు. ఏదైనా ఆసుపత్రిలోనే అక్క పురుడు పోసుకోవాలని పట్టుబట్టాడు. వెల్దుర్తిలో హాస్పిటల్స్‌ లేవు. అక్కకు తొమ్మిదో నెల నిండుతూండగా బావ వచ్చాడు.

“పతంజలీ! మనిద్దరం కర్నూలుకు వెళ్లొద్దాం పద!” అని బయలుదేర దీశాడు. ఇద్దరూ లోకల్‌ ట్రెయిన్‌లో కర్నూలు చేరుకున్నారు.

కర్నూల్లో మిషనరీస్‌ వాళ్లు నడిపే ఆసుపత్రి ఉంది. దాని గురించి విచారించుకొని ఉన్నాడు రామ్మూర్తిబావ. అది నరసింగరావుపేటలో ఉంది. వెళ్లి సిస్టరు గారిని కలిశారు. “9వ నెల నిండగానే తెచ్చి జాయిన్‌ చేయండి. అంతా ఆ ప్రభువు చూసుకుంటాడు” అన్నదామె. ఆఫీసులో అక్కయ్యపేరు, భర్తపేరు, ఇద్దరి వయసు, అడ్రసు వ్రాయించారు. జనరల్‌ వార్డులో రాసుకున్నారు.

“అమ్మయ్య! ఇపుడు నాకు రిలీఫ్‌గా ఉందిరా!” అన్నాడు రామ్మూర్తి బావ. “వెల్దుర్తిలో అయితే ఏదయినా ఎమర్జెన్సీలో కష్టం. ఇక్కడయితే క్షేమం” అన్నాడు.

ఇద్దరూ వెళ్లి హోటల్‌ ఉడిపి బృందావన్‌లో కూర్చున్నారు. రెండు మసాల దోసెలకు ఆర్డరిచ్చాడు బావ.

“సరేగాని, ఇంటర్మీడియట్‌తోనే చదువు చాలనుకుంటున్నావా ఏం? ఎన్ని మార్కులు వచ్చాయి. నాకు ఏ విషయమూ రాయనే లేదు!” అన్నాడు. “అయ్యో బావా! వెంటనే నీకు రాశానే! పరీక్షల తర్వాత నెల రోజులకే మార్కుల లిస్టు సర్టిఫికెట్‌ పంపారు. 67 శాతం వచ్చింది. ఇంగ్లీషులో 78 మార్కులు వచ్చినాయి బావా!” అన్నాడు పతంజలి.

“బహుశా పోస్టులో మిస్సయి ఉంటుందిలే” ఆన్నాడు బావ.

“దాదాపు సంవత్సరం దాటిందోమో కదా! మరి డిగ్రీ సంగతేమీ అనుకోలేదా?”

“పట్టుపురుగుల పెంపకంలో పడిపోయాను బావా!” అన్నాడు పతంజలి.

మార్కులిస్టు, సర్టిఫికెట్‌ వచ్చిన రోజు తండ్రి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఇక డిగ్రీ అంటే యస్‌.వి యూనివర్సిటీ, తిరుపతికి వెళ్లాలి. ప్రయివేటుగా చదవడానికైనా మళ్లీ ఫీజులు, పుస్తకాలు, ఛార్జీలు! అందుకే నిరాశగా మౌనం దాల్చాడు పతంజలి. శంకరయ్యసారు, ఆజంసారు ఎంతో సంతోషించారు. మార్కులు చూసి, ఈ మధ్య వాళ్లను కూడ కలవడం కుదరలేదు. ఈ విషయాలన్నీ బావతో చెప్పలేదు పతంజలి.

“నీకు తిరుపతి కంటే హైదరాబాదు దగ్గర. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రయివేటుగా బి.ఎ. కట్టడానికవకాశం ఉందేమో కనుక్కోవాలి. నీవొకసారి ‘గద్వాల’ వెళ్లిరా. అక్కడ గవర్నమెంటు డిగ్రీ కాలేజీలో మన దూరపు బంధువొకాయన పని చేస్తున్నాడు. ఫిజిక్స్‌ లెక్చరర్‌ అనుకుంటా, పేరు సాగర్‌, మన తుంగభద్ర బ్రిడ్జి దాటితే మహబూబ్‌నగర్‌ జిల్లాయే కాబట్టి అదంతా ఉస్మానియా క్రిందికే వస్తుంది. ఆయన మా పిన్నమ్మ వైపు బంధువవుతాడు. ఏదో పెళ్లిలో కలసినట్లు గుర్తు” అన్నాడు రామ్మూర్తి బావ.

“నాన్న నేను చదువుకోడానికి అంత సుముఖంగా లేడు బావా!” అన్నాడు పతంజలి తలవంచుకొని.

“నేను మామతో మాట్లాడతాను లే. నీవు దిగులుపడకు”

తర్వాత వారం రోజులకు వాగ్దేవిని కర్నూలు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడంతా ‘కిరస్తానం’ వాళ్లుంటారని వర్ధనమ్మ కూడా సంకోచించినా అల్లునికి కోపం వస్తుందని, విధిలేక అంగీకరించింది. డాక్టరమ్మ వాగ్దేవిని పరీక్షించి, “అంతా నార్మల్‌గానే ఉంది. మరో రెండు రోజుల్లో ప్రసవం జరగొచ్చు” అన్నది.

కర్నూల్లో మార్కండేయశర్మ మిత్రుడు వరాహమూర్తి ఇంట్లో మహిత ఉండేట్లు, రాత్రి వాగ్దేవికి తోడుగా పడుకునేటట్లు నిర్ణయించారు. వరాహమూర్తి కర్నూల్లో లీడింగ్‌ పురోహితుడు. “వాడికి పాండిత్యం అంత లేదుగాని, లౌక్యం ఎక్కువ” అంటాడు మార్కండేయశర్మ వరాహమూర్తి గురించి.

చేరిన మూడవ రోజు వాగ్దేవి మగపిల్లవాడిని ప్రసవించింది. తల్లీ పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారు. రామ్మూర్తికి టెలిగ్రాం ఇచ్చారు. అతడు ఆ రాత్రికే బయలుదేరి కర్నూలుకు వచ్చేశాడు కొడుకును చూసుకోవడానికి. ఒక్కరోజు తర్వాత డిశ్చార్జి చేశారు. ఆరోజు వరాహమూర్తి యింట్లో ఉండి మరుసటి రోజు ఉదయం ద్రోణాచలం లోకల్‌ ట్రెయిన్‌లో వెల్దుర్తి చేరుకున్నారు.

నామకరణానికి ముహూర్తం నిర్ణయించాడు మార్కండేయశర్మ దగ్గర బంధువులందరికీ కార్డులు వేశారు. మనుమడికి తులం గొలుసు, ఉంగరం, వెండివి కాళ్లకు ‘కాపులు’, వెండి మొలతాడు చేయించారు. కంసాలి వీరాచారి దగ్గర.

నామకరణానికి దాదాపు ఒక అరవైమందికి పైగా హాజరయ్యారు. కర్నూలు నుంచి నారాయణప్ప, ఒక సహాయకుడితో వంటలకు దిగాడు. రామాలయంలో నామకరణం జరిగింది. పిల్లవాడికి ‘శశిధర్‌’ అని పేరు పెట్టారు నక్షత్రం ప్రకారం. “నామకరణానికి ఇంతమందిని పిలవడం ఇంత ఖర్చు అవసరమా!” అనిపించింది పతంజలికి. తమ యింట్లో నాన్నమ్మకుగాని, తాతయ్యకుగాని తద్దినం పెడితేనే దాదాపు ఇరవై మందికి పైగా ఉంటారు. ఊర్లోని యితర బ్రాహ్మల కుటుంబాల వారిని కూడ పిలుస్తారు. ఆరోజు వృథా అయ్యే ఆహారం గుర్తొచ్చి బాధపడ్డాడు పతంజలి. కొన్ని సంప్రదాయాలను, ఆర్థిక స్తోమత లేకపోయినా, క్లుప్తంగా జరుపుకోకుండా, ఎందుకు దుబారా ఖర్చులు చేస్తారో అర్థంకాదు పతంజలికి. ఆ రోజు రాత్రికే బావ వెళ్లిపోవాలి.

“బావా! నాన్నతో మాట్లాడతానన్నావు!” అని గుర్తు చేశాడు పతంజలి. “నాకు గుర్తుంది లేరా పద” అంటూ మామ దగ్గరకు వెళ్లాడు రామ్మూర్తి, బావమరిదితో.

“మామా! మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి” అని గొంతు సవరించుకున్నాడు రామ్మూర్తి. “చెప్పు నాయనా,” అన్నాడు మామగారు. పడసాలలో చాపమీద కూర్చున్నారిద్దరూ. పతంజలి దూరంగా నిలబడి వింటూన్నాడు.

“పెద్దవారు అన్నీ తెలిసినవారు మీకు చెప్పగలిగినవాడిని కాదు… మన పతంజలి ఇంత కష్టపడుతూ, ఇంటర్‌లో అన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే చిన్న విషయం కాదు. వాడిని తప్పక డిగ్రీకి కట్టమని చెప్పాను. మనకు ఉస్మానియా యూనివర్సిటీయే దగ్గర. మా బంధువొకాయన గద్వాలలో ఉన్నాడు కాలేజీ లెక్చరర్‌గా. మనవాడికి అన్ని వివరాలూ చెప్పగలడు. మీకు అండగా ఉంటూనే చదువుకుంటాడు. కాదనకండి” అన్నాడు అల్లుడు.

“స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మోభయావహః అన్నాడు నాయనా గీతలో. మాకు వ్యవసాయముంది. జాతకాలు ముహూర్తాలు చూడటం నేర్పించాను. ఏదో నా కళ్ల ఎదురుగా ఉంటూ నాకు చేదోడు వాదోడుగుగా వాడుంటే చాలు. వాడేదో పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసి, ఉద్ధరిస్తాడనే అత్యాశ నాకు లేదు” అన్నాడు మామగారు. “పైగా ‘మనకు’ ఉద్యోగాలు రావడం కూడ కష్టమే కదా!” అన్నాడు ‘మనకు’ అన్న చోట నొక్కి పలుకుతూ.

“అదే మీ ఆలోచనలోని పొరపాటు. నాకు బ్యాంకుద్యోగమెలా వచ్చింది మరి? టాలెంటు, మెరిట్‌ ఉన్నవాడికి ఉద్యోగం ఒక సమస్య కాదు. ఈ వ్యవసాయాలు ఎలా తయారవుతున్నాయో చూస్తున్నారు కదా! పట్టు పరిశ్రమలో ఏమయింది? నిమ్మకాయలు మార్కెట్లో ఏ రేటు ఎప్పుడుంటుందో తెలియదు. మీరు ఇవన్నీ ఆలోచించి మీ ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవాలి. పతంజలి పైకొస్తే తన తర్వాత వారిని కూడ వృద్ధిలోకి తీసుకొస్తాడనే నమ్మకం నాకుంది. నేనేమయినా తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి” అన్నాడు రామ్మూర్తి.

మార్కండేయశర్మ ఆలోచించి, ఒక దీర్ఘ నిశ్వాసం వదిలి, “సరే నాయనా, కానివ్వండి” అన్నాడు. తండ్రి మనస్ఫూర్తిగా అనటంలేదని, బావ మాట మీద గౌరవంతో కాదనలేక పోయాడనీ అర్థమయింది పతంజలికి. ఏది ఏమైనా, తనకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినందుకు పొంగిపోయాడు.

బావను ప్రక్కకు పిలిచి, కౌగిలించుకున్నాడు” థ్యాంక్స్‌ బావా, నీవు చెప్పకపోతే…” అంటుండగా గొంతు గద్గదమయింది. “పిచ్చివాడా, డోంట్‌ బి ఎమోషనల్‌. ‘స్పార్క్‌’ ఉన్నవాడిని ప్రోత్సహించాలి. ఇందులో నేను చేసిందేముంది?” అన్నాడు బావ.

పతంజలికి బావ మీద గౌరవం రెట్టింపయింది. మూడోనెలలో వాగ్దేవినీ మేనల్లుడినీ చిత్తూరులో దిగబెట్టి వచ్చాడు. వాగ్దేవి కాన్పు, నామకరణం ఖర్చులకు రామలింగయ్య శెట్టి దగ్గర మరో పదిహేనువందలు అప్పు పెరిగింది.

***

తండ్రికి చెప్పి, ఒక రోజు గద్వాలకు బయలుదేరాడు పతంజలి. కర్నూలు నుండి గద్వాలకు ప్రతి గంటకు ఒక బస్సుంటుందని ఎంక్వయిరీలో అడిగి తెలుసుకున్నాడు. అప్పుడే ఒక బస్సు వెళ్లిపోయిందన్నారు. ఇంతలో రాయచూరు వెళ్లే బస్సు వచ్చింది.

“అదికూడ రాయచూరుకు గద్వాలమీదుగానే పోతుంది” అని చెప్పాడొకాయన.

ఎక్కి కూర్చున్నాడు. హైదరాబాదుకు పోయే నేషనల్‌ హైవే మీద అలంపూరు చౌరస్తా దాటిన తర్వాత గద్వాల చౌరస్తా వచ్చింది. అక్కడ నుండి ఎడమవైపు తిరిగింది బస్సు. ఎక్కిన గంటన్నరకే గద్వాలలో దింపారు. ‘దగ్గరే’ అనుకున్నాడు. సికింద్రాబాదు – ద్రోణాచలం రైలుమార్గంలో గద్వాల స్టేషను వస్తుంది. అసలు వెల్దుర్తి నుండి కాచిగూడ ప్యాసింజరులో వచ్చి ఉంటే సరిపోయేది. బోలెడు ఛార్జీ కలిసొచ్చేది” అనుకున్నాడు.

గద్వాల పెద్ద ఊరే. డోన్‌ కంటే పెద్దదనిపించింది. కాని తెలంగాణా ప్రభావం అంతలేదు. ఇటు గద్వాల నుండి అటు పెబ్బేరు వరకు ఏపనికైనా అందరూ కర్నూలుకు వస్తారు.

డిగ్రీ కాలేజీని వెతుక్కుంటూ వెళ్లాడు. ఏదో సంస్థానం లాటి పాతకాలం భవంతిలో కాలేజీ నడుస్తుంది. లోపలికి వెళ్లాడు. అతన్ని చూసి అటెండరు అడిగాడు.

“ఎవరు కావాలండి?” అని

“ఫిజిక్స్‌ లెక్చరర్‌ సాగర్‌ గారిని కలవాలి” అన్నాడు.

“సారు క్లాసులో ఉన్నారు. స్టాఫ్‌రూంలో కూర్చోండి” అన్నాడు అటెండరు. స్టాఫ్‌ రూం చూపించాడు.

పదిహేను నిమిషాల తర్వాత సాగర్‌ వచ్చాడు. యువకుడే పతంజలి కంటే ఏడెనిమిదేళ్లు పెద్దయి ఉంటాడు. తెల్లని పాంటు మీద బ్రౌన్‌ కలర్‌ ఫుల్‌ షర్టు టక్‌ చేశాడు. కాళ్లకు షూస్‌, కళ్లకు గాగూల్స్‌ ధరించాడు.

అటెండరు చెప్పినట్లున్నాడు. పతంజలిని చూసి, దగ్గరకు వచ్చి “మీరేనా నాకోసం వచ్చింది?” అనడిగాడు.

“అవునుసార్‌! వెల్దుర్తి నుండి వచ్చాను మిమ్మల్ని కలవాలని” అన్నాడు పతంజలి.

‘ఏది? డోన్‌కు పోయేటపుడు వస్తుందే, ఆ వెల్దుర్తేనా?

“అవునండీ! నేను రామ్మూర్తిగారికి బావమరిదినౌతానండి”

“ఎవరు, కెనరాబ్యాంక్‌లో పనిచేస్తాడే, ఆయనా? ఆయన మా అమ్మవైపు బంధువు నాకు అన్నయ్య వరుస. అయితే మీరు కూడ బంధువులే” అన్నాడతను.

పతంజలి చిరునవ్వు నవ్వి తల ఊపాడు “కలుపుగోలు మనిషే” అనుకున్నాడు.

“మా రామ్మూర్తి నీకు బావ కాబట్టి నేనూ బావనే. నాకంటే చాలా చిన్నవాడివి. అందుకే ‘మీరు’ నుంచి ‘నీవు’లోకి వచ్చినా ఏం పర్వాలేదా?” అనాడు సాగర్‌.

“అదే కరెక్టు సార్‌” అన్నాడు పతంజలి.

“మరి బావను పట్టుకుని ఎవరయినా సార్‌ అంటారా? అనరు కాబట్టి నీవు రామ్మూర్తిని పిలిచినట్లే ‘బావా’ అని పిలువు. ఒకే.?”

“సరే బావా” అన్నాడు పతంజలి.

“పదా క్యాంటీన్‌కు వెళ్లి మాట్లాడుకుందాం” అంటూ దారితీశాడు.

ఒకవైపు చెట్టుకింద ఒక పాక ఉంది. టీ, కాఫీ మాత్రమే ఉన్నాయి. ముందు రెండు బెంచీలు వేసి ఉన్నాయి. ఇద్దరూ కూర్చున్నారు.

“రెండు కాఫీలు చెయ్యి నాగేశం!” అని చెప్పాడు పాకలో అతనికి.

అప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు ఇద్దరు ముగ్గురు సాగర్‌ను చూసి వెళ్లిపోవడం గమనించాడు పతంజలి.

కాఫీలు వచ్చాయి. తాగుతూ, “ఇప్పుడు చెప్పు, కొత్త బావమరిదీ!” అన్నాడు. విషయమంతా వివరించాడు పతంజలి.

“బేషుగ్గా కట్టొచ్చు డిగ్రీ. మా యూనివర్సిటీలో “బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినేషన్స్‌” అని ఒక వింగ్‌ ఉంటుంది. ప్రయివేటుగా డిగ్రీ, పి.జి. ఇంకా కొన్ని కోర్సులు చేయవచ్చు. అది ఉస్మానియా క్యాంపస్‌లోనే ఆర్ట్స్‌ కాలేజికి ఎదురుగ్గా ఉన్నట్లుంది. మా లైబ్రరీలో ప్రాస్పెక్టస్‌ ఏదయినా దొరుకుతుందేమో కునుక్కుందాము పద” అన్నాడు సాగర్‌.

లైబ్రరీయన్‌ సాగర్‌ను విష్‌ చేసి ఆహ్వానించాడు. విషయం విని “ఎక్స్‌టర్నల్‌ విద్యార్థులకు మన కాలేజీలో సెంటర్‌ లేదు సార్‌! మన ఆఫీసులో ఎల్‌.డీ.సీ. రమాకాంత్‌ భార్య ఆ పరీక్షలు కట్టినట్లు గుర్తు. పిలుస్తానుండండి” అని లైబ్రరీ ప్రక్కనే ఉన్న ఆఫీసు నుండి రమాకాంత్‌ను తీసుకొని వచ్చాడు. అతను సాగర్‌కు నమస్కరించాడు.

“రమాకాంత్‌గారూ, మీ మిసెస్‌ ప్రయివేటుగా డిగ్రీ చదువుతున్నారా?” అనడిగాడు సాగర్‌ అతన్ని. “అవును సార్‌ ఈ సంవత్సరం ఐపోతుంది”

“గుడ్‌. మీ దగ్గర ప్రాస్పెక్టస్‌ ఉందా?”

“ఉంది సార్‌. ఇంటి దగ్గరుంది మధ్యాహ్నం లంచ్‌కు పోయినప్పుడు తెస్తాను”

 “థాంక్స్‌. అలా చేయండి. ఈ అబ్బాయి మా బావమరిది. ఇతని కోసం” అన్నారు రమాకాంత్‌ వెళ్లిపోయాడు. “పద. నాకు క్లాసు లేదు మనమూ భోంచేసి వద్దాం”

బయట పార్క్‌ చేసి ఉన్న వెస్పా స్కూటరు దగ్గరికెళ్లి స్టాండు తీశాడు సాగర్‌. “రా పతంజలీ” అని పిలిచాడు.

స్కూటర్‌ వెనుక కూర్చున్నాడు పతంజలి. ఐదు నిమిషాల్లో ఒక యింటి ముందు ఆపాడు స్కూటర్‌. ఒక పక్కగా నీడలో నిలబెట్టి ఆ యింటి ప్రక్కన ఉన్న మెట్లమీదుగా పై పోర్షన్‌ చేరుకున్నారు.

ముందు చిన్న వరండా. నాలుగు గాడ్రెజ్‌ కుర్చీలు వేసినున్నాయి. తర్వాత ఒక పెద్ద గది. రెండు గోడలకు రెండు మంచాలు, వాటిపై పరుపులు, పైన ఫ్యాను, ఒక మూలగా చిన్న టేబులు, దానిమీద ఫిలిప్స్‌ ట్రాన్సిస్టర్‌ రేడియో ఉన్నాయి.

అప్పటికే లోపల ఒకాయన లుంగీ కట్టుకుంటున్నాడు. “మీట్‌ మై…” అంటూ సాగర్‌ పరిచయం చెయ్యబోతుంటే, “ఉండరా బాబు, లుంగీ కట్టుకోనీ ముందు” అన్నాడతను.

“కానీ, కానీ” అన్నాడు సాగర్‌. ఇద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేశాడు. “ఈ అబ్బాయి పేరు పతంజలి. నాకు రిలెటివ్‌ అవుతాడు. వీడి పేరు “శ్రీశైలవాసు” నా కొలీగ్‌. ఇంగ్లీషు లెక్చరర్‌. ఇద్దరం ఉస్మానియా ప్రొడక్ట్సుమే” అన్నాడు. “గ్లాడ్‌ టూ మీట్‌ యు” అంటూ షేక్‌ హాండ్‌ యిచ్చాడతను. “సేంటు యు సర్‌” అన్నాడు పతంజలి.

“సారా! సారేమిటి సార్‌! వీడికి బంధువయితే నాకూ డిటో” అన్నాడు శ్రీశైలవాస్‌.

మంచం మీద కూర్చున్నారు ముగ్గురూ. విషయం విన్నాడు శ్రీశైల. “వై డోన్ట్‌ యు జాయిన్‌ ఇన్‌ ఎ కాలేజ్‌, ఇన్‌స్టెడ్‌! రెగులర్‌ స్టడీ హాజ్‌ ఇట్స్‌ ఓన్‌ అడ్వాంటేజెస్‌, యునో”

“బట్‌ మై ఫ్యామిలీ సర్కంస్టెన్సెస్‌ డు నాట్‌ అలోమి” అన్నాడు పతంజలి.

వంటింట్లోంచి ఒక కుర్రాడు కేక వేశాడు. ‘బోజనం రెడీ’ అంటూ

ముగ్గురూ లోపలికి వెళ్లారు. ఒక గాద్రెజ్‌ టేబుల్‌. రెండు కుర్చీలు ఎదరెదురుగా వేసి ఉన్నాయి. వరండాలోంచి ఇంకో కుర్చీ తెచ్చి వేశాడు. ఆ కుర్రవాడు. అతనికి పదహారు, పదిహేడు సంవత్సరాలుండొచ్చు.

“వీడిపేరు జ్ఞానేశ్వర్‌. మాకు అన్ని పనులూ చేసిపెడతాడు” అన్నాడు శ్రీశైల.

“నన్ను తమ్ముని లెక్క జూసుకుంటారు సారోల్లు” అన్నాడా అబ్బాయి.

అతనిది మహారాష్ట్ర అనీ, షోలాపూరు దగ్గర ఏదో ఊరనీ, వాళ్ల నాన్న గద్వాలలో కార్పెంటర్‌ పని చేస్తాడనీ చెప్పారు.

లుంగీ తెచ్చిచ్చాడు సాగరు.

“ఇది కట్టుకో. ఫీల్ ఎట్‌ హోం” అన్నాడు.

“పరవాలేదు బావా! టేబుల్‌ మీదే కద తింటాము” అన్నాడు పతంజలి.

ముగ్గురూ కూర్చున్నారు. జ్ఞానేశ్వర్‌ ముగ్గురికీ వడ్డించాడు. జొన్నరొట్టెలు, పల్చగా, మెత్తగా, వేడిగా ఉన్నాయి. వాటితో తినటానికి మెంతికూరపప్పు, వంకాయ కూర, రెండూ చేశాడు. రెండూ చాలా బాగున్నాయి. రొట్టెలయితే అద్భుతం, తలా రెండు రొట్టెలు తిన్నారు. తర్వాత అందరికీ కొంచెం అన్నం వేసి, పెరుగు వడ్డించాడు. పెరుగన్నంలోకి టమోట ఊరగాయ. “ఎంత సింపుల్‌గా, రుచిగా వుంది!” అనుకోకుండా ఉండలేకపోయాడు పతంజలి.

“ఎలా వుంది పతంజలీ, మా భోజనం” అని అడిగాడు సాగర్‌.

“చాలా బాగుంది. జొన్న రొట్టెలు అద్భుతం” అన్నాడు పతంజలి.

“మరాఠీవాళ్లు జొన్నరొట్టెలు బాగా చేస్తారు” అన్నాడు శ్రీశైల. “మీరు నెమ్మదిగా రండి నాకు మధ్యాహ్నం సెషన్‌ ఫస్టవరుంది సెకండ్‌ బి.ఎస్సీ వాళ్లకు. సాగర్‌, నీ బండి తీసుకెళుతున్నా” అని చెప్పి గబగబ డ్రస్‌ వేసుకొని వెళ్లిపోయాడు శ్రీశైల.

సాగర్‌, పతంజలి పావుగంట విశ్రాంతిగా కూర్చుని, కాలేజీకి బయలుదేరారు. నడిచి. “నాకు చివరి పీరియడ్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అంతవరకు ఖాళీయే” అన్నాడు సాగర్‌.

వీళ్లు వెళ్లేసరికి స్టాఫ్‌ రూంలో రమాకాంత్‌ ఎదురు చూస్తున్నాడు. “ప్రాస్పెక్టస్‌ తెచ్చాను సార్‌” అన్నాడు. “అప్పుడెందుకో మరో అప్లికేషన్‌ కూడ తెప్పించాను. అదీ తీసుకొచ్చాను” అంటూ ఒక కవరు సాగర్‌ చేతికిచ్చాడు.

సాగర్‌ పతంజలిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. పదినిమిషాల్లో ప్రాస్పెక్టస్‌ అక్కడక్కడ తిరగేశాడు. పతంజలి కూడ చదివాడు. “అర్థమైంది కదా! బి.ఎ. ఎక్స్ టర్నల్‌ పరీక్షలు రెండు భాగాలు పార్ట్‌ 1, పార్ట్‌ 2. పార్ట్‌ 1లో లాంగ్వేజెస్‌, పార్ట్‌ 2లో గ్రూప్స్‌ ఉంటాయి. ఇంటర్మీడియట్‌ పాసయింతర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్‌తో పార్ట్‌ 1, తర్వాత వన్‌యియర్‌ గ్యాప్‌తో గ్రూప్స్‌ రాయొచ్చు. మూడు సంవత్సరాలు గ్యాప్‌ ఉంటే అన్నీ ఒకేసారి వ్రాయవచ్చు. దాన్ని ‘వన్‌ సిట్టింగ్‌’ అంటారట వీళ్లు. సరే నీవు ఇంటర్మీడియట్‌ ఎప్పుడు పూర్తి చేశావు? బోర్డు పేరు చెప్పు. చివర ఉస్మానియా యూనివర్సిటీ గుర్తించిన బోర్డుల లిస్టు ఉంది. అందులో నీదుందో లేదో చూద్దాం” అన్నాడు. పతంజలికి భయమేసింది ఉంటుందో లేదో అని.

“మధ్యప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ప్రీయూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ భోపాల్‌” అని చెప్పాడు. సాగర్‌ లిస్టులో వెతికి, “ఇదిగో ఇక్కడ ఉంది. నీ సర్టిఫికెట్‌ రెకగ్నైజ్‌డే! ఓ.కె.” అన్నాడు. “ఎప్పుడు పాసయ్యావు?” అని అడిగాడు.

“మే 1974లో” అని బదులిచ్చాడు.

“ఇంకేం ఎలాగూ 1976 చివరికొచ్చాం 1977 నవంబరులో వన్‌ సిట్టింగ్‌ రాసెయ్యి, ఒక పనైపోతుంది” అన్నాడు సాగర్‌.

పతంజలి లెక్కవేశాడు. సరిగ్గా 13 నెలలుంది.

ప్రాస్పెక్టస్‌లో సిలబస్‌ చూశారు. ఇంగ్లీషు 2 పేపర్లు, సెకండ్‌ లాంగ్వేజ్‌ రెండు పేపర్లు, గ్రూపు ఒక్కొకటి మూడు పేపర్లు మొత్తం 13 పేపర్లు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ మీడియంలలో వ్రాయవచ్చు.

ఒకచోట చదివి సాగర్‌ అన్నాడు “చూశావా! ప్రతి పేపరులో 35 రావాల్సిన పనిలేదట. ఉదాహరణకు ఒక గ్రూపులోని మూడు పేపర్లకు కలసి మూడు వందలకు నూట అయిదు వస్తే చాలు. ఒక పేపర్లో తక్కువ వచ్చినా ఫెలయివరు. మీ తిరుపతి యూనివర్సిటీలో అలా లేదని విన్నాను” అన్నాడు సాగర్‌. పతంజలికి బాగా అర్థమయింది.

“ఒక్క సంవత్సరంలో చదవగలనంటారా బావా?” అని అడిగాడు సాగర్‌ని. “భేషుగ్గా చదివేయొచ్చు. 13 పేపర్లకు 13 నెలలు చాలా ఎక్కువ” అన్నాడు సాగర్‌. పతంజలికి ధైర్యం వచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here