[box type=’note’fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[dropcap]“మి[/dropcap]త్రులారా నదీ ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. ఎటువంటి జలచరాల దాడి కూడా లేదు. కనుక అందరు తెడ్లు వేయడం ఆపి విశ్రాంతి పొందండి” అన్నాడు ముందుభాగాన ఉన్న తెప్పలోని విజయుడు.
ఆరోజు విషయాలను, క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ పావురాన్ని వదిలాడు జగ్గు.
ఈ వార్త అన్నితెప్పలవారికి తెలియజేయబడింది. ఎండ వేడి నుండి తప్పుకోవడానికి ప్రతి తెప్పలపైన ఏర్పాటు చేయబడిన గొంగళితో కట్టబడిన గుడారం కింద అంతా చేరారు.
రాత్రి పౌర్ణమి వెన్నెల కావడంతో కాగడాలు వెలిగించనవసరం రాలేదు.
‘ఊరువాడికి కాటి భయం, పొరుగూరు వాడికి నీటి భయం’ అన్నట్లుంది నా స్ధితి” అన్నాడు ఇకఇక.
ఇంతలో ఇకఇకను నెట్టుకుంటూ ముందుకు వచ్చాడు శివన్న.
శివయ్యను చూస్తూ “అందుకే అన్నారు ‘కర్ర లేని వాడిని, గొర్రెయిన కరుస్తుంది’ అని. ఊరికే అనలేదు” అన్నాడు ఇకఇక.
చల్లగాలికి పౌర్ణమి రేయికి పరవశించిన శివన్న ఒక జానపదగీతం పెద్దగా ఆలపించసాగాడు.అతన్ని అనుకరించారు మిగిలిన తెప్పలపైవారు.
మూడురోజుల ప్రయాణ అనందరం దక్షణ భాగాన సముద్రతీరంలో ప్రవేసిస్తున్న తెప్పలను ఒడుపుగా సముద్రతీరానికి చేర్చారు అందరూ కలసి.
“మిత్రమా మనం ఇక్కడ ఎన్నిరోజులు ఉండవలసి వస్తుందో ఏమో! నిధిని ఈ పరిసరాలలోని రహస్యప్రదేశంలో దాచి మనం ఈ తీరన ఉంటూ ఏవైన నావలు, వర్తక ఓడలు మనకు కనిపిస్తాయేమో చూస్తూ ఉందాం” అన్నాడు జయంతుడు.
“నువ్వు చెప్పింది నిజమే” అని “నిధిని సమీపంలోని కొండగుహలో దాచి, చేరువలోని చిన్న కొండపై చదునుగా ఉన్న ప్రదేశం శుభ్రపరచుకుని, అక్కడే గుడారాలు ఏర్పరచుకుందాం!” అన్నాడు విజయుడు.
“మిత్రులారా ఓడలో వెళ్ళేవారు మనలను గుర్తించడానికి మూడు మార్గాలు ఉన్నాయి.పెద్ద నెగళ్ళు వేసి ఆ మంటల పైన పచ్చిచెట్ట కొమ్మలు వేస్తే దాని నుండి వెలువడే పొగ చూసి ఇక్కడ ఎవరో మానవులు ఆపదలో ఉన్నారని ఎవరైనా ఇటు వైపుకు రావచ్చు.
రెండో మార్గం మన దగ్గర ఉన్న కత్తులు, గొడ్డళ్ళు వంటివి సూర్యకాంతికి ఎదురుగా పెడితే, మన ఆయుధాలపై పడిన ఆవెలుగు తిరిగి ప్రసరింపబడి ఓడలో ప్రయాణించే వారికి కనిపిస్తుంది. ఆపదలో ఉన్నవారు సహాయం కొరకు చేసే సూచన అది. కాని ఇలా చేయాలి అంటే సూర్యుడు ఉదయం పూట మాత్రమే మనకు ఎదురుగా ఉంటాడు. సాయంత్రం ఈ ఆయుధాల వెలుగు పనిచేయదు.
మూడవ మార్గం మన కనుచూపు మేరలలో ఏదైన వర్తకపు ఓడ కనిపిస్తే సహయం కోరుతూ మన చిలుక ద్వారా వర్తమానం వారికి పంపుదాం”. అన్నాడు విజయుడు.
“ఏందయ్య నేను లేఖ తీసుకొని ఓడ వద్దకు వెళ్ళాలా?’ ‘అవ్వను పట్టుకుని, వసంతాలు ఆడినట్లుంది’ ఇది. నేను సముద్రంపై ప్రయాణమా? ‘గోవులేని ఊళ్ళో గొడ్డు గేదే శ్రీమహాలక్ష్శి’ లా ఉంది. అసలే నాభార్య బెకబెక కనిపించక నేను దిగులుగా ఉంటే నాతో పరాచికాలా? అయినా సముద్రంలోని ఓడ వద్దకు లేఖ తీసుకువెళ్ళిన నేను తిరిగి ఇంతదూరం రాగలనా” అన్నది చిలుక.
“మిత్రమా బెకబెక నువ్వు తిరిగి వచ్చేసమయం ఓడలో ఉంటావు. వాళ్ళతో పాటు నువ్వు మా వద్దకు వస్తావు భయమెందుకు?” అన్నాడు జయంతుడు.
“ఒకవేళ వాళ్ళు లేఖ చదివినా, వాళ్ళు తమ ఓడను ఇక్కడకు తీసుకురాకపోతే?” అన్నాడు నవ్వుతూ శివన్న.
“‘శుభం పలకరా మంకెన్న అంటే, పెళ్ళికూతురు ముండ ఏడ’ అన్నాడట. శివన్న నాతో ఎక్కువ ఎకసికాలు ఎట్టుకోమాక. నా అవసరం మీకు ఎంతో ఉంది” అన్నాడు ఇకఇక.
“అట్టనేలే ముందు ఇది తిను” అని పండిన సీతాఫలం చిలుక ముందు ఉంచాడు శివన్న.
“సరే ఇంతగా అడుగుతున్నారుగా, మీవల్ల కాకపోతే, అవసరమైతే చూద్దాం. ‘ఆలూలేదు చూలులేదు అల్లుడి పేరు సోమలింగం’ అన్నాడట నీలాంటివాడు” అన్నాడు ఇకఇక.
ఆహార పదార్థాల కొరకు, తేనె, మంచినీళ్ళు తీసుకురావడానికి అంతా కొండపక్కన ఉన్న అడవిలోనికి వెళ్ళారు.
మరి కొంతసేపటికి చీకటి కమ్మురాసాగింది.
ఆహారం తేవడానికి వెళ్ళి అందరూ వచ్చారు. అందరికి పండ్లు పంచసాగారు జగ్గా,శివన్నలు.
మరికొంతసేపట్లో నెగళ్ళు మంట వేసారు. సాయుధులైన వారు వంతుల వారిగా నిధికి కొంత దూరంగా ఉండి కావలి కాయసాగారు.
ఆలా మూడు రోజులు గడిచాయి.
మరుదినం ఉదయం దూరంగా ఓ వ్యాపార ఓడ కనిపించింది.
వెంటనే చిన్నమంటగా ఉన్న నెగడుపై పలు ఎండుకట్టెలు వేసి, వాటిపై పచ్చిచెట్టు కొమ్మలు వేసారు. అంతా, సూర్యునికి అభిముఖంగా తమ ఆయుధాలు మెరిసేలా పట్టుకుని ఆ వెలుగు దూరంగా ఉండే ఓడపై ప్రసరించేలా కదిలించసాగారు.
కొద్దిసేపటికి ఆవర్తక నావ విజయుడు బృందం ఉన్నసముద్ర తీరానికి చేరువగా రాసాగింది.
విజయునితో అక్కడ ఉన్నవారంతా ఆనందంతో హర్షధ్వానాలు చేయసాగారు.
వారికి చేరువగా వచ్చిన ఓడ సముద్రంలో కొంతదూరంలో ఆగింది.
విజయుడు కొందరిని తెప్పపై వెంటబెట్టుకుని వెళ్ళి, ఓడలోనికి వెళ్ళాడు.
ఆ వ్యాపార ఓడపైన తమ రాజ్యం జెండా ఎగురుతూ కనిపించడంతో సంతోషించిన విజయుడు, తెప్పలపై నిధిని ఓడలోనికి చేర్చి,అందరిని ఓడలో ఎక్కించుకుని అంగరాజ్యానికి బయలుదేరాడు.
ఆ రోజు వార్తలను క్షేమాన్ని తెలియజేస్తు ఓ పావురాన్నిగూడెం వైపుకు వదిలాడు జగ్గా.
”ఈ సంతోష సమయంలో ఓ కథ చెప్పనా” అన్నాడు ఇకఇక.
“వద్దన్నా వదలవుగా కానీ” అన్నాడు శివన్న.
***
వారం రోజుల అనంతరం అంగరాజ్యం చేరింది ఓడ.
తను తీసుకువచ్చిన నిధిని తమ రాజ్యఖజానాకు చేర్పించి భద్రపరిచి, తనతోవచ్చిన భిల్లు, రాజముద్రిక యువకులకు మంచి దుస్తులు, చక్కటి వసతి రాజభోజనం ఏర్పాటు చేయించి “మిత్రులారా వారం తరువాత మీరంతా మీ గూడాలకు వెళతారు, మీలో వచ్చిన దారి ఎవరికైనా తెలుసా” అన్నాడు విజయుడు.
”ఏలికా మాకు తెలుసు” అన్నారు జగ్గా, శివన్నలు.
“మీరు అక్కడకు వెళ్ళి మనవాళ్ళందరిని నాలుగు ఓడల్లో ఇక్కడకు తీసుకురండి, వాళ్ళ జీవితాంతము సుఖఃగా జీవించే ఏర్పాట్లు నేచేస్తాను, మీ భిల్లు,రాజముద్రిక యువకులంతా మా సైన్యంలో ఉంటారు. జగ్గా,శివన్నలకు మా సేనలలో సముచిత స్ధానం ఉంటుంది.” అన్నాడు.
మరుదినం రాజసభలో తన తండ్రి ఆశీస్సులు అందుకున్నవిజయుడు “పౌరులారా మనకు మన పూర్వీకుల, సహచర రాజుల అపారనిధి లభించింది. ఆ నిధితో మన దేశం లోనే కాకుండా ఇతర దేశ ప్రాంతాలలో ప్రవహించే నదులన్నింటిని అనుసంధానం చేయబోతున్నాను. ఏ ప్రాంతం వారైనా వాకికి కావలసిన రీతిలో నదుల నుండి త్రాగునీరు, వ్యవసాయానికి అవసరమైన కాలువలు ఆ ప్రాంతం వారే ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి అయ్యేటువంటి ఖర్చు అంతా మనమే భరిస్తాం. ఏ ప్రాంతంవారు ఈ నీటి పారుదల పథకానికి ఎంత ధనం అవసరమో తెలియజేస్తే అడిగినంత మనమే చెల్లిస్తాం. ఇదంతా నా మిత్రుడు జయంతుని పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రతి రాజ్యానికి, నగరాలకు, గ్రామాలకు, పంటపొలాలకు నీరు అందించవలసిన బాధ్యత మనపై ఉంది అలాగే చెట్లు పెంచడం వలన ఎండవేడిని తగ్గించడంతో పాటు పలు రకాల ఉత్పత్తులు అంటే కుంకుళ్ళు, జిగురు, అనేక రకాలైన పండ్లు, ఆకుకూరలతో పాటు ఔషధాల మొక్కలు ఇలా మానవాళికి వినియోగపడే సమస్తం మనం చెట్లనుండి పొందవచ్చు. వ్యవసాయం, తోటలు, పాడి పరిశ్రమ నిర్వహించేవారికి మేము వడ్డి లేని ధన సహాయం చేస్తాము. ప్రజలకు కావలసిన అన్ని సదుపాయాలు అందించడానికి మేము సర్వాదా సిధ్ధం” అన్నాడు విజయుడు. సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి.
మరుదినం చంపారాజ్య రాజు, మంత్రి అంగరాజ్యం విచ్చేసారు. అతిథి మర్యాదలు జరిపిన అనంతరం, అంగరాజు, తనమంత్రితో కలసి చంపారాజును సాదరంగా ఆహ్వానించి “బాల్య మిత్రమా కుశలమా, ఎన్నో ఏళ్ళ అనంతరం మనం కలుసుకున్నాం, ఏం కోరుకుని ఇంతదూరం వచ్చారు” అన్నాడు.
“మిత్రమా మన స్నేహాన్ని శాశ్వతం చేసుకోవడానికే వచ్చాను. నాకుమార్తె సుగంధిని నీ కుమారుడు విజయునికి, మా మంత్రి కుమార్తె భువనను జయంతునికి ఇచ్చి వివాహం జరిపంచాలని అడగడానికి వచ్చాను” అన్నాడు చంపా రాజ్యరాజు.
అంతలోనే విజయుడు,జయంతుడు అక్కడికి వస్తునే చంపారాజ్య ప్రభువులను గమనించి వినయంగా నమస్కరించారు.
చంపా రాజ్యప్రభువులు రావడానికి కారణం విజయునికి, జయంతునికి వివరించారు అంగదేశపు రాజు, మంత్రి.
“పెద్దల నిర్ణయం శిరసావహిస్తాం” అన్నారు విజయుడు, జయంతుడు.
“శుభం త్వరలోనే ముహుర్తం నిర్ణయించి పట్టాభిషేకము, కల్యాణమహాత్సవం జరిపిద్దాం” అన్నాడు అంగరాజు.
అప్పుడే వచ్చిన ఇకఇక చెంపారాజ్య ప్రభువును చూసి “ప్రభూ తమరు ఇక్కడ ఉన్నారేమిటి?” అన్నాడు.
“సుగంథి, భువనలు అంగరాజ్యం మెట్టినిల్లుగా రాబోతున్నారు. అక్కడ బెకబెక నీకొసం బెంగపడి ఉంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు” అన్నాడు చంపా రాజ్య ప్రభువు.
”మహారాజా అదంతా పెద్ద కథ, తరువాత చెపుతాను. ‘బిడ్డను సంకలో ఉంచుకుని ఊరంతా వెదినట్లు’ నేను బెకబెక కొసం కొండలు కోనలు వెదుకుతున్నా. మహారాజా మనం మన రాజ్యానికి ఎప్పుడు వెళుతున్నాం” అన్నాడు ఇకఇక.
“ఎప్పుడో ఏమిటి తక్షణం బయలుదేరుతున్నాం” అన్నాడు చంపా దేశరాజు.
“సెలవు మిత్రమా, ఈ శుభవార్త మా చిరంజీవుల చెవిన వేయాలికదా” అన్నాడు చంపాదేశరాజు.
తనకు కాబోయే కోడలు సుగంధికి, జయంతుడు వివాహం ఆడబోయే భువనకు పలురకాల నగలు బహుమతులుగా ఇచ్చి గౌరవంగా తన బాల్యమిత్రుడిని సాగనంపాడు అంగరాజు.
మరుసటి మాసంలో పట్టాభిషేకం, వివాహం జరిపించిన అంగరాజు, తన కుమారుడికి మంత్రిగా జయంతుని నియమించాడు.
సుగంధి, భువనలతో పాటు ఇకఇక, బెకబెక చిలుకల జంట కూడా అంగరాజ్యం చేరాయి.
అలా అన్ని రాజ్యాలవారు సమైక్యంగా శ్రమించి అన్ని నదులను అనుసంధానం చేయడం వలన కరువు అనేది కనుచూపు మేరలలో లేకుండాపోయింది. ప్రతి రాజ్యానికి ఏడాది పొడవునా నీరు లభించడంతో పంటలు బాగా పండాయి. అంతా శుభిక్షంగా ఉన్నారు” అన్నాడు తాతయ్య.
అప్పటివరకు తాతయ్య చెప్పిన కథ విన్నపిల్లలు అందరూ సంతోషంగా తమ ఇళ్ళకు బయలుదేరారు.
శుభం.
(సమాప్తం)