(ఈ వ్యాసంలో కొరియన్ చిత్రం ‘ప్యారసైట్’ (2019) పూర్తి కథ ప్రస్తావించబడింది. ఈ చిత్రం చూడాలనుకున్నవారు ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇంగ్లీష్‌లో సబ్ టైటిల్స్ ఉంటాయి.)
[dropcap]స[/dropcap]మాజంలో ఆర్థిక స్థితిగతులను బట్టి తరగతులుగా విడిపోవటం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదే. “ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం… నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అన్నారు శ్రీశ్రీ. శ్రమను దోపిడీ చేసి కొందరు ఎదిగితే, ఆ శ్రామికులు మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోవటం చూస్తూనే ఉన్నాం. ఇలా తరగతులుగా విడిపోయినవాళ్ళ మధ్య ఘర్షణ జరిగితే ఎలా ఉంటుంది? అంతఃకలహాలు, విప్లవాలు జరుగుతాయి. ఆ ఘర్షణ ఒక ఇంటి ఐదు గోడల మధ్య జరిగితే?
ఐదు గోడలేమిటి అనుకుంటున్నారా? ‘గోడ’ అనే పదానికున్న నిర్వచనం కాస్త విస్తృతం చేస్తే ఏ ఇంటికైనా ఆరు గోడలుంటాయి – నిలువుగా ఉండే నాలుగు గోడలు, పైకప్పు, నేల (ఫ్లోర్). కొరియన్ చిత్రం ‘ప్యారసైట్’లో నాలుగు గోడలు, పైకప్పు మధ్యలో హాయిగా ఉన్నామనుకున్న ఒక కుటుంబానికి నేల కింద ఉన్నవారి గురించి తెలిసి వారి వల్ల ప్రమాదం ఉందని వారితో ఘర్షణ పడతారు. ఆ కింద ఉన్నవారే దగా పడ్డ కింది తరగతివారు. ఒకప్పుడు బ్రిటన్‌లో జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు పనివాళ్ళు కింది అంతస్తులోను, యజమానులు పై అంతస్తులోనూ ఉండేవారు. ఇప్పుడు కింది తరగతి వారు ఇంకా అణగారిపోతున్నారని ఇలా నేల కింది ఆవాసం రూపంలో చూపించాడు దర్శకుడు బాంగ్ జూన్-హో.
అసలు నేల కింద తెలియకుండా మనుషులుండటమేమిటి? సరిహద్దుల్లో శత్రుసైన్యం నుంచి రక్షణ కోసం బంకర్లు (నేలమాళిగలు) నిర్మిస్తారు. దక్షిణ కొరియాలో కొందరు సంపన్నులు ఉత్తర కొరియా దాడి చేస్తే తలదాచుకోవటానికి ఇంటి కింద అలాంటి బంకర్లు నిర్మించుకున్నారు. ఈ బంకర్లలో బాత్రూములు, నీటి సరఫరా ఉంటాయి. శత్రుభయంతో నిర్మించుకున్న బంకరు దేశంలో ఉన్నవారికి తలదాచుకునేందుకు ఒకే ఒక దిక్కయిందంటే శత్రువుల గురించి ఆలోచించినట్టే తమ దేశస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా?
ఏ దేశమైనా తమ దేశంలోని కింది తరగతి వారిని నిర్లక్ష్యం చేయటం తరతరాలుగా వస్తున్నదే. ఒకప్పుడు జాతివివక్షగా ఉన్నది ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిన వారి పట్ల వివక్షగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. అందుకే ‘ప్యారసైట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రతిష్ఠాత్మమైన క్యాన్ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆస్కార్ అవార్డులలో ఉత్తం చిత్రం అవార్డ్ గెలుచుకుంది. 1955లో వచ్చిన “మార్టీ” తర్వాత ఈ రెండు అవార్డులూ గెలుచుకున్న చిత్రం 2019లో వచ్చిన ‘ప్యారసైట్’ మాత్రమే! అంతే కాదు ఉత్తమ చిత్రం ఆస్కార్ గెలుచుకున్న తొలి పూర్తి విదేశీ చిత్రం ‘ప్యారసైట్’. అవార్డులే కాదు ప్రజాదరణ కూడా పొందిందంటే దర్శకుడు ఎంత జనరంజకంగా మలచాడో అర్థమవుతుంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఒక సెమీ బేస్మెంట్ ఫ్లాట్‌లో నివసిస్తూ ఉంటుంది కిమ్ కుటుంబం. కిమ్ వారి ఇంటి పేరు. వారి పేర్లు మనకు కష్టంగా ఉంటాయి కాబట్టి మనం సుబ్బారావు, జానకి, వారి పిల్లలు శాంతి, రవి అనుకుందాం. ఉద్యోగాల్లేవు. ఫీజు కట్టలేక పిల్లలు కాలేజీకి వెళ్ళలేదు. పీట్జా బాక్సులు తయారు చేస్తూ పొట్టపోసుకుంటూ ఉంటారు. రవి స్నేహితుడు ఒకరు కాలేజీలో చదువుకుంటూ ఒక సంపన్నుల అమ్మాయికి ఇంగ్లీష్ ట్యూషన్లు చెబుతూ ఉంటాడు. పై చదువుల కోసం విదేశాలకు వెళుతూ రవిని ఆ అమ్మాయికి ట్యూషన్ చెప్పమని రెకమెండేషన్ లెటర్ ఇస్తాడు. రవి దొంగ సర్టిఫికెట్‌తో అక్కడ ట్యూషన్ చెప్పటానికి కుదురుకుంటాడు. ఆ సంపన్నుల కుటుంబం రాజారావు, లక్ష్మి, పిల్లలు లత, టింకూ అనుకుందాం. వారి ఇంట్లోనే ఉండే పనిమనిషి కమల. రవి, లత దగ్గరవుతారు. టింకూ ఒకప్పుడు ఇంట్లో దెయ్యాన్ని చూసి భయపడ్డాడని డాక్టర్ అతనికి కళలు నేర్పిస్తే మనసు కుదుటపడుతుందని చెబుతాడు. రవికి ఒక ఆలోచన వస్తుంది. శాంతిని ఒక ఆర్ట్ థెరపిస్ట్‌గా ఆ ఇంట్లో ప్రవేశపెడతాడు. శాంతి ఇంటర్నెట్‌లో ఆర్ట్ థెరపీ గురించి కొంత చదువుకుని లక్ష్మి దగ్గర పోజు కొట్టేసి టింకూకి తనకి తోచినట్టు పెయింటింగ్ నేర్పిస్తూ ఉంటుంది. రవికి, శాంతికి కమల మర్యాదలు చేస్తూ ఉంటుంది. వారిద్దరూ దీంతో సంతృప్తిపడక రాజారావు దంపతులకు వారి కారు డ్రయివర్ మీద అనుమానం పుట్టించి సుబ్బారావుకి డ్రయివర్‌గా ఉద్యోగం వచ్చేటట్టు చేస్తారు. అందరూ కలిసి కమలకి క్షయరోగం ఉందని నమ్మించి ఆమె స్థానంలో జానకిని పనిమనిషిగా ప్రవేశపెడతారు. వీళ్ళందరూ ఒకరికొకరితో సంబంధం లేనట్టు నటించి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. రాజారావు దంపతులు పైకి బాగానే మాట్లాడినా సుబ్బారావుని, జానకిని హద్దుల్లో ఉండమని చెప్పకనే చెబుతారు. వారిదగ్గర అదో రకమైన వాసన వస్తుందని అనుకుంటూ ఉంటారు. టింకూ కూడా వారిద్దరి దగ్గర ఒకే రకమైన వాసన వస్తుందని అంటాడు.
ఇంతవరకూ సినిమా ఎంతో వినోదభరితంగా ఉంటుంది. ఒకరోజు రాజారావు కుటుంబం సరదాగా గడపటానికి వేరే ఊరికి వెళ్ళినపుడు సుబ్బారావు కుటుంబం రాజారావు ఇంట్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో కమల వస్తుంది. జానకి తప్ప అందరూ దాక్కుంటారు. తాను స్టోర్ రూంలో ఏదో మర్చిపోయానని చెప్పి కమల కిచెన్ కింద ఉన్న స్టోర్ రూంలోకి వెళుతుంది. అక్కడ ఒక బీరువా వెనక బంకర్ కి రహస్యద్వారం ఉంటుంది. బంకర్లో కమల భర్త కాంతారావు ఎప్పటి నుంచో ఉంటూ ఉంటాడు. ఏదో చిన్న వ్యాపారంలో దివాలా తీసి అప్పుల వాళ్ళ బాధ పడలేక అక్కడ చేరాడు. బీరువా కింద ఓ పాత్ర అడ్డుపడటంతో లోపలినుంచి బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. ఆ బంకర్ తమ ఇంటి కింద ఉన్నట్టు రాజారావు కుటుంబానికి తెలియదు. అంతకు ముందున్న యజమాని దగ్గర పనిమనిషిగా పనిచేసిన కమలకు తెలుసు. తిండి లేక మాడిపోతున్న కాంతారావుకు తిండి పెడుతుంది కమల. అప్పుడప్పుడూ తన భర్తకు తిండి పెట్టమని జానకిని ప్రాధేయపడుతుంది. జానకి ఒప్పుకోక నిజం బయటపెడతానని బెదిరిస్తుంది. ఇదంతా చాటు నుంచి చూస్తూ కంగారు పడుతున్న సుబ్బారావు, శాంతి, రవి కమల కంటపడతారు. వీళ్ళందరూ మోసపూరితంగా ఆ ఇంట్లో చేరారని కమలకి అర్థమవుతుంది. ఇప్పుడు బెదిరించటం కమల, కాంతారావుల వంతవుతుంది. ఇంతలో కుండపోత వర్షం కారణంగా త్వరగా ఇంటికి వచ్చేస్తున్నామని లక్ష్మి జానకికి ఫోన్ చేస్తుంది. ఈ గందరగోళంలో పెనుగులాట జరుగుతుంది. కాంతారావుని కట్టి బంకర్లో పడేస్తాడు సుబ్బారావు. కమలని జానకి బంకర్ మెట్లమీద నుంచి తోసేయటంతో ఆమె తలకు గాయమై స్పృహ కోల్పోతుంది. బంకర్ తలుపు వేసేసి అన్నీ సర్దేసి మామూలుగా ఉంటుంది జానకి. రాజారావు కుటుంబం తిరిగిరావటంతో సుబ్బారావు, శాంతి, రవి డ్రాయింగ్ రూమ్ లోని వెడల్పైన కాఫీ టేబుల్ కింద దాక్కుంటారు. సుబ్బారావు వాసన ఇంకా వస్తోందని రాజారావు భార్యతో అంటాడు. సుబ్బారావు, శాంతి, రవి కష్టం మీద బయటపడి వర్షంలో తమ ఇంటికి వెళ్ళేసరికి వారి ఇల్లు నీటిలో మునిగిపోయి ఉంటుంది. రాత్రంతా తుఫాను శిబిరంలో గడుపుతారు.
ఇప్పటివరకు జరిగిందే ఆశ్చర్యకరంగా ఉంటే తర్వాత జరిగేది ఇంకా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మర్నాడు ఆదివారమైనా టింకూ పుట్టినరోజు పార్టీకి షాపింగ్ కోసం డ్రైవర్ సుబ్బారావుని రమ్మంటుంది లక్ష్మి. రాత్రంతా ఒక శిబిరంలో పడుకున్నారు సుబ్బారావు, శాంతి, రవి. అయినా కాదనలేక లక్ష్మిని షాపింగ్‌కి తీసుకెళతాడు సుబ్బారావు. శాంతిని పార్టీకి పిలుస్తుంది లక్ష్మి. రవిని లత ఆహ్వానిస్తుంది. ఇంటి ఆవరణలోని పచ్చిక మైదానంలో పార్టీ జరుగుతుంది. జానకి పార్టీ పనులు చూస్తూ ఉంటుంది. టింకూ కోసం ఓ నాటకం వేద్దామని సుబ్బారావుని వేషం వేసుకోమంటాడు రాజారావు. ఇంతలో రవి ఉండబట్టలేక బంకర్లోకి వెళతాడు. కమల చనిపోయి ఉంటుంది. అప్పటికే కట్లు విప్పుకున్న కాంతారావు రవి మీద దాడి చేస్తాడు. రవి బంకర్లో నుంచి బయటపడి పైనున్న కిచెన్ లోకి పరుగు పెడతాడు. వెనకే వచ్చిన కాంతారవు రవిని తలమీద మోదటంతో అతను పడిపోతాడు. కసితో కాంతారావు మైదానంలోకి వచ్చి శాంతిని గుర్తుపట్టి ఆమెని కత్తితో పొడుస్తాడు. ఇది చూసి టింకూ కళ్ళు తిరిగి పడిపోతాడు. అందరూ కేకలు పెడతారు. సుబ్బారావు, జానకి శాంతి దగ్గరకు పరుగెత్తుకు వస్తారు. రాజారావు టింకూని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాలని సుబ్బారావుని రమ్మంటాడు. షాక్‌లో ఉన్న సుబ్బారావు కదలడు. ఇంతలో శాంతి చనిపోవటంతో జానకి కాంతారావుని పొడిచేస్తుంది. కారు తాళాలు ఇవ్వమని సుబ్బారావుని కేక వేస్తాడు రాజారావు. సుబ్బారావు స్థబ్దుగా తాళాలు అతని వైపు విసురుతాడు. అవి కింద పడతాయి. కొనప్రాణంతో ఉన్న కాంతారావు వాటి మీద పడిపోతాడు. అందరూ చెల్లాచెదురవుతారు. ఆ గుంపులో సుబ్బారావుకి గాయపడ్డ రవిని వీపు మీద వేసుకుని బయటకు ఈడ్చుకు వెళ్తుతున్న లత కనిపిస్తుంది. కారు తాళాలకోసం రాజారావు కాంతారావుని పక్కకి జరపటానికి ప్రయత్నిస్తాడు. అతనికి అభివాదం చేసి కాంతారావు మరణిస్తాడు. కాంతారావు నుంచి వచ్చే వాసనకి ముక్కు మూసుకుని తాళాల కోసం తడుముతూ ఉంటాడు రాజారావు. ముక్కు మూసుకున్న రాజారావుని చూసి సుబ్బారావులో ఆక్రోశం కట్టెలు తెంచుకుంటుంది. రాజారావుని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత భయంతో గ్యారేజ్ గుండా ఇంట్లో ప్రవేశించి బంకర్లోకి వెళ్ళి తలుపు వేసుకుని అక్కడే ఉండిపోతాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కమల మృతదేహాన్ని మైదానంలో ఓ మూల పాతిపెడతాడు. లక్ష్మి ఇల్లు ఖాళీ చేసి పిల్లలతో వెళ్ళిపోతుంది. వేరే వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కుంటారు. సుబ్బారావు అప్పుడప్పుడూ కిచెన్ లోకి వచ్చి తిండి దొంగిలిస్తూ ఉంటాడు. రవి తల గాయం నుంచి కోలుకున్నా అప్పుడప్పుడూ పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. జానకి అతన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. సుబ్బారావు బంకర్లో ఉన్నాడని అర్థమైన జానకి జరిగిన అసలు విషయాన్ని కోర్టులో చెప్పదు. కాంతారావు ఉన్మాదంతో రవి మీద, శాంతి మీద దాడి చేశాడనుకున్నా సుబ్బారావు రాజారావుని ఎందుకు చంపాడనేది ఎవరికీ అర్థం కాదు. బంకర్ గురించి వేరెవరికీ తెలియకపోవటంతో సుబ్బారావు పారిపోయాడనే అనుకుంటారు.
వినడానికి ఇది థ్రిల్లర్ కథలా అనిపించినా ఇందులో ఉన్న గూడార్థాలు ఆలోచింపచేస్తాయి. సామాన్య ప్రేక్షకులనీ, విమర్శకులనీ ఆకట్టుకునే సినిమాలు ఆధునిక కాలంలో చాలా తక్కువే అని చెప్పాలి. ఇంగ్లీష్‌లో జేమ్స్ క్యామెరన్ (టైటానిక్, అవతార్), హిందీలో రాజ్ కుమార్ హిరానీ (మున్నాభాయ్ ఎంబీబీయస్, 3 ఇడియట్స్), తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి (ఈగ, బాహుబలి) కొన్ని సినిమాలలో ఇది సాధించారు. వీటిలో కొన్ని మాత్రమే సామాజిక సమస్యలను స్పృశించాయి. ‘ప్యారసైట్’ లాగా ఓ సామాజిక సమస్యని చర్చిస్తూ ప్రేక్షకులని అలరించిన చిత్రం చాలా అరుదు.
సియోల్‌లో సెమీ బేస్మెంట్ ఫ్లాట్లు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అద్దె తక్కువ. భూమికి దిగువన కొంత భాగం, పైన కొంత భాగం ఉండే ఫ్లాట్లు ఇవి. బంకర్‌తో పోలిస్తే ఇవి నయమే అనిపిస్తుంది. గాలి, వెలుతురు వస్తూ ఉంటాయి. ఈ ఫ్లాట్లు దిగువ మధ్య తరగతికి ప్రతీకలుగా అటూ ఇటూ కాకుండా ఉంటాయి. ఈ ఫ్లాట్ నుంచి సుబ్బారావు చివరికి బంకర్లోకి చేరాడు… అంటే ఇంకా దిగువకి వెళ్ళాడు. బంకర్లలో ఉన్నవారి గురించి సమాజం పట్టించుకోదు… కింది తరగతిని నిర్లక్ష్యం చేసినట్టే.
తమ ఇంట్లో స్మార్ట్ ఫోన్లలో ఉచిత వైఫై కోసం శాంతి, రవి పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. పరాన్నభుక్కు(ప్యారసైట్) లలాగా ఇతరుల వైఫై దొంగిలిస్తుంటారు. కాంతారావైతే పరాన్నభుక్కు అనే మాటని సార్థకం చేస్తాడు. నేల కింద ఉండి ఇతరుల తిండిని తింటుంటాడు. తిండి ఎక్కువ ఖర్చవుతోందనే విషయం యజమానులకి తెలియలేదా? ఇక్కడే రచయితల ప్రతిభ కనపడుతుంది. కొత్త పనిమనిషి కోసం సుబ్బారావుతో మాట్లాడుతున్నపుడు రాజారావు “కమల ఇద్దరు మనుషుల తిండి తింటుంది” అంటాడు. రాజారావు, లక్ష్మి లాంటి వాళ్ళు ఇతరుల శ్రమని దోపిడీ చేసే పరాన్నభుక్కులు. ఆదివారం పూట సుబ్బారావుని అతని పరిస్థితి తెలుసుకోకుండా షాపింగ్ కోసమని, నాటకం కోసమని ఇబ్బందిపెడతారు. అదనంగా డబ్బిస్తున్నాంగా అంటారు. ఇది దర్జా దోపిడీ. ఐదో గోడ కిందా పైనా కూడా పరాన్నభుక్కులు ఉన్నారు. చూసే దృక్కోణమే వేరు. ఈ చిత్రానికి ‘ప్యారసైట్స్’ అని బహువచనంలో పేరు పెట్టి ఉండాల్సింది అని దర్శకుడు బాంగ్ జూన్-హో చిత్రం విడుదలైన తర్వాత అన్నాడు.
తనకు ఆశ్రయం కల్పించిన రాజారావంటే కాంతారావుకి గౌరవం. చనిపోతూ కూడా రాజారావుకి అభివాదం చేస్తాడు. తనకి సాయం చేయటానికి వచ్చాడనుకుంటాడు. కానీ కారు తాళాల కోసం అతని దగ్గరకి వచ్చాడని తెలియదు. కాస్త తిండికోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి కాంతారావుది. తనకు సమాజం ఏదో ఉపకారం చేస్తోందనుకునే అమాయకత్వం. సుబ్బారావు కుటుంబానిది ఘారానా మోసం. వాళ్ళు కాంతారావు, కమలల్లాగా సర్దుకుపోయే రకం కాదు. కలలు కంటుంటారు. విలాసాలు కోరుకుంటారు. రవి స్నేహితుడు ఒక శిలను రవికి కానుకగా ఇచ్చి అదృష్టసంకేతమని చెప్తాడు. అది నమ్ముతారు. రవి లతని పెళ్ళి చేసుకుంటే ఈ ఆస్తంతా తమదే అనుకుంటారు. చివరికి జరిగిన ఘర్షణలో తన కుటుంబం నాశనం కావటం కళ్ళారా చూస్తాడు సుబ్బారావు. ఒకరు హత్య చేశారు. ఒకరు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత జరిగినా రాజారావు తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నాడు. అంతే కాక ముక్కు మూసుకుని తమలాంటి వారిని చీదరించుకుంటున్నాడు. ఇంతకు ముందు సుబ్బారావు దగ్గర చెడు వాసన వస్తోందన్నాడు. ఇప్పుడు కాంతారావు దగ్గర చెడు వాసన వస్తోందంటున్నాడు. దాంతో ‘నేను రాజారావు స్థాయికి చేరగలను’ అనుకునే సుబ్బారావుకి ‘నేను కాంతారావు స్థాయిలో ఉన్నాను’ అనే విషయం అర్థమవుతుంది. తమలో తాము కొట్టుకు చచ్చిపోతుంటే (అంతఃకలహం) వీడి బడాయి ఏమిటి అని ఉద్రేకంతో రాజారావుని చంపేస్తాడు (విప్లవం). వాసన అనే భౌతిక అంశాన్నిసామాజిక వివక్షకు ప్రతీకగా చూపించారు. తమ వీధిలో దోమల నివారణకు పొగ కొడుతుంటే ఇంట్లో ఉన్న దోమలు కూడా నశించాలని కిటికీలు తెరిచిపెట్టే స్వభావం సుబ్బారావుది. డబ్బు ఆదా చేయటానికి చవక రకం సబ్బులు, డిటర్జెంట్లు వాడతారు వాళ్ళు. వాసన వస్తుంది మరి! కాంతారావు గాలీ వెలుతురూ లేని బంకర్లో ఏళ్ళ తరబడి ఉంటాడు. వాసన వస్తుంది మరి! టింకూ కూడా ఈ వాసనని పసిగడతాడు. అంటే తర్వాతి తరం కూడా అంతరాలని అలవాటు చేసుకుంటోంది.
ఈ చిత్రంలో మెట్లు కూడా అంతస్తుల మధ్య వారధులుగా ఉంటాయి. సుబ్బారావు ఫ్లాట్ లోకి ఉండేది కొన్ని మెట్లే. వాళ్ళకింకా సమాజంలోకి వెళ్ళి రావటం సులువే. కానీ కలుగులో ఉన్న ఎలుక పరిస్థితి. తిండి సంపాదించుకుని మళ్ళీ కలుగులోకి చేరాలి. బంకర్లోకి చాలా మెట్లుంటాయి. బయటకు రావాలంటే ఎంతో ఆలోచించాలి. తిండి దొంగ తిండి. జైల్లో ఉన్న ఖైదీ కన్నా హీనమైన పరిస్థితి. రాజారావు ఇల్లు ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. మెట్లెక్కి వెళ్ళాలి. రాజారావు కుటుంబం పై అంతస్తులో ఉంటుంది. దర్పంగా పై అంతస్తుకి మెట్లు ఎక్కుతూంటారు రాజారావు దంపతులు. సుబ్బారావు కుటుంబం ఉద్యోగాలలో భాగంగా పై అంతస్తుకి వెళ్ళినా కొంతసేపే… తిరిగి కిందకి రావలసిందే. వర్షంలో సుబ్బారావు కుటుంబం తమ ఇంటికి వెళ్ళేటపుడు ఒక వంతెన పైనుంచి ఎన్నో మెట్లు దిగి కిందికి వెళతారు… అథః పాతాళానికి వెళ్ళినట్టు.
దక్షిణ కొరియాలో మన దేశంలో ఉన్నట్టే విద్యార్థులకు పోటీ పరీక్షలు ఉంటాయి. మన దేశంలో కన్నా పోటీ తీవ్రంగా ఉంటుంది. కోచింగ్ సెంటర్లలో విపరీతంగా రుబ్బిస్తారు. డబ్బులు బాగా గుంజుతారు. కాలేజీ ఫీజులు కూడా ఎక్కువే. డబ్బు లేకపోతే చదువు దక్కదు. చదువు లేకపోతే డబ్బు దక్కదు. జానకి తన చిన్నతనంలో క్రీడల్లో ప్ర్రావీణ్యం సంపాదించింది. కానీ డబ్బులేక పై స్థాయికి వెళ్ళలేకపోయింది. ప్రావీణ్యం కన్నా డబ్బుకే ప్రాధాన్యం. సంపన్నులు ఇంట్లోనే ట్యూషన్లు, ఆర్ట్ థెరపీ లాంటి భేషజాలకు పోతారు. వారిని మోసం చేసే రవి, శాంతి లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇదంతా వ్యవస్థలోని డొల్లతనం.
సినిమా కథపరంగా చూస్తే తమ ఇంట్లో ఉన్న బంకర్ సంగతి రాజారావు దంపతులకు తెలియదనడం నమ్మశక్యంగా అనిపించదు. ఇంతకు ముందున్న యజమాని తాను ప్రాణభయంతో బంకర్ కట్టుకున్నానని చెప్పుకోవటం సిగ్గుగా భావించాడని కమల అంటుంది. అక్కడి రాజకీయ వాతావరణం, ఉత్తర కొరియాతో సంబంధాలు మనకు అంతగా తెలియవు కాబట్టి మనం పెద్దగా తర్కించలేం. బీరువా కింద పాత్ర అడ్డుపడి కాంతారావు బంకర్ నుంచి బయటికి రాలేకపోయాడనేది కూడా అలాంటిదే. అయినా ఒక సామజిక అంశాన్ని చర్చిస్తున్నప్పుడు స్థూల చిత్రాన్ని (బిగ్ పిక్చర్) చూడాలి కానీ రంధ్ర్రాన్వేషణ తగదు. కళారూపాలలో అసలే తగదు. విషాదమేంటంటే సినిమా చివరిలో కూడా సుబ్బారావు కుటుంబానికి తప్ప ఎవరికీ బంకర్ సంగతి తెలియదు. సంచలనమైన వార్త చూసి అందరూ కొన్నాళ్ళు చర్చించుకుంటారు, తర్వాత మర్చిపోతారు. బంకర్ మాత్రం అజ్ఞాతంగా ఉండిపోతుంది… సుబ్బారావు లాంటి వాళ్ళ బ్రతుకుల్లాగే. మళ్ళీ బంకర్ విషయం బయటపడితే ఎలా ఉంటుందనేది మనమే ఊహించుకోవాలి.
చిత్రం ముగింపులో రవి బాగా డబ్బు సంపాదించి ఆ ఇల్లు కొన్నట్టు, సుబ్బారావు బంకర్లో నుంచి బయటకు వచ్చి రవిని కౌగిలించుకున్నట్టు చూపిస్తారు. కానీ ఇదంతా రవి పథకం మాత్రమే. తండ్రికి ఉత్తరం రాస్తూ ఈ పథకం గురించి వివరిస్తాడు రవి. పథకం మాట అటుంచితే ఆ ఉత్తరం కూడా సుబ్బరావుకి అందే అవకాశం లేదు. నిజంగా రవి లాంటి వాళ్ళు సమాజంలో ఎదగగలిగితే అది సమసమాజమే అవుతుంది.
సినిమాలో దర్శకత్వ ప్రతిభను చూపించే అంశాలు ఎన్నో ఉన్నాయి. కమల తన భర్త కోసం తిరిగివచ్చినపుడు ఆమె మొహం కమిలిపోయి ఉంటుంది. అంటే అప్పుల వాళ్ళు ఆమె మీద దాడి చేశారన్నమాట. మన దేశంలో కాల్ మనీ ఉదంతాల్లో ఇలాంటి దాడులు చూశాం. బీరువా కింద పాత్ర అడ్డు పడిందని తెలియక కమల బీరువాని జరపటానికి గోడ మీద కాళ్ళు ఆనించి నేలకి సమాంతరంగా ఉండి బీరువాని శాయశక్తులా తోసే దృశ్యం బంకర్ సంగతి ఇంకా తెలియని ప్రేక్షకుడికి విస్మయం కలిగిస్తుంది. ఆ విస్మయం నుంచి తేరుకోకుండానే కమల తలుపు తీసుకుని మలుపులుగా ఉన్న మెట్లు దిగి తన భర్తని “ఏమండీ” అని పిలుస్తూ బంకర్ లోకి ప్రవేశించటంతో ప్రేక్షకుడు నోరువెళ్ళబెడతాడు. రవి స్నేహితుడిచ్చిన శిలను అదృష్టసంకేతంగా భావించి మునిగిపోయిన ఇంట్లోంచి దాన్ని తీసుకువెళతాడు. రాజారావు ఇంటికి పార్టీకి వెళ్ళినపుడు దాన్ని తీసుకువెళతాడు. చివరికి దాంతోనే కాంతారావు రవి తలపై మోదుతాడు. మూఢవిశ్వాసాలపై దర్శకుడు వేసిన అస్త్రమిది. ఇక టింకూ నిజానికి చూసింది దెయ్యాన్ని కాదు. కాంతారావు తిండికోసం ఒక రాత్రివేళ మెట్లెక్కి బెదురుగా కిచెన్లోకి వస్తుంటే చూసి దెయ్యమనుకుని భయపడతాడు. చివరికి అతన్ని మళ్ళీ చూడటంతోనే కళ్ళు తిరిగి పడిపోతాడు. సినిమాలో హాస్యం కూడా బాగా పండింది. రాజారావు దంపతుల ఎదుట ఎలా నటించాలో రెహార్సల్స్ చేసుకునే దృశ్యాలు, సుబ్బారావు కుటుంబం కాఫీ టేబుల్ కింద దాక్కునే దృశ్యాలు నవ్వు తెప్పిస్తాయి.
సుబ్బారావు, రాజారావు ఇళ్ళకోసం ప్రత్యేకమైన సెట్లు వేశారు. సుబ్బారావు ఇల్లు సహజత్వానికి దగ్గరగా, రాజారావు ఇల్లు సంపన్నుల ఆడంబరాన్ని చూపించేవిధంగా ఉంటాయి. రాజారావు ఇల్లు కథలో ఎంతో ప్రాధాన్యం కలది. దానికి ప్రత్యేకమైన ప్లాన్ వేయించి కట్టారు. విశాలమైన డ్రాయింగ్ రూమ్ నుంచి నిలువెత్తు అద్దాల కిటికీ ద్వారా పచ్చని పచ్చిక మైదానం కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోని వస్తువులు కూడా కథగమనానికి తోడ్పడతాయి. కళాదర్శకత్వానికి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఒక అంతస్తు మాత్రమే నిర్మించి షూటింగ్ చేశారు. మైదానం నుంచి చూసినపుడు కనిపించే రెండో అంతస్తు నిజానికి గ్రాఫిక్స్ మాయాజాలమే.
ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డులు వచ్చాయి. స్క్రీన్ ప్లే హాన్ జిన్-వాన్ తో కలిసి బాంగ్ జూన్-హో రాశాడు. ఉత్తమ ఎడిటింగ్ నామినేషన్ కూడా వచ్చింది. తెలియని భాషలో సినిమాలు చూడాలంటే వెనుకంజ వేస్తారు చాలామంది. “సబ్ టైటిల్స్ అనే చిన్న అడ్డుగోడ దాటితే ఎన్నో గొప్ప చిత్రాలను అస్వాదించవచ్చు” అంటాడు బాంగ్ జూన్-హో. అది అక్షరసత్యం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో ప్రపంచభాషల చిత్రాలు చూడవచ్చు. కాస్త ఓపిగ్గా వెతికాలి. కొంచెం ఓపిగ్గా సబ్ టైటిల్స్ చదవాలి. అంతే!