[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
దూరవిద్యతో నా అనుబంధం
[dropcap]ఒ[/dropcap]క రోజు శ్రీమతిని స్కూటర్ వెనక కూర్చోబెట్టుకొని వెళ్తుంటే వి.ఆర్. కాలేజ్ ఎదురుగా రెడ్ లైట్ వెలగడంతో, కొంచెం రోడ్డు పక్కగా నిలబడ్డాను. ట్రాఫిక్ కానిస్టేబుల్ గబగబా నా వద్దకు వచ్చి సెల్యూట్ చేస్తూ, “తమరెప్పుడు రిటైరవుతారు సార్” అన్నాడు వినయంగా. సమాధానం చెప్పేలోగానే పచ్చ లైటు వెలగడంతో కదిలిపోవలసి వచ్చింది. అతను ఎందుకడిగాడో నాకు అర్థం కాక, మరుసటి రోజు కాలేజీకి వెళ్లినప్పుడు నా ఆత్మీయ మిత్రునితో ఈ సంగతి చెప్పాను. అతను నవ్వి, “ఏం లేదు, మీరు ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకు చీఫ్ సూపర్నెంటుగా, చాలా స్ట్రిక్టని పేరుంది. కొందరు ఏదో విధంగా పరీక్ష పాసవాలనుకొనేవాళ్లకు మీ వల్ల ఇబ్బందిగా వుంటుంది” అని వివరంగా చెప్పాడు.
ఒకరోజు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు ఫోన్ చేసి అభినందిస్తూ “త్వరలో మనకొక సంబంధం ఏర్పడనుంది” అంటూ విషయం ఏమిటో చెప్పకుండా ఫోను పెట్టేశారు. మా కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ పెడుతున్నట్లు, నన్ను కోఆర్డినేటర్‍గా నియామకం చెయ్యమని ప్రిన్సిపాల్ గారికి చెప్పినట్లు తెలిసింది. అసలు సంగతేమిటంటే యూనివర్సిటీలో నా పేరు చర్చకు వచ్చినప్పుడు “తెలుగు లెక్చరర్ ఏం చేస్తాడు? ఎవరైనా సైన్స్ శాఖ వారైతే మేలు” అని కొందరు సూచించారట. అయితే విశ్వనాథరెడ్డి గారు పట్టుబట్టడంతో నేను మా యన్.యస్.యస్. ఇన్‌ఛార్జి పదవి విడిచిపెట్టి 1984లో కాబోలు, ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ బాధ్యత పైన వేసుకొన్నాను. మొదట్లో విశ్వనాథరెడ్డి గారే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్‌గా వ్యవహరించారు. తిలక్ రోడ్డులో సారస్వత పరిషత్తు హాల్లోనూ, అమీర్ పేట పార్కు వద్ద ఒక భవనంలోనూ మేమందంరం పేపర్లు దిద్దడానికి వెళ్లేవాళ్ళం. విశ్వనాథరెడ్డి గారు మాకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్, రైలు ఛార్జితో అన్నీ కలిపి, ఒక కవర్‍లో పెట్టించి, మా టేబుల్ వద్దకే అందజేయించేవారు. తర్వాత కాలంలో ఈ రెమ్యునరేషన్ కోసం అధ్యాపకులు సినిమా హాల్లో టికెట్ల కోసం కొట్టుకు చచ్చినట్లు ఇబ్బంది పడవలసి వచ్చింది.
ఓపెన్ యూనివర్సిటీ మొదటి ఏడు తెలుగు/హిందీ, సైన్సు, సొషల్ – విజ్ఞాన శాస్త్రం మూడు పేపర్లు. వీటిలో చాలా విషయాలుండేవి. మొదటి పర్యాయం విద్యార్థులకు ఉపయోగపడే వాడుక తెలుగు మీద పాఠాలు పెట్టారు. తెలుగు పాఠాల వరకు ఆలోచనంతా విశ్వనాథరెడ్డి గారిదే కాబోలు. ఈ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులకు ఆదివారాలు, సెలవు రోజుల్లో పాఠాలు ఉండేవి. మా కళాశాల వరకు ప్రభత్వ కళాశాలలో సైన్సు బోధించే మంగేశ్ గారు, జనార్దన్ గారు సైన్సు, సామాన్య శాస్త్రం బోధించారు. మా కళాశాలలో ఇంగ్లీషు, తెలుగు లెక్చరర్‍లే ఆ సబ్జెక్టులు బోధించారు. ఆదివారమైతే ఈ తరగతుల నిర్వహణలో రోజంతా సరిపోయేది. తొలి సంవత్సరాలలో క్లాసు నిండుగా విద్యార్థులుండేవారు. ఏడాది చివర రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించారు. మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో ఈ క్లాసుకు తీసుకోడం కోసం నేను కర్నూలు, హైదరాబాదు, వరంగల్లు వెళ్లాను. అట్లాగే అక్కడివాళ్లు ఈ వైపు వచ్చారు. అధ్యాపకులు విద్యార్థులు చాలా సంతోషంగా ఇందులో పాల్గొన్నారు.
మా కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటరు పెట్టినపుడు ఏభై మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. నాలుగేళ్ళలో 800 మంది విద్యార్థులయ్యారు. ఐదో సంవత్సరం ఓపెన్ యూనివర్సిటీ పూర్తి కాలం కోఆర్డినేటర్‍ను నియమించారు. నా శ్రీమతి, ఆమె సోదరి, మా మేనగోడలు, మా మేనల్లుడి భార్య… ఇట్లా నేనిచ్చిన స్ఫూర్తితో ఈ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. నా శ్రీమతి ఇంగ్లీషు, తెలుగు, చరిత్ర అంశాలతో డిగ్రీ తెచ్చుకొంది. ఇంతకూ చెప్పొచ్చిందేమంటే ఆ రోజుల్లో ఆధ్యాపకులం ఎంతో బాధ్యతగా నడిపామో, ఆ కానిస్టేబుల్ మాటలు సూచిస్తాయని. విశ్వవిద్యాలయం పేరు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా మార్చారు అప్పుడే.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి తోడుగా మా కళాశాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం School of Distance Education వారి స్టడీ సెంటరు కూడా నెలకొల్పడం, మా ప్రిన్సిపాల్ మాధవరావు నా పేరే ప్రతిపాదించడంతో, ఆ సెంటరు బాధ్యత పైనబడింది. ఈ స్టడీ సెంటరు పనితీరు కొంచెం వేరుగా ఉండేది. ఆదివారాలు, ఇతర సెలవుల్లో జరిగే తరగతులు, పరీక్షలను అజయాయిషీ చెయ్యడానికి విశ్వవిద్యాలయం నుంచి ఎవరో ఒక ఆచార్యులు నెల్లూరు వచ్చేవారు. పరీక్షా పత్రాలు మూల్యాంకనం చెయ్యడానికి మా అధ్యాపకులను విశాఖపట్టణం పిలిపించేవారు. విశాఖలో అధ్యాపకులు, ఆఫీస్ స్టాప్ చాలా గౌరవంగా చూచుకొనేవారు మమ్మల్ని. ఎక్కడో మంచి మిత్రులుంటే వారింట్లో, లేకపోతే, జగదాంబ సెంటర్‍లో ఇద్దరు ముగ్గురం కలిసి చిన్న హోటల్‍లో రూం తీసుకొని ఉండేవాళ్లం. ఒకసారి చీఫ్‌గా వెళ్లాను కాని మరుసటి రోజే తీవ్రమైన జ్వరం వచ్చి నాలుగు రోజులు గదికి పరిమితమై ఉండిపోయాను. నేను యూనివర్సిటీకి వెళ్తే నాకు కేటాయించిన పేపర్లని అలాగే ఉంచారు, అప్పటికి వేల్యూయేషన్ ముగిసినా! వేల్యూయేషన్‍కి కేటాయించిన హాలులో ఎవరో పెళ్లివారు దిగి, ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ పెళ్లి సంరంభం మధ్యే రెండు రోజుల్లో నా పని ముగించుకొని నెల్లూరు తిరిగి వచ్చాను. ఆంధ్రా యూనివర్శిటీ నాన్-టీచింగ్ అధ్యాపకులు, లెక్చరర్లు ఎంత మర్యాదగా వ్యవహరిస్తారో మాటల్లో చెప్పలేను. ఒక పర్యాయం ఏదో పని మీద యూనివర్శిటీకి వెళ్తే, స్టడీ సెంటర్ డిప్టీ డైరక్టర్ ప్రొఫెసర్ హరినారాయణ గారు తమ ఆఫీసు గదిలోనే ఉండమన్నారు. ఆ గదిలో వారు విశ్రాంతి తీసుకొను చిన్న మంచం, పడక కూడా ఏర్పాటు చేశారు. ఆ రాత్రి నిద్ర పట్టక మేడ మీద తూర్పు వరండాలోకి వెళ్తే, పౌర్ణమి రోజు వెన్నెలలో ఎగిసిపడే అలలతో సముద్రాన్ని అట్లా చూస్తునే ఉండిపోయాను.
ఆంధ్ర విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం వారు నా చేత స్పెషల్ తెలుగు పాఠాలు కూడా రాయించారు. ఆ రోజుల్లో మేము విశాఖ వెళ్లినప్పుడల్లా ఫస్ట్ క్లాస్ రైలు ఛార్జీలు ఇస్తూ, టికెట్ జెరాక్స్ కాపీ అడిగేవారు. మా అధ్యాపకులు కొందరు రైలు టికెట్ కొని జెరాక్స్ తీసుకొని, మరుసటి రోజు కేన్సిల్ చేసేవారు. మా కాలేజీ ప్రిన్సిపాల్ మాధవరావు మొదట్లోనే ఒక సలహా ఇచ్చారు. ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తేనే ఆ రకంగా బిల్లు పెట్టండి,లేకపోతే, ఆర్‌టిసి బస్సులో డీలక్సు బస్సు ఛార్జి తీసుకోమన్నారు. మేం కొందరం వారి సలహాను ఎన్నడూ మరిచిపోలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దూరవిద్యా స్కూల్ పరీక్షలు మా సెంటరులో జరుగుతూంటే కొందరు ప్రొఫెసర్లు, ఆ డ్యూటీ మీద వచ్చేవారు. మా మీది నమ్మకంతో కొందరు గొలగమూడి వెళ్లి అక్కడ నిద్ర చేసి, వెంకయ్య స్వామి సమాధిని దర్శించుకుని తిరిగివచ్చేవారు. మా సెంటరు కొక ఆకర్షణ వెంకయ్యస్వామి మందిరం దర్శనం.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా తెలుగు, చరిత్ర, ఆర్థిక శాస్త్రం వంటి అధ్యాపకులకు ట్యూషన్లుండవు. కాలేజీల్లో కామర్స్, సైన్సు మాస్టార్లు స్కూటర్లు, కార్లు కొన్నారు ట్యూషన్ డబ్బులతో. మాకు ఈ పేపర్ల మూల్యాంకనం అంటే ఎంత అసౌకర్యమైనా, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా, అవకాశం వస్తే జారవిడుచుకోము. 1973లో కాబోలు ఇంటర్మీడియట్ పేపర్లు మూల్యాంకనం ఏలూరు, కడప, వరంగల్లు సెంటర్లలో పెట్టారు. నేను మొదటి పర్యాయం ఏలూరు కట్టమంచి రామలింగారెడ్డి గారి కళాశాలలో జరిగిన మూల్యాంకనానికి వెళ్లాను.
పేపరుకు 75 పైసలు కాబోలు, రోజుకు 30 పేపర్లు, రెండు పూటలా దాదాపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు పని కొనసాగేది. ఏలూరు మూల్యాంకనానికి నూజివీడు నుంచి ముత్యాలముగ్గు నిర్మాత, ఎం.ఏ.లో నా సహాధ్యాయి ఎం.వి.ఎల్. కూడా హాజరయ్యాడు. ఇద్దరం బాపు ‘అందాల రాముడు’ సినిమా మొదటి రోజే చూశాము. సినిమా ఫెయిలందనే టాక్ రావడంతో అతను, చిన్నపిల్లవాడులాగా దుఃఖించాడు. ఏలూరులో బాపు సినిమాలో బామ్మ వేషం వేసిన ఆవిడ ఇంటికి కూడా వెళ్లొచ్చాము. మా ఎం.వి.ఎల్. ఏలూరులో పేపర్లు దిద్దే సెంటరుకు ‘ఎడ్యుకేషనల్ టూర్ సెంటర్’ అని తమాషాగా పేరు పెట్టాడు. కారణం, అప్పటికి రీనంబరింగ్ విధానం రాలేదు. ధనవంతులు, శక్తియుక్తులున్న పెద్దలు కుర్రాళ్లను వెంటపెట్టుకొని ఏలూరులో దిగారు. హోటళ్లు నిండిపోయాయి.
నీతి లేని కొందరు చీఫ్‍లు ‘ఈ నంబరు పేపరు మీకొచ్చిందా’ అని కప్పలు గెంతినట్లు ఒక్కో టేబుల్‌కు తిరుగుతూంటే నవ్వొచ్చేది. అదంతా పోయిందనుకోండి ఇప్పుడు.
(మళ్ళీ కలుద్దాం)