[dropcap]సూ[/dropcap]ర్యుడు మంచు దుప్పటి నుంచి బంగారు కిరణాలు ప్రసరిస్తూ ప్రజా జీవితాన్ని మేలుకొలుపుతున్నాడు. పల్లెల్లో కోడి కూత కాలాన్ని సూచిస్తే, పట్నంలో ఎన్నో రకాల విద్యుత్ గడియారాలు రేడియం లైట్స్‌తో నవరత్న రంగుల కాంతితో ఎంతో అందంగా ప్రకృతిని తలపించే ప్రకృతి దృశ్యాలు, పారే నీరు అన్ని ఉండి ఎలక్ట్రానిక్ కోడి కూత వినిపిస్తూ నిద్ర లేపుతుంది.
ఏమిటి కొత్తరకం పల్లెటూరు అభిరుచి అంటూ ఇంటికి వచ్చిన బంధువులు వెక్కిరిస్తారు.
పద్మనాభం పల్లెలో వ్యవసాయము, కోళ్ల ఫారము, చేపల చెరువులు, నర్సరీ అన్ని నడిపేవాడు. డబ్బు బాగానే సంపాదించాడు. తల్లి తండ్రినీ చూసేవాడు. అన్నదమ్ములు ఇద్దరు బాగా చదివి సిటీ ఉద్యోగాల్లో ఉన్నారు. అమ్మ నాన్న అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు అన్ని ఊళ్లు వెళ్లి ఉండి చూస్తారు. ఓపిక బాగా ఉన్నది అంటారు.
పద్మనాభం కూడా అగ్రికల్చర్ బీ.ఎస్.సి చదివాడు. ఉన్న పొలాలు చూసుకోవాలి అని ఆలోచించి వ్యవసాయంతో పాటు ఫ్రెండ్స్‌తో కొంత సొమ్ము వాటాగా పెట్టి డబ్బు పెంచాడు. భార్య పిల్లలను బాగా చూసుకుంటాడు. మార్కెట్లో వచ్చిన కొత్తరకం వస్తువు ఇంట్లో ఉండాలి. కొత్త నగ భార్యకో కూతురుకో కొంటాడు.
పెళ్లికి ముందే తల్లి చెప్పింది – “ఒరే పద్మనాభం, నువ్వు ఇంటికి వచ్చిన పిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మేమంతా ముఖ్యం కాదు, నువ్వు ఎంత బాగా చూసావు అన్నదే ముఖ్యం. నేను కోడల్ని కూతురులా కాకపోయినా ప్రేమగా చూస్తాను. మీ నాన్నగారు ఎప్పుడు బుద్దుడి వారసులు కదా. ఆడపిల్లకి భరోసా భర్త. పుట్టిన ఇల్లు వదిలి మన ఇంటికి వచ్చింది అంటే మనం ప్రేమగా చూడాలి. అప్పుడే ఇక్కడ నిలబడి ఉంటుంది. వారానికి ఒకసారి అయిన పట్నం తీసుకెళ్ళి దానికి కావాల్సినవి కొనిపెట్టు. ఏముంది ఓ కాయ కాస్తే అదే ఇంటి పట్టున ఉండిపోతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఎదిగి ఒదిగి ఉంటుంది. అది నిజమైన గృహిణి లక్షణం. నువ్వు అసలే దుర్వాసుడు వారసుడివి అని చెప్పాలి. అన్నీ వదులుకుని ఇంటికి వచ్చిన పిల్లని భద్రంగా చూడాలి. అదే ఆడపిల్లకి భర్తే భరోసా” అని హితవులు చెప్పి పెళ్లి చేసింది.
పద్మనాభం భార్య కట్నం లాంఛనాలు బాగానే తెచ్చుకున్నది.
“నీకు నీ కుటుంబం అంటే ఎంత ప్రేమ ఉన్నా, అక్కలు పెళ్లి తరువాత వెళ్లిపోయారు. తమ్ముళ్లు ఉద్యోగం కోసం సిటీకి వెళ్లిపోయారు. మిగిలింది మేము కదా. మేము కూడా అన్ని చూడాలి. కొడుకుల ప్రవర్హన చూడాలి. కనుక నీ భార్యను బాగా చూసుకో” అని చెప్పి రెండో కొడుకు దగ్గరకి వెళ్లారు పద్మనాభం తల్లిదండ్రులు, ఇంకా ఇద్దరు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి కదా అని చెప్పి. నిజమే కదా.
పద్మనాభం భార్య వసుధ డిగ్రీ చదివింది. ఇంటి పనులు బాగా చేస్తుంది. అసలు ఏ అత్తింటి వారైన ఆడపిల్లను శత విధాల పరిశీలిస్తారు. కానీ మొగపిల్లాడికి ఆస్తి, అంతస్తు, ఉద్యోగం, కుటుంబ స్థితి చూస్తారు. కానీ విధిరాతను బట్టి ఎవరూ రాసి ఉంటే వారు అవుతారు. పెద్దలు ఎప్పుడు పిల్లల క్షేమం కోరుతారు.
కొందరు మాత్రం వచ్చిన కోడల్ని విమర్శిస్తూ “మీ అమ్మ ఇలా పెంచిందేమిటీ?” అంటూ వెటకారం డాట్ కామ్‌లా ప్రవర్తిస్తారు. దాని వల్ల వాళ్ళ విలువ కోల్పోతారు. కోడలైనా కూతురైనా మాట్లాడే విధానంలో మంచి ఆత్మీయత ఉండాలి. ఎప్పుడు ఆ ఇంటి పిల్ల, మా ఇంటి పిల్లలు అలా కాదు అని కోడల్ని ఇంట్లో నోరెత్తకుండా చేస్తారు. దాని తోనే అసలు సమస్య వస్తుంది.
పద్మనాభానికి మొదట కూతురు పుట్టింది. రంగ రంగ వైభవంగా వియ్యాల వారు నామకరణం చేశారు వెంకట పద్మ వేద శ్రీ అని. పిల్ల శుక్రవారం పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి అనీ, ఇంట మొదట ఆడపిల్ల పుట్టడం శుభకరం అన్నారు పెద్దలు అంతాను. అలాగే పద్మనాభం ఇంటిలో సిరులు కురిశాయి.
అయితే ఇప్పటి వాతావరణం బట్టి, ప్రకృతి మార్పుల వల్ల పొలాలు కొంచెం దెబ్బ తిన్నాయి. దానికి కొంత బాధ పడ్డాడు, కానీ రైతు భరోసా వల్ల కొంత నష్టం తగ్గింది. ప్రకృతి వైపరీత్యాలకి ఏదో ఒక రెమిడీ ఉంటుంది కానీ ఆడపిల్ల జీవితానికి అత్త ఇంట్లో భరోసా ఇచ్చేది భర్త మాత్రమే అని గ్రహించాలి అనుకున్నాడు.
కాల గమనంలో ఈసారి మొగ పిల్లాడు పుట్టాడు. వాడికి మారుత సాయి వేదాన్ష్ అని పెట్టారు.
కారణం వాళ్ళ ముత్తాత గొప్ప వేద పండితుడు. ఇంటి అరుగులే వేద పాఠశాలలుగా కీర్తి ఉన్నది. అయితే పిల్లలు అంతా ఇంగ్లీష్ చదువు చదివితే గాని జీవితం లేదని అటు వైపు మొగ్గు చూపారు. వేదం ఎవరికో గానీ రాదు. అలాగే సంగీతం కూడా ఎవరికో గాని రాదు కదా. రెండు భగవత్ దత్త విద్యలు ఎంతో బాగా వల్లే వేయాలి, సాధన చెయ్యాలి. అందుకే పేర్లు అలా పెట్టుకున్నారు
పిల్లలని పద్మనాభం స్కూటర్ పై తీసుకెళ్ళి, తీసుకు వచ్చేవాడు. ఇంకా టెన్త్ కాగానే ఇంటర్ చదవాలి అంటే ప్రక్క ఊరు రాజమండ్రి వెళ్ళాలి. పోని ఇద్దరు ముగ్గురు పిల్లలు జత చేసి పంపితే మంచిది, ఆడపిల్లను ఒక్కర్తి ఎందుకు అని ఓ టాక్సీ మాట్లాడి ఆ ఊరు ఆడపిల్లల్ని మరో ముగ్గుర్నీ కలిపి కాలేజీకి పంపారు. తెలివైన పిల్ల కనుక వేద శ్రీ మంచి మార్కులు తెచ్చుకున్నది. మిగిలిన వాళ్ళు కూడా డిగ్రీ చదివే ఉద్దేశం లోనే ఉన్నారు.
కానీ వేద మెడిసిన్ చదువుతాను, కోచింగ్‌కి విజయవాడలో పెట్టాలి అని మారం చేసింది.
“అబ్బో చాలా సమయం పడుతుంది. నీకు డిగ్రీ అయ్యాక పెళ్లి చెయ్యాలని నా ఉద్దేశం” అన్నాడు తండ్రి. కానీ వేద ఒప్పుకోలేదు, “నేను చదివి తీరాలి” అన్నది.
సరే అంటూ హాస్టల్‌లో కోచింగ్‌కి పెట్టారు. హోమ్ సిక్ సెలవలు వచ్చే సమయానికి వేద శ్రీ చదువులో ఉంది, కానీ తల్లి తండ్రి మాత్రం చాలా బెంగ పెట్టుకున్నారు.
ఇంక ఉండలేక, “పిల్లను రోజు చూడకపోతే చాలా భయంగా ఉంది. జీవితంలో ఎప్పుడూ ఇంత బెంగ పడలేదు” అన్నాడు పద్మనాభం. వసుధ భర్త పరిస్తితి అర్థం చేసుకున్నది. బెంగ వల్ల పద్మనాభం చీటికి మాటికి భార్యపై విసుగుకుని దుర్వాసుడు మాదిరి మారాడు.
‘పిల్లల జీవితం కంటే ఏమి కావాలి? ఇద్దరు పిల్లలకి మంచి చదువులు ఉండాలి, కనుక పిల్లాడిని ఫస్ట్ ఇంటర్‌కి అక్కడే చేర్పిద్దాము’ అని నిర్ణయించుకొన్నారు. అలాగే మకాం మార్చారు. మంచి మార్కులతో పిల్లకి మెడిసిన్ సీటు వచ్చింది. కానీ హాస్టల్ వద్దు, ఇంటి నుంచే పంపాలి అని నిర్ణయం చేశారు.
మంచి చదువు కదా, పిల్ల ఐదు ఏళ్ళు చదవాలి కదా, అందుకని మంచి ఇల్లు తీసుకోవాలి. ఏదో మూడు గదుల్లో ఉండి జీవితం గడపటం కష్టం కాదని ఆలోచించారు. ఈలోగా అక్కడ అపార్ట్‌మెంట్‌లో అమ్మకానికి కొత్త ఫ్లాట్ ఉన్నదని తెలుసుకొని కొనడానికి సిద్ధపడ్డాడు పద్మనాభం.
మనిషి జీవితంలో మంచి ఇంట్లో ఉండటం కూడా ఒక యోగమే కదా. కొంత డబ్బు కొంత లోన్ పెట్టి ఇల్లు కొన్నాడు. ఒక ప్రక్క పిల్ల చదువుతోంటే ఇల్లు ఖర్చు కూడా దేనికి అన్నారు. “అదే కదా నా తమ్ముళ్లు అంతా సిటీలో ఉన్నారు. మా అమ్మ నాన్న అక్కడే ఉంటున్నారు. ఎప్పటికైన పల్లె ఇల్లు ఉమ్మడిదే.” అన్నాడు పద్మనాభం. అందుకే ఇల్లు కొని గృహ ప్రవేశం చేశాడు. ఇంటి బంధువులు వసుధ అక్క అన్న కుటుంబాలు వచ్చాయి. నవగ్రహ పూజ శ్రీ గణపతి పూజ చేసి శ్రీ వేంకటేశ్వర దీపారాధన, శ్రీ సత్యనారాయణ వ్రతము కూడా చేశారు
బంధువులకు బట్టలు ఘనంగా పెట్టారు. బంధువులు శ్రీ కనకదుర్గ, మల్లీశ్వరస్వామినీ చూశారు. ఆ ఊళ్ళో ఉన్న దేవాలయాలు – శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలు బంధువుల సహాయంతో వెళ్లి చూశారు. ఒక ఊరు వెళ్లినప్పుడే అన్నీ చూడాలి, ప్రత్యేకంగా కుదరదు అని పెద్దవాళ్ళు అన్నారు. గాంధీ కొండ, ప్లానిటోరియం వంటివి కూడా చూశారు.
ఇలా వచ్చిన బంధువులు నాలుగు రోజులు ఉండి “ఇంట్లో గాలి వెలుతురు చాలా బాగుంది రా” అంటూ కృష్ణ నది స్నానము, శ్రీ మరకత రాజేశ్వరి, క్షిప్రవినాయకుడు సరస్వతి శివుడు ఆంజనేయుడు, దత్తస్వామి అన్ని కలిపి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమములో అన్ని చూసి ఆనందించారు.
వేద శ్రీ చదువుతో పాటు కొత్త ఇల్లు వచ్చింది. పద్మనాభం తల్లి తండ్రి ఆనందించారు.
వేద మెడిసిన్ పూర్తి అయింది. పిజి అన్నది.
“ఇంక నాకు ఓపిక లేదు, నీ పెళ్లి చెయ్యాలి” అన్నాడు పద్మనాభం. “ఆ తరువాత నీ మొగుడు ఇష్ట పడితే పిజీ చెయ్యి” అన్నాడు
బాగానే ఉంది ఇంత వరకు. చిన్న స్కూల్‌కి పంపినట్లు కూతుర్ని మెడిసిన్ చదివించాడు. కొడుకు ఇంజినీర్ అయ్యాడు. వాడి ప్లాన్లు అన్ని విదేశాల వైపు ఉన్నాయి, భూమి మీద లేవు ఆకాశంలో ఉన్నాయి.
వేద శ్రీ తో, “నీ చదువు పూర్తి అయ్యింది. తల్లి తండ్రీగా నీకు ఓ భరోసాగా మంచి చదువు చదివించాము. ఇంక పెళ్లి చేసి నీ జీవిత భరోసా నీ భర్తకు అప్పచెప్పాలి, మన బంధువుల్లో ఎవరూ డాక్టర్స్ లేరు. నువ్వు చదువుకున్నావు. మంచి భర్తను ఎంపిక చేసుకోవాలి” అన్నాడు పద్మనాభం. “నీకు తెలిసిన, నువ్వు ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?” అడిగాడు కూతురు ఏమి చెపుతోందా అని ఆలోచిస్తూ.
“నాన్నా నేను ఎవరిని ప్రేమించలేదు. మీరు మమ్మల్ని ఆ పద్ధతిలో పెంచలేదు. అడుగు వేస్తే కందిపోతానని నన్ను వెన్నంటి ఉన్నారు. మా చదువుల కోసం పల్లె వదిలి పట్నం వచ్చారు. కొన్న పాలు, కూరలు, పళ్ళు, అపార్ట్‌మెంట్ ఇల్లు అలవాటు చేసుకున్నారు. మిమ్మల్ని చూసే అల్లుడిని మీరే ఎంచుకోండి” అని చెప్పింది వేద శ్రీ.
“పోని లే తల్లీ, మాకు ఆ మాత్రం గౌరవం ఇచ్చావు. ముందు నీ మనసు తెలిసికొని అప్పుడు సంబంధాలు చూడాలి అని అలా అడిగాను” అని చెప్పాడు
అప్పటికే అతని ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు. అప్పుడు కూతురుకి విషయం చెప్పాడు.
“అలాగే నాన్నా, నేను మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటాను. పెద్ద చదువు చదివాను అని పెద్దల మాటకి ఎదురు చెప్పను. మీ పెంపకం, ప్రేమ, ఆత్మీయత అలాంటిది” అని నవ్వింది.
వేదను తన ఫ్రెండ్ కొడుకు కాశ్యప్‍కి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. “ఇద్దరు పిజి చేస్తారు, మన మధ్య కట్నాలు వద్దు పిల్లలకు నచ్చినట్లు పెళ్లి చేద్దాము” అనుకున్నారు.
అటు ఇటు స్నేహితులు అంతా కలిసి ఆనందంగా ఈ తరం వంటలు, పాత తరం వంటలు అన్ని వండించుకుని పెద్దల చెప్పిన విధానంలో పెళ్లి చేసుకున్నారు.
పద్మనాభం కూతురుకి అక్కడి ఇల్లు ఇచ్చి వాళ్ళని పిజి చదువు కోమన్నాడు. ఎంట్రన్స్ రాసి ఇద్దరు మెరిట్‌లో సీటు తెచ్చుకున్నారు.
“మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి, మేము పల్లె ఇంటికి వెడతాము” అన్నాడు పద్మనాభం.
వేద శ్రీ ఆశ్చర్యపడి “అదేమిటి నాన్నా, నువ్వు వెళ్లిపోతే మేము ఊరుకోము. మీరు ఇద్దరు ఇక్కడే ఉండాలి” అంది. కాశ్యప్ కూడా ఉండమన్నాడు. అల్లుడు మంచితనానికి మురిసిపోయారు.
“ఈ ఇల్లు అంతా ఎవరూ చూస్తారు? అమ్మ నువ్వు మా దగ్గర ఉండాలి” అన్నది వేద. “మరి తమ్ముడు ఉన్నాడు కదా, వాడు కూడా నీ లాగ సెటిల్ అవ్వాలని భావిస్తున్నాము” అన్నారు తల్లిదండ్రులు.
“ఒకే ఒకే, చదువు అవగానే ఉద్యోగం వచ్చేస్తుంది. నా పిన మామగారు పిల్ల ఉన్నది, వాళ్ళు తమ్ముడికి పిల్లను ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఒక్కతే పిల్ల. వీడు ఎలాగూ బెంగుళూర్‌లో సెటిల్ అవ్వాలని అంటున్నాడు.
వాళ్ళూ బెంగుళూర్‌లోనే ఉన్నారు. వచ్చే ఏడాది వాడి పెళ్లి. నాన్నా మీరు బెంగపడవద్దు” అన్నది వేద శ్రీ.
“ఒక విధంగా చూస్తే అల్లుడికి అత్త ఇంట్లో సదా మర్యాదలు ఉంటాయి కదా. మీరు కాశ్యప్‌ని ఎంత ప్రేమగా చూస్తున్నారు, అంత కంటే ఎక్కువ చూస్తారు మన వేదాన్ష్‌ని వాళ్ళు. తెలిసిందా మీకు?” అంటూ మహా హుషారుగా చెప్పింది.
“అప్పుడే తమ్ముడి పెళ్లి పెద్ద అయ్యావు” అన్నారు అమ్మా నాన్న.
వేద శ్రీ, కాశ్యప్ పిజిలు పూర్తి చేశారు.
అయితే వారికి పల్లె అంటే ఇష్టం. అందుకే తాతగారి ఇంటికి వెళ్లి, అక్కడ ఇంటి స్థలంలో వాళ్ళు హాస్పిటల్ కట్టి ప్రాక్టీస్ పెట్టారు. మళ్లీ ఆ ఇంటికి పాత వైభవం వచ్చింది. ఊరిలో పెద్ద డాక్టర్స్ అని పేరు తెచ్చుకున్నారు.
సొంత ఊరు, సొంత ఇంట్లో వేదాన్ష్ పెళ్లి ఘనంగా అటు ఇటు బంధువులు వచ్చి డెబ్బై యోగాల పెళ్లి చేశారు. జీవిత భాగస్వామి ద్వారానే అమ్మాయికి జీవిత భరోసా అని పినమామగారు వేద శ్రీని మెచ్చుకున్నారు. అన్నీ మగ పెళ్లి వారే చూసుకున్నారు. “మాకు కట్నాలు లాంఛనాలు వద్దు మాకే అన్ని ఉన్నాయి మంచి పిల్ల వచ్చింది చాలు” అన్నారు
మంచితనం ప్రతి మనిషికి ఉంటుంది, అయితే ముందే వాళ్ళని విమర్శించి సమస్యలు, వెటకారం లేకుండా ప్రేమగా చూడాలి. అప్పుడే నానాటి బ్రతుకు నాటకంలో ప్రతి మనిషి శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారాంశం ఎరిగి, ప్రేమను పంచి పెంచాలి కదా. అప్పుడే ఆనందం పొందుతారు. మాటలే జీవిత వారధి. అదే జీవిత భరోసా కదా! మీరు ఏమంటారు!
శాంతి శుభము.