ఇంటి కంటె…

12
3

[dropcap]ఫో[/dropcap]న్ రింగవుతోంది.

శృతి వంటింట్లో అష్టావధానం చేస్తోంది.

“శృతీ! మీ ప్రొఫెసర్ చేస్తున్నారు”, గట్టిగా అన్నాడు భర్త సుధాకర్.

స్టవ్ ఆపేసి గబ గబా ముందు గదిలోకి వచ్చింది శృతి. ఫోన్ ఇంకా రింగవుతోంది. “తీయొచ్చుగా” అంటూ శ్రీవారి వంక విసురుగా చూసి ఫోన్ తీసింది.

“సర్”

“అమ్మా, శృతీ, బాగున్నావా?”

“బాగున్నా సర్, మీరెలా ఉన్నారు?”

“బాగున్నాను. కాలేజీకి వెళుతున్నావా?”

“వెళుతున్నాను సర్.”

“మరి, గురజాడ కథలలో స్త్రీ పాత్రల గురించి ఓ అరగంట నువ్వు మాట్లాడాలమ్మా! నన్ను ఎవరి పేరయినా సూచించమని రామచంద్రరావు గారు అడిగారు. నీ పేరు చెపుదామనుకుంటున్నా. ఏమంటావు?”

“ఆయన నాకు తెలుసు సర్”

“అవునా, అయితే ఇంకేం!”

“తెలుసంటే పరిచయం లేదు సర్, వాళ్ళ సాహితీ సంస్థ కార్యక్రమాలు చూస్తుంటాను.”

“ఇప్పుడూ ఆ సంస్థ తరపునే నిన్ను మాట్లాడమంటున్నాను. గురజాడను బాగా చదివావు నువ్వు. అవలీలగా మాట్లాడగలవు.”

“కాని, నాకు…. నాకు కుదరదేమో సర్.”

“ఇంట్లో కూర్చుని జూమ్ లోనేగామ్మా!ఆదివారం ఉదయం పదింటికి. ఇబ్బందేముంది చెప్పు! మాట్లాడగలిగి ముందుకు రాకపోతే ఎలా? నేను నీ పేరు చెప్పేస్తాను. తయారయి ఉండు. ఇంకా వారముంది. సరేనా!” అన్నారు ప్రొఫెసర్.

“సరే సర్” అంది శృతి ఎలాగో.

“గుడ్” ఫోన్ పెట్టేసారు.

“ఆదివారమేగా, సందేహమెందుకు? అవకాశాలు వచ్చినప్పుడు వదలకూడదు. జూమ్‌లో పాల్గొంటుంటే ఎక్కడెక్కడి వాళ్ళకి నువ్వేమిటో తెలుస్తుంది. నీకూ అనుభవం వస్తుంది” అన్నాడు భర్త.

భర్త, ప్రొఫెసర్‌ల ప్రోత్సాహం ఉత్సాహాన్నిస్తోంది. కాని, ఆ రోజు ఆ సమయానికి ఎలా ఉంటుందో, అని భయపడుతోంది శృతి.

ప్రొఫెసర్ అన్నది నిజమే. ఇంట్లో కూర్చుని ఆడవాళ్లు జూమ్‌లో చక్కగా ప్రసంగాలు చేయటం తను చూస్తోంది. వాళ్ళందరూ అపార్ట్‌మెంట్‌లలో వాళ్ళ ప్రత్యేక మైన గదుల్లో కూర్చుని మధ్యలో ఏ అవరోధాలు లేకుండా ప్రశాంతంగా చక్కగా మాట్లాడతారు. తనలాంటి వాళ్లకు అడుగడుగునా గండాలే! మంచి ఇల్లు, వేరే గది ఉంటే జూమ్‌లో బాగానే వుంటుంది, అనుకుంది శృతి. కరోనాకి ముందు అప్పుడప్పుడు బైట సాహిత్య సభలకు వెళ్లి మాట్లాడటం అలవాటే శృతికి. ఇంట్లో నుంచి అంటేనే తనకు ఇబ్బంది!.

శృతి తెలుగు ఎం.ఏ. చేసి, కాలేజీలో లెక్చరర్‌గా చేస్తోంది. చిన్నచిన్న గదులు, పక్క పక్క పోర్షన్లు, మధ్యలో తలుపులు పక్కవాళ్ళకి, వీళ్ళకి. వాళ్ళు టి.వి. పెట్టుకుంటే వీళ్ళు పెట్టుకోవక్కరలేదు. పొద్దున్న పదకొండు దాకా పెద్ద సౌండ్‌తో వెనక ఇంట్లోంచి భక్తి గీతాల హోరు! ఆదివారం ఫోన్ అయినా చేయకుండా ఎవరో ఒకరు వచ్చేస్తారు. ఊళ్ళో బంధు బలగం ఎక్కువ. శృతి మనసులో సందేహాలు చదివినట్లుగా సుధాకర్, “నేను ఇంట్లోనే ఉంటానుగా. ఎవరైనా వస్తే నేను చూసుకుంటానులే” అని అభయమిచ్చాడు.

ఇంట్లో నుంచి పాఠాలు చెప్పటం ఇబ్బందిగా ఉందని ఈ కరోనా టైంలో శృతి కాలేజీకి వెళ్లే ఆన్‌లైన్‌లో చెప్పి వస్తోంది.

నాలుగు రోజుల పాటు గురజాడ రచనలు మళ్ళీ చదివి నోట్స్ రాసుకుంది. ఆ రోజు ఇంట్లో మేమిద్దరమే ఉంటే బాగుండును, అని పదే పదే అనుకుంది. ఆదివారం అంటే శృతికి భయం! అయిష్టం! నిఘంటువులో నచ్చని పదం తనకు ఆదివారమే! ఆదివారమేగా, ఇంట్లో ఉంటారని వచ్చాము అంటారు చుట్టాలు. ఎవరూ రాకపోతే నిర్విరామమైన చాకిరీ! కాలేజీ ఉంటేనే బాగుంటుంది శృతికి.

శృతి వాళ్ళకి ఒక్కతే అమ్మాయి. ఈ మధ్యే పెళ్లయి హైదరాబాద్‌లో ఉంటోంది. శృతి, సుధాకర్‌లవి ప్రైవేటు ఉద్యోగాలు. ఆదివారం కాస్త విశ్రాంతి కోరుకుంటుంది శరీరం. కాని, ఎప్పుడూ తెలియకుండా గడిచిపోతుంది.

ఆదివారం రానే వచ్చింది. పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని పూజ చేసుకుని, శృతి సిద్ధమైంది. ఇద్దరం టిఫిన్ తినేసి, మీటింగ్ అయ్యాక వంట చేసుకోవచ్చనుకుంది.

అది మూడు గదుల అద్దె ఇల్లు. వంటిల్లు, బెడ్ రూం అని పిల్చుకునే గది కాక మూడోది పూర్తిగా గది అనటానికి లేదు. చిన్న వసారాకి చుట్టూ గ్రిల్స్ ఉంటాయి. ఎవరైనా వస్తే కూర్చోటానికి మూడు కుర్చీలు పడతాయి. అంతే!

మధ్య గదిలోనే టేబుల్ మీద ఫోన్ పెట్టుకుని మాట్లాడాలని అనుకుంది శృతి.

తొమ్మిదింటికి ఫోన్ రింగయింది. శృతి గుండె దడ దడ లాడింది. చూసింది.

రాధ, బావగారమ్మాయి.

“తీయకు. ఇప్పుడు వస్తానంటుంది. ఎటూ చెప్పలేం. ఫోన్ ఎత్తకపోతే ఇంట్లో లేమనుకుని మానేస్తుంది” అన్నాడు సుధాకర్.

నిజమే! ఇప్పుడు వస్తానంటే మీటింగ్ ఉందని చెప్పాలంటే మొహమాటం. మీటింగ్ అయితే ఎవరూ రాకూడదా అనుకుంటుందని భయం. మొత్తం మీద ఫోన్ అరచి అరచి ఊరుకుంది.

తొమ్మిదిన్నరకి సుధాకర్, “శృతి, మా అక్క కొడుకు వెంకట్ సెంటర్‌లో ఉన్నాడుట. ఊరు నుంచి మామిడి కాయలు తెచ్చాట్ట. రావటానికి టైం లేదుట. రోడ్డు మీదకు రమ్మన్నాడు. ఇప్పుడే వస్తాను” అన్నాడు.

“తొందరగా రండి” అంది శృతి.

పదవుతోంది. ఫోన్ ఆన్ చేసింది శృతి. స్క్రీన్ మీదకు ఒక్కొక్కరే వస్తున్నారు. తొందరగా భర్త వస్తే బాగుండును. ఇంతసేపా మాటలు! పక్క వాళ్ళ శబ్దాలు వినిపించకుండా ఉండాలంటే వంటింటి తలుపు, మధ్య తలుపు వేసేయ్యాలి. వీధి తలుపు తీసుంచుతే ఎవరొచ్చిందీ తెలియదు. వేసేస్తే మధ్యలో లేవాలి, అనుకుంటూ దగ్గరగా వేసుంచింది. పరిచయాలవుతున్నాయి. మొదటి ప్రసంగం శృతిదే! సుధాకర్ రాలేదింకా.

అంతలో, వీధి తలుపు తోసుకుని బావగారమ్మాయి తన ఇద్దరు పిల్లలతో లోపలికి వచ్చింది, “పిన్నీ, ఏం చేస్తున్నావంటూ”.

అప్పుడే శృతిని మాట్లాడమంటున్నారు.

శృతి సైగ చేసింది, ముందు గదిలో కూర్చోమని. వాళ్ళ అయిదేళ్ల పెద్ద పిల్లాడు పాలు కావాలని అంటున్నాడు, చిన్నవాడు బిస్కట్ కావాలంటున్నాడు. గట్టిగా అరుస్తున్నారు ఇద్దరూ. శృతి సైగ చేస్తోంది రావద్దని. వాళ్ళు వినట్లేదు. పక్కకు వచ్చి ఫొన్లో చూస్తున్నారు. శృతి పరిచయాన్ని గొప్పగా చేస్తోంది ఒక అమ్మాయి.

“శృతి, మాట్లాడమ్మా” అన్నారు ప్రొఫెసర్. ఆయనే నిర్వహిస్తున్నారు సభను.

సుధాకర్ వచ్చాడు. పిల్లలిదరినీ తీసుకుని వెళ్ళిపోయాడు.

రాని నవ్వుని ముఖాన పులుముకుని శృతి మాట్లాడటం మొదలుపెట్టింది. బావగారమ్మాయి, ‘పాలున్నాయా’ అని కొంచెం పక్కన నిల్చుని చేతి సంజ్ఞతో అడుగుతోంది. శృతి అనర్గళంగా గురజాడ రచనలలో స్త్రీల చైతన్య స్థాయి గురించి మాట్లాడుతూనే ఉంది.

ఆ అమ్మాయి వంటింట్లోకి వెళ్లి గిన్నెదో పడేసినట్లుంది. భళ్లున శబ్దం వచ్చింది. సుధాకర్ గబగబా వచ్చి ఆ అమ్మాయిని బరబరా ముందు గదిలోకి లాక్కుని వెళ్ళిపోయాడు. పిల్లాడు నాకు పాలు అంటూ ఏడుస్తూ లోపలికి వస్తున్నాడు. సుధాకర్ వాడిని తీసుకుని వెళుతూ మధ్య గది తలుపు వేసేశాడు. మొదటి పది నిముషాలు అలజడి మనసుతో మాట్లాడిన శృతి తరవాత బాగా మాట్లాడింది.

బావగారమ్మాయి పదో తరగతి ఫెయిల్ అయింది. తరవాత తనకు పెళ్లి చేసారు. శృతి బావగారి ఊరు దూరం. అందుకని ఇక్కడికి వచ్చేస్తుంటుంది.

శృతి ప్రసంగం అయి వెళ్ళేటప్పటికి, సుధాకర్ ఆ అమ్మాయికి లోపల మీటింగ్ జరుగుతోందని, శృతి ఉపన్యాసాన్ని చాలామంది వింటూ ఉంటారని అటు తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు కనిపిస్తారని వివరిస్తున్నాడు.

ఆ అమ్మాయి పెద్దగా పట్టించుకోలేదు. “పిన్నీ, అయిపోయిందా, కొంచెం పాలు ఇవ్వు వాడికి, నన్ను తినేస్తున్నాడు” అంది. వాళ్లకు కావలసినవి ఇచ్చి వంట మొదలుపెట్టింది శృతి

ప్రొఫెసర్ ఫోన్ చేసారు. “చాలా బాగా మాట్లాడావమ్మా. నువ్వు ఎందుకు కుదరదన్నావో నాకు కొంచెం అర్థమైంది. కాని, ఇక మీదట కుదుర్చుకోవాలి. ఎలాగోలా నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. ఇదివరకు బైట ఉపన్యాసాలకు ఎలా వెళ్లేదానివో, ఇవీ అలాగే! వచ్చిన అవకాశాలు వదులుకోకు. ఇంకా కొన్నాళ్ళు సభలు ఇలాగే జరుగుతాయి. స్త్రీ సమస్యల గురించి వ్యాసాలు రాస్తావుగా. నీ సమస్య గురించి నువ్వే ఆలోచించాలి” అని సలహా ఇచ్చి మరోసారి అభినందించి ఫోన్ పెట్టేసారు.

చాలా ఉత్సాహంగా అనిపించింది శృతికి. అవకాశాలు వదలకూడదు అనిపించింది. కాని, వాస్తవంలో బాగుండదు. ఒంటిగంటకు ఆ అమ్మాయి భర్త వచ్చాడు. భోజనాలు, తోముకోవటాలు, రోజంతా పనే! పిల్లలు ముందు గదిలో గెంతులేస్తున్నారు. మధ్య గదిలో టి. వి. మోగుతోంది. వంటింట్లో శృతి పక్కన చేరి బావగారమ్మాయి తన భర్త మీద, అత్తగారి మీద ఆపకుండా చాడీలు చెప్పేస్తోంది.

సాయంత్రం నాలుగింటికి కాలేజీ నుంచి ఫోన్. “మేడం గారూ, చిన్న అడ్జస్ట్‌మెంట్. రేపు మీ క్లాస్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పుడు తీసుకోమన్నారు మిమ్మల్ని. వీలవుతుందా. లింక్ పంపుతాను. ఇంట్లోనుంచి చెప్పేస్తారా” అడుగుతున్నాడు క్లర్క్.

“వద్దోద్దు, నేను పది నిముషాల్లో వచ్చేస్తా” అంటూ భర్తకి చెప్పి కాలేజీకి బయలుదేరింది శృతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here